Wednesday, May 20, 2020

గురు చరిత్ర అధ్యాయము -30


*** ఆదివారం పారాయణ ప్రారంభం ***

అధ్యాయము  -30




                                

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                               
శ్రీ గురుభ్యోనమః 




కథారంభము 


                                నామధారకుడు, "స్వామీ ! నాకెన్నో శ్రీగురుని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు. ఇట్టి మీ ఋణం ఎన్నటికైనా తీర్చుకోగలనా? అటు తరువాత ఏమి జరిగిందో సెలవియ్యండి" అని ప్రార్థించాడు. అంతట సిద్ధమునీంద్రుడు ఇలా చెప్పసాగారు :                            


                             "నామధారక ! శ్రీగురులీలలన్నీ  చెప్పడం ఎవరి తరమూకాదు. నాకు చేతనైనంత వరకూ చెబుతాను, విను. శ్రీగురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి  త్రిమూర్త్యవాతారమన్న  కీర్తి నలుదిక్కులా వ్యాపించింది, భక్తులు ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చి, వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని,  సంతానము లేనివారు సంతానము,  రోగులు ఆరోగ్యము పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకరి వృత్తాంతము చెబుతాను విను.      


                    మహురపురంలో గోడేనాథుడనే (ఉరఫ్ గోపీనాథుడు ) సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయస్వామిని నిష్ఠగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టుకున్నారు. అల్లారుముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి ఐదవ ఏటనే ఉపనయనం చేశారు. 12 వ సంవత్సరంలో రూపవతి, సుగుణాలరాశియైన సావిత్రి (ఉరఫ్ సుందరి )యనే కన్యతో వివాహం చేశారు. ఆ దంపతులు సుగుణాలలోనూ, సౌందర్యంలోనూ సమానులైన రతీ మన్మధులవలె సుఖిస్తూ, ధర్మతత్పరులై  పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఇలా ఉండగా విధివశాత్తు తత్వానికి 16వ సంవత్సరం లోనే తీవ్రంగా జబ్బుచేసి, ఎన్ని చికిత్సలు చేయించినా  తగ్గలేదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటినుండి ద్రవాహారమే తీసుకుంటున్నందువలన, నిత్యోపవాసిగా ఉండేవాడు. ఇలా మూడు సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవ్యాధిగా  పరిణమించింది. అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ, నిరంతరమూ అతని సేవలో గడిపేది. అతడు కృశించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమెకూడా అతనివలె అలంకారమే చేసికొనక, పాతచీర ధరించేది.జుట్టు దువ్వుకొనక పోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కిశల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్షదైవం అని నమ్మి సేవిస్తుండేది. తనకు గల సిరిసంపదలు వెచ్చించి, ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు, శాంతులు ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులు వచ్చి ఇచ్చిన మందులు ఎన్నో వాడింది. ఇలా మూడు సంవత్సరాలు గడిచాయి. కానీ దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగవకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు. అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకునేవారు: 'స్వామీ! దత్తాత్రేయా! నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనుకటి దుఃఖమంతా మరిచాము. ఇప్పుడితనిని కూడా నీవు మాకు దక్కించుకుంటే మేము ఏమి చూసుకొని బ్రతకాలి? 'వారలా  దుఃఖిస్తూ ఉంటే దత్తుడు వారిని ఊరడిస్తూ, 'మనకెంత ఋణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది గానీ, అంతకుమించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది? కనుక మీరు నాకోసం దుఃఖించవద్దు' అని చెబుతూ ఉండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొర్లుకొచ్చేది. అతడు గూడ దుఃఖిస్తూ తన తల్లితో,  'అమ్మా'  అంతా ఈశ్వరాధీనముగాని,  మన చేతిలో ఏమున్నది? నీవు నాకు ఒక్క గడియసేపు పాలిచ్చిన  ఋణమైన ఇంతవరకూ  తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చి పెట్టాను. మిమ్మల్ని కొంచమైనా సుఖపెట్టలేకపోయాను' అంటూ ఉండేవాడు.                                 


                    దత్తుడు తన భార్యతో, 'ప్రేయసీ, నాకింక కాలం తీరిపోతున్నది. నీవు నాకు చేసిన సేవకు, నా కోసం పడ్డ కష్టాలు కు అంతేలేదు. గతజన్మలో నీకు పరమశత్రువును కాబోలు, నిన్ను ఇలా బాధిస్తున్నాను! ఇకముందు కూడా నీకు అండలేదని భయంలేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురిలా చూసుకుంటారు. అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే  అదృష్టం నాకు  కించిత్తయినా లేదు. దౌర్భాగ్యుడనైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంటకలిసింది' అని బాధ పడుతుండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకుని ఏడుస్తూ, 'స్వామీ ! మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతి ఏమున్నది? భార్యకు భర్తయే దిక్కు గాని తల్లిదండ్రులుగారు. నేను మీ  శరీరంలో అర్ధభాగాన్ని సుమా! నా ప్రాణమైన మిమ్ములను వదలి పోతే నా శరీరంలో ప్రాణం ఉండదు. మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను' అంటూ ఉండేది. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి. సావిత్రి, 'అయ్యో! మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎట్టి  భయమూ లేదు. అందరమూ కలసి భగవంతుణ్ణి ప్రార్థిద్దాము' అని ధైర్యం చెబుతూ ఉండేది. ఆమె ఒకసారి, గాలిమార్పుకై అతనిని ఎక్కడికైనా తీసుకెళ్లాలని అనుకున్నది. అప్పుడొక గ్రామస్తుడు, మీరు దత్త భక్తులు కదా!దత్తావతారమైన శ్రీ గురుని వద్దకు వెళ్ళండి. అక్కడ ఎందరికో మంచి జరుగుతున్నది' అని చెప్పాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, 'గంధర్వపురంలో శ్రీనృసింహసరస్వతి అనే మహనీయులున్నారట. వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్లీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది. మీరనుజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడకు పోతాము. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను. మేమక్కడకు వెళ్ళడానికి అననుఙ్ఞ  ఇవ్వవలసినది' అని వారి కాళ్ళమీద పడి వేడుకున్నది. ఆ వృద్ధులు, తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకనుమతించి, తగిన ఏర్పాట్లు చేశారు. ఆమె తన అత్తమామలతో, ' మీరు ధైర్యంగా ఉండండి. ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు' అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకొని బయలుదేరింది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, 'అమ్మాయీ ! శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక! సౌభాగ్యవతీ భవ!' అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు.                                     


                                సావిత్రి తన భర్తకు శ్రమ కలుగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటుచేసి, బోయీలను మెల్లగా నడవమన్నది. ఈ విధంగా వారు మూడు రోజులు ప్రయాణంచేసి, గంధర్వనగరం సమీపించారు. సావిత్రి అక్కడక్కడా  పల్లకీ దింపి శ్రీగురుని గూర్చి విచారిస్తున్నది. అంతదూరం ప్రయాణం చేసి అలసినందువలన దత్తునికి రోగ బాధలు ఎంతో తీవ్రమయ్యాయి. అవసానదశ సమీపించిందా  అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతున్నాడు. ఎలాగో పల్లకిని గంధర్వపురం చేర్చి అక్కడ ఒకచోట దింపి, సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీ గురుడు ఎక్కడ ఉంటారని ఆ ఊరివారిని విచారించింది. వాళ్లు, స్వామి అనుష్టానానికి సంగమం వద్దకు వెళ్లారని  చెప్పారు. అతనిని అక్కడకు తీసుకు వెళ్దామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం! ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడచుకోపోతే,  అక్కడివారందరూ అడ్డు వచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ, 'అయ్యో స్వామీ ! నాకిదేమిగతి? ఓ శ్రీ గురుమూర్తీ ! మీరు ప్రాణ రక్షకులని తలచి గంపెడాశతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను. కానీ నా పని- దైవానుగ్రహం కోసం వెళ్లిన వాని మీద ఆలయం విరిగి పడ్డట్లు, నీడను చేరబోయిన వానిమీద ఆ చెట్టు విరిగి పడినట్లు, మంచినీటికని పోయిన వాడు మొసలి నోట్లోపడ్డట్లు, నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడకు వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను. నాగతి పులి బారి నుండి తప్పించుకున్న గోవు, గోమాంసం తినే యవనుడి  పాలిట పడినట్లయింది. నాకు తెలియకనే నేను నాభర్తను చంపినదానినయ్యాను. వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరంచేసి, దేశంకాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను'. అని హృదయవిదారకంగా ఏడుస్తున్నది. అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు, 'అమ్మాయీ ! నీవిలా ఏడ్చినందువలన లాభమేమి? విధిలిఖితం విష్ణువునయినా విడిచి పెడుతుందా? ' అని తెలియజెప్పాలని చూచారు. కానీ వయసులో చిన్నదైన ఆమెకు అతని సహచర్యంలోని మధురమైన స్మృతులు  గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలచివేస్తున్నాయి. ఆమె దీనాతిదీనంగా వారందరితో, 'అయ్యలారా! ఇప్పుడు నేనెక్కడ, ఎవరి అండన ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది? నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూలేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతం, వివాహమయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్యవ్రతము అన్నీ ఎంతో శ్రద్దగా చేసాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగల్య రక్షణకొసం నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితం చివరకు నాకీ పసుపుతాడైనా దక్కకపోవడమేనా?' అని దుఃఖిస్తూ ఆ శవంమీద పడి,  'స్వామీ! నన్ను విడిచి ఎక్కడకు  పోయారు?  మీరు లేకుండా నేనెలా బ్రతకగలను? అయ్యో! ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు. వారి బిడ్డను  ఎలాగైనా బ్రతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడకు తీసుకు వచ్చాను. నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురి ప్రాణాలను తీసిన దోషినయ్యాను. నేను ఇప్పుడు వారికి ముఖం ఎలా చూపేది?  నేనూ  మీతోనే వస్తాను' అంటూ హృదయవిదారకంగా శోకిస్తున్నది.                               


                            ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు,  చేతిలో శూలము, శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకము ఉపదేశించాడు: 'పిచ్చిదానా! నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం?నొసటి వ్రాత  మారదు గదా? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు? అయినా, ఇతడు ఎక్కడికి పోయాడనుకుంటున్నావు? ఆలోచించు-                           


                                  అసలు నీవెవరు? ఎక్కడినుండి వచ్చావో  చెప్పు. ప్రవాహంలో ఎక్కడనుండో వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే  అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు, జీవులు మళ్లీ ఎక్కడ నుండి వచ్చినవి అక్కడకు చేరుతాయి. నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ  శరీరాలు వచ్చి,  కొంతసేపుండి మరల మరలా నశించిపోయేవే కదా! పుట్టేవాడు, చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు? అతడెవడు? మాయావశులై, అలాంటి జీవులను "నావి, నావాళ్లు" అనుకోవడం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండ యీ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు. జీవుడు కర్మవలన శరీరం ధరిస్తాడు. కర్మ, త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఃఖాలు కలిగిస్తుంది. గుణాలన్నవి మాయవలన ఉన్నట్లు కనిపిస్తాయే కాని, నిజానికి లేనేలేవు. త్రిగుణాత్మకమైనది మాయేగాని, ఆత్మ కాదు. పుట్టుక, చావు మొదలైన వికారాలే  లేని ఆత్మకు త్రిగుణాలతో యెట్టి సంబంధమూలేదు. ఆ జీవుడు అవిద్యవలన కర్మబంధంలో చిక్కి, యీ సంసారంలోబడి ఈదులాడుతున్నంతవరకే సుఖదుఃఖాలు అనుభవిస్తాడు. మృత్యువంటావా- సుదీర్ఘమైన ఆయువుగల దేవతలు గూడ కల్పాంతంలో నశించవలసిందే! ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలంవలన పుట్టి, దాని కధీనమైవున్న యీ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం? ఇలా కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడియున్న యీ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషంకానీ, మరణించినందుకు దుఃఖముగాని పొందదగినదేమీలేదు. గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యెవరకు వెనుక చేసుకున్న కర్మననుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీతప్పదు. ఆమధ్యకాలంలో ఎవరైనా వారి విధి వ్రాతలననుసరించి ఎక్కడ ఏసమయంలో ఎలాంటి సుఖదుఃఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందేగాని, వాటిని నివారించడం ఎవరితరం? ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపజేసుకోవచ్చు. కానీ కాలగతిని నియమించడం ఎవరితరముగాదు. ఇప్పటి మీ సంభందమే నిజమైతే, గత జన్మలో నీకెవరితో యెట్టి సంభంధమున్నదో చెప్పగలవా?  లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా?  ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు? రక్తము, మాంసము, శ్లేష్మము మొదలైన ధాతువులతో చేయబడిన యీ పాంచభౌతిక శరీరం "నేను, నాది " అనుకోవడం సరియేనా? ఇంతకూ  నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మకోసమేగదా? ఇకనైనా యీ శోకాన్ని నిగ్రహించుకొని, యీ జన్మచక్రం నుండి బయటబడే మార్గం ఆలోచించుకో!' అన్నాడు.                                           


                        ఆ బోధవిని సావిత్రి కొంచం తమాయించుకొని, ఆ ముని పాదాలకు నమస్కరించి 'స్వామీ, నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పినట్లే చేస్తాను. దయాసాగరా!  నాకు నీవే తల్లివి, తండ్రివి. నేనీ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి ' అని వేడుకున్నది".


ముఫైయవ అధ్యాయం సమాప్తము 


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...