అధ్యాయము -16
శ్రీ గణేశాయనమః శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః
కథారంభము
నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, " మహాత్మా, అప్పుడు శ్రీగురుని ఆజ్ఞననుసరించి తీర్థయాత్రలకు వెళ్ళిన శిష్యులెవ్వరు ? అటుపై ఏమి జరిగింది? " అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు : " నామధరకా ! నీవు గురు భక్తులలో ఉత్తముడివి. ఇంతకాలము నన్ను గురుకథ చెప్పమని ఎవరూ కోరనందువలన నా మనస్సు నివురుగప్పినట్లయింది. నీవిప్పుడు ఆయన గురించి ఇంతగా ఆసక్తితో అడుగుతుంటే నీకు చెబుతుండడం వలన ఆయన కథలు గుర్తుతెచ్చుకున్నకొద్దీ నా మనస్సు మేల్కొన్నట్లవుతున్నది. ఆనంద పారవశ్యం కలుగుతున్నది. నీవు కూడ నాకెంతో ఉపకారం చేసావు. నీవు వయసులో చిన్నవాడైనా, శ్రీ గురుని అనుగ్రహము వలన లోకశ్రేష్ఠుడవవుతావు. నీ వంశమంతా పుత్ర, పౌత్ర, ధన, ధాన్యాలతోనూ, సుఖశాంతులతోనూ, విలసిల్లుగాక ! శ్రీ గురుని చరిత్ర చెబుతాను. అది మానవులకు కోరదగినవన్నీ ప్రసాదించడం లో కామధేనువు వంటిదని ప్రమాణం చేసి చెబుతున్నాను. శ్రద్ధగా విను : శ్రీ గురువు ఆజ్ఞను అనుసరించి శిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్లారు. నేను మాత్రం వారిని సేవిస్తూ వారి చెంతనే ఉండిపోయాను. అప్పటినుండి ఒక సంవత్సరముపాటు శ్రీ గురుడు వైద్యనాధంలోనే గుప్తంగా ఉండిపోయారు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి, 'స్వామీ, నేను ఆత్మసిద్ధికై ఎంతో కాలం తపస్సు చేసినా గాని, నా మనస్సు యే మాత్రమూ ప్రశాంతమవలేదు. కానీ మీ దర్శనం చేతనే నాకెంతో ఆనందం కలుగుతున్నది. నా మనస్సు స్థిరమవకపోవడానికి కారణం ఏమిటి? మీరు లోకాన్ని తరింపజేయడానికి అవతరించిన దైవస్వరూపులు. నన్ను అనుగ్రహించి నాకు తగిన ఉపదేశం చేయండి. మిమ్ములను శరణు వేడుతున్నాను' అన్నాడు.
శ్రీ గురుడు నవ్వి, ' నాయనా, నీవు గురువును ఆశ్రయించకుండానే తపస్సు ఎలా చేశావు? ' అని అడిగారు. అతడు కన్నీరు కారుస్తూ, 'స్వామీ ! మొదట నేను ఒక గురువును ఆశ్రయించి చాలాకాలం సేవించాను. కానీ ఆయన నా చేత అన్ని సేవలు చేయించుకుంటూ నన్నెప్పుడూ తిరుగుతుండేవారు గాని, నాకేమీ నేర్పలేదు. ఎప్పటికప్పుడు, " నీకింకా బుద్ధి స్థిరం కాలేదు" అని చెప్పి, నాకు వేదముగాని, శాస్త్రంగాని, భాష్యంగాని చెప్పలేదు. అందువలన ఒకసారి నేను ఆయన చెప్పిన సేవ చేయలేదు. అప్పుడాయన నాపై ఎంతో కోపించి తీవ్రంగా నిందించాడు. వెంటనే నేను ఆయనను విడిచి వచ్చేసాను' అని చెప్పాడు. శ్రీ గురుడు ముక్కుమీద వేలువేసుకుని, 'అయ్యో బ్రాహ్మణుడా! ఎంతపని చేసావు? నీవు చేసిన పని ఆత్మహత్యయంతటి మహాపాపం. నిజానికి నీవే నీలో దుర్గుణాలను తెలుసుకోలేక, గురువును నిందిస్తున్నావు. నీకింక మనస్సు నిశ్చలం ఎలా అవుతుంది? దొరికిన కామధేనువు వంటి గురువును విడిచి నీవు ఎక్కడికి పరుగెడితే మాత్రం నీకు జ్ఞానం ఎలా లభిస్తుంది? గురుద్రోహికి ఇహంలోనూ, పరంలోనూ సుఖం ఉండదు. అతడికి జ్ఞానం ఎన్నటికీ కలుగదు; అజ్ఞానాంధకారంలో చిక్కు పడవలసిందే. గురువుని ఎలా సేవించాలి తెలిసినవాడికే వేదవేదాంగాలు తెలిసి సర్వజ్ఞుడవుతాడు. అష్టసిద్ధులూ అతనికి అధీనమవుతాయి. నీవంటి గురుద్రోహి ముఖం చూడడం కూడా అపశకునమవుతుంది. దేవాలయంలో మలవిసర్జన చేసి, అందుకు తిట్టినవాణ్ణి తప్పపట్టినట్లుంది నీ పని!' అన్నారు. అప్పుడా విప్రుడు భయపడి, దుఃఖంతో స్వామి పాదాలపైబడి, ' పరమగురూ ! జ్ఞానసాగరా ! బుద్దిహీనుడై తెలియక గురు ద్రోహం చేశాను. గురువును ఎలా తెలుసుకోవాలో, సేవించాలో తెలిపి నన్నుధరించండి' అని దీనాతి దీనంగా ప్రాధేయపడ్డాడు. శ్రీ గురుడు అతని దైన్యానికి కరిగిపోయి అపార కరుణతో ఇలా చెప్పారు :"నాయనా! గురువే తల్లి, తండ్రి. ఆయనయే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రత్యక్ష రూపం. నిజమైన మేలు చేయగలవారు ఆయనొక్కరే. ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో, పట్టుదలతో గురువును సేవించాలి. అది తెలిపే టందుకు నీకు ఒక పురాణోపాఖ్యానం చెబుతాను విను.
ద్వాపరయుగంలో ధౌమ్యుడనే మహర్షి ఉండేవారు. ఆయన దగ్గర అరుణి, భైదుడు, ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ, ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారు. అహంకారము మొదలైన దోషాలు తొలగి, మనస్సుకు శుద్ధికి కలగడానికి వెనుకటి గురువులు శిష్యులు చేతసేవలు చేయిస్తూ ఉండేవారు. అతని సేవనుబట్టి అతని గురుభక్తిని, మనస్సుద్దినీ నిరూపించి అనుగ్రహించేవారు.
ఒకనాడు ధౌమ్యుడు, అరుణిని పిలిచి , ' నీవు మన పొలానికి వెళ్లి, చెరువు నుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరిపైరు ఎండిపోతుంది' అని చెప్పారు.అరుణి వెంటనే వెళ్ళి చెరువునుండి కాలువద్వారా నీరుపెట్టాడు. కానీ కాలువకు ఒకచోట గండిపడి నీళ్లన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి, రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలువలేదు. అప్పుడతడు, ప్రాణం పోయినా సరే, గురువు చెప్పినది చేసితీరాలన్న నిశ్చయంతో, ఆ గండికి తాను అడ్డుపడుకొని గురువును ధ్యానిస్తున్నాడు. అప్పుడా నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించింది. చీకటిపడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి ధౌమ్యుడువచ్చి, పొలం నిండుగా నీరు ఉండడం గమనించారు. కానీ శిష్యుడే కనిపించలేదు. అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించి, ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచారు. అరుణి సమాధానం ఇవ్వలేక కొంచెంగా శబ్దం చేసాడు. దానిని బట్టి ధౌమ్యులవారు వచ్చి శిష్యుని లేవనెత్తి, కౌగిలించుకొని, సంపూర్ణంగా అనుగ్రహించారు. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు ధౌమ్యమహర్షి, ' నాయన! నీవు ఇంటికి వెళ్లి, తగిన కన్యను వివాహమాడి స్వధర్మమాచరించు. కృతార్థుడవవుతావు' అని ఆదేశించారు. అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్లి, లోకపూజ్యుడయ్యాడు.
ఒకరోజు ధౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, 'నాయనా! పైరు పంటకొచ్చింది. నీవు రోజూ కావలి కాచి పైరు కోసి, ధాన్యం ఇంటికి చేర్చు' అని చెప్పారు. బైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి, పైరునెంతో జాగ్రత్తగా సంరక్షించి, పంట పక్వానికి వచ్చాక కోయించాడు. తర్వాత ధాన్యం రాశిగా పోయించి, ఆ సంగతి గురువుకు చెప్పాడు. అయన అతనికి ఒక బండి, ఒక దున్నపోతునూ ఇచ్చి, ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారు. అతడా బండి కాడికి ఒక ప్రక్క ఆ దున్నపోతును కట్టి, మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన వేసుకుని ధాన్యం ఇంటికి తీసుకొస్తున్నాడు. దారిలో ఒకచోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయింది. అప్పుడు బైదుడు దున్నపోతును విడిపించి, తానొక్కడే బండిని బురదలోనుండి లాగడానికి ప్రయత్నించి, ఆ శ్రమకోర్వలేక స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి, అతని గురుసేవా దీక్షకు మెచ్చి, అతని మెడనుంచి కాడి తొలగించి అతనిని లేవదీసి కౌగిలించుకుని అనుగ్రహించారు. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానమంతా అతనిలో మేల్కొన్నది. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారు. కొద్దికాలం లోనే అతడు గూడ అరణి వలె లోకప్రసిద్ధుడయ్యాడు.
ఇంకా ఉపమన్యు మాత్రమే ఆ మహర్షిని సేవిస్తూ ఉండేవాడు అతడు అతిగా భోజనం చేసేవాడు ఆ మాంద్యం వలన విద్యాభ్యాసంలో అతని మనస్సు నిలిచేది కాదు.ధౌమ్యుడు ఆలోచించి, ఒక రోజు అతనిని పిలిచి, 'నాయనా! నీవు గోవులను అడివికి తోలుకొని పోయి మేపుకొని వస్తూ ఉండు'అని చెప్పారు. ఉపమన్యువు గోవులను అడవికి తీసుకువెళ్ళాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. వెంటనే అతడు ఆవులను ఇంటికి తోలుకొచ్చాడు. ధౌమ్యుడది చూచి, ' నీవు ప్రతిరోజూ సూర్యాస్తమయం వరకూ గోవులను మేపాలి' అన్నారు. మరునాటి నుండి, ఆవులు మేస్తుండగా బాగా ఆకలైనప్పుడు అతడు స్నానం చేసి, సంధ్య వార్చుకుని, దగ్గరలోనున్న బ్రాహ్మణుల ఇండ్లలో భిక్ష తెచ్చుకుని భోజనం చేయసాగాడు. అందువలన కొద్దికాలానికి అతని శరీరానికి మంచి పుష్టి కలిగింది. అది గమనించిన ధౌమ్యుడు, ఒకరోజున అతనినడిగి కారణం తెలుసుకొని,'నన్ను విడిచి భోజనం చేస్తున్నావటరా? నిత్యము నీవు చేసుకొచ్చిన భిక్ష నాకిచ్చి, మరల అడవికి పోయి ఆవులను మేపుకొనిరావాలి' అని ఆజ్ఞాపించారు. ఉపమన్యువు అలా చేస్తూ ఉండటం వలన ఆకలి అతనిని ఎంతగానో బాధించేది. అతను తాను మొదట తెచ్చుకున్న భిక్షను గురువుకర్పించి, రెండవసారి భిక్ష తెచ్చుకుని తినసాగాడు. అందువలన అతడి శరీరం పుష్టిగా ఉండడం చూచి ధౌమ్యుడు కారణమడిగి తెలుసుకుని, ఆ రెండవ భిక్షను కూడా తమకే ఇవ్వమని చెప్పారు. ఉపమన్యువు కొంచమైనా బాధపడక అలానే చేసి, ఆవుల దగ్గర దూడలు త్రాగగా మిగిలిన పాలు త్రాగి ఆకలి తీర్చుకోసాగాడు. అందువలన కొద్దికాలంలోనే అతని శరీరం మరింత లావెక్కింది . ఒకరోజు ధౌమ్యులవారు అందుకు కారణము అడిగి తెలుసుకుని, 'ఒరే! పశువుల ఎంగిలి పాలు త్రాగితే పశువు వలె నీవు గూడ బుద్ధిహీనుడవవుతావు. కనుక త్రాగవద్దు' అని నిషేధించారు. ఆ మరునాడు ఆకలి వేస్తుంటే జిల్లేడు పాలు ఎంగిలి కావని తలచి, వాటిని ఒక దోప్పలో పడుతుండగా ఆ పాలు అతని కళ్ళలో చింది, అతని కళ్ళు రెండూ కనిపించలేదు. తర్వాత అతడు గోవులను వెతుక్కుంటూ పోతూ ఒక బావిలో పడిపోయాడు.
సూర్యాస్తమయం అయిన శిష్యుడు ఇంటికి రాకపోయేసరికి, అతనిని వెదుకుతూ ధౌమ్యులవారు అడవికి వెళ్ళారు. ఆయన కేక విని ఉపమన్యువు బావిలోనుండే సమాధానమిచ్చాడు. ఆ మహర్షి బావి వద్దకు వెళ్ళి అతని దుస్థితి తెలుసుకొని, అశ్వినీ దేవతలను ప్రార్థించమని చెప్పారు. ఉపమన్యువు అలా చేయగానే అతనికి దృష్టివచ్చింది. వెంటనే అతడు బావినుండి బయటకువచ్చి గురువుకు నమస్కరించాడు. ధౌమ్యుడు అతని గురుభక్తికి మెచ్చి అతని తలపై చేయి పెట్టి, 'నాయనా! నీ కీర్తి నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది. నీ శిష్యులు కూడా నీ అంతటి వారవుతారు. వారిలో ఉదంకుడు అనే శిష్యుడు తన గురుభక్తి చేత నాగలోకాన్ని జయించి, నాగకుండలాలు నీకు దక్షిణగా సమర్పించగలడు. నీ కీర్తిని శాశ్వతమొనర్చగలడు' అని ఆశీర్వదించాడు. అతడు గురుకృప వలన వేదశాస్త్ర పారంగతుడై, ఇంటికి వెళ్ళి గృహస్థాశ్రమం స్వీకరించాడు. కాలాంతరంలో ధౌమ్యులవారి ఆశీర్వచనం పూర్తిగా ఫలించింది.
కనుక, 'నాయనా, గురుని అనుగ్రహంతో పొందలేనిది ఏదీలేదు. గురుద్రోహం వలన యిహపరాలలో సుఖమే ఉండదు సరిగదా, నీ వెంత తిరిగినా వ్యర్థమే. కనుక నీవు వెంటనే వెళ్లి నీ పూర్వ గురువునే ఆశ్రయించి, ఆయనను ప్రసన్నం చేసుకో! ఆయన ప్రసన్నుడైతే నీకు వెంటనే మనస్సు స్థిరమవుతుంది'.
శ్రీగురుని మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, 'స్వామీ! నేను అజ్ఞానం వలన గురుద్రోహం చేసిన మాట నిజమే. నేను చేసిన అపరాధాలు కూడా ఎన్నో! విరిగిన నా గురువు మనస్సు అతకడం సాధ్యంకాదు. ఇక నేను బ్రతికి ప్రయోజనమేమీ? నా పాపానికి పరిహారంగా నా ప్రాణాలు విడుస్తాను' అని తీవ్రమైన పరితాపంతో ఆత్మహత్యకు సంసిద్దుడయ్యాడు. అప్పుడు శ్రీ గురుని మనస్సు కరిగి, 'నాయనా! తీవ్రమైన పరితాపం వలన నీ దోషం నశించి వైరాగ్యం కలిగింది. ఇప్పుడు నీ గురువును మనసారా స్మరించు' అని చెప్పి అతనిని ఆశీర్వదించారు. వెంటనే అతని కంఠం గద్గదమై, శరీరమంతా రోమాంచితమైంది. కన్నులు ఆనందభాష్పాలతో నిండాయి. అతడు కృతజ్ఞతతో స్వామి పాదాలకు నమస్కరించగానే, వేదశాస్త్రాల సారం అతని హృదయంలో ఉదయించింది. అప్పుడు శ్రీ గురుడు, 'నాయనా! నేను చెప్పిన గురు మహిమ హృదయంలో నిలుపుకొని నీవు గురువు వద్దకు వెళ్లు. నీవు నమస్కరించగానే ఆయన ప్రసన్నుడవుతాడు.ఆయనే నేనని తెలుసుకో!' అన్నారు.అతడలానే చేసి తరువాత ముక్తి పొందాడు.
ఇలా ఒక సంవత్సర కాలం వైద్యనాధంలో నివసించి, తర్వాత శ్రీ నృసింహ సరస్వతి దేశసంచారం చేస్తూ, కృష్ణాతీరంలో వున్న భిల్లవటీ గ్రామంలోని భువనేశ్వరీదేవి సన్నిధి చేరి, అచట కృష్ణ-వేణి సంగమంలో పడమట తీరానవున్న ఉదుంబర వృక్షం క్రింద కొంతకాలం గుప్తంగా నివశించారు."
పదహారవ అధ్యాయం సమాప్తము.
శ్రీ దత్తాయ గురవేనమః
శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః - శ్రీ నృసింహ సరస్వత్యైనమః
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box