Friday, May 15, 2020

గురు చరిత్ర అధ్యాయము -26


అధ్యాయము  -26




                                

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 

              నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో, "స్వామీ ! శ్రీ గురుడు విద్యా వంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు?" అని అడిగాడు. అందుకు సిద్ధముని ఇలా చెప్పారు:            

                        "శ్రీ గురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూడులకిలా  బోధించారు: 'నాయనలారా! మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేదవిదులమనుకోవడం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్ధమే గాని -- ధనము, కీర్తి,  అహంకారము గావు. సమదర్శనమే పండిత లక్షణం. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్నవారెవరూలేరు. వేదము ఆద్యంతరహితము, అపారము. దానిని పూర్తిగా తెలుసుకొనడం  బ్రహ్మదేవునికే  సాధ్యపడలేదు.  


               పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి,  బ్రహ్మచర్యమవలంభించి,  బ్రహ్మదేవుని వరంతో మూడుసార్లు దీర్ఘాయువు పొందాడు. నాలుగు యుగాలూ ఐదు వేల సార్లు పునరావృతమైతే బ్రహ్మకు ఒక పగలు. అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువువద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే, బ్రహ్మసాక్షాత్కరించి, 'వేదం పూర్తిగా నాకే తెలియదు. వేదరాశిని చూపుతాను, చూడు!' అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు.భరద్వాజుడది చూచిభయపడి, 'అయ్యో!  నేనింతకాలం పఠించిన వేదమంతా కలసి యిందులో ఒక్క పిడికిడైనా లేదే! వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమౌతుందా?' అని తలచి, "నాకవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి" అన్నాడు. అప్పుడు బ్రహ్మ, అనంతమైన ఆ వేదరాశినుండి మూడు పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి, "ఇదంతా అధ్యయనం చేసేంతవరకూ నీవు జీవింతువు గాక!" అని వరమిచ్చాడు. కాని ఆ మూడు పిడికెళ్ళ వేదమూ అధ్యయనం చేయడమే అతనికి యింతవరకూ పూర్తిగాలేదు. కనుక సాక్షాత్తూ నారాయణుడే బాదరాయణుగా అవతరించి, వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి, వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒకొక్కవేదం చొప్పున తెలిపాడు.వారు కల్పాంతం వరకూ అభ్యసించిగుడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు నాలుగు వేదాలనూ సంపూర్ణంగా అధ్యయనం చేసామనుకోవడం ఎంత తెలివి తక్కువ!


            వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికీ సాథ్యంగాదు గనుకనే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించాడు.ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి, దానిని ధ్యానించడానికై దానిని గురించి యిలా  చెప్పాడు: ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదము. ఆత్రేయస గోత్రం. గాయత్రి ఛందము. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ. ఎర్రని వర్ణము, తామరరేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గిరజాలజుట్టు, వంకమీసమూ కలిగి, అమ్మ రెండుమూరల పొడవైన దేహం గలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయపారము, క్రమపారము, జట, రధక్రమము, దండక్రమము అనే భాగాలున్నాయి. ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి. ఈవేదానికి అశ్వలాయని, సాంఖ్యాయని, శాకల, భాష్కలా, మాండుకేయులనే ఐదు శాఖలున్నాయి". వాటిని  ఆనాడు వ్యాసుడు పైలునికి  చెప్పాడుగాని, ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివినవారెవరు?   


                తర్వాత వ్యాసమహర్షి తన రెండవ శిష్యుడైన వైశంపాయునికి యజుర్వేదం చెప్పి,  దాని లక్షణాలు ఇలా చెప్పారు: "యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము. భారద్వాజసగోత్రము, త్రిష్టుప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలం  ధరించి సుమారు అయిదు మూరలు పొడవున్న తామ్రవర్ణ  శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖలలో ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి. యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము. ప్రతిపదము,  అనుపదము, ఛందస్సు,  భాష,  ధర్మము,  మీమాంస,  న్యాయము, తర్కము అనే ఎనిమిది దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము,  వ్యాకరణము,  నిరుక్తము, ఛందస్సు,  జ్యోతిషము అనే ఆరు అంగాలు దీనికున్నాయి" ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశం పాయనునికి వివరించి చెప్పి, వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జైమిని కి సామవేదాన్ని ఇలా వివరించాడు:   


                               " దీనికి ఉపవేదము గంధర్వము. విష్ణువు అధిదేవత, జగతీచ్చందస్సు. కాశ్యపసగోత్రము. దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రము,  చర్మము, దండము ధరించి ఆరుమూరలు పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీరఛాయ తెలుపు; శమము,  దమము మొదలైన దైవీసంపదగలవాడు. సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి.ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు".            



                    వ్యాసమహర్షి సుమంతుడు అనే శిష్యునికి అధర్వణవేదం చెప్పి,  "దీనికి అస్త్రరూపం ఉపవేదము.గోత్రము బైజానకము.  ఇంద్రుడు అధిదేవత.త్రిష్టుప్ఛందస్సు. అధర్వణ వేదపురుషుడు తీక్షణమైనా ఆకారము, నల్లని వర్ణమూగల కామరూపుడు. ఏకపత్నీవ్రతుడు.ఏడుమూరల పొడవు.ఈ వేదానికి తొమ్మిది శాఖలు, అయిదు కల్పాలు ఉన్నాయి. 


            పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా  నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమాచారనిరతులేందరో భరత భూమిలో ఉండేవారు. కనుకనే వేదాలన్నీ  నిలువగలిగాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మబ్రష్టులవుతున్నారు గనుక,  ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది. పూర్వపు బ్రాహ్మణులలో దైవత్వము,  మహత్తు ఉండేవి. అందుకే వారిని భూసురులు  అనేవారు. రాజు కూడా వారిని సేవించేవాడు.వారు ఎంత ధనమిస్తానన్నా లెక్కజేయక,  భోగాలపట్ల  నిర్లిప్తులుగా ఉండేవారు. వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులై ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తుండేవారు. మాటమాత్రం చేత గడ్డిపరకను మేరుపర్వతంగాను,  మేరుపర్వతాన్ని గడ్డిపరకగానూ మార్చి వేయగలిగి ఉండేవారు. జగత్తంతా దేవతలకు ఆధీనము: దేవతలందరూ మంత్రాధీనులు; మంత్రాలన్నీ బ్రాహ్మణుల అధీనంలో ఉండేవి. వారిని విష్ణువు కూడా పూజించేవాడు. కాని ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో లొంగి, మ్లేచ్చుల  ఎదుట కూడా వేదం  చదువుతున్నారు. అట్టివారి ముఖమైన చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేద వేత్తలమని విర్రవీగుతూ,  ద్విజులందరినీ ఈ  విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి? మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించినదెవరు?  మిమ్మల్ని మీరు పొగుడుకొని,   జయపత్రాలు పోగుచేసుకొనడమే గాక,  త్రివిక్రముని గూడ జయపత్రికను ఇవ్వమంటున్నారే! ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొనితెచ్చుకోవద్దు.  ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి' అన్నారు. కాని  ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయ పత్రికనైనా యివ్వమనీ  కోరారు".

ఇరవై ఆరవ అధ్యాయము సమాప్తము

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

 

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...