Thursday, April 30, 2020

గురు చరిత్ర అధ్యాయము -16




అధ్యాయము  -16




                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                                                                                  

శ్రీ గురుభ్యోనమః 




కథారంభము 


                       నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, " మహాత్మా, అప్పుడు శ్రీగురుని ఆజ్ఞననుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవ్వరు ? అటుపై ఏమి జరిగింది? " అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు : " నామధరకా ! నీవు గురు భక్తులలో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవరూ  కోరనందువలన నా మనస్సు నివురుగప్పినట్లయింది. నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతుండడం వలన ఆయన కథలు గుర్తుతెచ్చుకున్నకొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతున్నది. ఆనంద పారవశ్యం కలుగుతున్నది. నీవు కూడ నాకెంతో ఉపకారం చేసావు. నీవు వయసులో చిన్నవాడైనా, శ్రీ గురుని అనుగ్రహము వలన లోకశ్రేష్ఠుడవవుతావు. నీ వంశమంతా పుత్ర,  పౌత్ర,  ధన,  ధాన్యాలతోనూ,  సుఖశాంతులతోనూ, విలసిల్లుగాక ! శ్రీ గురుని చరిత్ర చెబుతాను. అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడం లో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను. శ్రద్ధగా విను : శ్రీ గురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్లారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటినుండి ఒక సంవత్సరముపాటు శ్రీ గురుడు వైద్యనాధంలోనే  గుప్తంగా ఉండిపోయారు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, 'స్వామీ, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా గాని,  నా మనస్సు యే మాత్రమూ ప్రశాంతమవలేదు. కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనస్సు స్థిరమవకపోవడానికి కారణం ఏమిటి? మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులు. నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి. మిమ్ములను శరణు వేడుతున్నాను' అన్నాడు.        




                శ్రీ గురుడు నవ్వి, ' నాయనా, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేశావు? ' అని అడిగారు. అతడు కన్నీరు కారుస్తూ, 'స్వామీ ! మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలాకాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిరుగుతుండేవారు గాని, నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు, " నీకింకా బుద్ధి స్థిరం కాలేదు" అని చెప్పి, నాకు వేదముగాని,  శాస్త్రంగాని, భాష్యంగాని చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడాయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేసాను' అని చెప్పాడు. శ్రీ గురుడు ముక్కుమీద వేలువేసుకుని, 'అయ్యో బ్రాహ్మణుడా! ఎంతపని చేసావు? నీవు చేసిన పని ఆత్మహత్యయంతటి మహాపాపం. నిజానికి నీవే నీలో దుర్గుణాలను తెలుసుకోలేక, గురువును నిందిస్తున్నావు. నీకింక మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది? దొరికిన కామధేనువు వంటి గురువును విడిచి నీవు ఎక్కడికి పరుగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలోనూ, పరంలోనూ సుఖం ఉండదు. అతడికి జ్ఞానం ఎన్నటికీ కలుగదు; అజ్ఞానాంధకారంలో చిక్కు పడవలసిందే. గురువుని ఎలా సేవించాలి తెలిసినవాడికే  వేదవేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులూ అతనికి అధీనమవుతాయి. నీవంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకునమవుతుంది. దేవాలయంలో మలవిసర్జన చేసి, అందుకు తిట్టినవాణ్ణి  తప్పపట్టినట్లుంది నీ పని!' అన్నారు. అప్పుడా విప్రుడు  భయపడి, దుఃఖంతో స్వామి పాదాలపైబడి, ' పరమగురూ ! జ్ఞానసాగరా ! బుద్దిహీనుడై తెలియక గురు ద్రోహం చేశాను. గురువును ఎలా తెలుసుకోవాలో, సేవించాలో తెలిపి నన్నుధరించండి' అని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు. శ్రీ గురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు :"నాయనా! గురువే తల్లి,  తండ్రి. ఆయనయే బ్రహ్మ,  విష్ణు,  మహేశ్వరుల ప్రత్యక్ష రూపం. నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే. ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో, పట్టుదలతో గురువును సేవించాలి. అది తెలిపే టందుకు నీకు ఒక పురాణోపాఖ్యానం చెబుతాను విను.          




                                  ద్వాపరయుగంలో ధౌమ్యుడనే  మహర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, భైదుడు,  ఉపమన్యువు  అను ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ,  ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు. అహంకారము మొదలైన దోషాలు తొలగి, మనస్సుకు శుద్ధికి కలగడానికి వెనుకటి గురువులు శిష్యులు చేతసేవలు చేయిస్తూ ఉండేవారు. అతని సేవనుబట్టి అతని గురుభక్తిని, మనస్సుద్దినీ  నిరూపించి అనుగ్రహించేవారు. 



                          ఒకనాడు ధౌమ్యుడు, అరుణిని పిలిచి , ' నీవు మన పొలానికి వెళ్లి, చెరువు నుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరిపైరు ఎండిపోతుంది' అని చెప్పారు.అరుణి వెంటనే వెళ్ళి చెరువునుండి కాలువద్వారా నీరుపెట్టాడు. కానీ కాలువకు ఒకచోట గండిపడి నీళ్లన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి,  రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలువలేదు. అప్పుడతడు, ప్రాణం పోయినా సరే, గురువు చెప్పినది చేసితీరాలన్న నిశ్చయంతో, ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు. అప్పుడా నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటిపడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడువచ్చి, పొలం నిండుగా నీరు ఉండడం గమనించారు. కానీ శిష్యుడే కనిపించలేదు. అతడు ఏ పులి బారినైనా  పడ్డాడేమోనని అనుమానించి, ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు. అరుణి సమాధానం ఇవ్వలేక కొంచెంగా శబ్దం చేసాడు. దానిని బట్టి ధౌమ్యులవారు వచ్చి శిష్యుని లేవనెత్తి, కౌగిలించుకొని, సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు ధౌమ్యమహర్షి, ' నాయన! నీవు ఇంటికి వెళ్లి, తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు. కృతార్థుడవవుతావు' అని ఆదేశించారు. అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్లి, లోకపూజ్యుడయ్యాడు.         



                          ఒకరోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, 'నాయనా! పైరు పంటకొచ్చింది. నీవు రోజూ కావలి కాచి పైరు కోసి,  ధాన్యం ఇంటికి చేర్చు' అని చెప్పారు. బైదుడు  తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి,  పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి, పంట పక్వానికి వచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా పోయించి, ఆ సంగతి గురువుకు  చెప్పాడు. అయన  అతనికి ఒక బండి,  ఒక దున్నపోతునూ ఇచ్చి,  ధాన్యం ఇంటికి చేర్చమని  చెప్పారు. అతడా బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతును కట్టి, మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకుని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒకచోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి,  తానొక్కడే బండిని బురదలోనుండి లాగడానికి ప్రయత్నించి,  ఆ శ్రమకోర్వలేక  స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి ధౌమ్యుడు  అక్కడికి వచ్చి చూచి,  అతని గురుసేవా దీక్షకు మెచ్చి, అతని మెడనుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగిలించుకుని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు. కొద్దికాలం లోనే అతడు గూడ అరణి వలె లోకప్రసిద్ధుడయ్యాడు.   



                    ఇంకా ఉపమన్యు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు.ధౌమ్యుడు ఆలోచించి,  ఒక రోజు అతనిని పిలిచి,  'నాయనా! నీవు గోవులను అడివికి తోలుకొని పోయి మేపుకొని వస్తూ ఉండు'అని చెప్పారు. ఉపమన్యువు  గోవులను అడవికి తీసుకువెళ్ళాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. ధౌమ్యుడది చూచి, ' నీవు ప్రతిరోజూ సూర్యాస్తమయం వరకూ గోవులను మేపాలి' అన్నారు. మరునాటి నుండి, ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి,  సంధ్య వార్చుకుని, దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇండ్లలో భిక్ష తెచ్చుకుని భోజనం చేయసాగాడు. అందువలన కొద్దికాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది. అది గమనించిన ధౌమ్యుడు,  ఒకరోజున అతనినడిగి కారణం తెలుసుకొని,'నన్ను విడిచి భోజనం చేస్తున్నావటరా? నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి,  మరల అడవికి పోయి ఆవులను మేపుకొనిరావాలి' అని ఆజ్ఞాపించారు. ఉపమన్యువు అలా చేస్తూ ఉండటం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది. అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను  గురువుకర్పించి, రెండవసారి భిక్ష తెచ్చుకుని తినసాగాడు. అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూచి ధౌమ్యుడు  కారణమడిగి తెలుసుకుని,  ఆ రెండవ  భిక్షను  కూడా తమకే  ఇవ్వమని చెప్పారు. ఉపమన్యువు  కొంచమైనా బాధపడక అలానే చేసి, ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొద్దికాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది . ఒకరోజు ధౌమ్యులవారు అందుకు కారణము అడిగి తెలుసుకుని, 'ఒరే!  పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు గూడ బుద్ధిహీనుడవవుతావు. కనుక త్రాగవద్దు' అని నిషేధించారు. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలి కావని తలచి, వాటిని ఒక దోప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది,  అతని కళ్ళు రెండూ కనిపించలేదు. తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు. 



               సూర్యాస్తమయం అయిన శిష్యుడు ఇంటికి రాకపోయేసరికి, అతనిని వెదుకుతూ ధౌమ్యులవారు అడవికి వెళ్ళారు. ఆయన కేక విని ఉపమన్యువు  బావిలోనుండే సమాధానమిచ్చాడు.  ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని, అశ్వినీ దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యువు  అలా చేయగానే అతనికి దృష్టివచ్చింది. వెంటనే అతడు బావినుండి బయటకువచ్చి గురువుకు నమస్కరించాడు. ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి, 'నాయనా! నీ కీర్తి  నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడు అనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి, నాగకుండలాలు  నీకు దక్షిణగా సమర్పించగలడు.   నీ కీర్తిని శాశ్వతమొనర్చగలడు' అని ఆశీర్వదించాడు. అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై,  ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో ధౌమ్యులవారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది.          




                        కనుక, 'నాయనా,  గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీలేదు. గురుద్రోహం వలన యిహపరాలలో  సుఖమే  ఉండదు సరిగదా,  నీ వెంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్లి నీ పూర్వ గురువునే  ఆశ్రయించి,  ఆయనను ప్రసన్నం చేసుకో! ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది'.  



                     శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, 'స్వామీ! నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో! విరిగిన నా గురువు మనస్సు  అతకడం సాధ్యంకాదు. ఇక నేను బ్రతికి ప్రయోజనమేమీ?  నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను' అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్దుడయ్యాడు. అప్పుడు శ్రీ గురుని మనస్సు కరిగి, 'నాయనా! తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ  గురువును మనసారా స్మరించు' అని చెప్పి అతనిని ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గద్గదమై, శరీరమంతా రోమాంచితమైంది. కన్నులు ఆనందభాష్పాలతో నిండాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే, వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీ గురుడు,  'నాయనా! నేను చెప్పిన గురు మహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్లు. నీవు  నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు.ఆయనే నేనని తెలుసుకో!' అన్నారు.అతడలానే  చేసి తరువాత ముక్తి పొందాడు.


                                           ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాధంలో  నివసించి, తర్వాత శ్రీ నృసింహ సరస్వతి  దేశసంచారం చేస్తూ,  కృష్ణాతీరంలో వున్న భిల్లవటీ  గ్రామంలోని భువనేశ్వరీదేవి సన్నిధి చేరి, అచట కృష్ణ-వేణి సంగమంలో పడమట తీరానవున్న ఉదుంబర  వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా  నివశించారు."               



 పదహారవ అధ్యాయం సమాప్తము.




శ్రీ దత్తాయ గురవేనమః 




శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


గురు చరిత్ర అధ్యాయము -15


అధ్యాయము  -15




                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                                                                                  

శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 




                         సిద్ధయోగి ఇలా చెప్పారు : "నాయనా! కొద్దికాలంలోనే శ్రీ  గురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి, సుదూర ప్రాంతాలనుండి గూడా ఎందరెందరో తమ కోర్కెలు నెరవేర్చుకోవడానికి ఆయనను దర్శించేవారు. వారిలో మంచివాళ్ళతో బాటు భక్తుల వేషాలలో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు. పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రిపర్వతానికి దక్షిణదిక్కునున్న కొంకణదేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు. కానీ కొందరు దురాశాపరులు  ఆయన వద్దకు వెళ్లి, తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు. ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్లకు దానమిచ్చి,  వాళ్ళ బెడదనుంచి తప్పించుకోడానికి సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు.    




                          అదే కారణంగా శ్రీగురుడు  కూడా వైద్యనాధంలో గుప్తంగా కొంతకాలం వుండదలచుకున్నారు. కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకు ఇలా సెలవిచ్చారు : 'ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి. అతడికి పగటినిద్ర తగదు. దొరికిన భిక్షాన్నం  గురువుకర్పించి ఆయన ఇచ్చినది భుజిస్తూ, విద్యావంతుడు కావాలి. చివరకు గురువుకు దక్షిణ సమర్పించి, సమావర్తన హోమం చేయాలి. అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి. పుత్రుడు యుక్తవయస్కుడయ్యాక, అతనికి సర్వస్వమూ  సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్లాలి. తర్వాత గ్రామ్య విషయాలను వదిలి, భార్యయొక్క అనుమతితో సన్యసించాలి. సన్యాసికి జపము, భిక్షాటనము, ధ్యానము, శౌచము, అర్చన ధర్మాలు. అతడు స్త్రీ కథలను వినగూడదు. వాహనము లెక్కరాదు. మంచము తాకరాదు. పగలు నిద్రింపరాదు. నిరంతరమూ  ఆత్మద్రష్టయై ఉండాలి. వెదురు,  సొరకాయ,  చెక్క,  మట్టి - వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ, దండధారియై, పగలు మాత్రమే భుజించాలి. సంవత్సరమంతా తీర్తాటనం  చేస్తూ, మూడు పగళ్ళు మించి ఏ గ్రామంలోనూ నివశించక స్థిరచిత్తుడై ఉండాలి. అలా తిరగటానికి శరీరంలో శక్తి లేకపోతె, సదా దైవాన్ని, ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివశించాలి'.   





                                        ఇలా చెప్పి, గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి, సన్యాసులైన శిష్యులకు  శ్రీగురుడు ఇలా చెప్పారు :' నాయనలారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి. మీకు మరలా  శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనమవుతుంది' అన్నారు. అప్పుడా శిష్యులు, 'స్వామీ ! సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి గదా! మిమ్ములను విడిచి మేమెక్కడికి పోగలము? దానివలన మాకు కలిగే లాభమేమున్నది? ' అన్నారు. అప్పుడు స్వామి, 'నాయనలారా! సన్యాసులమైన మనము ఐదురోజులకు మించి ఎక్కడా నిలువకూడదు. సర్వ తీర్థాలూ  దర్శించడం మన ధర్మం. దాని వలన మనస్సు స్థిరమవుతుంది. అటు తర్వాత ఒకచోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం' అని చెప్పారు. అప్పుడు శిష్యులు, 'స్వామీ ! మీ మాటయే మాకు ప్రమాణం. మేము ఏయే తీర్థాలు దర్శించాలో  సెలవియ్యండి' అని కోరారు. అప్పుడు శ్రీ గురుడు ఇలా చెప్పారు : 'నాయనలారా! తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి, గంగాతట యాత్ర చేయండి. అటు తర్వాత యమున,  సరస్వతి నదులను కూడా అలానే సేవించండి. అందువలన పితృదేవతలకు  సంతృప్తి, మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి. తర్వాత వరుణ,కుశావర్త, శతదృ, విపాశా, శరావతి, వితస్థా,అసిక్నీ, మరుధృదా, మధుమతి,పయస్విని, ఘృతవతి, రేవా, చంద్రభాగా, రేవతి,  సరయు,  గోమతి,  వేదిక,  కౌశికి, నిత్యజల,  మందాకిని, సహస్రవక్త,  పూర్ణ,  పుణ్య,  అరుణ,  బహుదా,  వైరోచని, పుష్కర, ఫల్గు, అలకనంద మొదలగు నదులలోనూ, నదీసంగమాలలోనూ స్నానం చేసి తటయాత్రలు చేయండి. అలానే శ్రీశైలము, అనంతము,  రామేశ్వరము,  సేతుబంధము,  శ్రీరంగము,  పద్మనాభము,  నైమిశారణ్యము, పురుషోత్తమము, కేదారము, మహాలయము, కోటిరుద్రము,  మాతృకేశము,కుబ్జతీర్థము, కోకాముఖి,  ప్రసాదతీర్థము,  విజయాతీర్థము, చంద్ర తీర్థము,   గోకర్ణము,  శంఖ కర్ణము అనే తీర్ధాలలో స్నానం చేయండి.        





                 అలానే అయోధ్య,  మధుర,  మాయా, కాంచీ,  ద్వారకా,  సాలగ్రామము, శబల గ్రామములు దర్శించండి. సవ్య మార్గంలో మూడుసార్లు గోదావరి తటయాత్ర చేస్తే పాపాలన్నీ నశించి, జ్ఞానం కలుగుతుంది. అలానే భీమేశ్వర,  పంజర, కుశతర్పణ, పూర్ణ,  కృష్ణవేణి,  తుంగభద్ర,  పంపా,  భీమా నదులకు తటయాత్ర చేయండి. హరిహర క్షేత్రము,  పాండురంగ క్షేత్రము,  మాతులింగము దర్శించండి. గంధర్వపురం(గాన్గాపురము) ఉత్తమమైన క్షేత్రము. అక్కడ ఎన్నో తీర్థాలున్నాయి. అచ్చట దేవతలు సులభంగా వరాలిస్తారు. అక్కడ భీమా - అమరజానదీ  సంగమమున్నది. అచ్చటి అశ్వత్థ వృక్షము సాక్షాత్తూ కల్పవృక్షమే. దానికి ఎదురుగా నృసింహ తీర్థము, దానికి తూర్పున పాపనాశ తీర్థము,  దాని పక్కనే రుద్రపాద తీర్థము, చక్ర తీర్ధము, తర్వాత కోటి తీర్థము మన్మధ తీర్థము ఉన్నాయి. అక్కడనే 'కల్లేశ్వరుడు' ఉన్నాడు. గంధర్వపురము సాటిలేని సిద్ధ భూమి గనుక, అక్కడ అనుష్టానం చేస్తే అతి త్వరగా అభీష్టాలు నెరవేరుతాయి. తుంగ- భద్ర నదుల సంగమము, మలాపహా సంగమము, నివృత్తి సంగమము దర్శించండి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినపుడు గోదావరికి, కన్యారాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానదికి, తులారాశి లోకి వచ్చినప్పుడు తుంగభద్రకు, కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మలాపహా నదికీ పుష్కరాలు వస్తాయి. అంటే గంగానది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదులలో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడం ఎంతో మంచిది. అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది.          





                       కుంభకోణము,  కన్యాకుమారి,  మత్స్యతీర్థము,  పక్షితీర్థము,  ధనుష్కోటి, కొల్హాపురము,కరవీరము, మహాబలేశ్వరము  దర్శించండి. భిల్లవటి,  వరుణా  సంగమము,  కృష్ణా తీరంలోననున్న ఋష్యాశ్రమము దర్శించండి. అమరపురం వద్దనున్న కృష్ణవేణీ,  పంచనదీ  సంగమములో మూడురోజులు స్నానము,  ఉపవాసము  చేస్తే అన్ని కోరికలూ తీరడమే గాక, పరమార్థము గూడా లభిస్తుంది. యుగాలయము, శూర్పాలయము, కపిలాశ్రమము, కేదారము,  పిఠాపురము దర్శించండి. అక్కడ శ్రీ దత్తాత్రేయస్వామి ఉన్నారు. తర్వాత మణిగిరి, ఋషభాద్రి, కళ్యాణనగరము, అహోబిలము  దర్శించండి. కర్కాటకరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటినుండి నదులు రజస్వలలు  గనుక, వాటిలో స్నానం చేయకూడదు. నదీ తీరాలలో నివసించేవారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదు. నదులకు క్రొత్తనీరు వచ్చే రోజులే రజస్వల కాలము'. అప్పుడు శిష్యులాయనకు సాష్టాంగ నమస్కారము చేసి, వారి ఆశీస్సులు పొంది, తీర్థయాత్రలకు వెళ్లారు. నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను".              





 పదిహేనవ అధ్యాయం సమాప్తము.  


శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Tuesday, April 28, 2020

గురు చరిత్ర అధ్యాయము-14



అధ్యాయము -14



                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                       

శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 


             నామధారకుడు, "స్వామీ ! అటు తర్వాత శ్రీ గురుడు యేమేమి చేసారో చెప్పండి" అన్నాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు :    

                 "భోజనాలయ్యాక సాయందేవుడు శ్రీగురుని పాదాలు ఒత్తుతూ, ' సద్గురూ ! మీ పాదసేవ వలన నా జన్మ, సత్కర్మలు సార్థకమయ్యాయి. నీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు. ధన్యుణ్ణి. మాయచేత మానవునిలా కనిపిస్తున్నారే గాని, మీరు సాక్షాత్తూ భక్తులను ఉద్దరించడానికి అవతరించిన భగవత్స్వరూపులే. మీ  మహిమ వేదాలకే  అంతుబట్టనిది. అట్టి మీకు సేవచేసే అవకాశం నాకనుగ్రహించి నా వంశాన్నే  పావనం చేశారు. కాని నాదొక విన్నపమున్నది : ప్రస్తుతము నేనొక కష్టంలో ఉన్నాను. వేరేదారిలేక, నేనొక యవనరాజు సేవలో ఉన్నాను. అతడు నరరూపరాక్షసుడే. అతడు ప్రతిసంవత్సరమూ ఒక బ్రాహ్మణుని చంపుతాడు. నన్ను బలివ్వాలని తలచి, ఇంతకు ముందే నాకు కబురు పంపాడు. నేనిప్పుడతని వద్దకు వెళ్లాలి తప్పదు. నన్ను మీరే కాపాడాలి' అన్నాడు. శ్రీ గురుడు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి, ' నాయనా! భయపడకు. ఆ యవనుడు నిన్ను ఏమీ చేయలేడు. భగవంతుడు సర్వానికీ  యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేమిక్కడే వుంటాము. దీర్ఘాయుష్మాన్ భవ!' అని పంపారు.     



                                సాయందేవుడు శ్రీ గురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. సాయందేవుడు భయంతో శ్రీగురుని ధ్యానించాడు. అంతఃపురంలోకి వెళ్ళిన యవనునికి  అంతలోనే నిష్కారణంగా భయము,  చనిపోతున్నంత బాధ కలిగి, సృహతప్పి పడిపోయాడు. అప్పుడతనికొక స్వప్నమొచ్చింది., ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి,  విపరీతమైన బాధ కలిగింది. అతనికి స్పృహ వచ్చేసరికి, తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధాకరమో తెలిసివచ్చింది. పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి, సాయందేవుని పాదాలపై పడి, ' అయ్యా! మిమ్మల్ని నేను పిలిపించలేదే! మీరు ఇంటికి వెళ్ళవచ్చు' అని, వస్త్రభూషణాలతో ఘనంగా సత్కరించి పంపాడు!  



                 సాయందేవుడు శ్రీ గురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరత్వరగా తన గ్రామం చేరి శ్రీగురుని తో జరిగిందంతా చెప్పాడు. ఆయన సంతోషించి 'నాయనా! మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము' అన్నారు. అతడు నమస్కరించి, 'స్వామీ ! నాకు మీరు ప్రసాదించిన ఈ జీవితశేషాన్ని మీ సేవకే అంకితము చేస్తాను. అనుగ్రహించండి. మీ  పాద సన్నిధి విడచి బ్రతుకలేను. నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు. నేను కూడా మీ వెంట వస్తాను' అని వేడుకున్నాడు. శ్రీ గురుడు, 'నాయనా! నాకు ఆత్మ సమర్పణం చేసుకున్నావు. నీ అభీష్టం నెరవేరుతుంది. మేము ఒక పనిమీద వెళ్తున్నాము. 16 సంవత్సరములకు మళ్ళీ మేము వచ్చి, ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము. నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకూ ఇక్కడే సుఖంగా ఉండు' అని ఆశీర్వదించి, శిష్యులతో కలసి పాదచారియై అనేక పుణ్య క్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాధం  చేరారు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు". అది విని నామధారకుడు, "స్వామీ ! అపుడు శ్రీ గురునితో అనేకమంది శిష్యులున్నారు గదా! వాళ్ళు ఎక్కడున్నారు? శ్రీ గురుడు అక్కడ గుప్తంగా వుండి ఏమిచేసారు? " అని అడిగాడు. 

పద్నాల్గవ అధ్యాయం సమాప్తము 


శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


Monday, April 27, 2020

గురు చరిత్ర అధ్యాయము -13



అధ్యాయము -13




                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                       


 శ్రీ గురుభ్యోనమః 




కథారంభము




                   శ్రీ గురుని  కథ శ్రద్ధగా విని, పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, " స్వామీ, ఈ శ్రీగురుచరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు.  నా పరిస్థితి లేత పచ్చికను చవిచూచిన ఆకలిగొన్న ఆవు వలె వున్నది. నేనెంత అల్పజ్ఞుడనో, నాకిప్పుడు తెలుస్తున్నది. అజ్ఞానం వలన బ్రష్టుడనై  నేనే వెనుక కష్టాలు కొనితెచ్చుకున్నానని ( శ్రీ గురుని పక్షాన యెట్టి లోపమూ లేదనీ) తెలుసుకున్నాను. అజ్ఞానాంధకారంలో దారి కనిపించకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురుని చూపారు. మీ రూపంలో శ్రీ గురుడే నన్ను అనుగ్రహించారు. మీరు చేసిన మేలుకు నేను ఎన్నటికీ మీ ఋణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి,  చింతామణికి,  జ్ఞానమిచ్చిన వారికీ  ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము? మీ బోధ వలన నాకు సర్వార్ధ సాధకమైన నిరంతర గురు స్మరణ కుదురుతోంది. దయతో అటు తరువాత శ్రీ గురుడు ఎక్కడకు  వెళ్లారో, ఏమి చేశారో సెలవియ్యండి" అని ప్రార్థించాడు.                                    





       సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సు న చేయి పెట్టి,  "నీ జన్మ ధన్యమయింది. శ్రీ గురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి. కనుకనే యిలా కోరగల్గుతున్నావు. ఇందువలన నీవు తరించడమే గాక సాటివారిని గూడ తరింప జేయగలవు. నీవడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది" అని ఆ వివరాలిలా చెప్పారు :





              " శ్రీ గురుడు ప్రయాగలో వుండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి  అన్ని దిక్కులా వ్యాపించి, ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు. మాధవుడు,  సిద్ధుడు,  బాలుడు, ఉపేంద్రుడు,  జ్ఞానజ్యోతి,  సదానందుడు,  కృష్ణుడు అనే ఏడుగురము స్వామికి ముఖ్య శిష్యులము. మా అందరి పేర్లకూ  చివర 'సరస్వతి' అనే బిరుదుంటుంది. శ్రీ గురుడు మమ్ములను మరికొందరు శిష్యులనూ వెంటబెట్టుకొని అనేక తీర్థాలు,  క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణదేశం తిరిగి వచ్చి,  పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన 'కారంజ' నగరం చేరారు. అపుడు  వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకెంతో  సంతోషించారు. స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు. వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ యింటికి భిక్షకు ఆహ్వానించసాగారు. శ్రీ గురుడు అందరి ఆహ్వానాలూ  అంగీకరించి,  ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి యిళ్ళకూ వెళ్ళి భిక్ష చేసారు. అందరూ ఆ లీలకాశ్యర్యపడి  ఆయన సర్వవ్యాపకుడైన భగవదవతారమని గుర్తించారు.                                            





                ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్లీ దర్శనమిచ్చారు.  వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, ' నాథా! క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాదస్వామిని పూజించి,  వారి ఆదేశానుసారం శనిప్రదోషపూజ చేసాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది' అని చెప్పింది. అపుడా దంపతులు తమను సంసారసాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు. అపుడు శ్రీ గురుడు, "ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో, ఆ వంశంలోని  42 తరాలవారు తరిస్తారు. ఆ కులమంతటికీ  బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు గూడా బ్రహ్మలోకం పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను గనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై, అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను మనుమలను చూడగల్గుతారు. చివరిదశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది,  వేదాల చేత కీర్తించబడినదీ అయిన కాశీలో మీరు నివసిస్తారు. మీకు యెట్టి  చింతా  అవసరము లేదు' అని అభయమిచ్చారు.                     





                   అపుడు,  పూర్వాశ్రమంలో స్వామివారి సోదరియైన రత్న ఆయనకు నమస్కరించి,  'స్వామీ,  నాకు గూడా సంసార తాపత్రయం తొలగించి, నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను' అని ప్రార్థించింది. అపుడు శ్రీ గురుడు నవ్వి, 'అమ్మా, స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది; అభీష్టాలు గూడా నెరవేరుతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించు. గృహిణులకు అది ఒక్కటే మార్గమని వేదం చెప్పింది'  అన్నారు. అప్పుడామె, 'స్వామీ ! మీరు త్రికాలజ్ఞులు, నా  ప్రారబ్ధమెలా వున్నదో,  నా భవిష్యత్తేమో తెలుపండి' అని కోరింది. శ్రీ గురుడు,  నీ సంస్కారం తామసికమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగవు పెట్టి, వారిని విడదీశావు. అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీవొక ఆవును కొట్టి చంపావు. అందువలన నికీ జన్మలో కుష్టురోగమొస్తుంది' అని చెప్పారు. వెంటనే రత్న,  భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి,'గురుదేవా, నన్ను రక్షించండి' అని వేడుకున్నది.శ్రీ గురుడు ఆమెను ఓదార్చి,  'అమ్మా, మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్టురోగమొచ్చినపుడు మా దర్శనమవుతుంది. నీకు కుష్టురోగం పొడచూపగానే దక్షిణ దిక్కునవున్న భీమానదీ  తీరంలోని పాపవినాశ క్షేత్రానికి వెళ్ళు. భీమా - అమరజా నదీ సంగమం దగ్గరనున్న గంధర్వపురంలో ఆ తీర్థమున్నది' అని చెప్పి,  శ్రీ గురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయల్దేరారు.     





                 నామధారకా! ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని 'వృద్ధగంగా' అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అదెలా వచ్చిందో చెబుతాను. పూర్వం మునులు భూమిపై వడ్లు చల్లి, తమ తపోమహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు. ఒకరోజు బ్రహ్మర్షియైన గౌతముడు వడ్లు చల్లి, తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై, 'ఈయనకొక సంకటం కల్పిస్తే,  ఈయన మనందరికోసమూ  గంగను భూలోకానికి తీసుకురాగలడు. జీవులన్నింటికీ ఆ నదీస్నానం వలన సద్గతి లభిస్తుంది' అని నిశ్చయించుకొన్నారు. అందరూ కలిసి ఒక ఆవును,  దూడను దర్భలతో తయారుచేసి,  తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి,  గౌతముని పంట చేను పైకి తోలారు. అనుష్టానం చేసుకొంటున్న గౌతముడు,  ఆవును చూచి, తన చేతిలోని దర్భతో దానిని అదిలించాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి, అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు. అందుకే దీనిని 'గౌతమి' అంటారు. అదియే ఈ గోదావరి.ఇది గూడా గంగయంతటి పవిత్రమైనది గనుకనే శ్రీ గురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. తర్వాత ఆయన ఆ నది యొక్క రెండు తీరాలలోనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరీ పరిక్రమం చేసారు.     





                      ఆ పర్యటనలో శ్రీ గురుడు మంజరీకరమనే  క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామియనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తుండేవారు. ఒకరోజతనికి ధ్యానంలో తన యిష్ట దైవానికి బదులు శ్రీగురుని దర్శనమైంది. తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి, గద్గద కంఠంతో, ' మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన వున్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహ స్వామియే!' అన్నాడు. 'మా దర్శనం వలన నీ సేవ ఫలించింది. ఇకనుండి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానిస్తూవుండు' అని శ్రీ గురుడు తమ దివ్యదర్శనం అనుగ్రహించారు. మాధవరణ్యుడు పారవశ్యంతో యిలా స్తుతించాడు:' ఓ జగద్గురు సార్వభౌమా! మీకు జయము, జయము. నరునిలా కనిపిస్తున్నా, మీరు త్రిమూర్తి స్వరూపము, లోకాలనుద్దరించే జగజ్యోతియైన పరమ పురుషులు! మీ పాదదర్శనం వలన కృతార్థుడనయ్యాను'. శ్రీ గురుడు, 'మాధవారణ్యా! నీకు మంత్రసిద్దియై, నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యమూ మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేసావు గనుకనే మా ప్రత్యక్షదర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది' అని ఆశీర్వదించి,  గోదావరీ  పరిక్రమం కొనసాగించారు.





          తర్వాత శ్రీ గురుడు,  వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి, స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు.ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. అన్నం తింటే చాలు,  అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఒక మహర్నవమినాటికి అతడు భోజనం చేసి నెలరోజులయింది. ఆ రోజతడు కడుపునిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. 'అన్ని జీవులకూ  ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు' అనుకుంటూ అతడా రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన మెడకొక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి, 'స్వామీ,  నేను పూర్వ జన్మలలో పేదలకు అన్నదానం చేయలేదో,  అతిథులను ధిక్కరించానో,  ఈ జన్మలో భూమికి భారమయ్యాను. ఎట్టి పుణ్యము గతజన్మలో చేయనందువల్లనే గాబోలు,  ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం గూడా అనుభవించలేదు. బ్రాహ్మణుల జీవనమో, పశువుల గ్రాసము అపహరించో, నమ్మినవారికి ద్రోహం చేసానో, తల్లిదండ్రులను అవమానించానేమో, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానో,  తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేసానో,  లేక వధూవరులను చంపానేమో! లేకుంటే, అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకొస్తుంది? ఈశ్వరుని భక్తితో పూజించలేదో, లేక నేను సద్గురువును నిందించానేమో! లేకుంటే నన్నే దైవమూ  ఎందుకు అనుగ్రహించదూ? " అని పరితపించి నది ని సమీపించాడు.                            




                 సరిగ్గా సమయానికి శ్రీ గురుడు తమ శిష్యులతో కలసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణుని చూచి ఆయన,  అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు. శిష్యులు పరుగునపోయి నీటిలో మునిగబోతున్న ఆ విప్రుని బలవంతాన  శ్రీ గురునివద్దకు తీసుకువచ్చారు. స్వామి అతనితో, 'బ్రాహ్మణుడా! ఆత్మహత్య మహాపాపమని తెలిసి గూడా నీవందుకే పాల్పడుతున్నావేమి? ' అనడిగారు. ఆ బ్రాహ్మణుడు,  'స్వామీ! నన్నీ  విషయం అడిగి మాత్రం ప్రయోజనమేమున్నది? పక్షానికీ, నెలకూ ఒక్కసారి భోజనం చేసినా గూడ భరించరాని బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేనెలా బ్రతికేది? నేను జీవించడం వలన భూమికి భారమే గాని,  ప్రయోజనమేమున్నది? ' అని చెప్పి కన్నీరు కార్చాడు. శ్రీ గురుడు, 'నాయనా! క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధమిస్తాను,  భయంలేదు. ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చేయి' అన్నారు.                                         





                 ఆ బ్రాహ్మణుడు ఆయన పై విశ్వాసముంచి శ్రీ గురునికి నమస్కరిస్తూండగా, ఆ గ్రామాధికారి గూడ వచ్చి నమస్కరించాడు. శ్రీ గురుడు,  'నీవెవరు?  ఎక్కడుంటావు?' అని అడిగారు. ఆ గ్రామాధికారి,'స్వామీ, మాది ఆపస్తంభశాఖ,  కౌండిన్యస గోత్రము.నన్ను సాయందేవుడంటారు. మా స్వస్థానం (కడకంచి) కాంచీపురం. కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరంనుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ  నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప, తాప, దైన్యాలను హరించి, ధర్మార్థ కామ మోక్షాలను  ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమయింది' అని స్తుతించాడు.                 





                         శ్రీ గురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకుని,  'సాయందేవా! నేనొక మాట చెబుతాను, విను. ఈ బ్రాహ్మణునికి ఉదరశూలరోగమున్నది. భోజనము లేకుండా ఇతడేలా బ్రతుకుతాడు?  ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కనుక నీవితనిని తీసుకువెళ్లి మంచిభోజనం పెట్టు' అని ఆదేశించారు. సాయందేవుడు ఆశ్చర్యచకితుడై, 'స్వామీ, నెలరోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే యితడా బాధ భరించలేక యిప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందేమో!' అన్నాడు. స్వామి నవ్వి,'అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను! నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము,  గారెలతో గూడిన భోజనమే పరమౌషధము. నీవు సంకోచించక యితనిని తీసుకుని వెళ్లి అలాంటి భోజనం పెట్టు' అన్నారు. సాయందేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని గూడా భిక్షకు ఆహ్వానించాడు.                                   




                  అప్పుడు శ్రీ గురునితో పాటు అందరమూ సాయందేవుని ఇంటికి వెళ్ళాము. ఆ పుణ్యదంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని,  మిగిలిన అతిధులను కూర్చోబెట్టి,  రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ, శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు. శ్రీ గురుడు సంతోషించి, 'నీ సంతతి వృద్ధి పొందుగాక! నీ వంశస్థులందరికీ మాయందు భక్తి కల్గు గాక!' అని సాయందేవుని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ దంపతులు,  అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. శ్రీ గురుని కృపవలన ఉదర రోగియైన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసి, అతనిరోగబాధ  మాయమైంది.             


 పదమూడవ అధ్యాయం సమాప్తము.



శ్రీ దత్తాయ గురవేనమః 



శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Sunday, April 26, 2020

గురు చరిత్ర అధ్యాయము - 12


అధ్యాయము  -12




                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                              


శ్రీ గురుభ్యోనమః 




కథారంభము 





                           సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు  :" అప్పుడా తల్లి పుత్ర వాత్సల్యంతో ఇలా అన్నది : 'నాయనా, నీవు  లోకానికి ధర్మం చెబుతావు గదా? మరి నీవు కూడా 12 సంవత్సరములు బ్రహ్మచర్యమవలంభించాక గృహస్థుడవై, బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి గదా! ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయమవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి గదా!' అని బ్రతిమాలింది. అప్పుడు వటువైన నరహరి, అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా, ఆమెకు తత్వం ఇలా బోధించాడు :





                              ' అమ్మా! భౌతికమైన శరీరాలు, వైభవము అశాశ్వతాలే. మరణంలేని వాడంటూ ఎవ్వడూ లేడు. మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంటనంటే వుంటుంది. యువకులకైనా, వృద్ధులకైనా ఈ శరీరమెప్పుడు  రాలిపోతుందో తెలియదు. అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు, మృత్యుదేవత గూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెడుతూంటుంది. రాత్రి, పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరకొట్టుకుని పోతుంటాయి. ఈ శరీరము,  భార్యా బిడ్డలు, గృహము,  ధనము,  జీవితము అశాశ్వతమని మరచి, అవే ప్రధాన మనుకుని జీవించేవారు పశువులవంటివారు. కనుక ధర్మాచరణ మొక్కటేమానవుల కర్తవ్యం. అలాగాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు. కాని  మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపలవంటి వారు. ఆ కొంచెము  నీరు యింకిపోయాక వాటి గతేమిటి?





                     ఈ కలియుగంలో మానవునికి నూరేండ్లు ఆయుర్దాయం. అందులో సగకాలం నిద్రలోనూ, బాల్యము,  పరాధీనతల వల్ల కొంతకాలమూ గడిచిపోతుంది. ఇట్టి జీవితంలో ప్రార్థించే సంపద క్షణకాలముండి వాడిపోయేది. కాలచక్రం గర్భంలోని పిండములను, శిశువులను,  బాలురను,  యువకులను, విజ్ఞులను,  దేవతలను,  సర్వజీవులను మ్రింగివేస్తుంది. దేనిమీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే, దుఃఖాన్ని కొని తెచ్చుకొనడమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము,  ఎముకలు,  రక్తమూ గల ఈ శరీరము నీటి బుడగ వంటిది. శరీరము జడము, నశ్వరమూ.  ఆత్మ చిత్స్వరూపము, శాశ్వతము. దానికి సుఖదుఃఖాలు లేవు. ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే. సద్గురు కటాక్షం వలన మానవుడీ మాయను దాటాలి. ఉత్తమమైన మానవజన్మమెత్తి  గూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకోనివాడే నిజమైన ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు గూడా. అమ్మా ! ఈమాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే, కారణజన్ముడనైన నాకేది కర్తవ్యం?  





                                    విషయసుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడమనే క్రమం తగియున్నది. నాకట్టి విషయావాసనలే లేవు గనుక ధీమంతుడనైన నాకు యెట్టి విఘ్నాలూ  రాజాలవు. నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే  సన్యాసం తీసుకుంటాను. నన్ను  ధ్యానిస్తూండు. సంసారాన్ని దాటగలవు!' అని, యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు, తన దివ్య రూపాన్ని దర్శింపజేశాడు. ఆయన ప్రసాదించిన యోగదృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి యిలా అన్నది. : 'స్వామీ ! నీవు పుట్టుకలేనివాడవు. బ్రహ్మాండాలన్నీ నీలోనే వున్నాయి. బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచమైనా తెలియరానివి. మాయామోహితురాలనైన  మానవస్త్రీని, నాకెలా తెలుస్తాయి? ఈ  జ్ఞానమైనా నీవనుగ్రహించినదే! నీవు సత్యసంకల్పుడవు. నీ సంకల్పానికి నేనడ్డుచెప్పను. లోకహితం చేయడానికే  అవతరించిన నిన్ను నా పుత్రుడవని తలచి యింట  కట్టి పెట్టుకొనడం తగదు. అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనస్సులో స్థిరంగా నిలచేటట్లు అనుగ్రహించు. నాకింకా పుత్రులు కలుగుతారన్నావు. మాకు ఇంకొక బిడ్డ పుట్టేవరకైనా నీవిక్కడేవుండు. అప్పటివరకూ  సన్యసించడానికి నేననుమతించను. నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను.నిన్ను విడిచి నేను బ్రతకలేను, అని ప్రార్థించింది. అప్పుడు శ్రీహరి,  'అమ్మా ! నీకు ఒక సంవత్సరంలోగా కవలలు పుడతారు. అంతవరకూ వుంటాను గానీ, ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు' అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు.





                          అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని, ఆ దంపతులు నిత్యమూ అర్చిస్తుండేవారు. చతుర్వేద పారంగతులు, షట్చస్త్రనిపుణులూ గూడ ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు. ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు. పామరులకు ఆయన ధర్మసూక్ష్మాలు చెప్పేవారు. ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు యిద్దరు మగపిల్లలు పుట్టారు. వారికి మూడు నెలలు రాగానే ఒక రోజు అంబ పిల్లలనాడిస్తుంటే నరహరి వచ్చి, 'అమ్మా ! నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు. నీకింకా ఇద్దరు కొడుకులు,  ఒక కూతురు కలుగుతారు. నీ కోరిక ఫలించింది. నా మాట నిలబెట్టుకున్నాను. కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయల్దేరుతాను. అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి' అన్నారు. అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి, ' మేమింతవరకు మాయలో  తగుల్కొని, నీవు మా బిడ్డవనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్టురాలాడి  వుంటే   మమ్మల్ని క్షమించు! నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము. నీవు మా వంశాన్నుద్ధరించడానికి యిక్కడ జన్మించావు. నీవు మా రక్తమాంసాలు పంచుకొనడం  ద్వారా మా దేహాలు గూడా పవిత్రమైనాయి. ఇక ముందు మా గతేమిటి? ' అన్నారు. మీ దర్శనం మాకింకెప్పటికీ లేకుంటే మేమెలా జీవించగలము? అన్నారు. అప్పుడు నరహరి, మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి. మీకిక జన్మవుండదు. అమ్మా! నీకు నన్ను చూడాలనివుంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనమవుతుంది. 30 సంవత్సరముల తరువాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను"  అని చెప్పాడు.                    





                 అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన, తలపై శిరస్త్రాణము, కౌపీనము, కాషాయాంబరము, చేత దండమూ  ధరించి చిరునవ్వులొలికిస్తూ మహా సంతోషంగా బయల్దేరాడు. ఆ దృశ్యం చూసిన జనం, 'తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు యిల్లు విడిచిపోవడానికి ఆ తల్లి యెలా అనుమతిస్తున్నది?' అని ఆశ్చర్యపోయారు. కొందరు, 'ఈయన అవతారమూర్తి. ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు' అన్నారు. సాధువులు, ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు. ఆ గ్రామస్తులందరూ కొంతదూరం వెళ్లి, ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక, తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్లారు. అక్కడ నరహరి వారికి కర్పూరము వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము, తర్వాత శ్రీపాదరూపములను దర్శనమిచ్చారు. అది తమ శనిప్రదోష పూజాఫలితమేనని తలచి, ఆ తల్లిదండ్రులు, 'మా జన్మలు ధన్యమయ్యాయి. మీరు దయతో మాకు మళ్లీ దర్శనమివ్వాలి అని వేడుకోగా, ఆయన 'తప్పక మళ్లీ దర్శనమిస్తాను' అని మాట ఇచ్చి వాళ్లను వెనుకకు పంపాడు. ఆ దివ్యదర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరచి, భక్తి భావంతో వెనుకకు వెళ్ళారు.





                 నరహరి, బదరీనాథ్ దిక్కుగా బయల్దేరి దారిలో 'ఆనంద కాననము' అనబడే వారణాసి పట్టణం చేరారు. మొదట ఆయన గంగలో స్నానం చేసి, ఆత్మ స్వరూపమైన విశ్వనాధుని దర్శించారు. తర్వాత అచట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని, ప్రాణవాయువు కుంభించి,   ఖేచరీ ముద్రలో నాదాను సంధానపరులై  కూర్చున్నారు. ఆయన నిత్యమూ మూడు వేళలా మణికర్ణికా ఘట్టానికి వెళ్లి శ్రద్ధగా గంగాస్నానం చేసి వస్తుండేవారు. ఆ క్షేత్రంలో వున్న తపస్వులు,  మునులు,  సాధువులు ఆయనను చూచి ఆశ్చర్యచకితులయ్యారు. యవ్వనం గూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము,  కఠోరమైన తపస్సు చూచి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తూండేవారు. అచ్చటి యతులలో వృద్ధుడు,  శ్రేష్టుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూండేవారు. ఆయన సాక్షాత్తూ అవతార పురుషుడని, సన్యాసమార్గాన్ని పునరుద్ధరిస్తాడని,  ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా  తపస్సు చేస్తున్నాడని,  కనుక ఆయన వయస్సులో చిన్నవారయినా,  జ్ఞానంలో వృద్ధులే గనుక ఆయనకు యతులు గూడ  నమస్కరించవచ్చుననీ కృష్ణ సరస్వతి చెబుతుండేవారు. చివరకు ఆ కృష్ణసరస్వతీ  స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, 'స్వామి, మీరు పరమేశ్వరులే  గాని,  మానవమాత్రులు గారు. సజ్జనులను,  ధర్మాన్నీ ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు. శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది. దానిని మరల మీరే నిర్దిష్టం చేసి,  విస్తరింపజేయాలి. అధికారులు కాని వారికి ఈ మార్గము భయంకరమైనదైనా, బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందమిచ్చే ఈ సన్యాసమార్గాన్ని మీరే పునరుద్ధరించాలి. సన్యాసులమైన మేము యిప్పుడు మిమ్మలను సేవిస్తే లోకనింద యేర్పడుతుంది. కనుక మీరు గూడా సన్యసిస్తే మేము గూడా మీ సేవ చేసుకోవచ్చు' అని ప్రార్థించాడు. 





 నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సాంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీ కృష్ణ సరస్వతీ  పాదులను గురువుగా స్వీకరించి, శాస్త్ర పద్ధతిన వారివద్ద సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువిచ్చిన దీక్షానామం  'శ్రీ నృసింహ సరస్వతి'. తర్వాత ఆయన కొంతకాలం కాశీ పట్టణంలోనే వుండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్ధాన్ని భక్తులకు ప్రవచించారు".





                     అంతవరకూ గురుకథను శ్రద్దగా వింటున్ననామధారకుడు, "స్వామీ, నాకొక సందేహం కలుగుతున్నది. విశ్వగురుడైన శ్రీ గురునికి ఇంకొకరు గురువెలా కాగలరు? గురువునాశ్రయించి ఆయన సాధించవలసిన దేమున్నది?" అని అడిగాడు. సిద్ధయోగి యిలా చెప్పారు:" పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ట మహర్షిని, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షినీ గురువులుగా వివరించినట్లే, శ్రీ గురుడు గూడా శ్రీ కృష్ణ సరస్వతీ స్వామిని గురువుగా ఎన్నుకున్నారు. ఈ గురుసాంప్రదాయం అనాది సిద్ధమైనది. దీనికి మూల పురుషుడు సదాశివుడు. ఆయన శిష్యుడు విష్ణువు. విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు. అటు తర్వాత గురుపరంపర యిలా కొనసాగింది. బ్రహ్మ దేవుడి నుండి వశిష్టుడు -శక్తి- పరాశరుడు- వ్యాసుడు- శుకుడు- గౌడపాదుడు- గోవింద భగవత్పాదాచార్యులు- శంకర భగవత్పాదులు- విశ్వరూపుడు- బోధజ్ఞానగిరి -సింహగిరి ఈశ్వరతీర్థుడు - నృసింహతీర్థుడు -విద్యారణ్యుడు- మలయానందుడు- దేవతీర్థుడు యాదవేంద్ర సరస్వతి -కృష్ణ సరస్వతి. ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీ గురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతీ  స్వామి యొక్క గురువు.              





                      తర్వాత శ్రీ గురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ, అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు. తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ, సర్వ క్షేత్రాలూ  దర్శిస్తూ, పుణ్య తీర్ధాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలసి గంగాసాగర సంగమం చేరారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకూ తటాకయాత్ర చేసారు. అదిగూడా గంగా ప్రదక్షిణంతో సమానమే. అందుకే ప్రయోగను  గూడా గంగాసాగరమంటారు ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీ గురుడే స్వయంగా తత్వముపదేశించి సన్యాసమిచ్చారు".                      





 పన్నెండవ అధ్యాయం సమాప్తము



శ్రీ దత్తాయ గురవేనమః 



శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Saturday, April 25, 2020

గురు చరిత్ర అధ్యాయము -11


అధ్యాయము  -11



                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః  

                                                               శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 




                     నామధారకుడు అత్యంతాసక్తితో యిలా అన్నాడు : " అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయము ఎక్కడ అవతరించారు? ఏయే  లీలలు ప్రదర్శించారు? అప్రమేయడైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న  కోరిక నాలో పెరుగుతున్నదే గాని, తరగడం లేదు. ఆ రెండవ అవతార విశేషాలు కూడా వివరించండి". అంతటి శ్రద్ధాళువైన శ్రోత లభించినందుకు సిద్దునికి భగవంతుని లీలలు తనివితీరా వివరించి చెప్పే అవకాశం లభించింది. అట్టి అదృష్టానికి పొంగిపోయి  సిద్ధుడు, " నామధారకా! దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతలు యోగీంద్రులకు  కూడా ఊహించ సాధ్యం కానివి. కనుక నేనెంత వర్ణించినా అగాధమైన ఆ గాధలో లవలేశమే  అవుతుంది గాని, ఆయన లీలలన్నీ  చెప్పినట్లు కాదు సుమా! ఇక విను" అని ఇలా చెప్పారు :                     





           "శ్రీ పాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివపూజలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రంలోని 'కారంజా', లేక 'లాడకారంజా ' అను గ్రామంలో (అకోలా జిల్లా ) వాజసనేయ శాఖకు చెందిన ఒక సద్భ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు 'అంబ' అని నామకరణం చేసారు. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో బాటు శివభక్తి కూడా అబ్బింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే మాధవశర్మ అనే బ్రాహ్మణోత్తమునికిచ్చి  వివాహం చేసారు. అతడు మంచి శివభక్తుడు. ఆ ప్రాంతంలోని  స్మార్తులకు  శివ వ్రతం చేసుకునే అలవాటు ఉండేది గనుక, వారిని శివవ్రతులంటారు. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినమూ సంధ్యా సమయంలో శివపూజ, భర్తతో కలిసి శని ప్రదోష పూజ, శని త్రయోదశి  నాడు విశేషమైన పూజ చేస్తుండేది. విశేషించి అంబ తన భర్తను, సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలూ చేస్తుండేది. ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతియైంది. మాధవశర్మ సకాలంలో పుంసవనాది కార్యక్రమం నిర్వర్తించాడు. నెలలు నిండిన తర్వాత మహామహిమాన్వితమైన ఒక శుభ లగ్నంలో ఆమెకొక మగబిడ్డ కల్గాడు.     





                నామధారకా ! ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లలవలె ఏడ్వలేదు. సరిగదా, స్పష్టంగా ప్రణవముచ్చరించాడు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. జ్యోతిష్య శాస్త్ర    విద్వాంసులు అతని జాతకం చూసి, 'మాధవశర్మా ! నీ భాగ్యం పండింది. ఈ శిశువు సాక్షాత్తూ భగవంతుడే ! ఇతడు మనవలె గృహస్థాశ్రమం స్వీకరించడు. చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడవుతాడు. ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేనువు అవుతాడు. ఇతని దర్శనం చేతనే పతితులు  పావనులవుతారు. ఇతనిని కన్నందువలన మీకు కీర్తి, ప్రతిష్టలు, దివ్య సుఖాలు లభిస్తాయి" అని దైవజ్ఞులు చెప్పారు. మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు. వారు సెలవు తీసుకుంటూ, 'మాధవశర్మా ! ఈ బాలునికి శ్రీ సిద్ధులు దాస్యం చేస్తాయి. నవనిధులు పరిచారికులవుతాయి' అని ఆశీర్వదించారు. 





                        ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవముచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయి, అతనిని చూడడానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. పిల్లవానికి దృష్టిదోషం తగలకుండా తండ్రి రక్షా బంధనం చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండు మిరపకాయలు,  వేపాకులతో దృష్టి తీసేది. తర్వాత ఒక సుముహూర్తంలో ఆ పిల్లవానికి 'శాల గ్రామదేవ' అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతనిని' నరహరి' అని పిలుచుకునేవారు. నరులంటే  అజ్ఞానబద్దులైన  మానవులు;         'హరి' యంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్య, తాప, పాపాలను పోగొట్టే వాడని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తియని సూచిస్తున్నట్లున్నది.





                     బలహీనంగా ఉండటం వలన, అంబవద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు. పిల్లవానికోసం ఒక దాదిని గాని, పాడి మేకను గాని, ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా, ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని స్పృశించాడు. వెంటనే ఆమెకు స్థన్యం పెల్లుబికి, 32 ధారలుగా కారి నేలపైబడ్డాయి. ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టిదోషం తగులుతుందని వెరచి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఉయ్యాలలో పడుకోబెడితే ఏడ్చేవాడు; నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు.                     





                  ఇలా సంవత్సరము గడిచినా, అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలనారాధించమని కొందరు, మర్రి ఆకుల విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరూ, రావి ఆకుల విస్తళ్లలో భోజనం పెట్టించమని మరి కొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అన్పించడానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు, అతడు మాత్రం మాటలు వచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడుతాడు అని మరికొందరు అనేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేమడిగినా, 'ఓం' అన్నదే  అతని సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు,'ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు. గనుక ఇతడు చెవిటివాడు గాదని స్పష్టమవుతున్నది' అనేవారు. ' అతడు మూగవాడు అయితే అంత స్పష్టంగా 'ఓం' అనడం సాధ్యం కాదు. అతడు మాటలొచ్చి గూడా ఎందుకో  మాట్లాడటం లేదు' అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవరు ఏది చేయమని చెప్పినా అదల్లా  చేసేది. తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది.





                                       ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది. కానీ అతడు మాట్లాడనేలేదు. బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులెంతో కలత చెందారు. ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది. అది చూచి నరహరి సైగలతో ఆమెను వారించి, ప్రక్కనేవున్న ఒక యినుప వస్తువును తెప్పించి చేతితో త్రాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్నియినుప వస్తువులను అతనిచేత తాకించారు. అవి కూడా బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడు కాడని, ఆజన్మసిద్ధుడనీ వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడం గురించి దిగులు పడుతూనే వుండేవారు. అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్నెలా  పాలించగలడన్నదే  మాధవ శర్మకున్న దిగులు. తల్లి ఒకరోజతనిని అక్కున జేర్చుకుని కన్నీరు కారుస్తూ, ' నా కన్నతండ్రీ, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా? ' అన్నది. అది విని నరహరి నవ్వి, తనకు ఉపనయనం చేస్తే మాట్లాడుతానని, మొట్టమొదటగా ఆమెతోనే మాట్లాడుతాననీ సైగల ద్వారా తెలిపాడు. ఆ సంగతి విని మాధవశర్మ ఆశ్చర్యపడి, అతని ఉపనయనానికి ఒక శుభ ముహూర్తం నిర్ణయించి, ఊరివారినందరినీ  ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాశలై, నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు. కొందరు పెద్దలు మాత్రం, ' అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రీ మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమి,  లేకపోతేనేమి? మనకు మాత్రం మృష్టాన్న భోజనము, ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి. కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి' అన్నారు. అందరూ ఉపనయనానికి మాధవశర్మ ఇంట సమావేశమయ్యారు.  





                          నరహరి ముండనము, మాతృభోజనము అయ్యాక జింకచర్మము, పసుపు వస్త్రము  ధరించాడు. చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తర్వాత అతడు తల్లికి నమస్కరించి, ఆమెను' భవతీ  భిక్షాం దేహి' అని బిక్ష కోరి, మొట్టమొదట ఆమెతోనే మాట్లాడుతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదటి భిక్ష ఇచ్చి,         'ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు' అనగానే నరహరి," అగ్నిమీళే  పురోహితం" అని ప్రారంభించి, ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు. అంబ రెండవసారి భిక్ష ఇచ్చి, ' యజుర్వేదం పఠించు ఆచారం పాటించు!' అనగానే నరహరి, "ఇషేత్వా" అని ప్రారంభించి యజుర్వేదం లోని మొదటి మంత్రం పఠించాడు. తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి, ' సామవేదం పఠించు, ఆచారం పాటించు!' అనగానే నరహరి "అగ్ని ఆయాహి" అని ప్రారంభించి, సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు! అది వినగానే తల్లిదండ్రుల ఆనందానికి, సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడడం ప్రణవోచ్చారణ, తర్వాత వేదపఠనతో కానీ చేయకూడదని నరహరి అంతకాలమూ మాట్లాడలేదని అందరు అనుకున్నారు. మూడు భిక్షలూ  అయ్యాక ఆయన నాల్గవ వేదం కూడా చదివాడు. ఆయన భగవదవతారం అని తెలుసుకొని అచటి బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వశాస్త్రాలకూ జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు.         





               క్రతువు పూర్తిగావచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు. వామనునివలె భాసిస్తున్న ఆ నూత్న బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించి, 'నాయనా! ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా !' అన్నది. వెంటనే అతడు తల్లికి నమస్కరించి, ' అమ్మా ! మీ ఆజ్ఞ మేరకు నేను బిక్షువునవ్వుతాను. నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి' అని తండ్రి వైపు కూడా తిరిగాడు. ఆ మాటలకా  తల్లి నివ్వెరబోయి దుఃఖిస్తూ, 'నాయనా! ఒక్కగానొక్క మగబిడ్డవు. మేము 16 సంవత్సరాలు ఎంతగానో ఎదురుచూచి, ఎన్నో వ్రతాలాచరించాక పుట్టావు. తర్వాత ఏడు సంవత్సరాలు నీవు మాట్లాడనేలేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు, వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను. అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేమి? అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేమిటీ ? నీవు గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు గదా !'అని బ్రతిమాలింది.       




       అపుడు నరహరి తల్లిని కౌగలించుకుని ఓదార్చి, 'అమ్మా ! నా మాట విను. వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కోసం అవతరించాను. నీకింకా నలుగురు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు. వెనుకటి జన్మలో నీవు నిష్టతో శంకరుణ్ణి  పూజించడం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను ' అని చెప్పి,  ఆమె శిరస్సుపై తన చేతినుంచి ఆశీర్వదించాడు. వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది. అతడు శ్రీపాదవల్లభుడుగా దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపైబడి ఇలా అన్నది. 'స్వామీ ! పూర్వజన్మలో కుపుత్రవతినైన  నేను  ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీ పాదుడవు నీవే! బ్రహ్మాండాలన్నీ నీలోనే వున్నాయి. అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్త్రువంశము, పితృ వంశము గూడా పావనమయ్యాయి'.                     





               అతడామెను లేవదీసి, 'అమ్మా ! ఈ పూర్వవృత్తాంతం వెల్లడి చేయవద్దు. నీకొక రహస్యం చెబుతాను. గుప్తంగా ఉంచు. నేను సంసారమంటని  సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటనము  మొదలైన కార్యాలెన్నో వున్నాయి. అవి నేను ప్రకటించ వీలులేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు. కనుక నేనింట్లో వుండవీలుపడదు. కనుక నీవు అనుమతి ప్రసాదించు' అన్నాడు.    




పదకొండవ అధ్యాయం సమాప్తము 


శ్రీ దత్తాయ గురవేనమః 



శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   



గురు చరిత్ర అధ్యాయము -10


*** శుక్రవారం పారాయణ ప్రారంభం ***

అధ్యాయము  -10




     శ్రీ గణేశాయనమః        శ్రీ సరస్వత్యేనమః                                        
   శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 


                           సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు, "స్వామీ ! శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై, వేరొకచోట మరొక అవతారమెత్తారు అని చెప్పారు గదా? అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురువపురం లో ఉన్నారని, ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారనీ  కూడ చెప్పారే! అదెలా సాధ్యం?" అని అడిగాడు.                                





                        "నాయనా! శ్రీపాదస్వామి సాక్షాత్తూ  భగవంతుడే. భగవంతుని మహిమకు అంతులేదు. ఆయన ఏమైనా చేయగల సమర్ధుడు. మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి, వేరు వేరు కార్యాలు చేయడం లేదా? శ్రీ పాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే. ఆయన మహిమకు సంభవము, అసంభవము అన్నది లేదు. ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమనాశ్రయించిన భక్తులను రక్షిస్తూ ఉన్నారని తెలిపే దివ్యలీలనొకదానిని చెబుతాను విను.     






                           కాశ్యపస గోత్రీకుడైన వల్లభేశుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురువపురంలో అంతర్హితుడైన  శ్రీపాదస్వామి, తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపంలో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని, అతడు స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరమూ  నియమంగా ఒక్కసారైనా కురువపురం దర్శించి స్వామిని సేవిస్తూ ఉండేవాడు. ఒకనాడతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభమొస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్లి, అక్కడ ఆయన ప్రీతికొరకు వేయిమంది బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. అప్పటినుండి అతడు స్వామిని స్మరించి యే  పట్టణానికి వెళ్ళినా,  అక్కడ స్వామి దయవలన అతడు ఆశించిన కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది. అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమ య్యాయి. అతడు తనకొచ్చిన లాభానికెంతో సంతోషించి, తన మ్రొక్కు చెల్లించడానికి కావల్సినంత డబ్బు మూటగట్టుకొని కురువపురానికి  బయల్దేరాడు. నలుగురు దొంగలు అతని వద్ద ఎంతో డబ్బు ఉన్నదని పసిగట్టి, యాత్రికుల వేషాలు ధరించి అతనికి తోడై నారు. తాము కూడా ప్రతి సంవత్సరము కురువపుర యాత్ర చేస్తుంటామని  చెప్పి, అతనితో ఎంతో ఆదరంగా ప్రవర్తించి అతనిని నమ్మించారు. ఇలా రెండు మూడు రోజులు ప్రయాణం చేసి, వాళ్లంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతని పై పడి అతని తల నరికి, అతని వద్దనున్న ధనం అపహరించారు. తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి, ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేశుడు, మరణించే ముందు చివరిక్షణంలో, 'శ్రీ పాద వల్లభా!' అని కేక పెట్టాడు. అందువలన భక్త రక్షకుడైన శ్రీ పాద శ్రీ వల్లభులు జడలు, భస్మము, త్రిశూలము ధరించిన యతి రూపంతో ఆ దొంగలకు ప్రత్యక్షమై, త్రిశూలంతో వాళ్లను పొడిచి చంపాడు. అప్పుడా దొంగలలో ఒకడు ఆయన పాదాలపై బడి, 'ప్రభూ ! నేను దుష్టబుద్ధి తో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు. నేను తెలియక  వీరిని దారిలో కలిశాను. నిజానికి నేనెన్నడూ దొంగతనం చేసి ఎరుగను. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది. స్వామి, నన్ను క్షమించి విడిచిపెట్టవలసినది' అని ఆయనను శరణు వేడాడు.






                  స్వామి అతనికి అభయమిచ్చి, కొంచెం విభూతి ప్రసాదించి, దానిని వల్లభేశుని శరీరం పై చల్లి, తెగిపడియున్న తలను మొండానికి అతికించమని ఆదేశించారు. అతడలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేశుని శిరస్సుపై తమ అమృతదృష్టిని సారించి, మరుక్షణమే అంతర్థానమయ్యారు!వల్లభేశుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయమైంది. అతని ప్రక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వల్లభేశునికి అంతకుముందు జరిగినదేమీ గుర్తులేదు. అందువలన అక్కడ చచ్చిపడియున్న దొంగలను చూచి ఆశ్చర్యపడి, 'వీళ్లందరూ ఎలా మరణించారు? నీవొక్కడవే ఎలా బ్రతికి వచ్చావు? ఇంత జరిగినా నీవొక్కడివే యింకా యిక్కడే వున్నావేమిటి?'  అని అడిగాడు. అప్పుడాతడు, 'అయ్యా ఇప్పుడొక అద్భుతమైన దైవలీల జరిగింది. మనననుసరించి వచ్చినవారు దొంగలే గాని, యాత్రికులు గారు. వారు నిన్ను చంపి నీ ధనమపహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి, నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలాగా ఉంచి ఆయన అంతర్థానమయ్యారు. ఆ మునీశ్వరుడెవరో గాని, సాక్షాత్తూ పరమశివునిలా ఉన్నారు!' అని చెప్పాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తూ శ్రీపాదవల్లభులేనని తెలుసుకొని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించనందుకు వల్లభేశుడు  ఎంతో పరితపించాడు. అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురువపురం చేరాడు. అక్కడ శ్రీ పాదుని పాదుకలను సకల ఉపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు వెయ్యిమందికి గాక నాలుగు వేల మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు. 





                        ఈ విధంగా శ్రీపాదస్వామి కురువపురం లో అదృశ్యంగా ఉంటూ, ఇలాంటి లీలలు ఎన్నో చేశారు. నేటికీ సజ్జనులకు అక్కడాయన దర్శనమిస్తారు. అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతీ అనే యతిగా వేరొకచోట అవతారమెత్తి లోకోద్ధరణ చేశారు. భక్తులు ఎక్కడ వున్నప్పటికీ శ్రీపాదస్మరణ చేస్తే చాలు. వారికి స్వామి అభీష్టాలనిచ్చి రక్షిస్తాడు. అట్టి స్మరణకనుగుణమైన నామం తరతరాలుగా యిలా వున్నది" అన్నారు సిద్ధముని-


          "దిగంబరా,  దిగంబరా, శ్రీపాద వల్లభ దిగంబరా | 

    దిగంబరా,  దిగంబరా - అవధూత చింతన  దిగంబరా ||                          

పదవ అధ్యాయం సమాప్తము           




శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


Wednesday, April 22, 2020

గురు చరిత్ర అధ్యాయము -9



అధ్యాయము -9




                                     శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                                                   
                                    
శ్రీ గురుభ్యోనమః 




కథారంభము


            సిద్ధ సరస్వతి, నామధారకునితో , ఇంకా ఇలా చెప్పారు. శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థ స్వరూపుడు. అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణా నదికి వెళ్లి స్నానము , అర్గ్యము  మొదలైన వీధులన్ని నిర్వహించుకుని మఠానికి తిరిగి వస్తుండేవారు. ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు  గంగాస్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత, పుణ్యమూ  కలుగుతాయో, అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయే పుణ్యమేముంటుంది?                         



            ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతూ ఉండగా శ్రీపాద స్వామిస్నానానికని అక్కడికి వచ్చారు. ప్రశాంతత, దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటేనే  అతని మనస్సుకెంతో శాంతి, చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి. నాటినుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తుండేవాడు. ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాద స్వామి అతనితో, 'నాయనా, నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు. నీ సేవ వలన మాకు సంతోషమయింది' అన్నారు. నాటి నుండి అతనికి సంసార చింతనశించి, మరింత భక్తిశ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజూ అతడు స్వామియొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతూ ఉండేవాడు. అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు.   



              ఒక వసంతఋతువులో, వైశాఖ మాసంలో, ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో, 'ఒరే! నువ్వు రాజువై జన్మించి రాజ్యమేలుతావురా!' అన్నాడు. అతనికి ఆ మాటలర్థం కాలేదు. తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు ఉతుక్కోవడానికి నది వద్దకు వెళ్లినప్పుడు అక్కడ, సుందరయువతీ  జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును, అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూచాడు. ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై, తాను నిరంతరం చేసుకొనే నామస్మరణ మరచి, తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ వుండిపోయాడు. తర్వాత అతడు, 'మానవజన్మమెత్తాక  ఇటువంటి వైభవము, సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ! ఇతనికి ఇంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును  సేవించాడో ! నాకిటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట!" అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నమయింది. శ్రీపాద స్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, 'స్వామీ , ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము, సంతోషమూ  కలుగుతున్నాయి' అని మళ్ళీ , 'అజ్ఞానం వలన నేనిలా భ్రమించానే  గాని, నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యమివ్వగలదని ఇప్పుడు తోస్తున్నది' అన్నాడు. శ్రీపాద స్వామి, 'దానికేమున్నది? నీవు పుట్టినది మొదలూ  కష్టం చేసుకునే  జీవిస్తున్నావు. అందువలన అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలు పై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. నాయనా! నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు కదా! నిస్సంకోచంగా చెప్పు' అన్నారు. చాకలి వెంటనే స్వామికి నమస్కరించి, 'స్వామి! నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు' అని వేడుకున్నాడు. స్వామి, 'నాయనా! మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే.లేకుంటే యిలాంటి వాసనలు మిగిలివున్నంతవరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూండవలసిందే.  నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా? లేక మరుజన్మలో కావాలా? సంకోచించకుండా చెప్పు!' అన్నారు. అప్పుడతడు సిగ్గుతో తలవంచుకొని, 'ఇప్పుడు నేను ముసలివాడనయ్యాను. ఈ జన్మలో అంతటి సుఖం లభించినా నేను తృప్తిగా అనుభవించలేను. కనుక నాకవి మరుజన్మలో లభిస్తే వాటిని ఆజన్మాంతమూ  అనుభవించగలుగుతాను'  అన్నాడు.                          



               అప్పుడు స్వామి, 'నాయనా! ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను, మనస్సును తృప్తి పరుచుకోవాలి. లేకుంటే మనసు నిర్మలమవక ఎన్నో జన్మలకు  కారణమవుతుంది. నీలో రాజ్యకాంక్ష, సుఖలాలస బలీయంగా ఉన్నాయి. కనుక నీవు మరుజన్మలో 'మృధుర' దేశంలో యవన రాజ వంశంలో జన్మిస్తావు' అన్నారు. అది విని రజకుడు, స్వామీ, మీరిచ్చిన వరం నాకు ఇష్టమైన దే కానీ, వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చెయ్యవద్దు. మీ యందు దృఢ భక్తి ఉండేలా అనుగ్రహించు. అపుడు నాకు మత ద్వేషం ఉండకూడదు' అని వేడుకున్నాడు. శ్రీపాద స్వామి, 'ఇప్పుడు నీవెట్టి వైభవం చూచావో అట్టిదే మరుజన్మలో పొందుతావు. అపుడు  మేమవతరించవలసిన  అవసరమొస్తుంది. అపుడు మేము "నృసింహసరస్వతి" అనే సన్యాసి రూపంలో ఉంటాము. వృద్ధాప్యంలో నీకు మా దర్శనమవుతుంది. తక్షణమే నీకు ఙ్ఞానోదయం అవుతుంది. భయం లేదు. ఇక నీవు వెళ్లి రావచ్చు' అని ఆశీర్వదించి, ఒక వింతైన నవ్వుతో అతనివైపు చూచారు. ఆ రజకుడు అక్కడిక్కడే క్రిందపడి మరణించాడు.                       



              శ్రీ పాదులు ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురువపురం లోనే ఉన్నారు. ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు ఆయన 'నేనింతకుముందు అంబికకు జీవితాంతమూ  శివపూజ చేస్తే, మరు జన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడు మరొకడు లేడు గనుక, నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి' అని తలచారు. అటు తర్వాత ఒక ఆశ్వీయుజ మాసం, కృష్ణ పక్ష ద్వాదశి, హస్థా  నక్షత్రమునాడు శ్రీపాద శ్రీ వల్లభులు కృష్ణా నదిలో( మునిగి ) అంతర్హితులై, మరొకచోట వేరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మరూపంలో ఇక్కడే ఉన్నారు అని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తిశ్రద్ధలతో కురుపురం దర్శించేవారికి ఆ స్వామి ప్రత్యక్షుడే. అందువల్లనే కురుపురం అంతటి శ్రేష్టమైన  క్షేత్రం."                                  

      తొమ్మిదవ అధ్యాయం సమాప్తము


శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

**** గురువారం పారాయణ సమాప్తము ****

గురు చరిత్ర అధ్యాయము -8



అధ్యాయము  -8




                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                                                                                      
 శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 


                                నామధారుకుడు,   "స్వామీ ! శ్రీపాద శ్రీవల్లభులు  గోకర్ణ క్షేత్రంలో ఎంతకాలమున్నారు? అసలు భగవదవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పనిఏమి? నాకి సందేహ నివృత్తి చేసి, అటుపై శ్రీపాద స్వామి చరిత్ర తెలపండి' అని కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు:  "శ్రీపాద స్వామి గోకర్ణ క్షేత్రం లో మూడు సంవత్సరాలు నివసించి, తర్వాత శ్రీశైలం వెళ్లారు. అక్కడ నాలుగు నెలలు ఉండి భక్తులను అనుగ్రహించి. అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్లి, స్నానం చేసి, తర్వాత కురువపురం వెళ్ళారు. అక్కడ కృష్ణ - వేణి అనే రెండు నదులు కలవడం వలన అది ఎంతో పవిత్రమైనది. దానికి తోడు భగవంతుడైన శ్రీ పాద స్వామి అక్కడ స్థిర నివాసం చేయడం వలన ఆ క్షేత్రం లోక విఖ్యాతమైంది. ఇప్పుడు దానిని "కురుగుడ్డి' అంటారు. అక్కడ శ్రీపాద స్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తమ వుతాయి. అక్కడ శ్రీపాద స్వామి అదృశ్యులై , మరొక అవతారం ధరించారు. అయినా ఇప్పటికీ ఆ కురుపురం లో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు.    


                        శ్రీపాద వల్లభులు సాక్షాత్తూ  భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థాలూ  ఉంటాయి. అయినప్పటికీ పుణ్యక్షేత్రాల అన్నింటిని పావనం చేయడానికీ, ఆయా క్షేత్రాలలోని ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు. పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులూ తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగివేయడం వలన చివరకు అవే మలినం అవుతాయి. అప్పుడు శ్రీపాదుల వంటి మహాత్ముల పాదస్పర్శవలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తపించి  పోతుంటాయి. ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా. ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను. శ్రద్ధగా విను.                                         


                   కురుపురంలో వేదవిదుడైన సద్భ్రాహ్మణుని  భార్య అంబిక మహాపతివ్రత. కానీ పూర్వకర్మ వలన ఆమెకు ఎందరో పిల్లలు పుట్టి కూడా కొద్దికాలంలోనే చని పోతూ ఉండేవారు. ఆమె ఎన్నో దానాలు, వ్రతాలు చేసింది. ఎన్నో తీర్థ క్షేత్రాలు దర్శించింది. కొంతకాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లవాడు స్థబ్థుడు , బుద్ధిహీనుడు, జడుడూ అయ్యాడు. అయినప్పటికీ, లేక లేక కలిగిన అతనిని తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచుతున్నారు.  ఎనిమిదవ సంవత్సరం రాగానే తండ్రి అతనికి ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయించాలని చూచాడు కానీ, ఆ మందమతి ఎంత కాలానికి ఒక్క వేద మంత్రమైనా సరిగా నేర్చుకో లేక పోయాడు. ఆ మంత్రానుష్టానం ద్వారానైనా అతనిని బుద్ధిమంతుని గా చేయాలని తండ్రి అతని కొడుతుండేవాడు.  అది చూడలేక అంబిక అడ్డు వచ్చి, 'వీడు లేకలేక కలిగిన పిల్లవాడు. మందమతి అయిన వీనిని దండిస్తే మటుకు ఏమి లాభం? వీనికి విద్య రాకున్నా సరే, మీరు వాణ్ణి  కొట్టవద్దు. బ్రతికినంత కాలం వీనిని ఇకనైనా సుఖంగా బ్రతకనివ్వండి. ఇక మీదట మీరు వానిని శిక్షిస్తే, నేను మీ ఎదుటే బావిలో దూకి మరణిస్తాను' అన్నది. ఆ బ్రాహ్మణుడు గూడా ఆలోచించి, ఆ పిల్లవాడు 'అజాగళస్నస్తనం', వలె వ్యర్ధుడని  తలచి నిరాశ చెంది వూరుకున్నాడు.                      


                       కొంతకాలానికి ఆ బ్రాహ్మణుడు ఆ దిగులుతోనే మరణించాడు. దిక్కులేక అతని భార్య అంబిక తన కొడుకుతో గూడా బిచ్చమెత్తుకుని బ్రతుకుతూ ఉండేది. ఆ బాలుని చూచి గ్రామస్తులు, ' ఓరి! పండితపుత్రా ! నీ బ్రతుకు వ్యర్థం. నీవు నీ కులానికే మచ్చ తెచ్చావు. నీ తల్లి బిచ్చమెత్తు కొస్తే కూర్చుని తింటున్నావు. సిగ్గులేదా? నదినుండి మంచి నీరు మోసి అయినా బ్రతుకరాదా? నీ వలన నీ పితృదేవతలకు  కూడా అధోగతి కలుగుతుంది. నీ బ్రతుకుకు ఏమి ప్రయోజనం? పవిత్రమైన భిక్షా వృత్తి నీవంటి అసమర్ధుడు కి తగదు. ఇలా బ్రతికేకంటే ఈ కృష్ణానదిలో దూకి చావరాదా?" అని పరిహసించేవారు. చివరకు ఆ బాలుడు లోకుల పరిహాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోదలచి నది వైపు పరిగెత్తాడు. అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లికూడా నిస్సహాయురాలై, తాను కూడా ఆత్మహత్య చేసుకోదలచి అతని వెంట పరిగెత్తసాగింది. దారిలో శ్రీపాద స్వామి ఎదురై అతనిని నిలిపి, 'బ్రాహ్మణుడా! తొందరపడవద్దు. పూర్వకర్మ వల్ల నీకీ దుస్థితి దాపురించింది. దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి. అవి నివారింపరానివి. అందువలన నీవు జీవించి, ఎంతటి కష్టాలైనా ఓరిమితో అనుభవించి దుష్కర్మనుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది' అన్నారు.   


                     అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించి, ' స్వామీ ! ఒక వంక భర్తను కోల్పోయి, మరొకవంక వ్యర్థుడైన  ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతీ ఆశింపజాలని నన్ను చూడడమే మహా పాపంగా లోకులు పరిగణిస్తున్నారు. నేనిక బ్రతికి మాత్రం చేయగలిగిన దేమున్నది?' అన్నది. ఆమె మాటలు విని, కరుణార్ధ్ర   హృదయుడైన శ్రీపాద స్వామి, అమ్మా ! ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందేగాని వేరే ప్రయోజనమేమున్నది? కనుక నీవు మిగిలిన జీవితమంతా శివపూజ లోనే గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నావంటి కుమారున్ని పొందగలవు' అన్నారు. ఆమె ఆలోచించి, 'స్వామి, నేను మీరు చెప్పినట్లే చేస్తాను. కానీ దాని వలన ప్రయోజనమే మో నాకు తెలియలేదు. దయచేసి వివరించండి' అన్నది.  




                 శ్రీపాద స్వామి, 'అమ్మా ! ఉజ్జయినీ   పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు, శివుని వరప్రభావం వలన చింతామణిని  పొందాడు. ఆమణి  యొక్క విలువ లెక్కకు మీరినదని  తెలుసుకుని, దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు - ఇద్దరూ ఏకాగ్రమనస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు. ఒక త్రయోదశి, శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి  ఆ పట్టణంలోని గోపబాలకులు కూడా తమ యిండ్ల  ముంగిళ్లలో ఆకులతోనూ, పూలతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు  ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోకి లాక్కొని పోయారు. వారిలో ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజా  సామాగ్రిలాగి వేసి, వాటిని బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివపూజకు విఘ్నం  కలిగినందుకు చాలా దుఃఖపడి, ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు విశ్వసాక్షియైన  పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ బాలుడు ఆ  దివ్య మూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. శివుడు, 'వత్సా ! భక్తి చేత నీవు నా సాయుజ్యం  పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది. అయినా నీ అర్చనా విధానం చూచింది గనుక మరుజన్మలో విష్ణుజనని అవుతుంది' అని వరమిచ్చి అంతర్థానమయ్యాడు.     





                     అక్కడున్న లింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూచి, సూర్యుడు రాత్రిపూటకూడా ప్రకాశిస్తున్నాడని తలచారు. అంతటి భక్తిశ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలచి, అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది, వారంతా సగౌరవంగా చంద్రసేన - మణిభద్రులను  దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజ ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకుని, తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లి, ఆ దివ్య లింగాన్ని చూచి ఆనందించాడు. ఆ గోపబాలకుడు చెప్పగా ఆ వృత్తాంతమంత  విన్న చంద్రసేనుడు, మిగిలిన రాజులూ  ఆ పిల్లవాడికి గోపాధిపత్యమూ, ధనము ఇచ్చి వెళ్ళిపోయారు. తరువాత ఆ గోపాలుని  తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది. కనుక అమ్మా! శివపూజా మహిమ వలన మరుజన్మలో నీవు గూడా అలాగే అవుతావు' అన్నారు.                               




                      ఈ కథ విని అంబిక ఇలా అడిగింది  : ' స్వామీ !  శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో గదా   ? ఈ జీవితశేషం నేనెలా గడపాలి? మహానుభావా ! అందరి పరిహాసాలకూ గురియవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు. నన్ను మాతృత్వంతో  రక్షించు'  అని వేడుకున్నది. ఆ కరుణాసముద్రుడి  హృదయం కరిగి, తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవముచ్చరించాడు. ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని,వక్తా  అయ్యాడు. అప్పుడు అతనిని మాతృసేవకు నియోగించి, శ్రీపాద స్వామి ఆమెతో, 'అమ్మా ! దుఃఖం విడిచి నీ జీవిత శేష మంతా శివపూజలో గడుపు. వచ్చే జన్మలో నా అంతటి కుమారుడు కలుగుతాడు' అని వరమిచ్చాడు. ఆమె పరమానందభరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి, జీవితమంతా శివార్చన లో గడిపి ధన్యురాలయింది."     



        ఎనిమిదవ అధ్యాయం సమాప్తము.


శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   




నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...