అధ్యాయము -20
శ్రీ గణేశాయనమః
శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః
కథారంభము
నామధారకుడు సిద్ధమనికి నమస్కరించి, "స్వామీ ! శ్రీ గురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరపురంలోని ఉదుంబర వృక్షం క్రింద నివశిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారని చెప్పారు కదా! అటువంటి అనుభవము ఎవరికైనా కలిగినదా? " అని అడిగాడు. సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు :
" నాయనా, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పడం ఎవ్వరి తరమూకాదు. అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెబుతాను విను. ' శిరోల ' అనే గ్రామంలో వేదశాస్త్రపరాయణుడు, ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారుగాని, ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతలను పూజించింది. ఎన్నో వ్రతాలు, ఉపవాసాలు చేసింది. అయినా ఆమెకర్మ తీరలేదు. చివరకు ఆమె తన శోకానికి కారణము, నివారణోపాయం తెలుపమని అని ఒక దైవజ్ఞుని కోరింది. అతడు, ' అమ్మా ! నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వ పాపమే. గర్భపాతం చేసినా, ఇతరుల ధనం అపహరించినా, తర్వాత జన్మలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. నీవు గత జన్మలో శౌనక గోత్రుడయిన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకుని, అతడెంత బ్రతిమాలినా తిరిగి ఇవ్వలేదు. అతడా దిగులుతో ఆత్మహత్య చేసుకొని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవీకర్మ అనుభవించక తీరదు' అని చెప్పాడు. ఆమె పశ్చాత్తాపంతో అతని పాదాలపై బడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, ' అమ్మా! ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందు వలన అతనికి శ్రాద్ధకర్మలు ఎవరూ చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవడము, అంత్యక్రియలు జరగకపోవడమూ - ఇవన్నీ నీ వలననే జరిగాయి. గనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డలను చంపుతున్నాడు. కనుక నీవు ఒక నెల రోజుల పాటు పంచగంగా స్నానం చేయాలి. నిత్యమూ ఏడుసార్లు మేడి చెట్టుకు యధావిధిగా ప్రదక్షణము, పూజ చేసి, శ్రీ గురుని పాదుకలకు పూజ, అభిషేకము చేస్తూ, ఉపవాసము చేయి. అటు తర్వాత నీవు అతనికి అంత్యక్రియలు చేసి, అతని సగోత్రికుడైన ఒక బ్రాహ్మణునికి నీవు అపహరించిన వంద రూపాయలు దానమివ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానము నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగి, శ్రీ గురుని అనుగ్రహం వలన పూర్ణాయుర్దాయం గల కొడుకులు కలుగుతారు'.
ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా, ' అయ్యా, నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాస వ్రతం ఆచరించగలను గాని, ఆ బ్రాహ్మణుని సగోత్రునికి దానం ఇవ్వడానికి నా వద్ద అంత పైకము లేదు. మరి నేను ఏమి చేయాలి? ' అని వాపోయింది. ఆ దైవజనుడు, 'అమ్మా, అలాగైతే నిర్మలమైన మనస్సుతో నేను చెప్పినట్లు శ్రీ గురు పాదుకలను అర్చించి నీ శక్తి మేరకు దానం ఇవ్వు. ఆ ఉదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీ గురుడు పరమ దయా మూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు' అని చెప్పాడు.
అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్లి దీక్షగా ఆ వ్రతమాచరించనారంభించింది. మూడవ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకు పట్టి స్వప్నం వచ్చింది. కలలో ఆ పిశాచం కనిపించి, ఆమెను భయపెట్టి, తన సొమ్ము తిరిగి ఇవ్వకుంటే ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు. అప్పుడామె మేడిచెట్టు వద్దకు పరుగెత్తింది. అక్కడ శ్రీ గురుడున్నాడు! ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీ గురుడామెకు అభయమిచ్చి ఆమె మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు. అప్పుడా పిశాచం ఆయనతో, తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి, 'స్వామీ, తపస్వలు, యతీశ్వరులు అయిన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు' అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీ గురుడు కోపంతో, ' నీవు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను. ఈమెనిలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే గాని, లాభం ఏమిటి? ఈమె నీ డబ్బు అపహరించినది పూర్వజన్మలో కదా! ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అందువలన ఈమెచేత ఊర్ధ్వదైహిక కర్మలు చేయించి యధాశక్తి దానం ఇప్పిస్తాము. నీకు సద్గతి ప్రసాదిస్తాము. మేము చెప్పినది నీకు నచ్చితే సరే. లేకపోతే నీకీ దుస్థితి తప్పదు. మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాము ' అన్నారు. ఆ పిశాచం, 'స్వామీ ! మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది. మీరెలా చేసినా సంతోషమే' అన్నాడు. శ్రీ గురుడు శాంతాదేవితో, 'అమ్మా ! నీవు యధాశక్తి పైకం వెచ్చించి, అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్యా దోషం తొలగి, పూర్ణాయువు గల కొడుకులూ, కూతుళ్లూ కలుగుతారు' అని చెప్పి, వెనుక దైవవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకాయన విధించారు. ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి 16 వ రోజున ఆ బ్రాహ్మణునికి ఊర్ధ్వదైహిక కర్మ చేయించింది. ఆమెకు బ్రహ్మహత్యా దోషము, ఆ బ్రాహ్మణునకు పిశాచత్వము తొలగిపోయాయి.
తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీ గురుడు కలలో కనిపించి, రెండు కొబ్బరి కాయలు ఆమె ఒడిలో వేసి, 'అమ్మా ! నీ వ్రతము పూర్తి అయిందికదా? పారాణకు ఈ కాయలు వాడుకో! నీకు నిస్సందేహంగా వేదవిదులు పుడుతారు' అని చెప్పారు. ఆమె నిద్రలేచి చూచేసరికి, నిజంగానే ఆ రెండు ఫలాలూ ఆమె ప్రక్కన వున్నాయి! ఆమె వెంటనే ఆ కల గురించి తన భర్తకు చెప్పింది. ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి, వాటిని పారణకు ఉపయోగించారు. తర్వాత కొద్దికాలానికి ఆమెకు ఇద్దరు మగ పిల్లలు కలిగారు. పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరం రెండవ వానికి మూడవ సంవత్సరము రాగానే పెద్ద వానికి ఉపనయనయనము, రెండవ వానికి చౌల సంస్కారము (పుట్టు వెంట్రుకలు తీయించుట) చేయాలని ముహూర్తం నిర్ణయించి, ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి, మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికల్లా అతడు చనిపోయాడు. ఆ తల్లి శోకంతో తలను నేలకు కొట్టుకున్నది;గుండెలు బాదుకున్నది; చివరకు ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలచుకొని తలచుకొని అతని శవంపైబడి ఇలా శోకించింది: 'నాయనా, మా ప్రాణరక్షకుడవు, వంశోద్ధారకుడవు అయిన నీవు మమ్మల్ని విడిచి పోవడానికి నీ మనస్సు ఎలా అంగీకరించింది? ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక అశోకం మరచాను. శ్రీ గురుడు వరమిచ్చినందువల్ల నీ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాను.
అప్పుడక్కడి జనులు ఇలా ఆమెను ఓదార్చారు: 'అమ్మా, నువ్వు ఇలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళి బ్రతుకుతాడా? మృత్యువు దేవతలను, ఋషులను, రాక్షసులను, అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు. మానవులమైన మనకు ఎలా తప్పుతుంది? నువ్వు ఆలోచించు. ఇలా దుఃఖించవద్దు.'అది విని ఆమె, 'నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి, సాక్షాత్తూ శ్రీ గురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకవాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైన విడుస్తాను,' అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది. ఆమె శ్రీగురుని స్మరించి, 'స్వామీ, త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇది ఏమి గతి? నేను మీరు చెప్పినట్లు ఈ ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితమిదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు. పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణుపొందిన నాకు ఇదేమీ ఫలితము? పులి నుండి పారిపోతున్న ఆవు కసాయి వానిని శరణుపొందినట్లున్నది; తన కష్టాలు నివారించుకోడానికి దేవాలయంలో ప్రవేశించిన వానిపై ఆలయం విరిగిపడినట్లైంది. నాకు యింతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు? 'అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే వున్నది.
మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, 'అమ్మా, నీవిలా శోకించినందువలన లాభమేమి? జరగవలసినది జరుగకుండా తప్పుతుందా? నీవీ మూర్ఖత్వం విడిచి, శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాము' అని చెప్పారు. కాని ఆమె మాత్రం తన పట్టు విడవక, 'ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తేయిస్తాను గానీ, లేకుంటే యివ్వను' అని చెప్పి, ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకున్నది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి, 'బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడమన్నది మేము కనీ వినీ ఎరుగము. ఇదెక్కడి ధర్మము?' అనుకున్నారు.ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్నా శవాన్ని వారికప్పగించలేదు. చివరికామె శ్రీగురుని మీద నిష్ఠూరమాడుతూ, తానూ ఆ బిడ్డతో సహా ప్రాణ త్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరింది. జనులంతా ఆమెననుసరించారు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్వముపదేశించాడు. అతడెవరో కాదు - త్రిమూర్తి స్వరూపము, భక్తవత్సలుడూ అయిన శ్రీ గురుడే!
ఇరవయ్యవ అధ్యాయం సమాప్తము
శ్రీ దత్తాయ గురవేనమః
శ్రీ పాద శ్రీ వల్లభాయనమః - శ్రీ నృసింహ సరస్వత్యైనమః
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box