అధ్యాయము -24
శ్రీ గణేశాయనమః
శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః
కథారంభము
సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు : "త్రివిక్రమభారతి శ్రీ గురుని నిందిస్తున్నాడని విని, రాజు ఒక రోజు స్వామితో, 'స్వామి! అతడు మిమ్మల్ని నిందిస్తూ ఉంటే మీరు ఊరుకుంటారేమిటి? అతని అజ్ఞానాన్ని తొలగించరాదా? ' అని వేడుకున్నాడు. శ్రీ గురుడు అంగీకరించి బయల్దేరారు. రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి, పల్లకిలో కూర్చోబెట్టి, రాజలాంఛనాలతో కుమసీ గ్రామానికి తీసుకు వెళ్ళాడు.
ఆ ఊరేగింపు మహా వైభవంగా కుమసీ గ్రామం సమీపించే సమయానికి, త్రివిక్రమభారతి పూజ చేసుకుంటున్నాడు. ప్రతిరోజూ నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు. త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు. కానీ ఆరోజు అతడు ఎంత ప్రయత్నించినా ఇష్ట దేవతామూర్తి దర్శనమీయలేదు. త్రివిక్రముడు ' స్వామీ! నరసింహా! ఈరోజు మీరు నన్ను ఎందుకు కరుణించలేదు? ఎంతోకాలంగా చేస్తున్న నా తపస్సంతా యీరోజు భంగమైంది. ఇక నేనేమి చేయగలను? 'అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు. వెంటనే అతని మనస్సులో, సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై, 'ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను. అక్కడికి వచ్చి దర్శించుకో!' అని దివ్యవాణి వినిపించింది. త్రివిక్రమభారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు.కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి, శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేసాడు. మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు, పరివారము, గూడ యతులలాగ కనిపించారు. త్రివిక్రమభారతి నివ్వెరబోయి అంత మంది సన్యాసులతో శ్రీగురుని గుర్తించలేక 'స్వామీ! త్రిమూర్తిస్వరూపా! వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను. నాపై కృపతో మీ నిజస్వరూపం దర్శింపజేయండి. ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనమనుగ్రహించారు. యీ రోజు నా తపస్సు ఫలించింది. అందువలననే మీదర్శనం లభించింది' అన్నాడు. శ్రీగురుడు సంతోషించి తమ నిజస్వరూపంతో కనిపించించారు. అంతకు ముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై, వాటి స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు, పరివారము కనిపించారు. స్వయంగా రాజుచేత వింజామరలతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులార చూచాడు. అప్పుడు శ్రీగురుడు, 'త్రివిక్రమా! ఎవరిని దాంభికుడనీ, భ్రష్టుడనీ నిందించావో, ఆ సన్యాసియే మేము. మేమిపుడే నిన్ను పరీక్షించాము. నృసింహభక్తుడవైన నీవు మమ్ములను ఏ కారణంగా విమర్శించావు? దంభిలక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను. నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయమేమిటో వివరించు!' అన్నారు.
శ్రీ గురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే గాక, ఆయన ప్రసాదించిన దివ్యదర్శనంతో పరవశించిన త్రివిక్రమభారతి శ్రీగురునికి నమస్కరించి, ' సద్గురూత్తమా! మీరు మానవరూపంలో అవతరించడం వలన నేను తెలియక మూడునివలె ప్రవర్తించాను. నన్ను క్షమించండి. విదురుని వద్దకు, ద్రౌపది వద్దకూ అనుగ్రహించ వచ్చిన శ్రీకృష్ణునివలె, నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు. మీరు సాక్షాత్తూ త్రిమూర్తి స్వరూపమైన పరమేశ్వరులే. పగటి వెలుగును చూడలేని గుడ్లగూబ వలె, అజ్ఞానినయిన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి, మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపజేసి, ఆత్మయనే ఒడ్డు చేర్చండి. భారతంలో అర్జునునికి శ్రీ కృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను. గాని, ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను. బేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణివలె మీరు నాకు ఈనాడు లభించారు. మీరే నా ఉపాస్యదైవమైన నృసింహస్వరూపులు. శరణు శరణు!' అని స్తుతించాడు. శ్రీగురుడతనిని అనుగ్రహించి 'త్రివిక్రమా! నీ భక్తికి సంతోషించాము. నీవు నృసింహస్వామికి చేసే అనుష్టానం మాకే చెందుతుంది. అదే చేస్తూండు. నీకు పునర్జన్మలేదు. నీకు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవగలవు!' అని ఆశీర్వదించి, త్రివిక్రమభారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు. తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ, పరివారంతోనూ, 'మాకు అనుష్టాన సమయం అయింది. మేము ముందుగా వెళ్తాము. మీరు వెనుక రండి!' అని చెప్పి, మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు. తర్వాత శ్రీ గురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు.
కనుక నామధారకా ! శ్రీ గురుడు భగవంతుడుకాడని, మానవమాత్రుడేనని తలచేవాడు ఏడు జన్మలు నరకమనుభవిస్తాడు. గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి. నా మాటపై విశ్వాసముంచి లోకులు శ్రీగురుపాదాలను ఆశ్రయింతురు గాక! అందరికీ అందుబాటులో ఈ గురుకథ అనబడు చలివేంద్రమును స్థాపించాము. దీనినుండి ప్రజలు గురుకథామృతమును సేవింతురు గాక!" అన్నారు సిద్ధయోగి.
ఇరవైనాలుగవ అధ్యాయము సమాప్తము
శ్రీ దత్తాయ గురవేనమః
శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః - శ్రీ నృసింహ సరస్వత్యైనమః
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box