Thursday, April 16, 2020

గురు చరిత్ర అధ్యాయము -4


అధ్యాయము  -4



                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                                                                                  శ్రీ గురుభ్యోనమః 



                           
కథారంభము



                దూర్వాసుని శాపం వలన భగవంతుడు ధరించిన అవతారాలలో ఉత్తమ సాధకులకు మాత్రమే తేలియబడే శ్రీ దత్తాత్రేయ అవతారం గురించి చెప్పమని నామధారకుడు  కోరగా సిద్ధయోగి ఇలా చెప్పసాగారు :                       




           " పూర్వం ఒక కల్పాంత  ప్రళయం తర్వాత నారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉద్భవించి  సనకాది యోగులను, మరీచి మొదలైన సప్త ప్రజా పతులను తన మానస పుత్రులుగా అవతరింపజేశాడు. తర్వాత శతరూప - మనువులను సృష్టించాడు. వారి కుమారై దేవహూతి కర్థముని భార్య అయ్యింది. ఆమెకు కలిగిన కుమార్తెలలో అనసూయాదేవి అత్రిమహర్షికి భార్యయై, మహా పతివ్రతగా ప్రసిద్ధికెక్కింది. ఆమె పాతివ్రత్య ప్రభావానికి వెరచి కొండలు, శిలలతో గూడి యెంతో కఠినమైన భూమి ఆమె పాదాలక్రింద మృదుత్వాన్ని వహించింది. సర్వాన్ని తపింపజేసే సూర్యుడు, అన్నింటినీ దహింపజేసే అగ్నిగూడ ఆమెకు చల్లదనం యివ్వసాగారు. వాయువు ఆమె చెంత  తన ప్రచండ వేగం  మాని మందంగా, మలయ మారుతంగా వీచేవాడు. దేవతలందరూ తమ వలన ఆమెకు కష్టం కలిగినా, లేక యే అల్పుడైనా  ఆమె అనుగ్రహం పొందినా  అతడు తమను గూడా జయింపగలడని భయపడుతుండేవారు.         




         ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నివాసాలకు వెళ్లి, అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని యెంతగానో ప్రశంసించాడు. అత్రిమహర్షి ఆదేశం మేరకు ఆమె వలె అతిధి అభ్యాగతులను ఆదరించే సాద్వి మరొకరు లేరు అన్నాడు. అప్పుడు త్రిమూర్తుల భార్యలు కూడా దేవతలందరి వలనే భయపడి, అసూయచెంది, ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు. అప్పుడు త్రిమూర్తులు అతిధి వేషాలలో అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకున్నారు. అనసూయదేవి వారికి యెదురేగి స్వాగతం చెప్పి,అర్ఘ్య  - పాద్యాదులు  సమర్పించి, ' అయ్యలారా, మీ రాక చేత మా ఆశ్రమం పావనమైంది. మీకు నేను ఏమి చేయాలో సెలవియ్యండి. అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యం లోకి వెళ్లారు' అని చెప్పింది. అప్పుడా అతిథులు, ' అమ్మా ! మాకెంతో ఆకలిగా ఉన్నది. నీ భర్త యెప్పుడు వస్తారో చెప్పలేము గదా? మాకు వెంటనే భోజనం పెట్టు' అన్నారు. ఆమె లోపలికి వెళ్ళి విస్తళ్లు  వేసి, అయ్యలారా! భోజనానికి దయచేయండి' అని ప్రార్థించింది. అప్పుడు వారు, ' సాద్వీ, నీవు మాకు ఆతిథ్యమిస్తానని మాట యిచ్చావు. కానీ మాది ఒక షరతు వున్నది. నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోంచేస్తాము. లేకుంటే యిలా ఆకలితోనే వెళ్లిపోతాము' అన్నారు.                   




        వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రిమహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది . అంతేకాక,  ఆకలితో తిరిగి పోయిన అతిధి, గృహస్థుల పుణ్యాన్నీ,  తపస్సునూ , తీసుకుపోతాడని  శాస్త్రం. కాని  పరపురుషుల యెదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం  భంగమవుతుంది! పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకోజూచిన అతిథులు సామాన్యులుగారని ఆమె వెంటనే గ్రహించింది. వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకున్నది.  'తపోమూర్తియైన  అత్రిమహర్షి సంసర్గంవలన పవిత్రురాలనైన నాకు కామ భయంలేదు. ఆకలిగొని అన్నమడిగిన వీరు ధర్మం ప్రకారం నా బిడ్డలే గాని పరపురుషులుగారు' అనుకొని ఆ సాధ్వి, 'అయ్యలారా! అలానే చేస్తాను, భోజనానికి లేవండి!' అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్లి, అత్రిమహర్షి పాదుకలతో,            'స్వామీ ! నేను మీ ఆజ్ఞమేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను' అని చెప్పు కొన్నది. ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్వితమైన సంకల్పంవలన ఆమె భోజనం వడ్డించడానికి నగ్నంగా వెళ్లేసరికి ఆ ముగ్గురూ పసిపిల్లలయ్యారు. ఆమె భావాన్ననుసరించి ఆమెకు బాలింతరాలికి వలె స్తన్యమొచ్చింది. ఆమె వెంటనే మరలా వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు తృప్తిగా పాలిచ్చింది. నిరంతరం సృష్టి చేసి అలసిన వాడిలా బ్రహ్మ దేవుడూ, ప్రపంచాన్ని పాలించి అలసిన వాడిలా శ్రీ మహావిష్ణువు, జగత్సంహార కార్యం వలన సోలిపోయిన వానిలాగా శంకరుడూ అనసూయాదేవి యొక్క పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి చెందారు. ఆ మహా పతివ్రత తన దివ్య దృష్టి వలన ఆ ముగ్గురూ త్రిమూర్తులని తెలుసుకొని ఉయలలో పెట్టి, ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది.                      




           ఇంతలో అత్రి మహర్షి వచ్చి, ఆమె నుండి సర్వమూ  తెలుసుకుని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి, ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్తుతించాడు: ' ఓ మహావిష్ణూ ! నీవు సృష్టి-స్థితి -లయకారణుడవు. జగత్సాక్షివి, విశ్వమయుడవు . విశ్వాధారుడవు. ఓ పరమేశ్వరా ! నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ లీల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు. వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా, మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు, " నేను- నాది' అనే మాయతో గూడిన భావన వలన నీ కంటే వేరయినట్లు  జీవులకు గోచరిస్తున్నది.                    




            ఉయ్యాలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది, తమ నిజ రూపాలతో గూడా ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నారు. అప్పుడాయన సాభిప్రాయంగా   భార్య వైపు చూస్తూ, ' సాధ్వీ, వీరు మనస్సుచేతగూడా పొందడానికి వీలు గానివారు. అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు. నీ అభీష్టమేమిటో నివేదించుకో!' అన్నాడు. అనసూయాదేవి, 'స్వామీ ! ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారుగదా! కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది, మీ అవతారకార్యం నెరవేర్చుకోవడమే నా అభీష్టము' అన్నది. అత్రిమహర్షి సంతోషించి, ' మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముధరించండి' అని కోరాడు. అప్పుడు వారు, ' మహర్షీ ! మమ్ము నీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము' అన్నారు. ఆ పతివ్రతా  ప్రభావం చేత త్రిమూర్తులు అత్రికోరిన వరముననుగ్రహించి తమ లోకాలకు వెళ్లి వారి భార్యలను కలుసుకున్నారు. తర్వాత అత్రి అనసూయలకు ముగ్గురు పుత్రులు కలిగారు. సద్గురువైన అత్రిమహర్షికి ఆత్మ సమర్పణ చేసుకుని సేవించిన ఫలితంగా, తనకు వ్రతభంగం చేసి శపించడానికి వచ్చిన త్రిమూర్తులను బిడ్డలుగా పొందింది అనసూయాదేవి!  




        తర్వాత అత్రిమహర్షి బాలవిష్ణుమూర్తికి దత్తుడనీ , దర్శనం మాత్రం చేత అందరి హృదయాలకూ  ఆహ్లాదాన్నిచ్చే బ్రహ్మదేవునికి చంద్రుడనీ, ప్రళయకర్త అయిన రుద్రుడికి దుర్వాసుడనీ నామకరణం చేసాడు. ఈ  ముగ్గురూ  అత్రి యొక్క సంతానం  గనుక వీరిని ఆత్రేయులని, దత్తుణ్ణి 'దత్తాత్రేయు'డని వ్యవహరిస్తారు. ఈయనే సాక్షాత్తూ పరమేశ్వరుడు; శృతులకు గూడా  అందని సచ్చిదానంద స్వరూపుడు; మానవులకు అభీష్టాలు  నెరవేర్చి యోగము, జ్ఞానము ప్రసాదించేవాడు; స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూంటాడు . దూర్వాసుడు మిక్కిలి కోపస్వభావం కలవాడైనా, ఆయన కోపం కూడా లోకానికి కల్యాణమే చేకూర్చింది. చంద్రుడు సర్వజీవులనూ  పోషిస్తుంటాడు. తర్వాత బ్రహ్మ( చంద్రుడు ), శివుడు( దూర్వాసుడు ) తమ దివ్యాంశలను దత్తాత్రేయుని యందుంచి తల్లి అనుమతితో తపస్సుకు వెళ్ళిపోయారు.                 




        నామధారకా ! అలనాటి దూర్వాస శాపం వల్ల నే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శాశ్వతంగా భూమిమీద సంచరిస్తూ భక్తులననుగ్రహిస్తుంటాడు. అసలు ఆయన అవతరించినదే అందుకు! స్థూలదృష్టికి అలా కనిపించినా, నిజానికి ఇతర అవతారాలు తమ కార్యం తీరగానే శరీరాలు త్యాగం చేసి వైకుంఠానికి వెళ్లిపోయినట్లు, భగవంతుడు ఈ దత్తావతారం లో చేయడు. శ్రీరాముడు రావణాది రాక్షస సంహారం కోసము, శ్రీకృష్ణుడు దుర్యోధనాది దుష్టులను సంహరించి భూభారాన్ని తగ్గించటానికి అవతరించారు. ఆ కార్యాలు తీరగానే ఆ ఇద్దరూ తమ శరీరాలు వదిలివేశారు. కానీ సర్వ జనోద్ధరణమనే దత్తావతారకార్యం సృష్టివున్నంత వరకూ  కొనసాగవలసిందే. కనుక దత్త స్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యమూ  భూమిపై సంచరిస్తుంటాడు. దత్తాత్రేయుడే  ఆది గురువు. పూర్వం భగవంతుడు మత్స్య, కూర్మ రూపాలలో అవతరించాడు. అలాగే ఈ కలియుగంలో కూడా ఇప్పటికి రెండుసార్లు అవతరించాడు. కలియుగంలో అజ్ఞానులకు గోచరం కాకపోయినా, ఆ రెండు అవతారాలు ఇప్పటికీ కూడా భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నారు. ఇతర యుగాలలో కర్మచేత తప్ప సిద్ధించని పుణ్యం ఈ కలియుగంలో పరిమిత కాలంలో సత్సంకల్పం  చేతనే సిద్ధిస్తుంది. కనుక ఇట్టి కలియుగంలో జన్మించి, బుద్ధిపూర్వకంగా శ్రీగురుణ్ణి ఆరాధించి తరించడమెంతో సులభం. అట్టి అవకాశం పూర్వ పుణ్యం చేత నీకు లభించింది. కనుక నేను చెప్పే గురు కథలు శ్రద్ధతో విను" అన్నారు సిద్ధయోగి. నామధారకుడు దత్తావతరణం  గురించి విని ఆనందించి, " ఆహా! అలనాటి అనసూయాదేవి పాతివ్రత్యం వలన మానవాళికి గురుపరంపర, అందువలన మా వంటి అజ్ఞానులకు మీవంటి గురువుయొక్క కృప లభించాయి "అన్నాడు.        


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   



 నాలుగవ అధ్యాయం సమాప్తము 

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...