Saturday, April 11, 2020

గురు చరిత్ర అధ్యాయము -1

 గురు చరిత్ర  

శ్రీ  దత్తాత్రేయుని షోడశావతారాలు 
1. యోగిరాజు 
2.అత్రివరదుడు 
3.శ్రీ దత్తాత్రేయుడు 
4.కాలాగ్నిశమనుడు 
5.యోగిజన వల్లభుడు 
6.శ్రీ లీలా విశ్వంభరుడు 
7.సిద్దిరాజు 
8.ఙ్ఞానసాగరుడు 
9.విశ్వంభరావధూత 
10.మాయాయుక్తావధూత  
11.మాయాముక్తావధూత 
12.ఆది గురువు 
13.శివరూపుడు 
14.శ్రీ దేవ దేవ 
15.దిగంబరుడు 
16.శ్రీ కృష్ణ శ్యామకమలనయనుడు 

ఈ గురు చరిత్ర నందలి 52 అధ్యాయములు కలవు . 

*** గురువారం పారాయణ ప్రారంభం ***
అధ్యాయము -1

                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 

                            
కథారంభము

                    గంధర్వనగరంలో శ్రీ నృసింహసరస్వతీ స్వామి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాలనుండి గూడా ఎందరో వచ్చి వారిని సేవించి పెళ్లికానివారు పెళ్లి ,సంతానం లేనివారు సంతానము ,పేదవారు ధనము యిలా ఎవరికి అవసరమైనవి వారు పొందుతున్నారు .వారిని దర్శించాలనుకొన్నప్పటినుండే కోరినవి నెరవేరుతున్నవారున్నారు . నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో  కష్టాలకు గురై ఎన్ని చేసిన ఒక్కటీ తీరక ఎంతో వ్యాకులపడ్డాడు .  ఆ పరిస్థితులలో అతడు శ్రీ గురుని మహత్యం గురించి విని , వారి దర్శనంతో గాని అవి తీరవని నిర్ణయించుకున్నాడు . అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు . ఆయన దర్శనం అవకుంటే ప్రాయోపవేశం చేసుకోదలచి అతడు శ్రీ గురుని స్మరించి యిలా మొరపెట్టుకున్నాడు . 

     "అందరి కష్టాలూ తొలగించే మీ నామ స్మరణతో నా కష్టాలెందుకు తొలగడం లేదు ? అందుకు నా పాపాలే కారణమైతే , సర్వపాపహరమైన మీ నామం వాటినెందుకు నశింపచేయలేదు? అన్నిజీవులనూ కరుణించే మీరు నన్నుమాత్రం ఎందుకు కరుణించడంలేదు? గురువే త్రిమూర్తి స్వరూపమని తలచినవెంటనే ఫలితమిస్తాడనీ వేదాలు, స్మృతులూ చెబుతున్నాయి. ఈ కలియుగంలో శ్రీ నృసింహసరస్వతీ స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చిందికదా, మరినాపట్ల అదిఎందుకు నిరూపణకావడంలేదు? మీరు సాటిలేని పెన్నిధి అన్నది నిసంశయంగా అందరి అనుభవమున్ను కాని నా మనస్సులో మీపై భక్తి ఎందుకు కలగడంలేదు? నా మనస్సు మీపై స్థిరంగా నిలవడంలేదేమి? మీరే నా తల్లీ, తండ్రీ, గురువు, దైవము, తోడూ, నీడా అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను. పసితనంలోనే నాకు మీ పేరుపెట్టి నా తల్లిదండ్రులు, నన్ను మీకు అమ్మేశారు. పరమాత్మా, మీరు దీనులపాలిటి కల్పవృక్షము, దయాళువూ, మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి  విశ్వమంతటినీ పోషిస్తున్న మీరు నన్ను ఉపెక్షిస్తున్నారెందుకు?మీరు సర్వసాక్షియని వేదాలు చెబుతున్నాయికదా మరి నా దుస్థితి మీకు తెలియడంలేదా?ఎవరినీ ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు? నేను మీకేమీ సమర్పించలేదనా? సాక్షాత్తూ లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడనైన నేనేమి ఇవ్వగలను? బిడ్డనుండి ఏమి తీసుకొని తల్లి స్తన్యమిస్తున్నది ? నన్ను అనుగ్రహించే సమయం యింకా రాలేదనడం సర్వసమర్దులైన మీకు తగదు . ఇంతకుముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించనిమాట నిజమే . కాని  సేవిస్తేనే ప్రసాదించేది దానమెలా అవుతుంది?1 స్వామి ,లౌకికుడైన రాజు గూడా తన సేవకుల వంశంలో పుట్టినవారిని రక్షిస్తున్నాడు. మా పూర్వికులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి. లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా ఋణం రాబట్టుకుంటాను. మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది. అది మీ సాటివారిపట్ల తగునేమో కానీ, అల్పుడనైన నాయందు తగదు. 

      ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో ! అజ్ఞానినైన నాకు దోషాలు చేయడం సహజమే. నా వంటి పాపిలేడు; కాని మీవంటి పాపహారకుడూ లేడు. కనుక నన్నుద్ధరించు. ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా? దయాసముద్రులైన మీరు - అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు - నన్ను బుజ్జగించాలి గాని , నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు? లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతోచెప్పవచ్చుగదా?   ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి.మీరే నాకు దిక్కు . మిమ్మల్నేనేను శరణు పొందుతున్నాను . చైతన్యమూర్తివీ , దయానిధివీ అయిన నీకారుణ్యమేమైంది ప్రభూ ? మృత్యుముఖంలో వున్న నన్నెందుకు
వుద్దరించకుండా వున్నావు ?" ఇలా దారిపొడుగునా నామధారకుడు అనేకవిధాలుగా శ్రీ గురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు ఖిన్నుడై , శోషవచ్చి గంధర్వపురం దగ్గర ఒకచెట్టుక్రింద పడుకున్నాడు . అతనికి నిద్రతూగినపుడు కలలో కూడా అతడు శ్రీ గురుణ్ణే స్మరిస్తున్నాడు. ఆవు తననెడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు, భక్తుల పాలిటికి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు . ఆయన జడలు, విభూతి , పులిచర్మము ధరించి వున్నాడు. నమదారకుడు కలలోనే స్వామి కి సాష్టాంగ నమస్కారం చేసి , తనపొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి , వాటితో అభిషేకించి , గంధమలంకరించి పూజించాడు. ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి , అతనిమనస్సులో ఆ రూపం స్థిరంగా నిలచింది . అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతి పెట్టి , తలపై చేయివుంచి ఆశీర్వదించారు. ఆ వెంటనే అతనికి మెలకువ వచ్చింది. అయినా తన తలపై ఆ అవధూత చేయిపెట్టిన అనుభవములానే వున్నది . అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు . అక్కడ మరెవ్వరూ లేరు అప్పుడతడు లేచి,తనకు స్వప్నదర్శనమిచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు .


శ్రీ దత్తాయ గురవేనమః

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః 

ఒకటవ అధ్యాయం సమాప్తము








No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...