అధ్యాయము -2
శ్రీ గణేశాయనమః శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః
కథారంభము
స్వప్నంలో జడలు, విభూతి, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సు పై చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైనది. అతడు కొద్ది దూరం వెళ్లేసరికి ఒక చోట కృపాకరుడు, ద్వంద్వాతీతుడూ అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడు. ఆయన పీతాంబరము, దానిపై పులిచర్మము, దేహమంతటా విభూతి, జడలు ధరించి వున్నాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించి న యోగి యే ! ఆయన దర్శనంతో నామదారుడికి రోమాంచితమై, కంఠం గద్గదమై, కన్నులు ఆనందభాష్పాలతో నిండాయి. అతడు పారవశ్యంతో నమస్కరించి "స్వామీ, నేను శ్రీ గురుని దర్శనం కోసం తపించి, అది లభించకుంటే మరణించాలనుకున్నాను. కాని స్వప్నంలో మీ దర్శనమవగానే నా హృదయంలో సంతోషం ఉప్పొంగింది. కనుక నా దుఃఖం పోగొట్టగలవారు మీరే నని స్పష్టమఅయినది. స్వామీ, నాకు తల్లి, తండ్రి, భయహారకుడు, పోషకుడు, ఆచార్యుడు,అన్నీ మీరే. వేరు దిక్కు లేదు. నా అదృష్టం వలన మీ దర్శనమైనది. మానవులకు సిరిసంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు. ఆపత్సమయంలో అందరూ వదలి పెడతారు. సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు. ఇంతటి కష్టపరిస్థితిలో నాకు మీరు లభించారు. యోగీశ్వరా ! అజ్ఞానమనేచీకటిని నశింప చేయగల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు. నా పేరు నామధారాక శర్మ. తమ పేరేమి? ఎక్కడినుండి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అని అడిగాడు.
ఆ యోగి ఇలా చెప్పారు -"నాయనా, ఎవరి భక్తులు తప్పక భుక్తిని, ముక్తినీ పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారం అయిన శ్రీ నృసింహ సరస్వతీ స్వామి శిష్యుణి నేను. ఆయనయే సద్గురువు.తననాశ్రఇంచిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలు అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధుడంటారు. లోకాను గ్రహార్థం భూలోక, సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను".
నామధారకుడు, "స్వామీ !శ్రీ నృసింహ సరస్వతీ స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశీయులందరూ ఆయన భక్తులే. అందువల్లనే నాకు ఆయన యందు భక్తి కలిగింది. నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తూ ఉన్నాను. కానీ నేను ఎంత కష్టాలలో ఉన్నా, నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్ను ఆయన అనుగ్రహించలేదేమి? ఆయన నాపై ఆగ్రహించారు ఎందుకు? " అని అడిగాడు.
సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు : " విప్రుడా! నేను చెప్పేది శ్రద్ధగా విని, ఎప్పుడూ గుర్తుంచుకో! భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైనా, ఎల్లప్పుడూ వర్షిస్తూ నే ఉంటాడు. అందులో ఎట్టి లోపమూ ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికేగాక, వారి వంశంలో కూడా ఎవరికీ యెట్టి దైన్యమూ కలుగదు. ఆయనను సేవించినా నీ దైన్యం పోలేదంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. నీవు మనస్సులో ఆయనను సంశయించి ఉండాలి. అందువలననే నీకన్ని కష్టాలు వచ్చాయి. త్రికరణశుద్ధిగా ఆయననే నమ్మి సేవించేవారికి ఎట్టి కొరవా ఉండజాలదు. నీ గురుభక్తి ఇంకా దృఢంకాలేదు. శ్రద్ధ లేని వాడు, సంశయాత్మకుడూ ఎవరి చేత ఎన్నడూ అంగీకరించ బడడు. శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపము. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ భక్తునిపై కోపించినా సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు. కాని ఆ సద్గురువే కోపిస్తే వానిని రక్షించగలవారు మరెవరూ లేరు. అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోపించరు. అలాంటి శ్రీ గురుణ్ణే శంకించే వాణ్ణి అనుగ్రహించగలవారెవరు?"
అప్పుడు నామధారకుడు, "స్వామీ ! సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు?" అని అడిగాడు. సిద్ధుడు, "మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒకప్పుడు, 'నేను అనేకమౌదును గాక !' అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు. అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తూ ఉంటాడు. అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానం కలిగించడం వలన, అజ్ఞానం నుండి రక్షించడం వలన, జన్మ పరంపరలను నశింపజే యడం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమ అయ్యారు" అని చెప్పాడు. అంతట నామ దారుకుడు "స్వామి, దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటిరే, అదెలా సంభవము? అందుకు తార్కాణమేమి? నా సందేహం తీర్చి నా మనస్సుకు స్థిరం ప్రసాదించండి" అని వేడుకున్నాడు.
సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు: " నీవు బుద్ధిమంతుడవు. మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడుగానున్న పరమాత్మ తాననేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి. మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము, దాని నుండి బ్రహ్మ పుట్టారు. అతడు శ్రీమహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన విశ్వమంతటినీ సృష్టించాడు. మొదట ఆయన బ్రహ్మనిష్టులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులనూ, తర్వాత ప్రజాపతులైన మరీచి, అత్రి, అంగీరస, పులహ, పులస్త్య, క్రతు, వశిష్టులనూ సృష్టించాడు. తర్వాత ముల్లోకాలను, దేవతలను, నానా విధములైన జీవరాశిని, మానవులను సృష్టించాడు. వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలనేర్పరచాడు . అలాగే నాలుగు యుగాలను సృష్టించి, క్రమపద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపజేశాడు.
మొదటగా ఆయన, సత్యమే ఆకారముగా గలిగి, యజ్ఞోపవీతము, ఆభరణములు ధరించి యున్న కృతయుగాన్ని భూలోకంలో 17 లక్షల 28 సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు. జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు. అది పూర్తయ్యాక ఆయన -దృఢమైన శరీరంకలిగియుండి, చేతిలో యజ్ఞ సామగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి, భూమిపై 12 లక్షల 96 వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రమెరిగి, యజ్ఞయాగాదులనుష్టించారు. అటు తర్వాత బ్రహ్మ- ఖడ్గము, మంచంకోడు, ధనుర్బాణాలు ధరించిన ద్వాపరయుగాన్ని పిలిచి, భూమిపై 8 లక్షల, 64 వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో శాంతి -ఉగ్రత్వము, దయ- కాటిన్యం మొదలైన పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు. అటు తర్వాత బ్రహ్మదేవుడు కలి పురుషుని పిలిచాడు.
ఈ కలిపురుషుడు మలినుడు. తగవులు అంటే అతనికి ఎంతో ఇష్టం. 'కలి' అంటేనే 'తగవు' అని అర్థం. అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు. పవిత్రత అంటేనే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితో తన మర్మావయవాన్ని, కుడిచేతితో నాలికనుపట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. పిశాచ రూపం గల అతనిని చూచి బ్రహ్మ నవ్వి, వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు. కలిపురుషుడు, 'నేను మానవులందరినీ కాముకులుగాను, జిహ్వ చాపల్యం గలవారుగాను చేసి, వారు ఉత్తమగతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞపూనాను. అదే నా ఈ చేష్టలకు అర్థం' అని అన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి, అక్కడ 4 లక్షల, 32 వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపజేయమని ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయపడి, 'స్వామి! నేను నిద్ర, కలహము, దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి. సిగ్గులేనివాడను. ఇతరుల వస్తువులను, స్త్రీలనూ అపహరించేవారు; దంభము మాత్సర్యము గలవారు; కొంగజపంచేసే దొంగ సన్యాసులు; నమ్మినవారికి ద్రోహం చేసే వారు; ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు; స్త్రీ పుత్ర ధన వ్యామోహము లలో చిక్కిన వారు; వేద శాస్త్రాలను నిందించే వారు; శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారూ - నాకెంతో ఇష్టులు. పుణ్య కార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు. ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను? బ్రహ్మజ్ఞానులను, భక్తులను, చిత్తశుద్ధితో జపధ్యానాదులు చేసేవారినీ చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది' అన్నాడు.
అప్పుడు బ్రహ్మ, కలీ, నీవు భూలోకంలో ధర్మం ఆచరించే వారిని విడిచిపెట్టి, తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోబరుచుకుని, నీ ధర్మాన్ని ప్రవర్తింప జేయి. శివకేశవులు ఒక్కరేనని తెలిసి పూజించేవారిని, తల్లి, తండ్రి, గురువులను సేవించే వారిని, కాశీలో నివసించేవారిని, గోవు, తులసి మొదలైన వాటిని పూజించే వారిని, వేద - శాస్త్ర - పురాణ - స్మృతులను ఆసక్తితో విని, వివేకం పొంది. ధర్మం ఆచరించేవారిని నీవు బాదించవద్దు. ప్రత్యేకించి గురుసేవ యందు దీక్ష వహించిన వారిని, గురు భక్తులను నీవు ఏమి చేయలేవు. నీవు వారిని భావించవద్దు. భూలోకంలో మిగిలిన వారందరూ నీవు అక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్ధించగలరు' అని చెప్పాడు.
కలిపురుషుడు, 'స్వామి, గురువు అంటే ఎవరు? అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే, అతని గొప్పతనం ఏమిటి? అని అడిగాడు. బ్రహ్మ ఇలా చెప్పాడు: ' 'గురువు త్రిమూర్తుల స్వరూపము. ఆయనే బ్రహ్మ, విష్ణువు , మహేశ్వరుడు. అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తిచెందుతారు. గురువు కోపించిన - వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు. గురువు తన శిష్యునికి తత్వముపదేశించి, పాపము నశింపజేసి, అతనియందు బ్రహ్మ జ్ఞానం కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు. అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు గాని, త్రిమూర్తులలో ఏ ఒక్కరూ సంప్రీతులైన గురువు సంప్రీతుడు గాకపోవచ్చు. కనుక ఎవడు శాస్త్రానుసారం గురువునుసేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు, వ్రతాలూ తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది. గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సదసద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యం, ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షం లభించదు. కారణం గురువు లేనిదే శాస్త్ర శ్రవణము, తత్వ శ్రవణము లభించవు. అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు. శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడం సద్గురువు కు మాత్రమే సాధ్యం. అందుకే ఆయన జ్ఞాన జ్యోతి స్వరూపము. సద్గురు సేవ వలన సర్వమూ సిద్ధిస్తుంది. అందుకు తార్కాణం చెబుతాను విను :
పూర్వం గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు, వ్రతదీక్షపూనినవారు, తపస్వులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేద ధర్ముడనే ముని ఉండేవారు. ఆయనకెందరో శిష్యులుండేవారు. ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలచి, అందరినీ పిలిచి ఇలా అన్నారు: " నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచము అనుభవిస్తేగానీ తీరదు. ఒకవేళ దానిని నా తపఃశక్తితో పోగొట్టుకున్నా, అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది. అందువలన నేను సర్వపాపహరం అయిన కాశీ నగరానికి వెళ్ళి ఆ కర్మ శేషం అనుభవించి దాన్ని నశింపజేసు కుంటాను. అక్కడ నా పూర్వ పాపాన్ననుసరించి గళత్కుష్టు రోగిని, కుంటి వాడిని, గుడ్డివాడిని అయి 21 సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను. అంత కాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరు ఉన్నారు? "
గురు సేవలో లోపం వస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు. దీపకుడు అనే శిష్యుడు ఆయనకు నమస్కరించి- " స్వామి, మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోరాదు. కాని మీరనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేనే అనుభవించి మీకు సేవచేస్తాను. అనుగ్రహించండి" అని విన్నవించుకున్నాడు. అపుడా గురువు సంతోషించి, "ఈ పాపం నేననుభావించవలసిందే. వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ. అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు" అన్నారు. దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు.
అక్కడ వేద ధర్ముడు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాధుని పూజించాడు. అటు తర్వాత కంబలాశ్వతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించ సాగాడు. వెంటనే ఆయనకు గళత్కుష్ఠురోగము, కుంటితనము, గుడ్డి తనము వచ్చాయి. ఆయన శరీరమంతా కుష్టురోగం తో కుళ్లిపోయి, పురుగులుపడి దుర్వాసన కొట్టసాగింది. దానికితోడు మతిస్థిమితం కూడా తప్పింది. సహజంగానే ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రం, తన గురువు సాక్షాత్తూ విశ్వనాథుడు అని విశ్వసించి నిత్యమూ ఆయన శరీరం శుభ్రం చేసి, సర్వోపచారాలతో పూజ చేసి, అన్నం తెచ్చి పెడుతూ ఉండేవాడు. ఆ మునిమాత్రం అతనిని ఎన్నో రీతుల భాదిస్తూ ఉండేవాడు. అతడు మంచి అన్నం తెచ్చినా కూడా కొంచమే తెచ్చాడని కోపించి, ముని దానిని నేలపై విసిరి కొట్టెవారు. దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచిచూచి బాగాలేదని విసిరికొట్టి, రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధించేవారు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, "అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడివి. నాకోసం నీవెంతో కష్టపడుతున్నావు !"అని లాలించేవారు. కాని మరుక్షణమే కోపించి, "దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడుస్తున్నావు. నీవు వెళ్ళిపో !నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు. అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి. తోలకుండా చూస్తావేమి? "అని కాసురుతారు. దీపకుడు ఆ పని చేయబోతే ఆయన "దుష్టుడా, ఆకలితో నా ప్రాణం పోతున్నది. ఇంకా భిక్షకుపోయి అన్నం తీసుకురాలేదేమి? "అని తిట్టేవారు, కొట్టేవారు. దీపకుడు మాత్రం కొంచం కూడా చలించలేదు. పాపము ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కల్గుతుందని తెలుసుకొని, దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్రయాత్ర కూడా చేయక, అచటి దేవతలను గుడా దర్శించక, గురుసేవలోనే లీనమయ్యాడు. అతడు ఎవరితోనూ మాట్లాడేవాడుగాదు. తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు.
ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి , దర్శనమిచ్చి, వరం కోరుకోమన్నాడు. అతడు తన గురుదేవుని అనుఙ్ఞ లేకుండా యెట్టి వరమూ కోరలేనన్నాడు. తన గురువు వద్దకు వెళ్లి, వారి వ్యాధి తగ్గేలా తాను వరం కోరడం ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు. అప్పుడు ఆయన, "ఏమిరా, నా సేవ చేయడం నీకంత కష్టంగా ఉందా? నాకోసం నీవెట్టి వరమూ కోరనక్కర్లేదు.వరం వలన యీ రోగం పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది. కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి , నా మోక్షానికి ఆటంకం తొలగించుకుంటాను "అని చెప్పారు. కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయం తెలుసుకుని నిర్వాణ మండపానికి వచ్చి, దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయం విష్ణుమూర్తితో చెప్పాడు. విష్ణుమూర్తి ఆనందించి, ఆ గురుశిష్యులను చూడడానికి వెళ్ళాడు. ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి, " స్వామి, వరాలు కోరి మీ కోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి, మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి? " అని అడిగాడు. విష్ణుమూర్తి" నాయనా, గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్లే! అట్టి శిష్యోతమునకు నేను అధీనుడను. తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను తపస్వులను, యతులను పూజించేవారు, పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించినవారే అవుతారు" అని చెప్పి వరం కోరుకోమన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కరించి "గురువే సకలదేవతా స్వరూపమని, సకల తీర్థ స్వరూపియనీ, వేదాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. మీరు ఇచ్చే వరం గురువు ఇవ్వగలడు గదా"? అన్నాడు. శ్రీమన్నారాయణుడు, "మేమిద్దరము ఒక్కటే, మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో! నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ అధీనంలోనే ఉంటాను." అన్నాడు. దీపకుడు, " స్వామి, అలా అయితే, నా గురుభక్తి నిరంతరమూ వృద్ధిచెందేలా అనుగ్రహించు" అని కోరాడు. విష్ణువు సంతోషించి, " నీవు గురుసేవ వలన తరించావు. నీవీ లోకంలోనే బ్రహ్మానందము పొందగలవు. నీవు ఎల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలానే సేవిస్తుండు. వేదము, వేదాంగాలు, వేదాంత వాక్యాల అర్థం తెలుసుకుని, గురువే పరమార్థమని, పరబ్రహ్మమని తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో, వారికి దేవతలందరూ వశమౌతారు. నిరంతరమూ సద్గురువును సేవించేవారు గూడా లోకపూజ్యులే. త్రిమూర్తులమైన మా అనుగ్రహంవల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు" అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు.
తర్వాత దీపకుడు ఈ సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగిందంతా చెప్పి, దీపకుని గురుభక్తికి మెచ్చి." చిరంజీవ! నీవు కాశీలోనే నివసించు. అష్టసిద్ధులు, నవనిధులు నిన్ను సేవిస్తుంటాయి. నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి" అని ఆశీర్వదించి, వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. కాశి క్షేత్ర ప్రభావము తెల్పడానికి, శిష్యుణ్ణి పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠురోగివలె కనిపించాడే గాని, నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది? ఆయన తన శిష్యులనుద్ధరించడంలో అమిత కుశలుడు, లోక ప్రియుడు, జీవన్ముక్తుడు. ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారబ్దాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి, శిష్యుని భక్తిని, నిష్ఠ, ఓరిమి లను, విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠురోగగ్రస్థుడయ్యాడు. ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకం ఉన్నాయి. ఇవి చెప్పే వారి దోషాలను, వినే వారి పాపాలను కూడా పోగొడతాయి. ఓ కలిపురుషా! కలియుగమారంభమవవలసియున్నది. కనుక నీవు భూలోకానికి వెళ్ళు. కానీ సద్గురు భక్తుని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా!" అని బ్రహ్మ దేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్లాడు.
గురువు యొక్క మహిమ యింతటిదని చెప్పడానికి వీలవుతుందా? నామధారకా ! ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది ధృడభక్తితో దైవాన్ని, భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు. కాబట్టి నీవు పరమ శ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్దాన్వితుడవై నరదేహంతో అవతరించిన శ్రీ గురుని సేవించు" అని సిద్ధుడు చెప్పారు.
శ్రీ దత్తాయ గురవేనమః
శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః - శ్రీ నృసింహ సరస్వత్యైనమః
రెండవ అధ్యాయం సమాప్తం
శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః - శ్రీ నృసింహ సరస్వత్యైనమః
రెండవ అధ్యాయం సమాప్తం
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box