Tuesday, May 12, 2020

గురు చరిత్ర అధ్యాయము -25


అధ్యాయము  -25

                              

శ్రీ గణేశాయనమః    
శ్రీ సరస్వత్యేనమః                                                                            శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 



    అటుపైన శ్రీ గురుడు చేసిన దివ్య లీలలను  వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధమని ఇలా చెప్పారు: ' ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు. అతడు హిందూమత ద్వేషి, ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలోగల వేద వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని, తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు. అందుక అంగీకరించని వారికి ధనాశ చూపుతుండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచారపరులు అలా చేయడం తమవల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలను  ఆశించి,  వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతుండేవారు. యజ్ఞకాండలోని అంశాలు వారినుండి విని,  ఆ దుష్టుడు,  యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు, ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికి వచ్చినంత సంభావనలు యిస్తుండేవాడు. ఆ సంగతి విని,  ధనాశపరులు ఎందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే  వచ్చి వేదార్థం చెప్పసాగారు.


               ఒకనాడు ఉత్తరాది నుండి వేదపండితులైన బ్రాహ్మణులు ఇద్దరు  వచ్చి ఆ రాజును దర్శించి,  'రాజా! సకల విద్యలలోనూ మాకు సాటిఅయినవారు ఎక్కడా లేరు. మేము దేశంలోని పండితులను శాస్త్ర వాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి. మా ప్రతిభ నిరూపించగలము'అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి,  ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి,  నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి, ఆ పండితులను వాదనలో ఓడించినవారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని, ఓడిన వారిని దండించగలననీ ప్రకటించాడు. అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టులఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు,  తమకంతటి సామర్ధ్యం లేదని చెప్పి తప్పుకున్నారు. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలిచ్చివేయక తప్పలేదు. అప్పుడా రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు,ఆభరణాలు,భారీఎత్తున కానుకలూ బహుమానమిచ్చి ఏనుగునెక్కించి,  మేళతాళాలతో ఊరేగించాడు. వారికొక అగ్రహారంగూడా ఇచ్చాడు. వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది.  


                                 అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి,  ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో,  'అయ్యా! మా పాండిత్యము,  మా ప్రతిభా ఇక్కడంతా తెలిసి పోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాని వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనం ఏమిటి? కనుక మీరు సెలవిస్తే మేమీ రాజ్యమంతటా సంచారం చేసి,  పండితులందరితో వాదించ దలచాము. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకు రాగలము' అని చెప్పారు. రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగుల నెక్కి దక్షిణదిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయజయధ్వానాలతో, పర్యటిస్తూ, ఒకరోజు కుమసీ గ్రామానికి వచ్చారు. అచట త్రివిక్రమభారతి వేదవేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి, ' ఏమయ్యా! నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు. లేకుంటే, ఓటమి అంగీకరిస్తూ మాకు జయ పాఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైన ఇవ్వు!' అన్నారు.                                             

                     అందుకు త్రివిక్రమ భారతి,  'అయ్యా!నాకు వేదం రాదు. వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజ సన్మానాలు అందుకుంటూ భోగాలు  అనుభవించేవాడినేగదా?  నేను ఈ అరణ్యంలో ముక్కుమూసుకుని కాలక్షేపం చేస్తున్న భిక్షువును. నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాతో వాదించడం,  కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది' అని చెప్పాడు. ఆ పండితులు,  అయ్యా! మాతో వాదించగల వారు మాకు ఎక్కడా కనిపించలేదు. కనుకనే మాకు లెక్కలేనన్ని జయ పత్రాలు లభించాయి. అలాగే నీవు కూడా ఒకటి రాసివ్వు, లేదా మాతో వాదించి' అని పట్టుబట్టారు. అప్పుడా సన్యాసి, 'వీరికి గర్వం తలకెక్కింది. ఒళ్ళు పై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు. వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను' అని ఆలోచించుకుని వాళ్లతో ఇలా అన్నాడు: 'పండితొత్తములారా! నేను స్వతంత్రుడను గాను; గంధర్వపురంలో మా గురుదేవులు ఉన్నారు. వారి ఆజ్ఞ తీసుకుని మీరు కోరినట్లే ఆ రెంటిలో ఏదో ఒకటి చేయగలను. మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి'.                     


        అందుకా మదాంధులంగీకరించి గంధర్వపురానికి బయల్దేరారు. త్రివిక్రమభారతి, వినయంతో కాలినడకన వెళుతుంటే, ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చుని వెళ్తున్నారు. సాధుసత్పురుషుల వద్దకు వెళ్లడం వలన ఆయుః  క్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు. గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమభారతి శ్రీగురునికి నమస్కరించి, ఆనందభాష్పాలు కారుస్తూ, గద్గదస్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించి, 'పరాత్పరా! గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లే, అజ్ఞానాంథులు మిమ్మెరుగలేరు మీ చేత వారికి హితం చెప్పించడానికై  వారినిక్కడకు  తీసుకువచ్చాను.
ఈ మదాంధుల బారి నుండి నన్ను,  వేదధర్మాన్ని కాపాడండి!! మీ ఆజ్ఞ కోసం వచ్చాను. మీరు ఏది చేయమంటే అది చేస్తాను' అని ప్రార్థించాడు. వాళ్ళు, 'మా కాలం వ్యర్థం అయింది. ఇతడు జయపత్రం ఇవ్వడు, వాదభిక్ష ఇవ్వడు. మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు కనుక,  మీ గురుశిష్యులలో ఎవరైనా ఆ రెండింటిలో ఏదో ఒకటి చేసి తీరాలి' అన్నారు. శ్రీ గురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు: ' అయ్యా! మీ వంటి వేదవిధులకు, వాదించడం వలన కలిగే ప్రయోజనమేమున్నది? వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభం ఏమిటి? యతులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము, ఓడినందువలన చిన్నతనమూ  ఏమీ  కలుగవు. అటువంటి మావలన మీకేమీ ప్రయోజనము?  అన్నారు. అందుకు వారిద్దరూ, 'అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రమివ్వక, మమ్మల్ని ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చాడు? కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే,  మాతో వాదానికి రండి; లేకుంటే జయ పత్రమైనా  ఇవ్వండి' అని పట్టుబట్టారు.       


                                     అప్పుడు శ్రీ గురుడు నవ్వి, 'అయ్యా! వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యంకాలేదు. వేదాలు అపారమైనవి. అటువంటప్పుడు వేదవిదులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది. ఈ జయపత్రికల వల్ల ప్రయోజనమేమున్నది ? మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి' అన్నారు. అప్పుడు వాళ్లు రోషంతో, 'అయ్యా! మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము. మమ్మల్ని  మించిన వారు ఎవరూ లేరు' అన్నారు". 


ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తము.

శ్రీ దత్తాయ గురవేనమః 
శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...