Saturday, April 18, 2020

గురు చరిత్ర అధ్యాయము -5

అధ్యాయము -5




                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                                                                                 
 శ్రీ గురుభ్యోనమః 


                            
కథారంభము
                   

          నామధారకుడు, " మహానుభావా ! భగవంతుడు కలియుగంలో కూడా రెండు సార్లు అవతరించారంటిరిగదా, వాటిని వివరించండి" అన్నాడు. అతని శ్రద్దా   భక్తులకు సంతోషించి సిద్ధుడిలా చెప్పాడు: " మంచిది, ఆ కథలు వినడం వలన నీకెంత ప్రయోజనమో, అవి చెప్పడం వలన నాకూ  అలాంటి ప్రయోజనమే  కలుగుతుంది. కనుక చెబుతాను,  శ్రద్ధగా విను ". 



            ధర్మాన్ని, ధర్మాత్ములను రక్షించి దుష్టుల   దౌష్ట్యాన్ని  రూపుమాపడానికే  భగవంతుడు తన లీలచేత మానవ రూపంలో అవతరిస్తుంటాడు. ఈ కలియుగంలో కూడా అలానే, ఇప్పుడు మనం కూర్చున్న గంధర్వపురానికి తూర్పుదిక్కున దూరంగా,  పవిత్ర గోదావరీ  సమీపంలో ఉన్న పిఠాపురం అనే అగ్రహారంలో ఆయన అవతరించారు. పిఠాపురంలో అల్ప రాజు శర్మ , సుమతి అనే పుణ్య దంపతులు ఉండేవారు. వారు బ్రాహ్మణులు, ఆపస్తంభ శాఖకు చెందినవారు. దత్త భక్తులు. వారికి ఎందరో పిల్లలు పుట్టారు కానీ అందరూ చనిపోగా, ఇద్దరు మాత్రమే బ్రతికారు. వారిలో ఒకడు కుంటివాడు మరొకడు గుడ్డివాడు తర్వాత కూడా ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు.  



                          నిత్యము భిక్షకై వచ్చేవారిని శ్రీదత్త రూపాలుగా భావించి, వారు భిక్ష సమర్పించేవారు. ఒక అమావాస్యనాడు వారింట్లో బ్రాహ్మణులను పిలిచి శ్రాద్ధకర్మ ప్రారంభించారు. అలాంటి రోజున బ్రాహ్మణభోక్తలు భోజనం చేయక ముందు మరెవ్వరూ భోజనం చేయరాదని శాస్త్రం. కానీ ఆనాడు బ్రాహ్మణులకు భోజనం వడ్డించడం ముందే వారి ఇంటికి దండకమండలు  ధారియైన  ఒక సన్యాసి వచ్చి భిక్ష కోరాడు. శ్రాధ కలాపంలో నిమగ్నుడై ఉన్న ఇంటి యజమానికి ఈ సంగతి తెలియదు. ఇల్లాలైన  సుమతి, ఆ వచ్చిన సంయమీంద్రుడు శ్రాద్ధ భోక్తయైన పరమేశ్వరుడేనననీ , తమ కుల దైవమైన శ్రీ దత్తాత్రేయుడు అని విశ్వసించి ఆయనకు భిక్ష ఇచ్చింది. ఆమె భక్తి విశ్వాసాలకు సంప్రీతుడైన ఆ యతీంద్రులు యదార్థమైన తన  దత్తాత్రేయ స్వరూపంలో దర్శనమిచ్చారు.                   



                   నామధారకా ! అప్పటి ఆ స్వామిని చూడడానికి వేయి కన్నులు చాలవు. వర్ణించడానికి ఎన్ని వేల నాలుకలయినా సరిపోవు. రెండు చేతులలో శంఖచక్రాలు, రెండు చేతులలో ఢమరు - త్రిశూలాలు, మిగిలిన రెండు చేతులలోనూ జపమాల కమండలాలు ధరించి, ఆరు బాహువులతో, మూడు ముఖాలతో స్వామి వెలిగిపోతున్నాడు. వెండి కొండ వలె తెల్లని కాంతితో ఆయన,  మూర్తీభవించిన శుద్ధసత్త్వమా అన్నట్లు ఆయన ప్రకాశిస్తున్నాడు. ప్రపంచంలోని దీనుల ఉద్దరించడానికి ఆరు చేతులు చాలక, అనేకమైన బాహు లే ఆయన శిరస్సు నుండి వచ్చాయా అన్నట్లు ఆయన జటాజూటం నుండి జుట్టు పాయలుగా వ్రేలాడుతున్నది. ఆ తల్లి సుమతి దేవి, తన జన్మ సార్థకం అయ్యేలా ఆ అమృత మూర్తిని  ఒడలెల్లా కళ్ళు  చేసుకుని, ఆ కన్నులతోనే  పానం చేయసాగింది. 


           అప్పుడా కరుణాకరుడు, ' తల్లీ, అచంచలమైన నీ విశ్వాసానికి సంప్రీతుడైయ్యాను. శ్రాద్ధబ్రాహ్మణులు భోజనం చేయకముందే నేను  పరమేశ్వరుడనన్న విశ్వాసంతో భోజనం పెట్టావు. నీ అదృష్టంనీ అభీష్టం ఏమిటో చెప్పు. నేను తప్పక నెరవేర్చగలను' అన్నాడు. స్వామి మాటలు అమృత ధారలై ఆమె చెవుల ద్వారా శరీరంలోని సర్వ ధాతువులలోకీ ప్రవహించాయి. జగన్మోహనమైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనంతో ఆమె కన్నులు, ఆమె యొక్క అమృతవాక్కులు వినడం వలన ఆమె చెవులు- బ్రహ్మ వాక్కు లైన వేదాలను వినిన ఋషిసత్తముల చెవుల వలె - పరమపావనమయ్యాయి. ఆమె కృతజ్ఞతతో, 'పరమాత్మా! యోగులను  గూడా ముగ్దులను  చేసేలా దర్శనమిచ్చావు. అంతేగాక, నా చేతి అన్నం స్వీకరించారు. ఇంతకంటే నాకేం కావాలి? నేను ధన్యురాలను. ఈనాటి శ్రాద్ధదేవతలైన మా పితృదేవతలు గూడా ధన్యులయ్యారు. నీవు భక్తుల కోరికలీ డేర్చే కల్పవృక్షానివి. నీవు నన్ను తల్లీ ' అని సంబోధించావు. కనుక నేను ప్రత్యేకంగా నిన్ను వరమడగవలసిన పనిలేదు. నీవిచ్చిన మాటను నిలుపుకోచాలు' అన్నది.                      


          భక్తి శ్రద్దల వలన జాగృతమైన ఆమె బుద్ధి శక్తికి ఆశ్చర్యచకితుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి' ఇది వరకు అత్రిమహర్షి అడిగినట్లే, ఈమె గూడా లోకానుగ్రహార్థమైన కోరిక కోరుతున్నది' అనుకున్నాడు. ఆయన, 'అమ్మా ! నాతో సమానుడైన పుత్రుడే నీకు జన్మిస్తాడు. కానీ నీవు పుత్ర వ్యామోహం తో అతని మాటలు పట్టించుకొనక నీవు చెప్పినట్లే అతడు చేయాలని నిర్బంధించ కూడదు. అతడు చెప్పినదే అక్షరాలా అమలు జరపాలి' అన్నారు. ఆ దర్శనంతో మరింత నిశితమైన బుద్ధి శక్తి గలిగిన ఆమె, 'స్వామీ ! నేను మానవమాతృరాలిని. నాకు పుత్ర వ్యామోహం కలగడం సహజం. అది లేక మాతృవాంఛ పరిపూర్ణమయ్యేదెలా? కనుక పుత్రుడు జన్మించాక సమయానుకూలంగా అట్టి వివేకాన్ని నీవే అనుగ్రహించాలి!' అని ప్రార్థించింది. ఆమె సమయస్ఫూర్తికి మెచ్చి దత్త స్వామి నవ్వి, ఆశీర్వదించి అంతర్హితులయ్యారు.   



                  సుమతిదేవి ఆనంద పారవశ్యంతో ఇంటిలోనికి వెళ్లి, పితృశ్రాద్దాది కార్యకలాపాన్ని కొనసాగిస్తున్న భర్తను ప్రక్కకు పిలిచి, ' స్వామీ ! నేనీనాడు ఒక అపరాధం చేసాను. చేసిన అపరాధం చెబితే దోషం పోతుంది. శ్రాధబ్రాహ్మణులు  ఇంతవరకు భోజనం చేయలేదుగదా? కానీ ఇప్పుడే ఒక సన్యాసి వచ్చి భిక్ష మడిగాడు. ఆయనే యజ్ఞపతి,  శ్రాద్ద  ఫలభోక్త  అయిన శ్రీ దత్తాత్రేయస్వామి అని భావించి భిక్ష ఇచ్చాను. ఆయన సంతోషించి తన నిజస్వరూపమైన దత్తాత్రేయ స్వామిగా దర్శనమిచ్చారు!" అని చెబుతూంటే ఆమె శరీరం రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనందభాష్పాలతో నిండాయి. ఆ మాటలు విన్న రాజు శర్మ ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనంద పారవశ్యానికి  ఆశ్చర్యచకితుడై, సంతోషంతో,  'సాద్వీ ' మనము బ్రాహ్మణులకు భోజనం పెట్టి, ఆ శ్రాద్ధకర్మను యజ్ఞభోక్తయైన విష్ణువుకే  గదా అర్పిస్తాము? అటువంటప్పుడు నీవు పెట్టిన భిక్ష భగవంతుడే స్వయంగా గ్రహించాడంటే అది మన మహద్భాగ్యం. అది కేవలం నీ విశ్వాస ఫలమే! నీవు చేసిన ఈ మంచి కార్యం వలన నీవేగాక అందరమూ కృతార్థులమయ్యాము. శ్రీ దత్తాత్రేయ స్వామి మధ్యాహ్న సమయంలో అనేక రూపాలలో భక్తులను ఉద్ధరించడానికి అతిధివలె సంచరిస్తుంటాడని విన్నాము. ఆచరణలో జరిగిన లోపం వలన అతిధి ఆకలితో తిరిగి పోతే సాక్షాత్తు ఆ శ్రీహరే  తిరిగి పోయినట్లు, నీవు చేసిన పని ఎంతో కల్యాణ కరమైనది' అని ప్రశంసించారు.  



            అప్పుడా  పరమ సాధ్వి, తనకు స్వామి వరమిచ్చిన సంగతి వివరంగా చెప్పింది. రాజుశర్మ ఆనందభరితుడై, 'కళ్యాణీ ! నీవు మన వంశానికి, ప్రపంచానికీ  గూడా మంగళకరమైనదే కోరావు. నేను ధన్యుణ్ణి' అని ఆమెను మనసారా అభినందించి, మిగిలిన శ్రద్ధ కలాపాన్ని యధావిధిగా పూర్తిచేశాడు.       



           త్వరలో ఆ సతీమతల్లి సుమతీ  దేవి గర్భం ధరించి ఒక భాద్రపద శుక్ల చతుర్థినాడు ఉదయం శుభముహూర్తంలో కాలాతీతుడు, పుట్టుక లేనివాడూ  అయిన భగవంతునికి పుట్టుక నిచ్చింది. దైవజ్ఞులు ఆ శిశువు యొక్క జన్మలగ్నము, గ్రహస్థితి గణించి సాక్షాత్తూ కల్పవృక్షమే వారింట వెలసిందని, సాక్షాత్తు దత్తాత్రేయుడి అవతరించాడని అన్నారు. రాజు శర్మకు  కలిగిన అదృష్టాన్ని పూర్వం అత్రిమహర్షికి ప్రాప్తించిన మహద్భాగ్యంతో పోల్చారు. ఆ శిశువు పాదాలలో దివ్య చిహ్నాలు మొదలైన శుభ లక్షణాలతోనూ, అప్రతిమాన  తేజస్సుతోనూ ప్రకాశిస్తుండడం   వలన అతనికి' శ్రీ పాదుడు' అని నామకరణం చేశారు. నామధారకా ! అది  కలియుగంలో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారం.                    



             పుట్టినది మొదలు శ్రీపాద స్వామి శుక్లపక్ష చంద్రునిలాగా అందరికీ ఆహ్లాదాన్ని అందిస్తూ, ఆనందం చిందిస్తూ, ముద్దులు మూటగడుతూ పెరిగి ఎనిమిదేండ్ల  వాడయ్యాడు. అతని ముద్దు ముచ్చటలు తల్లిదండ్రులే గాక, ఆ ఊరి వారందరూ తనివితీరా అనుభవించారు. అతని పాదస్పర్శతో ఆ ఊరు- అతని జననము, బాల్య  జీవితాల వలన ఆ పవిత్ర గోదావరీ  ప్రాంతం ఎంత ధన్యత పొందాయో చెప్పతరమా? ఎనిమిదవయేట అతని తల్లిదండ్రులు ఒక శుభ ముహూర్తంలో అతనికి ఉపనయనం చేశారు. సామాన్యంగా అటు తర్వాత వటువును తగిన గురువు వద్ద అధ్యయనం చేయిస్తే గాని వేదం రాదు. కానీ ఈ శ్రీపాద స్వామి తనకు ఉపనయనం అయిన మరుక్షణమే శిష్యులకు వేద పాఠాలు చెప్పి, వెనుక శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతి దేవి కి ఇచ్చిన మాట యధార్థం అని నిరూపించుకున్నాడు. ఇది ఆ భగవంతుడికి తప్పా వేరొకరికి సాధ్యమా? ఇలా శ్రీ  పాదుడు పదహారేండ్ల ప్రాయము గలవాడయ్యాడు.                



                ఇంతలో రాజు శర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ  చేయసాగాడు. అది తెలిసి ఒక నాడు శ్రీపాద స్వామి తండ్రితో, ' నాయనా! నీవు నాకు వివాహం చేయడానికి తగిన కన్య కోసం అన్వేషించనవసరం లేదు. సర్వ శుభ లక్షణాలు కలిగి, నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది. ఆమె పేరు యోగ శ్రీ. నేను ఆమెను చేపట్టి సన్యాసి అవుతాను. నేను శ్రీ వల్లభుడను గనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే ' అని నిశ్చయంగా చెప్పాడు . ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి. కన్నుల నీరు కారుతుంటే రాజు శర్మ గద్గదస్వరంతో పెల్లుబుకుతున్న పుత్ర వ్యామోహం తో, స్వామితో ఇలా వాపోయాడు: ' అబ్బాయీ ! నీవు గనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే, మేము నీటి నుండి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో  విలవిలలాడి మరణిస్తాము. నీవు సాక్షాత్తూ పరమేశ్వరుడవే అయినా, మా  పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు. అట్టి నీవే తల్లిదండ్రుల మైన మమ్ములను శోక సాగరంలో ముంచి వెడలిపోవడం  ఉచితమేనా? భగవంతుడవు, ధర్మగోప్తవూ, ధర్మ రక్షకుడు అయిన నీవే పుత్ర ధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా? '        



                              'నామధారకా ! ఈ దంపతులకు శ్రీపాద స్వామియే గాక, కుంటివాడు, గ్రుడ్డి వాడు అయిన మరి ఇద్దరు కొడుకులు ఉన్నారు గదా! రాజు శర్మ ఆ ఇద్దరినీ శ్రీపాద స్వామి వద్దకు తెచ్చి, ' నాయనా! నిన్ను స్మరించడం చేతనే సంసారబంధం తొలగిపోతుంది. కానీ అవిటివారైన నీ సోదరులిద్దరిని చూసినప్పుడు మాత్రం మాకు మరలా ఈ సంసార బంధాలు పెనవేసుకుంటాయి. వీరితో మా గతి ఏమి? ' అని దుఃఖించాడు. సుమతీ దేవి కూడా పొరలుకొస్తున్న దుఃఖం అణచుకుంటూ శ్రీపాదుని  సమాధానం కోసం ఎంతో ఆర్తితో ఎదురు చూసింది. వారి బాధను గుర్తించిన శ్రీపాద స్వామి అన్నలిద్దరినీ  తన అమృత హస్తంతో స్పృసించాడు. సంజీవిని స్పర్శచేత చనిపోయినవారికి ప్రాణం వచ్చినట్లు, స్వామి స్పర్శచేత తక్షణమే వారిద్దరూ పాద, నేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతో ప్రకాశింపసాగారు. సర్వతంత్ర స్వతంత్రుడు సకల జగన్నియామకుడూ అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు.                 



                       ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూసిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు  కేవలం తమ పుత్రుడు అన్న భ్రాంతి  పటాపంచలైంది. అతడు లేని చోటే లేదు గనుక, అతడు తన దగ్గర లేకుండా పోతున్నాడు అన్న వ్యామోహం అంతరించింది. ప్రపంచమంతా తన సంతానమే అయినా ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టిపెట్టుకొనడం అపరాధమని తోచి, సుమతీ దేవి స్వామినిలా ప్రార్థించింది.  



                              'ప్రభూ !నీ మాయ చేత నీవు నా పుత్రుడవని భ్రమించాను. నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్నాత్మకు ప్రభువువన్న సంగతి మరచాను. అనంతకోటి బ్రహ్మాండాలు నీయందే యిమిడియున్నాయి. నా భ్రాంతి తొలగించు !'అపుడు ఆయన తన యదార్థ రూపాన్ని తల్లికి మరొక్కసారి దర్శింపజేశాడు. ఆ దివ్య  మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితొ, కొటి చంద్రుల చల్లదనంతో, చూచేవారి దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచివేసేలా దర్శనమైంది. అపుడు స్వామి అన్నాడు   :  'అమ్మా !నీవిపుడు దర్శించిన రూపాన్ని నిరంతరమూ ధ్యానిస్తుండు. త్వరలో నీవు ఈ అజ్ఞానాంధకారాన్ని దాటి, నా సాయుజ్యం పొందగలవు. ఈ కొడుకులిద్దరూ నూరేండ్లు సుఖంగా జీవించి, మిమ్ములను భక్తితో సేవిస్తారు. వీరికి విద్య, సంపద, కొడుకులు, మనుమలు  -అన్నీ పుష్కలంగా సమకూరుతాయి. వీరు గుడ లోకవంద్యులవుతారు '.    



          ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితో స్తుతిస్తూంటే  వారితో ఆయన, 'మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావించి, సేవించి తరించండి. నేను సన్యసించాలి' అని చెప్పి, తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి, వారి అనుజ్ఞ తీసుకొని వెంటనే సన్యసించి, పాదచారియై ద్వారక, కాశీ, బృందావనము  మొదలైన క్షేతాలు  దర్శిస్తూ బదరీ వెళ్లి, అటు తర్వాత గోకర్ణ క్షేత్రానికి చేరాడు.అక్కడ మహాబలేశ్వరలింగ రూపంలో సాక్షాత్తు శంకరుడే నివసిస్తూవుంటాడు. ఆ లింగాన్ని ప్రతిష్టించిన వారు గణేశ్వరుడు. ఆ క్షేత్రం సజ్జనులకు నెలవు. అందువలననే ఆ క్షేత్రాన్ని, సజ్జనులనూ  ఉద్ధరించడానికే  శ్రీపాద స్వామి అక్కడకు వెళ్లారు' అని సిద్ధుడు చెప్పారు.                 




శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

          ఐదవ అధ్యాయం సమాప్తము

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...