Friday, May 15, 2020

గురు చరిత్ర అధ్యాయము -26


అధ్యాయము  -26




                                

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 

              నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో, "స్వామీ ! శ్రీ గురుడు విద్యా వంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు?" అని అడిగాడు. అందుకు సిద్ధముని ఇలా చెప్పారు:            

                        "శ్రీ గురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూడులకిలా  బోధించారు: 'నాయనలారా! మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేదవిదులమనుకోవడం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్ధమే గాని -- ధనము, కీర్తి,  అహంకారము గావు. సమదర్శనమే పండిత లక్షణం. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్నవారెవరూలేరు. వేదము ఆద్యంతరహితము, అపారము. దానిని పూర్తిగా తెలుసుకొనడం  బ్రహ్మదేవునికే  సాధ్యపడలేదు.  


               పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి,  బ్రహ్మచర్యమవలంభించి,  బ్రహ్మదేవుని వరంతో మూడుసార్లు దీర్ఘాయువు పొందాడు. నాలుగు యుగాలూ ఐదు వేల సార్లు పునరావృతమైతే బ్రహ్మకు ఒక పగలు. అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువువద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే, బ్రహ్మసాక్షాత్కరించి, 'వేదం పూర్తిగా నాకే తెలియదు. వేదరాశిని చూపుతాను, చూడు!' అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు.భరద్వాజుడది చూచిభయపడి, 'అయ్యో!  నేనింతకాలం పఠించిన వేదమంతా కలసి యిందులో ఒక్క పిడికిడైనా లేదే! వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమౌతుందా?' అని తలచి, "నాకవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి" అన్నాడు. అప్పుడు బ్రహ్మ, అనంతమైన ఆ వేదరాశినుండి మూడు పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి, "ఇదంతా అధ్యయనం చేసేంతవరకూ నీవు జీవింతువు గాక!" అని వరమిచ్చాడు. కాని ఆ మూడు పిడికెళ్ళ వేదమూ అధ్యయనం చేయడమే అతనికి యింతవరకూ పూర్తిగాలేదు. కనుక సాక్షాత్తూ నారాయణుడే బాదరాయణుగా అవతరించి, వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి, వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒకొక్కవేదం చొప్పున తెలిపాడు.వారు కల్పాంతం వరకూ అభ్యసించిగుడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు నాలుగు వేదాలనూ సంపూర్ణంగా అధ్యయనం చేసామనుకోవడం ఎంత తెలివి తక్కువ!


            వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికీ సాథ్యంగాదు గనుకనే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించాడు.ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి, దానిని ధ్యానించడానికై దానిని గురించి యిలా  చెప్పాడు: ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదము. ఆత్రేయస గోత్రం. గాయత్రి ఛందము. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ. ఎర్రని వర్ణము, తామరరేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గిరజాలజుట్టు, వంకమీసమూ కలిగి, అమ్మ రెండుమూరల పొడవైన దేహం గలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయపారము, క్రమపారము, జట, రధక్రమము, దండక్రమము అనే భాగాలున్నాయి. ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి. ఈవేదానికి అశ్వలాయని, సాంఖ్యాయని, శాకల, భాష్కలా, మాండుకేయులనే ఐదు శాఖలున్నాయి". వాటిని  ఆనాడు వ్యాసుడు పైలునికి  చెప్పాడుగాని, ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివినవారెవరు?   


                తర్వాత వ్యాసమహర్షి తన రెండవ శిష్యుడైన వైశంపాయునికి యజుర్వేదం చెప్పి,  దాని లక్షణాలు ఇలా చెప్పారు: "యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము. భారద్వాజసగోత్రము, త్రిష్టుప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలం  ధరించి సుమారు అయిదు మూరలు పొడవున్న తామ్రవర్ణ  శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖలలో ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి. యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము. ప్రతిపదము,  అనుపదము, ఛందస్సు,  భాష,  ధర్మము,  మీమాంస,  న్యాయము, తర్కము అనే ఎనిమిది దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము,  వ్యాకరణము,  నిరుక్తము, ఛందస్సు,  జ్యోతిషము అనే ఆరు అంగాలు దీనికున్నాయి" ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశం పాయనునికి వివరించి చెప్పి, వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జైమిని కి సామవేదాన్ని ఇలా వివరించాడు:   


                               " దీనికి ఉపవేదము గంధర్వము. విష్ణువు అధిదేవత, జగతీచ్చందస్సు. కాశ్యపసగోత్రము. దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రము,  చర్మము, దండము ధరించి ఆరుమూరలు పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీరఛాయ తెలుపు; శమము,  దమము మొదలైన దైవీసంపదగలవాడు. సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి.ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు".            



                    వ్యాసమహర్షి సుమంతుడు అనే శిష్యునికి అధర్వణవేదం చెప్పి,  "దీనికి అస్త్రరూపం ఉపవేదము.గోత్రము బైజానకము.  ఇంద్రుడు అధిదేవత.త్రిష్టుప్ఛందస్సు. అధర్వణ వేదపురుషుడు తీక్షణమైనా ఆకారము, నల్లని వర్ణమూగల కామరూపుడు. ఏకపత్నీవ్రతుడు.ఏడుమూరల పొడవు.ఈ వేదానికి తొమ్మిది శాఖలు, అయిదు కల్పాలు ఉన్నాయి. 


            పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా  నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమాచారనిరతులేందరో భరత భూమిలో ఉండేవారు. కనుకనే వేదాలన్నీ  నిలువగలిగాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మబ్రష్టులవుతున్నారు గనుక,  ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది. పూర్వపు బ్రాహ్మణులలో దైవత్వము,  మహత్తు ఉండేవి. అందుకే వారిని భూసురులు  అనేవారు. రాజు కూడా వారిని సేవించేవాడు.వారు ఎంత ధనమిస్తానన్నా లెక్కజేయక,  భోగాలపట్ల  నిర్లిప్తులుగా ఉండేవారు. వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులై ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తుండేవారు. మాటమాత్రం చేత గడ్డిపరకను మేరుపర్వతంగాను,  మేరుపర్వతాన్ని గడ్డిపరకగానూ మార్చి వేయగలిగి ఉండేవారు. జగత్తంతా దేవతలకు ఆధీనము: దేవతలందరూ మంత్రాధీనులు; మంత్రాలన్నీ బ్రాహ్మణుల అధీనంలో ఉండేవి. వారిని విష్ణువు కూడా పూజించేవాడు. కాని ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో లొంగి, మ్లేచ్చుల  ఎదుట కూడా వేదం  చదువుతున్నారు. అట్టివారి ముఖమైన చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేద వేత్తలమని విర్రవీగుతూ,  ద్విజులందరినీ ఈ  విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి? మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించినదెవరు?  మిమ్మల్ని మీరు పొగుడుకొని,   జయపత్రాలు పోగుచేసుకొనడమే గాక,  త్రివిక్రముని గూడ జయపత్రికను ఇవ్వమంటున్నారే! ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొనితెచ్చుకోవద్దు.  ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి' అన్నారు. కాని  ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయ పత్రికనైనా యివ్వమనీ  కోరారు".

ఇరవై ఆరవ అధ్యాయము సమాప్తము

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

 

Tuesday, May 12, 2020

గురు చరిత్ర అధ్యాయము -25


అధ్యాయము  -25

                              

శ్రీ గణేశాయనమః    
శ్రీ సరస్వత్యేనమః                                                                            శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 



    అటుపైన శ్రీ గురుడు చేసిన దివ్య లీలలను  వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధమని ఇలా చెప్పారు: ' ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు. అతడు హిందూమత ద్వేషి, ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలోగల వేద వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని, తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు. అందుక అంగీకరించని వారికి ధనాశ చూపుతుండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచారపరులు అలా చేయడం తమవల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలను  ఆశించి,  వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతుండేవారు. యజ్ఞకాండలోని అంశాలు వారినుండి విని,  ఆ దుష్టుడు,  యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు, ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికి వచ్చినంత సంభావనలు యిస్తుండేవాడు. ఆ సంగతి విని,  ధనాశపరులు ఎందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే  వచ్చి వేదార్థం చెప్పసాగారు.


               ఒకనాడు ఉత్తరాది నుండి వేదపండితులైన బ్రాహ్మణులు ఇద్దరు  వచ్చి ఆ రాజును దర్శించి,  'రాజా! సకల విద్యలలోనూ మాకు సాటిఅయినవారు ఎక్కడా లేరు. మేము దేశంలోని పండితులను శాస్త్ర వాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి. మా ప్రతిభ నిరూపించగలము'అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి,  ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి,  నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి, ఆ పండితులను వాదనలో ఓడించినవారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని, ఓడిన వారిని దండించగలననీ ప్రకటించాడు. అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టులఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు,  తమకంతటి సామర్ధ్యం లేదని చెప్పి తప్పుకున్నారు. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలిచ్చివేయక తప్పలేదు. అప్పుడా రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు,ఆభరణాలు,భారీఎత్తున కానుకలూ బహుమానమిచ్చి ఏనుగునెక్కించి,  మేళతాళాలతో ఊరేగించాడు. వారికొక అగ్రహారంగూడా ఇచ్చాడు. వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది.  


                                 అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి,  ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో,  'అయ్యా! మా పాండిత్యము,  మా ప్రతిభా ఇక్కడంతా తెలిసి పోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాని వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనం ఏమిటి? కనుక మీరు సెలవిస్తే మేమీ రాజ్యమంతటా సంచారం చేసి,  పండితులందరితో వాదించ దలచాము. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకు రాగలము' అని చెప్పారు. రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగుల నెక్కి దక్షిణదిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయజయధ్వానాలతో, పర్యటిస్తూ, ఒకరోజు కుమసీ గ్రామానికి వచ్చారు. అచట త్రివిక్రమభారతి వేదవేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి, ' ఏమయ్యా! నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు. లేకుంటే, ఓటమి అంగీకరిస్తూ మాకు జయ పాఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైన ఇవ్వు!' అన్నారు.                                             

                     అందుకు త్రివిక్రమ భారతి,  'అయ్యా!నాకు వేదం రాదు. వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజ సన్మానాలు అందుకుంటూ భోగాలు  అనుభవించేవాడినేగదా?  నేను ఈ అరణ్యంలో ముక్కుమూసుకుని కాలక్షేపం చేస్తున్న భిక్షువును. నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాతో వాదించడం,  కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది' అని చెప్పాడు. ఆ పండితులు,  అయ్యా! మాతో వాదించగల వారు మాకు ఎక్కడా కనిపించలేదు. కనుకనే మాకు లెక్కలేనన్ని జయ పత్రాలు లభించాయి. అలాగే నీవు కూడా ఒకటి రాసివ్వు, లేదా మాతో వాదించి' అని పట్టుబట్టారు. అప్పుడా సన్యాసి, 'వీరికి గర్వం తలకెక్కింది. ఒళ్ళు పై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు. వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను' అని ఆలోచించుకుని వాళ్లతో ఇలా అన్నాడు: 'పండితొత్తములారా! నేను స్వతంత్రుడను గాను; గంధర్వపురంలో మా గురుదేవులు ఉన్నారు. వారి ఆజ్ఞ తీసుకుని మీరు కోరినట్లే ఆ రెంటిలో ఏదో ఒకటి చేయగలను. మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి'.                     


        అందుకా మదాంధులంగీకరించి గంధర్వపురానికి బయల్దేరారు. త్రివిక్రమభారతి, వినయంతో కాలినడకన వెళుతుంటే, ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చుని వెళ్తున్నారు. సాధుసత్పురుషుల వద్దకు వెళ్లడం వలన ఆయుః  క్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు. గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమభారతి శ్రీగురునికి నమస్కరించి, ఆనందభాష్పాలు కారుస్తూ, గద్గదస్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించి, 'పరాత్పరా! గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లే, అజ్ఞానాంథులు మిమ్మెరుగలేరు మీ చేత వారికి హితం చెప్పించడానికై  వారినిక్కడకు  తీసుకువచ్చాను.
ఈ మదాంధుల బారి నుండి నన్ను,  వేదధర్మాన్ని కాపాడండి!! మీ ఆజ్ఞ కోసం వచ్చాను. మీరు ఏది చేయమంటే అది చేస్తాను' అని ప్రార్థించాడు. వాళ్ళు, 'మా కాలం వ్యర్థం అయింది. ఇతడు జయపత్రం ఇవ్వడు, వాదభిక్ష ఇవ్వడు. మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు కనుక,  మీ గురుశిష్యులలో ఎవరైనా ఆ రెండింటిలో ఏదో ఒకటి చేసి తీరాలి' అన్నారు. శ్రీ గురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు: ' అయ్యా! మీ వంటి వేదవిధులకు, వాదించడం వలన కలిగే ప్రయోజనమేమున్నది? వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభం ఏమిటి? యతులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము, ఓడినందువలన చిన్నతనమూ  ఏమీ  కలుగవు. అటువంటి మావలన మీకేమీ ప్రయోజనము?  అన్నారు. అందుకు వారిద్దరూ, 'అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రమివ్వక, మమ్మల్ని ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చాడు? కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే,  మాతో వాదానికి రండి; లేకుంటే జయ పత్రమైనా  ఇవ్వండి' అని పట్టుబట్టారు.       


                                     అప్పుడు శ్రీ గురుడు నవ్వి, 'అయ్యా! వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యంకాలేదు. వేదాలు అపారమైనవి. అటువంటప్పుడు వేదవిదులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది. ఈ జయపత్రికల వల్ల ప్రయోజనమేమున్నది ? మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి' అన్నారు. అప్పుడు వాళ్లు రోషంతో, 'అయ్యా! మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము. మమ్మల్ని  మించిన వారు ఎవరూ లేరు' అన్నారు". 


ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తము.

శ్రీ దత్తాయ గురవేనమః 
శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


Sunday, May 10, 2020

గురు చరిత్ర అధ్యాయము -24


అధ్యాయము  -24




                                
శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 

కథారంభము 


                                         సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు : "త్రివిక్రమభారతి శ్రీ గురుని నిందిస్తున్నాడని విని, రాజు ఒక రోజు స్వామితో, 'స్వామి! అతడు మిమ్మల్ని నిందిస్తూ ఉంటే మీరు ఊరుకుంటారేమిటి? అతని అజ్ఞానాన్ని తొలగించరాదా? ' అని వేడుకున్నాడు. శ్రీ గురుడు అంగీకరించి బయల్దేరారు. రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి, పల్లకిలో కూర్చోబెట్టి,  రాజలాంఛనాలతో కుమసీ  గ్రామానికి తీసుకు వెళ్ళాడు.            

                                         ఆ ఊరేగింపు మహా వైభవంగా కుమసీ గ్రామం సమీపించే సమయానికి, త్రివిక్రమభారతి పూజ చేసుకుంటున్నాడు. ప్రతిరోజూ నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు. త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు. కానీ ఆరోజు అతడు ఎంత ప్రయత్నించినా ఇష్ట దేవతామూర్తి దర్శనమీయలేదు. త్రివిక్రముడు ' స్వామీ! నరసింహా! ఈరోజు మీరు నన్ను ఎందుకు కరుణించలేదు?  ఎంతోకాలంగా చేస్తున్న నా తపస్సంతా యీరోజు భంగమైంది.  ఇక నేనేమి చేయగలను? 'అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు. వెంటనే అతని మనస్సులో,  సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై, 'ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను. అక్కడికి వచ్చి దర్శించుకో!' అని దివ్యవాణి వినిపించింది. త్రివిక్రమభారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు.కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి, శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేసాడు. మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు, పరివారము, గూడ యతులలాగ  కనిపించారు. త్రివిక్రమభారతి నివ్వెరబోయి అంత మంది సన్యాసులతో శ్రీగురుని గుర్తించలేక 'స్వామీ! త్రిమూర్తిస్వరూపా! వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను. నాపై కృపతో మీ నిజస్వరూపం దర్శింపజేయండి. ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనమనుగ్రహించారు. యీ రోజు నా తపస్సు ఫలించింది. అందువలననే మీదర్శనం లభించింది' అన్నాడు.  శ్రీగురుడు సంతోషించి తమ నిజస్వరూపంతో కనిపించించారు. అంతకు ముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై,  వాటి  స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు, పరివారము కనిపించారు. స్వయంగా రాజుచేత వింజామరలతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులార చూచాడు. అప్పుడు శ్రీగురుడు, 'త్రివిక్రమా! ఎవరిని దాంభికుడనీ, భ్రష్టుడనీ నిందించావో, ఆ సన్యాసియే మేము. మేమిపుడే నిన్ను పరీక్షించాము. నృసింహభక్తుడవైన నీవు మమ్ములను ఏ కారణంగా విమర్శించావు? దంభిలక్షణాలేమిటో  తెలుసుకోవాలని వచ్చాను. నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయమేమిటో వివరించు!' అన్నారు.           


                   శ్రీ గురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే గాక, ఆయన ప్రసాదించిన దివ్యదర్శనంతో పరవశించిన  త్రివిక్రమభారతి శ్రీగురునికి నమస్కరించి, ' సద్గురూత్తమా! మీరు మానవరూపంలో అవతరించడం వలన నేను తెలియక మూడునివలె ప్రవర్తించాను. నన్ను క్షమించండి. విదురుని వద్దకు, ద్రౌపది వద్దకూ అనుగ్రహించ వచ్చిన శ్రీకృష్ణునివలె, నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు. మీరు సాక్షాత్తూ త్రిమూర్తి స్వరూపమైన పరమేశ్వరులే. పగటి వెలుగును చూడలేని గుడ్లగూబ వలె, అజ్ఞానినయిన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి, మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపజేసి, ఆత్మయనే ఒడ్డు చేర్చండి. భారతంలో అర్జునునికి శ్రీ కృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను. గాని, ఇప్పుడు మీ  అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను. బేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణివలె మీరు నాకు ఈనాడు లభించారు. మీరే నా ఉపాస్యదైవమైన నృసింహస్వరూపులు. శరణు శరణు!' అని స్తుతించాడు. శ్రీగురుడతనిని అనుగ్రహించి 'త్రివిక్రమా!  నీ భక్తికి సంతోషించాము. నీవు నృసింహస్వామికి చేసే అనుష్టానం మాకే చెందుతుంది. అదే చేస్తూండు. నీకు పునర్జన్మలేదు. నీకు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవగలవు!' అని ఆశీర్వదించి, త్రివిక్రమభారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు. తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ, పరివారంతోనూ, 'మాకు అనుష్టాన సమయం అయింది. మేము ముందుగా వెళ్తాము. మీరు వెనుక రండి!' అని చెప్పి, మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు. తర్వాత శ్రీ గురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు.      


                      కనుక నామధారకా ! శ్రీ గురుడు భగవంతుడుకాడని, మానవమాత్రుడేనని తలచేవాడు ఏడు జన్మలు నరకమనుభవిస్తాడు. గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి. నా మాటపై విశ్వాసముంచి లోకులు శ్రీగురుపాదాలను ఆశ్రయింతురు గాక! అందరికీ అందుబాటులో ఈ గురుకథ అనబడు చలివేంద్రమును స్థాపించాము. దీనినుండి ప్రజలు గురుకథామృతమును  సేవింతురు  గాక!" అన్నారు సిద్ధయోగి.

ఇరవైనాలుగవ అధ్యాయము సమాప్తము
 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Saturday, May 9, 2020

గురు చరిత్ర అధ్యాయము -23

అధ్యాయం-23         



శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 

కథారంభము 



                                సిద్ధముని యింకా యిలా చెప్పారు: "నామధారకా! శ్రీ గురుడు గొడ్డు బఱ్ఱె నుండి పాలుపితికించడంతో అంతవరకూ  గుప్తంగా వున్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మర్నాడు కొందరు గ్రామస్థులు మట్టి తోలుకోడానికి బఱ్ఱెను బాడుగకు యిమ్మని అడగటానికి వచ్చారు. అప్పుడా బ్రాహ్మణుడు, 'అయ్యా! మా గేదె పాలిస్తున్నది. కనుక యికనుండి దానిని మట్టి తోలడానికి పంపలేము' అని చెప్పి, నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు. ఆ గ్రామస్థులు, 'అరెరే! యింతవరకూ ఒక్కసారైనా కట్టని యీ ముసలిబఱ్ఱె పాలు ఎలా యిచ్చింది? అని ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరమేలే రాజుకు చేరింది.అతడాశ్చర్యపడి, కుతూహులంతో బ్రాహ్మణుని యింటికి వచ్చి చూచి, అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు. వెంటనే అతడు సకుటుంబంగా, పరివారంతో గూడ సంగమానికి వెళ్లి శ్రీ గురునికి పొర్లుదండాలు పెట్టి, సాష్టాంగ నమస్కారం చేసి యిలా స్తుతించాడు: జగద్గురూ! మీకు జయము. మాయామోహితుడైన నాకు త్రిమూర్తిస్వరూపులైన మీ అపారమహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూపా! నన్ను మీరే యీ సంసారం నుండి ఉద్ధరించాలి. పామరుల దృష్టికి మానవునిలాగా కన్పించే  మీరు విశ్వకర్తలు'. 


                                 శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి, ' రాజా! మేము తపస్వులము. అరణ్యంలో నివసించే సన్యాసులము. నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి? ' అన్నారు. రాజు వినయంగా నమస్కరించి, ' ప్రభూ! మీరు భక్తులనుద్ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము. అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు? నా ప్రార్థనను మన్నించి గంధర్వపురంలోనే నివసించండి, మీరు అనుష్టానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను. మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి. మా పట్టణాన్ని పావనం చేయండి' అని స్వామి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు స్వామి, ' ఇది భగవదేఛ్ఛ. మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది. కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజునూ,  భక్తులనూ రక్షించాలి' అనుకొని అనుమతించారు. రాజెంతో సంతోషించి, శ్రీ గురుణ్ణి పల్లకిలో కూర్చోబెట్టి వాద్య, నృత్య, గీతాదులతో పట్టణానికి తీసుకెళ్లాడు. పల్లకీకి ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రాజు, అతని పరివారము, వందిమాగధులు నడచివచ్చారు. రాజు స్వయంగా ఛత్రం పట్టుకున్నాడు. విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే, వందిమాగధులు శ్రీగురుని స్తుతిస్తున్నారు. నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయజయధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు.      


                      ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వనగరంలో ప్రవేశిస్తున్నది. అక్కడొక పెద్ద రావిచెట్టు ఉన్నది. దాని సమీపంలోని ఇళ్లన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణం, ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. అతడు ఆ ప్రదేశంలోకొచ్చిన మానవులను, జంతువులను మ్రింగివేస్తుండేవాడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి, ఆ పట్టణంలోనే వేరొకచోట నివశిస్తున్నారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే, స్వామి తన పల్లకీ  నుండే ఆ చెట్టుపైకి చూశారు. మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా, ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టుదిగి వచ్చి స్వామికి నమస్కరించి తననుధ్ధరించమని ప్రార్థించాడు. పరాత్పరుడు, కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు. తక్షణమే అతనికి మానవాకారము వచ్చి అందరికీ కనిపించాడు. స్వామి అతనితో, ' నాయనా! నీవు వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేయి. నీ పాపం నశించి ముక్తి పొందుతావు' అని ఆదేశించారు. అతడు స్వామికి నమస్కరించి, వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేసి ఆ శరీరం విడిచి పెట్టి ముక్తి పొందాడు.          


                          ఈ సన్నివేశం చూచిన పట్టణవాసులు, శ్రీ గురుడు సాక్షాత్తూ పరమేశ్వరుడని తెలుసుకున్నారు. అపుడు శ్రీ గురుడు, ' నాకు మఠం ఇక్కడే నిర్మించాలి' అన్నారు. అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబడిన ఇల్లు శుభ్రం చేశారు. దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు. స్వామి అందులో ఉంటూ రోజూ స్నానానికి,  అనుష్టానానికి,  సంగమానికి వెళ్లి వచ్చేవారు. నిత్యమూ  రాజు ఆయనను దర్శించి పూజించేవాడు. శ్రీ గురుడు సంగమానికి వెళ్లేటప్పుడు, మళ్లీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడూ ఆయనను పల్లకీలోకూర్చోబెట్టి రాజ మర్యాదలతో తీసుకువెళ్లేవాడు.నిత్యమూ ఎందరెందరో శ్రీగురు  దర్శనానికి వస్తుండేవారు. ఆ పట్టణంలో ప్రతినిత్యమూ బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతుండేవి. అలా శ్రీగురుని కీర్తి గ్రామగ్రామాలకూ ప్రాకిపోయింది.


                                    గంధర్వనగరానికి కొద్దిదూరంలోని  'కుమసి' అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి వుండేవాడు. వేదవిదుడైన ఆ యతి, నిత్యమూ నృసింహావతారాన్ని మానస పూజతో ఉపాసిస్తుండేవాడు. ఇతడు శ్రీగురుని గురించి విని, ఆ యతి దాంభికుడు; సన్యాసాశ్రమధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు' అని ఆక్షేపిస్తూండేవాడు . విశ్వవ్యాపి,సర్వసాక్షియైన శ్రీ గురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు.  అప్పుడొక అద్భుతం జరిగింది ."   

ఇరవై మూడవ అధ్యాయము సమాప్తము

 

శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


గురు చరిత్ర అధ్యాయము -22

*** శనివారము పారాయణ ప్రారంభం ***

అధ్యాయం -22




శ్రీ గణేశాయనమః                          
శ్రీ సరస్వత్యేనమః                                                                                                 
శ్రీ గురుభ్యోనమః 

కథారంభము 


                                    నామధారకుడు, "సిద్ధమునీ, మీ వలన నాకు అజ్ఞానాంధకారము  తొలగి, జ్ఞానోదయం అయింది. అందువలన మీరే నా గురుదేవులు. కామధేనువు వంటి శ్రీ గురుచరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు. శ్రీ గురు కథ నా మనసును హరిస్తున్నది.  అటుపైన ఏమి జరిగిందో సెలవియ్యండి" అని ప్రార్థించాడు. సిద్ధయోగి, " నాయనా, నీకు గురుకృప  లభించింది. నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ గూడ  ధన్యమైంది.       

                          అటు తరువాత శ్రీ గురుడు ఈ గంధర్వపురం చేరి,  భీమ- అమరజా సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది.ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తరదిక్కుగా ప్రవహిస్తాయి. కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలున్నాయి. ఇక్కడ కూడా శ్రీ గురుడు అదృశ్యరూపంలో నిత్యనివాసం చేస్తున్నారు. ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలున్నప్పటికీ,  మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే  ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమవనీయక, గుప్తంగా సాదుజీవితం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ, దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్లేవారు. ఆ గ్రామంలో సుమారు నూరు బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వారంతా వేదవిధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పతివ్రత.వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది. గ్రామంలోని రైతులు దానిని మట్టి, ఇసుక మొదలైనవి మోయించుకోడానికై  అద్దెకు తీసుకెళ్తుండేవారు.అతడు యాయవారం (భిక్షాటన) తోనూ, గేదె పై వచ్చు బాడుగలతోనూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.                


                      శ్రీ నృసింహసరస్వతీ స్వామి తరచూ వీరి ఇంటికి బిక్షకు వెళ్లేవారు. అది చూచి కొందరు గ్రామంలో శ్రోత్రీయులము,   శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమందిమి  ఉండగా, ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర  బ్రాహ్మణుని ఇంటికే  వెళ్ళాలా? అక్కడ ఆయనకేమి దొరుకుతుంది? అని విమర్శిస్తుండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్లక పేదవాడైనా విదురుని ఇంటికే  వెళ్ళాడు. భగవంతునికి సత్వగుణమందే ప్రీతిగాని, ధనమదంతో చిక్కిన వారితో ఆయనకేమి పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రుడికి గూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మ లిపి కూడా మారవలసిందే!      


                     ఒక వైశాఖమాసంలో మధ్యాహ్నపుటెండ  నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీ గురుడు వారి ఇంటికి భిక్షకు వెళ్లారు. ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. శ్రీ గురుడు వాకిట్లో నిలచి.'భవతీ భిక్షాందేహి' అన్నారు. ఆ ఇల్లాలు నమస్కరించి,'స్వామీ,  యజమాని యాయవారానికై గ్రామంలోకి వెళ్ళారు. వారొచ్చే సమయమైంది. కోపగించక  దయతో కొద్దిసేపు మీరీ ఆసనం మీద కూర్చొండి' అని  పీట వేసింది.  


                               శ్రీ గురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో, 'నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు. మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు. మీ ముంగిట ఉన్న బర్రె పాలు కొంచెం ఇచ్చినా చాలు!' అన్నారు. అప్పుడామె, 'స్వామీ  ఇది గుడ్డుబర్రె.ఒక్కసారైనా కట్టనూ లేదు, ఈననూ లేదు. ఇప్పుడు ఇది ఎంతో ముసలిది. పళ్ళు కూడా ఊడిపోతున్నాయి. దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము' అన్నది. శ్రీ గురుడు అదేమీ పట్టించుకోకుండా 'ఎందుకు ఈ వట్టి మాటలు? అయినా పాలు పితుకు చూస్తాము!' అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యం!  ఆ గొడ్డుబర్రె రెండుపాత్రలనిండుగా పాలు ఇచ్చింది.ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తూ పరమేశ్వరుడేనని  తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది.శ్రీ గురుడు ఆ పాలు త్రాగి సంతోషించి, 'అమ్మా, మీరు అఖండ ఐశ్వర్యం తోనూ, పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు' అని ఆశీర్వదించి సంగమానికి వెళ్లిపోయారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని,  భార్యతో గూడ సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది" అన్నారు సిద్ధయోగి. 

ఇరవై రెండవ అధ్యాయం సమాప్తము.

                            
శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Thursday, May 7, 2020

జీవితం బుధ్బుధ ప్రాయం!

నా స్నేహితుడై న  నవనీత్! కలం నుండి జారిన కవిత 


జీవితం బుధ్బుధ ప్రాయం!


ప్రతీ క్షణం నూరేళ్ల జీవితం


నూరేళ్ల ప్రాయం ఒక్క క్షణం లో మాయం!!

ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని క్షణాన...

ప్రతీ క్షణం నీటి బుడగలో రంగుల రాట్నం!

నీరు విషం! గాలి విషం!

మనం తినే తిండి విషం!!

ఆఖరికి మనం ఉంచే ఎంగిలే కాలకూట విషం!!

ఏమౌతుందో తెలిసే లోపే ఎంతో జరిగే వింత కాలం!

అకాలం.. సకాలం.. కలకాలం... సకలం నిమిషంలో కకావికలం!

ఈ క్షణం..ఈ నిమిషం..ఈ ప్రదేశం.. నీ హృదయం.. పొందే అనుభూతే క్షణమనే అక్షణం లో 

అక్షయం..శాశ్వతం!!

ఈ జీవితం బుద్బుధ ప్రాయం!



గురు చరిత్ర అధ్యాయము -21


అధ్యాయము -21




                                

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                     
శ్రీ గురుభ్యోనమః 




కథారంభము



                         సిద్ధమునీంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు : " పుత్రశోకంతో ఖిన్నురాలై నదీతీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి, ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు : 'అమ్మా ! నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన- మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలలాగా పుట్టి నశిస్తుండడం సహజమే. కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి, కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది. మాయకు వశులైన  మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది,  బిడ్డ -భార్య -  మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు. వారు సత్వగుణము వలన దేవత్వాన్నీ, రజోగుణము వలన మానవత్వాన్నీ, తమోగుణం వలన అధోగతిని పొంది, కర్మఫలమనుభవిస్తారు. ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని, మరణం వలన దుఃఖం కానీ పొందరు. వారి వారి కర్మలననుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. నిజానికీ శరీరం రక్తము, మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైనది. బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము, ప్రియము అని భావించరు. ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో, బిడ్డలో, భర్తలో ఎవరికెరుక? ఇతడు నీ బిడ్డడన్న  భ్రాంతితో శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచి, శాస్త్ర విధిననుసరించి అంత్యక్రియలకై వారికీ శవాన్ని అప్పగించు'.


                                ఆ మాటలు విని శాంతాదేవి, 'అయ్యా, మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే గాని, అది నా మనస్సులో కొంచెం కూడా నిలవడం లేదు.జనన మరణాలకు మూలం కర్మే  అయితే, భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలెలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను. శ్రీ గురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు. ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించాడు? రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు; పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు. అలానే శ్రీ గురుని సేవించి, ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకొనడమే నా మూర్ఖత్వమా? ఈ నా బిడ్డ శతాయుష్మంమంతుడు అవుతాడని ఆయన వరమిచ్చాడు. నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తూ ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ  ఫలం  విఫలంఎందుకవాలి? ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా  వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని గూడాఆయనకే సమర్పిస్తాను ' అన్నది. అప్పుడా బ్రహ్మచారి,  'అమ్మా ! అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనం? నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్లి అడుగు!' అని ఉపాయం చెప్పాడు. ఆ తల్లి అందుకు అంగీకరించి, శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీ గురుడు అధివసించిన ఉదుంబర వృక్షం వద్ద కెళ్ళింది. అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచ్చటి పాదుకలకు తన తలను కొట్టుకుంటుంటే, రక్తం కారి పాదుకలు తడిశాయి. సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, "నీవు ధుఃఖం అణుచుకొని కర్తవ్యమాలోచించు. కొద్దిసేపట్లో సూర్యుడస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తిచేయాలి. శవం యింక వాసనగూడ వస్తుంది. కనుక దానిని మాకప్పగించు. అంతేగాక, ఈ స్థలం ఊరికి ఎంతో దూరం. ఏకాంతము, భయంకరము అయిన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు" అని తొందరపెట్టారు. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని, పాదుకలకు తన తల కొట్టుకుంటూనే ఉన్నది. ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక, 'ఇక చీకటిపడుతున్నది. ఇక్కడ దొంగల భయమున్నది. మనమిండ్లకు వెళ్లి,  రాత్రి ఉపవాసముండి, తెల్లవారాక శవసంస్కారం చేద్దాం. ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది' అనుకొని ఇళ్లకు వెళ్లిపోయారు.      


                            గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీ గురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు. పిల్లవాడు చనిపోక ముందు మూడు రోజులు, తర్వాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు, నాటి తెల్లవారుజామున కునుకు పట్టింది. అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీ గురుడు దర్శనమిచ్చారు. ఆయన జడలు, విభూతి, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు. ఒక చేతిలో దండము, మరో చేతిలో త్రిశూలము ధరించి వున్నారు. ఆయన బయటనుండి వీరున్న  ఉదుంబర  వృక్షం క్రిందకు వచ్చి, ఆమెతో, 'అమ్మా ! నాపై నిష్టూరాలాడతావెందుకు? నీ బిడ్డకు ఏమయింది? నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను' అని ఆ శవానికి విభూతి పూసి, పిల్లవాని ముక్కులోకి గాలివూది, ' అమ్మా ! నేను నీకేం అపకారం చేసాను? ఇంకా ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్ళి ప్రతిష్ఠించాను. నామీద కష్టపెట్టుకోవద్దు. ఇక దుఃఖించకు ' అని చెప్పి అదృశ్యమయ్యారు. శాంతాదేవి తుళ్లి పడి నిద్రలేచింది గాని, ' ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలే గాని, చనిపోయినవాడింక బ్రతుకుతాడా? నా ప్రారబ్ధం ఇలా ఉంటే శ్రీ గురుడు ఏమి చేస్తాడు? అనుకున్నది. ఇంతలో ప్రక్కనున్న శవం కదలసాగింది. ఆమె తాకి చూస్తే వెచ్చగా ఉన్నది. అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతమావేశించిందేమోనని పించి, భయమేసి దూరంగా వెళ్ళింది. కానీ పిల్లవాడు లేచి కూర్చుని, 'అమ్మా ! ఆకలి వేస్తున్నది. అన్నం పెట్టు!' అని ఏడుస్తూ ఆమె వద్దకు వచ్చాడు. ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యమొచ్చింది. ఆమె బిడ్డకు పాలిచ్చి, భర్తను నిద్రలేపి, జరిగినదంతా వివరించింది. అప్పుడా దంపతులు భక్తితో ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారము చేసి శ్రీ గురున్ని ఇలా స్తుతించారు.


                        ఓ శ్రీ గురుమూర్తీ ! జయము జయము. సాక్షాత్తూ త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవరూపం ధరించారు. వారి హితం కోరి, నిరంతరమూ వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయడానికై ఈ క్షేత్రంలో వెలిశారు. భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించడం ఎవరితరమూ కాదు. తల్లి వలె మీరు మా తప్పులు క్షమించి కృప చూప మిమ్ములను శరణు వేడుతున్నాము '. తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్లి సంగమ స్నానం చేసి, ఆ నీటితో గురుపాదుకలు కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని, పాదుకలను అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయం అయింది.శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు, ఆ బాలుడు బ్రతికి ఉండటం చూచి ఆశ్చర్యపడి శ్రీ గురు మహిమను కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు , దీర్ఘాయువు, భాగ్యవంతుడూ  అయ్యాడు.                


                 కనుక నామధారకా ! ఈ క్షేత్రమహిమను వర్ణించడం ఎవరితరమూ కాదు. అచ్చటి మేడి చెట్టు మూలంలో శ్రీ గురుడు నిశ్చయంగా నిత్యనివాసం చేస్తున్నాడు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి. సందేహం లేదు. అందుకే అచ్చటి మేడిచెట్టు సాక్షాత్తూ కల్పవృక్షమే!" 


ఇరవైఒకటవ అధ్యాయం సమాప్తము. 




శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


*** శుక్రవారం పారాయణ సమాప్తము ***


Wednesday, May 6, 2020

గురు చరిత్ర అధ్యాయము -20


అధ్యాయము  -20


శ్రీ గణేశాయనమః                            
శ్రీ సరస్వత్యేనమః                                                                                                 
 శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 

                                     నామధారకుడు సిద్ధమనికి నమస్కరించి, "స్వామీ ! శ్రీ గురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరపురంలోని ఉదుంబర  వృక్షం క్రింద నివశిస్తూ భక్తుల  కోరికలను నెరవేరుస్తున్నారని  చెప్పారు కదా! అటువంటి అనుభవము ఎవరికైనా కలిగినదా? " అని అడిగాడు. సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు :


                            " నాయనా, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పడం ఎవ్వరి తరమూకాదు. అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను. ' శిరోల ' అనే గ్రామంలో వేదశాస్త్రపరాయణుడు, ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారుగాని, ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది. ఎన్నో వ్రతాలు, ఉపవాసాలు చేసింది. అయినా ఆమెకర్మ తీరలేదు. చివరకు ఆమె తన శోకానికి కారణము, నివారణోపాయం తెలుపమని అని ఒక దైవజ్ఞుని కోరింది. అతడు, ' అమ్మా ! నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వ పాపమే. గర్భపాతం చేసినా, ఇతరుల ధనం అపహరించినా, తర్వాత జన్మలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. నీవు గత జన్మలో శౌనక గోత్రుడయిన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకుని, అతడెంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు. అతడా దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవీకర్మ అనుభవించక తీరదు' అని చెప్పాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై బడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, ' అమ్మా! ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందు వలన అతనికి శ్రాద్ధకర్మలు ఎవరూ చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడము, అంత్యక్రియలు జరగకపోవడమూ - ఇవన్నీ నీ వలననే జరిగాయి. గనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి. నిత్యమూ  ఏడుసార్లు మేడి చెట్టుకు యధావిధిగా ప్రదక్షణము, పూజ చేసి, శ్రీ గురుని పాదుకలకు పూజ, అభిషేకము చేస్తూ, ఉపవాసము చేయి. అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి, అతని సగోత్రికుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన వంద రూపాయలు దానమివ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగి, శ్రీ గురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్దాయం గల కొడుకులు కలుగుతారు'.         


                                    ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, ' అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాస వ్రతం ఆచరించగలను గాని,  ఆ బ్రాహ్మణుని సగోత్రునికి దానం ఇవ్వడానికి నా వద్ద అంత పైకము లేదు. మరి నేను ఏమి చేయాలి? ' అని వాపోయింది. ఆ దైవజనుడు, 'అమ్మా, అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీ గురు పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానం ఇవ్వు. ఆ ఉదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీ గురుడు పరమ దయా మూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు' అని చెప్పాడు.              


                                 అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్లి దీక్షగా ఆ వ్రతమాచరించనారంభించింది. మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది. కలలో ఆ పిశాచం కనిపించి, ఆమెను భయపెట్టి, తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు. అప్పుడామె మేడిచెట్టు వద్దకు పరుగెత్తింది. అక్కడ శ్రీ గురుడున్నాడు! ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీ గురుడామెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు. అప్పుడా పిశాచం ఆయనతో, తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి, 'స్వామీ, తపస్వలు, యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు' అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీ గురుడు కోపంతో, ' నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను. ఈమెనిలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే గాని, లాభం ఏమిటి? ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా! ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అందువలన ఈమెచేత ఊర్ధ్వదైహిక కర్మలు చేయించి యధాశక్తి దానం ఇప్పిస్తాము. నీకు సద్గతి ప్రసాదిస్తాము. మేము చెప్పినది నీకు నచ్చితే సరే. లేకపోతే నీకీ దుస్థితి తప్పదు. మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము ' అన్నారు. ఆ పిశాచం, 'స్వామీ ! మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది. మీరెలా చేసినా  సంతోషమే' అన్నాడు. శ్రీ గురుడు శాంతాదేవితో, 'అమ్మా ! నీవు యధాశక్తి పైకం వెచ్చించి, అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్యా దోషం తొలగి, పూర్ణాయువు గల కొడుకులూ, కూతుళ్లూ కలుగుతారు' అని చెప్పి, వెనుక దైవవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకాయన విధించారు. ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి 16 వ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వదైహిక కర్మ చేయించింది. ఆమెకు బ్రహ్మహత్యా దోషము, ఆ బ్రాహ్మణునకు పిశాచత్వము తొలగిపోయాయి.                       


                         తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీ గురుడు కలలో కనిపించి, రెండు కొబ్బరి కాయలు ఆమె ఒడిలో వేసి, 'అమ్మా ! నీ వ్రతము పూర్తి అయిందికదా? పారాణకు ఈ కాయలు వాడుకో! నీకు నిస్సందేహంగా వేదవిదులు పుడుతారు' అని చెప్పారు. ఆమె నిద్రలేచి చూచేసరికి, నిజంగానే ఆ రెండు ఫలాలూ ఆమె ప్రక్కన వున్నాయి! ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెప్పింది. ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి, వాటిని పారణకు ఉపయోగించారు. తర్వాత కొద్దికాలానికి ఆమెకు ఇద్దరు మగ పిల్లలు కలిగారు. పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరం రెండవ వానికి మూడవ సంవత్సరము రాగానే పెద్ద  వానికి ఉపనయనయనము, రెండవ వానికి చౌల సంస్కారము (పుట్టు వెంట్రుకలు తీయించుట) చేయాలని ముహూర్తం నిర్ణయించి, ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి, మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా  అతడు చనిపోయాడు. ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది;గుండెలు బాదుకున్నది; చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలచుకొని తలచుకొని అతని శవంపైబడి ఇలా శోకించింది: 'నాయనా,  మా ప్రాణరక్షకుడవు, వంశోద్ధారకుడవు అయిన నీవు  మమ్మల్ని విడిచి పోవడానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది? ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక అశోకం మరచాను. శ్రీ గురుడు వరమిచ్చినందువల్ల నీ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాను.             


                              అప్పుడక్కడి జనులు ఇలా ఆమెను ఓదార్చారు: 'అమ్మా,  నువ్వు ఇలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళి బ్రతుకుతాడా?  మృత్యువు దేవతలను,  ఋషులను,  రాక్షసులను,  అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు. మానవులమైన మనకు ఎలా తప్పుతుంది? నువ్వు ఆలోచించు. ఇలా దుఃఖించవద్దు.'అది విని ఆమె,  'నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి, సాక్షాత్తూ శ్రీ గురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకవాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైన విడుస్తాను,' అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది. ఆమె శ్రీగురుని స్మరించి, 'స్వామీ,  త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని  నమ్ముకున్న నాకు ఇది ఏమి గతి? నేను మీరు చెప్పినట్లు ఈ ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితమిదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు. పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణుపొందిన నాకు ఇదేమీ ఫలితము?  పులి నుండి పారిపోతున్న ఆవు కసాయి వానిని శరణుపొందినట్లున్నది; తన కష్టాలు నివారించుకోడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగిపడినట్లైంది. నాకు యింతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు? 'అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే వున్నది.         


                             మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, 'అమ్మా, నీవిలా శోకించినందువలన  లాభమేమి? జరగవలసినది జరుగకుండా తప్పుతుందా? నీవీ  మూర్ఖత్వం విడిచి, శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాము' అని చెప్పారు. కాని ఆమె మాత్రం తన పట్టు విడవక, 'ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తేయిస్తాను గానీ, లేకుంటే యివ్వను' అని చెప్పి, ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి,  'బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడమన్నది మేము కనీ వినీ ఎరుగము. ఇదెక్కడి  ధర్మము?' అనుకున్నారు.ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్నా శవాన్ని వారికప్పగించలేదు. చివరికామె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ,  తానూ ఆ బిడ్డతో సహా ప్రాణ త్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరింది. జనులంతా ఆమెననుసరించారు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్వముపదేశించాడు.  అతడెవరో కాదు - త్రిమూర్తి స్వరూపము, భక్తవత్సలుడూ అయిన శ్రీ గురుడే! 


ఇరవయ్యవ అధ్యాయం సమాప్తము 


శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

గురు చరిత్ర అధ్యాయము -19


                 అధ్యాయము  -19


                                                                                                    
శ్రీ గణేశాయనమః                  

శ్రీ సరస్వత్యేనమః                                                                                                 
                        
శ్రీ గురుభ్యోనమః 

                     కథారంభము 


                                                                నామధారకుడు, "స్వామీ ! అశ్వత్థవృక్షం( రావి చెట్టు ) వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా, శ్రీ గురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం( మేడి చెట్టు ) మూలంలోనే నివసించడానికి కారణమేమి? " అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధ మునీంద్రుడు ఇలా చెప్పారు: "పూర్వము నరసింహస్వామి అవతరించి, హిరణ్యకశిపుణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్ళకంటుకుని, ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడిపండ్లతోనూ,  ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసింది. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని, 'నిన్ను భక్తితో సేవించిన వారికి విషభాద తొలగుగాక! నిన్ను పూజించినవారి పాపాలు నశించి, అభీష్టాలు నెరవేరుతాయి. నీ నీడనచేసిన జపధ్యానాదులకు అపారమైన ఫలితముంటుంది. మేమిద్దరమూ నీ యందు నివశిస్తాము' అని వరమిచ్చాడు. ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీ గురుడు ఆ చెట్టుక్రింద నివశించారు. నేటికీ ఆ విషయంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీ గురుడు నివశిస్తుంటారు.                         

                                                శ్రీ గురుడక్కడ నివశిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభైమంది యోగినులు మధ్యాహ్నసమయంలో ఉదుంబర వృక్షం క్రిందనున్న శ్రీగురుని  దర్శించి, తమ ఆశ్రమానికి తీసుకువెళ్ళి యధావిధిగా పూజించి, ఆయనకు భిక్ష ఇవ్వసాగారు. ఆయన వారి భిక్షను స్వీకరించి, మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటుండేవారు. అమరాపురంలోని విప్రులకు - స్వామి నిత్యమూ  భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది. ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థంకాలేదు. వారా రహస్యాన్ని తెలుసుకోదలచి, ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగియుండ, మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు. కాని ఆ సమయమయ్యేసరికి అతనికి, ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబూనడం  మహాపాపమని తోచి, విపరీతమైన భయమేస్తుండేది. దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు. 


                                         అక్కడకు దగ్గరలోనే గంగానుజుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటబడింది. అకస్మాత్తుగా నదీజలం అడ్డంగా, రెండుగా చీలిపోయింది. అందులోనుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా, యోగినులు కొందరు నది నుండి బయటకి వచ్చి, అచటి మేడిచెట్టు క్రింద కూర్చొనివున్న శ్రీగురుని వద్దకు వెళ్లారు. వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని, తర్వాత స్వామిని తీసుకొని, వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు. మర్నాడు గూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూచి అతడు ఆశ్చర్యపోయి, కొంచెం దూరం వారిని అనుసరించాడు. ఆ నది మధ్యలో ఒక దివ్యమందిరం చూచాడు. వారు దేవకన్యలని, వారిచేత పూజింపబడుతున్న యతి సామాన్య మానవుడు కాడని అతడు గుర్తించాడు. మూడవ రోజు అదే సమయానికి అచటికి వెళ్లి, అతడు ఆ యోగినుల వెనుకనే నదీగర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్లి అచటి మందిర ద్వారం దగ్గర నిలచి, అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనం పై కూర్చోబెట్టి, పూజ చేసి,  నీరాజనం ఇచ్చి, షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు. తర్వాత శ్రీ గురుడు, మందిరం నుండి తిరిగివస్తూ గంగానుజుణ్ణి  చూచి, ' నీవెవరవు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ' అని అడిగారు. అతడు భయపడి ఆపాదమస్తకమూ  వణికిపోతూ, 'స్వామీ ! నా పేరుగంగానుజుడు. నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుక ఇచ్చటికి చూడవచ్చాను. నా అపరాధం క్షమించండి!' అని ఆయనకు నమస్కరించి, ' మీరు సాక్షాత్తూ త్రిమూర్తి స్వరూపులు. అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు. నన్నుధరించండి' అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి, 'నాయనా! నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి. నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. కానీ నీవు ఇప్పుడు చూచినది మేమీ ప్రాంతంలో వున్నంతకాలం ఎవరికీ చెప్పవద్దు. చెబితే తక్షణమే నీవు మరణిస్తావు' అన్నారు. గంగానుజుడు అలాగేనని చెప్పి, గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు. అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతి రోజూ భార్యాసమేతంగా వచ్చి  శ్రీగురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు. 


                                   ఒక మాఘపూర్ణిమ రోజున గంగానుజుడు యధాప్రకారం శ్రీ గురుణ్ణి  దర్శించి, 'స్వామీ, మాఘమాసంలోప్రయాగ, కాశీ, గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు. కాని వాటిని నేను దర్శించనైనా లేదు. ఆ క్షేత్రాల మహత్యము వినినా గూడా పుణ్యం వస్తుందంటారు. కనుక దయతో వాటిని వివరించి చెప్పండి' అని కోరాడు. శ్రీ నృసింహసరస్వతి సంతోషించి, 'ఈ కృష్ణా - పంచనదీ సంగమం సాక్షాత్తూ ప్రయాగయే. త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ,  గయ- ఎంతో మహత్తరమైనవి. అలాగే ఇక్కడి సంగమము, యుగాలయము, కరవీరము అనే  మూడూ  గూడా త్రిస్థలి అని తెలుసుకో. ఈ మూడింటినీ నీకిప్పుడే చూపిస్తాను 'అని చెప్పి, స్వామి పులిచర్మంపై కూర్చొని, గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు. క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి, మధ్యాహ్నం కాశీలో విశ్వనాధుని దర్శనం చేయించారు. సాయంత్రం అయ్యేసరికి గురు దర్శనం కూడా చేయించి, సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు. తర్వాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు.  


                            ఈ రీతిన ఆ క్షేత్రమహత్యం వెల్లడి చేశాక, శ్రీ గురుడు ఆ చోటు విడిచిపోదలచారు. ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి,'ప్రభూ ! మీ సేవకులమైన మమ్మల్ని వదిలి పెట్టి ఎక్కడకుపోతారు? ' అని విలపించారు. శ్రీ గురుడు వారిని వూరడించి, ' లోకుల  దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా, మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర  వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము. మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షం లోనే నివశించండి. అమరపురానికి తూర్పుదిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధం అవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్టిస్తాము. మమ్మల్ని, ఈఉదుంబర వృక్షాన్ని, మా పాదుకలను,ద్విజులనూ పూజించి, ఇచ్చట తీర్థాలలో స్నానం చేసినవారికి సర్వపాపాలూ  నశించి, అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి. ఈ వృక్షం క్రింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలయిన సత్కర్మలకు కోటిరెట్లు ఫలముంటుంది. ఇచ్చటి పాదుకలను పూజించి, నెమ్మదిగా ప్రదక్షణలు చేసి, ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలూ నశిస్తాయి' అని చెప్పి, శ్రీ గురుడు, ఆశ్వయుజ బహుళ ద్వాదశినాడు గంధర్వ నగరంలోని భీమ - అమరజా సంగమానికి వెళ్లారు.       

                             శ్రీ నరసింహ సరస్వతీస్వామి విశ్వరూపుడయిన జగన్నాథుడు. ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ, ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్యనివాసము చేస్తూనే ఉన్నారు. "     

 పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

గురు చరిత్ర అధ్యాయము -18


అధ్యాయము  -18



                                శ్రీ గణేశాయనమః                                       శ్రీ సరస్వత్యేనమః            

              శ్రీ గురుభ్యోనమః 

కథారంభము 

                                                                             నామధారకుడు,  "స్వామీ ! శ్రీ గురుని లీలలు ఇంకా వినిపించవలసింది" అని ప్రార్థించాడు.

                                        సిద్ధయోగి ఇలా చెప్పారు; "నాయనా! అంతవరకూ గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీలవలన లోకానికి వెల్లడయింది. ఇక శ్రీ గురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక  ప్రసిద్ధుడై, అచ్చటి నుండి వరుణా సంగమం చేరి,  అక్కడినుండి కృష్ణాతీరంలో ఉన్న తీర్థాలలో స్నానం చేస్తూ,  కృష్ణ-పంచనదీ  సంగమానికి వెళ్లి,  అక్కడ 12 సంవత్సరాలునివశించారు.  అక్కడ శివ, భద్ర, భోగవతీ, కుంభీ,  సరస్వతి అను  మహాపవిత్రమైన ఐదు నదులూ ఒక్కటై కృష్ణానదిలో  కలుస్తాయి. అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది, అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అక్కడినుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు, ఆయన సన్నిధిలో 64 మంది యోగినులు నివసిస్తున్నారు. అచ్చటి అమరేశ్వర లింగం సాక్షాత్తూ కాశీ విశ్వేశ్వరుడే. అక్కడ వేణీ నదితో కలసిన  కృష్ణ, దక్షిణ  దిక్కుగా ప్రవహిస్తున్నది. అక్కడకు ఉత్తరదిక్కున శుక్ల తీర్థము, ఉదుంబర వృక్షము దగ్గర పాపనాశతీర్థము, కామ్య తీర్థము, వరద తీర్థము ఉన్నాయి. సంగమంలో శక్తి తీర్థము, చామర తీర్థము, కోటి తీర్థము ఉన్నాయి. అవన్నీ అపారమైన మహిమ గలవే. అచ్చటి కృష్ణా - పంచ గంగలో స్నానం చేస్తే సర్వ కార్యాలు నెరవేరుతాయి. అది గొప్ప తీర్థక్షేత్రము. దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి. అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తూ కల్పవృక్షము. ఆ క్షేత్రమహిమను వెల్లడి చేయడానికే  శ్రీ గురుడక్కడ అంతకాలం నివసించారు.           


                                        శ్రీ నృసింహ సరస్వతీస్వామి ప్రతిరోజూ భిక్షకు  అమరపురానికి వెళ్తుండేవారు. ఆ గ్రామంలో ఒక నిరు పేద బ్రాహ్మణుడుండేవాడు. అతడు పరమ సాత్వికుడు. కేవలం యాయవారం వృత్తితో జీవిస్తుండేవాడు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతడి ఇంటి ముందు తమ్మపాదు ఒకటి ఉండేది. అతనికి గ్రామంలో గింజలు లభించనప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచ యజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ, అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రీ గురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్లారు. ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు. ఆరోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తమ్మ  కాయలు కోసి వండి, స్వామికి దానినే సమర్పించారు. తర్వాత స్వామి, వారి ఇంట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని, 'మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము. నేటితో మీ దారిద్యం తీరిపోయింది' అని చెప్పి, నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి, దాని కొమ్మలను తుంచివేస్తూ త్వరత్వరగా వెళ్ళిపోయారు. 


                                       అది చూచి ఆ ఇల్లాలు ఎంతో  దుఃఖించి, ' అయ్యో! స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధమేమిటి? మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారే ! మనం జీవించేదెలా? ' అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు, ' సర్వమూ ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారబ్దముననుసరించి జరుగుతుంది. చీమల దగ్గరనుండి సర్వజీవులకు ఆయువు, ఆహారము ప్రసాదిస్తాడేగాని, ఆయన మనకెందుకు కీడు చేస్తారు? ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది. నీవు బాధపడవద్దు' అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు  మొదట్లో త్రవ్వాడు. గడ్డపారకు ఒక లోహపు పాత్ర తగిలిన శబ్దం వచ్చింది. అక్కడ త్రవ్వి చూడగా, ఒక రాగిబిందె నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి. అతడు ఎంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి, చూశావా? స్వామి ఈ లతను పీకి వేయడంవల్లనే ఈ నిధి మనకు దొరికింది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే, అని చెప్పాడు. వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు. అప్పుడు శ్రీ గురుడు,'నాయనా! నీవీ విషయం ఎవరికీ చెప్పవద్దు. చెబితే సంపద నశిస్తుంది.  స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలు అనుభవించి, తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు' అని దీవించి పంపారు". 


పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తము.

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Saturday, May 2, 2020

గురు చరిత్ర అధ్యాయము -17



అధ్యాయం -17



                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                                                                                 

శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 




                   సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు; "నాయనా,  మబ్బు వేసేముందు చల్లనిగాలి వీచినట్లు, గురుకథ వినడంలో నీకు, అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని భక్తులపాలిట కామధేనువు,  కల్పవృక్షం అయిన యీ శ్రీ గురుచరిత్ర చెబుతాను విను:   
                 
            శ్రీ గురుడు కృష్ణాతీరంలో బిల్లవటి వద్దనున్న మేడిచెట్టు దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాస్యం చేసారు". అది వినగానే నామాధరకుడు  నమస్కరించి."స్వామీ,  భగవంతుడైన శ్రీ గురుడు తపస్సు, అనుష్ఠానము ఎందుకు చేశారు?  అందరికీ అన్ని సమర్పించగల ఆయన భిక్ష  చేసుకోనడమెందుకు? "అని అడిగాడు.


                    సిద్ధయోగి, "నాయనా! భగవంతుడైన శివుడు, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడూ భిక్ష చేయలేదా? మహాత్ములు తీర్థయాత్ర చేయడము,  తపస్సు చేయడమూగానీ, బిక్షమెత్తడం గానీ భక్తులనుద్దరించడానికి,  సాధకులకు సన్మార్గము తెలియజెప్పడానికీ మాత్రమే చేస్తారు. అలానే  శ్రీ గురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు. భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమతీర్థాల నెన్నింటినో తిరిగి ప్రకటం  చేయడానికే తీర్థయాత్రలు చేసారు. కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించేమూర్ఖులు,  స్వార్ధపరులు తమనాశ్రయించకుండా చూసుకోడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు. కాని  సూర్యుని తేజస్సు,  కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడీ  విధంగా వెల్లడయింది.  


                 కరవీరపురంలో వేదశాస్త్రపురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కణ్వశాఖీయుడు,  మహాపండితుడు అయిన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు,  మేనమామ గ్రామస్థులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరం లో ఉపనయనం చేశాడు. కానీ మతిమరుపువల్ల అతడు గాయత్రీ మంత్రానుష్టానం కూడా చేయలేకపోయేవాడు. ఉపనయనం చేసిన ఒక సంవత్సరానికే మేనమామ గూడ మరణించడంతో అతడు అనాధుడై  బిక్షకెళ్ళేవాడు. ఊళ్లోని జనం అతనిని, 'ఒరే  మందమతీ! అంతటి మహాపండితుని  పేరు చెడగొట్టిన నీవు  ఎందులోనైనా దూకిచావరాదా? నీ జన్మం వ్యర్థం,  విద్యావంతుడు వయస్సులో చిన్నవాడైనా, అతను ఎక్కడికి వెళ్ళినా సోదరునివలె విద్య అతని వెంటనుండి అతనికి కీర్తి,  గౌరవము లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వ దేవతలు నివశిస్తారు. గనుక,  అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే.  విద్యలేనివాడు వయస్సులో పెద్దవాడైనా  అతనినెవరూ  ఆదరించరు. విద్యలేని నీవు పశువు కంటే హీనం', అని హేళన చేసేవారు.        


              అతడు అందుకు బాధపడి,  'అయ్యా మీరు చెప్పినది నిజమేగానీ నేనేమి చేయగలను?  పూర్వ జన్మలో నేను విద్యాదానం చేయలేదు గాబోలు,  నాకీదుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి' అని ప్రాధేయపడేవాడు. అతనికి విద్య చెప్పిచెప్పి విసిగిపోయిన ఆ విప్రులు, 'నీకిక జన్మలో విద్యరాదు. నీవు బిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు. నీవలన వంశమే భ్రష్టమైంది', అని నిందించేవారు. ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహచెంది, ఇల్లు విడిచి భిల్లవటి చేరి, కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరీ దేవిని దర్శించి,  అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. అలా మూడురోజులు గడిచినా ఆ తల్లి దర్శనమీయకపోయేసరికి. అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాలవద్ద పెట్టి, 'అమ్మా! నీవు కూడా నన్ననుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి, నీ  ఎదుటనే ప్రాణాలు విడుస్తాను' అని చెప్పుకున్నాడు. నాటి రాత్రి, దేవి అతడికి కలలో కనిపించి,  'నాయనా! నాపై అలుగవద్దు. కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము. అపారశక్తిమంతుడు. నీ కోరిక తీర్చగలడు'.  అని చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయల్దేరి, శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారము  చేసాడు. శ్రీ గురుడు ప్రసన్నులై  అతని శిరస్సు మీద తమ చేయినుంచి ఆశీర్వదించారు. అతనికి వెంటనే నాలుక రావడమేగాక, సకల విద్యలూ సిద్ధించాయి. కాకి మానససరోవరం చేరి రాజహంసగా మారినట్లు, పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు,  శ్రీగురుని హస్త స్పర్శ వలన ఆ విప్ర కుమారుడు మహాజ్ఞాని అయ్యాడు. శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమ గల దయింది". 

పదిహేడవ  అధ్యాయము సమాప్తము


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః 

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...