Monday, April 27, 2020

గురు చరిత్ర అధ్యాయము -13



అధ్యాయము -13




                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                       


 శ్రీ గురుభ్యోనమః 




కథారంభము




                   శ్రీ గురుని  కథ శ్రద్ధగా విని, పులకించిపోయిన నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, " స్వామీ, ఈ శ్రీగురుచరిత్ర ఎంత విన్నా తనివి తీరడం లేదు.  నా పరిస్థితి లేత పచ్చికను చవిచూచిన ఆకలిగొన్న ఆవు వలె వున్నది. నేనెంత అల్పజ్ఞుడనో, నాకిప్పుడు తెలుస్తున్నది. అజ్ఞానం వలన బ్రష్టుడనై  నేనే వెనుక కష్టాలు కొనితెచ్చుకున్నానని ( శ్రీ గురుని పక్షాన యెట్టి లోపమూ లేదనీ) తెలుసుకున్నాను. అజ్ఞానాంధకారంలో దారి కనిపించకున్న నాకు జ్ఞానజ్యోతి అయిన మీరే శ్రీగురుని చూపారు. మీ రూపంలో శ్రీ గురుడే నన్ను అనుగ్రహించారు. మీరు చేసిన మేలుకు నేను ఎన్నటికీ మీ ఋణం తీర్చుకోలేను. కల్పవృక్షానికి,  చింతామణికి,  జ్ఞానమిచ్చిన వారికీ  ఏమి చేసి ప్రత్యుపకారం చేయగలము? మీ బోధ వలన నాకు సర్వార్ధ సాధకమైన నిరంతర గురు స్మరణ కుదురుతోంది. దయతో అటు తరువాత శ్రీ గురుడు ఎక్కడకు  వెళ్లారో, ఏమి చేశారో సెలవియ్యండి" అని ప్రార్థించాడు.                                    





       సిద్ధయోగి సంతోషంతో అతని శిరస్సు న చేయి పెట్టి,  "నీ జన్మ ధన్యమయింది. శ్రీ గురుని పాదాలు నీ హృదయంలో చోటు చేసుకున్నాయి. కనుకనే యిలా కోరగల్గుతున్నావు. ఇందువలన నీవు తరించడమే గాక సాటివారిని గూడ తరింప జేయగలవు. నీవడుగుతుంటే మాకు కూడా ఆనందం కలుగుతున్నది" అని ఆ వివరాలిలా చెప్పారు :





              " శ్రీ గురుడు ప్రయాగలో వుండగానే వారి మహిమ గురించిన ఖ్యాతి  అన్ని దిక్కులా వ్యాపించి, ఎందరో ఆయనకు శిష్యులయ్యారు. వారిలో ముఖ్యుడు మాధవుడు. మాధవుడు,  సిద్ధుడు,  బాలుడు, ఉపేంద్రుడు,  జ్ఞానజ్యోతి,  సదానందుడు,  కృష్ణుడు అనే ఏడుగురము స్వామికి ముఖ్య శిష్యులము. మా అందరి పేర్లకూ  చివర 'సరస్వతి' అనే బిరుదుంటుంది. శ్రీ గురుడు మమ్ములను మరికొందరు శిష్యులనూ వెంటబెట్టుకొని అనేక తీర్థాలు,  క్షేత్రాలు పావనం చేస్తూ దక్షిణదేశం తిరిగి వచ్చి,  పూర్వాశ్రమంలో తమ జన్మస్థానమైన 'కారంజ' నగరం చేరారు. అపుడు  వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు ఆయన రాకకెంతో  సంతోషించారు. స్థానిక జనమంతా ఆయనను దర్శించి పూజించారు. వారిలో బ్రాహ్మణులందరూ స్వామిని తమ యింటికి భిక్షకు ఆహ్వానించసాగారు. శ్రీ గురుడు అందరి ఆహ్వానాలూ  అంగీకరించి,  ఒకే సమయంలో అనేక రూపాలలో అందరి యిళ్ళకూ వెళ్ళి భిక్ష చేసారు. అందరూ ఆ లీలకాశ్యర్యపడి  ఆయన సర్వవ్యాపకుడైన భగవదవతారమని గుర్తించారు.                                            





                ఒకరోజు ఆయన తల్లిదండ్రులకు శ్రీపాదుల రూపంలో మళ్లీ దర్శనమిచ్చారు.  వెంటనే అంబకు పూర్వజన్మ స్మృతి కలిగి భర్తతో, ' నాథా! క్రిందటి జన్మలో లోకపూజ్యుడైన కొడుకు కలగాలని నేను శ్రీపాదస్వామిని పూజించి,  వారి ఆదేశానుసారం శనిప్రదోషపూజ చేసాను. ఈ జన్మలో ఆ కోరిక నెరవేరి నా జన్మ సార్థకమైంది' అని చెప్పింది. అపుడా దంపతులు తమను సంసారసాగరం నుండి ఉద్ధరించమని ఆయనను కోరారు. అపుడు శ్రీ గురుడు, "ఏ వంశంలో ఉత్తముడైన సన్యాసి జన్మిస్తాడో, ఆ వంశంలోని  42 తరాలవారు తరిస్తారు. ఆ కులమంతటికీ  బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అంతకుముందు నరకంలో పడిన పితృదేవతలు గూడా బ్రహ్మలోకం పొందుతారు. మీ కులంలో నేను జన్మించాను గనుక మీకు బ్రహ్మపదం లభిస్తుంది. మీ పిల్లలు పూర్ణాయుష్మంతులై, అష్టైశ్వర్యవంతులై సుఖంగా జీవిస్తారు. మీరు వారి బిడ్డలను మనుమలను చూడగల్గుతారు. చివరిదశలో క్షేత్రాలన్నింటిలో ఉత్తమమైనది,  వేదాల చేత కీర్తించబడినదీ అయిన కాశీలో మీరు నివసిస్తారు. మీకు యెట్టి  చింతా  అవసరము లేదు' అని అభయమిచ్చారు.                     





                   అపుడు,  పూర్వాశ్రమంలో స్వామివారి సోదరియైన రత్న ఆయనకు నమస్కరించి,  'స్వామీ,  నాకు గూడా సంసార తాపత్రయం తొలగించి, నిర్లిప్తత ప్రసాదిస్తే తపస్సు చేసుకుంటాను' అని ప్రార్థించింది. అపుడు శ్రీ గురుడు నవ్వి, 'అమ్మా, స్త్రీలకు పతిసేవ వల్లనే మోక్షం లభిస్తుంది; అభీష్టాలు గూడా నెరవేరుతాయి. కాబట్టి భర్తయే పరమేశ్వరుడన్న భావంతో ఆయనను సేవించు. గృహిణులకు అది ఒక్కటే మార్గమని వేదం చెప్పింది'  అన్నారు. అప్పుడామె, 'స్వామీ ! మీరు త్రికాలజ్ఞులు, నా  ప్రారబ్ధమెలా వున్నదో,  నా భవిష్యత్తేమో తెలుపండి' అని కోరింది. శ్రీ గురుడు,  నీ సంస్కారం తామసికమైనది. పూర్వజన్మలో అన్యోన్యంగా ఉన్న దంపతులకు తగవు పెట్టి, వారిని విడదీశావు. అందువలన ఈ జన్మలో నీ భర్త నిన్ను విడిచి సన్యాసి అవుతాడు. పూర్వజన్మలో నీవొక ఆవును కొట్టి చంపావు. అందువలన నికీ జన్మలో కుష్టురోగమొస్తుంది' అని చెప్పారు. వెంటనే రత్న,  భయంతో ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి,'గురుదేవా, నన్ను రక్షించండి' అని వేడుకున్నది.శ్రీ గురుడు ఆమెను ఓదార్చి,  'అమ్మా, మా అనుగ్రహం వలన ఈ కర్మఫలం నీవు వృద్ధాప్యంలో అనుభవిస్తావు. నీకు కుష్టురోగమొచ్చినపుడు మా దర్శనమవుతుంది. నీకు కుష్టురోగం పొడచూపగానే దక్షిణ దిక్కునవున్న భీమానదీ  తీరంలోని పాపవినాశ క్షేత్రానికి వెళ్ళు. భీమా - అమరజా నదీ సంగమం దగ్గరనున్న గంధర్వపురంలో ఆ తీర్థమున్నది' అని చెప్పి,  శ్రీ గురుడు తమ శిష్యులతో కలిసి గోదావరి పుట్టిన క్షేత్రమైన నాసికకు బయల్దేరారు.     





                 నామధారకా! ఈ పరమ పవిత్రమైన గోదావరి నదిని 'వృద్ధగంగా' అంటారు. దాని ఒడ్డున ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. అదెలా వచ్చిందో చెబుతాను. పూర్వం మునులు భూమిపై వడ్లు చల్లి, తమ తపోమహిమ వలన ఆ రోజే పంట పండించుకునేవారు. ఒకరోజు బ్రహ్మర్షియైన గౌతముడు వడ్లు చల్లి, తపస్సుకు కూర్చున్న సమయంలో మునులందరూ సమావేశమై, 'ఈయనకొక సంకటం కల్పిస్తే,  ఈయన మనందరికోసమూ  గంగను భూలోకానికి తీసుకురాగలడు. జీవులన్నింటికీ ఆ నదీస్నానం వలన సద్గతి లభిస్తుంది' అని నిశ్చయించుకొన్నారు. అందరూ కలిసి ఒక ఆవును,  దూడను దర్భలతో తయారుచేసి,  తమ తపశ్శక్తితో వాటికి ప్రాణం పోసి,  గౌతముని పంట చేను పైకి తోలారు. అనుష్టానం చేసుకొంటున్న గౌతముడు,  ఆవును చూచి, తన చేతిలోని దర్భతో దానిని అదిలించాడు. వెంటనే ఆ ఆవు మరణించింది. గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానదిని భూమిపైకి రప్పించి, అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు. గౌతముడు అందుకంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు. అందుకే దీనిని 'గౌతమి' అంటారు. అదియే ఈ గోదావరి.ఇది గూడా గంగయంతటి పవిత్రమైనది గనుకనే శ్రీ గురుడు దాని పుట్టుక స్థానమైన త్రయంబకానికి వచ్చారు. తర్వాత ఆయన ఆ నది యొక్క రెండు తీరాలలోనున్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరీ పరిక్రమం చేసారు.     





                      ఆ పర్యటనలో శ్రీ గురుడు మంజరీకరమనే  క్షేత్రానికి వచ్చారు. అక్కడ మాధవారణ్య స్వామియనే ఒక సన్యాసి నరసింహావతారాన్ని పూజిస్తుండేవారు. ఒకరోజతనికి ధ్యానంలో తన యిష్ట దైవానికి బదులు శ్రీగురుని దర్శనమైంది. తర్వాత అతడు శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి, గద్గద కంఠంతో, ' మీరు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన వున్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహ స్వామియే!' అన్నాడు. 'మా దర్శనం వలన నీ సేవ ఫలించింది. ఇకనుండి ఆత్మభావంతో మమ్మల్నే ధ్యానిస్తూవుండు' అని శ్రీ గురుడు తమ దివ్యదర్శనం అనుగ్రహించారు. మాధవరణ్యుడు పారవశ్యంతో యిలా స్తుతించాడు:' ఓ జగద్గురు సార్వభౌమా! మీకు జయము, జయము. నరునిలా కనిపిస్తున్నా, మీరు త్రిమూర్తి స్వరూపము, లోకాలనుద్దరించే జగజ్యోతియైన పరమ పురుషులు! మీ పాదదర్శనం వలన కృతార్థుడనయ్యాను'. శ్రీ గురుడు, 'మాధవారణ్యా! నీకు మంత్రసిద్దియై, నిశ్చయమైన పద్ధతి లభించింది. నీవు నిత్యమూ మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేసావు గనుకనే మా ప్రత్యక్షదర్శనం లభించింది. నీకు శాశ్వత బ్రహ్మపదం లభిస్తుంది' అని ఆశీర్వదించి,  గోదావరీ  పరిక్రమం కొనసాగించారు.





          తర్వాత శ్రీ గురుడు,  వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి, స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు.ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. అన్నం తింటే చాలు,  అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది. ఒక మహర్నవమినాటికి అతడు భోజనం చేసి నెలరోజులయింది. ఆ రోజతడు కడుపునిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. 'అన్ని జీవులకూ  ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు' అనుకుంటూ అతడా రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు. అతడు తన మెడకొక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి, 'స్వామీ,  నేను పూర్వ జన్మలలో పేదలకు అన్నదానం చేయలేదో,  అతిథులను ధిక్కరించానో,  ఈ జన్మలో భూమికి భారమయ్యాను. ఎట్టి పుణ్యము గతజన్మలో చేయనందువల్లనే గాబోలు,  ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం గూడా అనుభవించలేదు. బ్రాహ్మణుల జీవనమో, పశువుల గ్రాసము అపహరించో, నమ్మినవారికి ద్రోహం చేసానో, తల్లిదండ్రులను అవమానించానేమో, లేక ఎన్నో జీవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానో,  తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేసానో,  లేక వధూవరులను చంపానేమో! లేకుంటే, అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకొస్తుంది? ఈశ్వరుని భక్తితో పూజించలేదో, లేక నేను సద్గురువును నిందించానేమో! లేకుంటే నన్నే దైవమూ  ఎందుకు అనుగ్రహించదూ? " అని పరితపించి నది ని సమీపించాడు.                            




                 సరిగ్గా సమయానికి శ్రీ గురుడు తమ శిష్యులతో కలసి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు. ఆ బ్రాహ్మణుని చూచి ఆయన,  అతనిని తీసుకురమ్మని శిష్యులను పంపారు. శిష్యులు పరుగునపోయి నీటిలో మునిగబోతున్న ఆ విప్రుని బలవంతాన  శ్రీ గురునివద్దకు తీసుకువచ్చారు. స్వామి అతనితో, 'బ్రాహ్మణుడా! ఆత్మహత్య మహాపాపమని తెలిసి గూడా నీవందుకే పాల్పడుతున్నావేమి? ' అనడిగారు. ఆ బ్రాహ్మణుడు,  'స్వామీ! నన్నీ  విషయం అడిగి మాత్రం ప్రయోజనమేమున్నది? పక్షానికీ, నెలకూ ఒక్కసారి భోజనం చేసినా గూడ భరించరాని బాధ కలుగుతున్నది. అన్నం తినకుండా నేనెలా బ్రతికేది? నేను జీవించడం వలన భూమికి భారమే గాని,  ప్రయోజనమేమున్నది? ' అని చెప్పి కన్నీరు కార్చాడు. శ్రీ గురుడు, 'నాయనా! క్షణంలో నీ బాధ పోగొట్టగల ఔషధమిస్తాను,  భయంలేదు. ముందుగా నీవు నిర్భయంగా రుచికరమైన భోజనం చేయి' అన్నారు.                                         





                 ఆ బ్రాహ్మణుడు ఆయన పై విశ్వాసముంచి శ్రీ గురునికి నమస్కరిస్తూండగా, ఆ గ్రామాధికారి గూడ వచ్చి నమస్కరించాడు. శ్రీ గురుడు,  'నీవెవరు?  ఎక్కడుంటావు?' అని అడిగారు. ఆ గ్రామాధికారి,'స్వామీ, మాది ఆపస్తంభశాఖ,  కౌండిన్యస గోత్రము.నన్ను సాయందేవుడంటారు. మా స్వస్థానం (కడకంచి) కాంచీపురం. కేవలం భుక్తి కోసం ఒక యవనరాజు సేవలో సంవత్సరంనుండి పనిచేస్తున్నాను. మీ దర్శనం వలన నా జన్మాంతర పాపాలన్నీ  నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయాలలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షం తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించిన తమ దర్శనం తక్షణమే పాప, తాప, దైన్యాలను హరించి, ధర్మార్థ కామ మోక్షాలను  ప్రసాదించగలదు. నా అదృష్టం వలన అప్రయత్నంగానే మీ దర్శనమయింది' అని స్తుతించాడు.                 





                         శ్రీ గురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకుని,  'సాయందేవా! నేనొక మాట చెబుతాను, విను. ఈ బ్రాహ్మణునికి ఉదరశూలరోగమున్నది. భోజనము లేకుండా ఇతడేలా బ్రతుకుతాడు?  ఇతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కనుక నీవితనిని తీసుకువెళ్లి మంచిభోజనం పెట్టు' అని ఆదేశించారు. సాయందేవుడు ఆశ్చర్యచకితుడై, 'స్వామీ, నెలరోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే యితడా బాధ భరించలేక యిప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనం పెడితే బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందేమో!' అన్నాడు. స్వామి నవ్వి,'అలా అయితే ఇంకా మంచి మందు చెబుతాను విను! నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము,  గారెలతో గూడిన భోజనమే పరమౌషధము. నీవు సంకోచించక యితనిని తీసుకుని వెళ్లి అలాంటి భోజనం పెట్టు' అన్నారు. సాయందేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని గూడా భిక్షకు ఆహ్వానించాడు.                                   




                  అప్పుడు శ్రీ గురునితో పాటు అందరమూ సాయందేవుని ఇంటికి వెళ్ళాము. ఆ పుణ్యదంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని,  మిగిలిన అతిధులను కూర్చోబెట్టి,  రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ, శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారు. శ్రీ గురుడు సంతోషించి, 'నీ సంతతి వృద్ధి పొందుగాక! నీ వంశస్థులందరికీ మాయందు భక్తి కల్గు గాక!' అని సాయందేవుని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ దంపతులు,  అందరికీ షడ్రసోపేతమైన భోజనం పెట్టారు. శ్రీ గురుని కృపవలన ఉదర రోగియైన బ్రాహ్మణునకు ఆ భోజనం అమృతంలా పనిచేసి, అతనిరోగబాధ  మాయమైంది.             


 పదమూడవ అధ్యాయం సమాప్తము.



శ్రీ దత్తాయ గురవేనమః 



శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...