Wednesday, June 3, 2020

గురు చరిత్ర అధ్యాయము -43


అధ్యాయము  -43




                               
శ్రీ గణేశాయనమః                             

శ్రీ సరస్వత్యేనమః                                                                                                  

శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 


                           శ్రీ గురుడు సాయందేవునితో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగి ఇలా తెలిపారు: "ఈ  అనంతవ్రతము ఆచరించడంవలన ఎందరికో అభీష్టాలు సిద్దించాయి.  దీనివలన ధర్మరాజు,  తాను కోల్పోయిన రాజ్యమంతా  తిరిగి పొందగలిగాడు. పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి,  తన తమ్ములను,  ద్రౌపదినీ  తీసుకొని,  ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్లి,  ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతియని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైనవారు వాళ్ళ రాజ్యమపహరించి, పరాభవించి, అడవులకు పంపడమే కాకుండా వారిని యింకెన్నోరీతుల కష్టపెట్టారు. వారు కడుపునిండా భోజనమైనా లేక భాదపడుతుంటే,  వారిపుణ్యం కూడా నశింపజేయమని దూర్వాస  మహర్షిని పురిగొల్పి  వారిపైకి పంపారు. అప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారివద్దకు వెళ్ళాడు. పాండవులు అతనిని పూజించి,  'స్వామీ,  నీవు భూభారం  తొలగించడానికే అవతరించావు.  మేము మీకు ప్రాణసమానులమైనప్పటికీ ఈ అడవిలో దాగియుండవలసి వచ్చినదేమిటి? నీవే ఉపేక్షిస్తే,  మాకింక దిక్కెవరు?' అని బాధపడ్డారు. ద్రౌపదికూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది.శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు: 'నేనే అనంతుడను, సర్వవ్యాపిని,  త్రిమూర్తులు,  చతుర్దశ భువనాలు ఆకాశంవలె అనంతుడనైన నాయందు వున్నాయి.అట్టి  సర్వాంతర్యామిగ,  అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్టగా వ్రతం చేసుకుంటే మీ అభీష్టాలన్నీ నెరవేరుతాయి. మీ కష్టాలు తీరుతాయి.                                       

                    ఈ అనంత వ్రతం,  భాద్రపద శుద్ధ చతుర్దశినాడు మధ్యాహ్నం సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు. పూర్వం కృతయుగంలో వశిష్ట గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. సుశీల తండ్రివద్దనే  పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది. సుమంతుడు తన కర్మానుష్టానానికి భంగమురాకుండా ఉండేందుకు రెండవ వివాహము చేసుకున్నాడు. కాని, ఆమె గయ్యాళి.  ఎప్పుడూ  భర్తతోనూ,  సవతి కూతురుతోనూ పోట్లాడుతుండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన  కౌండిన్యునికి  ఇచ్చి వివాహం చేశాడు. కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వ లేక,  కౌండిన్యుడు వేరొకచోట కుటీరంలో కాపురం ఉండ తలచాడు. అయినా కూతురు కాపురానికి వెళ్లేరోజు కూడా దోవ బత్తేనికి కించిత్తు  పేలపిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్దీ గోధుమపిండి మాత్రం ఒక ఆకులోకట్టి  ఇచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నము ఒక ఏటివద్ద ఆగి, కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకొన్నాడు.  అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు  కట్టుకొని, కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా,  తాము  అనంత వ్రతము చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రతవిధానము ఇలా చెప్పింది:                            


                                'ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశినాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధము చేసుకొని,  ప్రవహించే నీటిలో స్నానం చేసి, ఎర్రని చీర కట్టుకొని,  ఆకులతో ఒక కలశం స్థాపించాలి. ఒక క్రొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మము గీచి,  దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతినుంచి,  శేషశాయియైన చతుర్భుజుని  ద్వాదశాక్షరీ మంత్రంతో గాని,  పురుషసూక్త విధానంతోగాని,  యథాశక్తి పూజించాలి. తర్వాత ఆ తోరము కుడిచేతికి కట్టుకొని, పాతతోరము విసర్జించాలి. తరువాత గోధుమపిండివంట నివేదించి,  దక్షిణతో సహా ఒకవేదవిప్రునికి దానమియ్యాలి. తరువాత యధాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు  దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఇలా చెప్పి,  ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత గూడా అనంతవ్రతం చేయించింది. తరువాత ఆమె తన భర్తతో కలసి బయలుదేరింది. ఆ వ్రతమహిమా  అన్నట్లు దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి,  వారినక్కడే ఉండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా  నివశించాడు.           


                       ఒకరోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి, 'ఇదేమిటి?  నన్ను వశం చేసుకోవడానికి ఈ ఎర్రని తోరం ధరించావా  ఏమి?  అని అడిగాడు. అది అనంత తోరమని, దాని మహిమ వల్లనే  తమకు సిరిసంపదలు వచ్చాయనీ  ఆమె చెప్పినా నమ్మక,  అతడు దానిని త్రెంచి నిప్పులో పడేసాడు. కొద్దికాలంలో వారింట దొంగలు పడి సర్వమూ  దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తనతప్పిదము  గుర్తించి,  ఎలాగైనా అనంతుని దర్శించి,  ఆయనను శరణు పొందనిదే భోజనమైనా చేయనని శపథము చేసి, "అనంతా! అనంతా!" అని  కేకలు వేస్తూ ఒక అడవిలో వెతకసాగాడు. దారిలో ఒక చోట పూత, కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమీ చిత్రమో గాని, దాని మీద ఒక్క పక్షైనా వాలలేదు. కౌండిన్యుడు, 'అనంతుడు ఎక్కడ?' అని అడుగగా,  ఆ చెట్టు, 'నాకే ఆయన దర్శనం లభించలేదు!' అని చెప్పి,  'నీకు కనిపిస్తే, నా  దుస్థితి గురించి ఆయనకు నివేదించు' అని చెప్పింది. ఆ ముని  మరోకచోట ఒక గడ్డి పరాకైనా కొరకని ఆవును,  దూడను చూచి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరోక చోట అటువంటి అంబోతే  కనిపించి అలానే చెప్పింది.ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి రెండు కొలనులు  కనిపించాయి. ఒక దానిలోని నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది. వాటి దగ్గర ఎక్కడా ఒక్క కొంగైనా వాలడంలేదు. అవి కూడా అనంతుని  గురించి అతనికి అలానే చెప్పాయి. తర్వాత ఒక  గాడిద, ఒక ఏనుగు  కనిపించి,అనంతుడు తమకేక్కడా కనిపించలేదన్నాయి.


                    చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒకచోట కూలబడ్డాడు. అప్పుడొక ముసలివాడు అతనిని చేయిపట్టి లేవదీసి, 'అనంతుని చూపిస్తాను రమ్మని ', ఒక అందమైన పట్టణంలోని రాజ భవనంలో సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహుని చూపించాడు. కౌండిన్యుడు, అతడే అనంతుడని తలచి అతనిని స్తుతించి, నమస్కరించాడు. అప్పుడు అనంతుడు అతనికి నాలుగు పురుషార్థాలు,  శాశ్వత వైకుంఠ నివాసమూ వరంగా ప్రసాదించాడు.                         


                       అప్పుడు కౌండిన్యుడు,  తాను అడవిలో చూసిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడిలా  చెప్పాడు: 'పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై  కూడా ఎవరికీ విద్య నేర్పకుండా,  తన కాలమంతా శాస్త్ర వాదాలతోనే గడిపాడు. అందుకతడు మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టై అడవిపాలయ్యాడు. చవిటినేలను దానమిచ్చిన వాడు మరుజన్మలో మేతమేయని పశువయ్యాడు. శ్రీమంతులై  గూడా కొంచమైనా దానము  చేయనివాడు నీవు చూచిన ఆబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కచెల్లెళ్లే  నీవు చూసిన ఆ రెండు చెరువులు. క్రోధము వహించినవాడు గాడిదగాను,  మదించి  విచ్చలవిడిగా ప్రవర్తించినవాడు ఏనుగుగానూ  జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడయ్యావు  గనుకే  ఆ వృద్ధుడి  రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను.  అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి  నీతో చెప్పుకొని నాకు తెల్పమని  నిన్ను కోరినాయి గనుకనే వాటన్నింటికీ ముక్తి కలిగింది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు' అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటినుంచి సుశీలాదేవి,  కౌండిన్యుడు సుఖంగా జీవించి  తర్వాత వైకుంఠానికి వెళ్లారు".            


                    శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని,  పాండవులు అనంతవ్రతం  ఆచరించి, అనంతుని కృపవలన యుద్ధంలో శత్రువులను ఓడించి,  మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు. నమ్మి  ఈ వ్రతం ఆచరించి సత్పలితము పొందనవారే లేరు. కనుక సాయందేవా! నీవుకూడా నీ గోత్ర ఋషియైన కౌండిన్యునివలె ఆ వ్రతం ఆచరించు. ముందు ముందు నాగనాథుడు,  అతని సంతతివారు నిష్టతో ఈ వ్రతం ఆచరించి,  శ్రీ గురుని పూజించి, అచ్చటి  బ్రాహ్మణులకు,  సన్యాసులకూ  సంతర్పణ చేశారు. తరువాత అతడు తన భార్యాబిడ్డలను ఇంటివద్ద దించివచ్చి,  తన జీవిత శేషమంతా గురు సేవలోనే గడిపి తరించాడు. అందువల్లనే నీకీనాడు కల్పవృక్షం వంటి 'శ్రీగురుచరిత్ర' లభించింది. అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో  ధన్యుడవు". 


నలభై మూడవ అధ్యాయం సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


**మంగళవారము పారాయణం సమాప్తము**

Tuesday, June 2, 2020

గురు చరిత్ర అధ్యాయము -42



అధ్యాయము  -42



శ్రీ గణేశాయనమః                             

శ్రీ సరస్వత్యేనమః                                                                                                  

శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 





                వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్ణకు అవధూత బోధించిన కాశీయాత్రా విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు: " విశ్వేశ్వరుని దర్శనము,  అంతర్ గృహ యాత్ర, దక్షిణ ఉత్తర మానస యాత్ర, పంచక్రోశయాత్ర,  స్నానము,  దానము,  అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ- విశ్వేశ్వర- బిందుమాధవ- డుండి  వినాయక- దండపాణి- కాలభైరవ- గుహ - గుహకాశీ- మణికర్ణిక- మొ || నవి దర్శించి,  పూజ చేసి,  నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ట చేసుకో. ఇలాచేస్తే నీగురు భక్తి దృఢమై,  ఈశ్వర సాక్షాత్కారమవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనస్సులో గురు చరణాలను స్థిరంగా నిలుపుకో',  అని చెప్పి,  రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ణ ఆశ్చర్యచకితుడై, 'ఆహా,  ఈ మహాత్ముడు నా గురు కృపవలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే,  సందేహము లేదు. తనను నేను ఆరాధించుకున్నా,  ఆయన ప్రసన్నుడవటము గురుకృప వల్లనే కదా! లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా ప్రసన్నుడు కానీ ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడౌతాడు?' అనుకుని యధావిధిగా కాశీ యాత్ర,  లింగ ప్రతిష్ఠ చేశాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగములో శంకరుడు  దర్శనమిచ్చి, వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు,  గురుభార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి,  'నాయనా, నీ గురు భక్తికి మెచ్చాను. నీవు 'విశ్వకర్మ' అనే సృష్టికర్తవు అవుతావు.' అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు.


                 త్వష్ణ సంతోషించి తన గురువు,  గురుపత్ని,  పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి,  అతనికి జ్ఞానము,  సర్వసిద్ధులు,  నవనిధులు,యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యము కానిది ఏదీలేదు. గురుభక్తునికి ముగ్గురు మూర్తులూ  వశులవుతారు. గురువు లేక మోక్షము సిద్ధించదు."              


                         శ్రీ గురుడు గురుసేవ ప్రాశస్త్యం  చెప్పడమయ్యేసరికి సూర్యోదయమైంది. సాయం దేవుడు,  శ్రీగురునికి నమస్కరించి ఆనంద పారవశ్యంతో, 'ఓ  కృపామూర్తీ! నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది. మీరి కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతోకలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. అది నిద్రావస్తొ, లేక  స్వప్నమో తెలియటం లేదు. జగద్గురూ! మీ నిజతత్వము తెలియని మూడులకు విశ్వేశ్వరలైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ' అంటూ ఉంటే అతని శరీరమంతా రోమాంచితమై కంఠం గద్గదమైంది. అతడిలా శ్రీగురుని స్తుతించాడు:       


                '(1). మొదట అద్వయులుగా ఉండి, సంకల్పమాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి,  మరలా దానిని పాలించడానికి అవతరించిన,  ఓ నృసింహ సరస్వతీ ! మీ పాద పద్మములకు వందనములు (2). కలి ప్రభావం వలన ధర్మం నశించి, యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనలననుసరించి,  భూమిపై అవతరించి,  ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతీ! మీ పాద పద్మములకు నమస్కారములు.(3). సంసార సాగరంలో మునిగిఉన్న భక్తులను తరింప చేయడానికి అవతరించి,  చతుర్దాశ్రమం  స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతీ ! మీ పాద పద్మములకు నమస్కారములు(4). స్వామీ,  మీ చరిత్ర చిత్రమైనది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గుడ్డివారికి దృష్టి, గొడ్రాలికి  సంతానము, ఎండు కట్టెకు  ప్రాణం, విధవరాలికి  సౌభాగ్యము,  భక్తులకు సిరిసంపదలు ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతీ ! మీ పాదపద్మములకు నమస్కారములు(5). పాపాన్ని,  దారిద్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ,  కామదేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ, ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకుకూడా అతీతమైన స్వరూపంగల ఓ నృసింహ సరస్వతీ! మీ పాద పద్మములకు నమస్కారములు. (6) ఓ గురుమూర్తి! మీ పాదపద్మములను నిత్యము స్మరించేవారికి సర్వతీర్థక్షేత్రాలను  సేవించిన ఫలితము,  వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేదాదియాగాలు చేసిన ఫలితము  ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతీ! మీ పాదపద్మములకు నమస్కారములు. (7). వేదాలకుకూడా మీ నామ మహత్యం అంతుపట్టనిది. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరల మరల నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతీ! మీ పాదపద్మములకు నమస్కారములు. శ్రీ సద్గురూ! నన్ను రక్షించు,  వేదాలకు గూడా అంతు పట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమీ వర్ణించగలను?  మీరు ఓంకార స్వరూపులు. పంచభూతాలు,  సూర్య చంద్రులు,  జీవాత్మ అనే ఎనిమిది రూపాలలో మీరు విశ్వరూపం ధరించారు.ఓ నృసింహ సరస్వతీ ! మీ పాద పద్మములకు నమస్కారములు. (8). ఈ కలియుగంలో భక్తులనుద్దరించడానికి దండకమండలుధారియైన యతీశ్వరుని రూపంలో అవతరించి,  భీమా - అమరజా సంగమంలో శ్రీ నృసింహ సరస్వతియను పేర నివసించిన శ్రీగురూ! మీ  పాదపద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపచేయడానికి, యోగులకు  దీక్షనను గ్రహించడానికీ  గానుగాపుర  క్షేత్రంలో వెలసి, నాలుగు పురుషార్థాలూ  ప్రసాదిస్తున్న ఓ  నృసింహ  సరస్వతీ ! మిమ్మల్ని స్తుతించడం  వలన నాలోని దోషాలన్నింటిని జయించి, మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. (9). శ్రీగురుస్తోత్రమైన  ఈ అష్టకాన్ని నిత్యమూ పఠించిన వారికి బలము,  సంపద, సద్బుద్ధి , వర్చస్సు,  పుత్ర పౌత్రాభివృద్ధి,  ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి  తోడు,  అటు తర్వాత ముక్తి  కూడా లభించగలదు' శ్రీగురుడు సంతోషించి,  'నాయనా! నీకు కాశీ దర్శనమైంది గదా! ఇందువలన నీ వంశంలో ఇరవై ఒక్క తరాలవారికి కాశీయాత్రాఫలం సిద్ధించింది. నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో ! కానీ అలా చేయాలంటే ఆ మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు. గనుక నీ భార్యాబిడ్డలను తీసుకొనివచ్చి గంధర్వనగరంలో ఉండు అని చెప్పి,  అతనిని వెంటబెట్టుకుని గ్రామంలోని తన మఠానికి తిరిగి వచ్చారు.    


                                                    సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్లి,  భార్యా బిడ్డలను తీసుకుని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు. అతడు శ్రీగురుని దర్శించి,  'త్రిమూర్తి! మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు,  మీ దర్శనమాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము  పాపాన్ని,  చంద్రుడు తాపాన్ని,  కల్పవృక్షము దైన్యాన్ని పోగొట్టగలదు.  కానీ పాప, తాప, దైన్యాలను మూడింటిని మీ  దర్శనమే పోగొట్టగలదు.  మీ కృప సర్వ పురుషార్థాలనూ  వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యము నాకిప్పుడు అనుభవమైంది' అని మైమరచి గంతులేస్తూ,  తన మాతృభాషయైన  కన్నడం లో ఇలా స్తుతించాడు:    


                                            '(1). భూమిపై భక్తుల పాలిటి భాగ్యనిధియై  అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను(2) భక్తితో ధ్యానించేవారికి సుఖమిచ్చే జగత్పతియైన మీ చరణ కమలాలు  దర్శించగలిగాను. (3). సంసారంలో తపిస్తున్న భక్తులకు అభీష్టాలిచ్చి, యోగులకు యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీనరసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు  కలిగింది. (4).మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్త్వమే సగుణమై సత్పురుషుల నుద్ధరించడానికి దండకమండలములు  ధరించి,యతి   సార్వభౌముడిగా అవతరించిన ఓ  నరసింహ సరస్వతీ! నేడు నాకు మీ దర్శనమైంది. (5). భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ  పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాసమైంది. అట్టి మీ పాదదర్శనం నేడు నాకు లభించింది.(6). యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రునివలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు  కలిగింది. మీ యతిరూపంలో భక్తజనుల మహాభాగ్యమే  సాకారమై వెలిసింది.(7). వేదాంతతత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించ గలిగాను.  భక్తులను రక్షించడంలోజాగు చేయని దయాఘనా ! నీకు జయము. (8). ఆనంద సముద్రుడు,  గంధపరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడూ  అయిన శ్రీకృష్ణుని,  మీ రూపంలో దర్శిస్తున్నాను. (9). ప్రకృతి -పురుషుల అభేదాన్ని'నరసింహ + సరస్వతి' అను పేరు సార్థకమొనర్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను. 


                            శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని,  అతని భార్యాబిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని,  వాత్సల్యంతో వారిక్షేమ సమాచారాలు విచారించారు. సాయందేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు  ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయందేవుని పెద్ద కుమారుడైన నాగనాధుని చూపిస్తూ ఆయన, 'సాయందేవా! ఇతడు సిరిసంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు,  మాకు ప్రీతిపాత్రుడు వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవతియైన నీ  భార్య పతివ్రత. మీకింకా నలుగురు కొడుకులు కలుగుతారు. మ్లేచ్చుని  సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది గనుక నీవది విడిచిపెట్టి మావద్దనే ఉండు' అని,  అతని భార్యా పిల్లలను కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయందేవునితో స్వామి,  'మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్లి స్నానము చేసి,  అశ్వత్తాన్ని  పూజించుకొనిరా' అని చెప్పారు.                                       

                        ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి. కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతము  చేసుకుని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వనగరము వస్తున్నారు. శ్రీ గురుడు సాయందేవునిగూడా అనంతవ్రతము చేసుకోమని చెప్పారు. అతడు, 'మీరే నాకు అనంతులు, మీ  పాదసేవయే  నాకు అనంతవ్రతము. నాకింక వేరొక వ్రతం ఎందుకు?  అన్నాడు. స్వామి, 'నాయనా,  నీవు మామాట విని వ్రతం చేసుకో! పూర్వము కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతము చేసుకొని అభీష్టాలన్నీ  పొందాడు. నీవు కూడా కౌండిన్యస గోత్రుడవే  గనుక ఈ వ్రతమాచరించు' అన్నారు. అప్పుడు సాయందేవుడు, 'స్వామీ !అలా అయితే ఆ  వ్రతవిధానమేమో, మా గోత్రఋషి దానివలన ఎలా కృతార్ధులయ్యారో  వివరించండి' అని కోరాడు. శ్రీగురుడు  వివరించారు".  

నలభై రెండవ అధ్యాయం సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Monday, June 1, 2020

గురు చరిత్ర అధ్యాయము - 41


అధ్యాయము  -41




                               
శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 



                        నామధారకుడు, "స్వామీ! సర్వధర్మాలతో కూడిన శ్రీ గురుచరిత్ర వింటుంటేనే నా హృదయంలో అజ్ఞానమనే చీకట్లు నశించి జ్ఞానమనే  జ్యోతి వెలిగింది. ఇప్పుడు గురుస్మరణ పట్ల ఎంతో ప్రీతి కలుగుతున్నది. శ్రీగురుని అంతటి అవతారమూర్తి యొక్క సాన్నిధ్యం పొందిన మహాజ్ఞానులు, సిద్ధపురుషులు మీరు. నా పూర్వపుణ్యం వలన అట్టి మీ దర్శన భాగ్యం కలిగింది. మా పూర్వీకులు శ్రీ గురుభక్తులు ఎలా అయ్యారో  తెలుసుకోవాలని ఉంది,  చెప్పండి' అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు:  


            "నాయనా! పూర్వం శ్రీ  గురుడు తీర్థాటనం  చేస్తూ, గోదావరీ తీరాన ఉన్న వాసర క్షేత్రానికి వేంచేసినప్పుడు ఆయనను భక్తితో పూజించి, ఆయన ప్రేమకు పాత్రుడైన సాయందేవుడే నీ పూర్వీకుడు. అటుతర్వాత శ్రీ గురుడు అనేక తీర్థక్షేత్రాలను పావనం చేస్తూ పర్యటించి, ఈ గంధర్వనగరం చేరారుగదా! అటు తర్వాత వారి కీర్తి దశదిశలా వ్యాపించి, సుదూర ప్రాంతాలనుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి, అభీష్టసిద్ధి పొందుతున్నారని మీ పూర్వీకుడైన సాయందేవునికి తెలిసింది. అతడు అందుకు ఎంతో ఆనందించి, ఒకనాడు శ్రీవారి దర్శనానికి ఈ గంధర్వపురం వచ్చాడు. శ్రీ  గురునికి నిలయమైన ఈ గంధర్వపురం అతడి కంటపడగానే, అతిశయించిన భక్తిశ్రద్ధలతో అడుగడుగుకు  సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీగురుని దర్శించగానే, అతనికి రోమాంచితమై, ఆనంద బాష్పాలు రాలాయి. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి, తన జుట్టుతో వారి పాదాలు తుడిచి, గద్గద  స్వరంతో ఆయననిలా  స్తుతించాడు:                    


                              ఓ పరమాత్మ! పరంజ్యోతి! నృసింహసరస్వతీ ! మీరు త్రిమూర్త్యాత్మకులే గాని, మానవమాత్రులుగారు. సర్వ తీర్థాలకూ  ఆశ్రయమైన మీ పాదాలను దర్శించినంత మాత్రాన కోటి జన్మల పాపం నశిస్తుంది. మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను. మా పితరులుకూడా కృతార్థులయ్యారు. ఓ  సర్వవ్యాపకా! సద్గురూ! భక్తవత్సలా! జయము. జీవుల పట్ల కరుణయనే  జలంతో నిండిన కమండలం  ధరించిన  మీరు సాక్షాత్తు ఆ  బ్రహ్మదేవుడే. మీరు అమృతతుల్యమైన ఆ నీరు చల్లి,  చనిపోయిన వారిని మరల బ్రతికిస్తున్నారు. స్వామి! దండమును ధరించిన మీరు సాక్షాత్తూ దుష్టులను దండించి,  భక్తుల దైన్యాన్ని పారద్రోలి  రక్షించే శ్రీ మహావిష్ణు స్వరూపులే, యిప్పుడిలా  సన్యాసి వేషంలో అవతరించారు. భస్మము,  రుద్రాక్షలు ధరించిన మీరు భక్తుల పాపాలను, భవరోగాన్ని నశింపజేయుగల సమర్థులు, సాక్షాత్తు శివస్వరూపులు. ఎవరి కృప వలన చచ్చినవాడు  బ్రతికాడో, గొడ్డుబర్రె పాలు ఇచ్చిందో, మేడికట్టె వృక్షమైందో, హీనుడుద్ధరింపబడ్డాడో అట్టి మిమ్మెవరెరుగగలరు?'        


                    శ్రీ గురుడు సంతోషించి  సాయం దేవుడి తలపైచేయి పెట్టి, 'నాయనా! నీవు మాకు పరమ భక్తుడవు.  నీ స్తోత్రం వలన మాకు సంతోషమైంది. నీ  వంశస్థులందరూ మా భక్తులై చిరకాలం వర్ధిల్లదురుగాక!' అని ఆశీర్వదించారు. తర్వాత శిష్యులందరితో ఆయన, 'మీరంతా సంగమంలో స్నానం చేసి, అశ్వత్థవృక్షాన్ని సేవించి పంక్తి  భోజనానికి రండి' అని చెప్పి, సాయందేవునితో, 'నీవు కూడా వారితో వెళ్లిరా, ప్రసాదం తీసుకుందువు' అన్నారు. అందరూ సంగమానికి వెళ్లి వచ్చాక, అతడు శ్రీగురునికి పూజచేసి, భిక్ష ఇచ్చాడు. అప్పుడు స్వామి అతనిని తన ప్రక్కనే కూర్చోబెట్టుకొని భోజనం పెట్టించారు. తర్వాత అతనిని దగ్గరకు పిలిచి, 'నాయనా,  నీవు ఎక్కడ ఉంటున్నావు? నీ భార్యబిడ్డలు క్షేమమా? చాలాకాలానికి కనిపించావు' అన్నారు. అతడు, 'స్వామీ మీరు సర్వజ్ఞులు. మీకు తెలియనిది ఏమున్నది? మీ  దయ వలన అందరము క్షేమమే. నా భార్యబిడ్డలు ఉత్తర కంచిలో ఉన్నారు. నా కుటుంబ భారం అంతా కొడుకులు చూసుకుంటున్నారు. కనుక నేను మీ పాదాల చెంత ఉండి సేవించుకోవాలని వచ్చాను. మీరు అనుగ్రహించాలి' అని వేడుకున్నాడు. శ్రీగురుడు నవ్వి, 'నాయనా మమ్మల్ని సేవించడం అంత సులభంకాదు. మేము ఒక చోట ఉండేవారముకాము. ఎక్కడ బడితే అక్కడే ఉంటాము. ఒకప్పుడు ఊరిలో ఉంటే, మరొకప్పుడు అడవిలో ఉంటాము. మాతో కలసి ఉండడం, మా సేవ చేయడం కష్టం. కనుక బాగా ఆలోచించుకో!' అన్నారు.           


                            సాయందేవుడు, 'స్వామి, మిమ్ము శరణు పొందిన నన్ను దూరం చేయవద్దు. మీరు ఉండగా నాకు భయమేమిటి. గురుసన్నిధికి చేర్చే పాదాలే పాదాలు; గురుపూజ చేసే చేతులే చేతులు. గురు పాదాలను అంటే శిరస్సే శిరస్సు. సర్వ అభిమానాలను నివారించి, పురుషార్థాలు ప్రసాదించగల గురుకృప ఉండగా నాకు భయమేమి? నేను మీ చెంతనే ఉండి, మీ పాదసేవ చేసుకుంటాను. అనుజ్ఞ ఇవ్వండి' అని పట్టుపట్టాడు. అప్పుడు శ్రీ గురుడు,  'నీకంత దృఢభావం ఉంటే అలానే చేయి' అని అంగీకరించారు. అతడు స్వామి సన్నిధిలో మూడు నెలలున్న తర్వాత ఒకనాటి సాయంత్రం శ్రీ గురుడు శిష్యులనెవ్వరిని రావద్దని చెప్పి, సాయందేవుణ్ణి ఒక్కడినే కూడా తీసుకొని సంగమానికి వెళ్లారు. ఇంతలో మరి కొందరు శిష్యులొచ్చి సంగమ స్నానం చేశారు. సాయం సంద్యోపాసన అయ్యాక, శ్రీ గురుడు అశ్వత్థవృక్షం క్రింద కూర్చుని, కొంతసేపు శిష్యులతో మాట్లాడారు. కొంతసేపటికి వారంతా గానుగాపురం వెళ్ళిపోయారు. శ్రీగురుడు, సాయందేవుడు మాత్రమే అక్కడ ఉన్నారు. అప్పుడతనిని పరీక్షించదలచి, శ్రీగురుడు ఒకలీల చేశారు. అంతలోనే అకస్మాత్తుగా పెనుగాలి చెలరేగింది. ఆ గాలికి చెట్లు ఊగిపోయి,  విరిగి పడుతున్నాయి. ఆకాశమంతా  కారుమేఘాలు అలముకుని భయంకరంగా ఉరుములు, కన్నులు మిరుమిట్లు గొలిపే మెరుపులతో కుండపోతగా వర్షం ఆరంభమైంది. సాయందేవుడు ఆ గాలికి ఎలాగో ఓర్చుకుని, తన వంటిపై నున్న ఉత్తరీయం తీసి శ్రీగురునికి కప్పి ఆయనకు అడ్డంగా నిల్చున్నాడు. ఇలా గాలి, వాన అర్ధరాత్రి రెండవ ఝాము వరకూ కొనసాగాయి. గాలి వాన కొంత నెమ్మదించగానే దుర్భరంగా చలిగాలి వీచసాగింది. అప్పుడు శ్రీ గురుడు,  నాయనా మమ్మల్ని చలి బాధిస్తున్నది. గ్రామానికి వెళ్లి మఠంనుండి అగ్ని తీసుకురా' అన్నారు. అతడు బయలుదేరుతుంటే, అతనిని బాట కటూఇటూ చూడకుండా త్వరగా వెళ్లి రమ్మని చెప్పారు. 


                    వెంటనే సాయందేవుడు బయల్దేరి గంధర్వపురం వైపుకు నడవసాగాడు. దారిలో ఎక్కడ అడుగు పెట్టినా మోకాలులోతున బురదలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఆపైన నీరు, రొమ్ములోతున ప్రవహిస్తోంది. కన్ను పొడుచుకున్నా కనిపించనంతగా కారు చీకట్లు అన్ని దిక్కులా  కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలి అతనిని ఒక ప్రక్క నెట్టివేస్తోంది. ఎలాగో అతడు శ్రీగురుని స్మరిస్తూ చీకట్లో తడుముకుంటూ, మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ కనిపించనంత దూరం పరిగెడుతున్నాడు. చివరకు ఎలాగో అతడు మఠం చేరి, అక్కడి సేవకులను నిద్రలేపి వారివద్దనుండి కుండలో నిప్పులు తీసుకుని తిరిగి బయల్దేరాడు. శ్రీగురుడు తనను ప్రక్కలకు చూడకుండా ఎందుకు సాగిపోమన్నారో తెలుసుకోవాలన్న కుతూహలం తీవ్రమై, నెమ్మదిగా కుడి ప్రక్కకు చూసాడు. అటు పక్కన ఐదు పడగలుగల భయంకరమైన త్రాచుపాము కనిపించింది. అతడు కొంచెం పక్కకు తప్పుకొని భయంతో వేగంగా నడుస్తూ, నెమ్మదిగా ఎడమ ప్రక్కకు చూచాడు. అటు ప్రక్కన కూడా మరో భయంకరమైన పాము అతని వెంటనే వస్తోంది. అతడు భయంతో మతిపోయి, బాటలోని ఎత్తుపల్లాలు కూడా పట్టించుకోకుండా పరుగెత్తసాగాడు. అతడు ఎటు పోతే అటు, అంత వేగంగానూ పాములు తరుముకొస్తున్నాయి. అతడు గుండెదడ పుట్టించే దిక్కుతోచక, పొదల మధ్యకు పోయాడు. ఎటుపోవాలో తెలియక భయంతో తననా పాముల బారినుండి రక్షించమని మనస్సులోనే శ్రీగురుని ప్రార్ధించు కొనసాగాడు. వెంటనే అతనికి కొంచెం భయం తగ్గి, ఒక చక్కని బాట చిక్కింది. దాని వెంటపోగా, కొద్దిసేపట్లోనే సంగమం వద్దనున్న రావిచెట్టు అతనికి కనిపించింది. ఆ ప్రాంతమంతా వేలకొద్దీ దీపాలతో వెలిగి పోతున్నట్లు కనిపించింది. అక్కడ నుండి వేద ఘోష అతనికి చక్కగా వినిపిస్తున్నది. అతడు అటువైపుగా వెళ్ళి శ్రీగురుని సమీపించేసరికి, అక్కడ ఆయన ఒక్కరే ఉన్నారు. అతడికి ఆ భయం వలన వర్షం ఆగింది అని కూడా తెలియలేదు. ఆకాశంలో మబ్బులు ఎప్పుడు తొలగిపోయాయోగాని, పిండి ఆరబోసినట్లు పండు వెన్నెల వచ్చింది. అతడు ఆ పాత్ర కిందపెట్టి, నిప్పును ప్రజ్వలింపచేసాడు. భయం తగ్గిపోయి, అతడు గురువుకేసి చూసేసరికి ఆ రెండు పాములు ఆయనకు నమస్కరించి వెళ్ళిపోతున్నాయి. వాటిని చూడగానే అతనికి మరలా భయమేసింది. శ్రీగురుడు నవ్వి, 'భయపడవద్దు, నిన్ను రక్షించడానికి ఆ పాములను మేమే పంపాము. గురుసేవ ఎంత కఠినమైనదో తెలిసిందా? కనుక ముందుగా ఆలోచించుకొని, తగిన భక్తి విశ్వాసాలు ఉంటేనే అందుకు పూనుకోవాలి. కలిప్రభావం వలన ఇంద్రియ చాపల్యము, అపప్రచారాలు మొదలైన అవరోధాలు ఎన్నో వస్తాయి. అయినా చలించకుండా నిశ్చలంగా గురుసేవచేస్తే గురుకృప వలన సర్వమూ  సిద్ధిస్తుంది. యజ్ఞ యాగాదులు చేసేవారికి ఎన్నో విఘ్నాలు వచ్చి, అవి తేలికగా  నిష్ఫలమవ్వవచ్చు. గురువుదగ్గరే ఉంటూ విశ్వాసంతో సేవ చేసేవాడు, తేలికగా అభీష్టాలు నెరవేరి కృతార్థుడవుతాడు. ఏకభావంతో ఆయనను ఆరాధించడమే ఉత్తమ సాధన. పతివ్రత తన భర్తను సేవించినట్లు, సచ్చిష్యుడు తన గురువును విడువక నీడవలే సేవిస్తాడు. దేహంతో సహా తన సర్వస్వమూ గురుసేవకే అర్పిస్తాడు. గురువే పరమేశ్వరుడని తెలుసుకొని ఆయన ప్రసాదమే భోజనంగా, ఆయన ధ్యానమే జీవనంగా, పాదతీర్థమే గంగాజలంగా సేవిస్తూ శ్రవణ మనన తత్పరుడై వుంటాడు. గురువు ఎంతటి దుస్సాధ్యమైన ఆదేశమిచ్చినా సరే, దాన్ని సాధించడానికి ఉపక్రమిస్తాడు. ప్రారంభించాక దానిని ఎంత కష్టపడి అయినా పూర్తిచేస్తాడు. అలా చేస్తే, వాడిని చూచి యమధర్మరాజు కూడా భయపడి తొలగిపోతాడు'. అప్పుడు సాయందేవుడు నమస్కరించి, 'స్వామి, నేనేమీ  తెలియని వాడిని, కృపతో గురుభక్తి ఎలాంటిదో వివరించండి. దాని సహాయంతో స్తైర్యం  చిక్కించుకుని మీ  చెంతనే ఉండి సేవిస్తాను' అన్నాడు. అప్పుడు  శ్రీ గురుడిలా బోధించారు:              


                     'నాయనా, చెబుతాను విను, నీవు ఇక రాత్రి అయిందో బ్రాహ్మీ ముహూర్తం అయిందోనన్నది పట్టించుకోకుండా వినాలి. సత్కాలక్షేపం అవుతుంది. పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు బోధించిన గురుభక్తి తత్వం నీకు చెబుతాము. శివుడు ఇలా చెప్పాడు: "దేవి, గురువే ఈశ్వరుడన్న దృఢమైన విశ్వాసంతో ఆయనను సేవించడం వలన సర్వసిద్ధులూ కలుగుతాయి. అట్టి ఫలితమే తపో అనుష్టానాదుల వలన చాలా కాలానికిగానీ సిద్ధించదు. యధావిధిగా గురుని సేవించేవారికి యజ్ఞాది కర్మలు చేయని లోటు కలగదు. పూర్వం త్వష్టయనే  బ్రాహ్మణ బాలునికి ఎనిమిదవ సంవత్సరంలో ఉపనయనం చేసి, వేదాధ్యయనానికి గురువు వద్దకు పంపారు. ఆ బ్రహ్మచారి చక్కగా గురు సేవ చేస్తున్నాడు. ఒకసారి ఆ గురువు యొక్క కుటీరం శిథిలమై, వర్షపునీరు లోపలకు కురిసింది. గురువు త్వష్టను పిలిచి, 'నాయనా, ఈ కుటీరం ప్రతిసారి వర్షానికి పాడైపోతున్నది. ఇలా గాలి, వాన, అగ్నుల  వలన నశించకుండా అన్ని వసతులూ కలిగి ఉండే కుటీరం నాకు కావాలి' అని చెప్పాడు. అప్పుడు గురు పత్ని,'నాయనా, ఎవ్వరూ నేయనిదీ, కుట్టనిదీ, రంగురంగులదీ, సరిపోయేది అయిన రవిక నాకు తెచ్చి పెట్టాలి' అన్నది. ఇంతలో గురుపుత్రుడు వచ్చి, 'అన్నా, నాకు మట్టి అంటనివీ, నీటి మీద నడిపించగలవీ, ఎప్పుడూ సరిపోయేవీ అయిన పాదరక్షలు కావాలి' అని చెప్పాడు. అప్పుడే చిన్న పాప అయిన గురుపుత్రిక కూడా వచ్చి, 'అన్నా! నా చెవులకు కుండలాలు, ఆడుకునేందుకు ఒక బొమ్మరిల్లు కావాలి. అది ఒంటి స్తంభం కలిగి, దంతంతో చేసినదై, పగలనిదిగా ఉండాలి. అది నా వెంట తీసుకెళ్లడానికి వీలుగా ఉండాలి. అందులో అన్ని వసతులూ ఉండాలి. దానిని నెట్టుకు వెళ్లడానికి చక్రాలు ఉండాలి. దానిని మళ్లీ ముడిచి వేయడానికి వీలు ఉండాలి. అందులో పీట, కుర్చీ ఉండాలి,  ఆడుకోవడానికి మంచి వంట పాత్రలు మట్టివి కావాలి. నాకు అవే వంట నేర్పాలి, వాటిలోని వంట ఎంతసేపైనా చల్లా రకూడదు. ఇతర వంట పరికరాలు కూడా కావాలి" అని చెప్పింది.   


             త్వష్ట అంగీకరించి, అడవికి వెళ్తూ, అవన్నీ ఎలా సంపాదించాలి అని ఆలోచించాడు. చివరకు దిక్కుతోచక, తన గురువునే ధ్యానించి, తన మనసులోనే ఆయనను శరణుపొందాడు. అలా పోతూ ఉండగా అతనికి ఒకచోట ఒక అవధూత కనిపించి, "నాయనా, నీవెవరు? ఇంత చిన్నవాడవు ఈ ఘోరమైన అరణ్యంలో చింతా క్రాంతుడవై తిరుగుతున్నావేమి?" అన్నాడు. ఆయనను చూడగానే త్వష్టకు మనస్సు శాంతించింది. తన గురువే ఆ రూపంలో దర్శనమిచ్చినట్లు  అనిపించింది. అతడు ఆయనకు నమస్కరించి, "స్వామి, ఈ నిర్మానుష్యమైన అరణ్యంలో మిమ్మల్ని చూడగానే మీరు సాక్షాత్తూ ఈశ్వరుడని నాకు తోచింది. మీ దర్శన మాత్రం చేతనే నా మనస్సు స్థిరపడి ఆనందం లభించింది" అని, తాను సాధించవలసిన కష్టతరమైన పనుల గురించి విన్నవించుకున్నాడు. అవధూత అతనిని ఆశీర్వదించి, "నాయనా! అభీష్టప్రదుడైన విశ్వేశ్వరుడు కాశీ లో ఉండగా దుర్లభమేమున్నది? నీవు కాశీ వెళ్లి విశ్వనాధుని పూజించు. ఆయన వరంతో  బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో మహిమను పొందారు. కేవలం గుక్కెడు పాలు కోరిన ఉపమన్యువుకు ఆయన సాక్షాత్తూ ఆ పాలసముద్రాన్నే ప్రసాదించిన దయాళువు" అని చెప్పాడు. గురుసేవ తప్ప వేరే ఏమీ ఎరుగని త్వష్ట, "స్వామీ! కాశీక్షేత్రం ఎక్కడ ఉన్నది? అని అడిగాడు. అప్పుడు ఆ ముని శ్రేష్ఠుడు, "కాశీకి నిన్ను నేనే స్వయంగా తీసుకుపోతాను. నీవలన నాకు కూడా విశ్వనాథుని దర్శనమవుతుంది" అని చెప్పి, తన లీల చేత అతనిని మనోవేగంతో కాశీకి తీసుకువెళ్లాడు."                    




      నలభై ఒకటవ అధ్యాయం సమాప్తము


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Sunday, May 31, 2020

గురు చరిత్ర అధ్యాయము -40


అధ్యాయము  -40




                               
శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 



                          సిద్ధయోగి శ్రీ గురులీలలు ఇంకా ఇలా వివరించారు : "గంధర్వపురానికి ఒకనాడు నరసింహశర్మయనే కుష్ఠురోగి వచ్చాడు. అతనిది యజుశ్శాఖ, గార్గ్య గోత్రము. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఇలా మనవి చేసుకున్నాడు : 'స్వామీ, మీరు సాక్షాత్తూ పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని, మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నా జన్మ యీ కాలిక్రింద మట్టివలె వ్యర్థమైపోయింది. నాకీ కుష్టువ్యాధి రావడం వలన ఎవరూ నా ముఖంకూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. అందరికీ జుగుప్స గొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు అనిపిస్తున్నది. ఎన్నో జన్మలలోచేసిన పాపాలన్నీ పేరుకొని, నన్ను ఇప్పుడిలా  కట్టికుడుపుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నాను. ఈ తెల్ల కుష్ఠురోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను. ఎన్ని తీర్థాలో సేవించాను. దేవతలందరికో  మ్రొక్కాను. కానీ దేనివలనా ఈ వ్యాధి కించిత్తైనా  తగ్గలేదు. చివరకు మీరే దిక్కు అని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు కూడా దయలేకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఎలాగైనా వుద్దరించండి స్వామీ!' అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీ గురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి, 'విప్రుడా! ఇదివరకు ఎన్నో పాపాలు చేసావు గనుకనే నీకీ కుష్టువ్యాధి వచ్చింది. అది తొలగి పోవడానికి నీకు ఒక ఉపాయం చెబుతాము, దానివలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు' అన్నారు.            


              ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టెపుల్లలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు. అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే నాలుగు సంవత్సరాల క్రిందట ఎండిమోడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడికర్రను  చూపి నరహరితో, 'నాయనా, నీకీ మేడికట్టే ఇప్పిస్తాము. నీవు దానిని తీసుకొనిపోయి, మా మాట యందు దృడవిశ్వాసముంచి మేము చెప్పినట్లే చేయి. దానిని సంగమంలోని  సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు. నిత్యమూ స్నానంచేసి ఈ రావిచెట్టుకు ప్రదక్షణంచేసి, రెండు చేతులతో రెండుకుండల నిండుగా నీరు తెచ్చి మూడు పూటలా ఆ ఎండు కట్టెకు పోస్తూవుండు. అది ఎప్పుడు చిగురిస్తుందో  అప్పుడే నీ పాపంపోయి, నీ శరీరం స్వచ్ఛమవుతుంది, వెళ్ళు!' అని చెప్పారు. నరహరి ఆయన మాట పై సంపూర్ణమైన విశ్వాసముంచి, ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొనిపోయి, ఆయన చెప్పినట్లే చేయసాగాడు. అతడు నిత్యమూ దీక్షగా దానికి నీరు పోయడం చూచిన వారంతా నవ్వి, 'ఓరి వెర్రి బ్రాహ్మణుడా! నీకేమైనా మతి పోయిందా? నీవు ఎన్నిరోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టే మళ్ళీ చిగురిస్తుందా? నిజంగా నీమీద శ్రీ గురుడికి దయ గలిగితే ఇదంతా ఎందుకు? అనుకున్నది వెంటనే జరిగిపోదా? నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యతలేదని సూచించడానికే  శ్రీగురుడు నీకిలా చెప్పారు. అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు? అని నిరుత్సాహపరుస్తుండేవారు. ఇలా ఒక వారంరోజులు గడిచిపోయాయి. అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం గూడా విడవక, ' ఈ భూమిమీద మహాత్ములు  పలికిన మాటలు ఎంత అమోఘమైనవి! వారు సత్యసంకల్పులు కదా! గురుదేవుల వాక్కు అసత్యమెలా అవుతుంది? వారి కృపవలన చచ్చిన వారెందరో బ్రతకగాలేనిది, ఈ ఎండుకట్టే చిగురించడంలో  ఆశ్చర్యమేమున్నది?' అని చెప్పి, తానుమాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతూ ఉండేవారు. వారిలో కొందరు వెళ్లి శ్రీ గురునితో, 'స్వామీ! మీరు ఆ రోజున ఆ కుష్ఠురోగికి  ఎందుకు అలా చెప్పారో గాని, ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని, ఈ వారంరోజులనుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను  సేవిస్తున్నాడు. ఎవరేమి చెప్పినా వినడంలేదు. అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది. "ఈ వృధా ప్రయాస ఎందుకు?" అని చెప్పిన వారందరితో అతడు, "గురువు చెప్పినట్లు చేయడమే నాపని. వారు అన్నమాట నిలబెట్టుకోవడం వారిపని!" అని చెప్పి, ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరైనా చెప్పండి! లేకుంటే అతడలాగే చేస్తుంటాడు' అని చెప్పారు. శ్రీ గురుడు,    'ఈ భూలోకంలో గురు వాక్యం ఒక్కటే తరింప చేయగలదు. దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది. దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది,  విను. దేవత, మంత్రము,  వైద్యుడు,  పుణ్యతీర్థము,  గురువు -వీటిపట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో, వారి ప్రాప్తము కూడా అలానే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో, యుక్తితో గురువును సేవించడమే అన్నిటికంటే సులభమైన సాధనం. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగలవారికి ఫలితం వెంటనే లభిస్తుంది.                      


                          పూర్వము పాంచాలదేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకుపోయాడు. ధనుంజయుడు దాహం తీర్చుకొని, ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్లి, అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక ప్రక్కన పడివున్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని, దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూచి, ' నీకు ఈ లింగం ఎందుకు? 'అని అడిగాడు. బోయవాడు, 'అయ్యా! నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది. శివలింగం అన్నింటికంటే ప్రశస్తమైనదన్న భావంతోతీసుకున్నాను' అన్నాడు. ధనంజయుడు సంతోషించి, 'ఇది అన్నింటికంటే ప్రశస్తమన్నమాట నిజమే. కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో!' అన్నాడు. అప్పుడా బోయవాడు, 'అయ్యా! నేను అడవిలో పెరిగినవాడిని. దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీనిని పూజించే విధానం చెప్పండి. మీరే నాగురుదేవులు!' అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు: 'అయితే చెబుతాను విను. దీనిని తీసుకొని పోయి, మీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి, స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తూ శివుడే నీ ఇంట్లో ఉంటాడు. కనుక నీవు నీ భార్యతో కలసి శ్రద్ధగా నిత్యము పూజచేయి. ప్రతిరోజు స్మశానం నుండి చితాభస్మం తెచ్చి,  అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడు ఏమి తిన్నాసరే, ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు' అని చెప్పాడు.


                ఆ బోయవాడు ఇంటికి వెళ్లి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒక రోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనేలేదు. అతడు ఎంతో బాధపడి తన భార్యతో, ' అయ్యో! ఈ రోజు శివునికి పూజ సరిగా జరగలేదు. గురువు ఉపదేశించినట్లు పూజ చేయాలి గానీ, మరోరకంగా చేస్తే ప్రయోజనముండదు. సరిగదా, గురువుమాట జవదాటితే నరకము, దరిద్రమూ వస్తాయి. గురువు చెప్పినట్లు చేస్తే నీ పుట్టుక లేకుండాపోతుంది. అందుకోసం నేనెంత వెతికినా బూడిద దొరకనేలేదు. ఈ ఒక్కరోజూ ఆయన చెప్పినట్లు చేయలేకపోతే, ఇన్ని రోజులుగా చేస్తున్న పూజ అంతా వ్యర్థమై పోతుంది. పూజ సమయం కూడా దాటి పోతున్నది. ఇంక నేనుఏమి చేయాలి? అది దొరకకుంటే నా ప్రాణమైన విడుస్తాను!' అని దుఃఖించాడు. అతని భార్య అతనిని ఓదార్చి, 'దానికోసం అంత బాధపడతావేమి? మనింట్లో ఎన్నో కట్టెలు ఉన్నాయి. వాటితో నన్ను దహనంచేసి, ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు, నీవు వ్రతభంగం చేసుకోవద్దు. శివపూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషమేమున్నది? ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసిందే గదా! అట్టి దానిని శివపూజకర్పిపించడం కంటే కావలసినదేమున్నది. అని ధైర్యం చెప్పింది.                                     


                    అప్పుడతడు, 'నీవు పడుచుదానివి. సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు. ఒక బిడ్డనైనా  కనలేదు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏ లుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటాన? అలాచేస్తే నాకెంతో పాపమొస్తుంది. ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపంచేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు.  నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసినవాడనవుతాను?' అంటూ  వలవలా  ఏడ్చాడు.  ఆమె,  'నీకెంత వెర్రి?  నాపై నీకు అంత మొహమెందుకు?  నీటి బుడగలాగా ఈనాడువున్న శరీరం రేపు లేకుండా పోతుందే.  పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసినదేగా? నా  తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదానినే గదా?  నేనేమైనా పరాయి దాన్నా?  నీలో భాగాన్నే  కదా?  శివునికోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే  అవుతుంది. నీ ప్రాణాన్నైన  నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి?  అది నా అదృష్టమే కదా?  అలా చేస్తే శివుడు మనిద్దరినీ రక్షిస్తాడు' అని పట్టుబట్టి,  చివరకు అతనినెలాగో ఒప్పించింది.  


                                  అప్పుడామె ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్ట మన్నది. అతడు అలానే చేసి,  సర్వమూ భస్మమైపోయాక దానినంతా  భక్తితో లింగానికి అర్పించి, కృతార్థుడనవగలిగానని  ఎంతో ఆనందించాడు. తర్వాత  ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి, అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోడానికి  రమ్మని తన భార్యను కేకవేశాడు. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి,  శరీరంతో నడిచి వచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదం  తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనుకటి వలనే చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నది. శబరుడు ఆశ్చర్యపడుతూ ఉంటే అతని భార్య, 'స్వామీ, నాలుగు ప్రక్కలా ఇల్లు అంటుకుని మండుతున్నాగాని నాకదేమో ఎక్కడలేని చలి పుట్టింది. నేను ముడుచుకుని పడుకోగానే గాఢంగా నిద్ర పట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియలేదు. మీరు పిలువగానే 'మెలకువవచ్చి లేచి వచ్చాను. ఆహా! ఏమి యీ  ఈశ్వరుని లీల!' అనగానే, శివుడు వారికి సాక్షాత్కరించాడు. వారు నమస్కరించగానే,  జీవితాంతంలో వారు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా  వరమిచ్చి అదృశ్యమయ్యాడు. దేనియందైనా పూర్ణ విశ్వాసం ఉండాలేగానీ, ఎంతటి  ఫలితమైన లభించగలదు. కనుక ఆ కుష్ఠురోగియైన నరహరి చేస్తున్న సేవకు ఫలితముండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది' అన్నారు శ్రీ గురుడు.     


                                  కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్లి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ కుష్టురోగి వద్దకు వెళ్ళారు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తూ ఉండటం చూచి ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరుపోసి ఆయన వద్దకు వచ్చి నమస్కరించాడు. ఆయన తన కమండలంలోని నీరు తీసి,  ఆ ఎండిన  మేడి కర్రమీద చల్లారు.మరుక్షణమే అది  చిగురించింది! అనుష్ఠానానికని  సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టైంది.నివ్వెరపోయి దానిని చూస్తున్న నరహరికి గూడా కుష్టురోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసి పోసాగింది. అతడు ఆనందబాష్పాలు రాలుస్తూ, శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరమంతటా రోమాంచితం అవుతుంటే, పారవశ్యంతో శ్రీగురుని ఇలా స్తుతించాడు: 'కోటి సూర్యుల తేజస్సు( జ్ఞానము), కోటిచంద్రుల చల్లదనం( ఆనందము ) గలిగి, దేవతలందరిచేతా పూజించబడే విశ్వాశ్రయుడు, భక్తప్రియుడు, శ్రేష్టుడుయైన అత్రి పుత్రుడు అయిన ఓ నృసింహ సరస్వతీ స్వామీ! నీకు నమస్కారము, నన్ను రక్షించు. మోహాపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపచేయగల జ్ఞాన సూర్యుడవు; విశాలమైన నేత్రములు గలవాడవు; భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివీ అయిన ఓ నృసింహ సరస్వతీ ! నీకు నమస్కారము. నన్ను రక్షించు. (2) మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటివారు మీరు; సత్యము, సర్వానికి సారభూతమూయైన పరమాత్మతత్వమే మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్తయైన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్టుడైన శ్రీ వల్లభా ఓ నృసింహ  సరస్వతీ ! నీకు నమస్కారము. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవై ఉండి, సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి  నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా, నీవు భక్తుల పాలిటి  కామధేనువవు. ఓ శ్రీగురు! ప్రచండమైన (మా) పాపాలను పారద్రోలడానికి దండము ధరించి, యతి వేషధారులైన నృసింహ  సరస్వతీ ! నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. మీపాద కమలాలను వేదాలు,  శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. నాదబిందు కళా స్వరూపా! నీవు వాటికి కూడా అతీతుడు అయ్యుండి, మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న   భక్తుల పాలిటి కల్పవృక్షమా ! ఓ నృసింహ సరస్వతీ ! నీకు నమస్కారము. నన్ను రక్షించు. అష్టాంగయోగ తత్త్వనిష్ఠతో  ఆత్మ సంతుష్టుడవైయున్న జ్ఞానసాగరా ! కృష్ణావేణీ పంచనది సంగమ తీర నివాసా ! కష్టాలను, దైన్యాన్ని దూరంచేసి, భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతీ, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. నిత్యము ఈ  నరసింహ సరస్వతీశుని అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము, దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వసంపదలు,  నాలుగు పురుషార్ధాలు లభిస్తాయి. ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము. నరహరిశర్మ కన్నీటితో స్వామి పాదాలు అభిషేకించి, వాటిని విడవక అలానే పడిఉన్నాడు. శ్రీ గురుడు అతనికి అభయమిచ్చి, "జ్ఞానరాశివవుదువుగాక !" అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు. అక్కడ చేరిన వారందరూ ఆ గురు మహత్యం చూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వ పురం లోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని, భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు హారతులు ఇచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. తర్వాత శ్రీ గురుడు అతని దగ్గరకు పిలిచి , ' నాయనా, నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది. నీవు గోవులు,  సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించ గలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రజ్ఞులు, శతాయుష్మంతులు అవుతారు. నీకు ముగ్గురు కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగియై మా సేవ చేస్తాడు. నీకు పరమార్థికమైన  శ్రేయస్సు కూడా లభిస్తుంది. ' అని ఆశీర్వదించారు. తర్వాత శ్రీ గురుడు అతనికి అష్టాంగయోగం ఉపదేశించి, విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి, ' నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము. నీ భార్యాబిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధి లోనే ఉండు' అని చెప్పారు.                                       


                     నామధారకా! శ్రీ గురుని ప్రసాదం వలన నరహరిశర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి, గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో  చూశాము కదా! అంతేగాదు, భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీ గురునికి ఎంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, చందో దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులు దిద్దపోతే, శ్రీ గురుడు అంగీకరించక, ఆ స్తోత్రమలానే చదవాలని చెప్పేవారు!"                             

నలభైయవ  అధ్యాయం సమాప్తం

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Friday, May 29, 2020

గురు చరిత్ర అధ్యాయము -39


అధ్యాయము  -39


                               

శ్రీ గణేశాయనమః                             

శ్రీ సరస్వత్యేనమః                                                                                                  

శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 




                        సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు: 'గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిది ఆపస్తంబశాఖ, శౌనక  గోత్రం. అతని భార్య గంగమ్మకు 60 ఏళ్లునిండినా సంతతి కలగలేదు. ఆమె నిత్యమూ శ్రీగురుని దర్శించి,  వారి పాదాలను పూజించి,  హారతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తూ ఉండేది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తూ ఉండేది. ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో,  'అమ్మా! ఇన్నాళ్లుగా  మమ్మల్ని సేవిస్తున్నావు. నీ అభీష్టం ఏమిటో ఎన్నడూ చెప్పలేదే? ఇప్పటికైనా చెబితే గౌరీనాధుని  కృపవలన నీకోరిక నెరవేరుతుంది' అన్నారు. ఆమె ఎంతో సంతోషించి దోసిలి యోగ్గి  కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది: 'స్వామి! కొడుకులు లేని వారికి ఉత్తమగతులు ఉండవుగదా. అందువలన గొడ్రాలుగా ఉండడమే మహాదోషమైంది. నేను మహా పాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కల్గలేదని అందరూ నన్ను ఏవగించుకొంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలుగదు కదా! పితృదేవతలు కూడా, తమ కులంలో ఒక మగ బిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. బిడ్డలు లేని ఇల్లు ఇల్లే గాదు అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే  అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్లు నిండిపోయాయి. మాకు,  మా పితృదేవతలకు తిలోదకాలిచ్చే వాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయె! స్వామీ, అయిందేదో అయిపోయింది. మరుజన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి. చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీ గురుడు నవ్వుతూ,  'ఓసి పిచ్చి తల్లి. ఏమి కోరిక కోరావమ్మా? ఎప్పుడో రాబోయే జన్మసంగతి ఇప్పుడెందుకు?  అప్పుడు బిడ్డలు గలిగినా, వాళ్లు మేమిచ్చిన వరంవలన కలిగినట్లు నీకు ఎలా తెలుస్తుంది? నీవు  నిత్యమూ  మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది. కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము.  కొద్దికాలంలోనే నీకు ఒక కూతురు,  ఒక కొడుకు కలుగుతారు' అని ఆమెను దీవించారు.                                    


                        అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కరించి, 'స్వామీ,  ఒక మనవి చేసుకుంటాను, నాపై కోపగించివద్దు,  నేను బిడ్డలకోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను. పుణ్యతీర్ధాలలో స్నానం చేశాను. రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి, కనిపించిన రావిచెట్టుకల్లా ఇంతవరకూ ప్రదక్షిణలు, నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను. అలానే నా వయస్సంతా చెల్లిపోయింది. ఇటువంటి నాకు మీ వరమెలా  ఫలించగలదా అని ఆలోచనగా ఉన్నది అలా అని త్రిమూర్తి స్వరూపులైన  మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు. అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను. ఇంతకూ నాకు కలిగిన సందేహం ఇది- నేను వచ్చే జన్మలో నైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే,  మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు. అయినప్పటికీ ఇన్నాళ్లుగా నేను కాళ్ళునొప్పులు పుట్టేలాగా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసినందువల్ల కలిగిన ప్రయోజనమేమిటి?' అని విన్నవించింది. ఆమె ఆవేదన చూచి నవ్వి,  శ్రీ గురుడు ఇలా చెప్పారు: 'అమ్మాయి! నీవు చేసిన అశ్వత్థపూజ వలన నీకు ఎంతో పుణ్యం లభించింది. ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి, పోగొట్టుకోకు. నా మాటవిని,  ఇక నుండి ఈ సంగమంలో ఉన్న యీ  రావి చెట్టుకు,  మాకూ  కలిపి నిత్యమూ  ప్రదక్షిణ, పూజ  చేస్తూ ఉండు. మేమెప్పుడూ అశ్వత్థ వృక్షంలో ఉంటాము. అందువల్లనే పురాణాలన్నీ దానిని 'అశ్వత్థనారాయణుడని ' కీర్తించాయి.                 


                              గంగాంబ, 'స్వామీ అతి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యం  వివరించండి. అప్పుడు తగిన శ్రద్దాభక్తులతో దీనిని సేవించ గలుగుతాను' అన్నది. శ్రీ గురుడు ఇలా చెప్పసాగారు. 'అశ్వత్థవృక్షంలో సర్వదేవతలూ  ఉంటారు. దాని మహత్యం గురించి బ్రహ్మాండపురాణంలో నారద మహర్షి చెప్పాడు. అశ్వత్థమే నారాయణ స్వరూపం. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ: దాని మధ్య భాగమే విష్ణువు: దాని చివరి భాగమే శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే.  అలానే,  త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ,  పడమర,  ఉత్తర దిక్కులలోని కొమ్మలు. తూర్పు దిక్కుకున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు. దాని వ్రేళ్లలో మహర్షులు,  గోబ్రాహ్మణులు,  నాలుగు వేదాలు ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్యనదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో '' కారము,   మానులో ' ' కారము. దాని పండ్లు '' కారము. - ఆ వృక్షం అంతా కలిసి ప్రణవస్వరూపమే ఇక ఆ చెట్టుయొక్క మహిమ ఎవరు వర్ణించగలరు? అది సాక్షాత్తూ కల్పవృక్షమే,  ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారదమహర్షి ఇలా చెప్పాడు: "అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర, ఆషాడ, పుష్యమాసాలలోనూ, గురు,  శుక్ర మౌడ్యాలలోనూ,  కృష్ణ పక్షంలోనూ  ప్రారంభించకూడదు. శుభ సుముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచియై  ఉపవసించి మరీ ప్రారంభించాలి. ఆది, సోమ, శుక్రవారాలలోనూ, సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధసమయాలలోనూ,  రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్తుతి, పరనింద, జూదము, అసత్యములను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానంచేసి,  ఉతికిన గుడ్డలను ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునలను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థవృక్షానికి  భక్తితో ఏడుసార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరల స్నానంచేసి,  దేవతామయమైన ఆ వృక్షానికి పురుషసూక్త విధానంగా షోడశోపచారపూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు గలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ గాని, మౌనంగా గాని, యెంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట,  చివరా  నమస్కారం చేయాలి. ఇలా రెండు లక్షలు ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి,  నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణశుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి, బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు. శనివారంనాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయం తొలగుతుంది. అశ్వత్థాన్ని పూజించాక-


                 శ్లో||   కోణస్థ:   పింగళో బభ్రు:  
                                                     
                                      కృష్ణోరౌద్రాంతకో  యమః                
                                                      
                      శౌరిశ్శనైశ్వరో మందః      
                 
                              పిప్పలాదేవ సంస్తుతః ||           

         అనే మంత్రం దృఢవిశ్వాసంతో జపిస్తే శనిదోషం కూడా తొలగి, అభీష్టసిద్ధి కలుగుతుంది. గురువారము అమావాస్య కలిసిన రోజున రావిచెట్టు నీడన స్నానంచేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేదవిప్రునికి మృష్టాన్నం పెడితే కోటిమంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితముంటుంది. అక్కడ చేసిన గాయత్రీ మంత్ర జపంవలన నాలుగు వేదాలూ చదివిన ఫలితముంటుంది. రావిచెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది. దానిని కొట్టివేయడం మహాపాపం. పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక,  ఆ సంఖ్యలో పదవ వంతు హోమము,  అందులో పదవవంతు బ్రాహ్మణ సమారాధనమూ  చేయాలి. ఈ వ్రత కాలంలో బ్రహ్మచర్యమవలంభించాలి. ఉద్యాపన  తర్వాత బంగారు రావిచెట్టును,  అలంకరించిన ఆవు - దూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల  రాశిని, ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులూ,  కుటుంబీకులూ అయిన వేద విప్రులకు దానమివ్వాలి. ఇలా చేస్తే తప్పక అభీష్టం సిద్ధిస్తుంది. 


                    అమ్మా! అశ్వత్థ మహత్యం తెలిసింది కనుక ఇంక దానిని నిందించక, యెట్టి సంశయమూ  పెట్టుకోకుండా అలా చేయి. నీ అభీష్టం నెరవేరుతుంది.' అప్పుడు గంగాంబ, 'స్వామీ ! 60 సంవత్సరాలు నిండిన నేను పుట్టుకనుండి వంధ్యను.  నాకు బిడ్డలెలా  కలుగుతారు?  అయినా నాకేమి? ప్రత్యక్షంగా మీ  పాదాలుండగా మరలా యీ రావిచెట్టును సేవించడం ఎందుకు?' అనిపిస్తున్నది. ఏమైనప్పటికీ,  గురువు మాట కామధేనువని వేదాలు,  శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక నమ్మి త్రికరణశుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది. ఆమె నాటినుండి మూడు రోజులూ ఉపవసించి,  మూడుపూటలా ష్టట్కుల  తీర్థంలో స్నానం చేసి, గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని  సేవించి,  దానికి ఏడు బిందెల నీళ్లు పోసి,  శ్రీ గురుసహితంగా దానిని పూజించింది. ఆ మూడు  రాత్రులూ  ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు. మూడవనాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒకబ్రాహ్మణుడు కనిపించి,  'అమ్మాయీ,  నీ కోరిక తీరింది. ఉదయమే శ్రీ గురిని పూజించి,  ఆయనిచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను' అన్నాడు. అలాగే నాలుగవరోజు ఉదయం సంగమంలో అశ్వత్తాన్నిసేవించి,  ఆ దంపతులు మఠానికి వచ్చారు. ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీ గురుడు నవ్వి,  రెండు పండ్లు ఆమెకిచ్చి,  'మీ లక్ష్యం నెరవేరింది. పారణ అయ్యాక నీవీ పండ్లు తిను. నీకు ఒక కూతురునూ,  కొడుకునూ  ఇస్తున్నాము. ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానమివ్వు' అని చెప్పారు. ఆమె అలానే చేసింది. ఆ రోజే సూర్యా స్తమయ సమయానికి ముందే ఆమె రజస్వల అయ్యింది. నాలుగవ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో గూడ శ్రీ గురుని  వద్దకు వచ్చి గురు పూజ చేసింది.శ్రీ గురుడు, 'నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు  కలుగుతారు; నీకు ముక్తి లభిస్తుంది' అన్నారు. ఐదవ రోజున భర్త్రుసమాగమం వలన ఆమె గర్భం ధరించింది. ఆమెభర్త ఎంతో సంతోషించి పుంసవనము,  ఎనిమిదవనెలలో సీమంతము మొదలైన సంస్కారాలన్నీ  ఘనంగా జరిపించాడు. ఆమె ఏడవ మాసంలో మళ్లీ శ్రీగురుని దర్శించి ఆశీస్సులు పొందింది. అప్పుడు శ్రీగురుని ఆజ్ఞమేరకు ఆ పండుముత్తైదువ వాయనదాన మిచ్చింది. నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నెరిసి, పళ్ళన్నీ  పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. శ్రీ గురుని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది. ఆమెకు నవమాసాలు నిండాక,  ఒక శుభ ముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది. దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు. ఆ బిడ్డకు శ్రీగురుని  పేరిట 'సరస్వతి' అని పేరు పెట్టుకున్నారు. పదకొండవ రోజున ఆ బాలింతరాలు నడుముకట్టు వేసుకుని,  బిడ్డనెత్తుకుని,  భర్తతో కలిసి శ్రీగురుని దర్శించింది. బిడ్డను ఆయనముందుంచి, 'వంద్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది. అది సుపాలమైతే బాటసారులు సేవిస్తారు. వ్యర్థఫలానికంటే వంధ్యాత్వమే మేలు!' అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది. స్వామి వాత్సల్యంతో, 'పుత్రవతీ! లేవవమ్మ!' అని బిడ్డను చూచి, 'ఇది ఆడపిల్లే గాని మగపిల్లవాడు గాడే!' అంటూ ఆమెను చూచి నవ్వి, 'ఇంక సందేహించనక్కరలేదు,  నీకు కొడుకుగూడా పుడతాడు' అని చెప్పారు. అప్పుడా పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకుని నిమురుతూ,  'ఈబిడ్డ  దీర్ఘాయువు, సౌభాగ్యము,  సౌశీల్యములతో ప్రసిద్ధికెక్కుతుంది. ఆమెకు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణదేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు. మీకు వేదశాస్త్ర పారంగతుడు,  మహా ఐశ్వర్య  సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు. కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి?  వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా?, లేక 30 సంవత్సరాల ఆయుస్సు  గల విధ్వాంసుడు కావాలా?' అన్నారు. గంగాంబ, 'విద్యావంతుడు, సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి. అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి' అని చెప్పి స్వామికి నమస్కరించింది.  స్వామి, 'తథాస్తు' అని ఆమెను  దీవించి పంపివేశారు. ఒక సంవత్సరంలో ఆమెకు  కొడుకు పుట్టాడు. అతనికి గూడా 'నృసింహ' అని శ్రీ గురుని  పేరే  పెట్టారు. వాడు కొంత కాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డలను కన్నాడు. గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞదీక్షితునీతో వివాహమైంది. అతని చేత యజ్ఞాలు చేయించుకోడానికి కాశీ నుండి శ్రీమంతులు,  పండితులు వచ్చి,  అతనిని తీసుకు వెళుతూ ఉండేవారు. శ్రీ గురుకృప ఎంతటిదో చూచావా? నామధారకా ! వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం". 

ముపై తొమ్మిదవ అధ్యాయం సమాప్తము.

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Wednesday, May 27, 2020

గురు చరిత్ర అధ్యాయము -38


అధ్యాయము  -38




                               

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                            శ్రీ గురుభ్యోనమః 




కథారంభము 



                        నామధారకుడు, "స్వామీ, శ్రీ గురుడుపదేశించిన కర్మానుష్టాన రహస్యం మీనుండి విని ధన్యుడినయ్యాను. ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీ గురుని వృత్తాంతం తెల్పండి" అని వేడుకొన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు : "నాయనా, నీవంటి గురుభక్తుడు, శ్రోతా  లభించినందువల్లనే శ్రీ గురుచరిత్ర తనివితీరా స్మరించుకొనే భాగ్యం నాకు కూడా కలిగింది.            


          శ్రీ గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులయిన గురుభక్తులెందరో  గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష, వారి ప్రీతికోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు. ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కరశర్మ అనే పేదబ్రాహ్మణుడు వచ్చాడు. అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలగునవి మూటగట్టుకొని తెచ్చి, శ్రీ గురునికి నమస్కరించాడు. కానీ ఆరోజు అందరితోపాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు. అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి, భోజనానికి వెళ్లాడు. ఈ రోజు ఇలానే జరుగుతూ ఉండటం వలన మూడుమాసాలు అలాగే గడిచింది. అతనిని చూచిన బ్రాహ్మణులందరూ,  'ఏమయ్యా బ్రాహ్మణుడా! నీవు వచ్చింది ఎందుకు?  చేస్తున్నదిఏమిటి? నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా? పోనీలే, ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు. నీకు ఇంటివద్దకంటే ఇక్కడే బాగున్నట్లున్నది. నీకు సిగ్గువేయడం లేదా?" అని ఎగతాళి చేయసాగారు. పాపమాభాస్కరశర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు. అతనిపై ఇట్టి విమర్శలు, నిష్టూరాలు, పెరిగిపోయి, ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది. ఆయన అది సహించలేక, అతనిని పిలిచి, 'నాయనా, నీవు రేపు ఇక్కడనే  స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు' అని ఆదేశించారు. అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి, పెరుగు సమకూర్చుకుని, స్నానానుష్టాలు పూర్తిచేసుకుని, తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు.  


                     ఆ సమయంలో వేరే ఒక భక్తుడు వచ్చి, తానారోజు శ్రీ గురునికి భిక్ష చేయడానికి అన్నము, మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు. కానీ శ్రీ గురుడు, తాము ఆరోజున భాస్కరశర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని, అతడు మరుసటిరోజు బిక్ష చేయవచ్చునని చెప్పారు. అతడు నిరుత్సాహపడి, 'అయ్యో! ఇప్పుడీ దరిద్రుడు వండినదాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకు అయినా  వస్తుందా? ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోజనం చేయవలసిందే!' అనుకుంటూ వెనుకకు మరలాడు. శ్రీ గురుడు ఆ మాటలు విని అతనికి, అక్కడున్న వారందరికీ ఎలా చెప్పారు: 'నాయనలారా! ఈరోజు మీరెవరూ  భోజనానికి ఎక్కడికీ  వెళ్ళవద్దు. మీరందరూ భార్యాబిడ్డలతోనూ, స్నేహితులతోనూ కలసి ఈ మఠంలోనే భోజనం చేయాలి. కనుక అందరూ స్నానాలు చేసిరండి' అనిచెప్పారు. అందరూ ముఖముఖాలు చూచుకొని నవ్వుకుంటూ, 'ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలెడు బియ్యమేకదా ! ఎవరికీ తెలియదు? మఠంలో అందరికీ భోజనం పెట్టడానికి అదేమి  సరిపోతుంది? ' అనుకుంటూ స్నానానికి వెళ్లారు. ఇంతలో శ్రీ గురుడు భాస్కరశర్మతో, 'నాయనా,  కొద్దిసేపట్లో అందరూ వస్తారు. త్వరగా సిద్ధంచేయి!' అని చెప్పారు. అతడు వెంటనే మరో పొయ్యికూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధంచేసి, అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు. అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ  ఆహ్వానించమని భాస్కరశర్మను ఆదేశించారు. అతడు అలాగే వెళ్ళి చెప్పగానే, వాళ్లు పకపకా నవ్వి, 'ఏమయ్యా! నీవు పెట్టినట్లే,  మేము తిన్నట్లే! ఈ రోజున మా ఇళ్ళల్లో ఉన్నదేదో మేము భోజనం చేస్తాము కానీ నీవు కనీసం శ్రీ గురుడికైనా కడుపునిండా పెట్టగలిగితే అంతేచాలు, పో,  పో!' అన్నారు. భాస్కరశర్మ తిరిగివచ్చి, వారందరూ తనను ఎగతాళిచేసి భోజనానికి రామన్నారని చెప్పాడు. శ్రీ గురుడు, 'నాయనా, మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతముగాని, మేము ఒక్కరమే బిక్ష చేయము' అన్నారు. స్వామి నోటిమాట తప్పక జరిగి తీరుతుందన్న దృఢ విశ్వాసం గల భాస్కరశర్మ అది నిరూపించుకోదలచి దీనంగా, స్వామి, నేనేం చేసేది? నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టిన వారు రావడంలేదు. సరిగదా, నన్ను ఆక్షేపిస్తున్నారు' అన్నాడు. అప్పుడాయన వెంటనే మరో శిష్యుని పంపి నదివద్దనున్న బ్రాహ్మణులందరిని వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. అతడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి, అందరిని ఆహ్వానించాడు. ఇక తప్పక అందరూ మఠం  చేరుకున్నారు. శ్రీ గురుడు వారందరితో, 'బ్రాహ్మణోత్తములారా! మీరందరూ మీ భార్యాబిడ్డలను తీసుకొని మఠానికి రావాలి. ఈ రోజు ఇక్కడే నాలుగువేల మందికి సమారాధన చేయాలి. అందరూ విస్తళ్లలో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి' అని భాస్కరశర్మతో, ఏమయ్యా, చూస్తావేమిటి? లేచి నమస్కరించి అందర్నీ ఆహ్వానించు' అన్నారు. అతడు వెంటనే లేచి నమస్కరించి, వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలసి తానుచేయనున్న సమారాధనకు విచ్చేసి. తనను కృతార్థుడను చేయమని వేడుకున్నాడు. వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి, 'ఓరి వెర్రి బ్రాహ్మణుడా! సిగ్గులేకుండా తగదుననుకొని, నీవుపిలిస్తే వచ్చామటయ్యా? నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా  సరిపోతుందా?' అన్నారు. కొందరు పెద్దలు వారిని వారించి, 'తప్పు అతనిని నిందించవద్దు. ఇందులో అతని దోషమేమీ లేదు. గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు, అని మందలించారు. భాస్కరుడు శ్రీగురుపాదాలను పూజించి, ఆయనకు హారతి ఇచ్చి విస్తళ్ళు వేసాడు. అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ కోరాడు. అంతట శ్రీ గురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి, దానిని వంటకాలపై కప్పమని  ఆదేశించారు. అతడలా చేయగానే, శ్రీ గురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి, వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు. వెంటనే భాస్కరశర్మ, మరికొంతమంది ఆ వస్త్రం క్రింద నుండి పళ్ళాలతో వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు. నెయ్యి కూడా ధారలుగా వడ్డీస్తూనేవున్నారు. అది చూచి భక్తులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు మొదట శ్రీగురుడు, తర్వాత మిగిలినవారూ ఆపోసనం తీసుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు. భాస్కరశర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్లి, నెమ్మదిగా కూర్చుని కావలసినవి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు. భోజనాలయ్యాక, అందరికీ తాంబూలాలిచ్చి, స్త్రీలకు,  పిల్లలకు, అన్ని వర్ణాలవారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు. చివరకు ఊరిలో విచారించి, భోజనం చేయనివారు ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక, శ్రీ గురుని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురు ప్రసాదం స్వీకరించాడు. అప్పుడతడు వెళ్లిచూచి అతడు వండిన వంటకమంతా అలానే ఉన్నదని స్వామికి మనవి చేశాడు. దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు. కొద్దిపాటి అన్నంతోనే వేలాదిమందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురుమహిమ అందరికీ తెలిసింది. శ్రీ గురుడు సాక్షాత్తూ అన్నపూర్ణేశ్వరుడని, వారి అనుగ్రహానికి పాత్రులైనవారికి ఎట్టి కొరతా ఉండదని అందరూ కీర్తించారు. అప్పుడు శ్రీ గురుడు భాస్కరశర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు. శ్రీ గురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమ్రోగింది."
                           

ముప్పై ఎనిమిదవ అధ్యాయం  సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

*** సోమవారం పారాయణ సమాప్తము ***


Tuesday, May 26, 2020

గురు చరిత్ర అధ్యాయము -37


అధ్యాయము  -37




                               
శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 



                         సిద్ధయోగి ఇలా చెప్పారు: "నామధారకా! శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు: 'మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతి రోజు తప్పకుండా భగవంతుడిని పూజించాలి. అందుకవకాశం లేకపోతే ఉదయం షోడశోపచారపూజ,  మధ్యాహ్నం పంచోపచారపూజ, సాయంత్రం నీరాజనమూ అయినా సమర్పించాలి. అందుకోసం ప్రతివారూ తమ ఇంట మంచిగంధము,  నెయ్యి,  జింక చర్మమూ ఉంచుకోవాలి. మానవ జన్మ లభించికూడా భగవంతుని పూజించినవారికి నరకము ప్రాప్తిస్తుంది. అటు తర్వాత కూడా మానవజన్మ రావడం కష్టం. అన్నింటిలోకి గురుపూజ శ్రేష్టమైనది. అందువలన త్రిమూర్తులూ సంతోషిస్తారు. కానీ కలియుగంలో మానవులకు గురువుయందు ఆయన భగవంతుడనే భావం కలగడం కష్టం. అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగము రూపాలు ధరించాడు. కనుక వాటిని పూజించడంవలన సర్వ పాపాలు నశిస్తాయి. అగ్ని, జలము,  సూర్యుడు, గోవు,  సద్బ్రాహ్మణుడు - వీటిలో భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు. అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్ఠం. మధ్యములకు మండలంలో పూజ, అధములకు విగ్రహారాధనము  అవసరం. భక్తితో పూజించగలిగితే రాయి, చెక్క గూడా  దేవుడై అభీష్టాలు  ప్రసాదించగలవు.                   


                          పీటమీద కూర్చుని శ్రద్ధగా సంకల్పము,  ప్రాణాయామము చేసి పూజాద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకుని వాటిని ప్రోక్షించాలి. తర్వాత, ఎదుట సింహాసనం మీద ఇష్ట దేవతా విగ్రహం ఉంచి, దానికి కుడి వైపున శంఖము,  ఎడమ వైపున గంట వుంచి,  దేవుని మీదనున్న నిర్మాల్యం తొలగించి,  దీపం వెలిగించాలి. మొదట గణపతిని పూజించి,  గురువును స్మరించి,  తర్వాత పీఠాన్ని,  ద్వారపాలకులను పూజించాలి. తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి,  దానినే  మన ఎదుటనున్న విగ్రహంలోకి ఆహ్వానించాలి,  సాక్షాతూ భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తించుకోవాలి. ఆయనకు పదహారు ఉపచారాలతో పూజచేయాలి. పూజకు తెల్లనిపువ్వులు శ్రేష్టం. పసుపు,  ఎరుపు రంగుగల పువ్వులు మధ్యమం. నల్లనివి ఇతర రంగు రంగుల పూలు అధమం.               


                                      ఉదయమే "అపవిత్రః పవిత్రోవా" అనే శ్లోకం చదువుకుని గురువును,  కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు. అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి,  ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారమూ చేయాలి. తల్లిదండ్రులు,  గురువులు, సద్బ్రహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి.                           

                        తల్లిదండ్రులు,  పూజ్యులు,  పెద్దలనూ చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి,  వారి పాదాలకు నమస్కరించాలి.  గురువు యొక్క కుడిపాదాన్ని మన కుడి చేతితోను,  వారి యొక్క ఎడమపాదాన్ని ఎడమచేతితోనూ స్పృశించి, సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత వారి యొక్క మోకాలు నుండి పాదం వరకు స్పృశించాలి. తల్లి,  తండ్రి,  గురువు,  పోషకుడు,  భయహర్త,  అన్నదాత, సవతితల్లి,  పురోహితుడు,  పెద్దన్న,  తల్లిదండ్రుల యొక్క సోదరులు,  జ్ఞానవృద్ధులు- వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి. అజ్ఞానులు,  తనకంటే చిన్నవారు,  స్నానం చేస్తున్నవారు, సమిధలు మొ||గు పూజాద్రవ్యాలు తెస్తున్నవారు,  హోమం చేస్తున్నవారు,  ధనగర్వులు, కోపించినవారు,  మూర్ఖులు, శవము - వీరికి నమస్కరించకూడదు. ఒకచేత్తో ఎవరికీ, ఎప్పుడూ నమస్కరించకూడదు.                                                       


                             గృహస్తుల ఇండ్లల్లో- కత్తి,  తిరుగలి,  రోకలి,  నిప్పు,  నీరు,  చీపురు - వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు,  పితరులకు,  సర్వజీవులకు,  ఋషులకు,  అతిథులకు అర్పించి,  మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి. దీనిని వైశ్వదేవమంటారు. అతిధులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి. కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే. అతిధికి కాళ్ళు కడిగితే పితృదేవతలు,  భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి,  భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి - వైశ్వదేవము,  నైవేద్యము అవ్వకున్నా  తప్పకుండా భిక్ష ఇవ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి,  దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి. పతితుల పంక్తిన భోజనం చేయకూడదు. మొదట కుడిప్రక్కన నేలమీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నముంచిన తరువాత భోజనం చేయాలి. తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము,  తాను తినే అన్నం కూడా భగవంతుని రూపాలన్న  భావంతో భోజనం చేయాలి. కుక్కను,  రజస్వలను,  యెట్టి  ధర్మమూ  పాటించనివాడినీ  చూస్తూ భోజనం చేయకూడదు. భోజనమయ్యాక అగస్త్యమహర్షిని,  కుంభకర్ణుణ్ణి,  బడబాగ్నినీ  స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. సాయంకాలం పురాణాలు,  సద్గ్రందాలు  పెద్దలవలన వినాలి.


                             సూర్యాస్తమయమప్పుడు సంధ్యావందనము,  హోమముచేసి,  గురువుకు నమస్కరించాలి. రాత్రి తేలికగా భోజనం చేసి,  కొంతసేపు సద్గ్రందాలుచదువుకొని,  తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతికోసం అని సమర్పించి,  నమస్కరించాలి. ఉత్తరానికి తలపెట్టుకుని నిద్రించ గూడదు.  ఇక నుండి నీవిటువంటి ధర్మాలన్నీ  ఆచరిస్తూ,  ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో! అందువలన ఇహంలోనూ,  పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది' అని శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ  ఇంటికి వెళ్ళిపోయారు."                      


ముప్పై ఏడవ అధ్యాయము సమాప్తము

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Monday, May 25, 2020

గురు చరిత్ర అధ్యాయము -36

***సోమవారం పారాయణ ప్రారంభము ***

అధ్యాయము  -36




                               

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                            శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 



                            నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, "స్వామీ, అజ్ఞానమనే గాఢనిద్రలో మునిగివున్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేలుకొలిపారు. దయతో అటుపై వృత్తాంతం తెల్పి, ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి" అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషించి, ఇలా చెప్పసాగారు: "నాయనా, శ్రీ గురులీలలు ఎన్నని చెప్పగలను?  కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను,  శ్రద్ధగా విను.                 


                గంధర్వ పురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు గాని, ఎవరి ఇంటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ, తనకున్న దాంట్లోనే అతిధులను సేవిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో శ్రీ గురు నీ మహిమ వలన అచ్చటికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లే వాడు కాదు. ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులు అందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లడానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్లి భోజనము, దక్షిణలు, కొత్త వస్త్రాలు, దానము తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటివలే ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో తననొక్కదానన్నా పంపమని,లేకపోతే అతనిని గూడా రమ్మనీ పట్టుబట్టింది !అతడు, 'నేను రాను, నీకంత ఆశవుంటే నీవు వెళ్ళవచ్చు' అన్నాడు. అప్పుడామె ఆ శ్రీమంతునితో, 'నేను ఒక్కదాన్నైనా భోజనానికి రావచ్చా? 'అనడిగింది. అతడు, దంపతులే రావాలన్నాడు. నిరాశ చెంది, తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్లి తన బాధనంతా వెళ్లబోసుకుని, తన భర్తకూడా ఆరోజు సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది. అందుకు శ్రీనృసింహసరస్వతి నవ్వి,  ఆమె భర్తను పిలిపించి, 'ద్విజోత్తమా, నామాటవిని ఈరోజుకు నీవుసమారాధనకు వెళ్ళు,  భార్య యొక్క కోరిక తీర్చడం భర్తయొక్క ధర్మం' అని హితం చెప్పారు. ఆ విప్రుడు, 'స్వామి మీ ఆజ్ఞానుసారం నా  నియమం విడిచి నేడు సంతర్పణకు వెళ్తాను. గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా? అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు.


                 ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రంవద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన  భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్ళలోనూ,  మరికొందరి విస్తళ్ళలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా, నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరివచ్చి,  అన్నపురాశిని ముట్టుకున్నది. వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూచి,  వెంటనే కోపంతో విస్తరిముందు నుండి లేచి,  అందరితో ఆ విషయం చెప్పింది. ఆమె భర్త తల బాదుకుని,  'బుద్ధిలేనిదానా! నీ వలన ఈ రోజు నా కర్మ ఇలా కాలింది!' అని చెప్పి,  విస్తరిముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమె కేసి చూస్తూ, 'ఏమమ్మా!పరాన్నసుఖం అనుభవించావా? నీ కోర్కె   నెరవేరిందా?' అని అడిగి, నవ్వారు.  ఆమె సిగ్గుతో తలవంచుకొని,  'స్వామి! నా బుద్ధిహీనత వలన మావారిని  కూడా ఈ కుక్క కూటికి బలవంతాన  తీసుకుపోయాను. నా తప్పు  ఎలాగైనా మీరే సవరించాలి' అని వేడుకొన్నది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగం  అయినందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీ గురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పారు: 'పోనీలే,  ఏమైతేనేమి?  నేటితో నీ భార్య మనసు కుదుట పడ్డ ది కదా? ఆమె ఇంక ఎన్నడు నిన్నలా వేధించదు.  ఇంతమాత్రానికే నీకెట్టి  దోషమూ  రాదు. నీకు నియమభంగమూ  కాదు. ఎప్పుడైనా దేవ, పితృకార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్టానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్లినందువలన ఎట్టి  దోషమూ  ఉండదు' అని చెప్పారు. 'స్వామి,  ఎలాంటి భోజనం చేయవచ్చు,  ఎలాంటిది చేయకూడదో వివరించండి' అని కోరాడు. శ్రీ గురుడు ఇలా చెప్పారు:                                       

                 'గురువులు,  మేనమామలు,  ఆచారవంతులైన వేదవిదులు,  అత్తమామలు,  తోబుట్టువులూ  పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునే వాడు భార్యాబిడ్డలను ఏడిపించి,  పేరు కోసం దానాలు  చేసేవాడు,  పొగరుబోతు,తగాదాలకోరు,  వైశ్వదేవం చేయనివాడు డబ్బుకాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు, క్రోదవంతుడు,  భార్యను విడిచిపెట్టినవాడు,  క్రూరుడు,  పిసినారి,  స్త్రీ లోలుడు,  దురాచారి,  దొంగ, జూదరి,  స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు,  భగవన్నామస్మరణ పట్ల శ్రద్దాభక్తులు లేనివాడు,  కనీసం సంధ్యావందనమైనా చేయని వాడు,  డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు,  విశ్వాసఘాతకుడు,  పక్షపాతంతో అన్యాయం పలికేవారు,  స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు,  బ్రాహ్మణులను,  గురువులను,  సాధువులను,  తన ఇంటి భోజనాన్ని నిందించేవారు,  తన ఇంటి కులదేవతను విడిచినవారు,  దురాశాపరులు,  భగవంతునికి నివేదించకుండా  భోజనం చేసేవారు- ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులు అవుతారు.                                         


                కూతురును,  అల్లుణ్ణి  బాదించేవారికి మరుజన్మలో బిడ్డలు కలుగరు. కేవలం అద్వైతం చెప్పి  దేవపూజ చెయ్యనివాడు,  పొట్టకూటికోసం కపటంగా  ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరుజన్మలో గ్రుడ్డితనము, అల్పాయుష్షు,  లేక చెవుడు కలుగుతాయి. నిత్యమూ  ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారి  పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. పూర్ణిమ,  అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే మాస మార్జించిన పుణ్యఫలం నశిస్తుంది. సాటివారికి కర్మానుష్టానంలో  లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అలా చేసిన దోషం గాయత్రీ జపంతో తొలుగుతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు. మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు. గోవు,  భూమి,  బంగారం మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు కానీ,  గ్రహణ సమయంలోనూ, సూతకమప్పుడు,  పుణ్యతీర్థాలలోనూ దానాలుతీసుకుంటే దోషంవస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మమాచరించే వారికి దైన్యమెన్నటికీరాదు. దేవతలు,  సిద్ధులు,  కామదేనువూ  కూడా వారిని సేవిస్తుంటాయి.      


                                  అప్పుడా విప్రుడు  నమస్కరించి,  'స్వామి,  స్వధర్మం అంటే ఎలాటిదో కొంచెం వివరించండి' అని ప్రార్థించాడు. స్వామి ఇలా చెప్పారు: 'నాయనా,  పూర్వము ఒకప్పుడు నైమిశారణ్యంలో పరాశరమహర్షిని మునులిలా  కోరారు: "మునీంద్రా, స్వధర్మానుష్టానంలో మాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము,  మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోగూడదంటారు. కనుక దయతో మాకవి వివరించండి". అప్పుడా మహర్షి ఇలా చెప్పారు: "ఋషులారా, సదాచారం వలన సర్వమూ సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మణుని ముహూర్తంలో నిద్రలేచి,  భక్తితో త్రిమూర్తులను,  నవగ్రహాలు, సనకాది సిద్ధులను,  పితృదేవతలను,  సప్త సముద్రాలు, చతుర్దశ భువనాలు,  సప్తద్వీపాలు,  సప్త ఋషులను మొదట స్మరించాలి. అప్పుడు గోవుకు మ్రొక్కి,  ఆచమనం చేశాకనే  కాలకృత్యాలు తీర్చుకొవాలి. స్నానము,  భోజనాలకు ముందు,  తరువాత కూడా కూర్చుని ఆచమనం చేయాలి. చూడకూడనివి చూచినప్పుడు,  మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు,  వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు మీరు లేకుంటే కుడి చెవును తాకాలి. కారణం, అందులో అగ్ని,  జలము,  వరుణుడు,  సూర్యుడు,  వాయువు మొ||గా గల సకల దేవతలు ఉంటారు. తర్వాత మానసిక స్నానం తో పరిశుద్ధుడై సూర్యోదయం వరకూ గాయత్రీ తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా  చదువుకోవచ్చు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరుబయట దేవాలయాలు,  పవిత్రమైన చెట్లు లేని చోట, బాటకు,  నీరుకూ దూరంగాను,  ఆకులూ - గడ్డీ లేని చోట మలవిసర్జన చేయాలి. ఆ సమయంలో జందెము వేరుగా వేసుకుని,  అంగవస్త్రం తలకు చుట్టుకుని ఉండాలి. దిక్కులకేసి, ఆకాశంకేసి చూడకూడదు. పగటివేళ ఉత్తర దిక్కుకు, రాత్రివేళ దక్షిణ దిక్కుకూ  తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కుల దేవతను స్మరించాలి'.                                  

         ఇలా శ్రీ గురు ఆచారకాండ  గురించి ఇంకా ఎన్నో అంశాలు బోధించారు."


 ముప్పై ఆరవ అధ్యాయం సమాప్తము.



శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


Sunday, May 24, 2020

గురు చరిత్ర అధ్యాయము -35


అధ్యాయము  -35




                               

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 




కథారంభము 


                               సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు: "సావిత్రి శ్రీగురుని పాదాలకు మ్రొక్కి 'స్వామీ! నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకొక మంత్రం ఉపదేశించి అనుగ్రహించండి' అని వేడుకొన్నది. శ్రీ గురుడు 'అమ్మా,  స్త్రీలకు భర్తను సేవించడంకంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు పూర్వం దేవాసుర యుద్ధంలో,  చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృతసంజీవిని మంత్రంతో బ్రతికించి, యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి, నందిని పంపి, ధ్యాననిమగ్నుడైయున్న  శుక్రాచార్యుని తెప్పించి అతనిని తన కడుపులో బంధించాడు. ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతోపాటు బయటకొచ్చి,  మరలా  యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు. ఏ మంత్రమైనా  స్త్రీకి ఉపదేశం ఇస్తే నిర్వీర్యం అవుతుందని,  అందులో మృతసంజీవనీ మంత్రం మూడవ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు, బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు.                                         


                            బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. కచుడు వెళ్లి శుక్రాచార్యునికి నమస్కారం చేసి, 'అయ్యా, నేనొక విప్ర  కుమారుడను. అపారమైన మీ యశస్సు విని,  విద్యార్థినై  మీ వద్దకు వచ్చాను. నన్ను స్వీకరించండి' అన్నాడు. శుక్రుని కుమార్తె,  దేవయాని అతనిని చూచి మోహించి,  తన తండ్రిని అందుకు ఒప్పించింది. కానీ రాక్షసులు కొద్ది కాలానికి  కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకొన్నారు గాని,  శుక్రాచార్యునికి చెప్ప  సాహసించలేదు. ఒకనాడు కచుడు సమిధలు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతనిని రహస్యంగా అక్కడే చంపేశారు. దేవయాని మొరపెట్టుకొనగా శుక్రుడు తన దివ్యదృష్టితో తెలుసుకొని,  మృతసంజీవనీ మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు. రాక్షసులు మరొక్కసారి అతనిని చంపి దహనం చేసి ఆ బూడిదను నలుదిక్కులకూ విరజిమ్మేశారు. కాని శుక్రుడు మరల అతనిని బ్రతికించాడు. రాక్షసులు అతనిని మళ్లీ చంపి బస్మం చేసి,  నీటిలో కలిపి శుక్రునిచేత త్రాగించారు. ఈసారి  దేవయాని మొరపెట్టుకొన్నప్పుడు,  శుక్రాచార్యుడు తన యోగదృష్టితో జరిగినది తెలుసుకుని ఆమెతో అన్నాడు, "అమ్మ ఈ రాక్షసులు అతనిని నాకడుపులోకి పంపేశారు. ఇప్పుడు కచుణ్ణి బ్రతికిస్తే, నేను చనిపోవలసింది వస్తుంది." అప్పుడామె, "తండ్రి! నేను అతనిని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను.  అతడు లేక నేను బ్రతుకలేను" అన్నది. ఆ రాక్షసగురువు, "ఈ మంత్రం నాకు ఒక్కడికే తెలుసు,  ఇతరులకు చెప్పకూడదు"అన్నాడు. ఆమె,  "తండ్రి, నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు. కచుడు బ్రతికి బయటకు రాగానే మరల నిన్ను కూడా బ్రతికిస్తాను" అన్నది. "అమ్మా,  స్త్రీలకు మంత్రజపం తగదు. వారికి భర్త సేవయే విధించబడింది. స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమౌతుంది" అన్నాడు శుక్రుడు. దేవయాని అలిగి,  "అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి. కచుణ్ణి  విడిచి జీవించలేని నేనే మరణిస్తాను" అని చెప్పి మూర్ఛపోయింది. వేరే దారిలేక,  ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొలిపి,  మంత్రం ఉపదేశించి, తర్వాత ఆ మంత్రంతో కచుణ్ణి  బ్రతికించాడు. అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే,  దేవయాని మూడుసార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు, కచుడు గూడ ఆ మంత్రం  విన్నాడు.                                    


                             స్త్రీకి ఉపదేశించడం  వలన,  మూడవవాడుగా కచుడు వినిన  కారణంగానూ  ఆ మంత్రం నష్టమైంది.అలా  నిర్ధారణ చేసుకుని కచుడు,  శుక్రాచార్యుడికి నమస్కరించి,  "అయ్యా,  మీ  కృపవలన విద్యలన్నీ  నేర్చుకున్నాను. నా అభీష్టం నెరవేరింది. ఇక్కడుంటే నన్నీరాక్షసులు  బ్రతుకనివ్వరు. కనుక నాకు సెలవిప్పించండి" అన్నాడు. అది విని దేవయాని ఏడుస్తూ,  "నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను. మూడుసార్లు నీకు ప్రాణం ఇప్పించాను.కనుక  నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చు" అని పట్టుబట్టింది. కచుడు,  నీవు గురుపుత్రివి  గనుక నాకు సోదరివి. ప్రాణదానం చేసావు గనుక తల్లివి. నిన్ను వివాహమాడదలచడం  మహాపాపం. కనుక నన్ను వేళ్ళనివ్వు" అని ప్రార్థించాడు.  కానీ ఆమె కామవశయై, "కృతజ్ఞుడా, నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక!" అని శపించింది. కచుడు ఆమెను అసహ్యించుకొని,  తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు. నాటినుండి యుద్ధంలో దేవతలచేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు. ఇది తెలిసిన వారెవరూ స్త్రీకి  మంత్రోపదేశం చేయరు. కనుక సావిత్రీ, నీకేదైనా వ్రతం చెబుతాను, చేసుకో!" అన్నారు. సావిత్రి స్వామికి నమస్కరించి,  'స్వామి! మీ పాదసేవకు మించిన వ్రతమేమున్నది?  అయినప్పటికీ,  మీ ఆదేశమే నాకు వేదవాక్కు, మీకు నచ్చిన వ్రతం సెలవియ్యండి' అన్నది. శ్రీ గురుడు ఇలా చెప్పారు: 'అందరూ ఆచరించుకోడానికి అనువైనది ఉత్తమమైన సోమవారవ్రతం. దాని వెనుక సూత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించాడు. సోమవారంనాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ వ్రత మహిమ తెల్పే ఐతిహ్యము ఒకటి  చెబుతాను:           


                                        ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు. అతడు సంతానం కోసం శివుని పూజించగా,  ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు. దైవజ్ఞులు ఆమె జాతకం చూచి,  ఆమె చిరకాలం సుమంగళిగా,  సుఖంగా జీవించగలదని చెప్పారు. కానీ కొంత కాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూచి,  14వ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు. ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి,  సీమంతిని ఒకనాడు యజ్ఞవల్క్యమహర్షి భార్య, మహాపతివ్రత అయిన మైత్రేయిని  దర్శించి నమస్కరించి, తన దురదృష్టానికి నివారణ తెల్పమని ప్రార్ధించింది. అప్పుడు మైత్రేయి, "అమ్మాయి,  ప్రతి సోమవారమూ  భక్తితో శివపార్వతులను పూజించు.  అభిషేకము వలన పాపం నశిస్తుంది. పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము, గంధ  పుష్పాక్షతలు సమర్పించినందువల్ల సౌభాగ్యము, దూపమార్పించడం వలన సౌగంద్యము, దీపదానం వలన కాంతిమత్వము, నైవేద్యం వలన సకల భోగాలు, తాంబూల సమర్పణ వలన నాల్గు పురుషార్థాలూ చేకూరుతాయి. జపం వలన అష్టైశ్వర్యాలు, హోమం చేసినందువలన సిరిసంపదలు, స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వ దేవతా సంతృప్తి కలుగుతాయి. కనుక ఆ రీతిన ఈ వ్రతమాచరించు" అని చెప్పింది.


                సీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి, ఎంతో శ్రద్ధతో ఆ వ్రత మాచరించింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే, ఇంద్రసేన మహీపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికిచ్చి  వివాహం చేశారు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని  వెళ్లి, ప్రమాదవశాత్తు కాళింది నదిలో మునిగిపోయాడు. ఎందరు ఈతగాళ్లు వెతికినా దొరకలేదు. అది తెలిసి 14 సంవత్సరాలు నిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైనది, కానీ రాజు ఆమెను వారించాడు. బంధువులందరూ నది ఒడ్డుకు చేరి, దుఃఖించారు. సీమంతిని తాను వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించనందుకు శివపార్వతులకు మొరపెట్టుకొని, సహగమనం చేయడానికి సిద్ధమైంది. అప్పుడు పురోహితులు, "శవం కనిపించకుండా ఉంటే సహగమనం చేయకూడదు. ఇంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము? కనుక నీవు వేచి ఉండాలి" అని చెప్పారు. పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యం అపహరించి, ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు. చిత్రవర్మ, శాస్త్రానుసారం ఒక సంవత్సరము వేచిచూసిన తర్వాత తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు. సీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేకదీక్షతో ఆ వ్రతం ఆచరిస్తూనే ఉన్నది.    


                                      నీట మునిగి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి, పాతాళలోకంలో మహోజ్వలమైన పట్టణంలో మణులతో వెలిగిపోతున్న పడగలుగల తమ రాజయిన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్లారు. అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు. తక్షకుడు అతని వృత్తాంతమెరిగి, సంతోషించి, సకల భోగాలూ అనుభవిస్తూ, తమ లోకంలోనే ఉండిపొమ్మని అతనిని ఆహ్వానించాడు. చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి, తన తల్లిదండ్రులు, తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని, కనుక తాను వెంటనే వెళ్లిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం త్రాగించి, అతని భార్యకోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతనిని సత్కరించి,తనను  ఎప్పుడు స్మరించినా ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు. తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వంమీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు. అమృతం త్రాగడం వలన దివ్యవర్ఛస్సుతో వెలిగిపోతూ, దివ్యాశ్వం  పై నీటినుండి పైకి వచ్చిన చంద్రాంగదుని జూచి సీమంతిని ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారం. సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది. కానీ ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రము,నొసట కుంకుమ కనిపించక పోయేసరికి, ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక, చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారు రూపం ధరించి రాజకుమార్తెను విచారించి, ' నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు' అని ఆమెతో చెప్పి. మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్లాడు. వారి రాజ్యం అపహరించిన దాయాదులకు, తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ, రాజ్యం తిరిగి అప్పగించమని, లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలననీ  హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు. నదిలోపడి మరణించిన చంద్రాంగదుడు  తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి, రాజ్యం అతనికి తిరిగి అప్పగించి,  క్షమాపణ కోరారు. చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ, తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తనవారు ఎంత దుఃఖించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకొని, తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పుకున్నాడు. తిరిగి తమ కొడుకును,  రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి, ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. '                                  


                                  శ్రీ గురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి, 'స్వామీ, పరమ పవిత్రము, శ్రేయోదాయకమూ అయిన మీ పాదసేవ మాకు చాలదా? త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా? వేరొక వ్రతంఎందుకు? ' అన్నాడు. శ్రీ గురుడు, ' ఇది మా ఆజ్ఞ! ఈ వ్రతం చేస్తే గాని మీ సేవ మాకుఅందదు. కనుక ఈ వ్రతం చేసుకోండి!' అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు. ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురుసన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు,  అతని భార్య వాళ్లను చూడడానికి అక్కడకు చేరుకున్నారు. వారు శ్రీగురుని దర్శించి, జరిగినదంతా తెలుసుకుని, వేయిమంది బ్రాహ్మణులకు సమారాధన చేసి, కొడుకు-కోడళ్లనూ తీసుకొని స్వస్థానం చేరుకున్నారు. సావిత్రీ  - దత్తాత్రేయులు శ్రీ గురుడు చెప్పిన వ్రతమాచరించి, కాలాంతరంలో పూర్ణాయువులైన కొడుకులను కన్నారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి, శ్రీ గురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు ప్రాకిపోయింది.                           

ముప్పైఐదవ అధ్యాయం సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః  
 

*** ఆదివారం పారాయణ సమాప్తము ***


నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...