Wednesday, May 6, 2020

గురు చరిత్ర అధ్యాయము -18


అధ్యాయము  -18



                                శ్రీ గణేశాయనమః                                       శ్రీ సరస్వత్యేనమః            

              శ్రీ గురుభ్యోనమః 

కథారంభము 

                                                                             నామధారకుడు,  "స్వామీ ! శ్రీ గురుని లీలలు ఇంకా వినిపించవలసింది" అని ప్రార్థించాడు.

                                        సిద్ధయోగి ఇలా చెప్పారు; "నాయనా! అంతవరకూ గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీలవలన లోకానికి వెల్లడయింది. ఇక శ్రీ గురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక  ప్రసిద్ధుడై, అచ్చటి నుండి వరుణా సంగమం చేరి,  అక్కడినుండి కృష్ణాతీరంలో ఉన్న తీర్థాలలో స్నానం చేస్తూ,  కృష్ణ-పంచనదీ  సంగమానికి వెళ్లి,  అక్కడ 12 సంవత్సరాలునివశించారు.  అక్కడ శివ, భద్ర, భోగవతీ, కుంభీ,  సరస్వతి అను  మహాపవిత్రమైన ఐదు నదులూ ఒక్కటై కృష్ణానదిలో  కలుస్తాయి. అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది, అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అక్కడినుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు, ఆయన సన్నిధిలో 64 మంది యోగినులు నివసిస్తున్నారు. అచ్చటి అమరేశ్వర లింగం సాక్షాత్తూ కాశీ విశ్వేశ్వరుడే. అక్కడ వేణీ నదితో కలసిన  కృష్ణ, దక్షిణ  దిక్కుగా ప్రవహిస్తున్నది. అక్కడకు ఉత్తరదిక్కున శుక్ల తీర్థము, ఉదుంబర వృక్షము దగ్గర పాపనాశతీర్థము, కామ్య తీర్థము, వరద తీర్థము ఉన్నాయి. సంగమంలో శక్తి తీర్థము, చామర తీర్థము, కోటి తీర్థము ఉన్నాయి. అవన్నీ అపారమైన మహిమ గలవే. అచ్చటి కృష్ణా - పంచ గంగలో స్నానం చేస్తే సర్వ కార్యాలు నెరవేరుతాయి. అది గొప్ప తీర్థక్షేత్రము. దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి. అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తూ కల్పవృక్షము. ఆ క్షేత్రమహిమను వెల్లడి చేయడానికే  శ్రీ గురుడక్కడ అంతకాలం నివసించారు.           


                                        శ్రీ నృసింహ సరస్వతీస్వామి ప్రతిరోజూ భిక్షకు  అమరపురానికి వెళ్తుండేవారు. ఆ గ్రామంలో ఒక నిరు పేద బ్రాహ్మణుడుండేవాడు. అతడు పరమ సాత్వికుడు. కేవలం యాయవారం వృత్తితో జీవిస్తుండేవాడు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతడి ఇంటి ముందు తమ్మపాదు ఒకటి ఉండేది. అతనికి గ్రామంలో గింజలు లభించనప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచ యజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ, అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రీ గురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్లారు. ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు. ఆరోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తమ్మ  కాయలు కోసి వండి, స్వామికి దానినే సమర్పించారు. తర్వాత స్వామి, వారి ఇంట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని, 'మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము. నేటితో మీ దారిద్యం తీరిపోయింది' అని చెప్పి, నిండుగా కాచిన ఆ పాదును పీకివేసి, దాని కొమ్మలను తుంచివేస్తూ త్వరత్వరగా వెళ్ళిపోయారు. 


                                       అది చూచి ఆ ఇల్లాలు ఎంతో  దుఃఖించి, ' అయ్యో! స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధమేమిటి? మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారే ! మనం జీవించేదెలా? ' అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు, ' సర్వమూ ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారబ్దముననుసరించి జరుగుతుంది. చీమల దగ్గరనుండి సర్వజీవులకు ఆయువు, ఆహారము ప్రసాదిస్తాడేగాని, ఆయన మనకెందుకు కీడు చేస్తారు? ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది. నీవు బాధపడవద్దు' అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు  మొదట్లో త్రవ్వాడు. గడ్డపారకు ఒక లోహపు పాత్ర తగిలిన శబ్దం వచ్చింది. అక్కడ త్రవ్వి చూడగా, ఒక రాగిబిందె నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి. అతడు ఎంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపి, చూశావా? స్వామి ఈ లతను పీకి వేయడంవల్లనే ఈ నిధి మనకు దొరికింది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే, అని చెప్పాడు. వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు. అప్పుడు శ్రీ గురుడు,'నాయనా! నీవీ విషయం ఎవరికీ చెప్పవద్దు. చెబితే సంపద నశిస్తుంది.  స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలు అనుభవించి, తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు' అని దీవించి పంపారు". 


పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తము.

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...