Monday, April 20, 2020

గురు చరిత్ర అధ్యాయము -6

అధ్యాయము -6




                                శ్రీ గణేశాయనమః                             శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
    శ్రీ గురుభ్యోనమః 



                            
కథారంభము

               నామధారకుడు  ఇలా అన్నాడు. " కాశీ, బదరీ, కేదారం వంటి క్షేత్రాలు  ప్రసిద్ధమైనందువలన శ్రీపాద స్వామి అక్కడకు వెళ్లారు. కాని  వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు. ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించగోరుతున్నాను".    


                        దానికి సిద్ధుడు ఇలా చెప్పారు. " పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి, నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తుండేది . బలగర్వితుడైన  రావణుడు అదిచూచి శంకరునితో గూడా కైలాస పర్వతాన్ని తెచ్చి  తన తల్లికి సమర్పించాలనుకున్నాడు. అతడు అక్కడకు వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు. అపుడు,   భూమి కంపించి పోయింది. లోకాలన్నీ  అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి, అట్టి  ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి  ప్రార్థించింది. శివుడు, రావణుణ్ణి కైలాస పర్వతం కింద  అణగిపోయేటట్లు తొక్కాడు.  అపుడు రావణుడు ప్రాణాపాయంలోబడి, దీనాతిదీనంగా శంకరుని ధ్యానించాడు. కరుణాసముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై, రావణుని లేవనెత్తాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా, సుస్వరంగా మధురగానం చేశాడు. మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు. అప్పుడా రాక్షస రాజు, ' దేవా! బంగారం తో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికీ లభించేది      గాదు. సాక్షాత్తు లక్ష్మీ దేవియే నాకు దాసి;  చతుర్ముఖుడైన బ్రహ్మయే నా జ్యోతిష్కుడు. యమధర్మరాజు నా సేవకుడు; సర్వదేవతలు నా పరిచారకులు. అటువంటి నాకు యెక్కడా  యేదీ  దుర్లభంగాదు. ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకు పోదామని వచ్చాను. శంకరా ! నీవు వరమీయదలచుకుంటే నేనీ  కైలాసాన్ని నీతోసహా లంకకు తీసుకు పోయే లా అనుగ్రహించు.' అని కోరాడు.అపుడు  కైలాసపతి, 'రావాణా !ఈ కైలాస పర్వతంతో ఏమి సాధిస్తావు? దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను. దీని వలన నీవు నా అంతటివాడవవుతావు. నీ లంకానగరమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది 'అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు. దానిని తీసుకొని సంతోషంతో రావణుడు లంకకు బయల్దేరాడు.             




                 ఇదంతా చూచిన నారదుడు  యీ వృత్తాంతం బ్రహ్మకు, విష్ణువుకూ విన్నవించాడు. ఆ ముగ్గురూ శివుని దగ్గరకు వెళ్లి, ' ఎంత పని చేసావు! రావణుడికి ఆత్మలింగమెందుకిచ్చావు? సర్వప్రాణకోటికీ, కంటకప్రాయుడు, లోకభయంకరుడూ , అయిన రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా? అని వాపోయారు. అప్పుడు శంకరుడు, అతని గానానికి పరవశించి ఆత్మలింగమిచ్చాను. వాడిప్పటికింకా లంకకు చేరివుండడు. ఉపాయమాలోచించు' అని విష్ణువుతో చెప్పాడు. అది విని శ్రీహరి, దుర్మార్గున్ని మోసం తోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని   నారదుని, గణపతినీ  ప్రేరేపించాడు. అప్పుడుదేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి, రావణా ! ఎక్కడ నుండి వస్తున్నావు? ఎక్కడకు పోతున్నావు? అన్నాడు. రావణుడు, శివుని ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నాను' అని దానిని చూపాడు.         




             రావణున్ని మాటలతో  యేమార్చాలని నారదుడు,"రావణా ! పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవిదున్నలన్నింటినీ  చంపుతుండేది. త్రిమూర్తులు దానిని వేటాడి, సంహరించి, దాని కొమ్ముల లో నుంచి తల ఒక లింగము తీసుకున్నారు. ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఈ లింగం తత్సంబంధమైనదే  గాబోలు. ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది. సాక్షాత్తూ శివ సాయుజ్యం ప్రసాదింపగలదు'. అని దాని ప్రభావం వివరించబోయాడు. రావణుడు, 'మహర్షి దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు తీరిక లేదు. తొందరగా వెళ్ళాలి అన్నాడు. ఆ దేవర్షి, రావణా, సంధ్యా సమయం దాటిపోతున్నదే ! నీవెలా వెడతావు?' అని  అక్కడే కూర్చున్నాడు.                    




        ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు. అతనిని చూచి రావణుడు, నీవెవరు? ఎవరి పిల్ల వాడవు? ఎక్కడకు పోతున్నావు? అని అడిగాడు. ఆ బ్రహ్మచారి, నేను ఉమాశంకరుల పుత్రున్ని, నన్ను పోనివ్వు, నిన్ను చూస్తేనే నాకు భయమేస్తోంది' అన్నాడు. అపుడు రావణుడు, ఓ బ్రహ్మచారీ! నేను సంధ్య వార్చుకొని వచ్చేవరకూ ఈ శివలింగాన్ని పట్టుకో నాకీ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకా పట్టణాన్ని చూపిస్తాను, నీకిష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు. ఆ వటువు, అమ్మో, ఇంత బరువైన శివలింగాన్ని నేనంతసేపు మోయగలనా? అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురికి నేను రాను బాబూ !అన్నాడు. రావణుడు ఆ భ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి, సంద్యోపాసనకై సమీపంలోని సముద్రం వద్దకు బయల్దేరాడు. ఆ బ్రహ్మచారి, రావణా !దీనినిక మోయలేనపుడు ఎలుగెత్తి  మూడుసార్లు పిలుస్తాను. అపుడు నీవు రాకపోతే దీనినిక్కడే స్థాపిస్తాను' అన్నాడు.              




                    రావణుడు ప్రక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతనిని మూడు సార్లు పిలిచి, అతడు రాని కారణంగా, స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి, ఆ లింగాన్ని భూస్థాపితం చేసాడు. తరువాత రావణుడు తిరిగివచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకిలింప చూచాడు. భూమి కంపించిందే గాని, ఆ లింగం కొంచెమైనా కదల్లేదు. అందుకే దానికి మహాబలేశ్వర లింగమని పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి వలన గోకర్ణమని  పేరు వచ్చింది. నామధరకా ! దానిని భూకైలాసమనవచ్చు. అక్కడ శివుడు సపరివారంగా  నివశిస్తాడు. అందుకే అది సజ్జనులెందరికో ఆశ్రయమైంది. అక్కడ దేవర్షులు కూడా నివశిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరకు పశుపక్ష్యాదులు గూడా శివుని అనుగ్రహం వలన తమ అభీష్టాలను పొందారు. అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు.                                          

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

ఆరవ అధ్యాయం సమాప్తము.





No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...