Tuesday, June 9, 2020

గురు చరిత్ర అధ్యాయము -49


అధ్యాయము  -49




                               
శ్రీ గణేశాయనమః 
                            
శ్రీ సరస్వత్యేనమః
                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము


                            నామధారకుడు ఈ లీలలు విని పులకించిపోయి సిద్ధయోగి పాదాలు పట్టుకొని,  "మహాత్మా! శ్రీగురుని లీలలు వింటుంటే ఆయన సాక్షాత్తూ త్రిమూర్తుల  అవతారమని రూఢి అవుతున్నది. కానీ ఈ భూమిమీద యెన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఈయన ఈ సంగమ క్షేత్రాన్నే తమ నివాసంగా ఎందుకు ఎన్నుకున్నారో తెలియడంలేదు. ఈ క్షేత్రం యొక్క విశేషమేమో వివరించండి" అని కోరాడు. అప్పుడా యోగి ఇలా చెప్పసాగారు:    


                           " నాయనా! ఒక అశ్వినీ మాసంలో కృష్ణ చతుర్దశినాడు ఈ గంధర్వ పురవాసులందరూ దీపావళి పండుగకు ఎంతో ఉత్సాహంగా సంసిద్దులవు తున్నారు. ఆనాడు ఈ శ్రీగురుడు తమ శిష్యులనందరినీ పిలచి, 'మనం ఈనాడు త్రిస్థలియాత్ర చేసివద్దాము' అన్నారు. అప్పుడు భక్తులు, 'స్వామీ! అలా అయితే మేమీ యాత్రకు కావలసిన పదార్థాలన్నీ మూట గట్టుకుని దారి ఖర్చులుకూడా సిద్ధం చేసుకొని వస్తాము' అన్నారు.ఆ మాటలు విని స్వామి, ' అవన్నీ ఎందుకు? త్రిస్థలి  మనకు దగ్గరలోనే ఉన్నది. ఎట్టి  సన్నాహాలూ అవసరం లేదు. కనుక మీరందరూ మీమీ కుటుంబాలతో సహా మాతో కూడా రండి' అని ఆదేశించారు. వెంటనే వారందరూ ఆయనతోకూడా సంగమ  తీరానికి చేరి,  నదిలో స్నానాలు చేశారు. అప్పుడు స్వామి,  'నాయనలారా! ఈ సంగమ ప్రాంతమంతా ప్రయాగతో సమానమైన మహత్మ్యం  గలది సుమా! ఇచ్చటి షట్కుల తీర్థాన్ని మించినది వేరొకటి లేదు. ఇది ప్రయాగను కూడా మించినది.ఈ బీమా - అమరజా సంగమం గంగా -  యమునా సంగమంకంటే కూడా ఎక్కువ పవిత్రమైనది. ఇక్కడ స్నానం చేయడంవలన కలిగే పుణ్యం ఇంతింతని చెప్పనలవికాదు.ఇచ్చటి  ఉత్తర వాహినిలో చేసిన స్నానం ఇంకా పుణ్యప్రదం. ఇక్కడ పవిత్రమైన తీర్థాలు ఎనిమిది ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కదానిని గూర్చి ఎంతని చెప్పగలము?' అన్నారు. అప్పుడు ఒక భక్తుడు,  'స్వామీ ! ఇచ్చటి నదికి "అమరజ" అని పేరు ఎలా వచ్చింది? అది ఎలా ఏర్పడిందో సెలవియ్యండి!' అన్నాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పసాగారు:       


                            'పూర్వం ఒకప్పుడు దేవతలకు రాక్షసులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఇందులో జాలంధరుడనే రాక్షసుడు  ఎందరో దేవతలను చంపేస్తున్నాడు. అప్పుడు దేవతలకు రాజైన ఇంద్రుడు మృత్యుంజయుడైన శంకరుణ్ణి దర్శించి,  "మహదేవా! ఈ  యుద్ధంలో దేవతలకే ఓటమి తప్పనట్లున్నది. అదేమీ చిత్రమోగాని,  రాక్షసుల దేహాలనుండి కారిన రక్తపు  చుక్కలనుండి వేలాదిగా రాక్షసుడు పుట్టి,  ముల్లోకాలలోని దేవతలను సహకరిస్తున్నారు" అని మొరపెట్టుకున్నారు. వెంటనే రుద్రుడు పట్టరానికోపంతో రాక్షసులతో యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. కాని ఇంద్రుడు  ప్రార్థించిన మీదట,  ఆ యుద్ధంలో చనిపోయిన దేవతలను బ్రతికించడానికి అమృతభాండం ప్రసాదించాడు. వెంటనే ఇంద్రుడు అది తీసుకువెళ్లి చనిపోయిన దేవతలమీద చల్లగానే వాళ్ళందరూ జీవించారు. చివరికి ఆ పాత్రలో మిగిలిన అమృతం కొద్దిగా భూమి మీద పడింది. అదే ఈ నదిరూపంలో ప్రవహిస్తున్నది. అందుకే దీనికి 'అమరజా' అనే పేరు వచ్చింది. అందువల్లనే సంజీవని వంటి ఈ నీరు సర్వ పాపాలను నశింపచేయగలదు.  ఇందులో భక్తి విశ్వాసాలతో స్నానం చేసినవారికి అపమృత్యు భయం ఉండదు. ఇది అన్ని బాధలనూ,  వ్యాధులను, బ్రహ్మహత్యాది పాపాలనూ  తొలగించడంలో  త్రివేణిసంగమంతో సమానమైనది.  ఈ సంగమంలో వైశాఖ, కార్తీక,  మాఘ మాసాలలో యధావిధిగా ఉషఃకాలంలో స్నానంచేస్తే ఈ లోకంలో సుఖము, అటుపై మోక్షమూ  కలుగుతాయి. అందుకు అవకాశం లేనప్పుడు,  గ్రహణ సమయంలోను,  సంక్రమణ,  పర్వదినాలలోను ఏకాదశి మొదలైన తిథులలోనూ ఈ నదిలో స్నానం చేస్తే అనంతమైన ఫలితమొస్తుంది. నిత్యమూ ఇందులో స్నానంచేసినా పూర్నాయుష్మంతులవుతారు.             


                ఈ అశ్వత్థవృక్షం దగ్గరున్న మనోరథ తీర్ధంలో స్నానంచేస్తే నిశ్చయంగా మనోరథాలన్నీ  నెరవేరుతాయి. భక్తితో అశ్వత్థాన్ని  సేవించిన వారికి కలిప్రభావం అంటక,  మా దర్శనం లభిస్తుంది. కారణం మేమందులో యెల్లప్పుడూ వుంటాము. అట్టి ఈ కల్పవృక్షాన్ని,  సంగమేశ్వరుడైన  సదాశివున్ని  పూజించి, త్రయంబక మంత్రం పఠించాలి. శ్రీశైలంలో మల్లికార్జునునివలె ఇక్కడ సంగమేశ్వరుడు సుస్థిరంగా ఉన్నాడు. ముందు నందీశ్వరునికి నమస్కరించి, తర్వాత  శివునికి ప్రదక్షిణంచేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా మూడు ప్రదక్షిణలు అయ్యాక, ఎడమచేత్తో నందీశ్వరుని వృషణాలు స్పృశించి, కొమ్ములపై బొటన - చూపుడువేళ్ళు ఆనించి, వాటిమధ్యనుండి శివలింగాన్ని దర్శించాలి.  భక్తితో ఇలాచేస్తే అభీష్టాలన్నీ  నెరవేరుతాయి. ఇక ఈ ఎదుటనే ఉన్న మహాతీర్థం సాక్షాత్తూ వారణాసియే.  అది నాగేశ్వరమనే  గ్రామంనుండి ప్రవహించినది. దీనిని గురించి ఒక పురాణోపాఖ్యానమున్నది.        


                పూర్వం భారద్వాజస గోత్రుడైన బ్రాహ్మణోత్తముడు నిరంతరం భక్తితో ఈశ్వరారాధన చేసి,  పూర్ణ విరాగి అయ్యాడు. అతనికి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుండేది. ఆనంద పారవశ్యంతో అతడు ఒళ్ళు మరచి తిరుగుతుంటే,  లోకులు అతనికి దెయ్యం పట్టింది కాబోలు అనుకునేవారు. ఒకప్పుడు అతని సోదరులైన ఈశ్వరుడు,  పాండురంగడు కాశీకి బయలుదేరుతూ,  తమ అన్నయైన అతనిని గూడ రమ్మన్నాడు. అతడు నవ్వి,  "కాశీ విశ్వేశ్వరుడు నాకు దగ్గరలోనే  ఉండగా, కాళ్ళీడ్చుకుంటూ ఎక్కడకో  వెళ్ళడమెందుకు?" అన్నాడు. "అలా అయితే మాకు చూపించగలవా?" అని వారన్నారు. అతడు అంగీకరించి,  సంగమంలో స్నానంచేసి ఈశ్వరుణ్ణి ద్యానించి, "వ్యోమకేశా! దీనిని కాశీ గాచేసి,  ఇక్కడ విశ్వేశ్వరుని రూపం అందరికీ చూపించు!" అని ప్రార్థించగా,  అందరికీ అక్కడే వారణాసి కనిపించింది. ఈ కుండమే మణికర్ణిక అయింది. ఈ నది ఉత్తర వాహిని అయ్యే చోటఆ కాశి  ప్రకటమయింది. కాశీలో ఉన్న దైవరూపాలన్నీ ఇక్కడే కనిపించాయి. అతని సోదరులిద్దరూ ఆశ్చర్యపడి ఇక్కడే స్నానము,  దానము మొదలైనవి చేశారు. అప్పుడాయన మహాజ్ఞానియని అందరూ తెలుసుకున్నారు. అప్పటి నుండి అతని దగ్గరకు వచ్చిన వారందరికీ విశ్వేశ్వరుని దర్శనం ప్రసాధిస్తూ ఉండేవాడు. కనుక ఇది సాక్షాత్తూ కాశీయే.'


                            స్వామి అటు తర్వాత భక్తులకు పాపవినాశతీర్థం చూపించి,  'ఇందులో స్నానంచేస్తే సర్వపాపాలూ భస్మమవుతాయి' అని చెబుతూ ఉండగా,  పూర్వాశ్రమంలో వారి సోదరియైన రత్నాదేవి అకస్మాత్తుగా అక్కడకు వచ్చి,  ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. శ్రీగురుడు, 'అమ్మాయీ! నీవు చేసిన పాపాల గురించి ఆలోచించావా?' అన్నారు. ఆమె నమస్కరించి,  'స్వామీ,  నేను మూడురాలిని.  సర్వజ్ఞులైన మీరే వాటిని నాకు తెల్పాలి' అన్నది. అప్పుడు స్వామి,  'పూర్వం ఒక పిల్లి పిల్లలను పెట్టింది. నీవు చూడకుండా ఆ కుండనిండా నీళ్లుపోసావు.  అవి చచ్చిపోయాయి. అందువలన నీకు పంచమార్జాల హత్యా మహాదోషం చుట్టుకున్నది. ఇంకా చెబుతాను విను' అంటుండగా, అంతలోనే ఆమె శరీరమంతా కుష్టువ్యాధితో నిండిపోయింది. ఆమె భయపడి ఆయన పాదాలమీదపడి, ఓ దయానిధి! ప్రజలు పాపాలు పోగొట్టుకోడానికి కాశీకి వెళ్ళినట్లు,  నేను మీ పాదాలను ఆశ్రయించడానికి వచ్చాను,  రక్షించు!' అని ప్రార్ధించింది. అప్పుడు శ్రీనృసింహ సరస్వతి,  'నీ వెన్నో పాపాలు చేశావు. వాటిని మరుజన్మలలో అనుభవించి పోగొట్టుకుంటావో,  లేక ఇప్పుడే  పోగొట్టుకుంటావో చెప్పు!' అన్నారు. ఆమె,  'ఇంకా మరొక జన్మ ఎందుకు? నా పాపాలు ఇప్పుడే తొలగించి మరలా జన్మలేకుండా చేయండి' అని ప్రార్థించింది. స్వామి, 'అలా అయితే, నీవు నిత్యమూ  ఈ పాపనాశతీర్థంలో స్నానం చేస్తూ ఉండు. ఒక్కొక్క స్నానానికి ఏడుజన్మల పాపం నశించిపోతుంది. ఈ కుష్టురోగ మొకలెక్కా? ' అని చెప్పారు. అలా చేయగానే  ఆమెవ్యాధి మాయమయింది. అది నేను స్వయంగా చూచాను.ఆ  క్షేత్రమహత్మ్యం చూచి ఆమె అక్కడే ఉండిపోయింది.            


             అప్పుడు స్వామి మా అందరికీ ఇచ్చటి కోటితీర్థం చూపించి,  'ఇందులో సర్వతీర్థాలూ  ఉన్నాయి. ఇక్కడ చేసిన స్నానానికి కోటి గోవులు దానమిచ్చిన ఫలితము  ఉంటుంది. ఇక్కడ చేసిన దానానికి కూడా కోటిరెట్లు ఫలితముంటుంది. దీనికి అవతలనున్న రుద్రపాద తీర్థంలో గయలోలాగే, కర్మచేసి రుద్రపాదస్వామిని పూజించాలి' అని చెప్పారు. తర్వాత కేశవస్వామి దగ్గరనున్న చక్రతీర్థం చూపి,  అక్కడ స్నానంచేస్తే జ్ఞానం కలుగుతుందని శ్రీగురుడు చెప్పారు. 'కల్లేశ్వరుని దగ్గరనున్న మన్మధతీర్థంలో స్నానంచేసి ఈశ్వరుణ్ణి  పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రావణమాసంలో అఖండాభిషేకము,  కార్తీకమాసంలో దీపోత్సవమూ  చేస్తే అష్టసిద్ధులు,  మోక్షమూ  కూడా లభిస్తాయి'.స్వామి  చెప్పినది విని అందరూ సంతోషించి, యీ  అష్టతీర్థాలలో స్నానం చేసారు. నాడు శ్రీగురుడు మఠం చేరగానే ఆ భక్తులు సమారాధన చేసారు.

నలభై తొమ్మిదవ అధ్యాయం సమాప్తము.


శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Monday, June 8, 2020

గురు చరిత్ర అధ్యాయము -48


అధ్యాయము  -48




                               
శ్రీ గణేశాయనమః  
                           
శ్రీ సరస్వత్యేనమః
                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 



                      "స్వామీ ! ఈ గంధర్వపురంలో శ్రీ గురుడు ఇంకేమి చేశారో చెప్పండి!" అని కోరిన నామధారకునితో సిద్ధుడు ఇలా చెప్పారు. "నాయనా! ఆ భగవంతుడు ప్రతిరోజూ స్నానానుష్టాలకు మఠంనుండి బయలుదేరి సంగమానికి వెళ్లి వస్తుండేవారు అని చెప్పాను కదా? అప్పుడు గంధర్వ పురం లో పార్వతేశుడనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడు గుత్తకు సాగుచేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉండేది. అతడు నిత్యమూ మొదట మఠంలో శ్రీగురుణ్ణి  దర్శించుకుని పొలానికి వెళ్తుండేవాడు. శ్రీ గురుడు మఠం నుండి సంగమానికి వెళ్లేటప్పుడు, తర్వాత మఠానికి తిరిగివచ్చేప్పుడు, కనిపెట్టి పరుగునపోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్దిదూరం నుండే ఆయనకు నమస్కరించుకుని పోతుండేవాడు. కొంతకాలం శ్రీగురుడు అతనినేమీ పలకరించకుండా అతడి భక్తిశ్రద్ధలను గమనిస్తూ ఉండేవారు. ఎంతకాలమైనా అతడేమి కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగానే, "నాయనా! నిత్యమూ  నీవింత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావే, మానుండి నీకు ఏమి కావాలో చెప్పు!' అన్నారు. ఇంత కాలానికి తనకట్టి  అవకాశం వచ్చినందుకు పర్వతేసుడెంతో సంతోషించి, చేతులు జోడించి, 'బాబూ, నా పొలాన్ని స్వామి వారు ఒక్కసారి చూచి, అక్కడ తమపాదము పెడితే మాకు మేలవుతుందని నా ఆశ' అన్నాడు. స్వామి, ' నాయనా, నీ పొలంలో ఏమి పైరు వేసావు?' అని అడిగారు. అతడు 'అయ్యా! ఈ సంవత్సరం జొన్నవేశాను.  రోజూ  మీకు నమస్కరించుకుంటుంటే చేను బాగా పెరుగుతున్నది. ఇప్పుడిప్పుడే ధాన్యం పాలు పోసుకుంటున్నది. తమ దయ వల్ల 2 నెలల్లో అది కోతకు సిద్ధమవుతుంది. కనుక మీ అమృత దృష్టితో ఆ చేనును  చూస్తే మాకింత అన్నం పెట్టిన వారవుతారు. ఎవరో శూద్రుడు ఏదో చెప్పాడులే అని తలచి, నామాట త్రోసిపుచ్చివద్దు. మీరే మా పాలిట రక్షకులు' అని ప్రార్థించాడు.                   


                            శ్రీ గురుడు, 'సరే పద, చూచి వద్దాము' అని చెప్పి, అతనితో గూడ చేను వద్దకు వచ్చారు. ఏపుగా పెరిగిన పైరును కలయజూస్తూ, ఏమిరా! మేము చెప్పింది చేస్తాం అంటే ఒక మాట చెబుతాను' అన్నారు. ఆ రైతు, 'తండ్రి, మీమాట జవదాటుతానా? మా క్షేమం కోరి చెప్పేవారు మీరుగాక మరి ఎవరున్నారు? మీరు ఒక మాట చెప్పిన తర్వాత నాకు వేరొక తలంపే ఉండదు. స్వామికి తెలియనిది ఏమున్నది?గుర్వాజ్ఞ  విషయంలో నాకు మరే ఆలోచనా లేదు' అన్నాడు. ఆ యతివరేణ్యుడు, 'అలా అయితే మా మాటమీద నమ్మకం ఉంచి, మేము మధ్యాహ్నం ఇటుగా వెళ్ళే లోపల ఈ చేలోని పైరుఅంతా కోయించు!' అని చెప్పి సంగమానికి వెళ్లి పోయారు. 


                            ఆ పాలిగాపు వారి ఆజ్ఞను  అక్షరాల పాటించదలచి వెంటనే ఊరిలోనున్న ఆ పొలం ఆసామి వద్దకు వెళ్లి, ఆ ముందటి సంవత్సరం అతనికి చెల్లించిన ప్రకారమే ఈ సంవత్సరం కూడా గుత్త  చెల్లిస్తానని, పైరు కోయడానికి  అనుమతిపత్రం ఇవ్వమనీ  కోరాడు. కానీ ఆ ఏడాది పైరు ఎప్పటికంటే ఎక్కువగా పెరగడం వలన ఆసామి అందుకు ఒప్పుకొనక, ఆ ముందటి సంవత్సరంకంటే రెట్టింపు గుత్త  చెల్లించేటట్లు ఒప్పించుకొని ఆ ప్రకారమే కాగితం రాయించుకొని, పైరు కోతకు అనుమతిచ్చాడు. ఆ కాపు వెంటనే కూలీలను పిలుచుకొని పొలంవద్దకు వెళ్లాడు. 'పైరుకు ఇంకా పాలుపట్టే సమయంలోనే అతడు కోత కోయిస్తున్నాడేమా!' ఈ కూలీలు గూడా ఆశ్చర్యపోయారు.కానీ,  తమకు కూలీ దక్కుతుందన్న తలంపుతో పనిలో దిగారు. అంతలో ఆ సంగతి తెలిసి,  అతని భార్య బిడ్డలు నెత్తీ,  నోరూ మొత్తుకొంటూ వచ్చి అతనికి అడ్డుపడ్డారు. వాళ్ళని పొమ్మని  ఎంత చెప్పినా వాళ్ళు అడ్డు తొలగకపోయేసరికి,  అతడు వాళ్ళమీద రాళ్ళు రువ్వసాగాడు.  వాళ్ళు భయపడి న్యాయాధికారి వద్దకు వెళ్లి, 'మహాప్రభూ! మా వాడికి దయ్యం పట్టిందో ఏమో గాని,  కంకులింకా ముదరకముందే పైరు కోయిస్తున్నాడు.  వద్దని అడ్డుబోతే  మమ్మల్ని రాళ్లతో కొడుతున్నాడు ఎవరో సన్యాసి చెప్పిన మాటలు విని,పంటకొస్తున్న పైరే చేతులారా పాడుచేస్తున్నాడు. ఇంకొక నెలరోజుల్లో చేతికి వస్తుందని మేము ఆశపడుతూ ఉంటే ఆ కాస్తా ఇలా నాశనమైపోతున్నది. అతనిని నిగ్రహించండి.అని గొల్లున ఏడ్చారు. ఆ న్యాయాధికారి,' మీరు నాతో చెబితే నేను ఏమి చేయగలను? ఏమైనా చేయగలిగితే యజమానే  చేయగలడు. అతనితో చెప్పుకోండి' అని చెప్పి వారిని పంపివేసాడు.    


                          వాళ్లు అప్పుడు ఆ పొలం యజమాని వద్దకువెళ్లి మొరపెట్టుకుంటే అతడు, 'వాడి ఇష్టం! వాడేమి  చేసుకుంటే నాకెందుకు? క్రిందటి సంవత్సరం కంటే రెట్టింపు గుత్త నాకు ఇచ్చేలా రాయించుకున్నాను. అయినా మీరింతగా గోల పెడుతున్నారు గనుక, మా మనిషినిపంపి వాడిని వారించడానికి ప్రయత్నిస్తాను. మీరు వెళ్ళండి' అని చెప్పి ఒక మనిషిని పంపాడు. ఆ మనిషి పొలం వద్దకు వెళ్లి అడ్డుచెప్పగానే ఆ సేద్యగాడు, 'ఏమయ్యా! కాగితం రాయించుకున్న ప్రకారం యజమాని నా నుండి ధాన్యం తీసుకోవాలేగాని, నేనేమి చేసుకుంటే అతనికి ఎందుకు? ఆయనకు ఇవ్వవలసిన ధాన్యం మా ఇంటి గాదెలోనే ఉన్నది. అది చాలకుంటే, వాటికి బదులు చెల్లించడానికి నా దగ్గర కావలసినన్ని పశువులు ఉన్నాయి కదా?' అని చెప్పి, అతనిని వెనుకకు పంపివేసాడు. అంతటితో యజమాని ఊరుకున్నాడు. పర్వతేశుడు పైరు కోత త్వర త్వరగా పూర్తి చేయించి, కొడవళ్ళు కట్టకట్టించి అవతల పెట్టించి, శ్రీ గురుణ్ణి స్మరిస్తూ, ఆయన సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఆయన రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కొంత సేపటికి అటుగావస్తున్న శ్రీగురునికి అతడు నమస్కరించి, వారిని పొలం వద్దకు తీసుకువెళ్లి, ఆ కోసి వేసిన పైరు చూపాడు. స్వామి అది చూచి ఆశ్చర్య నటిస్తూ, 'అయ్యో! నీవు అనవసరంగా పైరంతా కోసివేయించావే! నేనేదో పరిహాసంగా అంటే అన్నంత పని చేశావే! ఎంతపని చేశావయ్యా! పాపం, ఇప్పుడు నీ జీవనమెలా? యజమానికి ధాన్యం ఎలా ఇస్తావు? అమాయకుడా? పండనిపైరు కోసి అంతా వ్యర్ధం చేసావు కదా!' అన్నారు. కాని పర్వతేశుడు కొంచెమైనా జంకకుండా ఆయనకు నమస్కరించి, 'స్వామీ! నాకు గురువాక్యమే ప్రమాణము. అదేమాకు శ్రీరామరక్ష. మీరు ఉండగా మాకేమి భయం?' అన్నాడు. అతని విశ్వాసానికి శ్రీగురుడు లోలోపల సంతోషించి, 'నీకు అంత దృఢమైన విశ్వాసం ఉంటే అలానే అవుతుందిలే!' అని నిర్వికారంగా మఠానికి వెళ్లిపోయారు. ఆ కాపరి గూడా శ్రీ గురుడు కనుమరుగు అయ్యేవరకు తదేకంగా ఆయనను చూచి, నిశ్చింతగా ఇంటికి వెళ్లాడు. దారిలో అతనిని చూచిన వారంతా యెన్నెన్నో మాటలన్నారు కానీ, అతడు అవేమీ పట్టించుకోలేదు.


                    పర్వతేశుడు ఇల్లు చేరేసరికి అతడి భార్య తమకా  సంవత్సరం నోటి వద్దకొచ్చిన కూడు పాడై పోయిందని భోరుభోరున ఏడుస్తున్నది. అతడు మాత్రం ఎంతో నిబ్బరంగా ఆమెతో, ' ఓసి వెర్రిదానా! నీవలా  ఏడవకూడదు. ఆ గురుదేవుల వాక్కే మన పాలిట కామధేనువు. వారి మహిమ మూఢులకేమి తెలుస్తుంది? ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే. మనకాయన పెన్నిధిలా దొరికాడు. వారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతక గవారి దయ ఉంటేనే అందరము సుఖంగా బ్రతకగలము. మామూలుగా పడవలసిన పంటకంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ఆయన ప్రసాదిస్తారని నాకు నమ్మకమున్నది' అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అతని మాటలు విన్న ఇరుగు పొరుగు వారు అందరూ చోద్యము చూడవచ్చి, అతని మూఢవిశ్వాసానికి నివ్వెరబోయి, నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.   


                    ఒక వారం రోజులు గడిచాయి. ఎనిమిదవరోజు నుండి విపరీతమైన చలిగాలి వీచనారంభించింది. దానివలన చుట్టుప్రక్కల చేలన్నీ  వాలిపోయి, తాలుధాన్యం ఏర్పడింది. దానికితోడు ఆ పుష్యమాసంలో భారీఎత్తున అకాలవర్షం కురిసింది. అంతటితో మిగిలిన పైరులన్నీ  పూర్తిగా పాడైపోయాయి. కానీ పర్వతేశుని పొలంలో మాత్రం కోయబడిన పైరు మొక్కల మొదళ్లనుంచి ఒక్కొక్క మొక్కకు పది,  పదకొండు చొప్పున పిలకలు వచ్చాయి. పైరు ఏపుగా పెరిగి అమితంగా పండింది. అది చూచిన వారందరూ నిర్ఘాంతపోయారు. అతడి భార్యకూడా అమిత సంతోషంతో తన భర్త కాళ్ళమీదపడి, 'అయ్యా! తెలియక నేనెంతో గొడవచేసి మీ మనస్సును ఎంతగానో నొప్పించాను. తెలివితక్కువ వలన ఏమేమో నోటికొచ్చినట్లు మాట్లాడాను. చివరకు ఆ మహానుభావుణ్ణి గూడా నిందించాను. అదెంత తప్పో  ఇప్పుడు తెలుసుకున్నాను. అదంతా మనస్సులో పెట్టుకోక నన్ను క్షమించు' అని ప్రాధేయపడింది.         


                            అప్పుడు ఆ భార్యాభర్తలు ఆ పొలానికి నమస్కరించుకొని భూమి పూజచేసి శ్రీగురునివద్దకు వెళ్లి ఆయన పాదాలమీద పూలువేసి నమస్కరించు  కున్నారు. స్వామి నవ్వి, 'ఏమిటి విశేషం? ' అన్నారు. ఆ దంపతులు నమస్కరించి, 'స్వామీ, మీ దయవలన మేము కోరినదానికంటే ఫలితమెంతగానో ఎక్కువ వచ్చింది. మిమ్మల్ని మించిన కామధేనువు, సత్యమూర్తి భూమిమీద ఇంకెవరున్నారు? అమృతంవంటి మీమాట అందరూ వినదగినది. అదియే  అందరి పాలిట పెన్నిధి; మీ చూపు పాపులను కూడా పావనం చేయగలదు' అన్నారు. పర్వతేశుని భార్య, 'స్వామీ! నేను తెలియక మొదట ఏమేమో అన్నాను. మన్నించి మమ్మల్ని మీరు ఎప్పుడు ఇలానే కాపాడాలి. మీరే మాకు దిక్కు. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని ఇలాగే కొలుచుకునేలా అనుగ్రహించండి' అని  విన్నవించుకున్నది. తర్వాత ఆ దంపతులు స్వామికి నీరాజనమిచ్చారు. వారి భక్తిని చూచి సంతోషించి శ్రీగురుడు, 'అఖండ శ్రీరస్తు!' అని ఆశీర్వదించి, వాళ్లను పంపివేశారు. ఆ దంపతులు ఎంతో సంతోషంగా ఇంటికి పోయారు.   


                                                నెల గడిచేసరికి పర్వతేశుని పంటపండి, కంకులు అద్భుతంగా బయటికి వచ్చాయి. నిజానికి ఆ మొదటి సంవత్సరం కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా ధాన్యం పండింది. ఆ కాపు ధాన్యం నూర్చి రాశిపోసి, ఆసామి వద్దకుపోయి, 'అయ్యా! చూచారా, స్వామి దయవలన పైరెంత బాగా పండిందో? మీకు కూడా మన ఒప్పందం చేసుకున్న దాని కంటే ఎక్కువే ఇస్తాను తీసుకోండి. అయినా నాకు ఇంత ఎక్కువగా పడింది కనుక మనిద్దరమూ చెరిసగం తీసుకొనడం న్యాయమని నాకు అనిపిస్తున్నది. మీరు వెంటనే వచ్చి మీభాగం తీసుకుపోండి' అని చెప్పాడు. కానీ ఆసామి ధనాకు లోబడక ధర్మానికి అంటిపెట్టుకుని, తనుఒప్పందం చేసుకున్న దానికంటే కొంచెం కూడా ఎక్కువ తీసుకోడానికి అంగీకరించలేదు. 'అది నీ భక్తిశ్రద్ధలకు మెచ్చి శ్రీగురుడు ప్రసాదించినది కనుక అదంతా నీకే చెందాలి' అన్నాడు. అప్పుడా రైతు, రాజుకు చెల్లించాల్సిన భాగం వేరుగా తీసి ఆ సంవత్సరం పంటలు నాశనమై అలమటిస్తున్న బ్రాహ్మణులకు కొంత ధాన్యమిచ్చాడు. అటుపైన మిగిలినదంతా బండ్లమీద వేసి ఇల్లు చేరుకున్నాడు. నామధారకా! శ్రీగురుని మహత్యం ఎంతటిదో చూచావా? గురుభక్తే అభీష్టాలన్నింటినీ ప్రసాదించగలదు." 


నలభై ఎనిమిదవ అధ్యాయం సమాప్తము 


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Friday, June 5, 2020

గురు చరిత్ర అధ్యాయము -47


అధ్యాయము  -47




                               
శ్రీ గణేశాయనమః  
                           
శ్రీ సరస్వత్యేనమః
                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 



                                నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగాడు: " నీవు ఎంతో అదృష్టవంతుడివి కనుకనే ఈ కథ పట్ల ఇంత శ్రద్ధాసక్తులు కలిగాయి. ఈ కథ వినడం వలన పతితులు గూడా పావనులవుతారు. ఒకప్పుడు దీపావళి పండుగకు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు,  స్వామిని దీపావళికి  ముందు వచ్చే ధన త్రయోదశి  పర్వదినాన తమ తమ ఇళ్ళకు ఆహ్వానించాలని గానుగాపురం వచ్చారు. ఆ ఏడుగురు ఆ చుట్టు పక్కలనున్న 7 గ్రామాలకు పెద్దలు. వారి ప్రార్థన విని స్వామి, 'ఒకేరోజు ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావడం ఎలా సాధ్యం? అలా అని మీలో ఎవరి కోరికను మేము కాదనలేము. కనుక మీలో మీరు సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి, ఎవరింటికి రమ్మంటే అక్కడకు రాగలము' అన్నారు. అప్పుడు ఆ ఏడుగురు, స్వామి తమ ఇంటికి రావాలంటే, తమ ఇంటికి రావాలని వాదించుకోసాగారు. వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేక పోయేసరికి స్వామి నవ్వుతూ, 'మీరు వాదించు కోవడం ఎందుకు? మీ అందరికీ మా పై విశ్వాసం ఉన్నది గనుక, ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి. ఆ రోజు మాకు తోచిన చోటికి మేము వస్తాము' అన్నారు. అప్పుడా భక్తులు నమస్కరించి, 'స్వామీ! మా శక్తి సామర్థ్యాలు, స్థితిగతులు ఎంచక, మా అందరినీ సమానంగా మన్నించండి' అన్నారు! కాని, స్వామి వారిలో ఎవరి ఇంటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శపథం చేశారు. వారిలో పేదవారు, 'అయ్యా! మేము పేదవాళ్లం అని మమ్ము ఉపేక్షించిచవద్దు. అలనాడు శ్రీకృష్ణుణ్ణి రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించినా, అతని పదవినెంచక, తననే  నమ్ముకున్న నిరుపేద అయిన విదురుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా! అలానే మీరు కూడా మా ప్రార్థనను త్రోసిపుచ్చివద్దు!' అని ఎవరికి వారే వేడుకున్నారు. అప్పుడు స్వామి, 'మీరు మీ ఇళ్లకి వెళ్ళండి. ఆనాడు మాకై  మేమే రాగలం, సందేహించవద్దు!' అని వాగ్దానం చేశారు.


                        ఆయన ఎవరి ఆహ్వానాన్ని,  మన్నిస్తారోనన్న సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడి పోయారు. అప్పుడాయన ఒక్కొక్కరినే ప్రక్కకు పిలిచి, 'మేము మీ గ్రామానికే వస్తాము. కానీ ఈ మాట ఇంక ఎవరికీ చెప్పవద్దు!' అని రహస్యంగా చెప్పారు. అప్పుడు వాళ్ళు ఎవరికి వారే-స్వామి తన ఇంటికే రాగలరని తలచి, ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. కాని స్వామి ఆ పండుగనాడు ఏ ఊరో  వెళ్తారని అచ్చటి వారందరికీ తెలిసిపోయింది. గంధర్వపురవాసులు వెంటనే వారి వద్దకు వచ్చి, ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడికీ  వెళ్ళవద్దని బ్రతిమాలుకున్నారు. వారితో స్వామి, 'మేమానాడు ఇక్కడనే ఉంటాము, ఎక్కడకూ  వెళ్ళము' అని మాటఇచ్చి అందరినీ ఊరడించారు.   


                                 చివరకు ధనత్రయోదశి రానే వచ్చింది. ఆ రోజుకు ఆ ఏడు గ్రామాల పెద్దలూ, శ్రీ గురుడు తప్పక తమ ఇంటికే  రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘనస్వాగతము, పూజలకు సిద్ధమయ్యారు. కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు  ఆ గ్రామం విడిచి ఎక్కడకూ  వెళ్లక మఠంలోనే ఉండిపోయారు. ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో. శ్రీ గురుడు ఏడు రూపాలలో ఆ ఏడు గ్రామాలకు వెళ్లారు! అయినప్పటికీ ఎనిమిదవ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి, అచ్చటి వారి పూజలు అందుకున్నారు. కొద్ది రోజులు, ఆయన ఒక గ్రామానికి వెళ్లినా సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది. అయినప్పటికీ ఆ కార్తీకమాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పూర్ణిమ దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాల నుండి భక్తులు గంధర్వనగరం చేరుకున్నారు. వాళ్లందరూ అంతకు పదిహేను రోజులముందు తమతమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా, ఒకరి మాటలు ఒకరికి నమ్మలేనివిగా తోచాయి. ఎవరికివారు, శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేశారని చెప్పుకుంటూ, ఒకరి మాటను ఒకరు ఖండించు కుంటున్నారు. ఎవరికి వారే, ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాలువలు కానుకలు నిదర్శనంగా చూపించి, తమ మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు. అదంతా వింటున్న గంధర్వ పురవాసులు నవ్వి, 'మీ అందరికీ పిచ్చిపట్టిందా ఏమి? దీపావళినాడు స్వామి ఎక్కడకు వెళ్ళనేలేదు. స్వామిని మేమేకదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నాము?' అని మందలించారు. అప్పుడు స్వామి, 'మీరు వాదులాడుకోవద్దు. మీలో ఎవరు అబద్ధం చెప్పడం లేదు. మేము అంతటా ఉన్నాము కదా!' అన్నారు. స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి, అందరి పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడింది. అందరూ ఆశ్చర్యచకితులై, అటువంటి లీల తాము ఎన్నడూ కనీవినీ ఎరుగనని చెప్పి స్వామిని స్తుతించుకొన్నారు. ఎంతటి కవులకూ  వర్ణించ సాధ్యంకాని ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు. కనుక నామధారకా ! శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానమేమున్నది? శ్రీ గురుడే త్రిమూర్తి స్వరూపము. ఆయనకు మించిన దైవమే లేడు. ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీ గురు పాదసేవకు మించిన నావయే  లేదు. గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా!" అన్నారు సిద్ధయోగి.          


నలభై ఏడవ అధ్యాయం సమాప్తం

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

గురు చరిత్ర అధ్యాయము -46


అధ్యాయము  -46




                               
శ్రీ గణేశాయనమః 
                            
శ్రీ సరస్వత్యేనమః
                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 




                          నామధారకుడు, "స్వామీ  శ్రీగురునివద్ద మరొక కవి శేఖరుడు ఉండేవాడు అంటిరి  కదా?  అతడు ఎవరు?  అతడు శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యాడో,  ఆయననెలా  సేవించాడో  దయచేసి వివరించండి" అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు: "శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితా శక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు. ఆ రీతిన శ్రీగురుని మహత్యం మరింతగా వెల్లడై  ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు.                                

                                 గాంన్గాపురం సమీపంలోనే 'హిప్పరిగి' అనే గ్రామమున్నది. ఒకసారి ఆ గ్రామంనుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు. వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలచి ఆయనను ప్రార్థించి, ఆయననెలాగో ఒప్పించి, మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్లారు. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది. ఒక్కొక్కరూ ఎంతో భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకొన్నారు. ఆ ఊరిలో ఒక శివాలయమున్నది. అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ  ఊళ్లోనే నరకేసరియని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడున్నూ. అతడు నిత్యమూ  కల్లేశ్వరుని స్తుతిస్తూ, పంచపద్య మణిమాలను  వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు. అతడు ఆ శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు, మరేదేవతనూ  స్తుతించేవాడు గాదు. అతడొకరోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని, 'ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది. అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే  గనుక పనికిరాదు' అని తలచాడు. శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్లి,  'కవిచంద్రా !మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. శ్రీ నృసింహ సరస్వతీ యతివరేణ్యులకు కవిత్వమంటే ఎంతో ప్రీతి. కనుక వారిని స్తుతిస్తూ మాకు నాలుగు పద్యాలు వ్రాసిస్తే,  అవి వారిచెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము'  అని కోరారు. నరకేసరి,  'అయ్యా! అది నావల్లకాదు. కల్లేశ్వరుని తప్ప మరే దేవతనూ స్తుతించను. ఆయన సేవకే నా కవితనంకితం చేసుకున్నాను. అటువంటప్పుడు కేవలం ఒక మానవమాత్రుడైన  సన్యాసిని నా కవితతో ఎలా స్తుతించేది?  అని చెప్పాడు. తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోడానికి ఆలయానికి వెళ్లాడు. అదేమీ చిత్రమోగాని,  ఆరోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గరనుండి అతనికి బాగా నిద్రతూగసాగింది. అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక, చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది. ఆ కునులోనే ఒక చిత్రమైన కలగూడ వచ్చింది. ఆ కలలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు. అతని ఎదుట మాత్రం ఎప్పుడూ  కనిపించే కాల్లేశ్వరలింగం అప్పుడు కనిపించలేదు. ఆ స్థానంలో  శ్రీగురుడు కూర్చునివున్నాడు. ఆయన నవ్వుతూ,  'నీవు కల్లేశ్వరుని  తప్ప మరెవ్వరినీ నీ  కవితతో స్తుతించవు కదా! మానవమాత్రులమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నా  వేమీ? ' అన్నారు.నరకేసరి తృళ్ళిపడి, వెంటనే నిద్ర మేల్కొన్నాడు. మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకుపట్టింది.  శ్రీగురుడు మళ్ళీ స్వప్నదర్శనమిచ్చి, 'మేము - కల్లేశ్వరుడూ వెరుగాదు !' అన్నారు. ఆ కలలోనే అతడు పూజ పూర్తి చేసి అయిదు పద్యాలతో స్తుతించాడు. ఈ సారి నరకేసరి  మేల్కొని, తనకొచ్చిన కలను స్మరించుకొని, 'అయ్యో! నేనింతవరకూ పొరబడ్డానే! ఈ నరసింహ సరస్వతీ యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని, ఇంతవరకూ నేను తలచినట్లు మానవమాత్రులుగారు. కేవలం భక్తులను ఉద్దరించడానికే భగవంతుడు యిలా అవతరించాడు. ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే, కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి, నా సందేహానికి సమాధానమెలా యివ్వగలరు?' అని నిశ్చయించుకొన్నాడు.   


                            వెంటనే బయల్దేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు  దర్శనానికి వెళ్ళాడు. ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని,  స్వామిని తన కవితతో ఇలా స్తుతించాడు: 'అనంతా! సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తూ ఆ కల్లేశ్వరులే.  అది తెలియక నేనింతవరకూ  మిమ్మల్ని స్తుతించనైనాలేదు. చిరకాలం కఠోర తపస్సులు  చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు. కల్లేశ్వరుని కృప  వలన నాకీనాడు మీరు దర్శనమనుగ్రహించారు. ఈ దుఃఖసాగరంలో మునిగి,  దారీ  తెన్నూ కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరిలా అవతరించారు. ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక, యితర మార్గాలకోసం వెతుకులాడటం వ్యర్థమే!', అని స్తుతించాడు. స్వామి నవ్వి,  'ఏమయ్యా! ఇంతవరకూ  నీవు, మేము కేవలం మానవమాత్రులమని,  మమ్మల్ని ప్రజలిలా పూజించడం తగదనీ ఆక్షేపిస్తుంటివే, యింతలో నీ మనస్సు యిలా యెందుకు మారింది?' అని అడిగారు. నరకేసరి నమస్కరించి, 'స్వామీ! నేను అజ్ఞానమనే చీకటిలో  పడివున్నప్పటికీ మీరు  నాపాలిట జ్యోతి స్వరూపులై  నాకు కనువిప్పు కలిగించారు. ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి, యీనాడు నాకు మీ పాదసేవ లభించింది' అని, తనకు కల్గిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు. ఆయనను పూజించి, స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి,  అనుగ్రహించమని వేడుకున్నాడు.  'నీ  అభీష్టా లన్నీ  నెరవేరుగాక!' అని శ్రీ గురుడు ఆశీర్వదించారు. నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలచానని కోరాడు. శ్రీ గురుడు,  'ఈ కాల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు. ఆయనంటే మాకెంతో ప్రీతి గనుక మేమెప్పుడూ ఆ రూపంలో హిప్పరిగిలో  ఉంటాము. కనుక నీవు ఎప్పటివలే నీవక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు' అని ఆదేశించారు. కానీ అతడు త్రిమూర్తిస్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్నే  సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ  ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు. అప్పటినుండి నరకేసరి,  నిత్యమూ  తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ,  ఆయనను పంచరత్నాలతో స్తుతిస్తూ ఉండేవాడు. నామధారకా! శ్రీగురుని అనుగ్రహం వల్ల ఇలా మారినవారెందరో  కదా!"            


నలభై  ఆరవ అధ్యాయం సమాప్తము.


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

గురు చరిత్ర అధ్యాయము -45


అధ్యాయము  -45




                               
శ్రీ గణేశాయనమః  
                           
శ్రీ సరస్వత్యేనమః  
                                                                                                
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 




             నామధారకుడు భక్తి పారవశ్యంతో, " మహాత్మా, బ్రహ్మసాక్షాత్కారం గూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీగురుకథామృతం సేవించగలిగిన నేను ఎంతో ధన్యుణ్ణి. నాకు దైన్యం తొలగి, మనస్సు శాంతించింది. దయతో అటుపై కథ కూడా వివరించండి" అని కోరాడు. పెద్ద యోగి సంతోషంతో ఇలా చెప్పారు:     


                      "నామధారకా! ఇంతకుముందు నరహరిశర్మ వలనే శ్రీగురున్ని సేవించి, మరి ఇద్దరు కవులు ముక్తులయ్యారు. శ్రీ గురుడు వారినెలా అనుగ్రహించారో  చెబుతాను, విను. నందిశర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టువ్యాధి వచ్చింది; అతడు ఆ బాధ తొలగించుకోవడానికి తుల్జాపురం వెళ్లి, అహర్నిశలు తదేకదీక్షతో భవానిదేవిని మూడు సంవత్సరాలు ఉపాసించాడు. ఫలితం కనిపించకపోయేసరికి అతడొకసారి మూడు రోజులు ఉపవాసం చేశాడు. మూడవనాటిరాత్రి జగన్మాత అతనికి స్వప్నదర్శనమిచ్చి, చందలాపరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. ఆ ప్రకారమే అతడు వెళ్లి, ఏడు మాసాలపాటు ఒంటిపూట భోజనంతో,  ఆ పరమేశ్వరుని పూజించాడు. అప్పుడు ఒక నాటిరాత్రి ఆ దేవి స్వప్న దర్శనమిచ్చి, గంధర్వపురంలో విజయంచేస్తున్న త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది. నందిశర్మ నిద్రలేచి, 'అయ్యో, నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలినది ఇదేనా? దేవీ! ఈమాట మొదటే చెబితే నేను ఇక్కడకు వచ్చేవాడినేకాదు. మూడు సంవత్సరాలు తులజాభవానిని, ఏడు నెలలు నిన్నూ సేవిస్తే, నీవు చివరకు నన్నొక మానవ మాత్రుణ్ణి ఆశ్రయించమంటావే, నీ దైవత్వం ఏమయింది? అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గువేయడం లేదా? ఏడు నెలలు తపస్సు చేసి నేను తెలుసుకున్నది,  నీకు శక్తిలేదనేనా? నీవల్లకాదని మొదటనే చెబితే, నాకు ఇంత కష్టమైనా తప్పేదికదా?' అని వాపోయాడు. చివరకు, 'ఈ కఠిన తపస్సు వలన బలహీనుడు అయిన నేను ఇంకెక్కడికి పోగలను? నేను ఎక్కడకూ  వెళ్ళను, ఇక్కడేమరి కొంతకాలం పురశ్చరణ చేస్తాను. దేవీ! నీవు నా రోగం పోగొట్టకుంటే నీ పాదాలవద్దే  ప్రాణత్యాగం చేస్తాను' అని దేవికి చెప్పుకొని, ఈసారి ప్రాయోపవేశం చేయసాగాడు. ఆ దేవి అతనికి మరల ఆ మరుసటి రోజు రాత్రేస్వప్న దర్శనమిచ్చి, అతనిని అచటి నుండి లేచిపొమ్మని ఆదేశించింది. దానికి తోడు అచ్చట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి, నంది శర్మను అక్కడనుండి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది! మరుసటి ఉదయమే వాళ్లందరూ అతనితో, 'నందయ్యగారు! అమ్మవారి సెలవయింది. కనుక మీరు తక్షణమే ఇక్కడనుండి వెళ్లిపోవాలి. లేకుంటే మేము ఇక్కడి నుండి నెట్టి వేయవలసి వస్తుంది!' అని బెదిరించారు. వేరేదారిలేక, అతడు అందుకు అంగీకరించి, దేవిని పూజించి పారణచేసి, ఆ వూరు విడిచి బయల్దేరాడు. తనకు వ్రతభంగం అయినందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గానుగాపురం చేరుకొన్నాడు. అతడు దేవి చెప్పిన ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులను విచారించాడు. వారు, 'శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా ఉపవసించి, స్నానానికని సంగమానికి వెళ్లారు. కొద్ది సేపట్లో తిరిగివస్తారు' అని చెబుతున్నారు. ఇంతలోనే ఆ యతిరాజు వస్తుండడం చూసి, వారు ఆ కుష్ఠురోగిని దూరాన్నే ఉండమని చెప్పారు. స్వామి మఠంలో ప్రవేశించి తమ స్థానంలో కూర్చోగానే, వారి దర్శనానికై ఒక కుష్టురోగి వచ్చారని వారు మనవి చేశారు. అది వినగానే శ్రీగురుడు, 'వాడు సంశయాత్మకుడు! అయినప్పటికీ మా ఎదుటకు రమ్మనండి' అని చెప్పారు. అది విని నందిశర్మ  అడుగడుగుకూ సాష్టాంగపడుతూ వారి ఎదుటకు వచ్చాడు. శ్రీ నృసింహ సరస్వతి అతనిని చూచి. 'ఏమయ్యా!" మొదటి దేవిని ఆశ్రయించాక, మరలా ఈ మానవమాత్రుణ్ణి  దర్శించేదేమిటి?" అనుకుంటూ మా దర్శనానికి వచ్చావేమి? నీకు విశ్వాసం లేకుంటే,  దేవి ఆదేశిస్తే మాత్రం రావడమెందుకు?' అన్నారు. వెంటనే ఆయన సర్వజ్ఞులని తెలుసుకొనిన నందిశర్మ  పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు: 'స్వామీ! నేను మూడుడను. శుద్ధసత్త్వ స్వరూపులైన మీ దృష్టి నాపై ప్రసరింపజేయడం వలన నాలోని తమోగుణం అంతరించింది. పాపాత్ముడ నైన నేను మీరు మయాతీతులని, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులనీ  తెలుసుకోలేకపోయాను. నేడు తమ దర్శనంవలన నా పాపాలన్నీ నశించాయి. మీరు భూమిని ఉద్ధరించడానికి దిగివచ్చిన గంగవలె, నా వంటి వారిని రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు. మీ పాదసేవ దొరికాక, నా అభీష్టం ఎందుకు నెరవేరదు? జారత్వ దోషంవలన పాషాణమైన అహల్య శ్రీరాముని పాద స్పర్శ వలన ఉద్ధరణ పొందలేదా? నేను ఎన్ని పాపాలు చేసిన వాడనైనా మీ పాదస్పర్శవలన పవిత్రుడనవుతాను. స్వామీ! నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను . 


                నాకు వివాహం అయినప్పటి నుండి ఆపాదమస్తకమూ  కుష్టురోగం వచ్చింది. అందువలన నా భార్య నన్ను విడిచి, పుట్టింటికి వెళ్ళింది. నా తల్లి దండ్రులు కూడా నన్ను వెళ్లగొట్టారు. నేను దిక్కులేనివాడనై  ఆ  జగదాంబ నాశ్రయించి ఉపవసించినా, నా పాపం నశించలేదు. అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపెడాశలతో అచ్చటికి వెళ్లి, కఠోరమైన పునశ్చరణ చేశాను. ఆ తల్లి కూడా నన్ను చీదరించుకుని వెళ్ళగొట్టిందేగాని, అనుగ్రహించనే  లేదు. నా ముఖం చూసే వారు ఎవరూ లేరు. నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు. చివరి ఆశగా మిమ్మల్ని శరణు పొందడానికి వచ్చాను. దయచేసి ఈ నా వ్యాధికి నివారణోపాయం ఉన్నదో లేదో వెంటనే చెప్పండి! ఈ దుస్థితిలో నేనింక బ్రతుకలేను. నివారణోపాయం లేకుంటే మీ  పాదాల వద్దనే నా ప్రాణాలు విడువాలనే వచ్చాను. మీరే నాకు దిక్కు. ఆపైన మీ దయ' అని దీనాతి దీనంగా నందిశర్మ వేడుకున్నాడు.                     



                శ్రీ గురుడు అతని పట్ల కృపచెంది, సోమనాథుడు అనే ప్రియశిష్యునన్ని  పిలిచి, 'నాయనా! నీవు ఇతనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పము చెప్పించి, అచ్చటి షట్కుల తీర్థంలో స్నానం చేయించు. తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి సేవచేయించు. అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగులబెట్టించి, కొత్త వస్త్రాలు కట్టించి, ఇక్కడకు తీసుకొనిరా!' అని ఆదేశించారు. ఆ ప్రకారమే నందిశర్మ  స్నానానికి వెళ్లి ఒక్కసారి ఆ నదిలో మునిగిపైకి లేవగానే, అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండాపోయింది! తర్వాత అచ్చటి అశ్వత్థవృక్షానికి  ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారుఛాయతో వెలిగిపోయింది. తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక  అతని పాతవస్త్రాలు మూట కట్టించి, ఒక చోట తగులబెట్టించారు. అప్పుడు ఆ తగులబెట్టిన ప్రదేశమంతా చౌడు బారిపోయింది. అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగివచ్చారు. ఒక ఘడియ కిందట దేహమంతటా కుష్ఠురోగమున్న  అతడు ఇంతలోనే శుద్దుడై, సోమనాథునితో కూడా శ్రీగురుని పాదాలకు మొక్కలని వేగంగా వస్తున్న నందిశర్మను చూచి అచ్చటి జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు.      


              శ్రీ గురుడు అతనిని చూచి, 'ఏమి  నందిశర్మా ! నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ వొళ్ళంతా చూసుకొని చెప్పు!' అన్నారు. అతడు చూచుకొని, తన పిక్క మీద ఒకచోట కొద్దిమాత్రం కుష్టు మిగిలి ఉండటం చూచి బాధపడి, ' అయ్యో,  మీ కృప వల్లకూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే! నన్ను దయచూడండి' అని వేడుకున్నాడు. శ్రీగురుడు, 'నాయనా! నీవు, " దేవతల వల్లగానిది ఒక మానవ మాతృని వలన ఎలా సాధ్యమవుతుంది? " అని సంశయించినంతమేరకు ఈ వ్యాధి మిగిలింది. ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రంచేయి. ఆ కాస్తా  తొలగిపోతుంది అన్నారు. నందిశర్మ  నమస్కరించి,  'స్వామీ! మీపట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది. కానీ నేను చదువుకోలేదు.మంద బుద్ధియైన నాకు మిమ్మల్ని స్తుతించడమెలా సాధ్యం? ' అని ఆయన పాదాలకు నమస్కరించాడు. అప్పుడాయన,  'నాయనా! ఏనుగు నోటినుండి బయటకు పెరిగిన దంతంలా మా నోటినుండి వచ్చిన వాక్యం వెనుకకు మరలదు. మేము చెప్పిందే చెయ్యాలి అని కొంచెం భస్మం  తీసుకుని,  అతనిని  నోరు తెరవమనిచెప్పి,  అతని నాలుక చివర ఉంచారు. అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిలుచుని చేతులు కట్టుకొని స్వామిని భక్తి పారవశ్యంతో ఇలా స్తుతించాడు:                            


               ఓ పరమేశ్వరా! శ్రీగురూ ! నీవే ఆ పరబ్రహ్మస్వరూపము. నీవు సర్వకర్తవు, సర్వభర్తవు, అవ్యయుడవు,  ఆత్మ స్వరూపివి,  నీవే ప్రకృతి యొక్క త్రిగుణాలనుండి భూతాలను పుట్టించి,  మాయావశమైన,  ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు. ఈ ప్రపంచమంతటిలో మానవుడు ఒక్కడే జ్ఞానానికి పాత్రుడు. అలంటి  మానవుడు కూడా దాటనలవిగాని నీ మాయచేత భ్రాంతి చెంది,  సంకల్పవంతుడై పాపపుణ్యాలవలన ఈ సంసారంలో బ్రమిస్తున్నాడు.  వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయనుండి బయటపడలేడు. ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా,  ఆ పుణ్యం వ్యయమవగానే క్రిందకు వచ్చి చంద్ర మండలంలో పడతాడు. తర్వాత వర్షంతో పాటు భూమికి చేరే అన్నమవుతాడు. అప్పుడు జీవులచేత  భక్షింపబడి రేతస్వరూపుడై తల్లిగర్భములో పడతాడు. క్రమంగా నెలలు గడిచినకొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ,  తల్లి సేవించే  కారము,  వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు. అయినా జ్ఞానం లోపించడంచేత పరమాత్మయైన మిమ్మల్ని స్మరించనేలేడు. ఆ గర్భ చెరనుండి తప్పించుకుని బయటపడ్డాక కూడా తన బాధలు,  భయాలు,  ఎవరికీ చెప్పుకోలేక, ఎన్నో బాధలు పడతాడు గాని మీ గురించిన జ్ఞానమే ఉండదు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనంలో మదించి ఎన్నోపాపాలు చేస్తాడు. అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు. వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు, సంసారికమైన చింతలు,  అతనిని తలమునకలు చేస్తాయి. వాటివలన అంతిమ క్షణంలోకూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా స్మరించనైనా లేడు. నేను కూడా ఇలానే మాయలోబడి, యెంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను. ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది. నరరూపం ధరించి,  ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన విశ్వ పాలకులు.అజ్ఞానందులైన పామరులు  మిమ్మల్ని గుర్తించనైనా లేరు. స్వామీ! నన్నీ సంసారసాగరం నుండి తరింపజేయి' అని స్తుతించాడు. అప్పుడతడు ఆ పారవశ్యంలోనే  ప్రజలవైపు తిరిగి, 'ఓ జనులారా! ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తూ పరమేశ్వరుడే గాని మానవమాత్రుడుగాడు. వీరి దర్శనంవలన నా పాపాలన్నీ - దావానలంవలన ఎండుటాకులు భస్మమైనట్లు - నశించి పోయాయి. వీరి పాద స్పర్శవలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటివ్రాత గూడా మారిపోగలదు. పెన్నిధివలె నేడు మనకు ఈయన లభించారు. అయినా మనమీయనను గుర్తించలేకున్నాము.  ఆత్మ శ్రేయస్సు కోరుకున్నవారందరూ ఈయనను భజించి,  ధన్యులు కండి. ఈయన మహత్యాన్ని నేనెంతని వర్ణించను? వాక్కుకు,  మనస్సుకూ  అతీతమైన యీయన  మహిమను వర్ణించబోయి  వేదమే మూగబోయింది!' అని ఇక నోట మాటరాక,  ఆనంద భాష్పాలు కారుస్తూ నిల్చుండి పోయాడు. అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీ గురుడు అచటివారితో, 'ఈ బ్రాహ్మణునికి "కవీశ్వరుడు" అని బిరుదిస్తున్నాము. నేటి నుండి అందరూ ఇతనిని కవీశ్వరుడనే పిలవండి' అని చెప్పారు. ఇంతలోతన పారవశ్యంనుండి తెప్పరిల్లిన నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు. అంతకుముందు మిగిలిన ఈ పాటి కుష్టుకూడా మటుమాయమవడం గమనించి, సంతోషంతో స్వామికి నమస్కరించాడు. నాటినుండి నందిశర్మ  శ్రీగురుని సేవిస్తూ,  ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండి పోయాడు. ఇటువంటి  కవీశ్వరుడే మరొకడు గూడా శ్రీగురుని సేవించి తరించాడు".       

నలభై ఐదవ అధ్యాయం సమాప్తం.


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Wednesday, June 3, 2020

గురు చరిత్ర అధ్యాయము -44

*** బుధువారం - పారాయణం ప్రారంభం ***

అధ్యాయము  -44




                               
శ్రీ గణేశాయనమః                             

శ్రీ సరస్వత్యేనమః                                                  

శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 


                     నామధారకుడు నమస్కరించి, "స్వామీ! మీ గురుని  లీలనింకొకటి వివరించండి!" అని కోరితే,  సిద్ధయోగి ఇలా చెప్పసాగారు: "శ్రీగురుని సేవకులలో తంతుకుడు  అనే సాలెవాడు ఒకడుండేవాడు. అతడు నిత్యము ఇంటిపనులు చూచుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి, నీళ్ళు చల్లి,  ముగ్గులు పెట్టేవాడు. అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరంనుండే సాష్టాంగ నమస్కారం చేసుకొని వెళ్తుండేవాడు. ఒక సంవత్సరం శివరాత్రికనీ అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మన్నారు. అతడు,  'ఓరి వెర్రివాళ్ళల్లారా!  శ్రీశైలం ఎక్కడో  ఉన్నదనుకుని కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవటమెందుకు?  శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా?  శ్రీ గురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి?  నేను ఆయనను,  ఆయన మఠాన్ని విడిచి వేరేక్కడికి రాను' అన్నాడు. అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్లిపోయారు. అతడు వాళ్లందరినీ సాగనంపి, గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు. స్వామి అతనిని పలకరించి,  'నాయనా, మీవాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీవొక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి?  అని అడిగారు. తంతుకుడు చేతులు కట్టుకుని,  'మహాత్మా !మా  వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్లారు గాని,  మీ పాదాలలోలేని క్షేత్ర మేమున్నది? ' అని చెప్పి నమస్కరించి,  తన నిత్య సేవకు ఉపక్రమించాడు. 


            తర్వాత శివరాత్రి వచ్చింది. తంతుకుడు ఆ నాడు ఉపవాసం ఉండదలచి మధ్యాహ్నం సంగమానికి వెళ్లి,  స్నానం చేశాడు. తర్వాత అక్కడ అనుష్టానానికి  వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయగలిగి,  'ఏమిరా! మీ ఇంట్లో అందరూ మల్లికార్జునస్వామి దర్శనానికి శ్రీశైలం వెల్లడం వలన ఇంట్లో పాపం నీవోక్కడివే ఉన్నావు కాబోలు! నీవిదివరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా,  లేదా? ' అన్నారు. తంతుకుడు, 'స్వామీ! ఏలినవారి పాదాలు తప్ప నేనింకేమీ ఎరుగను. తీర్థయాత్రలన్నీ  నాకు మీ  పాదసేవలోనే ఉన్నాయి' అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు. 'ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది. నీవెప్పుడూ చూడలేదు కదా, నీవు గూడ  వెళితే బాగుండేది' అన్నారు శ్రీ గురుడు. అతడు, 'స్వామీ ! నాకు దానిమీద అంత ప్రీతిలేదు.' అయినా మీరు అంతగా చెబుతున్నారు గనుక,  ఎప్పుడైనా మీరుచూపిస్తే చూడాలని ఉన్నది' అన్నాడు. శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి  అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి, 'నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకిప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది. నీవు ఈ మా పాదుకలు గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో!' అని ఆదేశించారు. అతడు,  'చిత్త'మని అలానే చేసాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణ కాలంలో శ్రీశైలంలోని పాతాళగంగ ఒడ్డుకు చేర్చి  అతనిని కళ్ళు తెరవమని చెప్పారు. అతడికి ఆ క్షణకాలం నిద్రతూగినట్లయింది. అతడు కళ్ళు తెరచి చుట్టూచూచి మొదట భయపడ్డాడు. శ్రీగురుడు నవ్వుతూ,  'భయపడతావెందుకు?  ఇదే శ్రీశైలం. నీవు వెంటనే క్షౌరము, స్నానము మొ||నవి పూర్తి చేసుకుని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొనిరా, పో ! అని హెచ్చరించారు.        


                       తంతుకుడు శ్రీ గురునకు  నమస్కరించి,  ఆయన చెప్పినవన్నీ పూర్తిచేసుకుని,  మల్లికార్జునుడి దర్శనానికి వెళుతుండగా,  దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ళు అతనిని చూచి ఆశ్చర్యపడి, "ఏమయ్యా !నీకు  ఆ స్వామి సేవ తప్ప మరే  యాత్రలు అక్కరలేదన్నవాడివి మళ్లీ మా వెనకనే ఈ క్షేత్రానికి వచ్చావేమీ?' అని ఎగతాళి చేశారు. వారితో తంతుకుడు, 'నేను నిజం చెబుతున్నాను. ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను. కానీ శ్రీగురుడు ఇంతలో నన్నిక్కడకు తీసుకువచ్చారు. అంతేగాని,  నాకేమీ తెలియదు' అన్నాడు కానీ అతని మాటలు ఎవరూ  నమ్మలేదు. 'వీడు మనకు కనిపించకుండా మన వెనుకనే  వచ్చిఉండాలి' అనుకున్నారు. తంతుకుడు అదేమీ పట్టించుకోక గంధము,  పువ్వులు,  అక్షింతలు,  బిల్వదళాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు. కాని అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు,  ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు.అచటి  భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ  ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమయింది. అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచకితుడయ్యాడు కానీ,  మరలా అంతలో తెలివితెచ్చుకొని, "శ్రీ గురుడు సాక్షాత్తూ  శంకరుడే గదా!" అని సమాధానపడ్డాడు.               


         తర్వాత మల్లికార్జునునికి పూజ చేసుకుని,  పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాళగంగవద్దకు చేరాడు. శ్రీగురుడు అక్కడ యధాపూర్వమేకనిపించి,'నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్లతో కలిసి వస్తావా, లేక మాతోవస్తావా? ' అని అడిగారు. తంతుకుడు, 'మహాత్మా,  నేడు ఒక గొప్ప విచిత్రం చూచి వచ్చాను. లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకక్కడి శివలింగంలో మీరే ఉండి,  అందరూ చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమయింది. తలక్రింద కొండను ఉంచుకొని గులకరాళ్ళకోసం చుట్టూ గాలించే వారిలా, దగ్గరనున్న  మిమ్మల్ని విడిచి వీళ్లంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో  నాకు తెలియటంలేదు. మీరు మానవాకృతితో అవతరించిన పరమేశ్వరులు  అయినప్పటికీ నివురుగప్పిన నిప్పులా మీ మహిమ అందరకూ  గోచరించటంలేదు. అది తెలిశాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేది ఏమున్నది?  మీ పాదాల వద్ద పడియున్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకు వచ్చారో  నాకర్థం కావటంలేదు' అన్నాడు. స్వామి,  'నాయనా,  అలాకాదు. విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ,  ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన  మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది' అన్నారు. అప్పుడా భక్తుడు  దానిని వివరించమని కోరగా శ్రీ గురుడు ఇలా చెప్పారు:


                    "నాయనా! మహాశివరాత్రినాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది. పూర్వం కీరాత దేశంలో పరాక్రమశాలి,  బుద్ధిమంతుడూ,  అయిన విమర్షణుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ఈశ్వర భక్తుడే గాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ,  పరస్త్రీలంపటుడుగా  ఉండేవాడు. కానీ మరొక వంక నిత్యమూ  శ్రద్ధగా లింగార్చన చేసి,  నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు. అతని భార్య కుముద్వతి  మహా గుణవంతురాలు. ఆమె ఒక రోజున అతనితో,  'ప్రాణనాధా! మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను,  చెప్పండి. ఆహార విహారాదులలో యెట్టి నియమమూ  పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమయింది? 'అని అడిగింది. రాజు నవ్వి,  ఇలా చెప్పాడు:                               


                  "ప్రేయసి! నా పూర్వజన్మ వృత్తాంతం చెబితేగాని నీకీ  సందేహం తీరదు.వెనుకటి జన్మలో నేనొక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రినాడు ఊళ్లోని జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్లారు. ఆనాడు అందరూ ఉపవసించాలి గనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు; నాకు పెట్టనూలేదు. అందువలన అందరితోపాటు నేనుకూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళ్తుంటే,  నేనుకూడా తోక ఆడించుకుంటూ దారిలో పులిస్తరాకులకోసం వెతుక్కుంటూ  వారి  వెంటనే వెళ్ళాను. గ్రామస్తులందరూ తలొక దివిటీ  చేతపట్టుకొని శివ నామ సంకీర్తనం చేస్తూ  ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న  ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా  తిరుగుతున్నాను. నేను లోపలికి చూసేసరికి అచ్చటి శివలింగం నా కంటపడింది. ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు  నన్ను చూచి, 'కుక్కను  కొట్టండి!' అని కేకలు వేశారు. నేను పారిపోవాలని చూచాను గాని,  సింహద్వారం దగ్గర సందులేకుండా జనం మూగడంతో నాకు దారి చిక్కలేదు. కొందరు కర్రలు చేతబట్టుకుని తరుముతుంటే నేను వారి బారినుండి తప్పించుకోవాలని మూడుసార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను. చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాదటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణంవిడిచాను. ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసముండి, శివపూజ దర్శించి,  ప్రదక్షిణలు చేసిన పుణ్యము ఆర్జించాను. ఆలయ ద్వారం వద్ద నిల్చిన  వారిచేతిలోని దివిటీలనూ దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను. అందువలననే నాకిప్పుడు  ఇంత మాత్రమైనా జ్ఞానము,  రాజ్యము  లభించాయి. అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్నింకా  వదలలేదు. అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకున్నాను."                                              


                      కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి "ప్రాణనాథా ! శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు. దయతో నా వెనుకటి జన్మ ల గురించి తెలపండి" అని వేడుకున్నది. విమర్షణుడు నవ్వి,  "ప్రేయసీ ! పూర్వం శ్రీశైలంలో నీవొక పావురంగా ఉన్నావు. నీవొక రోజు అడవిలో మాంసం ముక్కను ముక్కున కరచుకొని పోతుండగా, ఒక డేగ దానిని లాక్కోదలచి నిన్ను తరిమింది. నీవు ప్రాణభీతితో మల్లికార్జునుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు. చివరికది నిన్ను చంపి ,మాంసం ముక్కను ఎత్తుకు పోయింది.ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల, నీవీనాడు రాణిగా జన్మించావు" అని చెప్పాడు. నాటినుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి, "నాథా ! ముందు జన్మలో మనకు ఏమి జరగనుందో కూడా సెలవియ్యండి" అని కోరింది. అప్పుడు రాజు ఇలా చెప్పాడు: "సఖీ ! నేను సింధుదేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను. నీవు సంజయదేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్యవవుతావు. ఆపై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను; నీవు కళింగ రాజకుమార్తెవై, నా రాణివవుతావు. అటుపై జన్మలో నేను గంగాధర దేశానికి రాజునవుతాను; నీవు మగధదేశ రాజపుత్రికగా జన్మించి,నన్ను వివాహం చేసుకుంటావు . ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు, నీవు దశార్ణ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషివవుతావు. అటు తర్వాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను. నీవు యయాతి వంశంలో జన్మించి, నా రాణివవుతావు. ఆపైన నేను పాండ్యదేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను; అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతీయనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు. అప్పుడు నేను సర్వ శాస్త్రాలూ నేర్చి దేవతలను,  బ్రాహ్మణులను పూజిస్తూ దానధర్మాలు చేసి,  చివరకు వృద్ధాప్యంలో అగస్త్యమహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకుని మరణించాక, నీతో కలసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికీ కారణం శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే. కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము "అని చెప్పి, కుముద్వతితో కలసి యాత్రచేసి వచ్చాడు.                        


                 కనుక, తంతుకా! తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షణం వలన ఒక పావురానికి రాణి పదవి, తర్వాత మోక్షమూ  కలిగాయి. నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరమూ ఈశ్వరుణ్ణి ఆరాధించు. గంధర్వనగరంలో ఈ మల్లికార్జునునితో సమానమైన మహిమ గల కల్లేశ్వరుడున్నాడు. నీవు నిత్యమూ  ఆయనను ఆరాధించు' అని చెప్పారు. తంతకుడు, 'స్వామీ ! మీరెందుకిలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు. మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా? సర్వవ్యాపకులు, పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించి నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి? మీరు గాక వేరొక దైవమున్నాడా  ఏమి?' అని గురు పాదాలకు నమస్కరించాడు. శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకొమ్మని చెప్పి, రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో కూడా చేర్చారు. వీరిద్దరూ శ్రీశైలంలో నున్న సమయంలో పురవాసులెందరో శ్రీనృసింహ సరస్వతీ  స్వామి దర్శనం కోసం మఠానికి, సంగమానికి వచ్చి, పవిత్రమైన మహాశివరాత్రినాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగి పోయారు. తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంతకుణ్ణి  గ్రామానికి పంపారు. అందరూ అతనిని చూచి ఆశ్చర్యంతో,  'నీవు మహాశివరాత్రినాడు తల గొరిగించుకున్నావేమి?' అని ఎగతాళి చేశారు. అతడు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి, అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము, పువ్వులూ చూపాడు. వాళ్లు అది నమ్మలేక, 'ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూచాము. నీవు చెప్పేది నిజంకాదు. ఈ పువ్వులు యింకెక్కడనించో తెచ్చావులే ఫో!' అన్నారు. అప్పుడతడు తనను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్లి వచ్చిన సంగతి చెప్పి, 'ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు. మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు. కావాలంటే వారిని అడగండి' అని చెప్పాడు. శ్రీగురుని మహత్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి, ఆ రూపంలో తమకుకూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్తుతించారు.           


                    తర్వాత పదిహేను రోజులకు శ్రీశైలయాత్రకు వెళ్ళిన పురవాసులు తిరిగివచ్చి, ఆ క్షేత్రంలో తాము తంతకుణ్ణి చూచామని చెప్పారు. అంతవరకూ అతని మాటలు నమ్మనివారు కూడా, తంతకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు. తంతుకుడు యావజ్జీవమూ  స్వామిని సేవించి, చివరకు ముక్తి పొందాడు. శ్రీగురుని మహత్యం ఎంతని చెప్పగలము?"          

నలభై నాల్గవ అధ్యాయం సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

గురు చరిత్ర అధ్యాయము -43


అధ్యాయము  -43




                               
శ్రీ గణేశాయనమః                             

శ్రీ సరస్వత్యేనమః                                                                                                  

శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 


                           శ్రీ గురుడు సాయందేవునితో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగి ఇలా తెలిపారు: "ఈ  అనంతవ్రతము ఆచరించడంవలన ఎందరికో అభీష్టాలు సిద్దించాయి.  దీనివలన ధర్మరాజు,  తాను కోల్పోయిన రాజ్యమంతా  తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి,  తన తమ్ములను,  ద్రౌపదినీ  తీసుకొని,  ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్లి,  ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతియని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైనవారు వాళ్ళ రాజ్యమపహరించి, పరాభవించి, అడవులకు పంపడమే కాకుండా వారిని యింకెన్నోరీతుల కష్టపెట్టారు. వారు కడుపునిండా భోజనమైనా లేక భాదపడుతుంటే,  వారిపుణ్యం కూడా నశింపజేయమని దూర్వాస  మహర్షిని పురిగొల్పి  వారిపైకి పంపారు. అప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారివద్దకు వెళ్ళాడు. పాండవులు అతనిని పూజించి,  'స్వామీ,  నీవు భూభారం  తొలగించడానికే అవతరించావు.  మేము మీకు ప్రాణసమానులమైనప్పటికీ ఈ అడవిలో దాగియుండవలసి వచ్చినదేమిటి? నీవే ఉపేక్షిస్తే,  మాకింక దిక్కెవరు?' అని బాధపడ్డారు. ద్రౌపదికూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది.శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు: 'నేనే అనంతుడను, సర్వవ్యాపిని,  త్రిమూర్తులు,  చతుర్దశ భువనాలు ఆకాశంవలె అనంతుడనైన నాయందు వున్నాయి.అట్టి  సర్వాంతర్యామిగ,  అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్టగా వ్రతం చేసుకుంటే మీ అభీష్టాలన్నీ నెరవేరుతాయి. మీ కష్టాలు తీరుతాయి.                                       

                    ఈ అనంత వ్రతం,  భాద్రపద శుద్ధ చతుర్దశినాడు మధ్యాహ్నం సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు. పూర్వం కృతయుగంలో వశిష్ట గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. సుశీల తండ్రివద్దనే  పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది. సుమంతుడు తన కర్మానుష్టానానికి భంగమురాకుండా ఉండేందుకు రెండవ వివాహము చేసుకున్నాడు. కాని, ఆమె గయ్యాళి.  ఎప్పుడూ  భర్తతోనూ,  సవతి కూతురుతోనూ పోట్లాడుతుండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన  కౌండిన్యునికి  ఇచ్చి వివాహం చేశాడు. కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వ లేక,  కౌండిన్యుడు వేరొకచోట కుటీరంలో కాపురం ఉండ తలచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్లేరోజు కూడా దోవ బత్తేనికి కించిత్తు  పేలపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్దీ గోధుమపిండి మాత్రం ఒక ఆకులోకట్టి  ఇచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నము ఒక ఏటివద్ద ఆగి, కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకొన్నాడు.  అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు  కట్టుకొని, కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా,  తాము  అనంత వ్రతము చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రతవిధానము ఇలా చెప్పింది:                            


                                'ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశినాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధము చేసుకొని,  ప్రవహించే నీటిలో స్నానం చేసి, ఎర్రని చీర కట్టుకొని,  ఆకులతో ఒక కలశం స్థాపించాలి. ఒక క్రొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మము గీచి,  దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతినుంచి,  శేషశాయియైన చతుర్భుజుని  ద్వాదశాక్షరీ మంత్రంతో గాని,  పురుషసూక్త విధానంతోగాని,  యథాశక్తి పూజించాలి. తర్వాత ఆ తోరము కుడిచేతికి కట్టుకొని, పాతతోరము విసర్జించాలి. తరువాత గోధుమపిండివంట నివేదించి,  దక్షిణతో సహా ఒకవేదవిప్రునికి దానమియ్యాలి. తరువాత యధాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు  దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి,  ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత గూడా అనంతవ్రతం చేయించింది. తరువాత ఆమె తన భర్తతో కలసి బయలుదేరింది. ఆ వ్రతమహిమా  అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి,  వారినక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా  నివశించాడు.           


                       ఒకరోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి, 'ఇదేమిటి?  నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరం ధరించావా  ఏమి?  అని అడిగాడు. అది అనంత తోరమని, దాని మహిమ వల్లనే  తమకు సిరిసంపదలు వచ్చాయనీ  ఆమె చెప్పినా నమ్మక,  అతడు దానిని త్రెంచి నిప్పులో పడేసాడు. కొద్దికాలంలో వారింట దొంగలు పడి సర్వమూ  దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తనతప్పిదము  గుర్తించి,  ఎలాగైనా అనంతుని దర్శించి,  ఆయనను శరణు పొందనిదే భోజనమైనా చేయనని శపథము చేసి, "అనంతా! అనంతా!" అని  కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు. దారిలో ఒక చోట పూత, కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమీ చిత్రమో గాని, దాని మీద ఒక్క పక్షైనా వాలలేదు. కౌండిన్యుడు, 'అనంతుడు ఎక్కడ?' అని అడుగగా,  ఆ చెట్టు, 'నాకే ఆయన దర్శనం లభించలేదు!' అని చెప్పి,  'నీకు కనిపిస్తే, నా  దుస్థితి గురించి ఆయనకు నివేదించు' అని చెప్పింది. ఆ ముని  మరోకచోట ఒక గడ్డి పరాకైనా కొరకని ఆవును,  దూడను చూచి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరోక చోట అటువంటి అంబోతే  కనిపించి అలానే చెప్పింది.ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి రెండు కొలనులు  కనిపించాయి. ఒక దానిలోని నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది. వాటి దగ్గర ఎక్కడా ఒక్క కొంగైనా వాలడంలేదు. అవి కూడా అనంతుని  గురించి అతనికి అలానే చెప్పాయి. తర్వాత ఒక  గాడిద, ఒక ఏనుగు  కనిపించి,అనంతుడు తమకేక్కడా కనిపించలేదన్నాయి.


                    చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒకచోట కూలబడ్డాడు. అప్పుడొక ముసలివాడు అతనిని చేయిపట్టి లేవదీసి, 'అనంతుని చూపిస్తాను రమ్మని ', ఒక అందమైన పట్టణంలోని రాజ భవనంలో సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహుని చూపించాడు. కౌండిన్యుడు, అతడే అనంతుడని తలచి అతనిని స్తుతించి, నమస్కరించాడు. అప్పుడు అనంతుడు అతనికి నాలుగు పురుషార్థాలు,  శాశ్వత వైకుంఠ నివాసమూ వరంగా ప్రసాదించాడు.                         


                       అప్పుడు కౌండిన్యుడు,  తాను అడవిలో చూసిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడిలా  చెప్పాడు: 'పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై  కూడా ఎవరికీ విద్య నేర్పకుండా,  తన కాలమంతా శాస్త్ర వాదాలతోనే గడిపాడు. అందుకతడు మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టై అడవిపాలయ్యాడు. చవిటినేలను దానమిచ్చిన వాడు మరుజన్మలో మేతమేయని పశువయ్యాడు. శ్రీమంతులై  గూడా కొంచమైనా దానము  చేయనివాడు నీవు చూచిన ఆబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కచెల్లెళ్లే  నీవు చూసిన ఆ రెండు చెరువులు. క్రోధము వహించినవాడు గాడిదగాను,  మదించి  విచ్చలవిడిగా ప్రవర్తించినవాడు ఏనుగుగానూ  జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడయ్యావు  గనుకే  ఆ వృద్ధుడి  రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను.  అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి  నీతో చెప్పుకొని నాకు తెల్పమని  నిన్ను కోరినాయి గనుకనే వాటన్నింటికీ ముక్తి కలిగింది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు' అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటినుంచి సుశీలాదేవి,  కౌండిన్యుడు సుఖంగా జీవించి  తర్వాత వైకుంఠానికి వెళ్లారు".            


                    శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని,  పాండవులు అనంతవ్రతం  ఆచరించి, అనంతుని కృపవలన యుద్ధంలో శత్రువులను ఓడించి,  మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు. నమ్మి  ఈ వ్రతం ఆచరించి సత్పలితము పొందనవారే లేరు. కనుక సాయందేవా! నీవుకూడా నీ గోత్ర ఋషియైన కౌండిన్యునివలె ఆ వ్రతం ఆచరించు. ముందు ముందు నాగనాథుడు,  అతని సంతతివారు నిష్టతో ఈ వ్రతం ఆచరించి,  శ్రీ గురుని పూజించి, అచ్చటి  బ్రాహ్మణులకు,  సన్యాసులకూ  సంతర్పణ చేశారు. తరువాత అతడు తన భార్యాబిడ్డలను ఇంటివద్ద దించివచ్చి,  తన జీవిత శేషమంతా గురు సేవలోనే గడిపి తరించాడు. అందువల్లనే నీకీనాడు కల్పవృక్షం వంటి 'శ్రీగురుచరిత్ర' లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో  ధన్యుడవు". 


నలభై మూడవ అధ్యాయం సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


**మంగళవారము పారాయణం సమాప్తము**

Tuesday, June 2, 2020

గురు చరిత్ర అధ్యాయము -42



అధ్యాయము  -42



శ్రీ గణేశాయనమః                             

శ్రీ సరస్వత్యేనమః                                                                                                  

శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 





                వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్ణకు అవధూత బోధించిన కాశీయాత్రా విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు: " విశ్వేశ్వరుని దర్శనము,  అంతర్ గృహ యాత్ర, దక్షిణ ఉత్తర మానస యాత్ర, పంచక్రోశయాత్ర,  స్నానము,  దానము,  అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ- విశ్వేశ్వర- బిందుమాధవ- డుండి  వినాయక- దండపాణి- కాలభైరవ- గుహ - గుహకాశీ- మణికర్ణిక- మొ || నవి దర్శించి,  పూజ చేసి,  నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ట చేసుకో. ఇలాచేస్తే నీగురు భక్తి దృఢమై,  ఈశ్వర సాక్షాత్కారమవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనస్సులో గురు చరణాలను స్థిరంగా నిలుపుకో',  అని చెప్పి,  రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ణ ఆశ్చర్యచకితుడై, 'ఆహా,  ఈ మహాత్ముడు నా గురు కృపవలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే,  సందేహము లేదు. తనను నేను ఆరాధించుకున్నా,  ఆయన ప్రసన్నుడవటము గురుకృప వల్లనే కదా! లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా ప్రసన్నుడు కానీ ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడౌతాడు?' అనుకుని యధావిధిగా కాశీ యాత్ర,  లింగ ప్రతిష్ఠ చేశాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగములో శంకరుడు  దర్శనమిచ్చి, వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు,  గురుభార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి,  'నాయనా, నీ గురు భక్తికి మెచ్చాను. నీవు 'విశ్వకర్మ' అనే సృష్టికర్తవు అవుతావు.' అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు.


                 త్వష్ణ సంతోషించి తన గురువు,  గురుపత్ని,  పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి,  అతనికి జ్ఞానము,  సర్వసిద్ధులు,  నవనిధులు,యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యము కానిది ఏదీలేదు. గురుభక్తునికి ముగ్గురు మూర్తులూ  వశులవుతారు. గురువు లేక మోక్షము సిద్ధించదు."              


                         శ్రీ గురుడు గురుసేవ ప్రాశస్త్యం  చెప్పడమయ్యేసరికి సూర్యోదయమైంది. సాయం దేవుడు,  శ్రీగురునికి నమస్కరించి ఆనంద పారవశ్యంతో, 'ఓ  కృపామూర్తీ! నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది. మీరి కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతోకలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. అది నిద్రావస్తొ, లేక  స్వప్నమో తెలియటం లేదు. జగద్గురూ! మీ నిజతత్వము తెలియని మూడులకు విశ్వేశ్వరలైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ' అంటూ ఉంటే అతని శరీరమంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది. అతడిలా శ్రీగురుని స్తుతించాడు:       


                '(1). మొదట అద్వయులుగా ఉండి, సంకల్పమాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి,  మరలా దానిని పాలించడానికి అవతరించిన,  ఓ నృసింహ సరస్వతీ ! మీ పాద పద్మములకు వందనములు (2). కలి ప్రభావం వలన ధర్మం నశించి, యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనలననుసరించి,  భూమిపై అవతరించి,  ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతీ! మీ పాద పద్మములకు నమస్కారములు.(3). సంసార సాగరంలో మునిగిఉన్న భక్తులను తరింప చేయడానికి అవతరించి,  చతుర్దాశ్రమం  స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతీ ! మీ పాద పద్మములకు నమస్కారములు(4). స్వామీ,  మీ చరిత్ర చిత్రమైనది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గుడ్డివారికి దృష్టి, గొడ్రాలికి  సంతానము, ఎండు కట్టెకు  ప్రాణం, విధవరాలికి  సౌభాగ్యము,  భక్తులకు సిరిసంపదలు ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతీ ! మీ పాదపద్మములకు నమస్కారములు(5). పాపాన్ని,  దారిద్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ,  కామదేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ, ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకుకూడా అతీతమైన స్వరూపంగల ఓ నృసింహ సరస్వతీ! మీ పాద పద్మములకు నమస్కారములు. (6) ఓ గురుమూర్తి! మీ పాదపద్మములను నిత్యము స్మరించేవారికి సర్వతీర్థక్షేత్రాలను  సేవించిన ఫలితము,  వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేదాదియాగాలు చేసిన ఫలితము  ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతీ! మీ పాదపద్మములకు నమస్కారములు. (7). వేదాలకుకూడా మీ నామ మహత్యం అంతుపట్టనిది. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరల మరల నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతీ! మీ పాదపద్మములకు నమస్కారములు. శ్రీ సద్గురూ! నన్ను రక్షించు,  వేదాలకు గూడా అంతు పట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమీ వర్ణించగలను?  మీరు ఓంకార స్వరూపులు. పంచభూతాలు,  సూర్య చంద్రులు,  జీవాత్మ అనే ఎనిమిది రూపాలలో మీరు విశ్వరూపం ధరించారు.ఓ నృసింహ సరస్వతీ ! మీ పాద పద్మములకు నమస్కారములు. (8). ఈ కలియుగంలో భక్తులనుద్దరించడానికి దండకమండలుధారియైన యతీశ్వరుని రూపంలో అవతరించి,  భీమా - అమరజా సంగమంలో శ్రీ నృసింహ సరస్వతియను పేర నివసించిన శ్రీగురూ! మీ  పాదపద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపచేయడానికి, యోగులకు  దీక్షనను గ్రహించడానికీ  గానుగాపుర  క్షేత్రంలో వెలసి, నాలుగు పురుషార్థాలూ  ప్రసాదిస్తున్న ఓ  నృసింహ  సరస్వతీ ! మిమ్మల్ని స్తుతించడం  వలన నాలోని దోషాలన్నింటిని జయించి, మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. (9). శ్రీగురుస్తోత్రమైన  ఈ అష్టకాన్ని నిత్యమూ పఠించిన వారికి బలము,  సంపద, సద్బుద్ధి , వర్చస్సు,  పుత్ర పౌత్రాభివృద్ధి,  ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి  తోడు,  అటు తర్వాత ముక్తి  కూడా లభించగలదు' శ్రీగురుడు సంతోషించి,  'నాయనా! నీకు కాశీ దర్శనమైంది గదా! ఇందువలన నీ వంశంలో ఇరవై ఒక్క తరాలవారికి కాశీయాత్రాఫలం సిద్ధించింది. నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో ! కానీ అలా చేయాలంటే ఆ మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు. గనుక నీ భార్యాబిడ్డలను తీసుకొనివచ్చి గంధర్వనగరంలో ఉండు అని చెప్పి,  అతనిని వెంటబెట్టుకుని గ్రామంలోని తన మఠానికి తిరిగి వచ్చారు.    


                                                    సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్లి,  భార్యా బిడ్డలను తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు. అతడు శ్రీగురుని దర్శించి,  'త్రిమూర్తి! మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు,  మీ దర్శనమాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము  పాపాన్ని,  చంద్రుడు తాపాన్ని,  కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు.  కానీ పాప, తాప, దైన్యాలను మూడింటిని మీ  దర్శనమే పోగొట్టగలదు.  మీ కృప సర్వ పురుషార్థాలనూ  వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యము నాకిప్పుడు అనుభవమైంది' అని మైమరచి గంతులేస్తూ,  తన మాతృభాషయైన  కన్నడం లో ఇలా స్తుతించాడు:    


                                            '(1). భూమిపై భక్తుల పాలిటి భాగ్యనిధియై  అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను(2) భక్తితో ధ్యానించేవారికి సుఖమిచ్చే జగత్పతియైన మీ చరణ కమలాలు  దర్శించగలిగాను. (3). సంసారంలో తపిస్తున్న భక్తులకు అభీష్టాలిచ్చి, యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీనరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు  కలిగింది. (4).మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్త్వమే సగుణమై సత్పురుషుల నుద్ధరించడానికి దండకమండలములు  ధరించి,యతి   సార్వభౌముడిగా అవతరించిన ఓ  నరసింహ సరస్వతీ! నేడు నాకు మీ దర్శనమైంది. (5). భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ  పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాసమైంది. అట్టి మీ పాదదర్శనం నేడు నాకు లభించింది.(6). యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రునివలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు  కలిగింది. మీ యతిరూపంలో భక్తజనుల మహాభాగ్యమే  సాకారమై వెలిసింది.(7). వేదాంతతత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించ గలిగాను.  భక్తులను రక్షించడంలోజాగు చేయని దయాఘనా ! నీకు జయము. (8). ఆనంద సముద్రుడు,  గంధపరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడూ  అయిన శ్రీకృష్ణుని,  మీ రూపంలో దర్శిస్తున్నాను. (9). ప్రకృతి -పురుషుల అభేదాన్ని'నరసింహ + సరస్వతి' అను పేరు సార్థకమొనర్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను. 


                            శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని,  అతని భార్యాబిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని,  వాత్సల్యంతో వారిక్షేమ సమాచారాలు విచారించారు. సాయందేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు  ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయందేవుని పెద్ద కుమారుడైన నాగనాధుని చూపిస్తూ ఆయన, 'సాయందేవా! ఇతడు సిరిసంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు,  మాకు ప్రీతిపాత్రుడు వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవతియైన నీ  భార్య పతివ్రత. మీకింకా నలుగురు కొడుకులు కలుగుతారు. మ్లేచ్చుని  సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది గనుక నీవది విడిచిపెట్టి మావద్దనే ఉండు' అని,  అతని భార్యా పిల్లలను కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయందేవునితో స్వామి,  'మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్లి స్నానము చేసి,  అశ్వత్తాన్ని  పూజించుకొనిరా' అని చెప్పారు.                                       

                        ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి. కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతము  చేసుకుని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వనగరము వస్తున్నారు. శ్రీ గురుడు సాయందేవునిగూడా అనంతవ్రతము చేసుకోమని చెప్పారు. అతడు, 'మీరే నాకు అనంతులు, మీ  పాదసేవయే  నాకు అనంతవ్రతము. నాకింక వేరొక వ్రతం ఎందుకు?  అన్నాడు. స్వామి, 'నాయనా,  నీవు మామాట విని వ్రతం చేసుకో! పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతము చేసుకొని అభీష్టాలన్నీ  పొందాడు. నీవు కూడా కౌండిన్యస గోత్రుడవే  గనుక ఈ వ్రతమాచరించు' అన్నారు. అప్పుడు సాయందేవుడు, 'స్వామీ !అలా అయితే ఆ  వ్రతవిధానమేమో, మా గోత్రఋషి దానివలన ఎలా కృతార్ధులయ్యారో  వివరించండి' అని కోరాడు. శ్రీగురుడు  వివరించారు".  

నలభై రెండవ అధ్యాయం సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Monday, June 1, 2020

గురు చరిత్ర అధ్యాయము - 41


అధ్యాయము  -41




                               
శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 



                        నామధారకుడు, "స్వామీ! సర్వధర్మాలతో కూడిన శ్రీ గురుచరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే  జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు మీరు. నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీ గురుభక్తులు ఎలా అయ్యారో  తెలుసుకోవాలని ఉంది,  చెప్పండి' అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు:  


            "నాయనా! పూర్వం శ్రీ  గురుడు తీర్థాటనం  చేస్తూ, గోదావరీ తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి, ఆయన ప్రేమకు పాత్రుడైన సాయందేవుడే నీ పూర్వీకుడు. అటుతర్వాత శ్రీ గురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి, ఈ గంధర్వనగరం చేరారుగదా! అటు తర్వాత వారి కీర్తి దశదిశలా వ్యాపించి, సుదూర ప్రాంతాలనుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి, అభీష్టసిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయందేవునికి తెలిసింది. అతడు అందుకు ఎంతో ఆనందించి, ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీ  గురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంటపడగానే, అతిశయించిన భక్తిశ్రద్ధలతో అడుగడుగుకు  సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీగురుని దర్శించగానే, అతనికి రోమాంచితమై, ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, తన జుట్టుతో వారి పాదాలు తుడిచి, గద్గద  స్వరంతో ఆయననిలా  స్తుతించాడు:                    


                              ఓ పరమాత్మ! పరంజ్యోతి! నృసింహసరస్వతీ ! మీరు త్రిమూర్త్యాత్మకులే గాని, మానవమాత్రులుగారు. సర్వ తీర్థాలకూ  ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను. మా పితరులుకూడా కృతార్థులయ్యారు. ఓ  సర్వవ్యాపకా! సద్గురూ! భక్తవత్సలా! జయము. జీవుల పట్ల కరుణయనే  జలంతో నిండిన కమండలం  ధరించిన  మీరు సాక్షాత్తు ఆ  బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి,  చనిపోయిన వారిని మరల బ్రతికిస్తున్నారు. స్వామి! దండమును ధరించిన మీరు సాక్షాత్తూ దుష్టులను దండించి,  భక్తుల దైన్యాన్ని పారద్రోలి  రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే, యిప్పుడిలా  సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము,  రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను, భవరోగాన్ని నశింపజేయుగల సమర్థులు, సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చినవాడు  బ్రతికాడో, గొడ్డుబర్రె పాలు ఇచ్చిందో, మేడికట్టె వృక్షమైందో, హీనుడుద్ధరింపబడ్డాడో అట్టి మిమ్మెవరెరుగగలరు?'        


                    శ్రీ గురుడు సంతోషించి  సాయం దేవుడి తలపైచేయి పెట్టి, 'నాయనా! నీవు మాకు పరమ భక్తుడవు.  నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది. నీ  వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లదురుగాక!' అని ఆశీర్వదించారు. తర్వాత శిష్యులందరితో ఆయన, 'మీరంతా సంగమంలో స్నానం చేసి, అశ్వత్థవృక్షాన్ని సేవించి పంక్తి  భోజనానికి రండి' అని చెప్పి, సాయందేవునితో, 'నీవు కూడా వారితో వెళ్లిరా, ప్రసాదం తీసుకుందువు' అన్నారు. అందరూ సంగమానికి వెళ్లి వచ్చాక, అతడు శ్రీగురునికి పూజచేసి, భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతనిని తన ప్రక్కనే కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించారు. తర్వాత అతనిని దగ్గరకు పిలిచి, 'నాయనా,  నీవు ఎక్కడ ఉంటున్నావు? నీ భార్యబిడ్డలు క్షేమమా? చాలాకాలానికి కనిపించావు' అన్నారు. అతడు, 'స్వామీ మీరు సర్వజ్ఞులు. మీకు తెలియనిది ఏమున్నది? మీ  దయ వలన అందరము క్షేమమే. నా భార్యబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు. నా కుటుంబ భారం అంతా కొడుకులు చూసుకుంటున్నారు. కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను. మీరు అనుగ్రహించాలి' అని వేడుకున్నాడు. శ్రీగురుడు నవ్వి, 'నాయనా మమ్మల్ని సేవించడం అంత సులభంకాదు. మేము ఒక చోట ఉండేవారముకాము. ఎక్కడ బడితే అక్కడే ఉంటాము. ఒకప్పుడు ఊరిలో ఉంటే, మరొకప్పుడు అడవిలో ఉంటాము. మాతో కలసి ఉండడం, మా సేవ చేయడం కష్టం. కనుక బాగా ఆలోచించుకో!' అన్నారు.           


                            సాయందేవుడు, 'స్వామి, మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు. మీరు ఉండగా నాకు భయమేమిటి. గురుసన్నిధికి చేర్చే పాదాలే పాదాలు; గురుపూజ చేసే చేతులే చేతులు. గురు పాదాలను అంటే శిరస్సే శిరస్సు. సర్వ అభిమానాలను నివారించి, పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమి? నేను మీ చెంతనే ఉండి, మీ పాదసేవ చేసుకుంటాను. అనుజ్ఞ ఇవ్వండి' అని పట్టుపట్టాడు. అప్పుడు శ్రీ గురుడు,  'నీకంత దృఢభావం ఉంటే అలానే చేయి' అని అంగీకరించారు. అతడు స్వామి సన్నిధిలో మూడు నెలలున్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీ గురుడు శిష్యులనెవ్వరిని రావద్దని చెప్పి, సాయందేవుణ్ణి ఒక్కడినే కూడా తీసుకొని సంగమానికి వెళ్లారు. ఇంతలో మరి కొందరు శిష్యులొచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంద్యోపాసన అయ్యాక, శ్రీ గురుడు అశ్వత్థవృక్షం క్రింద కూర్చుని, కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. కొంతసేపటికి వారంతా గానుగాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు, సాయందేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడతనిని పరీక్షించదలచి, శ్రీగురుడు ఒకలీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. ఆ గాలికి చెట్లు ఊగిపోయి,  విరిగి పడుతున్నాయి. ఆకాశమంతా  కారుమేఘాలు అలముకుని భయంకరంగా ఉరుములు, కన్నులు మిరుమిట్లు గొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమైంది. సాయందేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకుని, తన వంటిపై నున్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిల్చున్నాడు. ఇలా గాలి, వాన అర్ధరాత్రి రెండవ ఝాము వరకూ కొనసాగాయి. గాలి వాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచసాగింది. అప్పుడు శ్రీ గురుడు,  నాయనా మమ్మల్ని చలి బాధిస్తున్నది. గ్రామానికి వెళ్లి మఠంనుండి అగ్ని తీసుకురా' అన్నారు. అతడు బయలుదేరుతుంటే, అతనిని బాట కటూఇటూ చూడకుండా త్వరగా వెళ్లి రమ్మని చెప్పారు. 


                    వెంటనే సాయందేవుడు బయల్దేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు. దారిలో ఎక్కడ అడుగు పెట్టినా మోకాలులోతున బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఆపైన నీరు, రొమ్ములోతున ప్రవహిస్తోంది. కన్ను పొడుచుకున్నా కనిపించనంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా  కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతనిని ఒక ప్రక్క నెట్టివేస్తోంది. ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో తడుముకుంటూ, మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ కనిపించనంత దూరం పరిగెడుతున్నాడు. చివరకు ఎలాగో అతడు మఠం చేరి, అక్కడి సేవకులను నిద్రలేపి వారివద్దనుండి కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయల్దేరాడు. శ్రీగురుడు తనను ప్రక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై, నెమ్మదిగా కుడి ప్రక్కకు చూసాడు. అటు పక్కన ఐదు పడగలుగల భయంకరమైన త్రాచుపాము కనిపించింది. అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ, నెమ్మదిగా ఎడమ ప్రక్కకు చూచాడు. అటు ప్రక్కన కూడా మరో భయంకరమైన పాము అతని వెంటనే వస్తోంది. అతడు భయంతో మతిపోయి, బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరుగెత్తసాగాడు. అతడు ఎటు పోతే అటు, అంత వేగంగానూ పాములు తరుముకొస్తున్నాయి. అతడు గుండెదడ పుట్టించే దిక్కుతోచక, పొదల మధ్యకు పోయాడు. ఎటుపోవాలో తెలియక భయంతో తననా పాముల బారినుండి రక్షించమని మనస్సులోనే శ్రీగురుని ప్రార్ధించు కొనసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి, ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంటపోగా, కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావిచెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతమంతా వేలకొద్దీ దీపాలతో వెలిగి పోతున్నట్లు కనిపించింది. అక్కడ నుండి వేద ఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది. అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగురుని సమీపించేసరికి, అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతడికి ఆ భయం వలన వర్షం ఆగింది అని కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయోగాని, పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర కిందపెట్టి, నిప్పును ప్రజ్వలింపచేసాడు. భయం తగ్గిపోయి, అతడు గురువుకేసి చూసేసరికి ఆ రెండు పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది. శ్రీగురుడు నవ్వి, 'భయపడవద్దు, నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము. గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా? కనుక ముందుగా ఆలోచించుకొని, తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి. కలిప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపప్రచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి. అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవచేస్తే గురుకృప వలన సర్వమూ  సిద్ధిస్తుంది. యజ్ఞ యాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి, అవి తేలికగా  నిష్ఫలమవ్వవచ్చు. గురువుదగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు, తేలికగా అభీష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు. ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన. పతివ్రత తన భర్తను సేవించినట్లు, సచ్చిష్యుడు తన గురువును విడువక నీడవలే సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వమూ గురుసేవకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై వుంటాడు. గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశమిచ్చినా సరే, దాన్ని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తిచేస్తాడు. అలా చేస్తే, వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు'. అప్పుడు సాయందేవుడు నమస్కరించి, 'స్వామి, నేనేమీ  తెలియని వాడిని, కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి. దాని సహాయంతో స్తైర్యం  చిక్కించుకుని మీ  చెంతనే ఉండి సేవిస్తాను' అన్నాడు. అప్పుడు  శ్రీ గురుడిలా బోధించారు:              


                     'నాయనా, చెబుతాను విను, నీవు ఇక రాత్రి అయిందో బ్రాహ్మీ ముహూర్తం అయిందోనన్నది పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపం అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాము. శివుడు ఇలా చెప్పాడు: "దేవి, గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులూ కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్టానాదుల వలన చాలా కాలానికిగానీ సిద్ధించదు. యధావిధిగా గురుని సేవించేవారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వం త్వష్టయనే  బ్రాహ్మణ బాలునికి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేసి, వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురు సేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై, వర్షపునీరు లోపలకు కురిసింది. గురువు త్వష్టను పిలిచి, 'నాయనా, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలి, వాన, అగ్నుల  వలన నశించకుండా అన్ని వసతులూ కలిగి ఉండే కుటీరం నాకు కావాలి' అని చెప్పాడు. అప్పుడు గురు పత్ని,'నాయనా, ఎవ్వరూ నేయనిదీ, కుట్టనిదీ, రంగురంగులదీ, సరిపోయేది అయిన రవిక నాకు తెచ్చి పెట్టాలి' అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, 'అన్నా, నాకు మట్టి అంటనివీ, నీటి మీద నడిపించగలవీ, ఎప్పుడూ సరిపోయేవీ అయిన పాదరక్షలు కావాలి' అని చెప్పాడు. అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి, 'అన్నా! నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి. అది ఒంటి స్తంభం కలిగి, దంతంతో చేసినదై, పగలనిదిగా ఉండాలి. అది నా వెంట తీసుకెళ్లడానికి వీలుగా ఉండాలి. అందులో అన్ని వసతులూ ఉండాలి. దానిని నెట్టుకు వెళ్లడానికి చక్రాలు ఉండాలి. దానిని మళ్లీ ముడిచి వేయడానికి వీలు ఉండాలి. అందులో పీట, కుర్చీ ఉండాలి,  ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి. నాకు అవే వంట నేర్పాలి, వాటిలోని వంట ఎంతసేపైనా చల్లా రకూడదు. ఇతర వంట పరికరాలు కూడా కావాలి" అని చెప్పింది.   


             త్వష్ట అంగీకరించి, అడవికి వెళ్తూ, అవన్నీ ఎలా సంపాదించాలి అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచక, తన గురువునే ధ్యానించి, తన మనసులోనే ఆయనను శరణుపొందాడు. అలా పోతూ ఉండగా అతనికి ఒకచోట ఒక అవధూత కనిపించి, "నాయనా, నీవెవరు? ఇంత చిన్నవాడవు ఈ ఘోరమైన అరణ్యంలో చింతా క్రాంతుడవై తిరుగుతున్నావేమి?" అన్నాడు. ఆయనను చూడగానే త్వష్టకు మనస్సు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు  అనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, "స్వామి, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తూ ఈశ్వరుడని నాకు తోచింది. మీ దర్శన మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది" అని, తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. అవధూత అతనిని ఆశీర్వదించి, "నాయనా! అభీష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీ లో ఉండగా దుర్లభమేమున్నది? నీవు కాశీ వెళ్లి విశ్వనాధుని పూజించు. ఆయన వరంతో  బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు. కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తూ ఆ పాలసముద్రాన్నే ప్రసాదించిన దయాళువు" అని చెప్పాడు. గురుసేవ తప్ప వేరే ఏమీ ఎరుగని త్వష్ట, "స్వామీ! కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నది? అని అడిగాడు. అప్పుడు ఆ ముని శ్రేష్ఠుడు, "కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను. నీవలన నాకు కూడా విశ్వనాథుని దర్శనమవుతుంది" అని చెప్పి, తన లీల చేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్లాడు."                    




      నలభై ఒకటవ అధ్యాయం సమాప్తము


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...