అధ్యాయము -50
శ్రీ గణేశాయనమః
శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః
కథారంభము
నామధారకుడు, "స్వామీ! మీరు పరమపవిత్రమైన క్షేత్ర మహత్యం చెప్పారు. మీరు వర్ణిస్తుంటే ఆ క్షేత్రాలను చూస్తున్నట్లున్నది. ఎక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడైన గురువుంటే అక్కడే దేవతలు, తీర్థాలు ఉంటాయి. ఈ సంగమము కృష్ణా - పంచగంగ సంగమము వంటిది. ఇక్కడ పశుపక్ష్యాదులు నీళ్ళుత్రాగి స్నానంచేసి కృతార్థత పొందాయి. ఇక మానవుల సంగతి చెప్పాలా? దీని మహత్యం వింటేనే పాపాలు పోతాయి. ఇక ఇక్కడ నివాసం చేసేవారికి ముక్తి కరతలామలకమే. స్వామీ ! మీ హృదయం శ్రీగురుని లీలలతో నిండి ఉన్నది వాటిని ఇంకా వినాలని ఉన్నది. దయచేసి వినిపించండి" అన్నాడు. అప్పుడు సిద్ధయోగి, "నాయనా, నీవు ధన్యుడివి. భగవంతుని కృపవల్లనే నీకిట్టి ప్రీతి కలిగింది. అటుపై ఆ కథ చెబుతాను విను:
"వైడూర్య నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తుండేవాడు. అతడు విజ్ఞుడు, శుద్ధాత్ముడు, సర్వభూత సముడున్నూ. పూర్వజన్మ సంస్కాకారం వలన అతడు మన దేవతలను, పుణ్యక్షేత్రాలను, సద్బ్రాహ్మణులనూ గూడా ఆదరిస్తుండే వాడు. అది సహించక అతని కొలువులోని యవనమత గురువులు అతనితో, 'రాజా! మన ధర్మాన్ని మాత్రమే మీరు ఆధరించడం మంచిది. ఇప్పుడు మీరు చేసేది, మనము కలలోనైనా తలచరానిది. హిందువుల మతధర్మం బోధించేవేవీ సత్యమైనవి గావు. రాజా! వారు అచేతనములైన శిలలలోనూ, అశ్వత్థాది వృక్షాలలోనూ దేవుడు ఉంటాడంటారు. అలా తల చటం మహాపాపమని మనం విశ్వసిస్తాము. కనుక వారిని సమానులుగా గౌరవించటం తగదు' అనేవారు. రాజు, 'సృష్టిలోని జీవులందరూ భగవంతుని బిడ్డలే. ఆయన అన్ని జీవులపట్ల సమానమైన ప్రేమ కలిగి ఉంటాడు. అలా అయితే ఆయన మానవులందరికీ వారి వారికి తగిన రీతిలో జ్ఞానాన్ని పొందే ధర్మాన్నే ప్రసాదించి ఉండాలి! మనధర్మానికి మూలమైన గ్రంధం వలెనే వారి వేదాలు కూడా ఈ సత్యమే చెబుతున్నాయి. కనుక ఇటువంటి భేదబుద్ధి భగవంతుని పట్ల అపచారమే గాక, మన మతధర్మానికి కూడా కళంకమే సుమా? ' అని ఖండితంగా చెప్పేవాడు. ఇక చేసేదేమీ లేక మంత్రులు వూరకుండేవారు.
మరికొందరు యవన మతగురువులు, 'రాజా! మీరు మన ధర్మం మాత్రమే ఆచరించండి. ఇప్పుడు మీరు చేసేపని మంచిదికాదు. అవయవాలన్నీ దేహానికి సమానం అయినప్పుడు ఈ దేశస్థులు నమ్మినట్లు మానవుల మధ్య వర్ణాశ్రమ బేధాలెలా ఉంటాయి?' అనే వారు. వారితో రాజు, 'మీరు బుద్ధిమాంద్యంవలన భ్రమపడుతున్నారు. గుణకర్మల భేదం వలన మానవులను దైవమే నాలుగు వర్ణాలుగా సృష్టించారని వారంటారు. మానవుల గుణ కర్మలలో భేదం ఉండడం మనం చూస్తున్నాం కదా! మీరు చెప్పినట్లు అవయవాలన్నీ దేహానికి సమానమే, కానీ ఆ దేహంలోని అవయవాలన్నీ ఒకేలాగా వుండవు; ఒకే పని చేయలేవు. ఏ అవయవం చేయవలసిన పని ఆ అవయవమే సమర్థవంతంగా చేయగలదు. అదే దానికి సార్ధకత. నిజానికి భగవంతుడు సర్వవ్యాపియని మనవలే వారూ విశ్వసిస్తారు. కానీ అజ్ఞులైన పామరులు, హృదయశుద్ధి లోపించడం వలన, పరమాత్మను ఆ రీతిన ధ్యానించలేరు.పిల్లలకు మొదట పెద్ద పెద్ద అక్షరాలు దిద్దపెట్టినట్లే, పామరులకు ఏకాగ్రత కుదరటానికి ప్రథమ సోపానంగా మాత్రమే వారి పెద్దలే దైవానికి విగ్రహాలు కల్పించారు. వారు అలా ఏకాగ్రత సాధించాక పరమేశ్వరుణ్ణి యధాతథంగా ధ్యానించగలుగుతారు. విగ్రహారాధన మందబుద్ధులకు ఒక సాధనమే గానీ, ధ్యేయంగాదని వారి మతమే చెబుతుంది. దుమ్ము కప్పిన అద్దంలో మన ప్రతిబింబం సరిగ్గా కనబడదు. శుద్ధమైన అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, మలినమైన మనస్సులో ఈశ్వర భావం కలుగదు. ఎలాగైనా ధ్యానం అభ్యసిస్తే మాలిన్యం తొలగి హృదయం పరిశుద్ధమై, అందులో భగవంతుని ఉనికి తెలుస్తుంది. మన పవిత్ర గ్రంథంలాగే, వేదాలు కూడా ఋషులు వినిన వాక్కే గనుక అవీ స్వతఃప్రమాణమే. అందులోని ధర్మాలు ఆచరించే బ్రాహ్మణులను గౌరవించ వలసిందే. వేదాలు, ధర్మశాస్త్రాలు చెప్పినట్లు ప్రవర్తించే మానవులందరూ, మన ధర్మం ప్రకారం ప్రవర్తించే వాళ్ళవల్లనే పూజ్యులు' అనేవాడు.
ఒకప్పుడు విధి వశానో, దైవయోగము వల్లనోగాని, ఆ మ్లేచ్చ రాజుకు తొడమీద పుండు లేచింది. అది ఎన్ని చికిత్సలు చేసినా తగ్గకపోగా రోజురోజుకూ ఎక్కువ గాసాగింది. ఆ బాధకు అతడికి నిద్రాహారాలు కూడా కరువయ్యాయి. చివరికతడు ఒక సదాచార సంపన్నుడైన సద్విపృన్ని పిలిపించి, దానికి నివారణ ఉపాయం చెప్పమని కోరాడు. ఆ విప్రుడు, 'రాజా! నీవు యవనుడవు - నేను బ్రాహ్మణుడను. నేను చెప్పే ఉపాయము గురించి, అది చెప్పినది నేనన్న సంగతి తెలిస్తే ఈ లోకం నిన్ను నన్ను బ్రతకనివ్వదు. అందువలన ఏకాంతంలో చెబుతాను' అన్నాడు. అప్పుడారాజు అతనితో కలిసి ఒక ఏకాంతస్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆ బ్రాహ్మణుడు అతనితో ఇలా చెప్పాడు: 'రాజా, నిజానికి గతజన్మపాపాలే మానవులందరినీ వ్యాధిరూపంలో భాధిస్థాయి. తీర్ధయాత్ర, దేవతారాధన, దానములవలన కొన్నిపాపాలు, వ్యాధులు, తొలగుతాయి. కానీ వాటన్నిటికంటే శ్రేష్ఠమైనది సాధుదర్శనం వలన సర్వ పాపాలు, వ్యాధులూ గూడా తొలగిపోతాయి! చివరకు అజ్ఞానమనే భవరోగాన్ని కూడా వారు తొలగించి ముక్తిని గూడా ప్రసాదించగలరు. కనుక రాజా! నీవు మీ వాళ్ళ అందరితో ఏదో ఒక సాకు చెప్పి, ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఈ విదర్భ నగరానికి సమీపంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళు. అక్కడ స్నానం చేసి దానధర్మాలు చేయి. దాని వలన నీ పాపం తొలగి, ఉత్తమమైన వ్యాధి నివారణోపాయం నీకు అదే లభిస్తుంది. ఆ క్షేత్రంలో ఎవరు ఏది కోరితే అదే లభిస్తుంది' అని చెప్తాడు. అప్పుడా మ్లేచ్చరాజు వెంటనే కొద్ది పరివారంతో బయల్దేరి, అక్కడికి కొద్దిదూరంలో ఉన్న పాపనాశ తీర్థానికి వెళ్ళాడు. ప్రతిరోజు అతడు అక్కడి తీర్థంలో స్నానం చేస్తూ, రహస్యంగా ఉన్నాడు. ఒకరోజు అతడు తీర్థంలో స్నానం చేసి బయటకు వస్తుండగా అతనికొక యతీశ్వరుడు కనిపించారు. రాజు ఆయనకి నమస్కరించి, తన పుండు గురించి, దాని నివారణ కోసం తనకు ఆ ద్విజుడు చెప్పిన ఉపాయం గురించీ నివేదించు కొని ఇలా అన్నాడు : ' స్వామి! నేను మ్లేచ్చుడనని మీరు ఉపేక్షించవద్దు. నేను యవనుడనైనా, మీ ధర్మాన్ని కూడా ఆదరించేవాడినే! నాకు దయతో ఈ వ్యాధి నివారణోపాయం తెలపండి' అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సన్యాసి కూడా, సాధు దర్శనము అన్నింటికంటే శ్రేష్టమైన తరునోపాయమని చెప్పాడు. అప్పుడా యవనరాజు ఆయనకు నమస్కరించి, ' యోగీశ్వరా ! సాధుదర్శనం అన్నింటికంటే శ్రేష్టం అంటిరి కదా, అందుకు తార్కాణం ఏమైనా దయతో వివరించండి' అని వేడుకొన్నాడు. అప్పుడా సన్యాసి ఇలా చెప్పాడు: 'నాయనా వెనుక ఋషభ యోగి అనే మహాత్ముని అనుగ్రహంవలన ఒక పతితుడైనబ్రాహ్మణుడు జన్మాంతరంలో ఉద్ధరింపబడ్డాడు. ఆ కథ వివరంగా చెప్తాను విను:
పూర్వం అవంతి పురం లో ఒక బ్రాహ్మణుడు పింగళ అనే వేశ్యకు వసుడై స్వధర్మాన్ని విడిచి పెట్టాడు. అతడు గృహస్తు అయ్యుండి కూడా తన భార్యను విడిచి పెట్టి ఆ వేశ్య ఇంటివద్దనే త్రాగి పడి ఉండేవాడు. ఒకనాడు సంధ్యవేళ ఋషభ యోగి అటుగా వెళ్తుంటే చూచి, ఆ నామమాత్ర బ్రాహ్మణుడు, వేశ్య ఆయనకు భక్తితో నమస్కరించి ఇంట్లోకి తీసుకెళ్లి, పూజించారు. తర్వాత ఆయనకు భోజనం పెట్టి, రాత్రంతా పాద సేవ చేస్తూ, ఆయనను నిద్రపుచ్చారు. మరుసటి ఉదయమే ఆ యోగి వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. అట్టి సాదు సేవ వలన ఆ బ్రాహ్మణునికి సద్బుద్ధి అంకురించి, త్వరలో పరివర్తన చెంది కొంతకాలానికి చనిపోయాడు. మరుజన్మలో అతడు దశార్ణదేశంలో వజ్రబాహువనే రాజు యొక్క పట్టపురాణి అయిన సుమతీదేవి గర్భంలో పడ్డాడు. ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడేమోనన్న అసూయతో ఆ రాజు గారి రెండవ భార్య ఆమెకు విషం పెట్టింది. కానీ అందువలన పట్టమహిషి స్పృహ లేకుండా పడిందే గాని, ఆమె గర్భంలోని పిండానికి ప్రాణాపాయం కలగలేదు. అయితే ఆమెకూ , పుట్టిన బిడ్డకి శరీరమంతటా పుండ్లు లేచాయి. రాజు దుఃఖించి ఎన్నో చికిత్సలు చేయించినా ఆ తల్లీబిడ్డలకు వళ్ళంతా పురుగులు పడి చీము కారుతూ, ఎంతో దుర్వాసనగా ఉండేది. పూర్వజన్మలో వారు చేసిన పాపాలే అందుకు కారణమని, వారిని చూడటం గూడా పాపమే అని తలచి రాజు వాళ్లను భయంకరమైన ఒక అడవిలో విడిచి పెట్టించాడు. అందుకు రాజు గారి రెండవ భార్య ఎంతో సంతోషించింది. ఎన్నడూ కాలైనా క్రింద పెట్టని మహారాణీ అడవిలో ఆకలితో మాడి పోయింది. అయినప్పటికీ ఆమె ఆ బిడ్డను చంకన పెట్టుకుని క్రూర జంతువుల గర్జనల మధ్య ముళ్ళలో లేస్తూ, పడుతూ తిరుగుతుండగా ఒకచోట కొందరు పశువుల కాపరులు కనబడితే, వారిని త్రాగడానికి మంచినీళ్లు అడిగింది. అప్పుడు వాళ్లు చెరువుకు వెళ్లే దారి చూపారు. అందులో నీరు త్రాగి, అక్కడకు నీళ్లకు వచ్చిన స్త్రీలను ఆమె, "అమ్మా, ఈ రాజ్యంలో ప్రజలందరూ, సంతోషంగా ఉన్నారు, మీ రాజు ఎవరు?" అని విచారించింది. ఆ ప్రాంతపు రాజు, పద్మాకరుడనే వైశ్యుడు ఎంతో ధర్మాత్ముడు అని తెలిసి అతనిని శరణు పొందింది. ఆ రాజు ఆమె వృత్తాంతం తెలుసుకొని జాలి చెంది ఆశ్రయమిచ్చాడు. అతడు గూడా ఆమె కొడుకుకు ఎన్ని చికిత్సలు చేయించినా నిష్ఫలమై అతడు చనిపోయాడు. ఆ తల్లి గర్భశోకంతో హృదయవిదారకంగా సోకించింది. అదృష్టవశాత్తు సరిగ్గా ఆ సమయానికి ఋషభయోగి అచ్చటికి వచ్చారు ఆయన ఆ తల్లి శ్లోకం విని, " తల్లి, నీవు అనవసరంగా దుఃఖిస్తున్నావు. పుట్టినవాడుఎవడు? చనిపోయినవాడెవడు? అతడెప్పుడయినా కంటికి కనబడ్డాడా? అతడు ఈ శరీరమే అనుకుంటున్నావా? జీవుడు కర్మవశాన పంచభూతాలతో చేయబడిన దేహాన్ని పొందినా, ఆ కర్మ తీరి పోగానే ఆ దేహం చనిపోతుంది. కానీ అతడు ఆత్మస్వరూపం గనుక అతడికి నాశనం ఉండదు. ఇక శోకమెందుకు? త్రిగుణాల వలన అతడికి కర్మబంధము చుట్టుకుంటుంది. సత్వగుణం వలన దేవత్వము, రజోగుణం వలన మానవజన్మ, తమోగుణం వలన తిర్యక్ జన్మలు కలుగుతాయి. త్రిగుణాతీతస్థితి కలిగినప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది. అలా జన్మించాక, అతడు చేసిన కర్మలననుసరించి సుఖదుఃఖాలతో కూడిన జన్మ పరంపర కలుగుతుంది. అలా జన్మించిన వారందరూ ఎప్పటికైనా మరణించవలసిందే. కనుకనే వివేకవంతులు జన్మించిన వారి గురించి సంతోషం గాని, చనిపోయిన వారి గురించి దుఃఖం గాని పొందరు. అంతకంటే భగవన్నామ స్మరణతో ఇహపరాలు సాధించుకోవచ్చు గదా! అలాగాక, జీవులకు గల అనుబంధం వాస్తవమైతే వెనుకటి జన్మలో నీవు వీడికి ఏమైనావో చెప్పగలవా? ఇప్పటికైనా నా మాట విని ఊరటచెందు" అని ఆమెను ఓదార్చాడు. ఆమె, "ఓ మహాత్మా! నేనొక మహారాజుకు రాణి అయ్యాక చివరకు నాకు ఈ గతి పట్టింది. అడవుల పాలైనా, నా వాళ్లందరికీ దూరమైనా, బిడ్డను విడిచి పెట్టలేక భూమిపై జీవిస్తున్నాను. అటువంటప్పుడు వీడు చనిపోతే నేనేం కావాలి? స్వామీ! కరుణార్ద్రహృదయులు అయిన మీరు చెప్పిన తత్వం అజ్ఞాని అయిన నాకెలా తెలుస్తుంది? ఈ కష్ట సమయంలో పరమేశ్వరునివలె మీరు నాకు లభించారు. దేనివలన నా ఈ దుఃఖం నశిస్తుందో దయచేసి దానిని నాకు అనుగ్రహించండి" అని శోకిస్తూ, ఆ యోగింద్రుని పాదాలమీద పడింది. ఆ యోగి కరుణార్ద్ర హృదయులై, ఆ పిల్లవాడు పూర్వజన్మలో తమ సేవకుడని తెలుసుకొని, కొంచెం భస్మం మంత్రించి ఆ శవం మీద చల్లాడు. వెంటనే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు. అతడు ఎట్టి వ్యాధి లేకుండా స్వచ్ఛమైన శరీరంతో ఉన్నాడు. ఆ యోగి యొక్క కృపా దృష్టి వలన ఆ తల్లికి కూడా జబ్బు మాయమైంది. ఆ తల్లి సంతోషంతో నమస్కరించ గానే, ఆ యోగి ఆమెకు కొంచెం భస్మము ఇచ్చి, "అమ్మా! నీవు, నీ బిడ్డా ఇది ధరించండి. మీ శరీరాలు వజ్ర సమానమై వృద్ధాప్యం చెందవు. నీ కుమారుడు ఉత్తమ గుణవంతుడు,యశస్వీయై, భధ్రాయువు అనే పరాక్రమవంతుడైన రాజుగా దేశాన్ని పరిపాలించి కీర్తికెక్కుతాడు" అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.
కనుక ఓ రాజా! మహాత్ముల కృపాదృష్టి మాత్రం చేతనే ఎంతటి వ్యాధి అయినా నశించగలదు. నీకు వచ్చిన వ్రణం తగ్గడంలో ఆశ్చర్యం ఏమున్నది? ' అన్నాడు. అప్పుడు రాజు, 'స్వామీ! నావ్యాధిని నివారించగల సత్పురుషుని దర్శనం నాకెలా లభిస్తుందో దయచేసి తెలపండి' అని వేడుకొన్నాడు. అప్పుడా సాధుపుంగవుడు, గంధర్వపురంలోని శ్రీగురుని గురించి తెలిపారు. వెంటనే ఆ రాజు గానుగాపురానికి బయల్దేరాడు.
సరిగ్గా అదే సమయానికి శ్రీగురుడు, 'ఇక్కడికి మ్లేచ్ఛరాజు వస్తాడు. అందువలన ఇచ్చటి ఆచారవంతులైన హిందువులకు బాధ కలగవచ్చు. మా మహత్యం లోకమంతటా వెల్లడయింది. కనుక మేము ఇంక ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు. నేను ఇక్కడే ఉంటే ఇంకెందరో మ్లేచ్చులు గూడా వస్తారు. భక్తీ సదాచారము లేనివారుకూడా పేరాసతో ఇక్కడకు వస్తారు కనుక ఇంక మేము అంతర్థానమవడం మంచిది. బహుధాన్య నామ సంవత్సరంలో బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినపుడు గౌతమీనదికి పుష్కరం వస్తుంది. అప్పుడు ఆ నదిలో స్నానం చేయడానికి అని చెప్పి ఈ చోటు విడిచిపోతాము' అని నిశ్చయించుకున్నారు. ఒకరోజున ఆయన అచ్చటి భక్తులతో, 'ఇక్కడకు ఒక మ్లేచ్ఛరాజు రానున్నాడు కనుక మీరంతా మీ ఇళ్లకు వెళ్లిపోండి. మేము గౌతమీ యాత్రకు బయలుదేరుతాము ' అని చెప్పారు. భక్తులు' మహాత్మా! మీరు సాక్షాత్తూ దత్తాత్రేయులే. మీరు మా అండనుండగా ఇక్కడకు ఎవరు వచ్చినా మాకు ధర్మహాని కలుగజాలదు. కనుక మేము మీ సన్నిధి విడిచి ఎక్కడకూ పోనవసరంలేదు' అని చెప్పి ఒక్కరు కూడా కదలలేదు. కొద్ది సమయమయ్యేసరికి ఆ యవనరాజు గంధర్వపురం చేరి అచ్చటి వారిని, 'ఇక్కడి సన్యాసి ఎక్కడున్నారు? దయచేసి ఆయనను చూపండి' అని ప్రార్థించాడు. అతనిని చూసి, యవనరాజు అక్కడకు రాగలడని స్వామి చెప్పిన మాటలు స్మరించి, భక్తులు కీడు శంకించి. అతనికి ఏమీ చెప్పడం లేదు. వారి సంశయాన్ని గుర్తించిన రాజు, 'అయ్యలారా! నేను కూడా అర్థార్థినై స్వామి దర్శనానికి వచ్చిన ఆర్థుడనే. సంశయించక వారు ఎక్కడున్నారో చెప్పండి' అని వేడుకున్నాడు. అతడు పదేపదే ప్రాధేయపడినమీదట, శ్రీ గురుడు అనుష్టానానికని సంగమానికి వెళ్లారని, మధ్యాహ్నం మఠానికి తిరిగి రాగలరనీ ఆ భక్తులు చెప్పారు. రాజు వెంటనే పల్లకీ దిగి, తన పరివారమంతటినీ అక్కడే విడిచి, తానొక్కడే అతి త్వరగా సంగమానికి వెళ్లి స్వామిని దర్శించి, చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డాడు. శ్రీ గురుడు, 'ఓరి సేవకుడా! ఇన్నాళ్ళకు కనిపించావేమి? ' అన్నారు. ఆ మాట వినగానే స్వామి అతనిని చూడగానే, రాజుకు పూర్వజన్మ స్మృతి కలిగి, ఆనందభాష్పాలు కారుస్తూ నమస్కరించాడు. అతని శరీరం అంతా రోమాంచితం అయింది. అతడు ఏమేమో మాట్లాడ బోయాడు గాని, సంతోషంతో అతనికి మాట పెగల్లేదు. కొంతసేపటికి అతడు తెప్పరిల్లి, ' ప్రభూ ! మీరు మా శ్రీ పాద స్వామియే. నేను మీ సేవకుడనైన చాకలినే !స్వామీ ! ఈ దీనుణ్ణి ఇంత ఉపేక్షించారేమి? నీ పాదసేవ విడిచి ఇంతకాలం నేను దూరంగా పడి ఉండేలా చేశారే ! రాజ వైభవాల భ్రమలో చిక్కి, మిమ్మల్ని మరచి ఎంతకాలం గడిపాను! ఇన్నాళ్ళు మీదర్శనమే లభించలేదు. చివరికి మీ ఎదుటకు వచ్చాక కూడా, యిదివరకు అంతగా సేవించుకున్న మీపాదాలను గుర్తించలేకున్నాను. అజ్ఞానమనే మహాసముద్రంలో నన్నిలా పడి ఉండడనివ్వడం మీకు న్యాయమా? జరిగింది చాలు, ఇక నుండి అయినా మీ పాదాలు విడువను. నన్నుధరించండి!' అని చెప్పి ఆయనకు నమస్కరించుకున్నాడు. శ్రీ గురుడు ' అఖిలాభీష్ట సిద్ధిరస్తు!' అని ఆశీర్వదించారు. వెంటనే ఆ రాజు తనను బాధిస్తున్న వ్రణం తగ్గించమని వేడుకున్నాడు. స్వామి, ' ఏదిరా, నీ వ్రణం చూపించు!' అనగానే అతడు తన తొడవంక చూచుకొని, ఆ కురుపు మటుమాయమవడంచూచి ఆశ్చర్యచకితుడై, భక్తితో ఆయనకు నమస్కరించాడు. ఆ స్వామి గంభీరవదనులై, 'ఏమిరా, నీవు కోరుకున్న రాజ్యభోగాలు తనివితీరా అనుభవించావా, లేక ఇంకేమైనా కోరికలు మిగిలి ఉన్నాయా? బాగా ఆలోచించుకొని చెప్పు!' అన్నారు. అప్పుడారాజు, 'మీ దయ వలన సకల ఐశ్వర్యాలతో చాలాకాలం రాజ్యమేలాను. నాకు కొడుకులు, మనుమలు కూడా కలిగారు. నా మనసు పూర్తిగా తృప్తిపడింది. కానీ భక్తవత్సలా! మీరు ప్రసాదించిన సంపదలు మీరు స్వయంగా చూడాలన్న కోరిక ఒక్కటే మిగిలింది. ఆ ఒక్కటీ తీరగానే నేను సర్వమూ విడిచి మీ పాదసేవచేస్తూ ఇక్కడే పడిఉంటాను' అని వేడుకున్నాడు. స్వామి, 'ఓరీ! సన్యాసుల మైన మేము పాప భూయిష్టమైన నీ మ్లేచ్చరాజ్యంలో అడుగు పెట్టకూడదు. మీ మతస్తులు గోవులను చంపుతారు. కనుక మాకది తగదు' అన్నారు. 'స్వామీ! నేను మీ సేవకుడను, మీ రజకుడను గానా? ఈ రాజ్యమంతా మీరు ప్రసాదించినదే గదా! కర్మవశాన ఈ జాతిలో జన్మించానే గాని, నేను మీ సేవకుడనే కదా! మీరు ప్రసాదించిన రాజ్యాన్ని, కొడుకులను, మనుమలను, మీకు చూపాలని నా కోరిక. మీరు దూరంగాఉండే మీ కృపాదృష్టి వారిమీద, మా ప్రజలమీద ప్రసరింపచేయండి. మారాజ్యంలో మీ రాకకు అవరోధమైన గోవధ నిషేధిస్తాను' అనిచెప్పి శ్రీగురుణ్ణి కాళ్లావేళ్లాపడి బ్రతిమాలాడుకున్నాడు. స్వామి, 'ఆహా! మా మహాత్మ్యం వెల్లడవడం వలన నీచులు గూడా ఇంకెందరెందరో ఇక్కడకు వస్తారు. కనుక ఈస్థానం విడిచి వెళ్ళిపోవడమే కర్తవ్యం. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించగానే గోదావరినది వద్దకు చేరి, ఎవరికీ కనిపించకుండా పోవడం మంచిది. అని తలచి, మొదట రాజు ప్రార్థనను మన్నించారు.
శ్రీ గురుని అంగీకారం చెవినపడగానే ఆ యవనుడు ఉప్పొంగి, వారినొక పల్లకిలో కూర్చోబెట్టి, వారి పాదుకలు తన తలపై పెట్టుకుని కూడా నడవసాగాడు. స్వామి నవ్వుతూ అతడికేసి చూచి, 'నీవు కూడా గుర్రంమీద కూర్చుని ప్రయాణం చెయ్యి. లేకుంటే లోకనిందపాలవుతావు. రాజువైన నీవు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడవై ఇలా ప్రవర్తించడం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు, నవ్వుతారు' అన్నారు. రాజు, 'బాబూ! నేనింక ఎక్కడికి రాజును? అంతకంటే ముందు మీ పాద సేవకుడనయిన చాకలినే కదా! పరశువేది స్పర్శవలన ఇనుము బంగారం అయినట్లు, కేవలం మీ కృపాదృష్టి వల్లనే నేను పవిత్రుడనయ్యాను. మీరు సాక్షాత్తూ సర్వేశ్వరులే. మానవమాత్రుడనైన నేనే లోకానికి రాజు అయినా, నిజానికి మీసేవకుడనే. ఎవరో ఏమో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా?' అంటూ ముందుకు సాగిపోయి, తాను దూరాన విడిచి వచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు. శ్రీ గురుడు సంతోషించి, 'మనం చాలా దూరం పోవాలి. నా మాట విని, ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చేయి' అన్నారు. అతడు శ్రీగురుణ్ణి, శిష్యులనూ గూడా ఉచితమైన వాహనాలలో కూర్చుండబెట్టి, వారితో గూడా గుర్రం మీద బయలుదేరాడు. మరికొంతసేపటికి స్వామి, 'నాయనా! నీవు మ్లేచ్చుడుగా జన్మించినా, మా పట్ల ఎంతో భక్తితో మెలగుతున్నావు. సంతోషమే! కానీ సన్యాసులమైన మాకు మీతో కలసి ప్రయాణం చేస్తుంటే త్రికాలానుష్టానము సక్రమంగా చేసుకొనడం వీలుపడదు. కనుక మేము ముందుగా వెడతాము. మీరందరూ మెల్లగా వచ్చి, పాపనాశతీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి' అని చెప్పి, రెప్పపాటులో స్వామి అదృశ్యమయ్యారు. అంతలో ఆయన ఎక్కడా కనిపించక పోయేసరికి, అందరూ నివ్వెరపోయారు. ఆయన అలా అదృశ్యమై, వైడూర్యనగరానికి కొద్దిదూరంలోవున్న పాపనాశతీర్థం చేరి, అక్కడ యోగాసనంలో కూర్చుని అనుష్టానం చేసుకోసాగారు. కొందరు శిష్యులు వారితోకూడా అక్కడకు చేరి, శుశ్రూష చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఉంటున్న సాయందేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు. ఆయనను ప్రార్థించి, శిష్యసమేతంగా వారిని తన ఇంటికి తీసుకుపోయి పూజించి, అందరికీ భిక్ష ఇచ్చాడు. నాటి సాయంత్రం అతనితో స్వామి, 'నాయనా!యవన రాజును పాపనాశతీర్థానికి రమ్మని చెప్తాము. మేము అక్కడకు పోతాము. లేకుంటే మమ్ము వెతుక్కుంటూ యవనుడు యిక్కడకు వస్తాడు. అతడిక్కడకు వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది' అని చెప్పి, శిష్యులతో కలిసి ఆ తీర్థం దగ్గరకు వచ్చి, అక్కడ భద్రాసనంలో కూర్చున్నారు.
ఇంతలో అక్కడ ఆ యవనరాజు, స్వామి అదృశ్యమవగానే, 'అయ్యో! స్వామి నన్నుపేక్షించి, ఇలా నన్ను విడిచి వెళ్లిపోయారు. నేనేమి అపరాధము చేశాను? అయినప్పటికీ నన్ను తీర్థానికి రమ్మని చెప్పారు కదా! అక్కడ నా కోసం వారు వేచి ఉంటారు అని తలచి నలభై క్రోసుల దూరంలోవున్న ఆ తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు. అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు. అతడు మహావైభవంగా అలంకరించిన ఆ నగర వీధులలో స్వామిని, వారి శిష్యులనూ, ఆ వాహనాలపై తీసుకుపోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు. అతడు తన మతధర్మం విడచి ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడై మెలగడం చూచిన యవనులు అతనిని అసహ్యించుకున్నారు. నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి, సనాతన ధర్మాభిమానియైన అటువంటి రాజు లభించినందుకు పొంగిపోయారు. స్వామికి రాజు అడుగడుగుకూ హారతులు ఇప్పించడము, వింజామరలతో వీస్తుండము చూచిన పురవాసులు స్వామిని చూచి, 'ఈయనెవరో భగవదవతారమేగాని, మానవమాత్రులుగారు. లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి ఒక యవనరాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు? అయినప్పటికీ ఈ దృశ్యం కూడా కలికాల వైపరీత్యమే!' అనుకొని ఆశ్చర్యపోయారు. డక్కా, మృదంగము మొదలైన వాద్యాలఘోషతోనూ, వందల కొద్దీ ఏనుగులు, గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా, వందిమాగదులు ఎలుగెత్తి స్వామి కీర్తిని స్తుతిస్తూ వుంటే, అగర దూపాలు చిమ్ముకుంటూ, దారిపొడుగునా లెక్కకుమించిన పువ్వులతో రత్నాలుకలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు, నగర వీధులగుండా తీసుకుపోయాడు. చివరకు పల్లకిని రాజభవనం వద్ద దింపించి, అందము, స్వచ్ఛమైన క్రొత్తవస్త్రాలు పరచిన దారివెంట స్వామిని లోపలకు తీసుకొని పోయి, స్వర్ణ సింహాసనం మీద కూర్చుండ బెట్టాడు. తర్వాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారంచేసి, ఒక వింజామరతో ఆయనకు వీస్తూ ఒక పక్కన నుంచున్నాడు. అప్పుడు ఆ రాజు తన రాణులు, అంతఃపుర కాంతలు రాజకుమారులు, కుమార్తెలనూ రప్పించి వారిచేత స్వామికి పాదపూజ చేయించాడు. చివరకు అతడు, 'స్వామీ! నేను జన్మతః హీనుడనైనా తమ కృపవలన ఈనాటికి కృతార్థుడనయ్యాను. నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి' అని చెప్పి నమస్కరించాడు. అతడు చేసిన సపర్యలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దీవించి, 'ఓరీ, నికింకేమైనా కోరవలసినది ఉంటే నిస్సంకోచంగా చెప్పుకో!' అన్నారు. ఆ రాజు, తనకింక నిరంతర గురుపాద సేవ తప్ప వేరేమీ అక్కర్లేదని నిశ్చయంగా చెప్పాడు. స్వామి సంతోషించి, అలా అయితే ఈ రాజ్యభారము నీ కొడుకులకు అప్పగించి, శ్రీశైలం వెళ్ళు. మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడకు వస్తాము. నీకక్కడ మరలా మా దర్శనమవుతుంది' అని ఆదేశించారు. ఆయనతో ఎడబాటు సహించలేని రాజు, 'స్వామీ! అలా అయితే నాకు నిరంతర గురుస్మరణ ప్రసాదించండి' అని వేడుకున్నాడు. శ్రీ గురుడు అతనిని ఆశీర్వదించి, తన శిష్యులతో కలసి గోదావరి యాత్ర చేయడానికి వెళ్లారు. చివరకు వారందరూ ఆ నదిలో స్నానంచేసి భీమ - అమరజా సంగమం చేరుకున్నారు.
గంధర్వపురం వాసులందరూ పూజాద్రవ్యాలు తీసుకొని ఎదురేగి, 'స్వామీ ! మీరు యిక్కడ నుండి వెళ్ళినప్పటి నుండి ఈ ఊరు అంతా అచేతనమయిపోయింది. తిరిగి మీరాక వలన మరల ప్రాణం వచ్చినట్లయింది' అని ఆయనను స్తుతించి పూజించారు. అప్పుడు స్వామి, 'బిడ్డలారా! మేమెక్కడికో వెళ్ళిపోయామని ఎన్నడూ అనుకోవద్దు. ఈ పురం మాకు ఎంతో ప్రియమైనది. ఇక్కడ మమ్మల్ని నిశ్చలభక్తితో కొలిచేవారికి ఎప్పుడూ ప్రత్యక్షమౌతుంటాము. ముందుముందు దేశమంతా కలియుగ దోషాలన్నింటికీ నిలయం కానున్నది. కనుక మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము. అయినప్పటికీ భక్తులను రక్షించటం కోసం వాస్తవంగా గుప్తరూపంలో ఇక్కడే వుంటాము. అలా గుప్తంగా ఉండటానికి కారణం, రానున్నది కష్టకాలం. ధర్మం రోజు రోజుకూ క్షీణించిపోతుంది. దుర్మార్గులు ప్రబలి ఎన్నో దుష్కృత్యాలు చేయబోతారు. పూర్వజన్మ సంస్కారం వలన యోగ్యుడైన ఆ మ్లేచ్చ రాజు మా అనుగ్రహానికి పాత్రులైనారని విని ఎందరెందరో హీనులు కూడా ఇక్కడకు వస్తారు. మా ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగడం వలన అందరికీ ఎంతో కీడు జరుగుతుంది. కనుక మా రూపాన్ని గుప్తం చేయడం ఒక్కటే కర్తవ్యం' అన్నారు. అది విని పురవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చే ష్టులై బొమ్మల లాగా నిలుచున్నారు.
ఆనాటి వరకూ మానవాకారంతో కనిపిస్తున్న త్రిమూర్త్యవతారం అటు తర్వాత తమ స్థూలరూపాన్ని గుప్తపరచినప్పటికీ యీ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు సుమా! అందుకు నేనే సాక్షిని. నేటికీ ఈ గంధర్వనగరంలో ఆయనను విశ్వాసంతో భజించిన వారి కోరికలు తీరుతాయి. ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించని ఈ దత్తమూర్తి, ఇప్పుడు భక్తుల పాలిటి కల్పవృక్షమై ఇక్కడనిల్చారు. భక్తి - ముక్తులను ప్రసాదించడానికి ఈ భూమి మీద ఇంతకు మించినదేమున్నది? "
యాభైవ అధ్యాయం సమాప్తం
శ్రీ దత్తాయ గురవేనమః
శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః - శ్రీ నృసింహ సరస్వత్యైనమః
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box