Saturday, May 2, 2020

గురు చరిత్ర అధ్యాయము -17



అధ్యాయం -17



                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                                                                                 

శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 




                   సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు; "నాయనా,  మబ్బు వేసేముందు చల్లనిగాలి వీచినట్లు, గురుకథ వినడంలో నీకు, అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని భక్తులపాలిట కామధేనువు,  కల్పవృక్షం అయిన యీ శ్రీ గురుచరిత్ర చెబుతాను విను:   
                 
            శ్రీ గురుడు కృష్ణాతీరంలో బిల్లవటి వద్దనున్న మేడిచెట్టు దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాస్యం చేసారు". అది వినగానే నామాధరకుడు  నమస్కరించి."స్వామీ,  భగవంతుడైన శ్రీ గురుడు తపస్సు, అనుష్ఠానము ఎందుకు చేశారు?  అందరికీ అన్ని సమర్పించగల ఆయన భిక్ష  చేసుకోనడమెందుకు? "అని అడిగాడు.


                    సిద్ధయోగి, "నాయనా! భగవంతుడైన శివుడు, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడూ భిక్ష చేయలేదా? మహాత్ములు తీర్థయాత్ర చేయడము,  తపస్సు చేయడమూగానీ, బిక్షమెత్తడం గానీ భక్తులనుద్దరించడానికి,  సాధకులకు సన్మార్గము తెలియజెప్పడానికీ మాత్రమే చేస్తారు. అలానే  శ్రీ గురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు. భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమతీర్థాల నెన్నింటినో తిరిగి ప్రకటం  చేయడానికే తీర్థయాత్రలు చేసారు. కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించేమూర్ఖులు,  స్వార్ధపరులు తమనాశ్రయించకుండా చూసుకోడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు. కాని  సూర్యుని తేజస్సు,  కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడీ  విధంగా వెల్లడయింది.  


                 కరవీరపురంలో వేదశాస్త్రపురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కణ్వశాఖీయుడు,  మహాపండితుడు అయిన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు,  మేనమామ గ్రామస్థులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరం లో ఉపనయనం చేశాడు. కానీ మతిమరుపువల్ల అతడు గాయత్రీ మంత్రానుష్టానం కూడా చేయలేకపోయేవాడు. ఉపనయనం చేసిన ఒక సంవత్సరానికే మేనమామ గూడ మరణించడంతో అతడు అనాధుడై  బిక్షకెళ్ళేవాడు. ఊళ్లోని జనం అతనిని, 'ఒరే  మందమతీ! అంతటి మహాపండితుని  పేరు చెడగొట్టిన నీవు  ఎందులోనైనా దూకిచావరాదా? నీ జన్మం వ్యర్థం,  విద్యావంతుడు వయస్సులో చిన్నవాడైనా, అతను ఎక్కడికి వెళ్ళినా సోదరునివలె విద్య అతని వెంటనుండి అతనికి కీర్తి,  గౌరవము లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వ దేవతలు నివశిస్తారు. గనుక,  అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే.  విద్యలేనివాడు వయస్సులో పెద్దవాడైనా  అతనినెవరూ  ఆదరించరు. విద్యలేని నీవు పశువు కంటే హీనం', అని హేళన చేసేవారు.        


              అతడు అందుకు బాధపడి,  'అయ్యా మీరు చెప్పినది నిజమేగానీ నేనేమి చేయగలను?  పూర్వ జన్మలో నేను విద్యాదానం చేయలేదు గాబోలు,  నాకీదుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి' అని ప్రాధేయపడేవాడు. అతనికి విద్య చెప్పిచెప్పి విసిగిపోయిన ఆ విప్రులు, 'నీకిక జన్మలో విద్యరాదు. నీవు బిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు. నీవలన వంశమే భ్రష్టమైంది', అని నిందించేవారు. ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహచెంది, ఇల్లు విడిచి భిల్లవటి చేరి, కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరీ దేవిని దర్శించి,  అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. అలా మూడురోజులు గడిచినా ఆ తల్లి దర్శనమీయకపోయేసరికి. అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాలవద్ద పెట్టి, 'అమ్మా! నీవు కూడా నన్ననుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి, నీ  ఎదుటనే ప్రాణాలు విడుస్తాను' అని చెప్పుకున్నాడు. నాటి రాత్రి, దేవి అతడికి కలలో కనిపించి,  'నాయనా! నాపై అలుగవద్దు. కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము. అపారశక్తిమంతుడు. నీ కోరిక తీర్చగలడు'.  అని చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయల్దేరి, శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారము  చేసాడు. శ్రీ గురుడు ప్రసన్నులై  అతని శిరస్సు మీద తమ చేయినుంచి ఆశీర్వదించారు. అతనికి వెంటనే నాలుక రావడమేగాక, సకల విద్యలూ సిద్ధించాయి. కాకి మానససరోవరం చేరి రాజహంసగా మారినట్లు, పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు,  శ్రీగురుని హస్త స్పర్శ వలన ఆ విప్ర కుమారుడు మహాజ్ఞాని అయ్యాడు. శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమ గల దయింది". 

పదిహేడవ  అధ్యాయము సమాప్తము


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః 

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...