Saturday, May 9, 2020

గురు చరిత్ర అధ్యాయము -23

అధ్యాయం-23         



శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 

కథారంభము 



                                సిద్ధముని యింకా యిలా చెప్పారు: "నామధారకా! శ్రీ గురుడు గొడ్డు బఱ్ఱె నుండి పాలుపితికించడంతో అంతవరకూ  గుప్తంగా వున్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మర్నాడు కొందరు గ్రామస్థులు మట్టి తోలుకోడానికి బఱ్ఱెను బాడుగకు యిమ్మని అడగటానికి వచ్చారు. అప్పుడా బ్రాహ్మణుడు, 'అయ్యా! మా గేదె పాలిస్తున్నది. కనుక యికనుండి దానిని మట్టి తోలడానికి పంపలేము' అని చెప్పి, నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు. ఆ గ్రామస్థులు, 'అరెరే! యింతవరకూ ఒక్కసారైనా కట్టని యీ ముసలిబఱ్ఱె పాలు ఎలా యిచ్చింది? అని ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరమేలే రాజుకు చేరింది.అతడాశ్చర్యపడి, కుతూహులంతో బ్రాహ్మణుని యింటికి వచ్చి చూచి, అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు. వెంటనే అతడు సకుటుంబంగా, పరివారంతో గూడ సంగమానికి వెళ్లి శ్రీ గురునికి పొర్లుదండాలు పెట్టి, సాష్టాంగ నమస్కారం చేసి యిలా స్తుతించాడు: జగద్గురూ! మీకు జయము. మాయామోహితుడైన నాకు త్రిమూర్తిస్వరూపులైన మీ అపారమహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూపా! నన్ను మీరే యీ సంసారం నుండి ఉద్ధరించాలి. పామరుల దృష్టికి మానవునిలాగా కన్పించే  మీరు విశ్వకర్తలు'. 


                                 శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి, ' రాజా! మేము తపస్వులము. అరణ్యంలో నివసించే సన్యాసులము. నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి? ' అన్నారు. రాజు వినయంగా నమస్కరించి, ' ప్రభూ! మీరు భక్తులనుద్ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము. అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు? నా ప్రార్థనను మన్నించి గంధర్వపురంలోనే నివసించండి, మీరు అనుష్టానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను. మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి. మా పట్టణాన్ని పావనం చేయండి' అని స్వామి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు స్వామి, ' ఇది భగవదేఛ్ఛ. మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది. కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజునూ,  భక్తులనూ రక్షించాలి' అనుకొని అనుమతించారు. రాజెంతో సంతోషించి, శ్రీ గురుణ్ణి పల్లకిలో కూర్చోబెట్టి వాద్య, నృత్య, గీతాదులతో పట్టణానికి తీసుకెళ్లాడు. పల్లకీకి ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రాజు, అతని పరివారము, వందిమాగధులు నడచివచ్చారు. రాజు స్వయంగా ఛత్రం పట్టుకున్నాడు. విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే, వందిమాగధులు శ్రీగురుని స్తుతిస్తున్నారు. నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయజయధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు.      


                      ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వనగరంలో ప్రవేశిస్తున్నది. అక్కడొక పెద్ద రావిచెట్టు ఉన్నది. దాని సమీపంలోని ఇళ్లన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణం, ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. అతడు ఆ ప్రదేశంలోకొచ్చిన మానవులను, జంతువులను మ్రింగివేస్తుండేవాడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి, ఆ పట్టణంలోనే వేరొకచోట నివశిస్తున్నారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే, స్వామి తన పల్లకీ  నుండే ఆ చెట్టుపైకి చూశారు. మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా, ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టుదిగి వచ్చి స్వామికి నమస్కరించి తననుధ్ధరించమని ప్రార్థించాడు. పరాత్పరుడు, కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు. తక్షణమే అతనికి మానవాకారము వచ్చి అందరికీ కనిపించాడు. స్వామి అతనితో, ' నాయనా! నీవు వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేయి. నీ పాపం నశించి ముక్తి పొందుతావు' అని ఆదేశించారు. అతడు స్వామికి నమస్కరించి, వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేసి ఆ శరీరం విడిచి పెట్టి ముక్తి పొందాడు.          


                          ఈ సన్నివేశం చూచిన పట్టణవాసులు, శ్రీ గురుడు సాక్షాత్తూ పరమేశ్వరుడని తెలుసుకున్నారు. అపుడు శ్రీ గురుడు, ' నాకు మఠం ఇక్కడే నిర్మించాలి' అన్నారు. అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబడిన ఇల్లు శుభ్రం చేశారు. దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు. స్వామి అందులో ఉంటూ రోజూ స్నానానికి,  అనుష్టానానికి,  సంగమానికి వెళ్లి వచ్చేవారు. నిత్యమూ  రాజు ఆయనను దర్శించి పూజించేవాడు. శ్రీ గురుడు సంగమానికి వెళ్లేటప్పుడు, మళ్లీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడూ ఆయనను పల్లకీలోకూర్చోబెట్టి రాజ మర్యాదలతో తీసుకువెళ్లేవాడు.నిత్యమూ ఎందరెందరో శ్రీగురు  దర్శనానికి వస్తుండేవారు. ఆ పట్టణంలో ప్రతినిత్యమూ బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతుండేవి. అలా శ్రీగురుని కీర్తి గ్రామగ్రామాలకూ ప్రాకిపోయింది.


                                    గంధర్వనగరానికి కొద్దిదూరంలోని  'కుమసి' అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి వుండేవాడు. వేదవిదుడైన ఆ యతి, నిత్యమూ నృసింహావతారాన్ని మానస పూజతో ఉపాసిస్తుండేవాడు. ఇతడు శ్రీగురుని గురించి విని, ఆ యతి దాంభికుడు; సన్యాసాశ్రమధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు' అని ఆక్షేపిస్తూండేవాడు . విశ్వవ్యాపి,సర్వసాక్షియైన శ్రీ గురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు.  అప్పుడొక అద్భుతం జరిగింది ."   

ఇరవై మూడవ అధ్యాయము సమాప్తము

 

శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...