అధ్యాయము -12
శ్రీ గణేశాయనమః శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః
కథారంభము
సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు :" అప్పుడా తల్లి పుత్ర వాత్సల్యంతో ఇలా అన్నది : 'నాయనా, నీవు లోకానికి ధర్మం చెబుతావు గదా? మరి నీవు కూడా 12 సంవత్సరములు బ్రహ్మచర్యమవలంభించాక గృహస్థుడవై, బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి గదా! ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయమవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి గదా!' అని బ్రతిమాలింది. అప్పుడు వటువైన నరహరి, అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా, ఆమెకు తత్వం ఇలా బోధించాడు :
' అమ్మా! భౌతికమైన శరీరాలు, వైభవము అశాశ్వతాలే. మరణంలేని వాడంటూ ఎవ్వడూ లేడు. మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంటనంటే వుంటుంది. యువకులకైనా, వృద్ధులకైనా ఈ శరీరమెప్పుడు రాలిపోతుందో తెలియదు. అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు, మృత్యుదేవత గూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెడుతూంటుంది. రాత్రి, పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరకొట్టుకుని పోతుంటాయి. ఈ శరీరము, భార్యా బిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరచి, అవే ప్రధాన మనుకుని జీవించేవారు పశువులవంటివారు. కనుక ధర్మాచరణ మొక్కటేమానవుల కర్తవ్యం. అలాగాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు. కాని మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపలవంటి వారు. ఆ కొంచెము నీరు యింకిపోయాక వాటి గతేమిటి?
ఈ కలియుగంలో మానవునికి నూరేండ్లు ఆయుర్దాయం. అందులో సగకాలం నిద్రలోనూ, బాల్యము, పరాధీనతల వల్ల కొంతకాలమూ గడిచిపోతుంది. ఇట్టి జీవితంలో ప్రార్థించే సంపద క్షణకాలముండి వాడిపోయేది. కాలచక్రం గర్భంలోని పిండములను, శిశువులను, బాలురను, యువకులను, విజ్ఞులను, దేవతలను, సర్వజీవులను మ్రింగివేస్తుంది. దేనిమీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే, దుఃఖాన్ని కొని తెచ్చుకొనడమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తమూ గల ఈ శరీరము నీటి బుడగ వంటిది. శరీరము జడము, నశ్వరమూ. ఆత్మ చిత్స్వరూపము, శాశ్వతము. దానికి సుఖదుఃఖాలు లేవు. ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే. సద్గురు కటాక్షం వలన మానవుడీ మాయను దాటాలి. ఉత్తమమైన మానవజన్మమెత్తి గూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకోనివాడే నిజమైన ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు గూడా. అమ్మా ! ఈమాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే, కారణజన్ముడనైన నాకేది కర్తవ్యం?
విషయసుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడమనే క్రమం తగియున్నది. నాకట్టి విషయావాసనలే లేవు గనుక ధీమంతుడనైన నాకు యెట్టి విఘ్నాలూ రాజాలవు. నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను. నన్ను ధ్యానిస్తూండు. సంసారాన్ని దాటగలవు!' అని, యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు, తన దివ్య రూపాన్ని దర్శింపజేశాడు. ఆయన ప్రసాదించిన యోగదృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి యిలా అన్నది. : 'స్వామీ ! నీవు పుట్టుకలేనివాడవు. బ్రహ్మాండాలన్నీ నీలోనే వున్నాయి. బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచమైనా తెలియరానివి. మాయామోహితురాలనైన మానవస్త్రీని, నాకెలా తెలుస్తాయి? ఈ జ్ఞానమైనా నీవనుగ్రహించినదే! నీవు సత్యసంకల్పుడవు. నీ సంకల్పానికి నేనడ్డుచెప్పను. లోకహితం చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడవని తలచి యింట కట్టి పెట్టుకొనడం తగదు. అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనస్సులో స్థిరంగా నిలచేటట్లు అనుగ్రహించు. నాకింకా పుత్రులు కలుగుతారన్నావు. మాకు ఇంకొక బిడ్డ పుట్టేవరకైనా నీవిక్కడేవుండు. అప్పటివరకూ సన్యసించడానికి నేననుమతించను. నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను.నిన్ను విడిచి నేను బ్రతకలేను, అని ప్రార్థించింది. అప్పుడు శ్రీహరి, 'అమ్మా ! నీకు ఒక సంవత్సరంలోగా కవలలు పుడతారు. అంతవరకూ వుంటాను గానీ, ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు' అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు.
అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని, ఆ దంపతులు నిత్యమూ అర్చిస్తుండేవారు. చతుర్వేద పారంగతులు, షట్చస్త్రనిపుణులూ గూడ ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు. ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు. పామరులకు ఆయన ధర్మసూక్ష్మాలు చెప్పేవారు. ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు యిద్దరు మగపిల్లలు పుట్టారు. వారికి మూడు నెలలు రాగానే ఒక రోజు అంబ పిల్లలనాడిస్తుంటే నరహరి వచ్చి, 'అమ్మా ! నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు. నీకింకా ఇద్దరు కొడుకులు, ఒక కూతురు కలుగుతారు. నీ కోరిక ఫలించింది. నా మాట నిలబెట్టుకున్నాను. కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయల్దేరుతాను. అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి' అన్నారు. అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి, ' మేమింతవరకు మాయలో తగుల్కొని, నీవు మా బిడ్డవనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్టురాలాడి వుంటే మమ్మల్ని క్షమించు! నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము. నీవు మా వంశాన్నుద్ధరించడానికి యిక్కడ జన్మించావు. నీవు మా రక్తమాంసాలు పంచుకొనడం ద్వారా మా దేహాలు గూడా పవిత్రమైనాయి. ఇక ముందు మా గతేమిటి? ' అన్నారు. మీ దర్శనం మాకింకెప్పటికీ లేకుంటే మేమెలా జీవించగలము? అన్నారు. అప్పుడు నరహరి, మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి. మీకిక జన్మవుండదు. అమ్మా! నీకు నన్ను చూడాలనివుంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనమవుతుంది. 30 సంవత్సరముల తరువాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను" అని చెప్పాడు.
అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన, తలపై శిరస్త్రాణము, కౌపీనము, కాషాయాంబరము, చేత దండమూ ధరించి చిరునవ్వులొలికిస్తూ మహా సంతోషంగా బయల్దేరాడు. ఆ దృశ్యం చూసిన జనం, 'తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు యిల్లు విడిచిపోవడానికి ఆ తల్లి యెలా అనుమతిస్తున్నది?' అని ఆశ్చర్యపోయారు. కొందరు, 'ఈయన అవతారమూర్తి. ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు' అన్నారు. సాధువులు, ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు. ఆ గ్రామస్తులందరూ కొంతదూరం వెళ్లి, ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక, తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్లారు. అక్కడ నరహరి వారికి కర్పూరము వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము, తర్వాత శ్రీపాదరూపములను దర్శనమిచ్చారు. అది తమ శనిప్రదోష పూజాఫలితమేనని తలచి, ఆ తల్లిదండ్రులు, 'మా జన్మలు ధన్యమయ్యాయి. మీరు దయతో మాకు మళ్లీ దర్శనమివ్వాలి అని వేడుకోగా, ఆయన 'తప్పక మళ్లీ దర్శనమిస్తాను' అని మాట ఇచ్చి వాళ్లను వెనుకకు పంపాడు. ఆ దివ్యదర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరచి, భక్తి భావంతో వెనుకకు వెళ్ళారు.
నరహరి, బదరీనాథ్ దిక్కుగా బయల్దేరి దారిలో 'ఆనంద కాననము' అనబడే వారణాసి పట్టణం చేరారు. మొదట ఆయన గంగలో స్నానం చేసి, ఆత్మ స్వరూపమైన విశ్వనాధుని దర్శించారు. తర్వాత అచట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని, ప్రాణవాయువు కుంభించి, ఖేచరీ ముద్రలో నాదాను సంధానపరులై కూర్చున్నారు. ఆయన నిత్యమూ మూడు వేళలా మణికర్ణికా ఘట్టానికి వెళ్లి శ్రద్ధగా గంగాస్నానం చేసి వస్తుండేవారు. ఆ క్షేత్రంలో వున్న తపస్వులు, మునులు, సాధువులు ఆయనను చూచి ఆశ్చర్యచకితులయ్యారు. యవ్వనం గూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము, కఠోరమైన తపస్సు చూచి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తూండేవారు. అచ్చటి యతులలో వృద్ధుడు, శ్రేష్టుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూండేవారు. ఆయన సాక్షాత్తూ అవతార పురుషుడని, సన్యాసమార్గాన్ని పునరుద్ధరిస్తాడని, ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడని, కనుక ఆయన వయస్సులో చిన్నవారయినా, జ్ఞానంలో వృద్ధులే గనుక ఆయనకు యతులు గూడ నమస్కరించవచ్చుననీ కృష్ణ సరస్వతి చెబుతుండేవారు. చివరకు ఆ కృష్ణసరస్వతీ స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, 'స్వామి, మీరు పరమేశ్వరులే గాని, మానవమాత్రులు గారు. సజ్జనులను, ధర్మాన్నీ ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు. శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది. దానిని మరల మీరే నిర్దిష్టం చేసి, విస్తరింపజేయాలి. అధికారులు కాని వారికి ఈ మార్గము భయంకరమైనదైనా, బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందమిచ్చే ఈ సన్యాసమార్గాన్ని మీరే పునరుద్ధరించాలి. సన్యాసులమైన మేము యిప్పుడు మిమ్మలను సేవిస్తే లోకనింద యేర్పడుతుంది. కనుక మీరు గూడా సన్యసిస్తే మేము గూడా మీ సేవ చేసుకోవచ్చు' అని ప్రార్థించాడు.
నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సాంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీ కృష్ణ సరస్వతీ పాదులను గురువుగా స్వీకరించి, శాస్త్ర పద్ధతిన వారివద్ద సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువిచ్చిన దీక్షానామం 'శ్రీ నృసింహ సరస్వతి'. తర్వాత ఆయన కొంతకాలం కాశీ పట్టణంలోనే వుండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్ధాన్ని భక్తులకు ప్రవచించారు".
అంతవరకూ గురుకథను శ్రద్దగా వింటున్ననామధారకుడు, "స్వామీ, నాకొక సందేహం కలుగుతున్నది. విశ్వగురుడైన శ్రీ గురునికి ఇంకొకరు గురువెలా కాగలరు? గురువునాశ్రయించి ఆయన సాధించవలసిన దేమున్నది?" అని అడిగాడు. సిద్ధయోగి యిలా చెప్పారు:" పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ట మహర్షిని, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షినీ గురువులుగా వివరించినట్లే, శ్రీ గురుడు గూడా శ్రీ కృష్ణ సరస్వతీ స్వామిని గురువుగా ఎన్నుకున్నారు. ఈ గురుసాంప్రదాయం అనాది సిద్ధమైనది. దీనికి మూల పురుషుడు సదాశివుడు. ఆయన శిష్యుడు విష్ణువు. విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు. అటు తర్వాత గురుపరంపర యిలా కొనసాగింది. బ్రహ్మ దేవుడి నుండి వశిష్టుడు -శక్తి- పరాశరుడు- వ్యాసుడు- శుకుడు- గౌడపాదుడు- గోవింద భగవత్పాదాచార్యులు- శంకర భగవత్పాదులు- విశ్వరూపుడు- బోధజ్ఞానగిరి -సింహగిరి ఈశ్వరతీర్థుడు - నృసింహతీర్థుడు -విద్యారణ్యుడు- మలయానందుడు- దేవతీర్థుడు యాదవేంద్ర సరస్వతి -కృష్ణ సరస్వతి. ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీ గురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి యొక్క గురువు.
తర్వాత శ్రీ గురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ, అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు. తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ, సర్వ క్షేత్రాలూ దర్శిస్తూ, పుణ్య తీర్ధాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలసి గంగాసాగర సంగమం చేరారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకూ తటాకయాత్ర చేసారు. అదిగూడా గంగా ప్రదక్షిణంతో సమానమే. అందుకే ప్రయోగను గూడా గంగాసాగరమంటారు ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీ గురుడే స్వయంగా తత్వముపదేశించి సన్యాసమిచ్చారు".
పన్నెండవ అధ్యాయం సమాప్తము
శ్రీ దత్తాయ గురవేనమః
శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః - శ్రీ నృసింహ సరస్వత్యైనమః
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box