అధ్యాయము -14
శ్రీ గణేశాయనమః శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః
కథారంభము
నామధారకుడు, "స్వామీ ! అటు తర్వాత శ్రీ గురుడు యేమేమి చేసారో చెప్పండి" అన్నాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు :
"భోజనాలయ్యాక సాయందేవుడు శ్రీగురుని పాదాలు ఒత్తుతూ, ' సద్గురూ ! మీ పాదసేవ వలన నా జన్మ, సత్కర్మలు సార్థకమయ్యాయి. నీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు. ధన్యుణ్ణి. మాయచేత మానవునిలా కనిపిస్తున్నారే గాని, మీరు సాక్షాత్తూ భక్తులను ఉద్దరించడానికి అవతరించిన భగవత్స్వరూపులే. మీ మహిమ వేదాలకే అంతుబట్టనిది. అట్టి మీకు సేవచేసే అవకాశం నాకనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు. కాని నాదొక విన్నపమున్నది : ప్రస్తుతము నేనొక కష్టంలో ఉన్నాను. వేరేదారిలేక, నేనొక యవనరాజు సేవలో ఉన్నాను. అతడు నరరూపరాక్షసుడే. అతడు ప్రతిసంవత్సరమూ ఒక బ్రాహ్మణుని చంపుతాడు. నన్ను బలివ్వాలని తలచి, ఇంతకు ముందే నాకు కబురు పంపాడు. నేనిప్పుడతని వద్దకు వెళ్లాలి తప్పదు. నన్ను మీరే కాపాడాలి' అన్నాడు. శ్రీ గురుడు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి, ' నాయనా! భయపడకు. ఆ యవనుడు నిన్ను ఏమీ చేయలేడు. భగవంతుడు సర్వానికీ యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేమిక్కడే వుంటాము. దీర్ఘాయుష్మాన్ భవ!' అని పంపారు.
సాయందేవుడు శ్రీ గురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురు పంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. సాయందేవుడు భయంతో శ్రీగురుని ధ్యానించాడు. అంతఃపురంలోకి వెళ్ళిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయము, చనిపోతున్నంత బాధ కలిగి, సృహతప్పి పడిపోయాడు. అప్పుడతనికొక స్వప్నమొచ్చింది., ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి, విపరీతమైన బాధ కలిగింది. అతనికి స్పృహ వచ్చేసరికి, తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధాకరమో తెలిసివచ్చింది. పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి, సాయందేవుని పాదాలపై పడి, ' అయ్యా! మిమ్మల్ని నేను పిలిపించలేదే! మీరు ఇంటికి వెళ్ళవచ్చు' అని, వస్త్రభూషణాలతో ఘనంగా సత్కరించి పంపాడు!
సాయందేవుడు శ్రీ గురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరత్వరగా తన గ్రామం చేరి శ్రీగురుని తో జరిగిందంతా చెప్పాడు. ఆయన సంతోషించి 'నాయనా! మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము' అన్నారు. అతడు నమస్కరించి, 'స్వామీ ! నాకు మీరు ప్రసాదించిన ఈ జీవితశేషాన్ని మీ సేవకే అంకితము చేస్తాను. అనుగ్రహించండి. మీ పాద సన్నిధి విడచి బ్రతుకలేను. నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు. నేను కూడా మీ వెంట వస్తాను' అని వేడుకున్నాడు. శ్రీ గురుడు, 'నాయనా! నాకు ఆత్మ సమర్పణం చేసుకున్నావు. నీ అభీష్టం నెరవేరుతుంది. మేము ఒక పనిమీద వెళ్తున్నాము. 16 సంవత్సరములకు మళ్ళీ మేము వచ్చి, ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము. నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకూ ఇక్కడే సుఖంగా ఉండు' అని ఆశీర్వదించి, శిష్యులతో కలసి పాదచారియై అనేక పుణ్య క్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాధం చేరారు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు". అది విని నామధారకుడు, "స్వామీ ! అపుడు శ్రీ గురునితో అనేకమంది శిష్యులున్నారు గదా! వాళ్ళు ఎక్కడున్నారు? శ్రీ గురుడు అక్కడ గుప్తంగా వుండి ఏమిచేసారు? " అని అడిగాడు.
పద్నాల్గవ అధ్యాయం సమాప్తము
శ్రీ దత్తాయ గురవేనమః
శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః - శ్రీ నృసింహ సరస్వత్యైనమః
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box