అధ్యాయము -46
శ్రీ గణేశాయనమః
శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః
కథారంభము
నామధారకుడు, "స్వామీ శ్రీగురునివద్ద మరొక కవి శేఖరుడు ఉండేవాడు అంటిరి కదా? అతడు ఎవరు? అతడు శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యాడో, ఆయననెలా సేవించాడో దయచేసి వివరించండి" అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు: "శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితా శక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు. ఆ రీతిన శ్రీగురుని మహత్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు.
గాంన్గాపురం సమీపంలోనే 'హిప్పరిగి' అనే గ్రామమున్నది. ఒకసారి ఆ గ్రామంనుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు. వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలచి ఆయనను ప్రార్థించి, ఆయననెలాగో ఒప్పించి, మేళతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్లారు. వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది. ఒక్కొక్కరూ ఎంతో భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకొన్నారు. ఆ ఊరిలో ఒక శివాలయమున్నది. అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్లోనే నరకేసరియని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడున్నూ. అతడు నిత్యమూ కల్లేశ్వరుని స్తుతిస్తూ, పంచపద్య మణిమాలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు. అతడు ఆ శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు, మరేదేవతనూ స్తుతించేవాడు గాదు. అతడొకరోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని, 'ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది. అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే గనుక పనికిరాదు' అని తలచాడు. శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్లి, 'కవిచంద్రా !మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. శ్రీ నృసింహ సరస్వతీ యతివరేణ్యులకు కవిత్వమంటే ఎంతో ప్రీతి. కనుక వారిని స్తుతిస్తూ మాకు నాలుగు పద్యాలు వ్రాసిస్తే, అవి వారిచెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము' అని కోరారు. నరకేసరి, 'అయ్యా! అది నావల్లకాదు. కల్లేశ్వరుని తప్ప మరే దేవతనూ స్తుతించను. ఆయన సేవకే నా కవితనంకితం చేసుకున్నాను. అటువంటప్పుడు కేవలం ఒక మానవమాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్తుతించేది? అని చెప్పాడు. తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోడానికి ఆలయానికి వెళ్లాడు. అదేమీ చిత్రమోగాని, ఆరోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గరనుండి అతనికి బాగా నిద్రతూగసాగింది. అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక, చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది. ఆ కునులోనే ఒక చిత్రమైన కలగూడ వచ్చింది. ఆ కలలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు. అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కాల్లేశ్వరలింగం అప్పుడు కనిపించలేదు. ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చునివున్నాడు. ఆయన నవ్వుతూ, 'నీవు కల్లేశ్వరుని తప్ప మరెవ్వరినీ నీ కవితతో స్తుతించవు కదా! మానవమాత్రులమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నా వేమీ? ' అన్నారు.నరకేసరి తృళ్ళిపడి, వెంటనే నిద్ర మేల్కొన్నాడు. మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లో కునుకుపట్టింది. శ్రీగురుడు మళ్ళీ స్వప్నదర్శనమిచ్చి, 'మేము - కల్లేశ్వరుడూ వెరుగాదు !' అన్నారు. ఆ కలలోనే అతడు పూజ పూర్తి చేసి అయిదు పద్యాలతో స్తుతించాడు. ఈ సారి నరకేసరి మేల్కొని, తనకొచ్చిన కలను స్మరించుకొని, 'అయ్యో! నేనింతవరకూ పొరబడ్డానే! ఈ నరసింహ సరస్వతీ యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని, ఇంతవరకూ నేను తలచినట్లు మానవమాత్రులుగారు. కేవలం భక్తులను ఉద్దరించడానికే భగవంతుడు యిలా అవతరించాడు. ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే, కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి, నా సందేహానికి సమాధానమెలా యివ్వగలరు?' అని నిశ్చయించుకొన్నాడు.
వెంటనే బయల్దేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు దర్శనానికి వెళ్ళాడు. ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని, స్వామిని తన కవితతో ఇలా స్తుతించాడు: 'అనంతా! సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తూ ఆ కల్లేశ్వరులే. అది తెలియక నేనింతవరకూ మిమ్మల్ని స్తుతించనైనాలేదు. చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు. కల్లేశ్వరుని కృప వలన నాకీనాడు మీరు దర్శనమనుగ్రహించారు. ఈ దుఃఖసాగరంలో మునిగి, దారీ తెన్నూ కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరిలా అవతరించారు. ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక, యితర మార్గాలకోసం వెతుకులాడటం వ్యర్థమే!', అని స్తుతించాడు. స్వామి నవ్వి, 'ఏమయ్యా! ఇంతవరకూ నీవు, మేము కేవలం మానవమాత్రులమని, మమ్మల్ని ప్రజలిలా పూజించడం తగదనీ ఆక్షేపిస్తుంటివే, యింతలో నీ మనస్సు యిలా యెందుకు మారింది?' అని అడిగారు. నరకేసరి నమస్కరించి, 'స్వామీ! నేను అజ్ఞానమనే చీకటిలో పడివున్నప్పటికీ మీరు నాపాలిట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు. ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి, యీనాడు నాకు మీ పాదసేవ లభించింది' అని, తనకు కల్గిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు. ఆయనను పూజించి, స్తుతించి తనను శిష్యునిగా స్వీకరించి, అనుగ్రహించమని వేడుకున్నాడు. 'నీ అభీష్టా లన్నీ నెరవేరుగాక!' అని శ్రీ గురుడు ఆశీర్వదించారు. నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలచానని కోరాడు. శ్రీ గురుడు, 'ఈ కాల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు. ఆయనంటే మాకెంతో ప్రీతి గనుక మేమెప్పుడూ ఆ రూపంలో హిప్పరిగిలో ఉంటాము. కనుక నీవు ఎప్పటివలే నీవక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు' అని ఆదేశించారు. కానీ అతడు త్రిమూర్తిస్వరూపుడుగా అవతరించిన శ్రీగురుని రూపాన్నే సేవించుకోవాలని ఉన్నదని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు. అప్పటినుండి నరకేసరి, నిత్యమూ తాను ఆలయంలో కల్లేశ్వరుని పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ, ఆయనను పంచరత్నాలతో స్తుతిస్తూ ఉండేవాడు. నామధారకా! శ్రీగురుని అనుగ్రహం వల్ల ఇలా మారినవారెందరో కదా!"
నలభై ఆరవ అధ్యాయం సమాప్తము.
శ్రీ దత్తాయ గురవేనమః
శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః - శ్రీ నృసింహ సరస్వత్యైనమః
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box