అధ్యాయము -37
శ్రీ గణేశాయనమః
శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః
కథారంభము
సిద్ధయోగి ఇలా చెప్పారు: "నామధారకా! శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు: 'మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతి రోజు తప్పకుండా భగవంతుడిని పూజించాలి. అందుకవకాశం లేకపోతే ఉదయం షోడశోపచారపూజ, మధ్యాహ్నం పంచోపచారపూజ, సాయంత్రం నీరాజనమూ అయినా సమర్పించాలి. అందుకోసం ప్రతివారూ తమ ఇంట మంచిగంధము, నెయ్యి, జింక చర్మమూ ఉంచుకోవాలి. మానవ జన్మ లభించికూడా భగవంతుని పూజించినవారికి నరకము ప్రాప్తిస్తుంది. అటు తర్వాత కూడా మానవజన్మ రావడం కష్టం. అన్నింటిలోకి గురుపూజ శ్రేష్టమైనది. అందువలన త్రిమూర్తులూ సంతోషిస్తారు. కానీ కలియుగంలో మానవులకు గురువుయందు ఆయన భగవంతుడనే భావం కలగడం కష్టం. అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగము రూపాలు ధరించాడు. కనుక వాటిని పూజించడంవలన సర్వ పాపాలు నశిస్తాయి. అగ్ని, జలము, సూర్యుడు, గోవు, సద్బ్రాహ్మణుడు - వీటిలో భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు. అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్ఠం. మధ్యములకు మండలంలో పూజ, అధములకు విగ్రహారాధనము అవసరం. భక్తితో పూజించగలిగితే రాయి, చెక్క గూడా దేవుడై అభీష్టాలు ప్రసాదించగలవు.
పీటమీద కూర్చుని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయామము చేసి పూజాద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకుని వాటిని ప్రోక్షించాలి. తర్వాత, ఎదుట సింహాసనం మీద ఇష్ట దేవతా విగ్రహం ఉంచి, దానికి కుడి వైపున శంఖము, ఎడమ వైపున గంట వుంచి, దేవుని మీదనున్న నిర్మాల్యం తొలగించి, దీపం వెలిగించాలి. మొదట గణపతిని పూజించి, గురువును స్మరించి, తర్వాత పీఠాన్ని, ద్వారపాలకులను పూజించాలి. తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి, దానినే మన ఎదుటనున్న విగ్రహంలోకి ఆహ్వానించాలి, సాక్షాతూ భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తించుకోవాలి. ఆయనకు పదహారు ఉపచారాలతో పూజచేయాలి. పూజకు తెల్లనిపువ్వులు శ్రేష్టం. పసుపు, ఎరుపు రంగుగల పువ్వులు మధ్యమం. నల్లనివి ఇతర రంగు రంగుల పూలు అధమం.
ఉదయమే "అపవిత్రః పవిత్రోవా" అనే శ్లోకం చదువుకుని గురువును, కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు. అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి, ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారమూ చేయాలి. తల్లిదండ్రులు, గురువులు, సద్బ్రహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి.
తల్లిదండ్రులు, పూజ్యులు, పెద్దలనూ చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి, వారి పాదాలకు నమస్కరించాలి. గురువు యొక్క కుడిపాదాన్ని మన కుడి చేతితోను, వారి యొక్క ఎడమపాదాన్ని ఎడమచేతితోనూ స్పృశించి, సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత వారి యొక్క మోకాలు నుండి పాదం వరకు స్పృశించాలి. తల్లి, తండ్రి, గురువు, పోషకుడు, భయహర్త, అన్నదాత, సవతితల్లి, పురోహితుడు, పెద్దన్న, తల్లిదండ్రుల యొక్క సోదరులు, జ్ఞానవృద్ధులు- వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి. అజ్ఞానులు, తనకంటే చిన్నవారు, స్నానం చేస్తున్నవారు, సమిధలు మొ||గు పూజాద్రవ్యాలు తెస్తున్నవారు, హోమం చేస్తున్నవారు, ధనగర్వులు, కోపించినవారు, మూర్ఖులు, శవము - వీరికి నమస్కరించకూడదు. ఒకచేత్తో ఎవరికీ, ఎప్పుడూ నమస్కరించకూడదు.
గృహస్తుల ఇండ్లల్లో- కత్తి, తిరుగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు - వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు అర్పించి, మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి. దీనిని వైశ్వదేవమంటారు. అతిధులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి. కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే. అతిధికి కాళ్ళు కడిగితే పితృదేవతలు, భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి, భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి - వైశ్వదేవము, నైవేద్యము అవ్వకున్నా తప్పకుండా భిక్ష ఇవ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి, దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి. పతితుల పంక్తిన భోజనం చేయకూడదు. మొదట కుడిప్రక్కన నేలమీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నముంచిన తరువాత భోజనం చేయాలి. తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము, తాను తినే అన్నం కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనం చేయాలి. కుక్కను, రజస్వలను, యెట్టి ధర్మమూ పాటించనివాడినీ చూస్తూ భోజనం చేయకూడదు. భోజనమయ్యాక అగస్త్యమహర్షిని, కుంభకర్ణుణ్ణి, బడబాగ్నినీ స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. సాయంకాలం పురాణాలు, సద్గ్రందాలు పెద్దలవలన వినాలి.
సూర్యాస్తమయమప్పుడు సంధ్యావందనము, హోమముచేసి, గురువుకు నమస్కరించాలి. రాత్రి తేలికగా భోజనం చేసి, కొంతసేపు సద్గ్రందాలుచదువుకొని, తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతికోసం అని సమర్పించి, నమస్కరించాలి. ఉత్తరానికి తలపెట్టుకుని నిద్రించ గూడదు. ఇక నుండి నీవిటువంటి ధర్మాలన్నీ ఆచరిస్తూ, ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో! అందువలన ఇహంలోనూ, పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది' అని శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ ఇంటికి వెళ్ళిపోయారు."
ముప్పై ఏడవ అధ్యాయము సమాప్తము
శ్రీ దత్తాయ గురవేనమః
శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః - శ్రీ నృసింహ సరస్వత్యైనమః
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box