Monday, April 20, 2020

గురు చరిత్ర అధ్యాయము -7

అధ్యాయము  -7




                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                                                                               
   శ్రీ గురుభ్యోనమః 

కథారంభము

              నామధారకుడు సిద్ధయోగికి  నమస్కరించి, "స్వామీ, ఈ గోకర్ణక్షేత్ర మహిమ యింకొంచెం విపులంగా వివరించండి. మన దేశంలో యెన్నో  పుణ్యతీర్థాలు ఉండగా శ్రీపాద స్వామి ఈ క్షేత్రాన్ని ఎందుకు ఆశ్రయించారో  చెప్పండి" అని వేడుకున్నాడు.   


            అప్పుడు సిద్ధయోగి యిలా చెప్పారు: "పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడను  పేరు గల రాజు వేదమార్గతత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవారు . ఒకనాడతడు అడవికిపోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైన ఒక రాక్షసుణ్ణి  చూచాడు. రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ  తన సోదరుని  పిలిచి,  రాజుపై ప్రతీకారం తీర్చుకోమని  ఆదేశించాడు. అతని సోదరుడు తన రాక్షసమాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజువద్దకొచ్చి, ఎంతో వినయంతో అతనికి సేవ చేయసాగాడు. ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశ్రాద్దానికి వశిష్ఠాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు
ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు. భోజన సమయంలో వశిష్ఠమహర్షి అది తెలుసుకుని రాజుపై కోపించి, 'రాజా! నీవు మాకు నిషిద్ధమైన నరమాంసం వడ్డించావు  గనుక నీవు బ్రహ్మరాక్షసుడవవుతావు!' అని శపించాడు. ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు  రాజు కోపించి ఆయనకు ప్రతి శాపమివ్వబోతుంటే  పతివ్రత అయిన అతని భార్య దమయంతి అడ్డుపడి,  గురువును శపించబూనడం మహాపాపమని హెచ్చరించి, ఆ శాపజలాన్ని తన పాదాల పైనే పోసుకోమని  ప్రార్థించింది. రాజు తన కోపాన్ని నిగ్రహించుకుని, శాపకల్మషమైన        ( అపవిత్రమైన ) తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకుని, వశిష్ట శాపం వలన బ్రహ్మరాక్షసుడై, పై కారణంగా కల్మషపాదుడనే  పేరు గ్రహించాడు. అప్పుడు శాపవిముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠమహర్షి జాలి చెంది 'అమ్మా, నీ భర్తకు 12 సంవత్సరముల తర్వాత బ్రహ్మ రాక్షసత్వం పోతుంది' అని ఆశీర్వదించి, తమ ఆశ్రమానికి వెళ్ళి పోయారు.                    


      అప్పటినుండి కల్మషపాదుడు  ఘోరమైన ఆ అరణ్యంలో నివసిస్తూ అచ్చటి క్రూర జంతువులను, మనుషులను పట్టుకొని తింటుండేవాడు. అతని బ్రహ్మ రాక్షస రూపం ఛాయలా  అతనెప్పుడూ వెంటాడుతుండేది. ఒకసారి అతడొక బ్రాహ్మణ శ్రేష్ఠుని  చంపి తిన్నాడు. అందుకా బ్రాహ్మణుని భార్య శోకంతో, నీకు వశిష్ట శాపం తీరి నీ పూర్వ రూపాన్ని పొందాక, నన్నూ, నా భర్తనూ ఎడబాటు చేసిన పాపానికి భార్య సంగమం చేస్తే నశిస్తావు' అని శపించింది. కొంతకాలానికి వశిష్ట శాపం నుండి విముక్తుడైన  రాజు తన నగరంలో ప్రవేశించాడు. అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నది. ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు క్రొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెప్పాడు. భార్యాభర్తలిద్దరూ ఖిన్నులై, ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు. మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని సందర్శించి తమ విషాద గాధ విన్నవించుకున్నారు. అది విని జాలి చెందిన గౌతమ మహర్షి, 'రాజా, భయపడవద్దు పాపాల అన్నింటిని పారద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైన గోకర్ణక్షేత్రముండగా బ్రహ్మహత్యాపాతకం నిన్ను ఏమి చేయగలదు; ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే. అక్కడ శిలలన్నీ  శివలింగాలే ! ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందారనిదేమున్నది? ఆ క్షేత్రమహత్యాన్ని తెల్పే  విషయం ఒకటి నేనక్కడ చూచినది చెబుతాను. ఆ క్షేత్రంలో మరణించినా ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకోవడానికై  శివకింకరులు వచ్చారు. వారిని అడగ్గా  వారిలా  చెప్పారు :    

                  "పూర్వము ఈమె సౌదామిని అను అందమైన ఒక బ్రాహ్మణకన్య. ఆమెకు యుక్త వయస్సు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణుని తో ఇష్టంలేని వివాహం  బలవంతంగా చేసారు. కొద్దికాలానికే, ఆమెకు పిల్లలు కలగకముందే, ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆమె కామవశం  చేత ఒక కోమిటి వాణ్ణి  ఉంచుకున్నది. జారత్వం ఎన్నటికీ దాగదు గదా! త్వరలో ఆ రహస్యం బంధువులందరకూ  తెలిసి,  వారామెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అప్పటి నుండి ఆమెఅప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించనారంభించింది. అతని దుస్సాంగత్యంతో  మద్యపానానికి గూడా అలవాటు పడింది. ఒకనాడామె కల్లు  త్రాగిన మైకంలో ఆవుదూడ నొకదానిని మేక అనుకొని చంపి, దాని తలను మరునాటికని దాచి, మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది. మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి, ఆవుదూడ శిరస్సును చూచి నిజాన్ని కప్పి పుచ్చుకుంటూ, 'అయ్యయ్యో  ఆవుదూడను పులి తిని పోయింది' అని వలవల ఏడ్చింది. ఆమె ఇటువంటి పాపాలనేకం చేసి, నరకంలో శిక్షలను అనుభవించి కర్మ శేషం వలన ఈ జన్మను పొందింది. ఈ జన్మలో ఆమె పుట్టుగ్రుడ్డి, కుష్ఠురోగి అయ్యి  కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషించబడింది. వారు మరణించాక దిక్కు లేక ఆకలితో అలమటిస్తూ, ఒక శివరాత్రినాడు అందరినీ భిక్ష కోసం యాచించింది. ఆనాడు అన్నం ఎవరు వండరు గనుక, ఆమె చేతిలో కొద్ది మారేడు దళాలు మాత్రం ఉంచారు. అవి తినడానికి పనికి రావని తలచి, ఆమె వాటినన్నింటిని జారవిడిచింది. ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది. అదే ఆమె చేసిన శివ పూజ. ఆ రోజంతా తిండి లభించని అందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఈ విధంగా ఆమె ఉపవాసము, జాగరణ గూడా చేసినట్లయింది. ఆ రోజంతా ఆమె శివ నామ సంకీర్తనం విన్నది. తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలైంది. ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్ములను శంకరుడు పంపాడు" అని చెప్పారు. అప్పుడా శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి, దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్లారు. అబుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితముంటే, ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా? కనుక ఓ రాజా! నీవు గోకర్ణక్షేత్రానికి వెళ్లి మహాబలేశ్వరుని  సేవించు. బ్రాహ్మణీ శాపం నుండి విముక్తుడవవుతావు' అని గౌతమమహర్షి ఆ క్షేత్రమహత్యాన్ని ఇంకా ఇలా వివరించారు:    



                         గోకర్ణమంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు, నక్షత్రాల వంటివనుకుంటే,, గోకర్ణం పాపమనే కారు చీకట్లను నశింపజేసే సూర్యుని వంటిది. ఆ క్షేత్ర దర్శనము ,స్మరణముల  వలన కూడా సర్వపాపాలూ నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలు అందరూ తపస్సు చేసి శివ అనుగ్రహము వలన తమ అభీష్టాలను పొందారు. అక్కడ మహాబలేశ్వరునికి  బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు,  విశ్వదేవతలు, మరుద్గణాలు, సూర్య చంద్రులు, అష్ట వసువులు తూర్పు ద్వారంలోనూ, యమధర్మరాజు,  చిత్రగుప్తుడు,  అగ్నిదేవుడు, ఏకాదశరుద్రులు,  పితృదేవతలు  దక్షిణద్వారం లోనూ; వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారం లోనూ, కుబేరుడు భద్రకాళి, వాయుదేవుడు, సప్తమాతృకలు ఉత్తరద్వారం లోనూ;విశ్వావసువు, చిత్రరధుడు మొదలైన గంధర్వులు నిత్యము  నిలిచి ఆయనను ఉపాసిస్తుంటారు.   కశ్యపుడు,  అత్రి, వశిష్టుడు, కణ్వుడు మొదలైన మునీశ్వరులు; కృతయుగంలో విశ్వామిత్రుడు,  జాబాలి,  భరద్వాజుడు మొదలైన మహర్షులూ, సనక సనందనాది బ్రహ్మ మానస పుత్రులు, నారదాది దేవర్షులు, సిద్ధులు, సాధ్యులు, మునీశ్వరులు, యతులు, నిత్యము గోకర్ణేశ్వరుని  ఉపాసిస్తున్నారు. రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు. కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు, లక్ష రెట్లు మంచి ఫలితమిస్తాయి. అప్పుడా రాజు, భార్యాసమేతంగా గోకర్ణం వెళ్లి మహాబలేశ్వరుని  సేవించి శాపవిముక్తుడయ్యాడు. 




             కనుక ఓ నామధారకా ! ఎందరో సజ్జనులకాశ్రయమైన గోకర్ణ క్షేత్రం, వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది. అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది. అందుకే సాధుజీవనుడైన శ్రీపాద స్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి, అక్కడ మూడు సంవత్సరాలుండి, ఆ క్షేత్ర మహత్యాన్ని  పునరుద్ధరించారు. తరువాత ఆయన కృష్ణా తీరంలోని కురువు పురానికి వెళ్లి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరచారు".                        



ఏడవ అధ్యాయం సమాప్తము

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   








No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...