అధ్యాయము -19
శ్రీ గణేశాయనమః
శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః
కథారంభము
నామధారకుడు, "స్వామీ ! అశ్వత్థవృక్షం( రావి చెట్టు ) వంటి పవిత్రమైన వృక్షాలెన్నో ఉండగా, శ్రీ గురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం( మేడి చెట్టు ) మూలంలోనే నివసించడానికి కారణమేమి? " అని ప్రశ్నించాడు. అప్పుడు సిద్ధ మునీంద్రుడు ఇలా చెప్పారు: "పూర్వము నరసింహస్వామి అవతరించి, హిరణ్యకశిపుణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్ళకంటుకుని, ఆయన గోళ్ళు విపరీతంగా మంటలు పుట్టసాగాయి. అప్పుడు లక్ష్మీదేవి మేడిపండ్లతోనూ, ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసింది. అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని, 'నిన్ను భక్తితో సేవించిన వారికి విషభాద తొలగుగాక! నిన్ను పూజించినవారి పాపాలు నశించి, అభీష్టాలు నెరవేరుతాయి. నీ నీడనచేసిన జపధ్యానాదులకు అపారమైన ఫలితముంటుంది. మేమిద్దరమూ నీ యందు నివశిస్తాము' అని వరమిచ్చాడు. ఆ వరాన్ని అనుసరించే భగవంతుడైన శ్రీ గురుడు ఆ చెట్టుక్రింద నివశించారు. నేటికీ ఆ విషయంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీ గురుడు నివశిస్తుంటారు.
శ్రీ గురుడక్కడ నివశిస్తున్న రోజులలో అమరేశ్వరుని సన్నిధిలో ఉన్న నలభైమంది యోగినులు మధ్యాహ్నసమయంలో ఉదుంబర వృక్షం క్రిందనున్న శ్రీగురుని దర్శించి, తమ ఆశ్రమానికి తీసుకువెళ్ళి యధావిధిగా పూజించి, ఆయనకు భిక్ష ఇవ్వసాగారు. ఆయన వారి భిక్షను స్వీకరించి, మరలా వచ్చి ఆ వృక్ష మూలంలో కూర్చుంటుండేవారు. అమరాపురంలోని విప్రులకు - స్వామి నిత్యమూ భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది. ఆయన ఆ అడవిలో నిరాహారిగా ఎలా జీవిస్తున్నారో అర్థంకాలేదు. వారా రహస్యాన్ని తెలుసుకోదలచి, ఒక మనిషిని అందుకు నియమించారు. అతడు దాగియుండ, మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు. కాని ఆ సమయమయ్యేసరికి అతనికి, ఒక మహాత్ముని రహస్యం తెలుసుకోబూనడం మహాపాపమని తోచి, విపరీతమైన భయమేస్తుండేది. దానిని తట్టుకోలేక ఒకరోజు అతడు ఇంటికి పారిపోయాడు.
అక్కడకు దగ్గరలోనే గంగానుజుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటబడింది. అకస్మాత్తుగా నదీజలం అడ్డంగా, రెండుగా చీలిపోయింది. అందులోనుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా, యోగినులు కొందరు నది నుండి బయటకి వచ్చి, అచటి మేడిచెట్టు క్రింద కూర్చొనివున్న శ్రీగురుని వద్దకు వెళ్లారు. వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేసుకుని, తర్వాత స్వామిని తీసుకొని, వచ్చిన దారినే నది మధ్యకు వెళ్ళిపోయారు. మర్నాడు గూడా అదే సమయానికి సరిగ్గా అలానే జరగడం చూచి అతడు ఆశ్చర్యపోయి, కొంచెం దూరం వారిని అనుసరించాడు. ఆ నది మధ్యలో ఒక దివ్యమందిరం చూచాడు. వారు దేవకన్యలని, వారిచేత పూజింపబడుతున్న యతి సామాన్య మానవుడు కాడని అతడు గుర్తించాడు. మూడవ రోజు అదే సమయానికి అచటికి వెళ్లి, అతడు ఆ యోగినుల వెనుకనే నదీగర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్లి అచటి మందిర ద్వారం దగ్గర నిలచి, అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు. యోగినులు స్వామిని రత్నఖచిత సింహాసనం పై కూర్చోబెట్టి, పూజ చేసి, నీరాజనం ఇచ్చి, షడ్రసోపేతమైన భోజనం సమర్పించారు. తర్వాత శ్రీ గురుడు, మందిరం నుండి తిరిగివస్తూ గంగానుజుణ్ణి చూచి, ' నీవెవరవు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ' అని అడిగారు. అతడు భయపడి ఆపాదమస్తకమూ వణికిపోతూ, 'స్వామీ ! నా పేరుగంగానుజుడు. నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుక ఇచ్చటికి చూడవచ్చాను. నా అపరాధం క్షమించండి!' అని ఆయనకు నమస్కరించి, ' మీరు సాక్షాత్తూ త్రిమూర్తి స్వరూపులు. అజ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు. నన్నుధరించండి' అని వేడుకున్నాడు. స్వామి సంతోషించి, 'నాయనా! నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి. నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి. కానీ నీవు ఇప్పుడు చూచినది మేమీ ప్రాంతంలో వున్నంతకాలం ఎవరికీ చెప్పవద్దు. చెబితే తక్షణమే నీవు మరణిస్తావు' అన్నారు. గంగానుజుడు అలాగేనని చెప్పి, గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు. అప్పుడే అతనికి అక్కడ ఒక నిధి దొరికింది. నాటి నుండి అతడు ప్రతి రోజూ భార్యాసమేతంగా వచ్చి శ్రీగురుణ్ణి సేవిస్తూ ఉండేవాడు.
ఒక మాఘపూర్ణిమ రోజున గంగానుజుడు యధాప్రకారం శ్రీ గురుణ్ణి దర్శించి, 'స్వామీ, మాఘమాసంలోప్రయాగ, కాశీ, గయలలో స్నానం చేయడం ఎంతో పుణ్యమని చెబుతారు. కాని వాటిని నేను దర్శించనైనా లేదు. ఆ క్షేత్రాల మహత్యము వినినా గూడా పుణ్యం వస్తుందంటారు. కనుక దయతో వాటిని వివరించి చెప్పండి' అని కోరాడు. శ్రీ నృసింహసరస్వతి సంతోషించి, 'ఈ కృష్ణా - పంచనదీ సంగమం సాక్షాత్తూ ప్రయాగయే. త్రిస్థలి అని ప్రసిద్ధికెక్కిన ప్రయాగ, కాశీ, గయ- ఎంతో మహత్తరమైనవి. అలాగే ఇక్కడి సంగమము, యుగాలయము, కరవీరము అనే మూడూ గూడా త్రిస్థలి అని తెలుసుకో. ఈ మూడింటినీ నీకిప్పుడే చూపిస్తాను 'అని చెప్పి, స్వామి పులిచర్మంపై కూర్చొని, గంగానుజుణ్ణి తమ పాదుకలను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకోమన్నారు. క్షణకాలంలో శ్రీగురుడు అతనికి ప్రయాగ దర్శనం చేయించి, మధ్యాహ్నం కాశీలో విశ్వనాధుని దర్శనం చేయించారు. సాయంత్రం అయ్యేసరికి గురు దర్శనం కూడా చేయించి, సూర్యాస్తమయానికి తిరిగి అతనిని సంగమానికి తీసుకువచ్చారు. తర్వాత ఆ త్రిస్థలితో సమానమైన అక్కడ ఉన్న మూడు క్షేత్రాలను కూడా చూపించారు.
ఈ రీతిన ఆ క్షేత్రమహత్యం వెల్లడి చేశాక, శ్రీ గురుడు ఆ చోటు విడిచిపోదలచారు. ఆ సంగతి విని యోగినులు ఆయనను దర్శించి నమస్కరించి,'ప్రభూ ! మీ సేవకులమైన మమ్మల్ని వదిలి పెట్టి ఎక్కడకుపోతారు? ' అని విలపించారు. శ్రీ గురుడు వారిని వూరడించి, ' లోకుల దృష్టికి వెళ్ళినట్లు కనిపించినా, మేము నిజానికి అదృశ్యంగా ఈ ఉదుంబర వృక్షంలోనే ఎల్లప్పుడూ ఉంటాము. మీరు కూడా మనోహరమైన ఈ కల్పవృక్షం లోనే నివశించండి. అమరపురానికి తూర్పుదిశన మా నివాసమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధం అవుతుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్టిస్తాము. మమ్మల్ని, ఈఉదుంబర వృక్షాన్ని, మా పాదుకలను,ద్విజులనూ పూజించి, ఇచ్చట తీర్థాలలో స్నానం చేసినవారికి సర్వపాపాలూ నశించి, అపారమైన పుణ్యం సమకూడి కోరినవన్నీ నెరవేరుతాయి. ఈ వృక్షం క్రింద చేసిన జపము, హోమము, రుద్రాభిషేకము మొదలయిన సత్కర్మలకు కోటిరెట్లు ఫలముంటుంది. ఇచ్చటి పాదుకలను పూజించి, నెమ్మదిగా ప్రదక్షణలు చేసి, ప్రతి ప్రదక్షిణానికి చివర నమస్కారం చేసిన వారికి సర్వరోగాలూ నశిస్తాయి' అని చెప్పి, శ్రీ గురుడు, ఆశ్వయుజ బహుళ ద్వాదశినాడు గంధర్వ నగరంలోని భీమ - అమరజా సంగమానికి వెళ్లారు.
శ్రీ నరసింహ సరస్వతీస్వామి విశ్వరూపుడయిన జగన్నాథుడు. ఆయన సర్వవ్యాపి అయినప్పటికీ, ఈ ఉదుంబర వృక్షంపై ప్రేమతో దాని క్రింద నిత్యనివాసము చేస్తూనే ఉన్నారు. "
పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తము
శ్రీ దత్తాయ గురవేనమః
శ్రీ పాద శ్రీ వల్లభాయనమః - శ్రీ నృసింహ సరస్వత్యైనమః
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box