అధ్యాయము -27
శ్రీ గణేశాయనమః
శ్రీ సరస్వత్యేనమః శ్రీ గురుభ్యోనమః
కథారంభము
నామధారకుడు పట్టరాని ఆసక్తితో, "అటు తర్వాత ఏమి జరిగింది స్వామీ? "అన్నాడు. సిద్ధుడిలా చెప్పారు :"శ్రీగురుడు ఎంతచెప్పినా వారు వినలేదు. అపుడు శ్రీ గురుడు వారితో, 'అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము' అని, అటు ప్రక్కగా పోతున్న ఒకనిని పిలిచి, 'నీవెవరు? నీ కులమేది? నీ దేవూరు? ఎక్కడికి పోతున్నావు?' అని అడిగారు. అతడు, 'అయ్యా, నేను కడజాతివాణ్ణి. నన్ను మాతంగుడంటారు. నేను ఈ ఊరిబయట ఉంటాను. ఈనాటికి నాపై మీకు దయకలిగింది' అని నమస్కరించాడు. అప్పుడు శ్రీ గురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి, శిష్యునికి తమ దండంఇచ్చి, దానితో నేల మీద ఏడు గీతలు గీయించారు. అప్పుడా చండాలుని మీద విభూతి చల్లి, వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. అతడు మొదటి గీత దాటగానే ఆయన, 'నీవెవరు?' అని అడిగారు. 'నేను వనరక్షకుడైన భిల్లుడను 'అన్నాడతడు. అతడు రెండవ గీత దాటి, ' నేను రావణుడు అనే కిరాతకుణ్ణి' అన్నాడు. మూడవ గీత దాటి, ' నేను గాంగేయుడనే జాలరిని' అని, నాల్గవగీత దాటి, 'శూద్రుడనైన రైతును' అని, అయిదవ గీతను దాటి, ' నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి' అని, ఆరవగీత దాటి, ' గోవర్ధనవర్మయనే క్షత్రియుణ్ణి' అని, ఏడవ గీత దాటి, నేను వేద విదుడను, అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను ' అని వెనుకటి జన్మలో తానెవరో చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు, 'నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు' అన్నారు. అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు.
అది చూచి ఆ కుపండితులకు భయంతో నోరెండింది; కడుపులో నొప్పి ఆరంభమైంది. అప్పుడు వారు స్వామి పాదాలపైబడి, 'స్వామీ! సాక్షాత్తూ పరమేశ్వరులైన మిమ్ము దిక్కరించాము. బ్రాహ్మణులను దూషించాము. మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి, మ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి, అతని సత్కారానికై ఆశపడ్డాము. మీరు సర్వ సమర్థులు. మీ మహిమను తెలుసుకోవడం మా తరం కాదు. మమ్మల్ని ఉద్ధరించండి!' అని వేడుకున్నారు. అప్పుడు స్వామి, 'మీరు బ్రాహ్మణ దూషణ, ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు గనుక, ముందు జన్మలో బ్రహ్మరాక్షసులు అవుతారు. చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా?' అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపైబడి, తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు స్వామి, 'విప్రులారా! మీకు పశ్చాత్తాపం కలిగింది గనుక మీ పాపంలో కొంత భాగం నశించింది. ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక, ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వము తొలగి, ద్విజులై సద్గతి పొందుతారు' అన్నారు. వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికీ గుండెనొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి, రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు. తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని, ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు.
ఏడు జన్మల క్రిందట తాను వేదవిదుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, 'సద్గురోత్తమా! మీరు జ్ఞాన జ్యోతి స్వరూపులు. పూర్వజన్మలో వేదవిదుడనైన నేను ఈ జన్మలో కడజాతివాణ్ణి ఎలా అయ్యాను? త్రికాలజ్ఞులైన మీరు నాకీ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది' అని వేడుకున్నాడు.
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box