అధ్యాయము -9
శ్రీ గణేశాయనమః శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః
కథారంభము
సిద్ధ సరస్వతి, నామధారకునితో , ఇంకా ఇలా చెప్పారు. శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు, సకల తీర్థ స్వరూపుడు. అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణా నదికి వెళ్లి స్నానము , అర్గ్యము మొదలైన వీధులన్ని నిర్వహించుకుని మఠానికి తిరిగి వస్తుండేవారు. ఎవరి కృపాదృష్టి వలన భక్తులకు గంగాస్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత, పుణ్యమూ కలుగుతాయో, అటువంటి స్వామికి నదీ స్నానం వలన కలగబోయే పుణ్యమేముంటుంది?
ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు. ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతూ ఉండగా శ్రీపాద స్వామిస్నానానికని అక్కడికి వచ్చారు. ప్రశాంతత, దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాని హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి. వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనస్సుకెంతో శాంతి, చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి. నాటినుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తుండేవాడు. ఒకరోజు అతడు నమస్కరించుకున్నప్పుడు శ్రీపాద స్వామి అతనితో, 'నాయనా, నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు. నీ సేవ వలన మాకు సంతోషమయింది' అన్నారు. నాటి నుండి అతనికి సంసార చింతనశించి, మరింత భక్తిశ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు. ప్రతిరోజూ అతడు స్వామియొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతూ ఉండేవాడు. అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళ్తుండేవాడు.
ఒక వసంతఋతువులో, వైశాఖ మాసంలో, ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో, 'ఒరే! నువ్వు రాజువై జన్మించి రాజ్యమేలుతావురా!' అన్నాడు. అతనికి ఆ మాటలర్థం కాలేదు. తర్వాత ఒకరోజు అతడు గుడ్డలు ఉతుక్కోవడానికి నది వద్దకు వెళ్లినప్పుడు అక్కడ, సుందరయువతీ జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును, అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూచాడు. ఆ దృశ్యాన్ని చూచి అతడు సమ్మోహితుడై, తాను నిరంతరం చేసుకొనే నామస్మరణ మరచి, తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ వుండిపోయాడు. తర్వాత అతడు, 'మానవజన్మమెత్తాక ఇటువంటి వైభవము, సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము. ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ! ఇతనికి ఇంత వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో ! నాకిటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట!" అనుకున్నాడు. ఇంతలో మధ్యాహ్నమయింది. శ్రీపాద స్వామి స్నానం చేయడానికి నదికి వచ్చారు. అతడు స్వామికి నమస్కరించి, 'స్వామీ , ఆ యవనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము, సంతోషమూ కలుగుతున్నాయి' అని మళ్ళీ , 'అజ్ఞానం వలన నేనిలా భ్రమించానే గాని, నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యమివ్వగలదని ఇప్పుడు తోస్తున్నది' అన్నాడు. శ్రీపాద స్వామి, 'దానికేమున్నది? నీవు పుట్టినది మొదలూ కష్టం చేసుకునే జీవిస్తున్నావు. అందువలన అతనిని చూడగానే నీకు రాజ్యభోగాలు పై ప్రీతి కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు. నాయనా! నీవు రాజువు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు కదా! నిస్సంకోచంగా చెప్పు' అన్నారు. చాకలి వెంటనే స్వామికి నమస్కరించి, 'స్వామి! నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు' అని వేడుకున్నాడు. స్వామి, 'నాయనా! మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే.లేకుంటే యిలాంటి వాసనలు మిగిలివున్నంతవరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూండవలసిందే. నీకు ఆ రాజ్యసుఖాలు ఈ జన్మలోనే కావాలా? లేక మరుజన్మలో కావాలా? సంకోచించకుండా చెప్పు!' అన్నారు. అప్పుడతడు సిగ్గుతో తలవంచుకొని, 'ఇప్పుడు నేను ముసలివాడనయ్యాను. ఈ జన్మలో అంతటి సుఖం లభించినా నేను తృప్తిగా అనుభవించలేను. కనుక నాకవి మరుజన్మలో లభిస్తే వాటిని ఆజన్మాంతమూ అనుభవించగలుగుతాను' అన్నాడు.
అప్పుడు స్వామి, 'నాయనా! ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను, మనస్సును తృప్తి పరుచుకోవాలి. లేకుంటే మనసు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది. నీలో రాజ్యకాంక్ష, సుఖలాలస బలీయంగా ఉన్నాయి. కనుక నీవు మరుజన్మలో 'మృధుర' దేశంలో యవన రాజ వంశంలో జన్మిస్తావు' అన్నారు. అది విని రజకుడు, స్వామీ, మీరిచ్చిన వరం నాకు ఇష్టమైన దే కానీ, వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చెయ్యవద్దు. మీ యందు దృఢ భక్తి ఉండేలా అనుగ్రహించు. అపుడు నాకు మత ద్వేషం ఉండకూడదు' అని వేడుకున్నాడు. శ్రీపాద స్వామి, 'ఇప్పుడు నీవెట్టి వైభవం చూచావో అట్టిదే మరుజన్మలో పొందుతావు. అపుడు మేమవతరించవలసిన అవసరమొస్తుంది. అపుడు మేము "నృసింహసరస్వతి" అనే సన్యాసి రూపంలో ఉంటాము. వృద్ధాప్యంలో నీకు మా దర్శనమవుతుంది. తక్షణమే నీకు ఙ్ఞానోదయం అవుతుంది. భయం లేదు. ఇక నీవు వెళ్లి రావచ్చు' అని ఆశీర్వదించి, ఒక వింతైన నవ్వుతో అతనివైపు చూచారు. ఆ రజకుడు అక్కడిక్కడే క్రిందపడి మరణించాడు.
శ్రీ పాదులు ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురువపురం లోనే ఉన్నారు. ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఒకప్పుడు ఆయన 'నేనింతకుముందు అంబికకు జీవితాంతమూ శివపూజ చేస్తే, మరు జన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను. నాతో సమానుడు మరొకడు లేడు గనుక, నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి' అని తలచారు. అటు తర్వాత ఒక ఆశ్వీయుజ మాసం, కృష్ణ పక్ష ద్వాదశి, హస్థా నక్షత్రమునాడు శ్రీపాద శ్రీ వల్లభులు కృష్ణా నదిలో( మునిగి ) అంతర్హితులై, మరొకచోట వేరొక రూపంలో అవతరించారు. అయినప్పటికీ సూక్ష్మరూపంలో ఇక్కడే ఉన్నారు అని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భక్తిశ్రద్ధలతో కురుపురం దర్శించేవారికి ఆ స్వామి ప్రత్యక్షుడే. అందువల్లనే కురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం."
తొమ్మిదవ అధ్యాయం సమాప్తము
శ్రీ దత్తాయ గురవేనమః
శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః - శ్రీ నృసింహ సరస్వత్యైనమః
**** గురువారం పారాయణ సమాప్తము ****
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box