అధ్యాయము -28
శ్రీ గణేశాయనమః
శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః
కథారంభము
అటుపై జరిగిన వృత్తాంతం సిద్ధయోగి ఇలా చెప్పారు : " శ్రీ గురుడు ఆ చండాలునితో, ' నాయనా! ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాము విను: ఆచారం పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను, కులస్త్రీని, కులదేవతలను, సత్యమును, అహింసను విడిచినవారు, కన్యాశుల్కం తీసుకునేవారు. అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను- బిడ్డలను; ఆవులను- దూడలనూ విడదీసినవారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించనివారు, సద్బ్రాహ్మణులను దూషించి, అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించినవారు, తమ గురువులను, యజమానులనూ ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసినవారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రాద్దాదికర్మలు చేయనివారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేదమార్గం విడిచి మంత్ర ప్రయోగం చేసేవారు, గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు, గురునిందవిని సంతోషించేవారు, శివ-కేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడచి పరధర్మం చేపట్టేవారు, అర్హతలేని వారి నుండి మంత్రోపదేశం పొందినవారు- వీరికి చండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలనూ బయట పెట్టి చాటినవారికి జన్మాతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలవుతుంది. లేకుంటే, ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు. ధర్మ శాస్త్రము, పురాణము వినని వారికి గుడ్డితనం, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను, బ్రహ్మహత్య వలన క్షయ రోగము, ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్టురోగము, నమ్మకద్రోహం వలన అన్న ద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనసులను విరచి, వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది.
పుణ్యకర్మలను నిరసించేవారు; వారి మాటలు నమ్మినవారు; ప్రజాహితకరములయిన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలనూ ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలైన వ్రతాలలో పగలు భుజించేవారు, దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మముననుష్టించేవారు, తమ పుణ్యాలు, ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు, దాంభికుడు, దుస్సంగుడు, యంత్రమంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతాపం కలిగించేవారు- మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి, తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు.
నామధారకుడు, "స్వామీ, నాకొక సందేహమున్నది. కానీ కథకంతరాయమని అడగడానికి సందేహిస్తున్నాను."అన్నాడు. సిద్ధుడు, " నీవు అడగడం వలన కలిగే అంతరాయంకంటే , మనసులోని సందేహం వలన నీ శ్రద్ధ చలించే ప్రమాదమే ఎక్కువ. కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టం" అన్నారు. అప్పుడు నామధారకుడు, "స్వామీ, మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక, మరుజన్మలో చండాలయోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా?" అన్నాడు. అందుకు సిద్ధుడు ఇలా వివరించాడు : "భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్ట సుఖాలను మాత్రమే అందించగలదు. అందుకే దానిని 'మరణావధి శరీరము', లేక 'పతనావధి శరీరము' అంటారు. దీనితో అనుభవించ వీలులేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంతో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు".
నామధారకుడు, "ఏ పాపాల వలన ఏ జన్మలొస్తాయో ఉదహరించండి" అంటే, సిద్దుడిలా చెప్పారు: "ఏమి చేస్తే చండాలజన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేగాక- క్రోధము, శూద్రస్త్రీల పట్ల కామాసక్తి, ఎద్దునెక్కుట, అల్లం, ఆకులు మొదలైన రస వస్తువులను, వేదాలనూ అమ్ముట, భగవదర్పితంగాని ఆవు పాలు త్రాగుట, నిషిద్దాన్నము, దుర్మార్గుల నుండి దానము స్వీకరించడం, ఇతరుల జీవనాధారమపహరించడం, సంధ్యాకాలంలో నిద్రించడము బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాలజన్మ కలిగిస్తాయి.
యమలోకంలో అనుభవించే శిక్షలు ఎనిమిది కోట్ల నలభై లక్షలు. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి, అడుగుపెట్ట వీలులేని భయంకర మార్గంలో తీసుకుపోతారు. వాడు ఆకలి దప్పుల వలన నడవలేక నడుస్తుంటే, యమభటులు వాణ్ణి భయపెడతారు. వాడు మూర్ఛబోతే, వాణ్ణి లేపి, చీమూ నెత్తురు ప్రవహించే వైతరణీ నదిలో ముంచుతూ లాక్కుపోతారు. ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక, వాడు భూమిపై జన్మిస్తాడు. లేక వాసనాబలం వలన భూతంగానో,ప్రేతంగానో ఉండి శిక్ష అనుభవిస్తాడు.
గురుద్రోహి, విప్రులను పరాభవించినవాడూ బ్రహ్మరాక్షసులవుతారు. హీనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడచి భుజిస్తే కోడిగాను, ద్రవ్యాపహారి ఒంటెగాను, ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను, తేనె దొంగిలిస్తే పక్షిగాను, మాంసమపహరిస్తే గ్రద్దగాను, అన్నమపహరిస్తే మిడతగాను, జలం అపహరిస్తే చాతకపక్షిగాను, ధాన్యమపహరిస్తే మిడతగాను, విషమపహరిస్తే తేలుగానూ జన్మిస్తారు. స్వర్ణాపహారీ క్రిమికీటకాదులుగానో, పక్షిగానో పుడతాడు. గడ్డి దొంగలిస్తే పశువుగాను, మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను, మిత్రద్రోహి గ్రద్దగానూ జన్మిస్తారు. బ్రహ్మహంతకుడు క్షయ రోగిగాను, గ్రంథచోరుడు గ్రుడ్డిగాను, గణార్థచోరుడు గండరోగిగానూ, పరద్రవ్యాపహారి సంతాన హీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగానూ అవుతారు. అసత్యమాడేవాడు, ఆహారం దొంగిలించేవాడు గుల్మరోగులవుతారు. నూనె అపహరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతకునికి వాంతులు, దైవధనం అపహరిస్తే పాండురోగమూ వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరస్త్రీ గమనం వలన నూరుజన్మలు కుక్కగా పుడతాడు. పరస్త్రీ భగదర్శనం వలన గ్రుడ్డితనము, బంధుభార్యాగమనం వలనగాడిద -పాము జన్మలు, పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి".
నామధారకుడు శ్రద్ధగా విని, "స్వామీ ! ఇదివరకు తెలిసో తెలియకో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయమే లేదా? " అన్నాడు. అందుకు సిద్ధుడు, "త్రివిక్రమ భారతికి గూడా ఈ సందేహమే కలిగింది. ఆయన అడిగితే శ్రీ గురుడు ఇలా చెప్పారు: 'నాయనా! నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తర్వాత, వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని, తప్పును సభలో ఒప్పుకొని, సభ విధించిన శిక్ష అనుభవించాలి. తగిన కృచ్ఛాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలనగాని, లేక గోవు యొక్క వెలనుదానం చేయడంవలన గాని పాపం పోతుంది. దశ స్నానాలు, రెండు వందల ప్రాణాయామాలు, సువర్ణదానాలు వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవవలన మాత్రం మహా పాపాలుకూడా మటుమాయమవుతాయి. అంతటి సాధనము ఇంకొకటి లేదు.
ప్రాజాపత్య కృచ్ఛమంటే - మొదటిమూడు పగళ్ళు, తర్వాత మూడు రాత్రులయందు మాత్రమే భుజించాలి. తర్వాత మూడు రోజులు అయాచితంగా వచ్చినదే భగవత్ప్రసాదంగా తింటూ ఉపవసించాలి. మరి మూడు రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. పదివేల గాయత్రీ జపము, అందులో పదవవంతు గాయత్రి హోమము చేసి, పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానంగాని, లేక గురిగింజ ఎత్తు బంగారం గాని దానమివ్వాలి.
శుక్లపాడ్యమినాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకూ రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణమినాడు పదిహేను ముద్దలు భుజించాక, మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి, అమావాస్యనాడు ఉపవసించాలి. ఇలా చంద్రకళననుసరించి భుజించడం చాంద్రాయణ వ్రతం.
అసలు పగలు 12, రాత్రి 15 ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. స్వల్పభోజనమో, లేక పాలు మాత్రమో మాసం సేవిస్తే పాప శుద్ధి కలుగుతుంది. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలగునవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగాస్నానము, రామేశ్వరంలో సముద్రస్నానము పుణ్యక్షేత్రంలో అనుష్ఠానమూ వలన గూడా పాపాలు నశిస్తాయి. లక్షగాయత్రీజపం వలన మద్యపాన దోషము, కోటి గాయత్రి వలన బ్రహ్మహత్యాపాపము, ఏడు లక్షల జపంవలన స్వర్ణం దొంగిలించిన పాపమూ పోతాయి. సర్వపాపనాశానికి పావమానసూక్తం 610, "ఇంద్రమిత్రము" అను రెండు సూత్రాలతోనూ, " కస్యసూన" మనే శునశ్శేఫసూక్తాలతోనూ, "శంనఇంద్రాగ్ని" అనే శాంతి సూక్తాలతోనూ "త్రిసుపర్ణం", "పౌరుషం","నాచికేతం", "ఆఘామర్షణం", అనే సూక్తాలతోనూ, ఒక ఆరునెలలు వేదపారాయణ చేస్తే మహా పాపాలు కూడా తొలగుతాయి. సర్వపాప శాంతికోసం దర్భసహితమైన తీర్ధాన్ని పంచగవ్యాన్నీ ( ఆవు యొక్క పంచితము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ) స్వీకరించాలి. భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే యిద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసంచేసినా కూడా ప్రాయశ్చిత్తమనుభవించాలి. నామధారకా! నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగానదిలో పెట్టినా, ముంతలోని కల్లు బయటకు, నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా యెక్కవు. అలాగే భగవంతునిపై భక్తిలేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాపవిముక్తి కలుగదు.
తర్వాత శ్రీగురుడు ఆ చండాలునితో " నీవు తల్లిదండ్రులను విడిచి పెట్టడం వలన, గురువులను దూషించి వారిని విడిచి వేరే వున్నందు వలన నీకీ చాండాలజన్మ లభించింది. నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తావు' అని చెప్పారు. అప్పుడా చండాలుడు, 'స్వామీ ! మీ కటాక్షం అనే గంగా ప్రవాహం వల్ల నేను పాపవిముక్తుడైయ్యాను. మానససరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు, పరశువేదిని త్రాకిన ఇనుము బంగారం అయినట్లు, మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి, నన్ను విప్రులలో చేర్చండి' అని వేడుకున్నాడు. శ్రీ గురుడు, 'పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్తమాంసాలు పంచుకుని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యము? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిననిపించుకోవాలని కొన్ని వందల కొద్దీ సంవత్సరాలు మహాతపస్సు చేసి, తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠమహర్షి వలన కావలసిందేగాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడతడు వశిష్ట మహర్షిని ఆశ్రయించగా, ఆయన అది సాధ్యపడదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్టుని నూరుగురు కొడుకులనూ చంపాడు. వశిష్టుడు అతనిని శిక్షించలేదు గాని, అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్దబండనెత్తి వశిష్ట మహర్షి పైన వేయాలి అనుకున్నాడు. కానీ తిరిగి ఆలోచించుకుని, "వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షి అని అంగీకరించగలవారెవరు? దేవర్షులందరూ ఆయనను అనుసరించే వారేకదా! ఈయనను చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్యాపాతకం గూడా చుట్టుకుంటుంది" అని తలచి, పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడా బ్రహ్మర్షి, " నాయనా, ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తపింపజేసికొని, కొత్త శరీరం చూపు" అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి, సూర్య కిరణాల వలన తన దేహం మాడిపోయి, కొత్త దేహం వచ్చేవరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడు అని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమీ చేయకుండానే నీకదెలా సాధ్యము? పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది, నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడవుతావు వెళ్ళు!' అన్నారు.
కానీ పేదవానికి పెన్నిది దొరికినా, మృత్యుముఖంలోకి ఉన్నవాడికి అమృతం దొరికినా, ఆకలిగొన్న పశువులకు గడ్డి దొరికినా వాటిని విడువలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక, మాలెపల్లెకు వెళ్ళకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్యబిడ్డలు వచ్చి, అతనిని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, ' నేనిప్పుడు సద్బ్రాహ్మణుడను. నన్ను తాక వద్దు, దూరంగా పోండి!' అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ' ఏమయ్యా! నీకేమన్నా పిచ్చి పట్టిందా?' అనగానే అతడామెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ, శ్రీ గురునికి నమస్కరించి, ' బాబూ! ఇతడు నాపై ఎప్పుడు ఎంతో ప్రీతిగా ఉండేవాడు. ఇతడికి మతి చలించింది. నన్ను ఇప్పుడు ఎక్కడకు వెళ్ళమంటాడో చెప్పమనండి, నేనింక ఈ బిడ్డలను ఎలా పోషించేది? స్వామీ ! మీరే ఈయనకు బుద్ధి మార్చాలి. లేకుంటే నేను ఇక్కడే ఉరి వేసుకుంటాను' అని గోల పెట్టింది. శ్రీ గురుడు నవ్వుతూ అతని కేసి చూస్తూ, ' నాయనా! ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళు. భార్య పిల్లలను ఏడిపిస్తే నీకింకా సద్గతి లభిస్తుందా? సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపరనుండి బయట పడగలవు. లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది. సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహా పాపం వస్తుంది' అన్నారు.
అతడు చేతులు కట్టుకుని, 'స్వామీ ! నేను సద్బ్రాహ్మణుడనన్న జ్ఞానం కలిగాక, అలా చేయడం నాకు ఎలా సాధ్యం? 'అన్నాడు. శ్రీ గురుడు నవ్వుకుని, 'ఈతని వంటిమీదున్న విభూతి తొలగిస్తేగాని ప్రయోజనం లేదు' అని తలచారు. ఆయన ఒక శిష్యుణ్ణి పిలిచి, ఒక శ్రీమంతుడూ, పిసినారి అయిన బ్రాహ్మణుని తీసుకు రమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్లి, ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు. అతడితో స్వామి, ' నాయనా! నీవితనికి స్నానం చేయించు, అప్పుడతనికి తిరిగి తన కుటుంబం పై మమకారం మేల్కొంటుంది' అని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మస్మృతి పొందిన ఆ చండాలుని తలపై కుమ్మరించాడు. అతని వంటిపైనున్న విభూతి కొట్టుకు పోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మరచిపోయి, భార్యాబిడ్డలతో, ' ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతి పోయినట్లు అయింది. ఇంతకూ మీరందరూ ఇక్కడకు ఎందుకు వచ్చారు? నేను ఒంటరి నన్న భయం మీకెందుకు? ఇది పగలేగదా!' అన్నాడు. వారు జరిగినదంతా చెప్పారు. అతడు వారితో కలసి ఇంటికి వెళ్లాడు. ఆ సన్నివేశం అంతా చూసినవారు ఆశ్చర్యపోయారు. అదంతా చూచి విస్తుబోయిన త్రివిక్రమభారతి, 'స్వామీ ! మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది?' అని అడిగాడు. శ్రీ గురుడు నవ్వి, అతడికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది. అది కడిగి వేయగానే తొలగిపోయింది. భస్మమహిమ అలాంటిది. కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు. దానికితోడు ఆ భస్మాన్నికి మహాత్ముల స్పర్శవుంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగలదు' అన్నారు. అప్పుడు త్రివిక్రమభారతి భస్మమహిమ గురించి వివరించవలసిందిగా శ్రీగురుని ప్రార్థించాడు.
ఇరవైఎనిమిదవ అధ్యాయం సమాప్తము
శ్రీ దత్తాయ గురవేనమః
శ్రీశ్రీ పాద శ్రీ వల్లభాయనమః - శ్రీ నృసింహ సరస్వత్యైనమః
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box