అధ్యాయము -21
శ్రీ గణేశాయనమః
శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః
కథారంభము
సిద్ధమునీంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు : " పుత్రశోకంతో ఖిన్నురాలై నదీతీరానికి వెళ్తున్న శాంతాదేవిని సమీపించి, ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు : 'అమ్మా ! నీవు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన- మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలలాగా పుట్టి నశిస్తుండడం సహజమే. కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి, కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది. మాయకు వశులైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది, బిడ్డ -భార్య - మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు. వారు సత్వగుణము వలన దేవత్వాన్నీ, రజోగుణము వలన మానవత్వాన్నీ, తమోగుణం వలన అధోగతిని పొంది, కర్మఫలమనుభవిస్తారు. ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని, మరణం వలన దుఃఖం కానీ పొందరు. వారి వారి కర్మలననుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. నిజానికీ శరీరం రక్తము, మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైనది. బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము, ప్రియము అని భావించరు. ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో, బిడ్డలో, భర్తలో ఎవరికెరుక? ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచి, శాస్త్ర విధిననుసరించి అంత్యక్రియలకై వారికీ శవాన్ని అప్పగించు'.
ఆ మాటలు విని శాంతాదేవి, 'అయ్యా, మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే గాని, అది నా మనస్సులో కొంచెం కూడా నిలవడం లేదు.జనన మరణాలకు మూలం కర్మే అయితే, భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలెలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను. శ్రీ గురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు. ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించాడు? రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు; పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు. అలానే శ్రీ గురుని సేవించి, ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకొనడమే నా మూర్ఖత్వమా? ఈ నా బిడ్డ శతాయుష్మంమంతుడు అవుతాడని ఆయన వరమిచ్చాడు. నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తూ ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలంఎందుకవాలి? ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని గూడాఆయనకే సమర్పిస్తాను ' అన్నది. అప్పుడా బ్రహ్మచారి, 'అమ్మా ! అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనం? నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్లి అడుగు!' అని ఉపాయం చెప్పాడు. ఆ తల్లి అందుకు అంగీకరించి, శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీ గురుడు అధివసించిన ఉదుంబర వృక్షం వద్ద కెళ్ళింది. అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచ్చటి పాదుకలకు తన తలను కొట్టుకుంటుంటే, రక్తం కారి పాదుకలు తడిశాయి. సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, "నీవు ధుఃఖం అణుచుకొని కర్తవ్యమాలోచించు. కొద్దిసేపట్లో సూర్యుడస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తిచేయాలి. శవం యింక వాసనగూడ వస్తుంది. కనుక దానిని మాకప్పగించు. అంతేగాక, ఈ స్థలం ఊరికి ఎంతో దూరం. ఏకాంతము, భయంకరము అయిన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు" అని తొందరపెట్టారు. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని, పాదుకలకు తన తల కొట్టుకుంటూనే ఉన్నది. ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక, 'ఇక చీకటిపడుతున్నది. ఇక్కడ దొంగల భయమున్నది. మనమిండ్లకు వెళ్లి, రాత్రి ఉపవాసముండి, తెల్లవారాక శవసంస్కారం చేద్దాం. ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది' అనుకొని ఇళ్లకు వెళ్లిపోయారు.
గంగాధరుడు, శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీ గురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు. పిల్లవాడు చనిపోక ముందు మూడు రోజులు, తర్వాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు, నాటి తెల్లవారుజామున కునుకు పట్టింది. అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీ గురుడు దర్శనమిచ్చారు. ఆయన జడలు, విభూతి, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు. ఒక చేతిలో దండము, మరో చేతిలో త్రిశూలము ధరించి వున్నారు. ఆయన బయటనుండి వీరున్న ఉదుంబర వృక్షం క్రిందకు వచ్చి, ఆమెతో, 'అమ్మా ! నాపై నిష్టూరాలాడతావెందుకు? నీ బిడ్డకు ఏమయింది? నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను' అని ఆ శవానికి విభూతి పూసి, పిల్లవాని ముక్కులోకి గాలివూది, ' అమ్మా ! నేను నీకేం అపకారం చేసాను? ఇంకా ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్ళి ప్రతిష్ఠించాను. నామీద కష్టపెట్టుకోవద్దు. ఇక దుఃఖించకు ' అని చెప్పి అదృశ్యమయ్యారు. శాంతాదేవి తుళ్లి పడి నిద్రలేచింది గాని, ' ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలే గాని, చనిపోయినవాడింక బ్రతుకుతాడా? నా ప్రారబ్ధం ఇలా ఉంటే శ్రీ గురుడు ఏమి చేస్తాడు? అనుకున్నది. ఇంతలో ప్రక్కనున్న శవం కదలసాగింది. ఆమె తాకి చూస్తే వెచ్చగా ఉన్నది. అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతమావేశించిందేమోనని పించి, భయమేసి దూరంగా వెళ్ళింది. కానీ పిల్లవాడు లేచి కూర్చుని, 'అమ్మా ! ఆకలి వేస్తున్నది. అన్నం పెట్టు!' అని ఏడుస్తూ ఆమె వద్దకు వచ్చాడు. ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యమొచ్చింది. ఆమె బిడ్డకు పాలిచ్చి, భర్తను నిద్రలేపి, జరిగినదంతా వివరించింది. అప్పుడా దంపతులు భక్తితో ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారము చేసి శ్రీ గురున్ని ఇలా స్తుతించారు.
ఓ శ్రీ గురుమూర్తీ ! జయము జయము. సాక్షాత్తూ త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవరూపం ధరించారు. వారి హితం కోరి, నిరంతరమూ వారిని కనిపెట్టి కాపాడి తరింపజేయడానికై ఈ క్షేత్రంలో వెలిశారు. భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించడం ఎవరితరమూ కాదు. తల్లి వలె మీరు మా తప్పులు క్షమించి కృప చూప మిమ్ములను శరణు వేడుతున్నాము '. తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్లి సంగమ స్నానం చేసి, ఆ నీటితో గురుపాదుకలు కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని, పాదుకలను అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయం అయింది.శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు, ఆ బాలుడు బ్రతికి ఉండటం చూచి ఆశ్చర్యపడి శ్రీ గురు మహిమను కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు , దీర్ఘాయువు, భాగ్యవంతుడూ అయ్యాడు.
కనుక నామధారకా ! ఈ క్షేత్రమహిమను వర్ణించడం ఎవరితరమూ కాదు. అచ్చటి మేడి చెట్టు మూలంలో శ్రీ గురుడు నిశ్చయంగా నిత్యనివాసం చేస్తున్నాడు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి. సందేహం లేదు. అందుకే అచ్చటి మేడిచెట్టు సాక్షాత్తూ కల్పవృక్షమే!"
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box