అధ్యాయము -3
శ్రీ గణేశాయనమః శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః
కథారంభము
నామధారకుడు నమస్కరించి, "ఓ సిద్ధమునీ , మీరు నా సందేహాలన్నీ తొలగించారు. నాకు గురువు యొక్క యథార్థ తత్వం తెలిసింది. మీకు జయము. ఇంతకూ మీ నివాసము ఎక్కడ? మీకు భోజనమెలా లభిస్తున్నది? " అని అడిగాడు. సిద్ధయోగి అతనిని కౌగలించుకుని ఆశీర్వదించి నవ్వుతూ, "నేను యెప్పుడూ శ్రీగురుని చెంతనే వుంటాను. శ్రీ గురుస్మరణమే నాకు ఆహారం. వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము. ఈ 'శ్రీ గురు చరిత్ర' గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి, ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులై దీనిని ఏడు రోజులలో పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి, సంతానము, ధన ధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము- ఎవరు కోరినది వారికి లభిస్తుంది. నిష్కాములకు ముక్తినిస్తుంది " అని చెప్పి, తమ వద్దనున్న గ్రంథం చూపారు.
నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, " మీరీ గ్రంథం సంగతి చెబుతుంటే నాకు- ఎంతో దూరం నడిచి దప్పిక గొన్న వాడికి సాక్షాత్తూ అమృతమే పోసినట్లు ఉన్నది. ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపోగలదు. దీనిని శ్రవణం చేయాలి అనిపిస్తున్నది. నా సందేహాలు తొలగించి నాకు ఇంత మేలు చేస్తున్న మీరే నా గురుదేవులు, నన్ను అనుగ్రహించండి!" అని వేడుకున్నాడు. సిద్ధమని సంతోషించి అభయమిచ్చి, అతనిని చేయి పట్టుకొని వెనుక శ్రీ గురుడు పావనం చేసిన అశ్వత్థ( రావి) వృక్షం దగ్గరకు తీసుకు పోయాడు. నామధారకుణ్ణి దానిక్రింద తమ దగ్గరగా కూర్చోబెట్టుకుని ఇలా చెప్పారు. " నాయనా! అజ్ఞానం వలన నీకు శ్రీగురునియందు దృఢమైన భక్తి కుదరలేదు. ఆయనను సందేహించడం వలననే నీకిన్ని కష్టాలు వచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించ గలవారికే వారి నిజ తత్వం అర్థమవుతుంది. అట్టివారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన - పర - భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తుంటాడు. నీరు ఎత్తైన ప్రాంతంలో నిలువజాలనట్లు, దాంభికులకు ఆయన కృప లభించదు. గురువుకు సాటి అయినదేదీ లేదు. కల్పవృక్షము చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు గానీ గురువు మనం కోరనిదానినిగూడా ప్రసాదిస్తారు. ఆయన స్పర్శదీక్షతోనే మనకు ప్రపంచమంతా బ్రహ్మమయముగా దర్శింపజేస్తారు. ఆయననే శంకించే వారికి ఆయనేమి చేయగలడు? తనను సంపూర్ణ విశ్వాసంతో సేవించేవారి వెంటనంటి కాపాడటమే ఆయన ధర్మం! కాని పామరులు కష్టం వచ్చినప్పుడు, ఎవరో చెప్పగా ఆయనను సేవిస్తారు గాని, శ్రద్ధ విశ్వాసాలతో సరైన పద్ధతిలో సేవించరు. కనుకనే కొందరి అభీష్టాలు నెరవేరవు. అప్పుడు వారు తమకు గురువు ఏమీ చేయలేదని ఆయనను నిందిస్తారు. నామధారకుడు ఆయనకు నమస్కరించి, " స్వామి, నాకు శ్రీగురుని లీలలు వినిపించి కృతార్ధుని చేయండి. శ్రీ గురుడు త్రిమూర్త్యాత్మకమైన భగవంతుడంటిరి గదా? ఆయన మొదట అలా ఎందుకు అవతరించారో సెలవియ్యండి" అని వేడుకున్నాడు.
సిద్ధమని సంతోషించి, " శ్రీ గురుని పట్ల శ్రద్ధ కలగడం యెంతో శుభసూచకం. యింతవరకు శ్రీగురుని లీలలు గురించి యింత ప్రీతితో యెవరూ అడుగనే లేదు. ముముక్షువులకు మాత్రమే యిట్టి అభిరుచి కలుగుతుంది. నీకు తప్పక పురుషార్ధాలు ప్రాప్తిస్తాయి. నీ శ్రద్ధ నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్నది. నీవడిగినది చెబుతాను. శ్రద్ధగా విను.
జగత్తుకు మూలకారణమైన భగవంతుడు మొదట అనేకమవాలని సంకల్పించినప్పుడు ఆయన శక్తి త్రిగుణాత్మకంగా మారి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపం ధరించింది. వాటిలో రజోగుణము ప్రకోపించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ రూపంలో ఆ శక్తే సర్వాన్నీ సృష్టించింది. సత్వగుణము బలీయమై, విష్ణురూపంలో సర్వాన్నీ పాలిస్తుంది. తమోగుణం బలీయమైనప్పుడు, అదే మహేశ్వరుడై సర్వాన్ని సంహరిస్తుంది. అంతేకానీ, నిజానికి ముగ్గురికీ భేదమేలేదు.
పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడనే రాజు నిరంతరము హరి చింతన, అతిథి సేవలతో పాటు దృఢమైన నిష్టతో ఏకాదశీ వ్రతం ఆచరించేవాడు. ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క ఘడియ మాత్రమే వుందనగా, దూర్వాస మహర్షి, శిష్య ప్రశిష్యులతో కలసి అతని వద్దకు వచ్చారు. అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్టానం పూర్తిచేసుకుని భోజనానికి రమ్మని ప్రార్థించాడు. అప్పుడా మహర్షి, స్నానానికని నదికి వెళ్లి పారణ సమయం మీరి పోతున్నాగాని రాకుండా ఆలస్యం చేయసాగారు. తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగమవుతుంది. అలా అని అతడు భోజనం చేస్తే, అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది. అందుకని అతడు ఆ రెండిటిని పరీరక్షించుకోదలచి, కొద్ది తీర్థం మాత్రం త్రాగాడు. ఇంతలో దుర్వాసుడు వచ్చి, కోపించి, 'రాజా, నీవు నానాయోనులలో జన్మింతువు గాక!' అని శపించాడు. అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణుపొందాడు. అపుడాయన సాక్షాత్కరించి దుర్వాసునితో, ' మహర్షి, నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు. అతనిని రక్షించడం నా ధర్మం. అయినా మహర్షులు అయిన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక, ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి' అన్నారు. అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తలచి సంతోషించి దూర్వాసుడు, ' విశ్వాత్మా ! మీ గురించి తపస్సు చేస్తున్న యోగులకు ప్రత్యక్ష దర్శనమివ్వడానికి, జంతుయోనులలో జన్మించిన పాపులనుద్ధరించడానికీ మీరు భూలోకంలో యెప్పుడూ అవతరిస్తూ వుండండి' అన్నారు. అందువల్లనే విష్ణువు మత్స్యాది అవతారాలెత్తాడు. కానీ వాటిలో కొన్ని గుప్తంగా వుండి, ఉత్తమ తపస్వులకు మాత్రమే తెలుసుకొన సాధ్యమవుతాయి. ఇట్టి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు. ఈయన అత్రి అనసూయలకు జన్మించాడు."
శ్రీ దత్తాయ గురవేనమః
శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః - శ్రీ నృసింహ సరస్వత్యైనమః
మూడవ అధ్యాయం సమాప్తము
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box