Tuesday, May 19, 2020

గురు చరిత్ర అధ్యాయము -29


అధ్యాయము  -29




                                

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః

శ్రీ గురుభ్యోనమః 


కథారంభము








                           నామధారకుడు సంతోషించి "శ్రీగురుడు స్వయంగా భస్మమహాత్యాన్ని యేమి వివరించారో సెలవీయండి" అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి యిలా చెప్పారు: "త్రివిక్రమభారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి యిలా వివరించారు: 'పూర్వం కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతుండేవాడు. ఆ ముని జడలు, నారబట్టలు ధరించి, వంటినిండా విభూతి పూసుకుని అక్కడక్కడా సంచరించి, చివరకు నిర్మానుష్యముగా వున్న క్రౌంచారణ్యములో నివసించసాగాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కన్పించిన ప్రాణినల్లా చంపి తింటుండేవాడు. వాడు ఈ మునిని చూచి, ఆయనను మ్రింగదలచి, ఆయనమీదకొచ్చాడు. ఆయన ముని నిర్లిప్తుడుగా చూస్తుండిపోయాడు. అతడు చంపడానికై ఆయనను త్రాకగానే, ఆయన శరీరం మీది భస్మం  అతనికి అంటుకున్నది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమోగాని, సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం. అన్ని ఘోరపాపాలు చేసిన ఆ రాక్షసునికి గూడా ఆ ముని యొక్క స్పర్శ  తగలగానే అతడి హృదయం  శాంతించి, విశేషమైన జ్ఞానము ఉదయించింది. అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపైబడి,  "గురూత్తమా! నీవు సాక్షాత్తూ  భగవంతుడవు.  మీ కటాక్షము వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి. నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి. నన్ను రక్షించు!" అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవమహర్షి "నీవెవడవు?  నీవి అడవిలో ఎందుకు ఉన్నావు?"అని అడిగారు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు:                             


                             "స్వామి! మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అను పేరుగల యవనరాజును. అప్పుడు నేనెన్నో  పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను. మదోన్మత్తుడనై పరస్త్రీలనెందరినో  చేజిక్కించుకుని, మరెందరినో బలాత్కారం చేశాను. తర్వాత వారి ముఖమైనా  చూసేవాడిని కాదు. వారి గతేమీ  పట్టించుకునేవాన్నికాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు. అయినా నేను లెక్క చేయక తప్ప తాగి, ఇంకెందరినో భ్రష్టులను చేశాను. చివరకు నాకు క్షయ రోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి, నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. తర్వాత పదివేల సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి. తర్వాత వంద సంవత్సరాలు పిశాచమై సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండచిలువ, తోడేలు,  ఊరపంది,  కుక్క,  నక్క, జింక,  కుందేలు, కోతి,  గ్రద్ద, కప్ప,  కాకి,  ఎలుగుబంటు,  అడవి కోడి,  గ్రుడ్డిగాడిద,  పిల్లి, కప్ప,  తాబేలు, కాకి, చేప,  పందికొక్కు,  గుడ్లగూబ,  ఏనుగు, పిల్లి అనే 24 జన్మలెత్తి, 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడనయ్యాను. ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్ముమ్రింగాలన్న  గర్భాత్రంలో  మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకీజ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్ని ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు. నాకేనాటి పుణ్యమో కించిత్తుండడం వలన మీరు నాకు లభించారు. స్ప్రుశించినంతమాత్రానే  నాకు ఇంత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే! కానీ నావంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం యెలా  కలిగిందో తెలుపండి" అని ప్రార్థించాడు.                   


                  అప్పుడు వామదేవుడు, "ఇది నా మహిమ కాదు,  నా వంటిపైనున్న  భస్మం యొక్క మహిమే! దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడేలేడు. సాక్షాత్తూ  పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా?  అందుకొక నిదర్శనం చెబుతాను. పూర్వము కర్మభ్రష్టుడు,  దురాచారుడు  అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడొక శూద్రస్త్రీని చేరదీసినందుకు ఊరంతా  అతనిని వెలివేశారు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు. క్రమంగా అతనికి త్రాగుడు అలవాటై.అందుకు డబ్బులేక దొంగతనం చేస్తూ ఉండేవాడు. ఒకనాడతడు తప్పతాగి ఆ శూద్రస్త్రీ వద్దకెళ్లగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతనిని చితకబాది ఊరిబయట ఒక గోతిలో పారవేశాడు. అతడు కొనఊపిరితో పడిఉండగా చూచి, శివమనుకుని పక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పీక్కు తింటానికి వచ్చి అతనిని నఖశిఖ పర్యంతమూ వాసన చూసింది. అప్పుడు దాని వంటిమీదనున్న బూడిద కొంచెం అతడి తలపైన పడింది. కొద్దిసేపట్లో అతనికి అవసానదశరాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చారోగాని శివ దూతలు వచ్చి వాళ్ళని తరిమివేశారు. అప్పుడు యమధర్మరాజు అక్కడకు వచ్చి వారిని కారణమడిగాడు. అప్పుడా శివకింకరులు  ఆ శవం పైనున్న విభూతి చూపి,  'విభూతి పూసుకొన్న  వారందరినీ కైలాసానికి తీసుకొనిరమ్మని మా పరమశివుడు ఆదేశించాడు. బస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి' అని చెప్పారు.        


                    కనుకనే ఓ రాక్షసుడా! నేను భక్తితో విభూతి ధరిస్తాను" అని వామదేవుడు చెప్పాడు.అప్పుడా  రాక్షసుడు,  "స్వామీ! సాక్షాత్తూ మీరు  ఆ పరమేశ్వరులే.  నా పూర్వ పుణ్యలేశం వలన మీ దర్శనము, ఈ జ్ఞానము లభించాయి. ఇకనైనా నన్ను ఉద్ధరించు. అంతటి మహత్యం గల ఆ భస్మాన్ని ఏవిధంగా భరించాలో వివరించు" అని వేడుకున్నాడు.


                వామదేవుడు ఇలా చెప్పాడు:" ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు. అచ్చటికి ఇంద్రాది దేవతలు,  గంధర్వులు,  యక్షులు, కింపురుషులు,  సిద్ధులు,  సాధ్యులు,  వశిష్ట,  నారదాది ఋషులు,  బృహస్పతి మొదలైన వారందరూ చేరారు. అప్పుడు వారిమధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు. కర్పూరకాంతి గల దేహంతో జడలు,  నాగాభరణాలు,  చంద్రవంక,  సకల ఆయుధాలు ధరించిన ఆయన,  ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అప్పుడా సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి,  'స్వామీ! లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తిని ఇవ్వగల ఉపాయమేదైనా చెప్పవలసింది' అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమ శివుడు ఇలా బోధించాడు: 'సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలది - భస్మంతో త్రిపుండ్రాలు ధరించడం. భస్మం కోసమని సంకల్పించి గోమయం (ఆవుపేడ ) సేకరించి, దానితో హోమం చేయాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని ' సద్యోజాతం' అనే మంత్రంతో చేతిలోకితీసుకుని,  ' 'అగ్నిరిత్యా' అనే మంత్రంతో అభిమంత్రించి, 'మానసోక్త' అనే మంత్రం చదువుతూ, దానిని బొటనవేలితో నలిపి, 'త్రయంబకం' అని చెబుతూ శిరస్సున ధరించాలి. తర్వాత 'త్రయాయుషం జమదగ్నే ' అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి. ఆ మూడింటిలో ఏ రేఖాగూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు. ఆ రేఖలో మొదటిది, చివరిది, మద్యమ,  అనామిక అనే వేళ్ళతో అద్దుకున్నాక, అప్పుడు బొటన వ్రేలితో కుడివైపునుండి ఎడమ ప్రక్కకు మధ్యరేఖ దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు అకారము వర్ణము, గార్హపత్యాగ్ని, భూతత్త్వం, రజోగుణం, ఋగ్వేదం, క్రియాశక్తి, ప్రాతః సదనము, బ్రహ్మదేవత. రెండవరేఖకు ఉకారము వర్ణము; దక్షిణాగ్ని, ఆకాశ తత్వం, యజుర్వేదం, మాధ్యందిన సవనములకు సంకేతము, ఇచ్ఛాశక్తి. విష్ణు దేవతకు చిహ్నం. మూడవ రేఖకు మకారము, ఆహవనీయాగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి. తృతీయ సవనము, శివునికి సంకేతము. ఇలా భావించి త్రిపుండ్రము ధరించాలి. ఈరీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది. మిగిలినవారికి వారు కోరిన పురుషార్ధాలు లభిస్తాయి. కనుక నాలుగు  ఆశ్రమాలకు చెందినవారూ భస్మం ధరించాలి. దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియక పోయినా, సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపైనున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంత పుణ్యం, మంత్రాలన్నీ అనుష్టానం చేసిన ఫలితము లభించడమే గాక, ఇతరులకు కూడా ఉత్తమగతి లభిస్తుంది. వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి' అని శివుడు చెప్పాడు.         


                          కనుక,  'ఓ రాక్షసుడా! ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది' అని చెప్పి, కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై  మహర్షికి ప్రదక్షిణము,  నమస్కారము చేసి స్వర్గానికి వెళ్లిపోయాడు. వామదేవుడు త్రిమూర్తి అవతారము; జీవులనుద్దరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు. ఈ భస్మ మహిమ గురించి శౌనకాది ఋషులకు సూతమహాముని కూడా చెప్పాడు.                         


                శ్రీ గురుడు వివరించి చెప్పిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమభారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.


 ఇరవై తొమ్మిదవ అధ్యాయం సమాప్తము 


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


*** శనివారము  పారాయణ సమాప్తము ***

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...