Wednesday, June 3, 2020

గురు చరిత్ర అధ్యాయము -44

*** బుధువారం - పారాయణం ప్రారంభం ***

అధ్యాయము  -44




                               
శ్రీ గణేశాయనమః                             

శ్రీ సరస్వత్యేనమః                                                  

శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 


                     నామధారకుడు నమస్కరించి, "స్వామీ! మీ గురుని  లీలనింకొకటి వివరించండి!" అని కోరితే,  సిద్ధయోగి ఇలా చెప్పసాగారు: "శ్రీగురుని సేవకులలో తంతుకుడు  అనే సాలెవాడు ఒకడుండేవాడు. అతడు నిత్యము ఇంటిపనులు చూచుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి, నీళ్ళు చల్లి,  ముగ్గులు పెట్టేవాడు. అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరంనుండే సాష్టాంగ నమస్కారం చేసుకొని వెళ్తుండేవాడు. ఒక సంవత్సరం శివరాత్రికనీ అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మన్నారు. అతడు,  'ఓరి వెర్రివాళ్ళల్లారా!  శ్రీశైలం ఎక్కడో  ఉన్నదనుకుని కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవటమెందుకు?  శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా?  శ్రీ గురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి?  నేను ఆయనను,  ఆయన మఠాన్ని విడిచి వేరేక్కడికి రాను' అన్నాడు. అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్లిపోయారు. అతడు వాళ్లందరినీ సాగనంపి, గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు. స్వామి అతనిని పలకరించి,  'నాయనా, మీవాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీవొక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి?  అని అడిగారు. తంతుకుడు చేతులు కట్టుకుని,  'మహాత్మా !మా  వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్లారు గాని,  మీ పాదాలలోలేని క్షేత్ర మేమున్నది? ' అని చెప్పి నమస్కరించి,  తన నిత్య సేవకు ఉపక్రమించాడు. 


            తర్వాత శివరాత్రి వచ్చింది. తంతుకుడు ఆ నాడు ఉపవాసం ఉండదలచి మధ్యాహ్నం సంగమానికి వెళ్లి,  స్నానం చేశాడు. తర్వాత అక్కడ అనుష్టానానికి  వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయగలిగి,  'ఏమిరా! మీ ఇంట్లో అందరూ మల్లికార్జునస్వామి దర్శనానికి శ్రీశైలం వెల్లడం వలన ఇంట్లో పాపం నీవోక్కడివే ఉన్నావు కాబోలు! నీవిదివరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా,  లేదా? ' అన్నారు. తంతుకుడు, 'స్వామీ! ఏలినవారి పాదాలు తప్ప నేనింకేమీ ఎరుగను. తీర్థయాత్రలన్నీ  నాకు మీ  పాదసేవలోనే ఉన్నాయి' అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు. 'ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది. నీవెప్పుడూ చూడలేదు కదా, నీవు గూడ  వెళితే బాగుండేది' అన్నారు శ్రీ గురుడు. అతడు, 'స్వామీ ! నాకు దానిమీద అంత ప్రీతిలేదు.' అయినా మీరు అంతగా చెబుతున్నారు గనుక,  ఎప్పుడైనా మీరుచూపిస్తే చూడాలని ఉన్నది' అన్నాడు. శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి  అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి, 'నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకిప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది. నీవు ఈ మా పాదుకలు గట్టిగా పట్టుకొని కన్నులు మూసుకో!' అని ఆదేశించారు. అతడు,  'చిత్త'మని అలానే చేసాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణ కాలంలో శ్రీశైలంలోని పాతాళగంగ ఒడ్డుకు చేర్చి  అతనిని కళ్ళు తెరవమని చెప్పారు. అతడికి ఆ క్షణకాలం నిద్రతూగినట్లయింది. అతడు కళ్ళు తెరచి చుట్టూచూచి మొదట భయపడ్డాడు. శ్రీగురుడు నవ్వుతూ,  'భయపడతావెందుకు?  ఇదే శ్రీశైలం. నీవు వెంటనే క్షౌరము, స్నానము మొ||నవి పూర్తి చేసుకుని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొనిరా, పో ! అని హెచ్చరించారు.        


                       తంతుకుడు శ్రీ గురునకు  నమస్కరించి,  ఆయన చెప్పినవన్నీ పూర్తిచేసుకుని,  మల్లికార్జునుడి దర్శనానికి వెళుతుండగా,  దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు. వాళ్ళు అతనిని చూచి ఆశ్చర్యపడి, "ఏమయ్యా !నీకు  ఆ స్వామి సేవ తప్ప మరే  యాత్రలు అక్కరలేదన్నవాడివి మళ్లీ మా వెనకనే ఈ క్షేత్రానికి వచ్చావేమీ?' అని ఎగతాళి చేశారు. వారితో తంతుకుడు, 'నేను నిజం చెబుతున్నాను. ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను. కానీ శ్రీగురుడు ఇంతలో నన్నిక్కడకు తీసుకువచ్చారు. అంతేగాని,  నాకేమీ తెలియదు' అన్నాడు కానీ అతని మాటలు ఎవరూ  నమ్మలేదు. 'వీడు మనకు కనిపించకుండా మన వెనుకనే  వచ్చిఉండాలి' అనుకున్నారు. తంతుకుడు అదేమీ పట్టించుకోక గంధము,  పువ్వులు,  అక్షింతలు,  బిల్వదళాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు. కాని అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు,  ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు.అచటి  భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ  ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమయింది. అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచకితుడయ్యాడు కానీ,  మరలా అంతలో తెలివితెచ్చుకొని, "శ్రీ గురుడు సాక్షాత్తూ  శంకరుడే గదా!" అని సమాధానపడ్డాడు.               


         తర్వాత మల్లికార్జునునికి పూజ చేసుకుని,  పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాళగంగవద్దకు చేరాడు. శ్రీగురుడు అక్కడ యధాపూర్వమేకనిపించి,'నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్లతో కలిసి వస్తావా, లేక మాతోవస్తావా? ' అని అడిగారు. తంతుకుడు, 'మహాత్మా,  నేడు ఒక గొప్ప విచిత్రం చూచి వచ్చాను. లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకక్కడి శివలింగంలో మీరే ఉండి,  అందరూ చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమయింది. తలక్రింద కొండను ఉంచుకొని గులకరాళ్ళకోసం చుట్టూ గాలించే వారిలా, దగ్గరనున్న  మిమ్మల్ని విడిచి వీళ్లంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో  నాకు తెలియటంలేదు. మీరు మానవాకృతితో అవతరించిన పరమేశ్వరులు  అయినప్పటికీ నివురుగప్పిన నిప్పులా మీ మహిమ అందరకూ  గోచరించటంలేదు. అది తెలిశాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేది ఏమున్నది?  మీ పాదాల వద్ద పడియున్న నన్ను ఇక్కడకు ఎందుకు తీసుకు వచ్చారో  నాకర్థం కావటంలేదు' అన్నాడు. స్వామి,  'నాయనా,  అలాకాదు. విశ్వమంతటా వ్యాపించి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ,  ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన  మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది' అన్నారు. అప్పుడా భక్తుడు  దానిని వివరించమని కోరగా శ్రీ గురుడు ఇలా చెప్పారు:


                    "నాయనా! మహాశివరాత్రినాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది. పూర్వం కీరాత దేశంలో పరాక్రమశాలి,  బుద్ధిమంతుడూ,  అయిన విమర్షణుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ఈశ్వర భక్తుడే గాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ,  పరస్త్రీలంపటుడుగా  ఉండేవాడు. కానీ మరొక వంక నిత్యమూ  శ్రద్ధగా లింగార్చన చేసి,  నృత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు. అతని భార్య కుముద్వతి  మహా గుణవంతురాలు. ఆమె ఒక రోజున అతనితో,  'ప్రాణనాధా! మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను,  చెప్పండి. ఆహార విహారాదులలో యెట్టి నియమమూ  పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమయింది? 'అని అడిగింది. రాజు నవ్వి,  ఇలా చెప్పాడు:                               


                  "ప్రేయసి! నా పూర్వజన్మ వృత్తాంతం చెబితేగాని నీకీ  సందేహం తీరదు.వెనుకటి జన్మలో నేనొక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రినాడు ఊళ్లోని జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్లారు. ఆనాడు అందరూ ఉపవసించాలి గనుక నా యజమాని కూడా అన్నం వండుకోలేదు; నాకు పెట్టనూలేదు. అందువలన అందరితోపాటు నేనుకూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళ్తుంటే,  నేనుకూడా తోక ఆడించుకుంటూ దారిలో పులిస్తరాకులకోసం వెతుక్కుంటూ  వారి  వెంటనే వెళ్ళాను. గ్రామస్తులందరూ తలొక దివిటీ  చేతపట్టుకొని శివ నామ సంకీర్తనం చేస్తూ  ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు. నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న  ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా  తిరుగుతున్నాను. నేను లోపలికి చూసేసరికి అచ్చటి శివలింగం నా కంటపడింది. ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు  నన్ను చూచి, 'కుక్కను  కొట్టండి!' అని కేకలు వేశారు. నేను పారిపోవాలని చూచాను గాని,  సింహద్వారం దగ్గర సందులేకుండా జనం మూగడంతో నాకు దారి చిక్కలేదు. కొందరు కర్రలు చేతబట్టుకుని తరుముతుంటే నేను వారి బారినుండి తప్పించుకోవాలని మూడుసార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను. చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాదటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణంవిడిచాను. ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసముండి, శివపూజ దర్శించి,  ప్రదక్షిణలు చేసిన పుణ్యము ఆర్జించాను. ఆలయ ద్వారం వద్ద నిల్చిన  వారిచేతిలోని దివిటీలనూ దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను. అందువలననే నాకిప్పుడు  ఇంత మాత్రమైనా జ్ఞానము,  రాజ్యము  లభించాయి. అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్నింకా  వదలలేదు. అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకున్నాను."                                              


                      కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి "ప్రాణనాథా ! శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు. దయతో నా వెనుకటి జన్మ ల గురించి తెలపండి" అని వేడుకున్నది. విమర్షణుడు నవ్వి,  "ప్రేయసీ ! పూర్వం శ్రీశైలంలో నీవొక పావురంగా ఉన్నావు. నీవొక రోజు అడవిలో మాంసం ముక్కను ముక్కున కరచుకొని పోతుండగా, ఒక డేగ దానిని లాక్కోదలచి నిన్ను తరిమింది. నీవు ప్రాణభీతితో మల్లికార్జునుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు. చివరికది నిన్ను చంపి ,మాంసం ముక్కను ఎత్తుకు పోయింది.ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల, నీవీనాడు రాణిగా జన్మించావు" అని చెప్పాడు. నాటినుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి, "నాథా ! ముందు జన్మలో మనకు ఏమి జరగనుందో కూడా సెలవియ్యండి" అని కోరింది. అప్పుడు రాజు ఇలా చెప్పాడు: "సఖీ ! నేను సింధుదేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను. నీవు సంజయదేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్యవవుతావు. ఆపై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను; నీవు కళింగ రాజకుమార్తెవై, నా రాణివవుతావు. అటుపై జన్మలో నేను గంగాధర దేశానికి రాజునవుతాను; నీవు మగధదేశ రాజపుత్రికగా జన్మించి,నన్ను వివాహం చేసుకుంటావు . ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు, నీవు దశార్ణ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషివవుతావు. అటు తర్వాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను. నీవు యయాతి వంశంలో జన్మించి, నా రాణివవుతావు. ఆపైన నేను పాండ్యదేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను; అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతీయనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు. అప్పుడు నేను సర్వ శాస్త్రాలూ నేర్చి దేవతలను,  బ్రాహ్మణులను పూజిస్తూ దానధర్మాలు చేసి,  చివరకు వృద్ధాప్యంలో అగస్త్యమహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకుని మరణించాక, నీతో కలసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికీ కారణం శ్రీశైల మల్లికార్జునుని అనుగ్రహమే. కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము "అని చెప్పి, కుముద్వతితో కలసి యాత్రచేసి వచ్చాడు.                        


                 కనుక, తంతుకా! తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షణం వలన ఒక పావురానికి రాణి పదవి, తర్వాత మోక్షమూ  కలిగాయి. నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరమూ ఈశ్వరుణ్ణి ఆరాధించు. గంధర్వనగరంలో ఈ మల్లికార్జునునితో సమానమైన మహిమ గల కల్లేశ్వరుడున్నాడు. నీవు నిత్యమూ  ఆయనను ఆరాధించు' అని చెప్పారు. తంతకుడు, 'స్వామీ ! మీరెందుకిలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు. మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా? సర్వవ్యాపకులు, పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించి నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి? మీరు గాక వేరొక దైవమున్నాడా  ఏమి?' అని గురు పాదాలకు నమస్కరించాడు. శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకొమ్మని చెప్పి, రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో కూడా చేర్చారు. వీరిద్దరూ శ్రీశైలంలో నున్న సమయంలో పురవాసులెందరో శ్రీనృసింహ సరస్వతీ  స్వామి దర్శనం కోసం మఠానికి, సంగమానికి వచ్చి, పవిత్రమైన మహాశివరాత్రినాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగి పోయారు. తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంతకుణ్ణి  గ్రామానికి పంపారు. అందరూ అతనిని చూచి ఆశ్చర్యంతో,  'నీవు మహాశివరాత్రినాడు తల గొరిగించుకున్నావేమి?' అని ఎగతాళి చేశారు. అతడు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి, అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము, పువ్వులూ చూపాడు. వాళ్లు అది నమ్మలేక, 'ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి దగ్గర చూచాము. నీవు చెప్పేది నిజంకాదు. ఈ పువ్వులు యింకెక్కడనించో తెచ్చావులే ఫో!' అన్నారు. అప్పుడతడు తనను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్లి వచ్చిన సంగతి చెప్పి, 'ఇప్పుడు స్వామి సంగమ తీరంలో ఉన్నారు. మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు. కావాలంటే వారిని అడగండి' అని చెప్పాడు. శ్రీగురుని మహత్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు. వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి, ఆ రూపంలో తమకుకూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్తుతించారు.           


                    తర్వాత పదిహేను రోజులకు శ్రీశైలయాత్రకు వెళ్ళిన పురవాసులు తిరిగివచ్చి, ఆ క్షేత్రంలో తాము తంతకుణ్ణి చూచామని చెప్పారు. అంతవరకూ అతని మాటలు నమ్మనివారు కూడా, తంతకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు. తంతుకుడు యావజ్జీవమూ  స్వామిని సేవించి, చివరకు ముక్తి పొందాడు. శ్రీగురుని మహత్యం ఎంతని చెప్పగలము?"          

నలభై నాల్గవ అధ్యాయం సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...