Wednesday, May 20, 2020

గురు చరిత్ర అధ్యాయము -31


అధ్యాయము  -31




                                

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః 
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 



                             ఆ తర్వాత సిద్ధయోగి నామధారకునితో ఇలా చెప్పారు: " ఆ యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెప్పాడు: 'సాద్వీ, స్త్రీలు ఆచరించవలసిన ధర్మము చెబుతాను విను. పూర్వం కాశీలో అగస్త్యమహర్షి, ఆయన భార్య  లోపాముద్ర నివసిస్తూ ఉండేవారు. ఆ మహర్షి తపస్సుకు, ఆమె పాతివ్రత్యానికీ  మెచ్చి వింద్యాచలుడు వారికి గొడుగు వలె నిలిచి ఉండేవాడు. ఒకనాడు త్రిలోక సంచారియైన నారదుడు వింద్యునితో, "ఓ పర్వతరాజా! నీకు సాటి అయిన పర్వతమింకొకటి లేదు. అయితేనేమి, నీవు మేరువుతో మాత్రం సమానం కాలేదు" అన్నాడు. అప్పుడు రోషంతో  వింద్యాచలుడు మేరుపర్వతాన్ని మించిపోవాలని పెరగసాగాడు. అందువలన ఆ పర్వతానికి దక్షిణంగా ఉన్న ప్రాంతమంతా చీకటిమయం అయింది. సూర్య దర్శనం అవనందువలన ఆ ప్రాంతంలోని ప్రజల నిత్యకర్మాచరణ తారుమారైంది. అప్పుడు ఋషులా విషయమై మొరపెట్టుకోగా, అతడు బ్రహ్మకు ఆ విషయం విన్నవించాడు. బ్రహ్మదేవుడు,  'కాశీలో అగస్త్యుడను బ్రహ్మవేత్త అయిన సద్గురువును ప్రార్థించి, వారు దక్షిణదేశానికి వెళ్లేలా చేయి' అని ఉపాయం చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు దేవతలందరితో కలిసి ఆ ఋషి  దంపతులను దర్శించి పూజించాడు. అప్పుడు మహాపతివ్రత అయిన లోపాముద్రను కీర్తిస్తూ, ఆమె మహిమకు కారణమైన పతివ్రతా ధర్మాలను దేవగురువైన బృహస్పతి ఇలా చెప్పాడు:                        


                               స్త్రీలు ఎప్పుడూ  తమ పతిని  శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానమూ చేయకూడదు. సాధ్యమైనంతవరకూ పొరుగిళ్లకు పోకుండా, తప్పనిసరి అయినప్పుడు తలవంచుకొని వెళ్లాలి. దుశ్శిలురైన స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకని, యాత్రలకనీ ఒంటరిగా వెళ్లకూడదు. భర్త ఇంట్లో లేనప్పుడు స్త్రీ అలంకరించుకోకూడదు. గ్రామాంతరం వెళ్లిన భర్త తిరిగిరాగానే సంతోషంతో ఎదురేగి భక్తితో కాళ్లుకడిగి, తుడిచి, విసనకర్రతో వీచి సేద తీర్చాలి. తర్వాత ఆయనకు అలసట తీరేవరకు కాళ్ళుపిసికి, తర్వాత స్నానం చేయించి, ఆయన పాదతీర్థం తీసుకుని నమస్కరించాలి. అటు తర్వాత అతని చిత్తముననుసరించి ఆరోగ్యానికి హితకరమైన భోజనం పెట్టి, అతని ఉచ్చిష్టాన్నే ప్రసాదంగా భుజించాలి. అటు తర్వాతనే తాను అలంకరించుకొని ఆయనను సంతోషపెట్టాలి. భర్తను నిద్రపుచ్చిన తర్వాతనే ఆమె నిద్రపోవాలి. మరలా అతనికంటే ముందు నిద్ర మేల్కొని ఇంటి పనులు చేసుకొని, అతడు మేల్కొనగానే అవసరమైన సేవలు చేయాలి. భర్తకు కావలసిన పూజా ద్రవ్యాలు తానే స్వయంగా సమకూర్చాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. భర్త సంతోషంగా ఉన్నప్పుడు తాను విచారంగానూ, భర్త విచారంతో ఉన్నప్పుడు తాను సంతోషంగానూ, ఉండకూడదు. భర్త కోపించినప్పుడు క్షమించమని ప్రార్థించాలి. భర్తతో తగువులాడకూడదు.అతడు కోపంతో అన్న మాటలను మనసులో వుంచుకోకూడదు. భర్త ఆజ్ఞననుసరించే భార్య నడుచుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిదే వ్రతాలు, ఉపవాసాలు చేయకూడదు. భర్త యొక్క ఆయుష్యాభివృద్ధికిగాను పసుపు,  కుంకుమ,  మంగళసూత్రము మొదలైనవి భక్తితో ధరించాలి. భర్తకు ఇష్టమైన ఆభరణాలు,  వస్త్రాలు మాత్రమే ధరించాలి. అత్తమామలను,  బావమరుదులను,  ఆడబిడ్డలను విడచి వేరుగా ఉండాలని కోరుకోకూడదు. భర్తకు లభించిన దానితోనే సంతృప్తి చెందాలి. ఇరుగుపొరుగు శ్రీమంతులను  చూచి, భర్త అసమర్థుడని నిందించకూడదు. యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలనుకోకూడదు. పతి సేవయే యాత్రగా, పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి. భర్త లోభియైనా, రోగియైన, వికలాంగుడైనా అతనినే పరమేశ్వరుడుగా భావించి అతనినే పూజించాలి. అట్టి పతివ్రతను చూచి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు.                           


                         ఇలాచేయక యదేచ్ఛగా సంచరిస్తే, ఆమె పుణ్యమంతా నశించి నరకానికి పోతుంది. మరొక పతివ్రత పాదధూళితో గాని అట్టివారి పాపం నశించదు. పతివ్రతల పాద ధూళిని స్పర్శించి దేవతలు కూడా ధన్యత పొందుతారు. అలా కాకుంటే, రూపసులైన స్త్రీలు సృష్టిలో ఎందరు లేరు? అయినా పతివ్రత వల్లనే వంశమంతా ఉద్ధరించిబడుతుంది. ఏడు జన్మల పుణ్యంవల్ల గాని అట్టి ఇల్లాలు లభించదు. ఆమెను వివాహమాడిన భాగ్యశాలికి అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. అటువంటి భార్య లేకుండా యజ్ఞము మొదలైన ధర్మాలన్నీ సఫలం కాజాలవు. ఆమె నివసించిన ఇల్లే ఇల్లు. ఆమె లేని భవనమైన అడవితో సమానమే. ఆమె వల్లనే సత్సంతానము, ఊర్ధ్వలోకాలు లభిస్తాయి. ఆమెను చూడగానే భూమి తన సహజమైన కాఠిన్యం విడచి అడుగులకు మడుగులొత్తుతుంది. ఆమె సాహచర్యం వలన ఏడు జన్మల పాపం కూడా నశిస్తుంది. గంగా స్నానం వల్ల వచ్చే పుణ్యం కూడా పతివ్రతను దర్శించడంవల్ల కలుగుతుంది".      


ముప్పై ఒకటవ అధ్యాయం సమాప్తము   


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...