Saturday, May 9, 2020

గురు చరిత్ర అధ్యాయము -22

*** శనివారము పారాయణ ప్రారంభం ***

అధ్యాయం -22




శ్రీ గణేశాయనమః                          
శ్రీ సరస్వత్యేనమః                                                                                                 
శ్రీ గురుభ్యోనమః 

కథారంభము 


                                    నామధారకుడు, "సిద్ధమునీ, మీ వలన నాకు అజ్ఞానాంధకారము  తొలగి, జ్ఞానోదయం అయింది. అందువలన మీరే నా గురుదేవులు. కామధేనువు వంటి శ్రీ గురుచరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు. శ్రీ గురు కథ నా మనసును హరిస్తున్నది.  అటుపైన ఏమి జరిగిందో సెలవియ్యండి" అని ప్రార్థించాడు. సిద్ధయోగి, " నాయనా, నీకు గురుకృప  లభించింది. నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ గూడ  ధన్యమైంది.       

                          అటు తరువాత శ్రీ గురుడు ఈ గంధర్వపురం చేరి,  భీమ- అమరజా సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది.ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తరదిక్కుగా ప్రవహిస్తాయి. కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలున్నాయి. ఇక్కడ కూడా శ్రీ గురుడు అదృశ్యరూపంలో నిత్యనివాసం చేస్తున్నారు. ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలున్నప్పటికీ,  మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే  ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమవనీయక, గుప్తంగా సాదుజీవితం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ, దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్లేవారు. ఆ గ్రామంలో సుమారు నూరు బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వారంతా వేదవిధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పతివ్రత.వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది. గ్రామంలోని రైతులు దానిని మట్టి, ఇసుక మొదలైనవి మోయించుకోడానికై  అద్దెకు తీసుకెళ్తుండేవారు.అతడు యాయవారం (భిక్షాటన) తోనూ, గేదె పై వచ్చు బాడుగలతోనూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.                


                      శ్రీ నృసింహసరస్వతీ స్వామి తరచూ వీరి ఇంటికి బిక్షకు వెళ్లేవారు. అది చూచి కొందరు గ్రామంలో శ్రోత్రీయులము,   శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమందిమి  ఉండగా, ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర  బ్రాహ్మణుని ఇంటికే  వెళ్ళాలా? అక్కడ ఆయనకేమి దొరుకుతుంది? అని విమర్శిస్తుండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్లక పేదవాడైనా విదురుని ఇంటికే  వెళ్ళాడు. భగవంతునికి సత్వగుణమందే ప్రీతిగాని, ధనమదంతో చిక్కిన వారితో ఆయనకేమి పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రుడికి గూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మ లిపి కూడా మారవలసిందే!      


                     ఒక వైశాఖమాసంలో మధ్యాహ్నపుటెండ  నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీ గురుడు వారి ఇంటికి భిక్షకు వెళ్లారు. ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. శ్రీ గురుడు వాకిట్లో నిలచి.'భవతీ భిక్షాందేహి' అన్నారు. ఆ ఇల్లాలు నమస్కరించి,'స్వామీ,  యజమాని యాయవారానికై గ్రామంలోకి వెళ్ళారు. వారొచ్చే సమయమైంది. కోపగించక  దయతో కొద్దిసేపు మీరీ ఆసనం మీద కూర్చొండి' అని  పీట వేసింది.  


                               శ్రీ గురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో, 'నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు. మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు. మీ ముంగిట ఉన్న బర్రె పాలు కొంచెం ఇచ్చినా చాలు!' అన్నారు. అప్పుడామె, 'స్వామీ  ఇది గుడ్డుబర్రె.ఒక్కసారైనా కట్టనూ లేదు, ఈననూ లేదు. ఇప్పుడు ఇది ఎంతో ముసలిది. పళ్ళు కూడా ఊడిపోతున్నాయి. దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము' అన్నది. శ్రీ గురుడు అదేమీ పట్టించుకోకుండా 'ఎందుకు ఈ వట్టి మాటలు? అయినా పాలు పితుకు చూస్తాము!' అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యం!  ఆ గొడ్డుబర్రె రెండుపాత్రలనిండుగా పాలు ఇచ్చింది.ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తూ పరమేశ్వరుడేనని  తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది.శ్రీ గురుడు ఆ పాలు త్రాగి సంతోషించి, 'అమ్మా, మీరు అఖండ ఐశ్వర్యం తోనూ, పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు' అని ఆశీర్వదించి సంగమానికి వెళ్లిపోయారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని,  భార్యతో గూడ సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది" అన్నారు సిద్ధయోగి. 

ఇరవై రెండవ అధ్యాయం సమాప్తము.

                            
శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...