Wednesday, May 20, 2020

గురు చరిత్ర అధ్యాయము -31


అధ్యాయము  -31




                                

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః 
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 



                             ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు: " ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు: 'సాద్వీ, స్త్రీలు ఆచరించవలసిన ధర్మము చెబుతాను విను. పూర్వం కాశీలో అగస్త్యమహర్షి, ఆయన భార్య  లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు. ఆ మహర్షి తపస్సుకు, ఆమె పాతివ్రత్యానికీ  మెచ్చి వింద్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారియైన నారదుడు వింద్యునితో, "ఓ పర్వతరాజా! నీకు సాటి అయిన పర్వతమింకొకటి లేదు. అయితేనేమి, నీవు మేరువుతో మాత్రం సమానం కాలేదు" అన్నాడు. అప్పుడు రోషంతో  వింద్యాచలుడు మేరుపర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు. అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయం అయింది. సూర్య దర్శనం అవనందువలన ఆ ప్రాంతంలోని ప్రజల నిత్యకర్మాచరణ తారుమారైంది. అప్పుడు ఋషులా విషయమై మొరపెట్టుకోగా, అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు. బ్రహ్మదేవుడు,  'కాశీలో అగస్త్యుడను బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి, వారు దక్షిణదేశానికి వెళ్లేలా చేయి' అని ఉపాయం చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి  దంపతులను దర్శించి పూజించాడు. అప్పుడు మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ, ఆమె మహిమకు కారణమైన పతివ్రతా ధర్మాలను దేవగురువైన బృహస్పతి ఇలా చెప్పాడు:                        


                               స్త్రీలు ఎప్పుడూ  తమ పతిని  శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానమూ చేయకూడదు. సాధ్యమైనంతవరకూ పొరుగిళ్లకు పోకుండా, తప్పనిసరి అయినప్పుడు తలవంచుకొని వెళ్లాలి. దుశ్శిలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకని, యాత్రలకనీ ఒంటరిగా వెళ్లకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. గ్రామాంతరం వెళ్లిన భర్త తిరిగిరాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్లుకడిగి, తుడిచి, విసనకర్రతో వీచి సేద తీర్చాలి. తర్వాత ఆయనకు అలసట తీరేవరకు కాళ్ళుపిసికి, తర్వాత స్నానం చేయించి, ఆయన పాదతీర్థం తీసుకుని నమస్కరించాలి. అటు తర్వాత అతని చిత్తముననుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి, అతని ఉచ్చిష్టాన్నే ప్రసాదంగా భుజించాలి. అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆయనను సంతోషపెట్టాలి. భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి. మరలా అతనికంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకొని, అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. భర్తకు కావలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగానూ, భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగానూ, ఉండకూడదు. భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి. భర్తతో తగువులాడకూడదు.అతడు కోపంతో అన్న మాటలను మనసులో వుంచుకోకూడదు. భర్త ఆజ్ఞననుసరించే భార్య నడుచుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు, ఉపవాసాలు చేయకూడదు. భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికిగాను పసుపు,  కుంకుమ,  మంగళసూత్రము మొదలైనవి భక్తితో ధరించాలి. భర్తకు ఇష్టమైన ఆభరణాలు,  వస్త్రాలు మాత్రమే ధరించాలి. అత్తమామలను,  బావమరుదులను,  ఆడబిడ్డలను విడచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి. ఇరుగుపొరుగు శ్రీమంతులను  చూచి, భర్త అసమర్థుడని నిందించకూడదు. యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలనుకోకూడదు. పతి సేవయే యాత్రగా, పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి. భర్త లోభియైనా, రోగియైన, వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడుగా భావించి అతనినే పూజించాలి. అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు.                           


                         ఇలాచేయక యదేచ్ఛగా సంచరిస్తే, ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. మరొక పతివ్రత పాదధూళితో గాని అట్టివారి పాపం నశించదు. పతివ్రతల పాద ధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు. అలా కాకుంటే, రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరు లేరు? అయినా పతివ్రత వల్లనే వంశమంతా ఉద్ధరించిబడుతుంది. ఏడు జన్మల పుణ్యంవల్ల గాని అట్టి ఇల్లాలు లభించదు. ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు. ఆమె లేని భవనమైన అడవితో సమానమే. ఆమె వల్లనే సత్సంతానము, ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడచి అడుగులకు మడుగులొత్తుతుంది. ఆమె సాహచర్యం వలన ఏడు జన్మల పాపం కూడా నశిస్తుంది. గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించడంవల్ల కలుగుతుంది".      


ముప్పై ఒకటవ అధ్యాయం సమాప్తము   


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


గురు చరిత్ర అధ్యాయము -30


*** ఆదివారం పారాయణ ప్రారంభం ***

అధ్యాయము  -30




                                

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                               
శ్రీ గురుభ్యోనమః 




కథారంభము 


                                నామధారకుడు, "స్వామీ ! నాకెన్నో శ్రీగురుని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు. ఇట్టి మీ ఋణం ఎన్నటికైనా తీర్చుకోగలనా? అటు తరువాత ఏమి జరిగిందో సెలవియ్యండి" అని ప్రార్థించాడు. అంతట సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పసాగారు :                            


                             "నామధారక ! శ్రీగురులీలలన్నీ  చెప్పడం ఎవరి తరమూకాదు. నాకు చేతనైనంత వరకూ చెబుతాను, విను. శ్రీగురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి  త్రిమూర్త్యవాతారమన్న  కీర్తి నలుదిక్కులా వ్యాపించింది, భక్తులు ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చి, వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని,  సంతానము లేనివారు సంతానము,  రోగులు ఆరోగ్యము పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకరి వృత్తాంతము చెబుతాను విను.      


                    మహురపురంలో గోడేనాథుడనే (ఉరఫ్ గోపీనాథుడు ) సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయస్వామిని నిష్ఠగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు. అల్లారుముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి ఐదవ ఏటనే ఉపనయనం చేశారు. 12 వ సంవత్సరంలో రూపవతి, సుగుణాలరాశియైన సావిత్రి (ఉరఫ్ సుందరి )యనే కన్యతో వివాహం చేశారు. ఆ దంపతులు సుగుణాలలోనూ, సౌందర్యంలోనూ సమానులైన రతీ మన్మధులవలె సుఖిస్తూ, ధర్మతత్పరులై  పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఇలా ఉండగా విధివశాత్తు తత్వానికి 16వ సంవత్సరం లోనే తీవ్రంగా జబ్బుచేసి, ఎన్ని చికిత్సలు చేయించినా  తగ్గలేదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటినుండి ద్రవాహారమే తీసుకుంటున్నందువలన, నిత్యోపవాసిగా ఉండేవాడు. ఇలా మూడు సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా  పరిణమించింది. అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ, నిరంతరమూ అతని సేవలో గడిపేది. అతడు కృశించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమెకూడా అతనివలె అలంకారమే చేసికొనక, పాతచీర ధరించేది.జుట్టు దువ్వుకొనక పోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కిశల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్షదైవం అని నమ్మి సేవిస్తుండేది. తనకు గల సిరిసంపదలు వెచ్చించి, ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు, శాంతులు ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులు వచ్చి ఇచ్చిన మందులు ఎన్నో వాడింది. ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి. కానీ దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగవకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు. అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకునేవారు: 'స్వామీ! దత్తాత్రేయా! నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనుకటి దుఃఖమంతా మరిచాము. ఇప్పుడితనిని కూడా నీవు మాకు దక్కించుకుంటే మేము ఏమి చూసుకొని బ్రతకాలి? 'వారలా  దుఃఖిస్తూ ఉంటే దత్తుడు వారిని ఊరడిస్తూ, 'మనకెంత ఋణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది గానీ, అంతకుమించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది? కనుక మీరు నాకోసం దుఃఖించవద్దు' అని చెబుతూ ఉండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొర్లుకొచ్చేది. అతడు గూడ దుఃఖిస్తూ తన తల్లితో,  'అమ్మా'  అంతా ఈశ్వరాధీనముగాని,  మన చేతిలో ఏమున్నది? నీవు నాకు ఒక్క గడియసేపు పాలిచ్చిన  ఋణమైన ఇంతవరకూ  తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చి పెట్టాను. మిమ్మల్ని కొంచమైనా సుఖపెట్టలేకపోయాను' అంటూ ఉండేవాడు.                                 


                    దత్తుడు తన భార్యతో, 'ప్రేయసీ, నాకింక కాలం తీరిపోతున్నది. నీవు నాకు చేసిన సేవకు, నా కోసం పడ్డ కష్టాలు కు అంతేలేదు. గతజన్మలో నీకు పరమశత్రువును కాబోలు, నిన్ను ఇలా బాధిస్తున్నాను! ఇకముందు కూడా నీకు అండలేదని భయంలేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురిలా చూసుకుంటారు. అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే  అదృష్టం నాకు  కించిత్తయినా లేదు. దౌర్భాగ్యుడనైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంటకలిసింది' అని బాధ పడుతుండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకుని ఏడుస్తూ, 'స్వామీ ! మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతి ఏమున్నది? భార్యకు భర్తయే దిక్కు గాని తల్లిదండ్రులుగారు. నేను మీ  శరీరంలో అర్ధభాగాన్ని సుమా! నా ప్రాణమైన మిమ్ములను వదలి పోతే నా శరీరంలో ప్రాణం ఉండదు. మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను' అంటూ ఉండేది. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి. సావిత్రి, 'అయ్యో! మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎట్టి  భయమూ లేదు. అందరమూ కలసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము' అని ధైర్యం చెబుతూ ఉండేది. ఆమె ఒకసారి, గాలిమార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకెళ్లాలని అనుకున్నది. అప్పుడొక గ్రామస్తుడు, మీరు దత్త భక్తులు కదా!దత్తావతారమైన శ్రీ గురుని వద్దకు వెళ్ళండి. అక్కడ ఎందరికో మంచి జరుగుతున్నది' అని చెప్పాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, 'గంధర్వపురంలో శ్రీనృసింహసరస్వతి అనే మహనీయులున్నారట. వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్లీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది. మీరనుజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడకు పోతాము. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను. మేమక్కడకు వెళ్ళడానికి అననుఙ్ఞ  ఇవ్వవలసినది' అని వారి కాళ్ళమీద పడి వేడుకున్నది. ఆ వృద్ధులు, తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకనుమతించి, తగిన ఏర్పాట్లు చేశారు. ఆమె తన అత్తమామలతో, ' మీరు ధైర్యంగా ఉండండి. ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు' అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకొని బయలుదేరింది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, 'అమ్మాయీ ! శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక! సౌభాగ్యవతీ భవ!' అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు.                                     


                                సావిత్రి తన భర్తకు శ్రమ కలుగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటుచేసి, బోయీలను మెల్లగా నడవమన్నది. ఈ విధంగా వారు మూడు రోజులు ప్రయాణంచేసి, గంధర్వనగరం సమీపించారు. సావిత్రి అక్కడక్కడా  పల్లకీ దింపి శ్రీగురుని గూర్చి విచారిస్తున్నది. అంతదూరం ప్రయాణం చేసి అలసినందువలన దత్తునికి రోగ బాధలు ఎంతో తీవ్రమయ్యాయి. అవసానదశ సమీపించిందా  అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతున్నాడు. ఎలాగో పల్లకిని గంధర్వపురం చేర్చి అక్కడ ఒకచోట దింపి, సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీ గురుడు ఎక్కడ ఉంటారని ఆ ఊరివారిని విచారించింది. వాళ్లు, స్వామి అనుష్టానానికి సంగమం వద్దకు వెళ్లారని  చెప్పారు. అతనిని అక్కడకు తీసుకు వెళ్దామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం! ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడచుకోపోతే,  అక్కడివారందరూ అడ్డు వచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ, 'అయ్యో స్వామీ ! నాకిదేమిగతి? ఓ శ్రీ గురుమూర్తీ ! మీరు ప్రాణ రక్షకులని తలచి గంపెడాశతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను. కానీ నా పని- దైవానుగ్రహం కోసం వెళ్లిన వాని మీద ఆలయం విరిగి పడ్డట్లు, నీడను చేరబోయిన వానిమీద ఆ చెట్టు విరిగి పడినట్లు, మంచినీటికని పోయిన వాడు మొసలి నోట్లోపడ్డట్లు, నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడకు వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను. నాగతి పులి బారి నుండి తప్పించుకున్న గోవు, గోమాంసం తినే యవనుడి  పాలిట పడినట్లయింది. నాకు తెలియకనే నేను నాభర్తను చంపినదానినయ్యాను. వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరంచేసి, దేశంకాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను'. అని హృదయవిదారకంగా ఏడుస్తున్నది. అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు, 'అమ్మాయీ ! నీవిలా ఏడ్చినందువలన లాభమేమి? విధిలిఖితం విష్ణువునయినా విడిచి పెడుతుందా? ' అని తెలియజెప్పాలని చూచారు. కానీ వయసులో చిన్నదైన ఆమెకు అతని సహచర్యంలోని మధురమైన స్మృతులు  గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలచివేస్తున్నాయి. ఆమె దీనాతిదీనంగా వారందరితో, 'అయ్యలారా! ఇప్పుడు నేనెక్కడ, ఎవరి అండన ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది? నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూలేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతం, వివాహమయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్యవ్రతము అన్నీ ఎంతో శ్రద్దగా చేసాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగల్య రక్షణకొసం నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితం చివరకు నాకీ పసుపుతాడైనా దక్కకపోవడమేనా?' అని దుఃఖిస్తూ ఆ శవంమీద పడి,  'స్వామీ! నన్ను విడిచి ఎక్కడకు  పోయారు?  మీరు లేకుండా నేనెలా బ్రతకగలను? అయ్యో! ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు. వారి బిడ్డను  ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడకు తీసుకు వచ్చాను. నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురి ప్రాణాలను తీసిన దోషినయ్యాను. నేను ఇప్పుడు వారికి ముఖం ఎలా చూపేది?  నేనూ  మీతోనే వస్తాను' అంటూ హృదయవిదారకంగా శోకిస్తున్నది.                               


                            ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు,  చేతిలో శూలము, శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకము ఉపదేశించాడు: 'పిచ్చిదానా! నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం?నొసటి వ్రాత  మారదు గదా? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు? అయినా, ఇతడు ఎక్కడికి పోయాడనుకుంటున్నావు? ఆలోచించు-                           


                                  అసలు నీవెవరు? ఎక్కడినుండి వచ్చావో  చెప్పు. ప్రవాహంలో ఎక్కడనుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే  అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు, జీవులు మళ్లీ ఎక్కడ నుండి వచ్చినవి అక్కడకు చేరుతాయి. నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ  శరీరాలు వచ్చి,  కొంతసేపుండి మరల మరలా నశించిపోయేవే కదా! పుట్టేవాడు, చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు? అతడెవడు? మాయావశులై, అలాంటి జీవులను "నావి, నావాళ్లు" అనుకోవడం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండ యీ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు. జీవుడు కర్మవలన శరీరం ధరిస్తాడు. కర్మ, త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఃఖాలు కలిగిస్తుంది. గుణాలన్నవి మాయవలన ఉన్నట్లు కనిపిస్తాయే కాని, నిజానికి లేనేలేవు. త్రిగుణాత్మకమైనది మాయేగాని, ఆత్మ కాదు. పుట్టుక, చావు మొదలైన వికారాలే  లేని ఆత్మకు త్రిగుణాలతో యెట్టి సంబంధమూలేదు. ఆ జీవుడు అవిద్యవలన కర్మబంధంలో చిక్కి, యీ సంసారంలోబడి ఈదులాడుతున్నంతవరకే సుఖదుఃఖాలు అనుభవిస్తాడు. మృత్యువంటావా- సుదీర్ఘమైన ఆయువుగల దేవతలు గూడ కల్పాంతంలో నశించవలసిందే! ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలంవలన పుట్టి, దాని కధీనమైవున్న యీ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం? ఇలా కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడియున్న యీ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషంకానీ, మరణించినందుకు దుఃఖముగాని పొందదగినదేమీలేదు. గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యెవరకు వెనుక చేసుకున్న కర్మననుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీతప్పదు. ఆమధ్యకాలంలో ఎవరైనా వారి విధి వ్రాతలననుసరించి ఎక్కడ ఏసమయంలో ఎలాంటి సుఖదుఃఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందేగాని, వాటిని నివారించడం ఎవరితరం? ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపజేసుకోవచ్చు. కానీ కాలగతిని నియమించడం ఎవరితరముగాదు. ఇప్పటి మీ సంభందమే నిజమైతే, గత జన్మలో నీకెవరితో యెట్టి సంభంధమున్నదో చెప్పగలవా?  లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా?  ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు? రక్తము, మాంసము, శ్లేష్మము మొదలైన ధాతువులతో చేయబడిన యీ పాంచభౌతిక శరీరం "నేను, నాది " అనుకోవడం సరియేనా? ఇంతకూ  నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మకోసమేగదా? ఇకనైనా యీ శోకాన్ని నిగ్రహించుకొని, యీ జన్మచక్రం నుండి బయటబడే మార్గం ఆలోచించుకో!' అన్నాడు.                                           


                        ఆ బోధవిని సావిత్రి కొంచం తమాయించుకొని, ఆ ముని పాదాలకు నమస్కరించి 'స్వామీ, నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పినట్లే చేస్తాను. దయాసాగరా!  నాకు నీవే తల్లివి, తండ్రివి. నేనీ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి ' అని వేడుకున్నది".


ముఫైయవ అధ్యాయం సమాప్తము 


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


Tuesday, May 19, 2020

గురు చరిత్ర అధ్యాయము -29


అధ్యాయము  -29




                                

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః

శ్రీ గురుభ్యోనమః 


కథారంభము








                           నామధారకుడు సంతోషించి "శ్రీగురుడు స్వయంగా భస్మమహాత్యాన్ని యేమి వివరించారో సెలవీయండి" అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి యిలా చెప్పారు: "త్రివిక్రమభారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి యిలా వివరించారు: 'పూర్వం కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతుండేవాడు. ఆ ముని జడలు, నారబట్టలు ధరించి, వంటినిండా విభూతి పూసుకుని అక్కడక్కడా సంచరించి, చివరకు నిర్మానుష్యముగా వున్న క్రౌంచారణ్యములో నివసించసాగాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కన్పించిన ప్రాణినల్లా చంపి తింటుండేవాడు. వాడు ఈ మునిని చూచి, ఆయనను మ్రింగదలచి, ఆయనమీదకొచ్చాడు. ఆయన ముని నిర్లిప్తుడుగా చూస్తుండిపోయాడు. అతడు చంపడానికై ఆయనను త్రాకగానే, ఆయన శరీరం మీది భస్మం  అతనికి అంటుకున్నది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమోగాని, సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం. అన్ని ఘోరపాపాలు చేసిన ఆ రాక్షసునికి గూడా ఆ ముని యొక్క స్పర్శ  తగలగానే అతడి హృదయం  శాంతించి, విశేషమైన జ్ఞానము ఉదయించింది. అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపైబడి,  "గురూత్తమా! నీవు సాక్షాత్తూ  భగవంతుడవు.  మీ కటాక్షము వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి. నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి. నన్ను రక్షించు!" అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవమహర్షి "నీవెవడవు?  నీవి అడవిలో ఎందుకు ఉన్నావు?"అని అడిగారు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు:                             


                             "స్వామి! మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అను పేరుగల యవనరాజును. అప్పుడు నేనెన్నో  పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను. మదోన్మత్తుడనై పరస్త్రీలనెందరినో  చేజిక్కించుకుని, మరెందరినో బలాత్కారం చేశాను. తర్వాత వారి ముఖమైనా  చూసేవాడిని కాదు. వారి గతేమీ  పట్టించుకునేవాన్నికాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు. అయినా నేను లెక్క చేయక తప్ప తాగి, ఇంకెందరినో భ్రష్టులను చేశాను. చివరకు నాకు క్షయ రోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి, నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. తర్వాత పదివేల సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి. తర్వాత వంద సంవత్సరాలు పిశాచమై సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండచిలువ, తోడేలు,  ఊరపంది,  కుక్క,  నక్క, జింక,  కుందేలు, కోతి,  గ్రద్ద, కప్ప,  కాకి,  ఎలుగుబంటు,  అడవి కోడి,  గ్రుడ్డిగాడిద,  పిల్లి, కప్ప,  తాబేలు, కాకి, చేప,  పందికొక్కు,  గుడ్లగూబ,  ఏనుగు, పిల్లి అనే 24 జన్మలెత్తి, 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడనయ్యాను. ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్ముమ్రింగాలన్న  గర్భాత్రంలో  మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకీజ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్ని ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు. నాకేనాటి పుణ్యమో కించిత్తుండడం వలన మీరు నాకు లభించారు. స్ప్రుశించినంతమాత్రానే  నాకు ఇంత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే! కానీ నావంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం యెలా  కలిగిందో తెలుపండి" అని ప్రార్థించాడు.                   


                  అప్పుడు వామదేవుడు, "ఇది నా మహిమ కాదు,  నా వంటిపైనున్న  భస్మం యొక్క మహిమే! దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడేలేడు. సాక్షాత్తూ  పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా?  అందుకొక నిదర్శనం చెబుతాను. పూర్వము కర్మభ్రష్టుడు,  దురాచారుడు  అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడొక శూద్రస్త్రీని చేరదీసినందుకు ఊరంతా  అతనిని వెలివేశారు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు. క్రమంగా అతనికి త్రాగుడు అలవాటై.అందుకు డబ్బులేక దొంగతనం చేస్తూ ఉండేవాడు. ఒకనాడతడు తప్పతాగి ఆ శూద్రస్త్రీ వద్దకెళ్లగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతనిని చితకబాది ఊరిబయట ఒక గోతిలో పారవేశాడు. అతడు కొనఊపిరితో పడిఉండగా చూచి, శివమనుకుని పక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పీక్కు తింటానికి వచ్చి అతనిని నఖశిఖ పర్యంతమూ వాసన చూసింది. అప్పుడు దాని వంటిమీదనున్న బూడిద కొంచెం అతడి తలపైన పడింది. కొద్దిసేపట్లో అతనికి అవసానదశరాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చారోగాని శివ దూతలు వచ్చి వాళ్ళని తరిమివేశారు. అప్పుడు యమధర్మరాజు అక్కడకు వచ్చి వారిని కారణమడిగాడు. అప్పుడా శివకింకరులు  ఆ శవం పైనున్న విభూతి చూపి,  'విభూతి పూసుకొన్న  వారందరినీ కైలాసానికి తీసుకొనిరమ్మని మా పరమశివుడు ఆదేశించాడు. బస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి' అని చెప్పారు.        


                    కనుకనే ఓ రాక్షసుడా! నేను భక్తితో విభూతి ధరిస్తాను" అని వామదేవుడు చెప్పాడు.అప్పుడా  రాక్షసుడు,  "స్వామీ! సాక్షాత్తూ మీరు  ఆ పరమేశ్వరులే.  నా పూర్వ పుణ్యలేశం వలన మీ దర్శనము, ఈ జ్ఞానము లభించాయి. ఇకనైనా నన్ను ఉద్ధరించు. అంతటి మహత్యం గల ఆ భస్మాన్ని ఏవిధంగా భరించాలో వివరించు" అని వేడుకున్నాడు.


                వామదేవుడు ఇలా చెప్పాడు:" ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు. అచ్చటికి ఇంద్రాది దేవతలు,  గంధర్వులు,  యక్షులు, కింపురుషులు,  సిద్ధులు,  సాధ్యులు,  వశిష్ట,  నారదాది ఋషులు,  బృహస్పతి మొదలైన వారందరూ చేరారు. అప్పుడు వారిమధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు. కర్పూరకాంతి గల దేహంతో జడలు,  నాగాభరణాలు,  చంద్రవంక,  సకల ఆయుధాలు ధరించిన ఆయన,  ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అప్పుడా సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి,  'స్వామీ! లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తిని ఇవ్వగల ఉపాయమేదైనా చెప్పవలసింది' అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమ శివుడు ఇలా బోధించాడు: 'సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలది - భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం. భస్మం కోసమని సంకల్పించి గోమయం (ఆవుపేడ ) సేకరించి, దానితో హోమం చేయాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని ' సద్యోజాతం' అనే మంత్రంతో చేతిలోకితీసుకుని,  ' 'అగ్నిరిత్యా' అనే మంత్రంతో అభిమంత్రించి, 'మానసోక్త' అనే మంత్రం చదువుతూ, దానిని బొటనవేలితో నలిపి, 'త్రయంబకం' అని చెబుతూ శిరస్సున ధరించాలి. తర్వాత 'త్రయాయుషం జమదగ్నే ' అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి. ఆ మూడింటిలో ఏ రేఖాగూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు. ఆ రేఖలో మొదటిది, చివరిది, మద్యమ,  అనామిక అనే వేళ్ళతో అద్దుకున్నాక, అప్పుడు బొటన వ్రేలితో కుడివైపునుండి ఎడమ ప్రక్కకు మధ్యరేఖ దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు అకారము వర్ణము, గార్హపత్యాగ్ని, భూతత్త్వం, రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి, ప్రాతః సదనము, బ్రహ్మదేవత. రెండవరేఖకు ఉకారము వర్ణము; దక్షిణాగ్ని, ఆకాశ తత్వం, యజుర్వేదం, మాధ్యందిన సవనములకు సంకేతము, ఇచ్ఛాశక్తి. విష్ణు దేవతకు చిహ్నం. మూడవ రేఖకు మకారము, ఆహవనీయాగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి. తృతీయ సవనము, శివునికి సంకేతము. ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి. ఈరీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది. మిగిలినవారికి వారు కోరిన పురుషార్ధాలు లభిస్తాయి. కనుక నాలుగు  ఆశ్రమాలకు చెందినవారూ భస్మం ధరించాలి. దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియక పోయినా, సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపైనున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంత పుణ్యం, మంత్రాలన్నీ అనుష్టానం చేసిన ఫలితము లభించడమే గాక, ఇతరులకు కూడా ఉత్తమగతి లభిస్తుంది. వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి' అని శివుడు చెప్పాడు.         


                          కనుక,  'ఓ రాక్షసుడా! ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది' అని చెప్పి, కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై  మహర్షికి ప్రదక్షిణము,  నమస్కారము చేసి స్వర్గానికి వెళ్లిపోయాడు. వామదేవుడు త్రిమూర్తి అవతారము; జీవులనుద్దరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు. ఈ భస్మ మహిమ గురించి శౌనకాది ఋషులకు సూతమహాముని కూడా చెప్పాడు.                         


                శ్రీ గురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమభారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.


 ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తము 


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


*** శనివారము  పారాయణ సమాప్తము ***

Saturday, May 16, 2020

గురు చరిత్ర అధ్యాయము -28


అధ్యాయము  -28




                                

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 




కథారంభము 


                        అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు : " శ్రీ గురుడు ఆ చండాలునితో, ' నాయనా! ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాము  విను: ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను,  కులస్త్రీని,  కులదేవతలను,  సత్యమును,  అహింసను  విడిచినవారు, కన్యాశుల్కం తీసుకునేవారు. అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను- బిడ్డలను; ఆవులను- దూడలనూ విడదీసినవారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించనివారు, సద్బ్రాహ్మణులను దూషించి, అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించినవారు, తమ గురువులను, యజమానులనూ ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసినవారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రాద్దాదికర్మలు  చేయనివారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేదమార్గం విడిచి మంత్ర ప్రయోగం చేసేవారు, గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు, గురునిందవిని సంతోషించేవారు, శివ-కేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడచి పరధర్మం చేపట్టేవారు, అర్హతలేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు- వీరికి చండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను,  పాపాలనూ బయట పెట్టి  చాటినవారికి జన్మాతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ  మరుజన్మలో గొడ్రాలవుతుంది. లేకుంటే, ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు. ధర్మ శాస్త్రము, పురాణము వినని  వారికి గుడ్డితనం, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను,  బ్రహ్మహత్య వలన క్షయ రోగము, ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్టురోగము, నమ్మకద్రోహం వలన అన్న ద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనసులను విరచి, వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది.              


                   పుణ్యకర్మలను నిరసించేవారు; వారి మాటలు నమ్మినవారు; ప్రజాహితకరములయిన చెరువులు,  బావులు,  తోటలు,  మార్గాలు,  యజ్ఞాలనూ ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు భుజించేవారు, దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మముననుష్టించేవారు, తమ పుణ్యాలు, ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు, దాంభికుడు, దుస్సంగుడు, యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతాపం కలిగించేవారు- మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి, తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు.               


                        నామధారకుడు, "స్వామీ, నాకొక సందేహమున్నది. కానీ కథకంతరాయమని అడగడానికి సందేహిస్తున్నాను."అన్నాడు. సిద్ధుడు, " నీవు అడగడం వలన కలిగే అంతరాయంకంటే , మనసులోని సందేహం వలన నీ శ్రద్ధ చలించే ప్రమాదమే ఎక్కువ. కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం" అన్నారు. అప్పుడు నామధారకుడు, "స్వామీ, మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక, మరుజన్మలో చండాలయోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా?" అన్నాడు. అందుకు సిద్ధుడు ఇలా వివరించాడు : "భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్ట సుఖాలను మాత్రమే అందించగలదు. అందుకే దానిని 'మరణావధి శరీరము', లేక 'పతనావధి శరీరము' అంటారు. దీనితో అనుభవించ వీలులేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు".


                       నామధారకుడు, "ఏ పాపాల వలన ఏ జన్మలొస్తాయో ఉదహరించండి" అంటే, సిద్దుడిలా చెప్పారు: "ఏమి చేస్తే చండాలజన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేగాక- క్రోధము, శూద్రస్త్రీల పట్ల కామాసక్తి, ఎద్దునెక్కుట, అల్లం,  ఆకులు మొదలైన రస వస్తువులను, వేదాలనూ  అమ్ముట, భగవదర్పితంగాని ఆవు పాలు త్రాగుట, నిషిద్దాన్నము, దుర్మార్గుల నుండి దానము స్వీకరించడం, ఇతరుల జీవనాధారమపహరించడం, సంధ్యాకాలంలో నిద్రించడము  బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాలజన్మ కలిగిస్తాయి.             

            యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి, అడుగుపెట్ట వీలులేని భయంకర మార్గంలో తీసుకుపోతారు. వాడు ఆకలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే, యమభటులు వాణ్ణి భయపెడతారు. వాడు మూర్ఛబోతే, వాణ్ణి లేపి, చీమూ నెత్తురు ప్రవహించే వైతరణీ నదిలో ముంచుతూ లాక్కుపోతారు. ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక, వాడు భూమిపై జన్మిస్తాడు. లేక వాసనాబలం వలన భూతంగానో,ప్రేతంగానో ఉండి శిక్ష అనుభవిస్తాడు. 


                       గురుద్రోహి,  విప్రులను పరాభవించినవాడూ బ్రహ్మరాక్షసులవుతారు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడచి భుజిస్తే కోడిగాను, ద్రవ్యాపహారి ఒంటెగాను, ఫలపత్రాదులు  దొంగిలిస్తే కోతిగాను, తేనె దొంగిలిస్తే పక్షిగాను, మాంసమపహరిస్తే గ్రద్దగాను, అన్నపహరిస్తే మిడతగాను, జలం అపహరిస్తే చాతకపక్షిగాను, ధాన్యపహరిస్తే మిడతగాను, విషమపహరిస్తే  తేలుగానూ జన్మిస్తారు. స్వర్ణాపహారీ క్రిమికీటకాదులుగానో, పక్షిగానో పుడతాడు. గడ్డి దొంగలిస్తే పశువుగాను, మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను, మిత్రద్రోహి గ్రద్దగానూ జన్మిస్తారు. బ్రహ్మహంతకుడు క్షయ రోగిగాను, గ్రంథచోరుడు గ్రుడ్డిగాను, గణార్థచోరుడు   గండరోగిగానూ, పరద్రవ్యాపహారి సంతాన హీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగానూ అవుతారు. అసత్యమాడేవాడు, ఆహారం దొంగిలించేవాడు గుల్మరోగులవుతారు. నూనె అపహరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతకునికి వాంతులు, దైవధనం అపహరిస్తే పాండురోగమూ  వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరస్త్రీ గమనం వలన నూరుజన్మలు కుక్కగా పుడతాడు. పరస్త్రీ భగదర్శనం వలన గ్రుడ్డితనము, బంధుభార్యాగమనం వలనగాడిద -పాము జన్మలు, పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి".      


                       నామధారకుడు శ్రద్ధగా విని, "స్వామీ ! ఇదివరకు తెలిసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా? " అన్నాడు. అందుకు సిద్ధుడు, "త్రివిక్రమ భారతికి  గూడా ఈ సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీ గురుడు ఇలా చెప్పారు: 'నాయనా! నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తర్వాత, వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని, తప్పును సభలో ఒప్పుకొని,  సభ విధించిన శిక్ష అనుభవించాలి. తగిన కృచ్ఛాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలనగాని, లేక గోవు యొక్క వెలనుదానం చేయడంవలన గాని పాపం పోతుంది. దశ స్నానాలు, రెండు వందల ప్రాణాయామాలు, సువర్ణదానాలు వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవవలన మాత్రం మహా పాపాలుకూడా మటుమాయమవుతాయి. అంతటి సాధనము ఇంకొకటి లేదు.    


                                      ప్రాజాపత్య కృచ్ఛమంటే - మొదటిమూడు  పగళ్ళు, తర్వాత మూడు రాత్రులయందు మాత్రమే భుజించాలి. తర్వాత మూడు రోజులు అయాచితంగా వచ్చినదే భగవత్ప్రసాదంగా తింటూ ఉపవసించాలి. మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. పదివేల గాయత్రీ జపము, అందులో పదవవంతు గాయత్రి హోమము చేసి, పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానంగాని, లేక గురిగింజ ఎత్తు బంగారం గాని దానమివ్వాలి.  


                               శుక్లపాడ్యమినాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకూ రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణమినాడు పదిహేను ముద్దలు భుజించాక, మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి, అమావాస్యనాడు ఉపవసించాలి. ఇలా చంద్రకళననుసరించి భుజించడం చాంద్రాయణ వ్రతం.       


                                  అసలు పగలు 12, రాత్రి 15 ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. స్వల్పభోజనమో,  లేక పాలు మాత్రమో మాసం సేవిస్తే పాప శుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలగునవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగాస్నానము,  రామేశ్వరంలో సముద్రస్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానమూ వలన గూడా పాపాలు నశిస్తాయి. లక్షగాయత్రీజపం వలన మద్యపాన దోషము,  కోటి గాయత్రి వలన బ్రహ్మహత్యాపాపము, ఏడు లక్షల జపంవలన స్వర్ణం దొంగిలించిన పాపమూ పోతాయి. సర్వపాపనాశానికి పావమానసూక్తం 610, "ఇంద్రమిత్రము" అను రెండు సూత్రాలతోనూ, " కస్యసూన" మనే శునశ్శేఫసూక్తాలతోనూ, "శంనఇంద్రాగ్ని" అనే శాంతి సూక్తాలతోనూ "త్రిసుపర్ణం", "పౌరుషం","నాచికేతం", "ఆఘామర్షణం",  అనే సూక్తాలతోనూ, ఒక ఆరునెలలు వేదపారాయణ చేస్తే మహా పాపాలు కూడా తొలగుతాయి. సర్వపాప శాంతికోసం దర్భసహితమైన తీర్ధాన్ని పంచగవ్యాన్నీ ( ఆవు యొక్క పంచితము, పాలు,  పెరుగు,  వెన్న, నెయ్యి ) స్వీకరించాలి. భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే యిద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసంచేసినా కూడా ప్రాయశ్చిత్తమనుభవించాలి. నామధారకా! నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా, ముంతలోని కల్లు బయటకు, నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా యెక్కవు. అలాగే భగవంతునిపై భక్తిలేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు  చేసుకున్నా పాపవిముక్తి కలుగదు.                               


                         తర్వాత శ్రీగురుడు ఆ చండాలునితో " నీవు తల్లిదండ్రులను విడిచి పెట్టడం వలన, గురువులను దూషించి వారిని విడిచి వేరే వున్నందు వలన నీకీ చాండాలజన్మ లభించింది. నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తావు' అని చెప్పారు. అప్పుడా చండాలుడు, 'స్వామీ ! మీ కటాక్షం అనే గంగా ప్రవాహం వల్ల నేను పాపవిముక్తుడైయ్యాను. మానససరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు, పరశువేదిని త్రాకిన ఇనుము బంగారం అయినట్లు, మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి, నన్ను విప్రులలో చేర్చండి' అని వేడుకున్నాడు. శ్రీ గురుడు, 'పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకుని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యము? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిననిపించుకోవాలని కొన్ని వందల కొద్దీ  సంవత్సరాలు మహాతపస్సు చేసి, తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠమహర్షి వలన కావలసిందేగాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడతడు వశిష్ట మహర్షిని ఆశ్రయించగా, ఆయన అది సాధ్యపడదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్టుని నూరుగురు కొడుకులనూ  చంపాడు. వశిష్టుడు అతనిని శిక్షించలేదు గాని, అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్దబండనెత్తి వశిష్ట మహర్షి పైన వేయాలి అనుకున్నాడు. కానీ తిరిగి ఆలోచించుకుని, "వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షి అని అంగీకరించగలవారెవరు? దేవర్షులందరూ ఆయనను అనుసరించే వారేకదా! ఈయనను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్యాపాతకం గూడా చుట్టుకుంటుంది" అని తలచి, పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడా బ్రహ్మర్షి, " నాయనా, ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తపింపజేసికొని, కొత్త శరీరం చూపు" అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి, సూర్య కిరణాల వలన తన దేహం మాడిపోయి, కొత్త దేహం వచ్చేవరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడు అని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమీ చేయకుండానే నీకదెలా  సాధ్యము? పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది, నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడవుతావు వెళ్ళు!' అన్నారు.      


              కానీ పేదవానికి పెన్నిది దొరికినా,  మృత్యుముఖంలోకి ఉన్నవాడికి అమృతం దొరికినా,  ఆకలిగొన్న పశువులకు గడ్డి దొరికినా  వాటిని విడువలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక, మాలెపల్లెకు వెళ్ళకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్యబిడ్డలు వచ్చి, అతనిని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, ' నేనిప్పుడు సద్బ్రాహ్మణుడను. నన్ను తాక వద్దు, దూరంగా పోండి!' అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ' ఏమయ్యా!  నీకేమన్నా పిచ్చి పట్టిందా?' అనగానే అతడామెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ, శ్రీ గురునికి నమస్కరించి, ' బాబూ! ఇతడు నాపై ఎప్పుడు ఎంతో ప్రీతిగా ఉండేవాడు. ఇతడికి మతి చలించింది. నన్ను ఇప్పుడు ఎక్కడకు వెళ్ళమంటాడో  చెప్పమనండి, నేనింక ఈ బిడ్డలను ఎలా పోషించేది? స్వామీ ! మీరే ఈయనకు బుద్ధి మార్చాలి. లేకుంటే నేను ఇక్కడే ఉరి వేసుకుంటాను' అని గోల పెట్టింది. శ్రీ గురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ, ' నాయనా! ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు. భార్య పిల్లలను ఏడిపిస్తే నీకింకా సద్గతి లభిస్తుందా? సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపరనుండి బయట పడగలవు. లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది. సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహా పాపం వస్తుంది' అన్నారు.                 


                     అతడు చేతులు కట్టుకుని, 'స్వామీ ! నేను సద్బ్రాహ్మణుడనన్న జ్ఞానం కలిగాక, అలా చేయడం నాకు ఎలా సాధ్యం? 'అన్నాడు. శ్రీ గురుడు నవ్వుకుని, 'ఈతని వంటిమీదున్న  విభూతి తొలగిస్తేగాని ప్రయోజనం లేదు' అని తలచారు. ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి, ఒక శ్రీమంతుడూ, పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకు రమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్లి, ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు. అతడితో స్వామి, ' నాయనా! నీవితనికి స్నానం చేయించు, అప్పుడతనికి తిరిగి తన కుటుంబం పై మమకారం మేల్కొంటుంది' అని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మస్మృతి పొందిన ఆ చండాలుని తలపై కుమ్మరించాడు. అతని వంటిపైనున్న విభూతి కొట్టుకు పోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మరచిపోయి, భార్యాబిడ్డలతో, ' ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతి పోయినట్లు అయింది. ఇంతకూ మీరందరూ ఇక్కడకు ఎందుకు వచ్చారు? నేను ఒంటరి నన్న భయం మీకెందుకు? ఇది పగలేగదా!' అన్నాడు. వారు జరిగినదంతా చెప్పారు. అతడు వారితో కలసి ఇంటికి వెళ్లాడు. ఆ సన్నివేశం అంతా చూసినవారు ఆశ్చర్యపోయారు. అదంతా చూచి విస్తుబోయిన త్రివిక్రమభారతి, 'స్వామీ ! మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది?' అని అడిగాడు. శ్రీ గురుడు నవ్వి, అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది. అది కడిగి వేయగానే తొలగిపోయింది. భస్మమహిమ అలాంటిది. కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు. దానికితోడు ఆ భస్మాన్నికి మహాత్ముల స్పర్శవుంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగలదు' అన్నారు. అప్పుడు త్రివిక్రమభారతి భస్మమహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురుని ప్రార్థించాడు. 


 ఇరవైఎనిమిదవ అధ్యాయం సమాప్తము




శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీశ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

గురు చరిత్ర అధ్యాయం -27



అధ్యాయము -27

                          

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                            శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 


                      నామధారకుడు పట్టరాని ఆసక్తితో, "అటు తర్వాత ఏమి జరిగింది స్వామీ? "అన్నాడు. సిద్ధుడిలా చెప్పారు :"శ్రీగురుడు ఎంతచెప్పినా వారు వినలేదు. అపుడు  శ్రీ గురుడు వారితో,  'అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము' అని, అటు ప్రక్కగా పోతున్న ఒకనిని పిలిచి, 'నీవెవరు? నీ కులమేది? నీ దేవూరు? ఎక్కడికి పోతున్నావు?' అని అడిగారు. అతడు, 'అయ్యా, నేను కడజాతివాణ్ణి. నన్ను మాతంగుడంటారు. నేను ఈ ఊరిబయట ఉంటాను. ఈనాటికి నాపై మీకు దయకలిగింది' అని నమస్కరించాడు. అప్పుడు శ్రీ గురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి, శిష్యునికి తమ దండంఇచ్చి, దానితో నేల మీద ఏడు  గీతలు గీయించారు. అప్పుడా చండాలుని  మీద విభూతి చల్లి, వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. అతడు మొదటి గీత దాటగానే ఆయన,  'నీవెవరు?' అని అడిగారు. 'నేను వనరక్షకుడైన  భిల్లుడను 'అన్నాడతడు. అతడు రెండవ గీత దాటి, ' నేను రావణుడు అనే కిరాతకుణ్ణి'  అన్నాడు. మూడవ గీత దాటి, ' నేను గాంగేయుడనే జాలరిని' అని, నాల్గవగీత దాటి, 'శూద్రుడనైన రైతును' అని, అయిదవ గీతను  దాటి, ' నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి'  అని, ఆరవగీత దాటి, ' గోవర్ధనవర్మయనే  క్షత్రియుణ్ణి' అని, ఏడవ గీత దాటి, నేను వేద విదుడను, అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను ' అని వెనుకటి జన్మలో తానెవరో చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు, 'నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు' అన్నారు. అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు.                     

        అది చూచి ఆ కుపండితులకు భయంతో నోరెండింది; కడుపులో నొప్పి ఆరంభమైంది. అప్పుడు వారు స్వామి పాదాలపైబడి, 'స్వామీ! సాక్షాత్తూ పరమేశ్వరులైన మిమ్ము దిక్కరించాము. బ్రాహ్మణులను దూషించాము. మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి, మ్లేచ్చుల  ఎదుట వేదం చెప్పి, అతని సత్కారానికై  ఆశపడ్డాము. మీరు సర్వ సమర్థులు. మీ మహిమను తెలుసుకోవడం మా తరం కాదు. మమ్మల్ని ఉద్ధరించండి!' అని వేడుకున్నారు. అప్పుడు స్వామి, 'మీరు బ్రాహ్మణ దూషణ, ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు గనుక, ముందు జన్మలో బ్రహ్మరాక్షసులు అవుతారు. చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా?' అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపైబడి, తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు స్వామి, 'విప్రులారా! మీకు పశ్చాత్తాపం కలిగింది గనుక మీ పాపంలో కొంత భాగం నశించింది. ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక, ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం  వినడం వలన మీకు పిశాచత్వము తొలగి, ద్విజులై సద్గతి పొందుతారు' అన్నారు. వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికీ గుండెనొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి,  రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు. తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని, ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు.


                     ఏడు జన్మల క్రిందట తాను వేదవిదుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, 'సద్గురోత్తమా! మీరు జ్ఞాన జ్యోతి స్వరూపులు. పూర్వజన్మలో వేదవిదుడనైన నేను ఈ జన్మలో కడజాతివాణ్ణి ఎలా అయ్యాను? త్రికాలజ్ఞులైన మీరు నాకీ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది' అని వేడుకున్నాడు.                     

  ఇరవైఏడవ అధ్యాయం సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


Friday, May 15, 2020

గురు చరిత్ర అధ్యాయము -26


అధ్యాయము  -26




                                

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 

              నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో, "స్వామీ ! శ్రీ గురుడు విద్యా వంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు?" అని అడిగాడు. అందుకు సిద్ధముని ఇలా చెప్పారు:            

                        "శ్రీ గురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూడులకిలా  బోధించారు: 'నాయనలారా! మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది. ఎవరైనా వేదవిదులమనుకోవడం దురహంకారమే. వేదాల లక్ష్యం పరమార్ధమే గాని -- ధనము, కీర్తి,  అహంకారము గావు. సమదర్శనమే పండిత లక్షణం. నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్నవారెవరూలేరు. వేదము ఆద్యంతరహితము, అపారము. దానిని పూర్తిగా తెలుసుకొనడం  బ్రహ్మదేవునికే  సాధ్యపడలేదు.  


               పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి,  బ్రహ్మచర్యమవలంభించి,  బ్రహ్మదేవుని వరంతో మూడుసార్లు దీర్ఘాయువు పొందాడు. నాలుగు యుగాలూ ఐదు వేల సార్లు పునరావృతమైతే బ్రహ్మకు ఒక పగలు. అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువువద్ద వేదం నేర్వడానికి చాలక తపస్సు చేస్తే, బ్రహ్మసాక్షాత్కరించి, 'వేదం పూర్తిగా నాకే తెలియదు. వేదరాశిని చూపుతాను, చూడు!' అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు.భరద్వాజుడది చూచిభయపడి, 'అయ్యో!  నేనింతకాలం పఠించిన వేదమంతా కలసి యిందులో ఒక్క పిడికిడైనా లేదే! వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమౌతుందా?' అని తలచి, "నాకవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి" అన్నాడు. అప్పుడు బ్రహ్మ, అనంతమైన ఆ వేదరాశినుండి మూడు పిడికెళ్ళు తీసి అతనికి ప్రసాదించి, "ఇదంతా అధ్యయనం చేసేంతవరకూ నీవు జీవింతువు గాక!" అని వరమిచ్చాడు. కాని ఆ మూడు పిడికెళ్ళ వేదమూ అధ్యయనం చేయడమే అతనికి యింతవరకూ పూర్తిగాలేదు. కనుక సాక్షాత్తూ నారాయణుడే బాదరాయణుగా అవతరించి, వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి, వాటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అను శిష్యులకు ఒకొక్కవేదం చొప్పున తెలిపాడు.వారు కల్పాంతం వరకూ అభ్యసించిగుడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు నాలుగు వేదాలనూ సంపూర్ణంగా అధ్యయనం చేసామనుకోవడం ఎంత తెలివి తక్కువ!


            వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికీ సాథ్యంగాదు గనుకనే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించాడు.ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి, దానిని ధ్యానించడానికై దానిని గురించి యిలా  చెప్పాడు: ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదము. ఆత్రేయస గోత్రం. గాయత్రి ఛందము. ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ. ఎర్రని వర్ణము, తామరరేకుల వంటి కళ్ళు, సుస్పష్టమైన కంఠము, గిరజాలజుట్టు, వంకమీసమూ కలిగి, అమ్మ రెండుమూరల పొడవైన దేహం గలిగి ఉంటాడు. నీవు ఆ రూపాన్ని ధ్యానించు. దీనిలో చర్చ, శ్రావకము, చర్చకము, శ్రవణీయపారము, క్రమపారము, జట, రధక్రమము, దండక్రమము అనే భాగాలున్నాయి. ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి. ఈవేదానికి అశ్వలాయని, సాంఖ్యాయని, శాకల, భాష్కలా, మాండుకేయులనే ఐదు శాఖలున్నాయి". వాటిని  ఆనాడు వ్యాసుడు పైలునికి  చెప్పాడుగాని, ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివినవారెవరు?   


                తర్వాత వ్యాసమహర్షి తన రెండవ శిష్యుడైన వైశంపాయునికి యజుర్వేదం చెప్పి,  దాని లక్షణాలు ఇలా చెప్పారు: "యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము. భారద్వాజసగోత్రము, త్రిష్టుప్ ఛందస్సు. దీనికి రుద్రుడు అధిదేవత. సన్నగా ఉండి చేతిలో కపాలం  ధరించి సుమారు అయిదు మూరలు పొడవున్న తామ్రవర్ణ  శరీరం కలిగి ఉంటాడు. దీనికి గల 85 శాఖలలో ఇప్పుడు 18 మాత్రమే మిగిలి ఉన్నాయి. యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది. మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము. ప్రతిపదము,  అనుపదము, ఛందస్సు,  భాష,  ధర్మము,  మీమాంస,  న్యాయము, తర్కము అనే ఎనిమిది దీనికి ఉపాంగాలు. శిక్ష, కల్పము,  వ్యాకరణము,  నిరుక్తము, ఛందస్సు,  జ్యోతిషము అనే ఆరు అంగాలు దీనికున్నాయి" ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశం పాయనునికి వివరించి చెప్పి, వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జైమిని కి సామవేదాన్ని ఇలా వివరించాడు:   


                               " దీనికి ఉపవేదము గంధర్వము. విష్ణువు అధిదేవత, జగతీచ్చందస్సు. కాశ్యపసగోత్రము. దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ, మొలకు తెల్లని వస్త్రము,  చర్మము, దండము ధరించి ఆరుమూరలు పొడవు కలిగి ఉంటాడు. ఆయన శరీరఛాయ తెలుపు; శమము,  దమము మొదలైన దైవీసంపదగలవాడు. సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి.ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు".            



                    వ్యాసమహర్షి సుమంతుడు అనే శిష్యునికి అధర్వణవేదం చెప్పి,  "దీనికి అస్త్రరూపం ఉపవేదము.గోత్రము బైజానకము.  ఇంద్రుడు అధిదేవత.త్రిష్టుప్ఛందస్సు. అధర్వణ వేదపురుషుడు తీక్షణమైనా ఆకారము, నల్లని వర్ణమూగల కామరూపుడు. ఏకపత్నీవ్రతుడు.ఏడుమూరల పొడవు.ఈ వేదానికి తొమ్మిది శాఖలు, అయిదు కల్పాలు ఉన్నాయి. 


            పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా  నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమాచారనిరతులేందరో భరత భూమిలో ఉండేవారు. కనుకనే వేదాలన్నీ  నిలువగలిగాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మబ్రష్టులవుతున్నారు గనుక,  ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది. పూర్వపు బ్రాహ్మణులలో దైవత్వము,  మహత్తు ఉండేవి. అందుకే వారిని భూసురులు  అనేవారు. రాజు కూడా వారిని సేవించేవాడు.వారు ఎంత ధనమిస్తానన్నా లెక్కజేయక,  భోగాలపట్ల  నిర్లిప్తులుగా ఉండేవారు. వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులై ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తుండేవారు. మాటమాత్రం చేత గడ్డిపరకను మేరుపర్వతంగాను,  మేరుపర్వతాన్ని గడ్డిపరకగానూ మార్చి వేయగలిగి ఉండేవారు. జగత్తంతా దేవతలకు ఆధీనము: దేవతలందరూ మంత్రాధీనులు; మంత్రాలన్నీ బ్రాహ్మణుల అధీనంలో ఉండేవి. వారిని విష్ణువు కూడా పూజించేవాడు. కాని ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో లొంగి, మ్లేచ్చుల  ఎదుట కూడా వేదం  చదువుతున్నారు. అట్టివారి ముఖమైన చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేద వేత్తలమని విర్రవీగుతూ,  ద్విజులందరినీ ఈ  విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి? మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించినదెవరు?  మిమ్మల్ని మీరు పొగుడుకొని,   జయపత్రాలు పోగుచేసుకొనడమే గాక,  త్రివిక్రముని గూడ జయపత్రికను ఇవ్వమంటున్నారే! ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొనితెచ్చుకోవద్దు.  ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి' అన్నారు. కాని  ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయ పత్రికనైనా యివ్వమనీ  కోరారు".

ఇరవై ఆరవ అధ్యాయము సమాప్తము

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

 

Tuesday, May 12, 2020

గురు చరిత్ర అధ్యాయము -25


అధ్యాయము  -25

                              

శ్రీ గణేశాయనమః    
శ్రీ సరస్వత్యేనమః                                                                            శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 



    అటుపైన శ్రీ గురుడు చేసిన దివ్య లీలలను  వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధమని ఇలా చెప్పారు: ' ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు. అతడు హిందూమత ద్వేషి, ఎంతో కఠినాత్ముడు. అతడు తన రాజ్యంలోగల వేద వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని, తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు. అందుక అంగీకరించని వారికి ధనాశ చూపుతుండేవాడు. అయినప్పటికీ కొందరు శిష్టాచారపరులు అలా చేయడం తమవల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. కొందరు నికృష్టులు మాత్రం అతడిచ్చే సంభావనలను  ఆశించి,  వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతుండేవారు. యజ్ఞకాండలోని అంశాలు వారినుండి విని,  ఆ దుష్టుడు,  యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు, ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికి వచ్చినంత సంభావనలు యిస్తుండేవాడు. ఆ సంగతి విని,  ధనాశపరులు ఎందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే  వచ్చి వేదార్థం చెప్పసాగారు.


               ఒకనాడు ఉత్తరాది నుండి వేదపండితులైన బ్రాహ్మణులు ఇద్దరు  వచ్చి ఆ రాజును దర్శించి,  'రాజా! సకల విద్యలలోనూ మాకు సాటిఅయినవారు ఎక్కడా లేరు. మేము దేశంలోని పండితులను శాస్త్ర వాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము. మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి. మా ప్రతిభ నిరూపించగలము'అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలచి,  ఆ రాజు వెంటనే నగరంలో దండోరా వేయించి,  నాటి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి, ఆ పండితులను వాదనలో ఓడించినవారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలనని, ఓడిన వారిని దండించగలననీ ప్రకటించాడు. అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలను ఆ దుష్టులఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు,  తమకంతటి సామర్ధ్యం లేదని చెప్పి తప్పుకున్నారు. మరికొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు. వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలిచ్చివేయక తప్పలేదు. అప్పుడా రాజు ఆ కుపండితులిద్దరికీ వస్త్రాలు,ఆభరణాలు,భారీఎత్తున కానుకలూ బహుమానమిచ్చి ఏనుగునెక్కించి,  మేళతాళాలతో ఊరేగించాడు. వారికొక అగ్రహారంగూడా ఇచ్చాడు. వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది.  


                                 అంతటితో ఆ పండితులిద్దరూ మరింత గర్వించి,  ఆ నగరంలోని విద్వాంసులందరినీ నోటికి వచ్చినట్లు దూషించసాగారు. ఒకనాడు వారు రాజుతో,  'అయ్యా! మా పాండిత్యము,  మా ప్రతిభా ఇక్కడంతా తెలిసి పోవడం వలన ఇక్కడ మాతో వాదానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాని వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనం ఏమిటి? కనుక మీరు సెలవిస్తే మేమీ రాజ్యమంతటా సంచారం చేసి,  పండితులందరితో వాదించ దలచాము. మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రికలు తీసుకు రాగలము' అని చెప్పారు. రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వారు ఏనుగుల నెక్కి దక్షిణదిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు. వాళ్ళిద్దరూ ప్రజల జయజయధ్వానాలతో, పర్యటిస్తూ, ఒకరోజు కుమసీ గ్రామానికి వచ్చారు. అచట త్రివిక్రమభారతి వేదవేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి, ' ఏమయ్యా! నీవు వేదజ్ఞుడవైతే మాతో వాదించు. లేకుంటే, ఓటమి అంగీకరిస్తూ మాకు జయ పాఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైన ఇవ్వు!' అన్నారు.                                             

                     అందుకు త్రివిక్రమ భారతి,  'అయ్యా!నాకు వేదం రాదు. వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజ సన్మానాలు అందుకుంటూ భోగాలు  అనుభవించేవాడినేగదా?  నేను ఈ అరణ్యంలో ముక్కుమూసుకుని కాలక్షేపం చేస్తున్న భిక్షువును. నాలాంటి వాడిని జయించినా మీకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాతో వాదించడం,  కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది' అని చెప్పాడు. ఆ పండితులు,  అయ్యా! మాతో వాదించగల వారు మాకు ఎక్కడా కనిపించలేదు. కనుకనే మాకు లెక్కలేనన్ని జయ పత్రాలు లభించాయి. అలాగే నీవు కూడా ఒకటి రాసివ్వు, లేదా మాతో వాదించి' అని పట్టుబట్టారు. అప్పుడా సన్యాసి, 'వీరికి గర్వం తలకెక్కింది. ఒళ్ళు పై తెలియకుండా సాటి పండితులందరినీ నిందిస్తున్నారు. వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు. వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను' అని ఆలోచించుకుని వాళ్లతో ఇలా అన్నాడు: 'పండితొత్తములారా! నేను స్వతంత్రుడను గాను; గంధర్వపురంలో మా గురుదేవులు ఉన్నారు. వారి ఆజ్ఞ తీసుకుని మీరు కోరినట్లే ఆ రెంటిలో ఏదో ఒకటి చేయగలను. మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి'.                     


        అందుకా మదాంధులంగీకరించి గంధర్వపురానికి బయల్దేరారు. త్రివిక్రమభారతి, వినయంతో కాలినడకన వెళుతుంటే, ఆ దుష్టులిద్దరూ ఏనుగు మీద కూర్చుని వెళ్తున్నారు. సాధుసత్పురుషుల వద్దకు వెళ్లడం వలన ఆయుః  క్షీణమవుతుందన్న శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు. గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమభారతి శ్రీగురునికి నమస్కరించి, ఆనందభాష్పాలు కారుస్తూ, గద్గదస్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించి, 'పరాత్పరా! గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లే, అజ్ఞానాంథులు మిమ్మెరుగలేరు మీ చేత వారికి హితం చెప్పించడానికై  వారినిక్కడకు  తీసుకువచ్చాను.
ఈ మదాంధుల బారి నుండి నన్ను,  వేదధర్మాన్ని కాపాడండి!! మీ ఆజ్ఞ కోసం వచ్చాను. మీరు ఏది చేయమంటే అది చేస్తాను' అని ప్రార్థించాడు. వాళ్ళు, 'మా కాలం వ్యర్థం అయింది. ఇతడు జయపత్రం ఇవ్వడు, వాదభిక్ష ఇవ్వడు. మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు కనుక,  మీ గురుశిష్యులలో ఎవరైనా ఆ రెండింటిలో ఏదో ఒకటి చేసి తీరాలి' అన్నారు. శ్రీ గురుడు నవ్వుతూ ఆ దుష్టులతో ఇలా అన్నారు: ' అయ్యా! మీ వంటి వేదవిధులకు, వాదించడం వలన కలిగే ప్రయోజనమేమున్నది? వాదంలో సాటి విప్రులను ఇలా పరాభవించినందువలన మీకు కలిగే లాభం ఏమిటి? యతులమైన మాకు జయించడం వలన వచ్చే గౌరవము, ఓడినందువలన చిన్నతనమూ  ఏమీ  కలుగవు. అటువంటి మావలన మీకేమీ ప్రయోజనము?  అన్నారు. అందుకు వారిద్దరూ, 'అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రమివ్వక, మమ్మల్ని ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చాడు? కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే,  మాతో వాదానికి రండి; లేకుంటే జయ పత్రమైనా  ఇవ్వండి' అని పట్టుబట్టారు.       


                                     అప్పుడు శ్రీ గురుడు నవ్వి, 'అయ్యా! వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యంకాలేదు. వేదాలు అపారమైనవి. అటువంటప్పుడు వేదవిదులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది. ఈ జయపత్రికల వల్ల ప్రయోజనమేమున్నది ? మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి' అన్నారు. అప్పుడు వాళ్లు రోషంతో, 'అయ్యా! మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు. మేము సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకున్నాము. మమ్మల్ని  మించిన వారు ఎవరూ లేరు' అన్నారు". 


ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తము.

శ్రీ దత్తాయ గురవేనమః 
శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


Sunday, May 10, 2020

గురు చరిత్ర అధ్యాయము -24


అధ్యాయము  -24




                                
శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 

కథారంభము 


                                         సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు : "త్రివిక్రమభారతి శ్రీ గురుని నిందిస్తున్నాడని విని, రాజు ఒక రోజు స్వామితో, 'స్వామి! అతడు మిమ్మల్ని నిందిస్తూ ఉంటే మీరు ఊరుకుంటారేమిటి? అతని అజ్ఞానాన్ని తొలగించరాదా? ' అని వేడుకున్నాడు. శ్రీ గురుడు అంగీకరించి బయల్దేరారు. రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి, పల్లకిలో కూర్చోబెట్టి,  రాజలాంఛనాలతో కుమసీ  గ్రామానికి తీసుకు వెళ్ళాడు.            

                                         ఆ ఊరేగింపు మహా వైభవంగా కుమసీ గ్రామం సమీపించే సమయానికి, త్రివిక్రమభారతి పూజ చేసుకుంటున్నాడు. ప్రతిరోజూ నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు. త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు. కానీ ఆరోజు అతడు ఎంత ప్రయత్నించినా ఇష్ట దేవతామూర్తి దర్శనమీయలేదు. త్రివిక్రముడు ' స్వామీ! నరసింహా! ఈరోజు మీరు నన్ను ఎందుకు కరుణించలేదు?  ఎంతోకాలంగా చేస్తున్న నా తపస్సంతా యీరోజు భంగమైంది.  ఇక నేనేమి చేయగలను? 'అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు. వెంటనే అతని మనస్సులో,  సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై, 'ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను. అక్కడికి వచ్చి దర్శించుకో!' అని దివ్యవాణి వినిపించింది. త్రివిక్రమభారతి వెంటనే లేచి నది వద్దకు వెళ్ళాడు.కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వడంతో అతడు ఆశ్చర్యపడి, శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేసాడు. మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు, పరివారము, గూడ యతులలాగ  కనిపించారు. త్రివిక్రమభారతి నివ్వెరబోయి అంత మంది సన్యాసులతో శ్రీగురుని గుర్తించలేక 'స్వామీ! త్రిమూర్తిస్వరూపా! వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను. నాపై కృపతో మీ నిజస్వరూపం దర్శింపజేయండి. ఇంతకాలం నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనమనుగ్రహించారు. యీ రోజు నా తపస్సు ఫలించింది. అందువలననే మీదర్శనం లభించింది' అన్నాడు.  శ్రీగురుడు సంతోషించి తమ నిజస్వరూపంతో కనిపించించారు. అంతకు ముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై,  వాటి  స్థానాలలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు, పరివారము కనిపించారు. స్వయంగా రాజుచేత వింజామరలతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులార చూచాడు. అప్పుడు శ్రీగురుడు, 'త్రివిక్రమా! ఎవరిని దాంభికుడనీ, భ్రష్టుడనీ నిందించావో, ఆ సన్యాసియే మేము. మేమిపుడే నిన్ను పరీక్షించాము. నృసింహభక్తుడవైన నీవు మమ్ములను ఏ కారణంగా విమర్శించావు? దంభిలక్షణాలేమిటో  తెలుసుకోవాలని వచ్చాను. నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయమేమిటో వివరించు!' అన్నారు.           


                   శ్రీ గురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే గాక, ఆయన ప్రసాదించిన దివ్యదర్శనంతో పరవశించిన  త్రివిక్రమభారతి శ్రీగురునికి నమస్కరించి, ' సద్గురూత్తమా! మీరు మానవరూపంలో అవతరించడం వలన నేను తెలియక మూడునివలె ప్రవర్తించాను. నన్ను క్షమించండి. విదురుని వద్దకు, ద్రౌపది వద్దకూ అనుగ్రహించ వచ్చిన శ్రీకృష్ణునివలె, నన్ను అనుగ్రహించడానికై మీరే స్వయంగా వచ్చారు. మీరు సాక్షాత్తూ త్రిమూర్తి స్వరూపమైన పరమేశ్వరులే. పగటి వెలుగును చూడలేని గుడ్లగూబ వలె, అజ్ఞానినయిన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి, మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపజేసి, ఆత్మయనే ఒడ్డు చేర్చండి. భారతంలో అర్జునునికి శ్రీ కృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను. గాని, ఇప్పుడు మీ  అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను. బేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణివలె మీరు నాకు ఈనాడు లభించారు. మీరే నా ఉపాస్యదైవమైన నృసింహస్వరూపులు. శరణు శరణు!' అని స్తుతించాడు. శ్రీగురుడతనిని అనుగ్రహించి 'త్రివిక్రమా!  నీ భక్తికి సంతోషించాము. నీవు నృసింహస్వామికి చేసే అనుష్టానం మాకే చెందుతుంది. అదే చేస్తూండు. నీకు పునర్జన్మలేదు. నీకు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవగలవు!' అని ఆశీర్వదించి, త్రివిక్రమభారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు. తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ, పరివారంతోనూ, 'మాకు అనుష్టాన సమయం అయింది. మేము ముందుగా వెళ్తాము. మీరు వెనుక రండి!' అని చెప్పి, మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు. తర్వాత శ్రీ గురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు.      


                      కనుక నామధారకా ! శ్రీ గురుడు భగవంతుడుకాడని, మానవమాత్రుడేనని తలచేవాడు ఏడు జన్మలు నరకమనుభవిస్తాడు. గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి. నా మాటపై విశ్వాసముంచి లోకులు శ్రీగురుపాదాలను ఆశ్రయింతురు గాక! అందరికీ అందుబాటులో ఈ గురుకథ అనబడు చలివేంద్రమును స్థాపించాము. దీనినుండి ప్రజలు గురుకథామృతమును  సేవింతురు  గాక!" అన్నారు సిద్ధయోగి.

ఇరవైనాలుగవ అధ్యాయము సమాప్తము
 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Saturday, May 9, 2020

గురు చరిత్ర అధ్యాయము -23

అధ్యాయం-23         



శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 

కథారంభము 



                                సిద్ధముని యింకా యిలా చెప్పారు: "నామధారకా! శ్రీ గురుడు గొడ్డు బఱ్ఱె నుండి పాలుపితికించడంతో అంతవరకూ  గుప్తంగా వున్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మర్నాడు కొందరు గ్రామస్థులు మట్టి తోలుకోడానికి బఱ్ఱెను బాడుగకు యిమ్మని అడగటానికి వచ్చారు. అప్పుడా బ్రాహ్మణుడు, 'అయ్యా! మా గేదె పాలిస్తున్నది. కనుక యికనుండి దానిని మట్టి తోలడానికి పంపలేము' అని చెప్పి, నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు. ఆ గ్రామస్థులు, 'అరెరే! యింతవరకూ ఒక్కసారైనా కట్టని యీ ముసలిబఱ్ఱె పాలు ఎలా యిచ్చింది? అని ఆశ్చర్యపోయారు. అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరమేలే రాజుకు చేరింది.అతడాశ్చర్యపడి, కుతూహులంతో బ్రాహ్మణుని యింటికి వచ్చి చూచి, అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నాడు. వెంటనే అతడు సకుటుంబంగా, పరివారంతో గూడ సంగమానికి వెళ్లి శ్రీ గురునికి పొర్లుదండాలు పెట్టి, సాష్టాంగ నమస్కారం చేసి యిలా స్తుతించాడు: జగద్గురూ! మీకు జయము. మాయామోహితుడైన నాకు త్రిమూర్తిస్వరూపులైన మీ అపారమహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూపా! నన్ను మీరే యీ సంసారం నుండి ఉద్ధరించాలి. పామరుల దృష్టికి మానవునిలాగా కన్పించే  మీరు విశ్వకర్తలు'. 


                                 శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి, ' రాజా! మేము తపస్వులము. అరణ్యంలో నివసించే సన్యాసులము. నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి? ' అన్నారు. రాజు వినయంగా నమస్కరించి, ' ప్రభూ! మీరు భక్తులనుద్ధరించడానికి అవతరించిన నారాయణులే. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము. అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు? నా ప్రార్థనను మన్నించి గంధర్వపురంలోనే నివసించండి, మీరు అనుష్టానం చేసుకోవడానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను. మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి. మా పట్టణాన్ని పావనం చేయండి' అని స్వామి పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు స్వామి, ' ఇది భగవదేఛ్ఛ. మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది. కనుక కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజునూ,  భక్తులనూ రక్షించాలి' అనుకొని అనుమతించారు. రాజెంతో సంతోషించి, శ్రీ గురుణ్ణి పల్లకిలో కూర్చోబెట్టి వాద్య, నృత్య, గీతాదులతో పట్టణానికి తీసుకెళ్లాడు. పల్లకీకి ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రాజు, అతని పరివారము, వందిమాగధులు నడచివచ్చారు. రాజు స్వయంగా ఛత్రం పట్టుకున్నాడు. విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే, వందిమాగధులు శ్రీగురుని స్తుతిస్తున్నారు. నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయజయధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు.      


                      ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వనగరంలో ప్రవేశిస్తున్నది. అక్కడొక పెద్ద రావిచెట్టు ఉన్నది. దాని సమీపంలోని ఇళ్లన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణం, ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. అతడు ఆ ప్రదేశంలోకొచ్చిన మానవులను, జంతువులను మ్రింగివేస్తుండేవాడు. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి, ఆ పట్టణంలోనే వేరొకచోట నివశిస్తున్నారు. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే, స్వామి తన పల్లకీ  నుండే ఆ చెట్టుపైకి చూశారు. మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా, ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టుదిగి వచ్చి స్వామికి నమస్కరించి తననుధ్ధరించమని ప్రార్థించాడు. పరాత్పరుడు, కరుణామూర్తి అయిన శ్రీ నరసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు. తక్షణమే అతనికి మానవాకారము వచ్చి అందరికీ కనిపించాడు. స్వామి అతనితో, ' నాయనా! నీవు వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేయి. నీ పాపం నశించి ముక్తి పొందుతావు' అని ఆదేశించారు. అతడు స్వామికి నమస్కరించి, వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేసి ఆ శరీరం విడిచి పెట్టి ముక్తి పొందాడు.          


                          ఈ సన్నివేశం చూచిన పట్టణవాసులు, శ్రీ గురుడు సాక్షాత్తూ పరమేశ్వరుడని తెలుసుకున్నారు. అపుడు శ్రీ గురుడు, ' నాకు మఠం ఇక్కడే నిర్మించాలి' అన్నారు. అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబడిన ఇల్లు శుభ్రం చేశారు. దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు. స్వామి అందులో ఉంటూ రోజూ స్నానానికి,  అనుష్టానానికి,  సంగమానికి వెళ్లి వచ్చేవారు. నిత్యమూ  రాజు ఆయనను దర్శించి పూజించేవాడు. శ్రీ గురుడు సంగమానికి వెళ్లేటప్పుడు, మళ్లీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడూ ఆయనను పల్లకీలోకూర్చోబెట్టి రాజ మర్యాదలతో తీసుకువెళ్లేవాడు.నిత్యమూ ఎందరెందరో శ్రీగురు  దర్శనానికి వస్తుండేవారు. ఆ పట్టణంలో ప్రతినిత్యమూ బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతుండేవి. అలా శ్రీగురుని కీర్తి గ్రామగ్రామాలకూ ప్రాకిపోయింది.


                                    గంధర్వనగరానికి కొద్దిదూరంలోని  'కుమసి' అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి వుండేవాడు. వేదవిదుడైన ఆ యతి, నిత్యమూ నృసింహావతారాన్ని మానస పూజతో ఉపాసిస్తుండేవాడు. ఇతడు శ్రీగురుని గురించి విని, ఆ యతి దాంభికుడు; సన్యాసాశ్రమధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు' అని ఆక్షేపిస్తూండేవాడు . విశ్వవ్యాపి,సర్వసాక్షియైన శ్రీ గురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మనిందను తెలుసుకున్నాడు.  అప్పుడొక అద్భుతం జరిగింది ."   

ఇరవై మూడవ అధ్యాయము సమాప్తము

 

శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


గురు చరిత్ర అధ్యాయము -22

*** శనివారము పారాయణ ప్రారంభం ***

అధ్యాయం -22




శ్రీ గణేశాయనమః                          
శ్రీ సరస్వత్యేనమః                                                                                                 
శ్రీ గురుభ్యోనమః 

కథారంభము 


                                    నామధారకుడు, "సిద్ధమునీ, మీ వలన నాకు అజ్ఞానాంధకారము  తొలగి, జ్ఞానోదయం అయింది. అందువలన మీరే నా గురుదేవులు. కామధేనువు వంటి శ్రీ గురుచరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపజేస్తున్నారు. శ్రీ గురు కథ నా మనసును హరిస్తున్నది.  అటుపైన ఏమి జరిగిందో సెలవియ్యండి" అని ప్రార్థించాడు. సిద్ధయోగి, " నాయనా, నీకు గురుకృప  లభించింది. నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ గూడ  ధన్యమైంది.       

                          అటు తరువాత శ్రీ గురుడు ఈ గంధర్వపురం చేరి,  భీమ- అమరజా సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది.ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తరదిక్కుగా ప్రవహిస్తాయి. కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం. ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలున్నాయి. ఇక్కడ కూడా శ్రీ గురుడు అదృశ్యరూపంలో నిత్యనివాసం చేస్తున్నారు. ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలున్నప్పటికీ,  మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెలపడానికే  ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమవనీయక, గుప్తంగా సాదుజీవితం గడిపేవారు. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ, దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్లేవారు. ఆ గ్రామంలో సుమారు నూరు బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. వారంతా వేదవిధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పతివ్రత.వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేది. గ్రామంలోని రైతులు దానిని మట్టి, ఇసుక మొదలైనవి మోయించుకోడానికై  అద్దెకు తీసుకెళ్తుండేవారు.అతడు యాయవారం (భిక్షాటన) తోనూ, గేదె పై వచ్చు బాడుగలతోనూ జీవనం సాగిస్తూ ఉండేవాడు.                


                      శ్రీ నృసింహసరస్వతీ స్వామి తరచూ వీరి ఇంటికి బిక్షకు వెళ్లేవారు. అది చూచి కొందరు గ్రామంలో శ్రోత్రీయులము,   శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమందిమి  ఉండగా, ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర  బ్రాహ్మణుని ఇంటికే  వెళ్ళాలా? అక్కడ ఆయనకేమి దొరుకుతుంది? అని విమర్శిస్తుండేవారు. కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్లక పేదవాడైనా విదురుని ఇంటికే  వెళ్ళాడు. భగవంతునికి సత్వగుణమందే ప్రీతిగాని, ధనమదంతో చిక్కిన వారితో ఆయనకేమి పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రుడికి గూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మ లిపి కూడా మారవలసిందే!      


                     ఒక వైశాఖమాసంలో మధ్యాహ్నపుటెండ  నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీ గురుడు వారి ఇంటికి భిక్షకు వెళ్లారు. ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. ఆ బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు. శ్రీ గురుడు వాకిట్లో నిలచి.'భవతీ భిక్షాందేహి' అన్నారు. ఆ ఇల్లాలు నమస్కరించి,'స్వామీ,  యజమాని యాయవారానికై గ్రామంలోకి వెళ్ళారు. వారొచ్చే సమయమైంది. కోపగించక  దయతో కొద్దిసేపు మీరీ ఆసనం మీద కూర్చొండి' అని  పీట వేసింది.  


                               శ్రీ గురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో, 'నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు. మాకు భిక్షే ఇవ్వనవసరం లేదు. మీ ముంగిట ఉన్న బర్రె పాలు కొంచెం ఇచ్చినా చాలు!' అన్నారు. అప్పుడామె, 'స్వామీ  ఇది గుడ్డుబర్రె.ఒక్కసారైనా కట్టనూ లేదు, ఈననూ లేదు. ఇప్పుడు ఇది ఎంతో ముసలిది. పళ్ళు కూడా ఊడిపోతున్నాయి. దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాము' అన్నది. శ్రీ గురుడు అదేమీ పట్టించుకోకుండా 'ఎందుకు ఈ వట్టి మాటలు? అయినా పాలు పితుకు చూస్తాము!' అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యం!  ఆ గొడ్డుబర్రె రెండుపాత్రలనిండుగా పాలు ఇచ్చింది.ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తూ పరమేశ్వరుడేనని  తెలుసుకున్నది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది.శ్రీ గురుడు ఆ పాలు త్రాగి సంతోషించి, 'అమ్మా, మీరు అఖండ ఐశ్వర్యం తోనూ, పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు' అని ఆశీర్వదించి సంగమానికి వెళ్లిపోయారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకుని,  భార్యతో గూడ సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది" అన్నారు సిద్ధయోగి. 

ఇరవై రెండవ అధ్యాయం సమాప్తము.

                            
శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Thursday, May 7, 2020

జీవితం బుధ్బుధ ప్రాయం!

నా స్నేహితుడై న  నవనీత్! కలం నుండి జారిన కవిత 


జీవితం బుధ్బుధ ప్రాయం!


ప్రతీ క్షణం నూరేళ్ల జీవితం


నూరేళ్ల ప్రాయం ఒక్క క్షణం లో మాయం!!

ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని క్షణాన...

ప్రతీ క్షణం నీటి బుడగలో రంగుల రాట్నం!

నీరు విషం! గాలి విషం!

మనం తినే తిండి విషం!!

ఆఖరికి మనం ఉంచే ఎంగిలే కాలకూట విషం!!

ఏమౌతుందో తెలిసే లోపే ఎంతో జరిగే వింత కాలం!

అకాలం.. సకాలం.. కలకాలం... సకలం నిమిషంలో కకావికలం!

ఈ క్షణం..ఈ నిమిషం..ఈ ప్రదేశం.. నీ హృదయం.. పొందే అనుభూతే క్షణమనే అక్షణం లో 

అక్షయం..శాశ్వతం!!

ఈ జీవితం బుద్బుధ ప్రాయం!



నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...