Tuesday, August 29, 2023

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

 నూతనయజ్ఞోపవీత ధారణ విధానము



జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను.


ప్రార్థన:


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |


ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||


గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః |


గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః ||


అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా |


యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరశ్సుచి: ||


పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!


(అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను)


ఆచమన విధానం:

ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,

1.   ఓం కేశవాయ స్వాహా,


2.   ఓం నారాయణాయ స్వాహా,


3.   ఓం మాధవాయ స్వాహా,


అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.


4.   ఓం గోవిందాయనమః,


5.   ఓం విష్ణవే నమః,


6.   ఓం మధుసూదనాయనమః,


7.   ఓం త్రివిక్రమాయనమః,


8.   ఓం వామనాయనమః,


9.   ఓం శ్రీధరాయనమః,


10.  ఓం హృషీకేశాయనమః,


11.  ఓం పద్మనాభాయనమః,


12.  ఓం దామోదరాయనమః,


13.  ఓం సంకర్షణాయనమః,


14.  ఓం వాసుదేవాయనమః,


15.  ఓం ప్రద్యుమ్నాయనమః,


16.  ఓం అనిరుద్ధాయనమః,


17.  ఓం పురుషోత్తమాయనమః,


18.  ఓం అధోక్షజాయనమః,


19.  ఓం నారసింహాయనమః,


20.  ఓం అత్యుతాయనమః,


21.  ఓం జనార్దనాయనమః,


22.  ఓం ఉపేంద్రాయనమః,


23.  ఓం హరయేనమః,


24.  ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను. అటు పిమ్మట:


భూతోచ్చాటన:


(చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.)


ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః


(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)



గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను.


ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ | ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్||



తదుపరి సంకల్పం:


మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే



(బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య” అని చెప్పనక్కర లేదు)




యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను. కొందరు రెండు ముడులు కొందరు మూడు ధరిస్తారు 




యజ్ఞోపవీతమిత్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా,


దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||




“ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం


ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్


ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం


యజ్ఞోపవీతం బలమస్తు తేజః ”


అని చెప్పి అని ధరించవలెను.




(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)



ద్వితీయోపవీత ధారణం:


తిరిగి ఆచమనం చేసి “మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.



తృతీయ యజ్ఞోపవీత ధారణం:


తిరిగి ఆచమనం చేసి “ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.




చతుర్ధ పంచమ యజ్నోపవీతములు ధరించుట:


తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ “ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.



తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు కానీ నూట ఎనిమిది మారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీటిని వదలవలెను. (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)



గాయత్రీ మంత్రము:


“ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం

భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ ”



తరువాత ఈ క్రింది విసర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.



జీర్ణోపవీత విసర్జనం:


తిరిగి ఆచమనం చేసి




శ్లో: ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం


విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||




శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం


వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం


ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం


జీర్నోపవీతం విసృజంతు తేజః ||




శ్లో: ఏతా వద్దిన పర్యంతం


బ్రహ్మత్వం ధారితం మయా


జీర్ణత్వాత్తే పరిత్యాగో


గచ్ఛ సూత్ర యథా సుఖం ||




విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.


తిరిగి ఆచమనం చేసి కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపింఛి యధాశక్తి “గాయత్రీ దేవతార్పణమస్తు” అని నీరు విడువ వలెను. ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను.




తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను.




నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు:


జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను. 


వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతివారికీ సుపరిచితమైంది ‘యజ్ఞోపవీతం’. 


దీనినే తెలుగులో ‘జ్యంద్యం’ అంటాం. 


ఇది చాలామంది మెడలో వేలాడుతూ ఉంటుంది కానీ, ఇది అలా ఎందుకు వేలాడుతుందో చాలామందికి తెలియదు. 


ఇలా మెడలో ఈ యజ్ఞోపవీతాలను వేసుకున్న వారు నిష్టతోనూ, కొందరు ఆచారం మీద మక్కువతోనూ, కొందరు ఇతరుల ముందు ప్రదర్శన కోసం, మరికొందరు అవసరార్థం ఉపయోగించేవారుగా కనపడతారు. 


యజ్ఞోపవీతాన్ని ‘బ్రహ్మసూత్రం’ అని కూడా అంటారు. 


దీన్ని ఎందుకోసం ధరించాలో ధర్మశాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి.


’సూచనాత్ బ్రహ్మతత్త్వస్య 


   వేదతత్త్వస్య సూచనాత్


తత్సూత్రముపవీతత్వాత్ 


బ్రహ్మసూత్రమితి స్మృతమ్’!!


బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని (యజ్ఞోపవీతాన్ని) ధరించాలి. అదే ఉపవీతం. అంటే రక్షణ వస్త్రం.  


యజ్ఞోపవీతాన్ని, శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. 

అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని


 ‘యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...’


 అనే మంత్రం చెబుతోంది.  


యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో (తొమ్మిది దారపుపోగులతో) నిర్మించాలి. 


ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం - 


‘ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీ 

వాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవ 

ఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ

తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా 

పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిః

సప్తమే మారుతశ్చైవ అష్టమే సూర్య ఏవ చ 

సర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః’!!


మొదటి తంతువులో ఓంకారం,

 రెండవ తంతువులో అగ్నిదేవుడు, 

మూడవ తంతులో నాగదేవత, 

నాలుగవ తంతువులో సోమదేవుత, 

ఐదవ తంతువులో పితృదేవతలు, 

ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, 

ఏడవ తంతువులో వాయుదేవుడు, 

ఎనిమిదవ తంతువులో సూర్యుడు, 

తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకాల్లోని పరమార్థం. 


‘యజ్ఞోపవీతం’ కేవలం తంతు సముదాయం మాత్రమే కాదని అదొ తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది. 


’తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్

కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్’


ఈ శ్లోకంలో తాత్పర్యం ఇది. 


తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12 మొత్తం 96. 

అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.


 ‘యజ్ఞోపవీతం’ తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని ‘వశిష్ఠస్మృతి’ చెబుతోంది. 


’చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీ

తస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్’


నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించబడింది. 


అందువల్ల ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. 


గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. కనుక, గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం. 


యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది. 


’పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్

తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్

ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్

యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్’!!


అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. 

దానికంటే పైన గానీ, క్రిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్యం తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది. మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.


బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. వీళ్ళిద్దరూ ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.


యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ, తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీతధారణ, విసర్జనలు పనికిరావు. అశౌచాలవల్ల (ఆప్తుల జనన, మరణ సమయాలలో) ఇతర అమంగళాలు కలిగిన సంధర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. 


యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్తపాపాలు చుట్టుకుంటాయి. 


ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి. యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సుకోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శనకోసం కాదు. ప్రదర్శన కోసం వేసుకోనక్కరలేదు. 


ధర్మాలను ఆచరిస్తూ ధరించాలి. 


ఇదే యజ్ఞోపవీత మహిమ!


ఓం తత్సత్......

సర్వేజనా సుఖినోభవంతూ.......




సేకరణ 

కొల్లూరు సతీష్ శర్మ 

ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ

Friday, June 12, 2020

గురు చరిత్ర అధ్యాయము -52


అధ్యాయము  -52




                               
శ్రీ గణేశాయనమః
                             
శ్రీ సరస్వత్యేనమః
                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 


            అంతవరకూ ఎంతో ఆసక్తితో శ్రీగురుని లీలలు చెప్పించు కుంటున్న నామధారకుడు, ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడు. నఖశిఖపర్యంతమూ కించిత్తైనా చలనం లేకుండా శిలాప్రతిమలా ఉండిపోయాడు. అతని శరీరమంతటా వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఉన్నాయి. చెమట బిందువులు నిలిచాయి. అతని శరీరమంతా కంపించి పోతున్నది. అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి, అతని కన్నుల నుండి సంతతధారగా ఆనందభాష్పాలు కారుతున్నాయి. ఈ ఎనిమిది  విధాలైన భక్తి భావాలతోను అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని, లోకహితం కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకొన్నారు. కనుక అతని శరీరాన్ని తమచేతితో నిమిరి. వాత్సల్యంతో ఆలింగనం చేసుకుని ఇలా అన్నారు: "శిష్యోత్తమా! నామధారకా! లే నాయనా! నీవిప్పుడు ఈ సంసారసాగారాన్ని దాటి పరమానందంలో నిమగ్నుడవయ్యావు". శ్రీగురులీలామృతం పానం చేసి శ్రీ గురుచరణకమల ధ్యానమనే సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంలోనే శ్రీ గురుణ్ణి ఇలా స్తుతిస్తున్నాడు :    


                      "స్వామీ !అచింత్యులైన మిమ్మెలా ధ్యానించేది? సర్వగతులైన మిమ్ము ఎక్కడికని ఆహ్వానించేది? ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనం సమర్పించేదెలా? తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ  పాదపద్మాలను దేనితో కడిగేది? విశ్వకర్తవు, సర్వకర్తవూ అయిన మీ చేతులకు అర్ఘ్యం సమర్పించేది ఎలా? సప్త సముద్రాలనే  గాక ఈ విశ్వాన్నంతటినీ కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేనెలా సమర్పించగలను?  శుద్ధసత్వస్వరూపులైన మీ స్మరణయే లోకాలనూ పావనం చేస్తుంటే, మీకేమని స్నానం  చేయించేది?  ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రమేమున్నది?  చతుర్ముఖుడైన బ్రహ్మదేవుణ్ణి  సృష్టించిన మీకు యజ్ఞసూత్రం వలన కలిగే లాభమేమున్నది? సర్వ జీవుల తాపాన్ని హరించగల మీకు గంధలేపనమేమి చేయగలదు? ఇచ్ఛలే లేని  మీకు ఏ పూలు సమర్పించి ప్రీతినొనర్చగలను? స్వయం సంతుష్టులు,  ఆత్మానంద స్వరూపులైన మీకు నేను సమర్పించదగిన ధూప మెక్కడున్నది?  స్వయం ప్రకాశకులు,  జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను  దీపం  సమర్పించడమా? జగత్ పోషకులైన మీకు ఏమినైవేద్యం ఇవ్వగలను? నిత్యసుముకులైన మీకు తాంబూలం వలన ఏమి ప్రయోజనం?  నక్షత్రగ్రహగోళాదులే మీకు నిత్య నీరాజనాలిస్తూ, సర్వ జీవుల హృదయాలలోనూ,  మరియు విశ్వమందంతటా ప్రణవోచ్చారణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరజనమెలా ఇవ్వాలో, మిమ్మెలా స్తుతించాలో  నాకు తెలియడంలేదు. సర్వగతులైన మీకు ప్రదక్షిణమెలా చేయాలి?  ఈనామ రూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయిఉండగా నేనెక్కడని నమస్కరించేది? నా లోపల,  వెలుపలా  నిండియున్న మీకు ఎచ్చటికని ఉద్వాసన చెప్పేది?" అంటున్నాడు.                                  


             అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకుని "నాయనా! నీవిలా అంతర్ముఖుడవై  నిశ్చలసమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదెలా?  ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే  శ్రీగురుని సంకల్పం. ఆయన చూపిన మార్గంలో పయనిస్తున్న మనకు, ఆయన అభీష్టం  నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం. నీవిలా కూర్చుండిపోతే అదెలా సంభవం? కనుక నీవు మేల్కొని  శ్రీగురుచరణాలను స్మరిస్తూ,  శాస్త్ర వాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచంలోనే జీవించాలి" అని చెప్పి,  అతనిని మేల్కొలిపారు. నామధారకుడు కన్నులు తెరచి సిద్ధమునిని  చూచి, "స్వామి! దయామయా! విశ్వాధారా ! ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌకవంటివారు మీరు. నా పాలిటి శ్రీగురుడు మీరే!" అని,  ఆయనకు సవినయంగా నమస్కరించాడు. సిద్ధయోగి సంతోషించి, " నాయనా! శ్రీ గురు కథాశ్రవణమందు నీ కిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిల్చుగాక !నీవు ఈ "గురుచరిత్ర" నిత్యపారాయణ చేస్తూ ఉంటే ఇహపరాలు రెండు సిద్ధిస్తాయి. ఒక శుభ ముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధిచేసి,  రంగవల్లులతో అలంకరించి,  అక్కడ కూర్చొని మొదట దేశ కాలాలను స్తుతించు. అటు తర్వాత శ్రీ గురునికి మానసోపచారపూజ చేయి. పారాయణ సమయంలో మౌనంపాటిస్తూ మనోవికారాలను శమింపజేసుకో. అప్పుడు దీపం పెట్టి గురువుకు,  పెద్దలకూ  మనసా నమస్కరించు. ఉత్తరదిక్కుగానో  లేక తూర్పు ముఖంగానో  కూర్చుని,  మొదటి రోజు 9 వ అధ్యాయము చివరి వరకు,  రెండవ రోజు పారాయణ 10వ  అధ్యాయం నుండి 21వ అధ్యాయం చివరి వరకు, మూడవ రోజున 29వ అధ్యాయం చివరి వరకూ,  నాల్గవ రోజున 35 వ అధ్యాయము చివరి వరకూ,  5వ రోజున 38 వ అధ్యాయము చివరి వరకూ, 6వ రోజున  43వ అధ్యాయం నుంచి చివరి వరకు,  చివరి రోజు, గ్రందాంతము  వరకు విద్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణ చేయాలి. తర్వాత నైవేద్యం పెట్టి, అటు తర్వాత సాష్టాంగ నమస్కారం చేయాలి. సప్తాహ పారాయణం చేస్తున్నంత కాలం  భూమిపై నిద్రించడమే మంచిది. అది పూర్తయ్యాక యధాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టి,  దక్షిణ,  తాంబూలాలతో వాళ్లను సత్కరించాలి. ఇలా  నిర్దిష్టంగా శ్రీగురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురుదర్శనమవుతుంది. ఇలా చేస్తే సాటివారందరూకూడా ఆ భగవంతుణ్ణి  సేవించుకోగల్గుతారు".


యాభై రెండవ అధ్యాయము సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


*** బుధువారం పారాయణం సమాప్తము ***

Thursday, June 11, 2020

గురు చరిత్ర అధ్యాయము -51


అధ్యాయము  -51




                               
శ్రీ గణేశాయనమః
                             
శ్రీ సరస్వత్యేనమః
                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 


                               నామధారకుడు,  "స్వామీ! శ్రీగురుడు వైడూర్యనగరం నుండి బయలుదేరి వెళ్లి గౌతమీ పుష్కరయాత్ర పూర్తిచేసుకుని, తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవియ్యండి" అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు: "శ్రీగురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు. అది ఈశ్వరనామ సంవత్సరం. అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు. ఒకనాడు ఆయన భక్తులందరితో, తాము శ్రీశైల యాత్రకు బయల్దేరుతున్నామని చెప్పారు. అది తెలిసి గ్రామస్తులందరూ గూడా మఠం  వద్దకు చేరుకున్నారు. వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురుని తో ఇలా అన్నారు : 'స్వామీ ! మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళ వలసిన అవసరం ఏమిటి? తాము తమ అవతారకార్యం పరిసమాప్తి చేయదలచినట్లు మాకు తోస్తున్నది. ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు, అభీష్టాలు తీర్చుకుంటున్నాము. మీరీ  గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠం అనదగిన మహా పుణ్యక్షేత్రంగా రూపొందింది. నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు. మేము అజ్ఞులము, దీనులము మాకు మీరుతప్ప వేరు దిక్కులేదు. మమ్మల్ని విడిచి పెట్టిపోవడం మీకు న్యాయమేనా? ఏ తల్లి అయినా తన బిడ్డలను ఇలా విడిచి వెళ్లిపోతుందా? ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్ళను సాకడం ఆమె ధర్మంకాదా?' అన్నారు.                        


                    శ్రీ నృసింహసరస్వతీస్వామి, వాళ్ల భక్తికి కరిగిపోయి, చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు: ' బిడ్డలారా! మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడచి మేము మాత్రం పోగలమా? నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వ నగరంలోనే ఉంటాము. నిత్యమూ ఈ సంగమంలో స్నానము, నిత్యకృత్యములు తీర్చుకొని, మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలందుకుంటూ గుప్తంగా ఉంటాము. కేవలం లౌకికుల స్థూలదృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్లినట్లు, ఇక్కడ లేనట్లు కనిపిస్తాముగాని నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్టిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము. ఇది ముమ్మాటికి నిజము, ఎట్టి సందేహమూ లేదు. మా భక్తులకు మేము ప్రత్యక్షము కానిదెప్పుడూ? ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి వుండే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు? మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తూ కల్పవృక్షమైన ఈ అశ్వత్థవృక్షానికి ప్రదక్షిణంచేసి, అనర్థాలన్నింటినీ  తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్చిస్తుంటే సర్వభ్రమలూ తొలగి, సాక్షాత్తూ ఆనందమే సిద్ధిస్తుంది. ఎలాంటి చింతలు గలవారికి అయినా ఇచ్చటి చింతామణి అనబడు విగ్నేశ్వరుని ఆరాధించడం వలన సర్వ విఘ్నాలూ  నశిస్తాయి. భక్తిశ్రద్ధలతో ఈ అష్ట తీర్ధాలలో స్నానం చేసేవారికి సర్వ సిద్ధులూ  సమకూరి, ముక్తిగూడా లభిస్తుంది. మూడు కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకలను పూజించి, నీరాజనం ఇచ్చి, నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది. ఇకముందు పవిత్రమైన ఈ దేశం మ్లేచ్చులైన యవనులకు అధీనం అవుతుంది. వాళ్లు కూడా ఇక్కడకు వస్తారు. వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది. మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోగలందుకు స్థూలదృష్టికి శ్రీశైలం వెళ్లిపోయినట్లు కనిపిస్తాము గాని, అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నులమై శాశ్వతంగా ఉంటాము' అని చెప్పి, ఆయన తమ పాదుకలు మఠంలో విడిచిపెట్టారు. వెంటనే ఆయన మఠం నుండి బయటకువచ్చి, సాయందేవుణ్ణి, నందిశర్మను, నరహరి కవినీ, నన్నూ కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు. కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండి పోయారు. శ్రీ గురుని  వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణసరస్వతి, బాల సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి మొదలైనవారు అంతకుముందే శ్రీగురుని ఆజ్ఞమేరకు తీర్థయాత్రలకు వెళ్లిపోయారు. స్థానిక భక్తులు, మా ఐదుగుర్ని ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి, చేతులు జోడించి శ్రీవారి దివ్యరూపం కనుమరుగు అయ్యేవరకు చూస్తూ నిలబడి, అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు.                      


                               అటు తర్వాత జరిగినది చెబుతాను విను : వెనుక శ్రీ గురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు, వారివద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయల్దేరిన శిష్యులు, వైఢూర్యనగరాన్ని పరిపాలించిన యవనరాజు, శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి, అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. కుంభరాశిలోకి సూర్యుడు, కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు. అది శిశిర ఋతువు. మాఘమాసము, కృష్ణపక్షము, ప్రతిపద( పాడ్యమి) శుక్రవారం నాడుశ్రీ గురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళగంగకు చేరారు. అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమంతా త్వరత్వరగా పూలు సమృద్ధిగా సేకరించి, వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూలనావ సిద్ధంచేశాము. అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై,  ఉంచమని ఆదేశిస్తే మేమలానే చేసాము. అప్పుడాయన, 'మేము ఈ పూలనావలో ఈ పాతాళగంగ దాటి శ్రీశైలంచేరి, అక్కడ మల్లికార్జునునితో ఐక్యం చెందుతాము. మీరందరూ వెనక్కు తిరిగి గంధర్వపురం వెళ్లిపోండి' అని చెప్పారు. కానీ మేము నివ్వెరబోయాము.          


                             ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాము. ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు : ' ప్రియ శిష్యులారా ! మీరిలా దిగులుపడకూడదు. మీరు గంధర్వపురం వెళ్ళండి. మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది. భక్తిలేనివారికి కన్పించక, భక్తులకు మాత్రమే దర్శనమివ్వదలచి మేమక్కడే గుప్తరూపంలో ఉంటాము. మమ్మల్నే  నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్ళలో మేము ప్రత్యక్షంగా ఉంటాము'. పుష్యమీ నక్షత్రంతో కూడిన ఆ శుక్రవారంనాడు, ఆ శుభసమయంలో శ్రీగురుడు ఆ పూలనావమీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ, బొడ్డున నిలిచిన మా అందరితో చివరిమాటగా ఇలా చెప్పారు-                

                'నాయనలారా! మీకు సర్వశుభాలూ ప్రాప్తించుగాక! నలుగురు ఒక్కచోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు, అందులోని స్తోత్రాలు పఠించేవారు, నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు. మా కథామృత గానం చేసేవారింట్లో నాలుగు పురుషార్ధాలు, సిద్ధులూ నిత్యనివాసం చేస్తాయి, జీవితాంతము అష్టైశ్వర్యాలు, అటుతర్వాత ముక్తి సిద్ధిస్తాయి. మేము ఆనంద నిలయానికి వెళుతున్నాము. మేమచటికి చేరగానే అందుకు గుర్తుగా మీవద్దకు నాలుగు తామరపువ్వులు ఈ నదిలో కొట్టుకొని వస్తాయి. మీరు నలుగురూ వాటిని ప్రసాదంగా తీసుకోండి. మీరు వాటిని ప్రాణంకంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరుచుకుని పూజించుకోవాలి. ఇది మా ప్రమాణం. దీనిని సంశయించరాదు' అన్నారు. ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపుమేర దాటిపోయింది. అయినా తాము ధరించిన కాషాయవస్త్రంతో తమ తలనుకూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సుతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది.               


                                         ఇలా శ్రీ గురుడు తమ  అంతిమ సందేశమిచ్చి ఆ పూలనావలో  కొంత దూరం వెళ్లి, అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు. అంతలోనే ఆ పుష్పాసనంగాని, స్వామిగాని కనిపించకపోయేసరికి మేమందరమూ కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశంకేసి చూస్తూ ఉండిపోయాము. కొద్దిసేపటికి నదికి  అవతలి ఒడ్డునుండి ఒక పడవ లో వచ్చిన కొందరు బెస్తవాళ్ళు మా వద్దకువచ్చి, ' అయ్యా! ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూసాము. వారి కాళ్లకు బంగారు పాదుకలున్నాయి. వారు కాషాయ వస్త్రము, చేతిలో దండము ధరించిఉన్నారు. ఆయన మాతో, ' మీరు వెళ్లి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి. నాలుగు పువ్వులు నదీజలాలపై కొట్టుకొని వారి వద్దకువస్తాయి. అవి తీసి వారికి ఇవ్వండి. మా పేరు నరసింహసరస్వతి. మేము స్థూలరూపంతో కదలీవనం వెడుతున్నాము. కానీ, గుప్తరూపంలో ఎప్పటికీ గానుగాపురంలోనేఉంటాము. అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి' అని చెప్పారట. వాళ్లు ఆ విషయం మాతో చెబుతుండగానే నాలుగు తామరపువ్వులు నదిలో కొట్టుకు వస్తున్నాయి. శ్రీగురుని ఆదేశం ప్రకారం ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలోకి దూకి ఈదుకుంటూపోయి,  ఆ నాలుగు పువ్వులనూ తెచ్చి ఇచ్చారు. వారినుండి ఆ పువ్వుల ను అందుకుని, సాయందేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు. అవి తీసుకొని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గంధర్వనగరంలోని మఠం చేరుకున్నాము.             


                      శ్రీ గురుడు అక్కడ నుండి బయలుదేరి వెళ్లినప్పుడు, మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూచి శ్రీ గురుని  గురించి మాట్లాడుకుంటూ మఠం  చేరుకొని, అక్కడ కూర్చున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహసరస్వతీస్వామి యథాపూర్వం తమస్థానంలో కూర్చొని కనిపించారు! ఆయనను చూచి అందరూ ఆశ్చర్యచకితులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమైంది. అంతటితో గ్రామస్థుల సంశయాలన్నీ మటుమాయమై, ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తలచడం ఎంతటి అపచారమో వారికి అర్థమైంది. అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసికొని తమ ఇళ్లకు వెళ్లిపోయారు. "    


                  అప్పుడు నామధారకుడు, "స్వామీ! ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవరు?" అని అడిగాడు. సిద్ధయోగి, "స్వామికి శిష్యులుఎందరో ఉండేవారు. వారిలో బాలసరస్వతి, కృష్ణ సరస్వతి, మాధవ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైనవారు. వీరేగాక, ఆ శ్రీశైలయాత్రా  సమయంలో సాయందేవుడు, నందిశర్మ, నరహరి, నేను మాత్రమే స్వామిని అనుసరించాము. ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే. నాకు దొరికిన ప్రసాదమిదిగో చూడు! దీనిని భద్రంగా ఉంచుకుని, మనస్సును నిశ్చలంగా గురు పాదాలపై నిలుపుకున్నాను. అందుకు సాధనంగా ఈ 'గురుచరిత్ర' కూర్చాను. అంతేగాని గురు మహిమను పూర్తిగా వివరించడము మహామహితాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఇహంలో పురుషార్థాలను, అటు తర్వాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. దీని పారాయణ వలన సుఖము, పవిత్రత, శాంతి కలుగుతాయి; పాపాలు, రోగాలు నశిస్తాయి" అన్నారు. 

                             
యాభైఒకటవ అధ్యాయం సమాప్తం

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Wednesday, June 10, 2020

గురు చరిత్ర అధ్యాయము -50


అధ్యాయము  -50




                               
శ్రీ గణేశాయనమః 
                            
శ్రీ సరస్వత్యేనమః
                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 


                       నామధారకుడు, "స్వామీ! మీరు పరమపవిత్రమైన క్షేత్ర మహత్యం చెప్పారు. మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లున్నది. ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువుంటే అక్కడే దేవతలు,  తీర్థాలు ఉంటాయి. ఈ సంగమము కృష్ణా - పంచగంగ సంగమము వంటిది. ఇక్కడ పశుపక్ష్యాదులు నీళ్ళుత్రాగి స్నానంచేసి కృతార్థత పొందాయి. ఇక మానవుల సంగతి చెప్పాలా?  దీని మహత్యం వింటేనే పాపాలు పోతాయి. ఇక ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతలామలకమే. స్వామీ ! మీ హృదయం శ్రీగురుని లీలలతో నిండి ఉన్నది వాటిని ఇంకా వినాలని ఉన్నది. దయచేసి వినిపించండి" అన్నాడు. అప్పుడు సిద్ధయోగి,  "నాయనా,  నీవు ధన్యుడివి.  భగవంతుని కృపవల్లనే నీకిట్టి ప్రీతి కలిగింది. అటుపై ఆ కథ చెబుతాను విను:                     


                   "వైడూర్య  నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తుండేవాడు. అతడు విజ్ఞుడు, శుద్ధాత్ముడు,  సర్వభూత సముడున్నూ.  పూర్వజన్మ సంస్కాకారం వలన అతడు మన దేవతలను, పుణ్యక్షేత్రాలను,  సద్బ్రాహ్మణులనూ గూడా ఆదరిస్తుండే వాడు. అది సహించక అతని కొలువులోని యవనమత గురువులు అతనితో, 'రాజా! మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆధరించడం మంచిది. ఇప్పుడు మీరు చేసేది, మనము కలలోనైనా తలచరానిది. హిందువుల మతధర్మం బోధించేవేవీ సత్యమైనవి గావు. రాజా! వారు అచేతనములైన శిలలలోనూ,  అశ్వత్థాది వృక్షాలలోనూ దేవుడు ఉంటాడంటారు. అలా తల చటం  మహాపాపమని మనం విశ్వసిస్తాము.  కనుక వారిని సమానులుగా గౌరవించటం తగదు' అనేవారు. రాజు,  'సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే. ఆయన అన్ని జీవులపట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు.  అలా అయితే ఆయన మానవులందరికీ వారి వారికి తగిన రీతిలో జ్ఞానాన్ని పొందే  ధర్మాన్నే  ప్రసాదించి ఉండాలి! మనధర్మానికి మూలమైన గ్రంధం వలెనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి. కనుక ఇటువంటి భేదబుద్ధి భగవంతుని పట్ల అపచారమే గాక,  మన మతధర్మానికి కూడా కళంకమే సుమా? ' అని ఖండితంగా చెప్పేవాడు. ఇక చేసేదేమీ లేక మంత్రులు వూరకుండేవారు.                     



                             మరికొందరు యవన మతగురువులు,  'రాజా! మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి. ఇప్పుడు మీరు చేసేపని మంచిదికాదు. అవయవాలన్నీ దేహానికి సమానం అయినప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ బేధాలెలా ఉంటాయి?' అనే వారు. వారితో రాజు,  'మీరు బుద్ధిమాంద్యంవలన భ్రమపడుతున్నారు. గుణకర్మల భేదం వలన మానవులను దైవమే నాలుగు వర్ణాలుగా సృష్టించారని వారంటారు.  మానవుల గుణ కర్మలలో భేదం ఉండడం మనం చూస్తున్నాం కదా! మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే,  కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా వుండవు; ఒకే పని చేయలేవు. ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవమే  సమర్థవంతంగా చేయగలదు. అదే దానికి సార్ధకత. నిజానికి భగవంతుడు సర్వవ్యాపియని  మనవలే  వారూ  విశ్వసిస్తారు. కానీ అజ్ఞులైన పామరులు,  హృదయశుద్ధి లోపించడం వలన,  పరమాత్మను ఆ రీతిన ధ్యానించలేరు.పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్దపెట్టినట్లే, పామరులకు ఏకాగ్రత కుదరటానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు. వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యధాతథంగా ధ్యానించగలుగుతారు. విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే గానీ, ధ్యేయంగాదని వారి మతమే చెబుతుంది. దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగ్గా కనబడదు. శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే,  మలినమైన మనస్సులో ఈశ్వర భావం కలుగదు. ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై,  అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది. మన పవిత్ర గ్రంథంలాగే,  వేదాలు కూడా ఋషులు వినిన వాక్కే గనుక అవీ స్వతఃప్రమాణమే. అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించ వలసిందే. వేదాలు,  ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ,  మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళవల్లనే పూజ్యులు' అనేవాడు.


                ఒకప్పుడు విధి వశానో,  దైవయోగము వల్లనోగాని,  ఆ మ్లేచ్చ  రాజుకు తొడమీద పుండు లేచింది. అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజురోజుకూ ఎక్కువ గాసాగింది.  ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయి. చివరికతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విపృన్ని పిలిపించి, దానికి నివారణ ఉపాయం చెప్పమని కోరాడు. ఆ విప్రుడు,  'రాజా! నీవు యవనుడవు - నేను బ్రాహ్మణుడను. నేను చెప్పే ఉపాయము గురించి, అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బ్రతకనివ్వదు. అందువలన ఏకాంతంలో చెబుతాను' అన్నాడు. అప్పుడారాజు అతనితో కలిసి ఒక ఏకాంతస్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు: 'రాజా, నిజానికి గతజన్మపాపాలే  మానవులందరినీ వ్యాధిరూపంలో భాధిస్థాయి. తీర్ధయాత్ర, దేవతారాధన, దానములవలన కొన్నిపాపాలు, వ్యాధులు, తొలగుతాయి.  కానీ వాటన్నిటికంటే శ్రేష్ఠమైనది సాధుదర్శనం వలన సర్వ పాపాలు, వ్యాధులూ గూడా తొలగిపోతాయి! చివరకు అజ్ఞానమనే భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని గూడా ప్రసాదించగలరు. కనుక రాజా! నీవు మీ వాళ్ళ అందరితో ఏదో ఒక సాకు చెప్పి, ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళు. అక్కడ స్నానం చేసి దానధర్మాలు చేయి. దాని వలన నీ పాపం తొలగి, ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది. ఆ క్షేత్రంలో ఎవరు ఏది కోరితే అదే లభిస్తుంది' అని చెప్తాడు. అప్పుడా మ్లేచ్చరాజు వెంటనే కొద్ది పరివారంతో బయల్దేరి, అక్కడికి కొద్దిదూరంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు. ప్రతిరోజు అతడు అక్కడి తీర్థంలో స్నానం చేస్తూ, రహస్యంగా ఉన్నాడు. ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తుండగా అతనికొక యతీశ్వరుడు కనిపించారు. రాజు ఆయనకి నమస్కరించి, తన పుండు గురించి, దాని నివారణ కోసం తనకు ఆ ద్విజుడు  చెప్పిన ఉపాయం గురించీ నివేదించు కొని ఇలా అన్నాడు : ' స్వామి! నేను మ్లేచ్చుడనని మీరు ఉపేక్షించవద్దు. నేను యవనుడనైనా, మీ ధర్మాన్ని కూడా ఆదరించేవాడినే! నాకు దయతో ఈ వ్యాధి నివారణోపాయం తెలపండి' అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి కూడా, సాధు దర్శనము అన్నింటికంటే శ్రేష్టమైన తరునోపాయమని చెప్పాడు. అప్పుడా యవనరాజు ఆయనకు నమస్కరించి, ' యోగీశ్వరా ! సాధుదర్శనం అన్నింటికంటే శ్రేష్టం అంటిరి కదా, అందుకు తార్కాణం ఏమైనా దయతో వివరించండి' అని వేడుకొన్నాడు. అప్పుడా సన్యాసి ఇలా చెప్పాడు: 'నాయనా వెనుక ఋషభ యోగి అనే మహాత్ముని  అనుగ్రహంవలన ఒక పతితుడైనబ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడ్డాడు. ఆ కథ వివరంగా చెప్తాను విను:  


                        పూర్వం అవంతి పురం లో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వసుడై స్వధర్మాన్ని విడిచి పెట్టాడు. అతడు గృహస్తు అయ్యుండి కూడా తన భార్యను విడిచి పెట్టి ఆ వేశ్య ఇంటివద్దనే త్రాగి పడి ఉండేవాడు. ఒకనాడు సంధ్యవేళ ఋషభ యోగి అటుగా వెళ్తుంటే చూచి, ఆ నామమాత్ర బ్రాహ్మణుడు, వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకెళ్లి, పూజించారు. తర్వాత ఆయనకు భోజనం పెట్టి, రాత్రంతా పాద సేవ చేస్తూ, ఆయనను నిద్రపుచ్చారు. మరుసటి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అట్టి సాదు సేవ వలన ఆ బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి, త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు. మరుజన్మలో అతడు దశార్ణదేశంలో వజ్రబాహువనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడ్డాడు. ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోనన్న  అసూయతో ఆ రాజు గారి రెండవ భార్య ఆమెకు విషం  పెట్టింది. కానీ అందువలన పట్టమహిషి స్పృహ లేకుండా పడిందే గాని, ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం కలగలేదు. అయితే ఆమెకూ , పుట్టిన బిడ్డకి శరీరమంతటా పుండ్లు లేచాయి. రాజు దుఃఖించి ఎన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లీబిడ్డలకు వళ్ళంతా పురుగులు పడి చీము కారుతూ, ఎంతో దుర్వాసనగా ఉండేది. పూర్వజన్మలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని, వారిని చూడటం గూడా పాపమే అని తలచి రాజు వాళ్లను  భయంకరమైన ఒక అడవిలో విడిచి పెట్టించాడు. అందుకు రాజు గారి రెండవ భార్య ఎంతో సంతోషించింది. ఎన్నడూ కాలైనా క్రింద పెట్టని మహారాణీ అడవిలో ఆకలితో మాడి పోయింది. అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకుని క్రూర జంతువుల గర్జనల మధ్య ముళ్ళలో లేస్తూ,  పడుతూ తిరుగుతుండగా ఒకచోట కొందరు పశువుల కాపరులు కనబడితే, వారిని త్రాగడానికి మంచినీళ్లు అడిగింది. అప్పుడు వాళ్లు చెరువుకు వెళ్లే దారి చూపారు. అందులో నీరు త్రాగి, అక్కడకు నీళ్లకు వచ్చిన స్త్రీలను ఆమె, "అమ్మా, ఈ రాజ్యంలో ప్రజలందరూ, సంతోషంగా ఉన్నారు, మీ రాజు ఎవరు?" అని విచారించింది. ఆ ప్రాంతపు రాజు, పద్మాకరుడనే  వైశ్యుడు ఎంతో ధర్మాత్ముడు అని తెలిసి అతనిని శరణు పొందింది. ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకొని జాలి చెంది  ఆశ్రయమిచ్చాడు. అతడు గూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు చేయించినా నిష్ఫలమై అతడు చనిపోయాడు. ఆ తల్లి గర్భశోకంతో హృదయవిదారకంగా సోకించింది. అదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయానికి ఋషభయోగి అచ్చటికి వచ్చారు ఆయన ఆ తల్లి శ్లోకం విని, " తల్లి, నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు. పుట్టినవాడుఎవడు? చనిపోయినవాడెవడు? అతడెప్పుడయినా కంటికి కనబడ్డాడా? అతడు ఈ  శరీరమే అనుకుంటున్నావా? జీవుడు కర్మవశాన  పంచభూతాలతో చేయబడిన దేహాన్ని పొందినా, ఆ కర్మ తీరి పోగానే ఆ దేహం చనిపోతుంది. కానీ అతడు ఆత్మస్వరూపం గనుక అతడికి నాశనం ఉండదు. ఇక శోకమెందుకు? త్రిగుణాల వలన అతడికి కర్మబంధము చుట్టుకుంటుంది. సత్వగుణం వలన దేవత్వము, రజోగుణం వలన మానవజన్మ, తమోగుణం వలన తిర్యక్  జన్మలు కలుగుతాయి. త్రిగుణాతీతస్థితి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది. అలా జన్మించాక, అతడు చేసిన కర్మలననుసరించి సుఖదుఃఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది. అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించవలసిందే. కనుకనే వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం గాని, చనిపోయిన వారి గురించి దుఃఖం గాని పొందరు. అంతకంటే భగవన్నామ స్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు గదా! అలాగాక, జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నీవు వీడికి ఏమైనావో  చెప్పగలవా? ఇప్పటికైనా నా మాట విని ఊరటచెందు" అని ఆమెను ఓదార్చాడు. ఆమె, "ఓ మహాత్మా! నేనొక మహారాజుకు రాణి అయ్యాక చివరకు నాకు ఈ గతి పట్టింది. అడవుల పాలైనా, నా వాళ్లందరికీ దూరమైనా, బిడ్డను విడిచి పెట్టలేక భూమిపై జీవిస్తున్నాను. అటువంటప్పుడు వీడు చనిపోతే నేనేం కావాలి? స్వామీ! కరుణార్ద్రహృదయులు అయిన మీరు చెప్పిన తత్వం అజ్ఞాని అయిన నాకెలా తెలుస్తుంది? ఈ కష్ట సమయంలో పరమేశ్వరునివలె మీరు నాకు లభించారు. దేనివలన నా ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి దానిని నాకు అనుగ్రహించండి" అని శోకిస్తూ, ఆ యోగింద్రుని పాదాలమీద పడింది. ఆ యోగి కరుణార్ద్ర  హృదయులై, ఆ పిల్లవాడు పూర్వజన్మలో  తమ సేవకుడని తెలుసుకొని, కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లాడు. వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు. ఆ యోగి యొక్క కృపా దృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు మాయమైంది. ఆ తల్లి సంతోషంతో నమస్కరించ గానే, ఆ యోగి ఆమెకు కొంచెం భస్మము ఇచ్చి, "అమ్మా! నీవు, నీ బిడ్డా ఇది ధరించండి. మీ శరీరాలు వజ్ర సమానమై వృద్ధాప్యం చెందవు. నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు,యశస్వీయై, భధ్రాయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు" అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.    


                         కనుక ఓ రాజా! మహాత్ముల కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయినా నశించగలదు. నీకు వచ్చిన వ్రణం తగ్గడంలో ఆశ్చర్యం ఏమున్నది? ' అన్నాడు. అప్పుడు రాజు, 'స్వామీ! నావ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో దయచేసి తెలపండి' అని వేడుకొన్నాడు. అప్పుడా సాధుపుంగవుడు, గంధర్వపురంలోని శ్రీగురుని  గురించి తెలిపారు. వెంటనే ఆ రాజు గానుగాపురానికి బయల్దేరాడు.


                            సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు, 'ఇక్కడికి మ్లేచ్ఛరాజు వస్తాడు. అందువలన ఇచ్చటి ఆచారవంతులైన  హిందువులకు బాధ కలగవచ్చు. మా మహత్యం లోకమంతటా  వెల్లడయింది. కనుక మేము ఇంక ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు. నేను ఇక్కడే ఉంటే ఇంకెందరో మ్లేచ్చులు గూడా వస్తారు. భక్తీ  సదాచారము లేనివారుకూడా పేరాసతో ఇక్కడకు వస్తారు కనుక ఇంక మేము అంతర్థానమవడం మంచిది. బహుధాన్య నామ సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినపుడు గౌతమీనదికి పుష్కరం వస్తుంది. అప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికి అని చెప్పి ఈ చోటు విడిచిపోతాము' అని నిశ్చయించుకున్నారు. ఒకరోజున ఆయన అచ్చటి భక్తులతో,  'ఇక్కడకు ఒక మ్లేచ్ఛరాజు రానున్నాడు  కనుక మీరంతా మీ ఇళ్లకు వెళ్లిపోండి. మేము గౌతమీ యాత్రకు బయలుదేరుతాము ' అని చెప్పారు. భక్తులు' మహాత్మా! మీరు సాక్షాత్తూ దత్తాత్రేయులే. మీరు మా అండనుండగా ఇక్కడకు ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలుగజాలదు. కనుక మేము మీ సన్నిధి విడిచి ఎక్కడకూ పోనవసరంలేదు' అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు. కొద్ది సమయమయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అచ్చటి వారిని, 'ఇక్కడి సన్యాసి ఎక్కడున్నారు? దయచేసి ఆయనను చూపండి' అని ప్రార్థించాడు. అతనిని చూసి, యవనరాజు అక్కడకు రాగలడని స్వామి చెప్పిన మాటలు స్మరించి, భక్తులు కీడు శంకించి. అతనికి ఏమీ చెప్పడం లేదు. వారి సంశయాన్ని గుర్తించిన రాజు, 'అయ్యలారా! నేను కూడా అర్థార్థినై స్వామి దర్శనానికి వచ్చిన ఆర్థుడనే. సంశయించక  వారు ఎక్కడున్నారో చెప్పండి' అని వేడుకున్నాడు. అతడు పదేపదే ప్రాధేయపడినమీదట, శ్రీ గురుడు అనుష్టానానికని సంగమానికి వెళ్లారని, మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరనీ  ఆ భక్తులు చెప్పారు. రాజు వెంటనే పల్లకీ దిగి, తన పరివారమంతటినీ  అక్కడే విడిచి, తానొక్కడే అతి త్వరగా సంగమానికి వెళ్లి స్వామిని దర్శించి, చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డాడు. శ్రీ గురుడు,  'ఓరి సేవకుడా! ఇన్నాళ్ళకు కనిపించావేమి? ' అన్నారు. ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే, రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి, ఆనందభాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతని శరీరం అంతా రోమాంచితం అయింది. అతడు ఏమేమో మాట్లాడ బోయాడు గాని, సంతోషంతో అతనికి మాట పెగల్లేదు. కొంతసేపటికి అతడు తెప్పరిల్లి, ' ప్రభూ ! మీరు మా శ్రీ పాద స్వామియే. నేను మీ సేవకుడనైన చాకలినే !స్వామీ ! ఈ దీనుణ్ణి ఇంత ఉపేక్షించారేమి? నీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే ! రాజ వైభవాల భ్రమలో చిక్కి, మిమ్మల్ని మరచి ఎంతకాలం గడిపాను! ఇన్నాళ్ళు మీదర్శనమే లభించలేదు. చివరికి మీ ఎదుటకు వచ్చాక కూడా, యిదివరకు అంతగా సేవించుకున్న మీపాదాలను గుర్తించలేకున్నాను. అజ్ఞానమనే మహాసముద్రంలో నన్నిలా పడి ఉండడనివ్వడం మీకు న్యాయమా? జరిగింది చాలు, ఇక నుండి అయినా మీ  పాదాలు విడువను. నన్నుధరించండి!' అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు. శ్రీ గురుడు ' అఖిలాభీష్ట సిద్ధిరస్తు!' అని ఆశీర్వదించారు. వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం  తగ్గించమని వేడుకున్నాడు. స్వామి, ' ఏదిరా, నీ వ్రణం  చూపించు!' అనగానే అతడు తన తొడవంక చూచుకొని, ఆ కురుపు మటుమాయమవడంచూచి ఆశ్చర్యచకితుడై, భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆ స్వామి గంభీరవదనులై, 'ఏమిరా, నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనివితీరా అనుభవించావా, లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయా? బాగా ఆలోచించుకొని చెప్పు!' అన్నారు. అప్పుడారాజు, 'మీ  దయ వలన సకల ఐశ్వర్యాలతో చాలాకాలం రాజ్యమేలాను. నాకు కొడుకులు, మనుమలు కూడా కలిగారు. నా మనసు పూర్తిగా తృప్తిపడింది. కానీ భక్తవత్సలా! మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న  కోరిక ఒక్కటే మిగిలింది. ఆ ఒక్కటీ  తీరగానే నేను సర్వమూ విడిచి మీ పాదసేవచేస్తూ ఇక్కడే పడిఉంటాను' అని వేడుకున్నాడు. స్వామి, 'ఓరీ! సన్యాసుల మైన మేము పాప భూయిష్టమైన నీ మ్లేచ్చరాజ్యంలో అడుగు పెట్టకూడదు. మీ మతస్తులు గోవులను చంపుతారు. కనుక మాకది తగదు' అన్నారు. 'స్వామీ! నేను మీ సేవకుడను, మీ రజకుడను గానా? ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించినదే గదా! కర్మవశాన ఈ జాతిలో జన్మించానే గాని, నేను మీ సేవకుడనే కదా! మీరు ప్రసాదించిన రాజ్యాన్ని, కొడుకులను, మనుమలను, మీకు చూపాలని నా కోరిక. మీరు దూరంగాఉండే మీ  కృపాదృష్టి వారిమీద, మా ప్రజలమీద ప్రసరింపచేయండి. మారాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవధ నిషేధిస్తాను' అనిచెప్పి శ్రీగురుణ్ణి కాళ్లావేళ్లాపడి బ్రతిమాలాడుకున్నాడు. స్వామి, 'ఆహా! మా మహాత్మ్యం వెల్లడవడం  వలన నీచులు గూడా ఇంకెందరెందరో ఇక్కడకు వస్తారు. కనుక ఈస్థానం విడిచి వెళ్ళిపోవడమే కర్తవ్యం. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరినది వద్దకు చేరి, ఎవరికీ కనిపించకుండా పోవడం మంచిది. అని తలచి, మొదట రాజు ప్రార్థనను మన్నించారు.               


                                    శ్రీ గురుని అంగీకారం చెవినపడగానే ఆ యవనుడు ఉప్పొంగి,  వారినొక పల్లకిలో కూర్చోబెట్టి, వారి పాదుకలు తన తలపై పెట్టుకుని కూడా నడవసాగాడు. స్వామి నవ్వుతూ అతడికేసి చూచి,  'నీవు కూడా గుర్రంమీద కూర్చుని ప్రయాణం చెయ్యి. లేకుంటే లోకనిందపాలవుతావు. రాజువైన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడవై ఇలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు, నవ్వుతారు' అన్నారు. రాజు,  'బాబూ! నేనింక ఎక్కడికి రాజును? అంతకంటే ముందు మీ పాద సేవకుడనయిన చాకలినే  కదా! పరశువేది స్పర్శవలన ఇనుము బంగారం అయినట్లు, కేవలం మీ  కృపాదృష్టి వల్లనే నేను పవిత్రుడనయ్యాను. మీరు సాక్షాత్తూ సర్వేశ్వరులే. మానవమాత్రుడనైన నేనే లోకానికి రాజు అయినా, నిజానికి మీసేవకుడనే. ఎవరో ఏమో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా?' అంటూ ముందుకు సాగిపోయి, తాను దూరాన విడిచి వచ్చిన పరివారాన్ని స్వామికి  చూపించాడు. శ్రీ గురుడు సంతోషించి, 'మనం చాలా దూరం పోవాలి. నా మాట విని, ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చేయి' అన్నారు. అతడు శ్రీగురుణ్ణి, శిష్యులనూ  గూడా ఉచితమైన వాహనాలలో కూర్చుండబెట్టి, వారితో గూడా గుర్రం మీద బయలుదేరాడు. మరికొంతసేపటికి స్వామి, 'నాయనా! నీవు మ్లేచ్చుడుగా  జన్మించినా, మా పట్ల ఎంతో భక్తితో మెలగుతున్నావు. సంతోషమే! కానీ సన్యాసులమైన మాకు మీతో కలసి ప్రయాణం చేస్తుంటే త్రికాలానుష్టానము సక్రమంగా చేసుకొనడం వీలుపడదు. కనుక మేము ముందుగా వెడతాము. మీరందరూ మెల్లగా వచ్చి, పాపనాశతీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి' అని చెప్పి, రెప్పపాటులో స్వామి అదృశ్యమయ్యారు. అంతలో ఆయన ఎక్కడా కనిపించక పోయేసరికి,  అందరూ నివ్వెరపోయారు. ఆయన అలా అదృశ్యమై, వైడూర్యనగరానికి కొద్దిదూరంలోవున్న పాపనాశతీర్థం చేరి, అక్కడ యోగాసనంలో కూర్చుని అనుష్టానం చేసుకోసాగారు. కొందరు శిష్యులు వారితోకూడా అక్కడకు చేరి, శుశ్రూష చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయందేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు. ఆయనను ప్రార్థించి, శిష్యసమేతంగా వారిని తన ఇంటికి తీసుకుపోయి పూజించి, అందరికీ భిక్ష ఇచ్చాడు. నాటి సాయంత్రం అతనితో స్వామి,  'నాయనా!యవన రాజును పాపనాశతీర్థానికి రమ్మని చెప్తాము. మేము అక్కడకు పోతాము. లేకుంటే మమ్ము  వెతుక్కుంటూ యవనుడు యిక్కడకు వస్తాడు. అతడిక్కడకు వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది' అని చెప్పి,  శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరకు వచ్చి,  అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు.       


                 ఇంతలో అక్కడ ఆ యవనరాజు,  స్వామి అదృశ్యమవగానే,  'అయ్యో! స్వామి నన్నుపేక్షించి,  ఇలా నన్ను విడిచి వెళ్లిపోయారు. నేనేమి అపరాధము చేశాను?  అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా! అక్కడ నా కోసం వారు వేచి ఉంటారు అని తలచి నలభై  క్రోసుల దూరంలోవున్న ఆ  తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు. అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు. అతడు మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని,  వారి శిష్యులనూ, ఆ  వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు.  అతడు తన మతధర్మం విడచి ఒక  బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగడం చూచిన యవనులు అతనిని అసహ్యించుకున్నారు. నగరవాసులైన  బ్రాహ్మణులు సంతోషించి, సనాతన ధర్మాభిమానియైన  అటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు. స్వామికి రాజు అడుగడుగుకూ  హారతులు ఇప్పించడము,  వింజామరలతో వీస్తుండము చూచిన పురవాసులు  స్వామిని చూచి,  'ఈయనెవరో  భగవదవతారమేగాని,  మానవమాత్రులుగారు. లేకుంటే ఒక  బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు?  అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే!' అనుకొని ఆశ్చర్యపోయారు.   డక్కా, మృదంగము మొదలైన వాద్యాలఘోషతోనూ,  వందల కొద్దీ ఏనుగులు,  గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా,  వందిమాగదులు ఎలుగెత్తి స్వామి కీర్తిని స్తుతిస్తూ వుంటే,  అగర దూపాలు చిమ్ముకుంటూ,  దారిపొడుగునా లెక్కకుమించిన పువ్వులతో రత్నాలుకలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు, నగర వీధులగుండా తీసుకుపోయాడు. చివరకు పల్లకిని రాజభవనం వద్ద దింపించి, అందము,  స్వచ్ఛమైన క్రొత్తవస్త్రాలు పరచిన దారివెంట స్వామిని లోపలకు తీసుకొని పోయి, స్వర్ణ సింహాసనం మీద కూర్చుండ బెట్టాడు. తర్వాత  రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారంచేసి,  ఒక వింజామరతో ఆయనకు వీస్తూ ఒక పక్కన నుంచున్నాడు. అప్పుడు ఆ రాజు తన రాణులు, అంతఃపుర కాంతలు రాజకుమారులు,  కుమార్తెలనూ రప్పించి వారిచేత స్వామికి పాదపూజ చేయించాడు. చివరకు అతడు,  'స్వామీ! నేను జన్మతః హీనుడనైనా తమ కృపవలన ఈనాటికి కృతార్థుడనయ్యాను. నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి' అని చెప్పి నమస్కరించాడు. అతడు చేసిన సపర్యలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి,  'ఓరీ, నికింకేమైనా కోరవలసినది ఉంటే నిస్సంకోచంగా చెప్పుకో!' అన్నారు. ఆ రాజు, తనకింక నిరంతర గురుపాద సేవ తప్ప వేరేమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు. స్వామి సంతోషించి,  అలా అయితే ఈ రాజ్యభారము నీ కొడుకులకు అప్పగించి,  శ్రీశైలం వెళ్ళు. మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడకు వస్తాము. నీకక్కడ మరలా మా దర్శనమవుతుంది' అని ఆదేశించారు. ఆయనతో ఎడబాటు సహించలేని రాజు,  'స్వామీ! అలా అయితే నాకు నిరంతర గురుస్మరణ ప్రసాదించండి' అని వేడుకున్నాడు. శ్రీ గురుడు అతనిని ఆశీర్వదించి,  తన శిష్యులతో కలసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్లారు. చివరకు వారందరూ ఆ నదిలో స్నానంచేసి భీమ - అమరజా సంగమం చేరుకున్నారు. 


                            గంధర్వపురం వాసులందరూ పూజాద్రవ్యాలు తీసుకొని ఎదురేగి,  'స్వామీ ! మీరు యిక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరు అంతా అచేతనమయిపోయింది. తిరిగి మీరాక వలన మరల ప్రాణం వచ్చినట్లయింది' అని ఆయనను స్తుతించి  పూజించారు. అప్పుడు స్వామి,  'బిడ్డలారా! మేమెక్కడికో వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు. ఈ పురం మాకు ఎంతో ప్రియమైనది. ఇక్కడ మమ్మల్ని నిశ్చలభక్తితో కొలిచేవారికి ఎప్పుడూ ప్రత్యక్షమౌతుంటాము.  ముందుముందు దేశమంతా కలియుగ దోషాలన్నింటికీ నిలయం కానున్నది. కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము. అయినప్పటికీ భక్తులను రక్షించటం కోసం వాస్తవంగా గుప్తరూపంలో ఇక్కడే వుంటాము. అలా గుప్తంగా  ఉండటానికి కారణం, రానున్నది కష్టకాలం. ధర్మం రోజు రోజుకూ  క్షీణించిపోతుంది. దుర్మార్గులు ప్రబలి ఎన్నో దుష్కృత్యాలు  చేయబోతారు. పూర్వజన్మ సంస్కారం వలన యోగ్యుడైన ఆ మ్లేచ్చ రాజు మా అనుగ్రహానికి పాత్రులైనారని విని ఎందరెందరో హీనులు కూడా ఇక్కడకు వస్తారు. మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగడం వలన అందరికీ ఎంతో కీడు జరుగుతుంది. కనుక మా  రూపాన్ని గుప్తం చేయడం ఒక్కటే  కర్తవ్యం' అన్నారు. అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చే ష్టులై బొమ్మల లాగా  నిలుచున్నారు.                                   

                                ఆనాటి వరకూ  మానవాకారంతో కనిపిస్తున్న త్రిమూర్త్యవతారం అటు తర్వాత తమ స్థూలరూపాన్ని గుప్తపరచినప్పటికీ యీ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమా! అందుకు నేనే సాక్షిని.  నేటికీ ఈ గంధర్వనగరంలో ఆయనను  విశ్వాసంతో భజించిన వారి కోరికలు తీరుతాయి. ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించని ఈ దత్తమూర్తి,  ఇప్పుడు భక్తుల పాలిటి కల్పవృక్షమై ఇక్కడనిల్చారు. భక్తి - ముక్తులను  ప్రసాదించడానికి ఈ భూమి మీద ఇంతకు మించినదేమున్నది? " 

యాభైవ  అధ్యాయం సమాప్తం

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Tuesday, June 9, 2020

గురు చరిత్ర అధ్యాయము -49


అధ్యాయము  -49




                               
శ్రీ గణేశాయనమః 
                            
శ్రీ సరస్వత్యేనమః
                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము


                            నామధారకుడు ఈ లీలలు విని పులకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకొని,  "మహాత్మా! శ్రీగురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తూ త్రిమూర్తుల  అవతారమని రూఢి అవుతున్నది. కానీ ఈ భూమిమీద యెన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ సంగమ క్షేత్రాన్నే తమ నివాసంగా ఎందుకు ఎన్నుకున్నారో తెలియడంలేదు. ఈ క్షేత్రం యొక్క విశేషమేమో వివరించండి" అని కోరాడు. అప్పుడా యోగి ఇలా చెప్పసాగారు:    


                           " నాయనా! ఒక అశ్వినీ మాసంలో కృష్ణ చతుర్దశినాడు ఈ గంధర్వ పురవాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్దులవు తున్నారు. ఆనాడు ఈ శ్రీగురుడు తమ శిష్యులనందరినీ పిలచి, 'మనం ఈనాడు త్రిస్థలియాత్ర చేసివద్దాము' అన్నారు. అప్పుడు భక్తులు, 'స్వామీ! అలా అయితే మేమీ యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూట గట్టుకుని దారి ఖర్చులుకూడా సిద్ధం చేసుకొని వస్తాము' అన్నారు.ఆ మాటలు విని స్వామి, ' అవన్నీ ఎందుకు? త్రిస్థలి  మనకు దగ్గరలోనే ఉన్నది. ఎట్టి  సన్నాహాలూ అవసరం లేదు. కనుక మీరందరూ మీమీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి' అని ఆదేశించారు. వెంటనే వారందరూ ఆయనతోకూడా సంగమ  తీరానికి చేరి,  నదిలో స్నానాలు చేశారు. అప్పుడు స్వామి,  'నాయనలారా! ఈ సంగమ ప్రాంతమంతా ప్రయాగతో సమానమైన మహత్మ్యం  గలది సుమా! ఇచ్చటి షట్కుల తీర్థాన్ని మించినది వేరొకటి లేదు. ఇది ప్రయాగను కూడా మించినది.ఈ బీమా - అమరజా సంగమం గంగా -  యమునా సంగమంకంటే కూడా ఎక్కువ పవిత్రమైనది. ఇక్కడ స్నానం చేయడంవలన కలిగే పుణ్యం ఇంతింతని చెప్పనలవికాదు.ఇచ్చటి  ఉత్తర వాహినిలో చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం. ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కదానిని గూర్చి ఎంతని చెప్పగలము?' అన్నారు. అప్పుడు ఒక భక్తుడు,  'స్వామీ ! ఇచ్చటి నదికి "అమరజ" అని పేరు ఎలా వచ్చింది? అది ఎలా ఏర్పడిందో సెలవియ్యండి!' అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగారు:       


                            'పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఇందులో జాలంధరుడనే రాక్షసుడు  ఎందరో దేవతలను చంపేస్తున్నాడు. అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి,  "మహదేవా! ఈ  యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లున్నది. అదేమీ చిత్రమోగాని,  రాక్షసుల దేహాలనుండి కారిన రక్తపు  చుక్కలనుండి వేలాదిగా రాక్షసుడు పుట్టి,  ముల్లోకాలలోని దేవతలను సహకరిస్తున్నారు" అని మొరపెట్టుకున్నారు. వెంటనే రుద్రుడు పట్టరానికోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. కాని ఇంద్రుడు  ప్రార్థించిన మీదట,  ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృతభాండం ప్రసాదించాడు. వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్లి చనిపోయిన దేవతలమీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు. చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది. అదే ఈ నదిరూపంలో ప్రవహిస్తున్నది. అందుకే దీనికి 'అమరజా' అనే పేరు వచ్చింది. అందువల్లనే సంజీవని వంటి ఈ నీరు సర్వ పాపాలను నశింపచేయగలదు.  ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసినవారికి అపమృత్యు భయం ఉండదు. ఇది అన్ని బాధలనూ,  వ్యాధులను, బ్రహ్మహత్యాది పాపాలనూ  తొలగించడంలో  త్రివేణిసంగమంతో సమానమైనది.  ఈ సంగమంలో వైశాఖ, కార్తీక,  మాఘ మాసాలలో యధావిధిగా ఉషఃకాలంలో స్నానంచేస్తే ఈ లోకంలో సుఖము, అటుపై మోక్షమూ  కలుగుతాయి. అందుకు అవకాశం లేనప్పుడు,  గ్రహణ సమయంలోను,  సంక్రమణ,  పర్వదినాలలోను ఏకాదశి మొదలైన తిథులలోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితమొస్తుంది. నిత్యమూ ఇందులో స్నానంచేసినా పూర్నాయుష్మంతులవుతారు.             


                ఈ అశ్వత్థవృక్షం దగ్గరున్న మనోరథ తీర్ధంలో స్నానంచేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ  నెరవేరుతాయి. భక్తితో అశ్వత్థాన్ని  సేవించిన వారికి కలిప్రభావం అంటక,  మా దర్శనం లభిస్తుంది. కారణం మేమందులో యెల్లప్పుడూ వుంటాము. అట్టి ఈ కల్పవృక్షాన్ని,  సంగమేశ్వరుడైన  సదాశివున్ని  పూజించి, త్రయంబక మంత్రం పఠించాలి. శ్రీశైలంలో మల్లికార్జునునివలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు. ముందు నందీశ్వరునికి నమస్కరించి, తర్వాత  శివునికి ప్రదక్షిణంచేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా మూడు ప్రదక్షిణలు అయ్యాక, ఎడమచేత్తో నందీశ్వరుని వృషణాలు స్పృశించి, కొమ్ములపై బొటన - చూపుడువేళ్ళు ఆనించి, వాటిమధ్యనుండి శివలింగాన్ని దర్శించాలి.  భక్తితో ఇలాచేస్తే అభీష్టాలన్నీ  నెరవేరుతాయి. ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్తూ వారణాసియే.  అది నాగేశ్వరమనే  గ్రామంనుండి ప్రవహించినది. దీనిని గురించి ఒక పురాణోపాఖ్యానమున్నది.        


                పూర్వం భారద్వాజస గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి,  పూర్ణ విరాగి అయ్యాడు. అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది. ఆనంద పారవశ్యంతో అతడు ఒళ్ళు మరచి తిరుగుతుంటే,  లోకులు అతనికి దెయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు. ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు,  పాండురంగడు కాశీకి బయలుదేరుతూ,  తమ అన్నయైన అతనిని గూడ రమ్మన్నాడు. అతడు నవ్వి,  "కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే  ఉండగా, కాళ్ళీడ్చుకుంటూ ఎక్కడకో  వెళ్ళడమెందుకు?" అన్నాడు. "అలా అయితే మాకు చూపించగలవా?" అని వారన్నారు. అతడు అంగీకరించి,  సంగమంలో స్నానంచేసి ఈశ్వరుణ్ణి ద్యానించి, "వ్యోమకేశా! దీనిని కాశీ గాచేసి,  ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు!" అని ప్రార్థించగా,  అందరికీ అక్కడే వారణాసి కనిపించింది. ఈ కుండమే మణికర్ణిక అయింది. ఈ నది ఉత్తర వాహిని అయ్యే చోటఆ కాశి  ప్రకటమయింది. కాశీలో ఉన్న దైవరూపాలన్నీ ఇక్కడే కనిపించాయి. అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానము,  దానము మొదలైనవి చేశారు. అప్పుడాయన మహాజ్ఞానియని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాధిస్తూ ఉండేవాడు. కనుక ఇది సాక్షాత్తూ కాశీయే.'


                            స్వామి అటు తర్వాత భక్తులకు పాపవినాశతీర్థం చూపించి,  'ఇందులో స్నానంచేస్తే సర్వపాపాలూ భస్మమవుతాయి' అని చెబుతూ ఉండగా,  పూర్వాశ్రమంలో వారి సోదరియైన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడకు వచ్చి,  ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీగురుడు, 'అమ్మాయీ! నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా?' అన్నారు. ఆమె నమస్కరించి,  'స్వామీ,  నేను మూడురాలిని.  సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెల్పాలి' అన్నది. అప్పుడు స్వామి,  'పూర్వం ఒక పిల్లి పిల్లలను పెట్టింది. నీవు చూడకుండా ఆ కుండనిండా నీళ్లుపోసావు.  అవి చచ్చిపోయాయి. అందువలన నీకు పంచమార్జాల హత్యా మహాదోషం చుట్టుకున్నది. ఇంకా చెబుతాను విను' అంటుండగా, అంతలోనే ఆమె శరీరమంతా కుష్టువ్యాధితో నిండిపోయింది. ఆమె భయపడి ఆయన పాదాలమీదపడి, ఓ దయానిధి! ప్రజలు పాపాలు పోగొట్టుకోడానికి కాశీకి వెళ్ళినట్లు,  నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను,  రక్షించు!' అని ప్రార్ధించింది. అప్పుడు శ్రీనృసింహ సరస్వతి,  'నీ వెన్నో పాపాలు చేశావు. వాటిని మరుజన్మలలో అనుభవించి పోగొట్టుకుంటావో,  లేక ఇప్పుడే  పోగొట్టుకుంటావో చెప్పు!' అన్నారు. ఆమె,  'ఇంకా మరొక జన్మ ఎందుకు? నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మలేకుండా చేయండి' అని ప్రార్థించింది. స్వామి, 'అలా అయితే, నీవు నిత్యమూ  ఈ పాపనాశతీర్థంలో స్నానం చేస్తూ ఉండు. ఒక్కొక్క స్నానానికి ఏడుజన్మల పాపం నశించిపోతుంది. ఈ కుష్టురోగ మొకలెక్కా? ' అని చెప్పారు. అలా చేయగానే  ఆమెవ్యాధి మాయమయింది. అది నేను స్వయంగా చూచాను.ఆ  క్షేత్రమహత్మ్యం చూచి ఆమె అక్కడే ఉండిపోయింది.            


             అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటితీర్థం చూపించి,  'ఇందులో సర్వతీర్థాలూ  ఉన్నాయి. ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవులు దానమిచ్చిన ఫలితము  ఉంటుంది. ఇక్కడ చేసిన దానానికి కూడా కోటిరెట్లు ఫలితముంటుంది. దీనికి అవతలనున్న రుద్రపాద తీర్థంలో గయలోలాగే, కర్మచేసి రుద్రపాదస్వామిని పూజించాలి' అని చెప్పారు. తర్వాత కేశవస్వామి దగ్గరనున్న చక్రతీర్థం చూపి,  అక్కడ స్నానంచేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీగురుడు చెప్పారు. 'కల్లేశ్వరుని దగ్గరనున్న మన్మధతీర్థంలో స్నానంచేసి ఈశ్వరుణ్ణి  పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రావణమాసంలో అఖండాభిషేకము,  కార్తీకమాసంలో దీపోత్సవమూ  చేస్తే అష్టసిద్ధులు,  మోక్షమూ  కూడా లభిస్తాయి'.స్వామి  చెప్పినది విని అందరూ సంతోషించి, యీ  అష్టతీర్థాలలో స్నానం చేసారు. నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేసారు.

నలభై తొమ్మిదవ అధ్యాయం సమాప్తము.


శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Monday, June 8, 2020

గురు చరిత్ర అధ్యాయము -48


అధ్యాయము  -48




                               
శ్రీ గణేశాయనమః  
                           
శ్రీ సరస్వత్యేనమః
                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 



                      "స్వామీ ! ఈ గంధర్వపురంలో శ్రీ గురుడు ఇంకేమి చేశారో చెప్పండి!" అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు. "నాయనా! ఆ భగవంతుడు ప్రతిరోజూ స్నానానుష్టాలకు మఠంనుండి బయలుదేరి సంగమానికి వెళ్లి వస్తుండేవారు అని చెప్పాను కదా? అప్పుడు గంధర్వ పురం లో పార్వతేశుడనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడు గుత్తకు సాగుచేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉండేది. అతడు నిత్యమూ మొదట మఠంలో శ్రీగురుణ్ణి  దర్శించుకుని పొలానికి వెళ్తుండేవాడు. శ్రీ గురుడు మఠం నుండి సంగమానికి వెళ్లేటప్పుడు, తర్వాత మఠానికి తిరిగివచ్చేప్పుడు, కనిపెట్టి పరుగునపోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్దిదూరం నుండే ఆయనకు నమస్కరించుకుని పోతుండేవాడు. కొంతకాలం శ్రీగురుడు అతనినేమీ పలకరించకుండా అతడి భక్తిశ్రద్ధలను గమనిస్తూ ఉండేవారు. ఎంతకాలమైనా అతడేమి కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే, "నాయనా! నిత్యమూ  నీవింత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావే, మానుండి నీకు ఏమి కావాలో చెప్పు!' అన్నారు. ఇంత కాలానికి తనకట్టి  అవకాశం వచ్చినందుకు పర్వతేసుడెంతో సంతోషించి, చేతులు జోడించి, 'బాబూ, నా పొలాన్ని స్వామి వారు ఒక్కసారి చూచి, అక్కడ తమపాదము పెడితే మాకు మేలవుతుందని నా ఆశ' అన్నాడు. స్వామి, ' నాయనా, నీ పొలంలో ఏమి పైరు వేసావు?' అని అడిగారు. అతడు 'అయ్యా! ఈ సంవత్సరం జొన్నవేశాను.  రోజూ  మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది. తమ దయ వల్ల 2 నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది. కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును  చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు. ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి, నామాట త్రోసిపుచ్చివద్దు. మీరే మా పాలిట రక్షకులు' అని ప్రార్థించాడు.                   


                            శ్రీ గురుడు, 'సరే పద, చూచి వద్దాము' అని చెప్పి, అతనితో గూడ చేను వద్దకు వచ్చారు. ఏపుగా పెరిగిన పైరును కలయజూస్తూ, ఏమిరా! మేము చెప్పింది చేస్తాం అంటే ఒక మాట చెబుతాను' అన్నారు. ఆ రైతు, 'తండ్రి, మీమాట జవదాటుతానా? మా క్షేమం కోరి చెప్పేవారు మీరుగాక మరి ఎవరున్నారు? మీరు ఒక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు. స్వామికి తెలియనిది ఏమున్నది?గుర్వాజ్ఞ  విషయంలో నాకు మరే ఆలోచనా లేదు' అన్నాడు. ఆ యతివరేణ్యుడు, 'అలా అయితే మా మాటమీద నమ్మకం ఉంచి, మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్ళే లోపల ఈ చేలోని పైరుఅంతా కోయించు!' అని చెప్పి సంగమానికి వెళ్లి పోయారు. 


                            ఆ పాలిగాపు వారి ఆజ్ఞను  అక్షరాల పాటించదలచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్లి, ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త  చెల్లిస్తానని, పైరు కోయడానికి  అనుమతిపత్రం ఇవ్వమనీ  కోరాడు. కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆసామి అందుకు ఒప్పుకొనక, ఆ ముందటి సంవత్సరంకంటే రెట్టింపు గుత్త  చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని, పైరు కోతకు అనుమతిచ్చాడు. ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలంవద్దకు వెళ్లాడు. 'పైరుకు ఇంకా పాలుపట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమా!' ఈ కూలీలు గూడా ఆశ్చర్యపోయారు.కానీ,  తమకు కూలీ దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు. అంతలో ఆ సంగతి తెలిసి,  అతని భార్య బిడ్డలు నెత్తీ,  నోరూ మొత్తుకొంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు. వాళ్ళని పొమ్మని  ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి,  అతడు వాళ్ళమీద రాళ్ళు రువ్వసాగాడు.  వాళ్ళు భయపడి న్యాయాధికారి వద్దకు వెళ్లి, 'మహాప్రభూ! మా వాడికి దయ్యం పట్టిందో ఏమో గాని,  కంకులింకా ముదరకముందే పైరు కోయిస్తున్నాడు.  వద్దని అడ్డుబోతే  మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని,పంటకొస్తున్న పైరే చేతులారా పాడుచేస్తున్నాడు. ఇంకొక నెలరోజుల్లో చేతికి వస్తుందని మేము ఆశపడుతూ ఉంటే ఆ కాస్తా ఇలా నాశనమైపోతున్నది. అతనిని నిగ్రహించండి.అని గొల్లున ఏడ్చారు. ఆ న్యాయాధికారి,' మీరు నాతో చెబితే నేను ఏమి చేయగలను? ఏమైనా చేయగలిగితే యజమానే  చేయగలడు. అతనితో చెప్పుకోండి' అని చెప్పి వారిని పంపివేసాడు.    


                          వాళ్లు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకువెళ్లి మొరపెట్టుకుంటే అతడు, 'వాడి ఇష్టం! వాడేమి  చేసుకుంటే నాకెందుకు? క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలా రాయించుకున్నాను. అయినా మీరింతగా గోల పెడుతున్నారు గనుక, మా మనిషినిపంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను. మీరు వెళ్ళండి' అని చెప్పి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి పొలం వద్దకు వెళ్లి అడ్డుచెప్పగానే ఆ సేద్యగాడు, 'ఏమయ్యా! కాగితం రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలేగాని, నేనేమి చేసుకుంటే అతనికి ఎందుకు? ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదెలోనే ఉన్నది. అది చాలకుంటే, వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినన్ని పశువులు ఉన్నాయి కదా?' అని చెప్పి, అతనిని వెనుకకు పంపివేసాడు. అంతటితో యజమాని ఊరుకున్నాడు. పర్వతేశుడు పైరు కోత త్వర త్వరగా పూర్తి చేయించి, కొడవళ్ళు కట్టకట్టించి అవతల పెట్టించి, శ్రీ గురుణ్ణి స్మరిస్తూ, ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొంత సేపటికి అటుగావస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి, వారిని పొలం వద్దకు తీసుకువెళ్లి, ఆ కోసి వేసిన పైరు చూపాడు. స్వామి అది చూచి ఆశ్చర్య నటిస్తూ, 'అయ్యో! నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే! నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావే! ఎంతపని చేశావయ్యా! పాపం, ఇప్పుడు నీ జీవనమెలా? యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు? అమాయకుడా? పండనిపైరు కోసి అంతా వ్యర్ధం చేసావు కదా!' అన్నారు. కాని పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి, 'స్వామీ! నాకు గురువాక్యమే ప్రమాణము. అదేమాకు శ్రీరామరక్ష. మీరు ఉండగా మాకేమి భయం?' అన్నాడు. అతని విశ్వాసానికి శ్రీగురుడు లోలోపల సంతోషించి, 'నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే!' అని నిర్వికారంగా మఠానికి వెళ్లిపోయారు. ఆ కాపరి గూడా శ్రీ గురుడు కనుమరుగు అయ్యేవరకు తదేకంగా ఆయనను చూచి, నిశ్చింతగా ఇంటికి వెళ్లాడు. దారిలో అతనిని చూచిన వారంతా యెన్నెన్నో మాటలన్నారు కానీ, అతడు అవేమీ పట్టించుకోలేదు.


                    పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతడి భార్య తమకా  సంవత్సరం నోటి వద్దకొచ్చిన కూడు పాడై పోయిందని భోరుభోరున ఏడుస్తున్నది. అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో, ' ఓసి వెర్రిదానా! నీవలా  ఏడవకూడదు. ఆ గురుదేవుల వాక్కే మన పాలిట కామధేనువు. వారి మహిమ మూఢులకేమి తెలుస్తుంది? ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే. మనకాయన పెన్నిధిలా దొరికాడు. వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతక గవారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతకగలము. మామూలుగా పడవలసిన పంటకంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకమున్నది' అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారు అందరూ చోద్యము చూడవచ్చి, అతని మూఢవిశ్వాసానికి నివ్వెరబోయి, నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.   


                    ఒక వారం రోజులు గడిచాయి. ఎనిమిదవరోజు నుండి విపరీతమైన చలిగాలి వీచనారంభించింది. దానివలన చుట్టుప్రక్కల చేలన్నీ  వాలిపోయి, తాలుధాన్యం ఏర్పడింది. దానికితోడు ఆ పుష్యమాసంలో భారీఎత్తున అకాలవర్షం కురిసింది. అంతటితో మిగిలిన పైరులన్నీ  పూర్తిగా పాడైపోయాయి. కానీ పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్లనుంచి ఒక్కొక్క మొక్కకు పది,  పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి. పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది. అది చూచిన వారందరూ నిర్ఘాంతపోయారు. అతడి భార్యకూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళమీదపడి, 'అయ్యా! తెలియక నేనెంతో గొడవచేసి మీ మనస్సును ఎంతగానో నొప్పించాను. తెలివితక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను. చివరకు ఆ మహానుభావుణ్ణి గూడా నిందించాను. అదెంత తప్పో  ఇప్పుడు తెలుసుకున్నాను. అదంతా మనస్సులో పెట్టుకోక నన్ను క్షమించు' అని ప్రాధేయపడింది.         


                            అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజచేసి శ్రీగురునివద్దకు వెళ్లి ఆయన పాదాలమీద పూలువేసి నమస్కరించు  కున్నారు. స్వామి నవ్వి, 'ఏమిటి విశేషం? ' అన్నారు. ఆ దంపతులు నమస్కరించి, 'స్వామీ, మీ దయవలన మేము కోరినదానికంటే ఫలితమెంతగానో ఎక్కువ వచ్చింది. మిమ్మల్ని మించిన కామధేనువు, సత్యమూర్తి భూమిమీద ఇంకెవరున్నారు? అమృతంవంటి మీమాట అందరూ వినదగినది. అదియే  అందరి పాలిట పెన్నిధి; మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు' అన్నారు. పర్వతేశుని భార్య, 'స్వామీ! నేను తెలియక మొదట ఏమేమో అన్నాను. మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడు ఇలానే కాపాడాలి. మీరే మాకు దిక్కు. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి' అని  విన్నవించుకున్నది. తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు. వారి భక్తిని చూచి సంతోషించి శ్రీగురుడు, 'అఖండ శ్రీరస్తు!' అని ఆశీర్వదించి, వాళ్లను పంపివేశారు. ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు.   


                                                నెల గడిచేసరికి పర్వతేశుని పంటపండి, కంకులు అద్భుతంగా బయటికి వచ్చాయి. నిజానికి ఆ మొదటి సంవత్సరం కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ధాన్యం పండింది. ఆ కాపు ధాన్యం నూర్చి రాశిపోసి, ఆసామి వద్దకుపోయి, 'అయ్యా! చూచారా, స్వామి దయవలన పైరెంత బాగా పండిందో? మీకు కూడా మన ఒప్పందం చేసుకున్న దాని కంటే ఎక్కువే ఇస్తాను తీసుకోండి. అయినా నాకు ఇంత ఎక్కువగా పడింది కనుక మనిద్దరమూ చెరిసగం తీసుకొనడం న్యాయమని నాకు అనిపిస్తున్నది. మీరు వెంటనే వచ్చి మీభాగం తీసుకుపోండి' అని చెప్పాడు. కానీ ఆసామి ధనాకు లోబడక ధర్మానికి అంటిపెట్టుకుని, తనుఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోడానికి అంగీకరించలేదు. 'అది నీ భక్తిశ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించినది కనుక అదంతా నీకే చెందాలి' అన్నాడు. అప్పుడా రైతు, రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యమిచ్చాడు. అటుపైన మిగిలినదంతా బండ్లమీద వేసి ఇల్లు చేరుకున్నాడు. నామధారకా! శ్రీగురుని మహత్యం ఎంతటిదో చూచావా? గురుభక్తే అభీష్టాలన్నింటినీ ప్రసాదించగలదు." 


నలభై ఎనిమిదవ అధ్యాయం సమాప్తము 


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...