Sunday, May 31, 2020

గురు చరిత్ర అధ్యాయము -40


అధ్యాయము  -40




                               
శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 



                          సిద్ధయోగి శ్రీ గురులీలలు ఇంకా ఇలా వివరించారు : "గంధర్వపురానికి ఒకనాడు నరసింహశర్మయనే కుష్ఠురోగి వచ్చాడు. అతనిది యజుశ్శాఖ, గార్గ్య గోత్రము. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఇలా మనవి చేసుకున్నాడు : 'స్వామీ, మీరు సాక్షాత్తూ పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని, మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నా జన్మ యీ కాలిక్రింద మట్టివలె వ్యర్థమైపోయింది. నాకీ కుష్టువ్యాధి రావడం వలన ఎవరూ నా ముఖంకూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరూ నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. అందరికీ జుగుప్స గొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు అనిపిస్తున్నది. ఎన్నో జన్మలలోచేసిన పాపాలన్నీ పేరుకొని, నన్ను ఇప్పుడిలా  కట్టికుడుపుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నాను. ఈ తెల్ల కుష్ఠురోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను. ఎన్ని తీర్థాలో సేవించాను. దేవతలందరికో  మ్రొక్కాను. కానీ దేనివలనా ఈ వ్యాధి కించిత్తైనా  తగ్గలేదు. చివరకు మీరే దిక్కు అని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు కూడా దయలేకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఎలాగైనా వుద్దరించండి స్వామీ!' అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీ గురుడు అతనిని కరుణించి లెమ్మని చెప్పి, 'విప్రుడా! ఇదివరకు ఎన్నో పాపాలు చేసావు గనుకనే నీకీ కుష్టువ్యాధి వచ్చింది. అది తొలగి పోవడానికి నీకు ఒక ఉపాయం చెబుతాము, దానివలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు' అన్నారు.            


              ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టెపుల్లలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు. అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ఆ ప్రాంతంలోనే నాలుగు సంవత్సరాల క్రిందట ఎండిమోడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడికర్రను  చూపి నరహరితో, 'నాయనా, నీకీ మేడికట్టే ఇప్పిస్తాము. నీవు దానిని తీసుకొనిపోయి, మా మాట యందు దృడవిశ్వాసముంచి మేము చెప్పినట్లే చేయి. దానిని సంగమంలోని  సంగమేశ్వరాలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు. నిత్యమూ స్నానంచేసి ఈ రావిచెట్టుకు ప్రదక్షణంచేసి, రెండు చేతులతో రెండుకుండల నిండుగా నీరు తెచ్చి మూడు పూటలా ఆ ఎండు కట్టెకు పోస్తూవుండు. అది ఎప్పుడు చిగురిస్తుందో  అప్పుడే నీ పాపంపోయి, నీ శరీరం స్వచ్ఛమవుతుంది, వెళ్ళు!' అని చెప్పారు. నరహరి ఆయన మాట పై సంపూర్ణమైన విశ్వాసముంచి, ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొనిపోయి, ఆయన చెప్పినట్లే చేయసాగాడు. అతడు నిత్యమూ దీక్షగా దానికి నీరు పోయడం చూచిన వారంతా నవ్వి, 'ఓరి వెర్రి బ్రాహ్మణుడా! నీకేమైనా మతి పోయిందా? నీవు ఎన్నిరోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండుకట్టే మళ్ళీ చిగురిస్తుందా? నిజంగా నీమీద శ్రీ గురుడికి దయ గలిగితే ఇదంతా ఎందుకు? అనుకున్నది వెంటనే జరిగిపోదా? నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యతలేదని సూచించడానికే  శ్రీగురుడు నీకిలా చెప్పారు. అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు? అని నిరుత్సాహపరుస్తుండేవారు. ఇలా ఒక వారంరోజులు గడిచిపోయాయి. అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం గూడా విడవక, ' ఈ భూమిమీద మహాత్ములు  పలికిన మాటలు ఎంత అమోఘమైనవి! వారు సత్యసంకల్పులు కదా! గురుదేవుల వాక్కు అసత్యమెలా అవుతుంది? వారి కృపవలన చచ్చిన వారెందరో బ్రతకగాలేనిది, ఈ ఎండుకట్టే చిగురించడంలో  ఆశ్చర్యమేమున్నది?' అని చెప్పి, తానుమాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతూ ఉండేవారు. వారిలో కొందరు వెళ్లి శ్రీ గురునితో, 'స్వామీ! మీరు ఆ రోజున ఆ కుష్ఠురోగికి  ఎందుకు అలా చెప్పారో గాని, ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని, ఈ వారంరోజులనుండి నీరైనా త్రాగకుండా ఆ కట్టెను  సేవిస్తున్నాడు. ఎవరేమి చెప్పినా వినడంలేదు. అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది. "ఈ వృధా ప్రయాస ఎందుకు?" అని చెప్పిన వారందరితో అతడు, "గురువు చెప్పినట్లు చేయడమే నాపని. వారు అన్నమాట నిలబెట్టుకోవడం వారిపని!" అని చెప్పి, ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరైనా చెప్పండి! లేకుంటే అతడలాగే చేస్తుంటాడు' అని చెప్పారు. శ్రీ గురుడు,    'ఈ భూలోకంలో గురు వాక్యం ఒక్కటే తరింప చేయగలదు. దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుంటే వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది. దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది,  విను. దేవత, మంత్రము,  వైద్యుడు,  పుణ్యతీర్థము,  గురువు -వీటిపట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో, వారి ప్రాప్తము కూడా అలానే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో, యుక్తితో గురువును సేవించడమే అన్నిటికంటే సులభమైన సాధనం. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగలవారికి ఫలితం వెంటనే లభిస్తుంది.                      


                          పూర్వము పాంచాలదేశాన్ని సింహకేతువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని కొడుకు ధనుంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకుపోయాడు. ధనుంజయుడు దాహం తీర్చుకొని, ఆ పక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్లి, అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక ప్రక్కన పడివున్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని, దానిని తదేకంగా చూస్తూ ఎంతోసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూచి, ' నీకు ఈ లింగం ఎందుకు? 'అని అడిగాడు. బోయవాడు, 'అయ్యా! నాకు చాలా కాలంగా శివపూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది. శివలింగం అన్నింటికంటే ప్రశస్తమైనదన్న భావంతోతీసుకున్నాను' అన్నాడు. ధనంజయుడు సంతోషించి, 'ఇది అన్నింటికంటే ప్రశస్తమన్నమాట నిజమే. కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో!' అన్నాడు. అప్పుడా బోయవాడు, 'అయ్యా! నేను అడవిలో పెరిగినవాడిని. దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీనిని పూజించే విధానం చెప్పండి. మీరే నాగురుదేవులు!' అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు: 'అయితే చెబుతాను విను. దీనిని తీసుకొని పోయి, మీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి, స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తూ శివుడే నీ ఇంట్లో ఉంటాడు. కనుక నీవు నీ భార్యతో కలసి శ్రద్ధగా నిత్యము పూజచేయి. ప్రతిరోజు స్మశానం నుండి చితాభస్మం తెచ్చి,  అది శివునికి అర్పించు. నీవు ఎప్పుడు ఏమి తిన్నాసరే, ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు' అని చెప్పాడు.


                ఆ బోయవాడు ఇంటికి వెళ్లి ఆ ప్రకారమే చేయసాగాడు. ఒక రోజు ఎంత వెతికినా అతనికి చితాభస్మం దొరకనేలేదు. అతడు ఎంతో బాధపడి తన భార్యతో, ' అయ్యో! ఈ రోజు శివునికి పూజ సరిగా జరగలేదు. గురువు ఉపదేశించినట్లు పూజ చేయాలి గానీ, మరోరకంగా చేస్తే ప్రయోజనముండదు. సరిగదా, గురువుమాట జవదాటితే నరకము, దరిద్రమూ వస్తాయి. గురువు చెప్పినట్లు చేస్తే నీ పుట్టుక లేకుండాపోతుంది. అందుకోసం నేనెంత వెతికినా బూడిద దొరకనేలేదు. ఈ ఒక్కరోజూ ఆయన చెప్పినట్లు చేయలేకపోతే, ఇన్ని రోజులుగా చేస్తున్న పూజ అంతా వ్యర్థమై పోతుంది. పూజ సమయం కూడా దాటి పోతున్నది. ఇంక నేనుఏమి చేయాలి? అది దొరకకుంటే నా ప్రాణమైన విడుస్తాను!' అని దుఃఖించాడు. అతని భార్య అతనిని ఓదార్చి, 'దానికోసం అంత బాధపడతావేమి? మనింట్లో ఎన్నో కట్టెలు ఉన్నాయి. వాటితో నన్ను దహనంచేసి, ఆ బూడిద శివునికి అర్పించు. భయపడవద్దు, నీవు వ్రతభంగం చేసుకోవద్దు. శివపూజ కోసం నా శరీరమే అర్పించడం కంటే సంతోషమేమున్నది? ఇది ఏనాటికైనా చచ్చి బూడిద కావలసిందే గదా! అట్టి దానిని శివపూజకర్పిపించడం కంటే కావలసినదేమున్నది. అని ధైర్యం చెప్పింది.                                     


                    అప్పుడతడు, 'నీవు పడుచుదానివి. సంసార సుఖం కూడా నీవు పూర్తిగా అనుభవించలేదు. ఒక బిడ్డనైనా  కనలేదు. సూర్యచంద్రుల సాక్షిగా నిన్ను ఏ లుకుంటానని బాస చేసిన నేను నిన్ను చేతులారా చంపుకుంటాన? అలాచేస్తే నాకెంతో పాపమొస్తుంది. ఆడదానిని చంపినందుకు నన్నందరూ నిందిస్తారు. అంతటి పాపంచేస్తే శివుడు కూడా నన్ను క్షమించడు.  నీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేసినవాడనవుతాను?' అంటూ  వలవలా  ఏడ్చాడు.  ఆమె,  'నీకెంత వెర్రి?  నాపై నీకు అంత మొహమెందుకు?  నీటి బుడగలాగా ఈనాడువున్న శరీరం రేపు లేకుండా పోతుందే.  పుట్టిన తర్వాత ఎవరైనా చావవలసినదేగా? నా  తల్లిదండ్రులు నన్ను నీకు అప్పగించాక నేను నీదానినే గదా?  నేనేమైనా పరాయి దాన్నా?  నీలో భాగాన్నే  కదా?  శివునికోసం నీవు నన్ను దహనం చేస్తే నీ ప్రాణాన్నే అర్పించినట్లే  అవుతుంది. నీ ప్రాణాన్నైన  నన్ను శివునికి అర్పిస్తే అందులో తప్పేమిటి?  అది నా అదృష్టమే కదా?  అలా చేస్తే శివుడు మనిద్దరినీ రక్షిస్తాడు' అని పట్టుబట్టి,  చివరకు అతనినెలాగో ఒప్పించింది.  


                                  అప్పుడామె ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకొని ఇంటికి నిప్పు పెట్ట మన్నది. అతడు అలానే చేసి,  సర్వమూ భస్మమైపోయాక దానినంతా  భక్తితో లింగానికి అర్పించి, కృతార్థుడనవగలిగానని  ఎంతో ఆనందించాడు. తర్వాత  ఏకాగ్రమైన మనసుతో హృదయపూర్వకంగా శివునికి నమస్కరించి, అలవాటు ప్రకారం ప్రసాదం తీసుకోడానికి  రమ్మని తన భార్యను కేకవేశాడు. శివుని అనుగ్రహం వలన ఆమె తిరిగి బ్రతికి,  శరీరంతో నడిచి వచ్చింది. వారిద్దరూ శివుని ప్రసాదం  తిన్నాక చూస్తే వారి ఇల్లు వెనుకటి వలనే చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నది. శబరుడు ఆశ్చర్యపడుతూ ఉంటే అతని భార్య, 'స్వామీ, నాలుగు ప్రక్కలా ఇల్లు అంటుకుని మండుతున్నాగాని నాకదేమో ఎక్కడలేని చలి పుట్టింది. నేను ముడుచుకుని పడుకోగానే గాఢంగా నిద్ర పట్టింది. తర్వాత ఏమైందో నాకు తెలియలేదు. మీరు పిలువగానే 'మెలకువవచ్చి లేచి వచ్చాను. ఆహా! ఏమి యీ  ఈశ్వరుని లీల!' అనగానే, శివుడు వారికి సాక్షాత్కరించాడు. వారు నమస్కరించగానే,  జీవితాంతంలో వారు కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో నివసించేలా  వరమిచ్చి అదృశ్యమయ్యాడు. దేనియందైనా పూర్ణ విశ్వాసం ఉండాలేగానీ, ఎంతటి  ఫలితమైన లభించగలదు. కనుక ఆ కుష్ఠురోగియైన నరహరి చేస్తున్న సేవకు ఫలితముండకపోదు. ఎవరి భావానికి తగిన ఫలితం వారికి తప్పక లభిస్తుంది' అన్నారు శ్రీ గురుడు.     


                                  కొద్దిసేపట్లో స్వామి సంగమానికి వెళ్లి అక్కడ తమ అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ కుష్టురోగి వద్దకు వెళ్ళారు. అతడు ఆయన చెప్పినట్లే ఎంతో భక్తిశ్రద్ధలతో చేస్తూ ఉండటం చూచి ఆనందించారు. నరహరి ఆ కట్టెకు నీరుపోసి ఆయన వద్దకు వచ్చి నమస్కరించాడు. ఆయన తన కమండలంలోని నీరు తీసి,  ఆ ఎండిన  మేడి కర్రమీద చల్లారు.మరుక్షణమే అది  చిగురించింది! అనుష్ఠానానికని  సంగమానికి వచ్చిన వారంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే అది పెరిగి చిన్న మేడి చెట్టైంది.నివ్వెరపోయి దానిని చూస్తున్న నరహరికి గూడా కుష్టురోగం అదృశ్యమై అతడి శరీరం బంగారు ఛాయతో మెరిసి పోసాగింది. అతడు ఆనందబాష్పాలు రాలుస్తూ, శ్రీగురుని పాదాలకు భక్తితో నమస్కరించాడు. శరీరమంతటా రోమాంచితం అవుతుంటే, పారవశ్యంతో శ్రీగురుని ఇలా స్తుతించాడు: 'కోటి సూర్యుల తేజస్సు( జ్ఞానము), కోటిచంద్రుల చల్లదనం( ఆనందము ) గలిగి, దేవతలందరిచేతా పూజించబడే విశ్వాశ్రయుడు, భక్తప్రియుడు, శ్రేష్టుడుయైన అత్రి పుత్రుడు అయిన ఓ నృసింహ సరస్వతీ స్వామీ! నీకు నమస్కారము, నన్ను రక్షించు. మోహాపాశమనే అజ్ఞానాంధకారాన్ని నశింపచేయగల జ్ఞాన సూర్యుడవు; విశాలమైన నేత్రములు గలవాడవు; భక్తులకు వరములిచ్చే లక్ష్మీపతివీ అయిన ఓ నృసింహ సరస్వతీ ! నీకు నమస్కారము. నన్ను రక్షించు. (2) మనసులో ఉద్భవించిన అరిషడ్వర్గమనే మదగజాన్ని శాసించగల అంకుశము వంటివారు మీరు; సత్యము, సర్వానికి సారభూతమూయైన పరమాత్మతత్వమే మీరు. భక్తవత్సలుడు, సర్వభూతకర్తయైన పరమాత్మ యొక్క అవతారాలన్నింటిలో శ్రేష్టుడైన శ్రీ వల్లభా ఓ నృసింహ  సరస్వతీ ! నీకు నమస్కారము. ఆకాశము, వాయువు, తేజస్సు, జలము భూమి అను పంచభూతాత్మకమైన సృష్టికి కర్తవై ఉండి, సూర్యచంద్రులే నేత్రములుగా గల సర్వసాక్షివి  నీవు. జీవులపై నీకు రాగద్వేషాలు లేకున్నా, నీవు భక్తుల పాలిటి  కామధేనువవు. ఓ శ్రీగురు! ప్రచండమైన (మా) పాపాలను పారద్రోలడానికి దండము ధరించి, యతి వేషధారులైన నృసింహ  సరస్వతీ ! నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. మీపాద కమలాలను వేదాలు,  శాస్త్రాలు స్తుతిస్తున్నాయి. నాదబిందు కళా స్వరూపా! నీవు వాటికి కూడా అతీతుడు అయ్యుండి, మూడు విధములైన తాపాలతో పీడించబడుతున్న   భక్తుల పాలిటి కల్పవృక్షమా ! ఓ నృసింహ సరస్వతీ ! నీకు నమస్కారము. నన్ను రక్షించు. అష్టాంగయోగ తత్త్వనిష్ఠతో  ఆత్మ సంతుష్టుడవైయున్న జ్ఞానసాగరా ! కృష్ణావేణీ పంచనది సంగమ తీర నివాసా ! కష్టాలను, దైన్యాన్ని దూరంచేసి, భక్తులకు కోరినవి ప్రసాదించి తృప్తినిచ్చు నరసింహ సరస్వతీ, నీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించు. నిత్యము ఈ  నరసింహ సరస్వతీశుని అష్టకం ఎవడు చదువుతాడో వాడికి జ్ఞానానుసారము, దీర్ఘాయువు, ఆరోగ్యము, సర్వసంపదలు,  నాలుగు పురుషార్ధాలు లభిస్తాయి. ఈ అష్టకం ఘోరమైన సంసారమనే సముద్రాన్ని తరించడానికి మంచి సాధనము. నరహరిశర్మ కన్నీటితో స్వామి పాదాలు అభిషేకించి, వాటిని విడవక అలానే పడిఉన్నాడు. శ్రీ గురుడు అతనికి అభయమిచ్చి, "జ్ఞానరాశివవుదువుగాక !" అని అతనిని ఆశీర్వదించి చేయి పట్టి లేవదీశారు. అక్కడ చేరిన వారందరూ ఆ గురు మహత్యం చూచి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కరించారు. అప్పుడు వారందరినీ తీసుకుని ఆయన గంధర్వ పురం లోని తమ మఠానికి చేరుకున్నారు. ఆ గ్రామంలోని వారందరూ ఆ లీల గురించి విని, భక్తితో శ్రీగురుని దర్శించి ఆయనకు హారతులు ఇచ్చారు. నరహరి ఆనాడు వారందరికీ సమారాధన చేశాడు. తర్వాత శ్రీ గురుడు అతని దగ్గరకు పిలిచి , ' నాయనా, నీ పట్ల మాకెంతో ప్రీతి కలిగింది. నీవు గోవులు,  సంపదలతో ఐహిక సుఖాలన్నీ అనుభవించ గలవు. నీ వంశంలో జన్మించిన వారందరూ వేద శాస్త్రజ్ఞులు, శతాయుష్మంతులు అవుతారు. నీకు ముగ్గురు కొడుకులు పుడతారు. వారిలో ఒకడు యోగియై మా సేవ చేస్తాడు. నీకు పరమార్థికమైన  శ్రేయస్సు కూడా లభిస్తుంది. ' అని ఆశీర్వదించారు. తర్వాత శ్రీ గురుడు అతనికి అష్టాంగయోగం ఉపదేశించి, విద్యా సరస్వతి మంత్రాన్ని కూడా ఉపదేశించి, ' నీకు యోగీశ్వరుడు అని పేరు పెడుతున్నాము. నీ భార్యాబిడ్డలను తీసుకొచ్చి మా సన్నిధి లోనే ఉండు' అని చెప్పారు.                                       


                     నామధారకా! శ్రీ గురుని ప్రసాదం వలన నరహరిశర్మకు ముగ్గురు కొడుకులు పుట్టి, గురుభక్తి వలన ఎంతో వృద్ధిలోకి వచ్చారు. స్వామిని నమ్మిన వారిని ఆయన ఎంతగా అనుగ్రహిస్తారో  చూశాము కదా! అంతేగాదు, భక్తితో అతడు చేసిన స్తోత్రం అంటే శ్రీ గురునికి ఎంతో ప్రీతి. ఆ స్తోత్రంలో వ్యాకరణ దోషాలు, చందో దోషాలు ఉన్నాయి. ఎవరైనా ఆ తప్పులు దిద్దపోతే, శ్రీ గురుడు అంగీకరించక, ఆ స్తోత్రమలానే చదవాలని చెప్పేవారు!"                             

నలభైయవ  అధ్యాయం సమాప్తం

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Friday, May 29, 2020

గురు చరిత్ర అధ్యాయము -39


అధ్యాయము  -39


                               

శ్రీ గణేశాయనమః                             

శ్రీ సరస్వత్యేనమః                                                                                                  

శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 




                        సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు: 'గంధర్వపురంలో సోమనాథుడనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిది ఆపస్తంబశాఖ, శౌనక  గోత్రం. అతని భార్య గంగమ్మకు 60 ఏళ్లునిండినా సంతతి కలగలేదు. ఆమె నిత్యమూ శ్రీగురుని దర్శించి,  వారి పాదాలను పూజించి,  హారతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తూ ఉండేది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తూ ఉండేది. ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహా ఇల్లాలితో,  'అమ్మా! ఇన్నాళ్లుగా  మమ్మల్ని సేవిస్తున్నావు. నీ అభీష్టం ఏమిటో ఎన్నడూ చెప్పలేదే? ఇప్పటికైనా చెబితే గౌరీనాధుని  కృపవలన నీకోరిక నెరవేరుతుంది' అన్నారు. ఆమె ఎంతో సంతోషించి దోసిలి యోగ్గి  కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది: 'స్వామి! కొడుకులు లేని వారికి ఉత్తమగతులు ఉండవుగదా. అందువలన గొడ్రాలుగా ఉండడమే మహాదోషమైంది. నేను మహా పాపిష్టినైన కారణంగానే నాకు బిడ్డలు కల్గలేదని అందరూ నన్ను ఏవగించుకొంటున్నారు. దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలుగదు కదా! పితృదేవతలు కూడా, తమ కులంలో ఒక మగ బిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. బిడ్డలు లేని ఇల్లు ఇల్లే గాదు అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే  అదృష్టానికి నేను నోచుకోలేదు. అలాగే నాకు 60 ఏళ్లు నిండిపోయాయి. మాకు,  మా పితృదేవతలకు తిలోదకాలిచ్చే వాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదాయె! స్వామీ, అయిందేదో అయిపోయింది. మరుజన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి. చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది. శ్రీ గురుడు నవ్వుతూ,  'ఓసి పిచ్చి తల్లి. ఏమి కోరిక కోరావమ్మా? ఎప్పుడో రాబోయే జన్మసంగతి ఇప్పుడెందుకు?  అప్పుడు బిడ్డలు గలిగినా, వాళ్లు మేమిచ్చిన వరంవలన కలిగినట్లు నీకు ఎలా తెలుస్తుంది? నీవు  నిత్యమూ  మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది. కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము.  కొద్దికాలంలోనే నీకు ఒక కూతురు,  ఒక కొడుకు కలుగుతారు' అని ఆమెను దీవించారు.                                    


                        అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కరించి, 'స్వామీ,  ఒక మనవి చేసుకుంటాను, నాపై కోపగించివద్దు,  నేను బిడ్డలకోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను. పుణ్యతీర్ధాలలో స్నానం చేశాను. రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి, కనిపించిన రావిచెట్టుకల్లా ఇంతవరకూ ప్రదక్షిణలు, నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను. అలానే నా వయస్సంతా చెల్లిపోయింది. ఇటువంటి నాకు మీ వరమెలా  ఫలించగలదా అని ఆలోచనగా ఉన్నది అలా అని త్రిమూర్తి స్వరూపులైన  మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు. అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను. ఇంతకూ నాకు కలిగిన సందేహం ఇది- నేను వచ్చే జన్మలో నైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే,  మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు. అయినప్పటికీ ఇన్నాళ్లుగా నేను కాళ్ళునొప్పులు పుట్టేలాగా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసినందువల్ల కలిగిన ప్రయోజనమేమిటి?' అని విన్నవించింది. ఆమె ఆవేదన చూచి నవ్వి,  శ్రీ గురుడు ఇలా చెప్పారు: 'అమ్మాయి! నీవు చేసిన అశ్వత్థపూజ వలన నీకు ఎంతో పుణ్యం లభించింది. ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి, పోగొట్టుకోకు. నా మాటవిని,  ఇక నుండి ఈ సంగమంలో ఉన్న యీ  రావి చెట్టుకు,  మాకూ  కలిపి నిత్యమూ  ప్రదక్షిణ, పూజ  చేస్తూ ఉండు. మేమెప్పుడూ అశ్వత్థ వృక్షంలో ఉంటాము. అందువల్లనే పురాణాలన్నీ దానిని 'అశ్వత్థనారాయణుడని ' కీర్తించాయి.                 


                              గంగాంబ, 'స్వామీ అతి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షం యొక్క ప్రాశస్త్యం  వివరించండి. అప్పుడు తగిన శ్రద్దాభక్తులతో దీనిని సేవించ గలుగుతాను' అన్నది. శ్రీ గురుడు ఇలా చెప్పసాగారు. 'అశ్వత్థవృక్షంలో సర్వదేవతలూ  ఉంటారు. దాని మహత్యం గురించి బ్రహ్మాండపురాణంలో నారద మహర్షి చెప్పాడు. అశ్వత్థమే నారాయణ స్వరూపం. ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ: దాని మధ్య భాగమే విష్ణువు: దాని చివరి భాగమే శివుడు. కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే.  అలానే,  త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ,  పడమర,  ఉత్తర దిక్కులలోని కొమ్మలు. తూర్పు దిక్కుకున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు. దాని వ్రేళ్లలో మహర్షులు,  గోబ్రాహ్మణులు,  నాలుగు వేదాలు ఉంటాయి. సప్త సముద్రాలు, పుణ్యనదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి. ఆ చెట్టు యొక్క మూలంలో '' కారము,   మానులో ' ' కారము. దాని పండ్లు '' కారము. - ఆ వృక్షం అంతా కలిసి ప్రణవస్వరూపమే ఇక ఆ చెట్టుయొక్క మహిమ ఎవరు వర్ణించగలరు? అది సాక్షాత్తూ కల్పవృక్షమే,  ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారదమహర్షి ఇలా చెప్పాడు: "అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర, ఆషాడ, పుష్యమాసాలలోనూ, గురు,  శుక్ర మౌడ్యాలలోనూ,  కృష్ణ పక్షంలోనూ  ప్రారంభించకూడదు. శుభ సుముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచియై  ఉపవసించి మరీ ప్రారంభించాలి. ఆది, సోమ, శుక్రవారాలలోనూ, సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధసమయాలలోనూ,  రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్తుతి, పరనింద, జూదము, అసత్యములను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానంచేసి,  ఉతికిన గుడ్డలను ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునలను పూజించాలి. అప్పుడు సంకల్పం చెప్పి అశ్వత్థవృక్షానికి  భక్తితో ఏడుసార్లు అభిషేకం చేయాలి. అప్పుడు మరల స్నానంచేసి,  దేవతామయమైన ఆ వృక్షానికి పురుషసూక్త విధానంగా షోడశోపచారపూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు గలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ గాని, మౌనంగా గాని, యెంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట,  చివరా  నమస్కారం చేయాలి. ఇలా రెండు లక్షలు ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి,  నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణశుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి, బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు. శనివారంనాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయం తొలగుతుంది. అశ్వత్థాన్ని పూజించాక-


                 శ్లో||   కోణస్థ:   పింగళో బభ్రు:  
                                                     
                                      కృష్ణోరౌద్రాంతకో  యమః                
                                                      
                      శౌరిశ్శనైశ్వరో మందః      
                 
                              పిప్పలాదేవ సంస్తుతః ||           

         అనే మంత్రం దృఢవిశ్వాసంతో జపిస్తే శనిదోషం కూడా తొలగి, అభీష్టసిద్ధి కలుగుతుంది. గురువారము అమావాస్య కలిసిన రోజున రావిచెట్టు నీడన స్నానంచేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేదవిప్రునికి మృష్టాన్నం పెడితే కోటిమంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితముంటుంది. అక్కడ చేసిన గాయత్రీ మంత్ర జపంవలన నాలుగు వేదాలూ చదివిన ఫలితముంటుంది. రావిచెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది. దానిని కొట్టివేయడం మహాపాపం. పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక,  ఆ సంఖ్యలో పదవ వంతు హోమము,  అందులో పదవవంతు బ్రాహ్మణ సమారాధనమూ  చేయాలి. ఈ వ్రత కాలంలో బ్రహ్మచర్యమవలంభించాలి. ఉద్యాపన  తర్వాత బంగారు రావిచెట్టును,  అలంకరించిన ఆవు - దూడలను, గుడ్డతో కప్పిన నువ్వుల  రాశిని, ఉదారమైన దక్షిణలతో సౌశీల్యవంతులూ,  కుటుంబీకులూ అయిన వేద విప్రులకు దానమివ్వాలి. ఇలా చేస్తే తప్పక అభీష్టం సిద్ధిస్తుంది. 


                    అమ్మా! అశ్వత్థ మహత్యం తెలిసింది కనుక ఇంక దానిని నిందించక, యెట్టి సంశయమూ  పెట్టుకోకుండా అలా చేయి. నీ అభీష్టం నెరవేరుతుంది.' అప్పుడు గంగాంబ, 'స్వామీ ! 60 సంవత్సరాలు నిండిన నేను పుట్టుకనుండి వంధ్యను.  నాకు బిడ్డలెలా  కలుగుతారు?  అయినా నాకేమి? ప్రత్యక్షంగా మీ  పాదాలుండగా మరలా యీ రావిచెట్టును సేవించడం ఎందుకు?' అనిపిస్తున్నది. ఏమైనప్పటికీ,  గురువు మాట కామధేనువని వేదాలు,  శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక నమ్మి త్రికరణశుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది. ఆమె నాటినుండి మూడు రోజులూ ఉపవసించి,  మూడుపూటలా ష్టట్కుల  తీర్థంలో స్నానం చేసి, గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని  సేవించి,  దానికి ఏడు బిందెల నీళ్లు పోసి,  శ్రీ గురుసహితంగా దానిని పూజించింది. ఆ మూడు  రాత్రులూ  ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు. మూడవనాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒకబ్రాహ్మణుడు కనిపించి,  'అమ్మాయీ,  నీ కోరిక తీరింది. ఉదయమే శ్రీ గురిని పూజించి,  ఆయనిచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను' అన్నాడు. అలాగే నాలుగవరోజు ఉదయం సంగమంలో అశ్వత్తాన్నిసేవించి,  ఆ దంపతులు మఠానికి వచ్చారు. ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీ గురుడు నవ్వి,  రెండు పండ్లు ఆమెకిచ్చి,  'మీ లక్ష్యం నెరవేరింది. పారణ అయ్యాక నీవీ పండ్లు తిను. నీకు ఒక కూతురునూ,  కొడుకునూ  ఇస్తున్నాము. ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దానమివ్వు' అని చెప్పారు. ఆమె అలానే చేసింది. ఆ రోజే సూర్యా స్తమయ సమయానికి ముందే ఆమె రజస్వల అయ్యింది. నాలుగవ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో గూడ శ్రీ గురుని  వద్దకు వచ్చి గురు పూజ చేసింది.శ్రీ గురుడు, 'నీకు పూర్ణాయుష్కులైన బిడ్డలు  కలుగుతారు; నీకు ముక్తి లభిస్తుంది' అన్నారు. ఐదవ రోజున భర్త్రుసమాగమం వలన ఆమె గర్భం ధరించింది. ఆమెభర్త ఎంతో సంతోషించి పుంసవనము,  ఎనిమిదవనెలలో సీమంతము మొదలైన సంస్కారాలన్నీ  ఘనంగా జరిపించాడు. ఆమె ఏడవ మాసంలో మళ్లీ శ్రీగురుని దర్శించి ఆశీస్సులు పొందింది. అప్పుడు శ్రీగురుని ఆజ్ఞమేరకు ఆ పండుముత్తైదువ వాయనదాన మిచ్చింది. నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నెరిసి, పళ్ళన్నీ  పట్టు తప్పిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. శ్రీ గురుని మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది. ఆమెకు నవమాసాలు నిండాక,  ఒక శుభ ముహూర్తంలో ఆమెకు ఆడపిల్ల పుట్టింది. దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు. ఆ బిడ్డకు శ్రీగురుని  పేరిట 'సరస్వతి' అని పేరు పెట్టుకున్నారు. పదకొండవ రోజున ఆ బాలింతరాలు నడుముకట్టు వేసుకుని,  బిడ్డనెత్తుకుని,  భర్తతో కలిసి శ్రీగురుని దర్శించింది. బిడ్డను ఆయనముందుంచి, 'వంద్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది. అది సుపాలమైతే బాటసారులు సేవిస్తారు. వ్యర్థఫలానికంటే వంధ్యాత్వమే మేలు!' అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది. స్వామి వాత్సల్యంతో, 'పుత్రవతీ! లేవవమ్మ!' అని బిడ్డను చూచి, 'ఇది ఆడపిల్లే గాని మగపిల్లవాడు గాడే!' అంటూ ఆమెను చూచి నవ్వి, 'ఇంక సందేహించనక్కరలేదు,  నీకు కొడుకుగూడా పుడతాడు' అని చెప్పారు. అప్పుడా పసిబిడ్డను తమ చేతిలోకి తీసుకుని నిమురుతూ,  'ఈబిడ్డ  దీర్ఘాయువు, సౌభాగ్యము,  సౌశీల్యములతో ప్రసిద్ధికెక్కుతుంది. ఆమెకు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణదేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు. మీకు వేదశాస్త్ర పారంగతుడు,  మహా ఐశ్వర్య  సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు. కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి?  వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా?, లేక 30 సంవత్సరాల ఆయుస్సు  గల విధ్వాంసుడు కావాలా?' అన్నారు. గంగాంబ, 'విద్యావంతుడు, సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి. అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి' అని చెప్పి స్వామికి నమస్కరించింది.  స్వామి, 'తథాస్తు' అని ఆమెను  దీవించి పంపివేశారు. ఒక సంవత్సరంలో ఆమెకు  కొడుకు పుట్టాడు. అతనికి గూడా 'నృసింహ' అని శ్రీ గురుని  పేరే  పెట్టారు. వాడు కొంత కాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డలను కన్నాడు. గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప యజ్ఞదీక్షితునీతో వివాహమైంది. అతని చేత యజ్ఞాలు చేయించుకోడానికి కాశీ నుండి శ్రీమంతులు,  పండితులు వచ్చి,  అతనిని తీసుకు వెళుతూ ఉండేవారు. శ్రీ గురుకృప ఎంతటిదో చూచావా? నామధారకా ! వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం". 

ముపై తొమ్మిదవ అధ్యాయం సమాప్తము.

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Wednesday, May 27, 2020

గురు చరిత్ర అధ్యాయము -38


అధ్యాయము  -38




                               

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                            శ్రీ గురుభ్యోనమః 




కథారంభము 



                        నామధారకుడు, "స్వామీ, శ్రీ గురుడుపదేశించిన కర్మానుష్టాన రహస్యం మీనుండి విని ధన్యుడినయ్యాను. ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీ గురుని వృత్తాంతం తెల్పండి" అని వేడుకొన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు : "నాయనా, నీవంటి గురుభక్తుడు, శ్రోతా  లభించినందువల్లనే శ్రీ గురుచరిత్ర తనివితీరా స్మరించుకొనే భాగ్యం నాకు కూడా కలిగింది.            


          శ్రీ గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులయిన గురుభక్తులెందరో  గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష, వారి ప్రీతికోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు. ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కరశర్మ అనే పేదబ్రాహ్మణుడు వచ్చాడు. అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యము మొదలగునవి మూటగట్టుకొని తెచ్చి, శ్రీ గురునికి నమస్కరించాడు. కానీ ఆరోజు అందరితోపాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు. అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి, భోజనానికి వెళ్లాడు. ఈ రోజు ఇలానే జరుగుతూ ఉండటం వలన మూడుమాసాలు అలాగే గడిచింది. అతనిని చూచిన బ్రాహ్మణులందరూ,  'ఏమయ్యా బ్రాహ్మణుడా! నీవు వచ్చింది ఎందుకు?  చేస్తున్నదిఏమిటి? నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా కుదరలేదా? పోనీలే, ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు. నీకు ఇంటివద్దకంటే ఇక్కడే బాగున్నట్లున్నది. నీకు సిగ్గువేయడం లేదా?" అని ఎగతాళి చేయసాగారు. పాపమాభాస్కరశర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు. అతనిపై ఇట్టి విమర్శలు, నిష్టూరాలు, పెరిగిపోయి, ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది. ఆయన అది సహించలేక, అతనిని పిలిచి, 'నాయనా, నీవు రేపు ఇక్కడనే  స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు' అని ఆదేశించారు. అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి, పెరుగు సమకూర్చుకుని, స్నానానుష్టాలు పూర్తిచేసుకుని, తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు.  


                     ఆ సమయంలో వేరే ఒక భక్తుడు వచ్చి, తానారోజు శ్రీ గురునికి భిక్ష చేయడానికి అన్నము, మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకుని ఆహ్వానించడానికి స్వామి వద్దకు వచ్చాడు. కానీ శ్రీ గురుడు, తాము ఆరోజున భాస్కరశర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని, అతడు మరుసటిరోజు బిక్ష చేయవచ్చునని చెప్పారు. అతడు నిరుత్సాహపడి, 'అయ్యో! ఇప్పుడీ దరిద్రుడు వండినదాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకు అయినా  వస్తుందా? ఈరోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళి భోజనం చేయవలసిందే!' అనుకుంటూ వెనుకకు మరలాడు. శ్రీ గురుడు ఆ మాటలు విని అతనికి, అక్కడున్న వారందరికీ ఎలా చెప్పారు: 'నాయనలారా! ఈరోజు మీరెవరూ  భోజనానికి ఎక్కడికీ  వెళ్ళవద్దు. మీరందరూ భార్యాబిడ్డలతోనూ, స్నేహితులతోనూ కలసి ఈ మఠంలోనే భోజనం చేయాలి. కనుక అందరూ స్నానాలు చేసిరండి' అనిచెప్పారు. అందరూ ముఖముఖాలు చూచుకొని నవ్వుకుంటూ, 'ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలెడు బియ్యమేకదా ! ఎవరికీ తెలియదు? మఠంలో అందరికీ భోజనం పెట్టడానికి అదేమి  సరిపోతుంది? ' అనుకుంటూ స్నానానికి వెళ్లారు. ఇంతలో శ్రీ గురుడు భాస్కరశర్మతో, 'నాయనా,  కొద్దిసేపట్లో అందరూ వస్తారు. త్వరగా సిద్ధంచేయి!' అని చెప్పారు. అతడు వెంటనే మరో పొయ్యికూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధంచేసి, అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు. అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ  ఆహ్వానించమని భాస్కరశర్మను ఆదేశించారు. అతడు అలాగే వెళ్ళి చెప్పగానే, వాళ్లు పకపకా నవ్వి, 'ఏమయ్యా! నీవు పెట్టినట్లే,  మేము తిన్నట్లే! ఈ రోజున మా ఇళ్ళల్లో ఉన్నదేదో మేము భోజనం చేస్తాము కానీ నీవు కనీసం శ్రీ గురుడికైనా కడుపునిండా పెట్టగలిగితే అంతేచాలు, పో,  పో!' అన్నారు. భాస్కరశర్మ తిరిగివచ్చి, వారందరూ తనను ఎగతాళిచేసి భోజనానికి రామన్నారని చెప్పాడు. శ్రీ గురుడు, 'నాయనా, మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతముగాని, మేము ఒక్కరమే బిక్ష చేయము' అన్నారు. స్వామి నోటిమాట తప్పక జరిగి తీరుతుందన్న దృఢ విశ్వాసం గల భాస్కరశర్మ అది నిరూపించుకోదలచి దీనంగా, స్వామి, నేనేం చేసేది? నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టిన వారు రావడంలేదు. సరిగదా, నన్ను ఆక్షేపిస్తున్నారు' అన్నాడు. అప్పుడాయన వెంటనే మరో శిష్యుని పంపి నదివద్దనున్న బ్రాహ్మణులందరిని వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. అతడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి, అందరిని ఆహ్వానించాడు. ఇక తప్పక అందరూ మఠం  చేరుకున్నారు. శ్రీ గురుడు వారందరితో, 'బ్రాహ్మణోత్తములారా! మీరందరూ మీ భార్యాబిడ్డలను తీసుకొని మఠానికి రావాలి. ఈ రోజు ఇక్కడే నాలుగువేల మందికి సమారాధన చేయాలి. అందరూ విస్తళ్లలో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి' అని భాస్కరశర్మతో, ఏమయ్యా, చూస్తావేమిటి? లేచి నమస్కరించి అందర్నీ ఆహ్వానించు' అన్నారు. అతడు వెంటనే లేచి నమస్కరించి, వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలసి తానుచేయనున్న సమారాధనకు విచ్చేసి. తనను కృతార్థుడను చేయమని వేడుకున్నాడు. వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి, 'ఓరి వెర్రి బ్రాహ్మణుడా! సిగ్గులేకుండా తగదుననుకొని, నీవుపిలిస్తే వచ్చామటయ్యా? నీవు చేసినది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా  సరిపోతుందా?' అన్నారు. కొందరు పెద్దలు వారిని వారించి, 'తప్పు అతనిని నిందించవద్దు. ఇందులో అతని దోషమేమీ లేదు. గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు, అని మందలించారు. భాస్కరుడు శ్రీగురుపాదాలను పూజించి, ఆయనకు హారతి ఇచ్చి విస్తళ్ళు వేసాడు. అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ కోరాడు. అంతట శ్రీ గురుడు అతనికి ఒక వస్త్రం ఇచ్చి, దానిని వంటకాలపై కప్పమని  ఆదేశించారు. అతడలా చేయగానే, శ్రీ గురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి, వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు. వెంటనే భాస్కరశర్మ, మరికొంతమంది ఆ వస్త్రం క్రింద నుండి పళ్ళాలతో వంటకాలు తీసుకుని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు. నెయ్యి కూడా ధారలుగా వడ్డీస్తూనేవున్నారు. అది చూచి భక్తులందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు మొదట శ్రీగురుడు, తర్వాత మిగిలినవారూ ఆపోసనం తీసుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు. భాస్కరశర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్లి, నెమ్మదిగా కూర్చుని కావలసినవి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు. భోజనాలయ్యాక, అందరికీ తాంబూలాలిచ్చి, స్త్రీలకు,  పిల్లలకు, అన్ని వర్ణాలవారికి బంతులు బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశారు. చివరకు ఊరిలో విచారించి, భోజనం చేయనివారు ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక, శ్రీ గురుని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురు ప్రసాదం స్వీకరించాడు. అప్పుడతడు వెళ్లిచూచి అతడు వండిన వంటకమంతా అలానే ఉన్నదని స్వామికి మనవి చేశాడు. దానిని జలచరాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలానే చేశాడు. కొద్దిపాటి అన్నంతోనే వేలాదిమందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురుమహిమ అందరికీ తెలిసింది. శ్రీ గురుడు సాక్షాత్తూ అన్నపూర్ణేశ్వరుడని, వారి అనుగ్రహానికి పాత్రులైనవారికి ఎట్టి కొరతా ఉండదని అందరూ కీర్తించారు. అప్పుడు శ్రీ గురుడు భాస్కరశర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు. శ్రీ గురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమ్రోగింది."
                           

ముప్పై ఎనిమిదవ అధ్యాయం  సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

*** సోమవారం పారాయణ సమాప్తము ***


Tuesday, May 26, 2020

గురు చరిత్ర అధ్యాయము -37


అధ్యాయము  -37




                               
శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 



కథారంభము 



                         సిద్ధయోగి ఇలా చెప్పారు: "నామధారకా! శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు: 'మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చొని ప్రతి రోజు తప్పకుండా భగవంతుడిని పూజించాలి. అందుకవకాశం లేకపోతే ఉదయం షోడశోపచారపూజ,  మధ్యాహ్నం పంచోపచారపూజ, సాయంత్రం నీరాజనమూ అయినా సమర్పించాలి. అందుకోసం ప్రతివారూ తమ ఇంట మంచిగంధము,  నెయ్యి,  జింక చర్మమూ ఉంచుకోవాలి. మానవ జన్మ లభించికూడా భగవంతుని పూజించినవారికి నరకము ప్రాప్తిస్తుంది. అటు తర్వాత కూడా మానవజన్మ రావడం కష్టం. అన్నింటిలోకి గురుపూజ శ్రేష్టమైనది. అందువలన త్రిమూర్తులూ సంతోషిస్తారు. కానీ కలియుగంలో మానవులకు గురువుయందు ఆయన భగవంతుడనే భావం కలగడం కష్టం. అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగము రూపాలు ధరించాడు. కనుక వాటిని పూజించడంవలన సర్వ పాపాలు నశిస్తాయి. అగ్ని, జలము,  సూర్యుడు, గోవు,  సద్బ్రాహ్మణుడు - వీటిలో భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు. అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్ఠం. మధ్యములకు మండలంలో పూజ, అధములకు విగ్రహారాధనము  అవసరం. భక్తితో పూజించగలిగితే రాయి, చెక్క గూడా  దేవుడై అభీష్టాలు  ప్రసాదించగలవు.                   


                          పీటమీద కూర్చుని శ్రద్ధగా సంకల్పము,  ప్రాణాయామము చేసి పూజాద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకుని వాటిని ప్రోక్షించాలి. తర్వాత, ఎదుట సింహాసనం మీద ఇష్ట దేవతా విగ్రహం ఉంచి, దానికి కుడి వైపున శంఖము,  ఎడమ వైపున గంట వుంచి,  దేవుని మీదనున్న నిర్మాల్యం తొలగించి,  దీపం వెలిగించాలి. మొదట గణపతిని పూజించి,  గురువును స్మరించి,  తర్వాత పీఠాన్ని,  ద్వారపాలకులను పూజించాలి. తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి,  దానినే  మన ఎదుటనున్న విగ్రహంలోకి ఆహ్వానించాలి,  సాక్షాతూ భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తించుకోవాలి. ఆయనకు పదహారు ఉపచారాలతో పూజచేయాలి. పూజకు తెల్లనిపువ్వులు శ్రేష్టం. పసుపు,  ఎరుపు రంగుగల పువ్వులు మధ్యమం. నల్లనివి ఇతర రంగు రంగుల పూలు అధమం.               


                                      ఉదయమే "అపవిత్రః పవిత్రోవా" అనే శ్లోకం చదువుకుని గురువును,  కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు. అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించి,  ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారమూ చేయాలి. తల్లిదండ్రులు,  గురువులు, సద్బ్రహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి.                           

                        తల్లిదండ్రులు,  పూజ్యులు,  పెద్దలనూ చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి,  వారి పాదాలకు నమస్కరించాలి.  గురువు యొక్క కుడిపాదాన్ని మన కుడి చేతితోను,  వారి యొక్క ఎడమపాదాన్ని ఎడమచేతితోనూ స్పృశించి, సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత వారి యొక్క మోకాలు నుండి పాదం వరకు స్పృశించాలి. తల్లి,  తండ్రి,  గురువు,  పోషకుడు,  భయహర్త,  అన్నదాత, సవతితల్లి,  పురోహితుడు,  పెద్దన్న,  తల్లిదండ్రుల యొక్క సోదరులు,  జ్ఞానవృద్ధులు- వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి. అజ్ఞానులు,  తనకంటే చిన్నవారు,  స్నానం చేస్తున్నవారు, సమిధలు మొ||గు పూజాద్రవ్యాలు తెస్తున్నవారు,  హోమం చేస్తున్నవారు,  ధనగర్వులు, కోపించినవారు,  మూర్ఖులు, శవము - వీరికి నమస్కరించకూడదు. ఒకచేత్తో ఎవరికీ, ఎప్పుడూ నమస్కరించకూడదు.                                                       


                             గృహస్తుల ఇండ్లల్లో- కత్తి,  తిరుగలి,  రోకలి,  నిప్పు,  నీరు,  చీపురు - వాడడం వలన జరిగే పాపాన్ని పోగొట్టుకోడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు,  పితరులకు,  సర్వజీవులకు,  ఋషులకు,  అతిథులకు అర్పించి,  మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి. దీనిని వైశ్వదేవమంటారు. అతిధులను కులగోత్రాలు పట్టించుకోకుండా భగవత్స్వరూపులుగా తలచి భోజనం పెట్టాలి. కారణం వారు సాక్షాత్తు సద్గురు రూపాలే. అతిధికి కాళ్ళు కడిగితే పితృదేవతలు,  భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. అతిథికి,  భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి - వైశ్వదేవము,  నైవేద్యము అవ్వకున్నా  తప్పకుండా భిక్ష ఇవ్వాలి. భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి,  దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి. పతితుల పంక్తిన భోజనం చేయకూడదు. మొదట కుడిప్రక్కన నేలమీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నముంచిన తరువాత భోజనం చేయాలి. తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము,  తాను తినే అన్నం కూడా భగవంతుని రూపాలన్న  భావంతో భోజనం చేయాలి. కుక్కను,  రజస్వలను,  యెట్టి  ధర్మమూ  పాటించనివాడినీ  చూస్తూ భోజనం చేయకూడదు. భోజనమయ్యాక అగస్త్యమహర్షిని,  కుంభకర్ణుణ్ణి,  బడబాగ్నినీ  స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. సాయంకాలం పురాణాలు,  సద్గ్రందాలు  పెద్దలవలన వినాలి.


                             సూర్యాస్తమయమప్పుడు సంధ్యావందనము,  హోమముచేసి,  గురువుకు నమస్కరించాలి. రాత్రి తేలికగా భోజనం చేసి,  కొంతసేపు సద్గ్రందాలుచదువుకొని,  తర్వాత తాను ఆ రోజంతా చేసిన సత్కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతికోసం అని సమర్పించి,  నమస్కరించాలి. ఉత్తరానికి తలపెట్టుకుని నిద్రించ గూడదు.  ఇక నుండి నీవిటువంటి ధర్మాలన్నీ  ఆచరిస్తూ,  ఇతరుల ఇండ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారం పాటించుకో! అందువలన ఇహంలోనూ,  పరంలోనూ ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది' అని శ్రీ గురుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి తమ  ఇంటికి వెళ్ళిపోయారు."                      


ముప్పై ఏడవ అధ్యాయము సమాప్తము

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   

Monday, May 25, 2020

గురు చరిత్ర అధ్యాయము -36

***సోమవారం పారాయణ ప్రారంభము ***

అధ్యాయము  -36




                               

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                            శ్రీ గురుభ్యోనమః 


కథారంభము 



                            నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, "స్వామీ, అజ్ఞానమనే గాఢనిద్రలో మునిగివున్న నాకు ఈ గురుచరిత్ర వినిపించి మేలుకొలిపారు. దయతో అటుపై వృత్తాంతం తెల్పి, ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి" అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషించి, ఇలా చెప్పసాగారు: "నాయనా, శ్రీ గురులీలలు ఎన్నని చెప్పగలను?  కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను,  శ్రద్ధగా విను.                 


                గంధర్వ పురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు గాని, ఎవరి ఇంటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ, తనకున్న దాంట్లోనే అతిధులను సేవిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో శ్రీ గురు నీ మహిమ వలన అచ్చటికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లే వాడు కాదు. ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులు అందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్లడానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్లి భోజనము, దక్షిణలు, కొత్త వస్త్రాలు, దానము తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటివలే ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో తననొక్కదానన్నా పంపమని,లేకపోతే అతనిని గూడా రమ్మనీ పట్టుబట్టింది !అతడు, 'నేను రాను, నీకంత ఆశవుంటే నీవు వెళ్ళవచ్చు' అన్నాడు. అప్పుడామె ఆ శ్రీమంతునితో, 'నేను ఒక్కదాన్నైనా భోజనానికి రావచ్చా? 'అనడిగింది. అతడు, దంపతులే రావాలన్నాడు. నిరాశ చెంది, తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్లి తన బాధనంతా వెళ్లబోసుకుని, తన భర్తకూడా ఆరోజు సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది. అందుకు శ్రీనృసింహసరస్వతి నవ్వి,  ఆమె భర్తను పిలిపించి, 'ద్విజోత్తమా, నామాటవిని ఈరోజుకు నీవుసమారాధనకు వెళ్ళు,  భార్య యొక్క కోరిక తీర్చడం భర్తయొక్క ధర్మం' అని హితం చెప్పారు. ఆ విప్రుడు, 'స్వామి మీ ఆజ్ఞానుసారం నా  నియమం విడిచి నేడు సంతర్పణకు వెళ్తాను. గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా? అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు.


                 ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఒక సత్రంవద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన  భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తళ్ళలోనూ,  మరికొందరి విస్తళ్ళలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా, నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరివచ్చి,  అన్నపురాశిని ముట్టుకున్నది. వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూచి,  వెంటనే కోపంతో విస్తరిముందు నుండి లేచి,  అందరితో ఆ విషయం చెప్పింది. ఆమె భర్త తల బాదుకుని,  'బుద్ధిలేనిదానా! నీ వలన ఈ రోజు నా కర్మ ఇలా కాలింది!' అని చెప్పి,  విస్తరిముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమె కేసి చూస్తూ, 'ఏమమ్మా!పరాన్నసుఖం అనుభవించావా? నీ కోర్కె   నెరవేరిందా?' అని అడిగి, నవ్వారు.  ఆమె సిగ్గుతో తలవంచుకొని,  'స్వామి! నా బుద్ధిహీనత వలన మావారిని  కూడా ఈ కుక్క కూటికి బలవంతాన  తీసుకుపోయాను. నా తప్పు  ఎలాగైనా మీరే సవరించాలి' అని వేడుకొన్నది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగం  అయినందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీ గురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పారు: 'పోనీలే,  ఏమైతేనేమి?  నేటితో నీ భార్య మనసు కుదుట పడ్డ ది కదా? ఆమె ఇంక ఎన్నడు నిన్నలా వేధించదు.  ఇంతమాత్రానికే నీకెట్టి  దోషమూ  రాదు. నీకు నియమభంగమూ  కాదు. ఎప్పుడైనా దేవ, పితృకార్యాలలో భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్టానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్లినందువలన ఎట్టి  దోషమూ  ఉండదు' అని చెప్పారు. 'స్వామి,  ఎలాంటి భోజనం చేయవచ్చు,  ఎలాంటిది చేయకూడదో వివరించండి' అని కోరాడు. శ్రీ గురుడు ఇలా చెప్పారు:                                       

                 'గురువులు,  మేనమామలు,  ఆచారవంతులైన వేదవిదులు,  అత్తమామలు,  తోబుట్టువులూ  పెట్టిన భోజనం చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునే వాడు భార్యాబిడ్డలను ఏడిపించి,  పేరు కోసం దానాలు  చేసేవాడు,  పొగరుబోతు,తగాదాలకోరు,  వైశ్వదేవం చేయనివాడు డబ్బుకాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు, క్రోదవంతుడు,  భార్యను విడిచిపెట్టినవాడు,  క్రూరుడు,  పిసినారి,  స్త్రీ లోలుడు,  దురాచారి,  దొంగ, జూదరి,  స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు,  భగవన్నామస్మరణ పట్ల శ్రద్దాభక్తులు లేనివాడు,  కనీసం సంధ్యావందనమైనా చేయని వాడు,  డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు,  విశ్వాసఘాతకుడు,  పక్షపాతంతో అన్యాయం పలికేవారు,  స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు,  బ్రాహ్మణులను,  గురువులను,  సాధువులను,  తన ఇంటి భోజనాన్ని నిందించేవారు,  తన ఇంటి కులదేవతను విడిచినవారు,  దురాశాపరులు,  భగవంతునికి నివేదించకుండా  భోజనం చేసేవారు- ఇలాంటి వారి భోజనం తిన్నవారు పతితులు అవుతారు.                                         


                కూతురును,  అల్లుణ్ణి  బాదించేవారికి మరుజన్మలో బిడ్డలు కలుగరు. కేవలం అద్వైతం చెప్పి  దేవపూజ చెయ్యనివాడు,  పొట్టకూటికోసం కపటంగా  ప్రవర్తించేవాడు పెట్టిన భోజనం వలన మరుజన్మలో గ్రుడ్డితనము, అల్పాయుష్షు,  లేక చెవుడు కలుగుతాయి. నిత్యమూ  ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారి  పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. పూర్ణిమ,  అమావాస్యలలో పరుల ఇంట భోజనం చేస్తే మాస మార్జించిన పుణ్యఫలం నశిస్తుంది. సాటివారికి కర్మానుష్టానంలో  లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అలా చేసిన దోషం గాయత్రీ జపంతో తొలుగుతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు. మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు. గోవు,  భూమి,  బంగారం మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు కానీ,  గ్రహణ సమయంలోనూ, సూతకమప్పుడు,  పుణ్యతీర్థాలలోనూ దానాలుతీసుకుంటే దోషంవస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మమాచరించే వారికి దైన్యమెన్నటికీరాదు. దేవతలు,  సిద్ధులు,  కామదేనువూ  కూడా వారిని సేవిస్తుంటాయి.      


                                  అప్పుడా విప్రుడు  నమస్కరించి,  'స్వామి,  స్వధర్మం అంటే ఎలాటిదో కొంచెం వివరించండి' అని ప్రార్థించాడు. స్వామి ఇలా చెప్పారు: 'నాయనా,  పూర్వము ఒకప్పుడు నైమిశారణ్యంలో పరాశరమహర్షిని మునులిలా  కోరారు: "మునీంద్రా, స్వధర్మానుష్టానంలో మాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము,  మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోగూడదంటారు. కనుక దయతో మాకవి వివరించండి". అప్పుడా మహర్షి ఇలా చెప్పారు: "ఋషులారా, సదాచారం వలన సర్వమూ సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రాహ్మణుని ముహూర్తంలో నిద్రలేచి,  భక్తితో త్రిమూర్తులను,  నవగ్రహాలు, సనకాది సిద్ధులను,  పితృదేవతలను,  సప్త సముద్రాలు, చతుర్దశ భువనాలు,  సప్తద్వీపాలు,  సప్త ఋషులను మొదట స్మరించాలి. అప్పుడు గోవుకు మ్రొక్కి,  ఆచమనం చేశాకనే  కాలకృత్యాలు తీర్చుకొవాలి. స్నానము,  భోజనాలకు ముందు,  తరువాత కూడా కూర్చుని ఆచమనం చేయాలి. చూడకూడనివి చూచినప్పుడు,  మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు,  వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు మీరు లేకుంటే కుడి చెవును తాకాలి. కారణం, అందులో అగ్ని,  జలము,  వరుణుడు,  సూర్యుడు,  వాయువు మొ||గా గల సకల దేవతలు ఉంటారు. తర్వాత మానసిక స్నానం తో పరిశుద్ధుడై సూర్యోదయం వరకూ గాయత్రీ తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా  చదువుకోవచ్చు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరుబయట దేవాలయాలు,  పవిత్రమైన చెట్లు లేని చోట, బాటకు,  నీరుకూ దూరంగాను,  ఆకులూ - గడ్డీ లేని చోట మలవిసర్జన చేయాలి. ఆ సమయంలో జందెము వేరుగా వేసుకుని,  అంగవస్త్రం తలకు చుట్టుకుని ఉండాలి. దిక్కులకేసి, ఆకాశంకేసి చూడకూడదు. పగటివేళ ఉత్తర దిక్కుకు, రాత్రివేళ దక్షిణ దిక్కుకూ  తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కుల దేవతను స్మరించాలి'.                                  

         ఇలా శ్రీ గురు ఆచారకాండ  గురించి ఇంకా ఎన్నో అంశాలు బోధించారు."


 ముప్పై ఆరవ అధ్యాయం సమాప్తము.



శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


Sunday, May 24, 2020

గురు చరిత్ర అధ్యాయము -35


అధ్యాయము  -35




                               

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                                                  
శ్రీ గురుభ్యోనమః 




కథారంభము 


                               సిద్ధయోగి అటుపై జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు: "సావిత్రి శ్రీగురుని పాదాలకు మ్రొక్కి 'స్వామీ! నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకొక మంత్రం ఉపదేశించి అనుగ్రహించండి' అని వేడుకొన్నది. శ్రీ గురుడు 'అమ్మా,  స్త్రీలకు భర్తను సేవించడంకంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు పూర్వం దేవాసుర యుద్ధంలో,  చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృతసంజీవిని మంత్రంతో బ్రతికించి, యుద్ధరంగానికి పంపుతున్నాడు. ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విని శివుడు కోపించి, నందిని పంపి, ధ్యాననిమగ్నుడైయున్న  శుక్రాచార్యుని తెప్పించి అతనిని తన కడుపులో బంధించాడు. ఒకనాడు శివుడు ఏమారినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతోపాటు బయటకొచ్చి,  మరలా  యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు. ఏ మంత్రమైనా  స్త్రీకి ఉపదేశం ఇస్తే నిర్వీర్యం అవుతుందని,  అందులో మృతసంజీవనీ మంత్రం మూడవ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు, బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు.                                         


                            బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు. కచుడు వెళ్లి శుక్రాచార్యునికి నమస్కారం చేసి, 'అయ్యా, నేనొక విప్ర  కుమారుడను. అపారమైన మీ యశస్సు విని,  విద్యార్థినై  మీ వద్దకు వచ్చాను. నన్ను స్వీకరించండి' అన్నాడు. శుక్రుని కుమార్తె,  దేవయాని అతనిని చూచి మోహించి,  తన తండ్రిని అందుకు ఒప్పించింది. కానీ రాక్షసులు కొద్ది కాలానికి  కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకొన్నారు గాని,  శుక్రాచార్యునికి చెప్ప  సాహసించలేదు. ఒకనాడు కచుడు సమిధలు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతనిని రహస్యంగా అక్కడే చంపేశారు. దేవయాని మొరపెట్టుకొనగా శుక్రుడు తన దివ్యదృష్టితో తెలుసుకొని,  మృతసంజీవనీ మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు. రాక్షసులు మరొక్కసారి అతనిని చంపి దహనం చేసి ఆ బూడిదను నలుదిక్కులకూ విరజిమ్మేశారు. కాని శుక్రుడు మరల అతనిని బ్రతికించాడు. రాక్షసులు అతనిని మళ్లీ చంపి బస్మం చేసి,  నీటిలో కలిపి శుక్రునిచేత త్రాగించారు. ఈసారి  దేవయాని మొరపెట్టుకొన్నప్పుడు,  శుక్రాచార్యుడు తన యోగదృష్టితో జరిగినది తెలుసుకుని ఆమెతో అన్నాడు, "అమ్మ ఈ రాక్షసులు అతనిని నాకడుపులోకి పంపేశారు. ఇప్పుడు కచుణ్ణి బ్రతికిస్తే, నేను చనిపోవలసింది వస్తుంది." అప్పుడామె, "తండ్రి! నేను అతనిని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను.  అతడు లేక నేను బ్రతుకలేను" అన్నది. ఆ రాక్షసగురువు, "ఈ మంత్రం నాకు ఒక్కడికే తెలుసు,  ఇతరులకు చెప్పకూడదు"అన్నాడు. ఆమె,  "తండ్రి, నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు. కచుడు బ్రతికి బయటకు రాగానే మరల నిన్ను కూడా బ్రతికిస్తాను" అన్నది. "అమ్మా,  స్త్రీలకు మంత్రజపం తగదు. వారికి భర్త సేవయే విధించబడింది. స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనమౌతుంది" అన్నాడు శుక్రుడు. దేవయాని అలిగి,  "అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి. కచుణ్ణి  విడిచి జీవించలేని నేనే మరణిస్తాను" అని చెప్పి మూర్ఛపోయింది. వేరే దారిలేక,  ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొలిపి,  మంత్రం ఉపదేశించి, తర్వాత ఆ మంత్రంతో కచుణ్ణి  బ్రతికించాడు. అప్పుడు కచుడు శుక్రుని కడుపు చీల్చుకొని బయటకు రాగానే,  దేవయాని మూడుసార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు, కచుడు గూడ ఆ మంత్రం  విన్నాడు.                                    


                             స్త్రీకి ఉపదేశించడం  వలన,  మూడవవాడుగా కచుడు వినిన  కారణంగానూ  ఆ మంత్రం నష్టమైంది.అలా  నిర్ధారణ చేసుకుని కచుడు,  శుక్రాచార్యుడికి నమస్కరించి,  "అయ్యా,  మీ  కృపవలన విద్యలన్నీ  నేర్చుకున్నాను. నా అభీష్టం నెరవేరింది. ఇక్కడుంటే నన్నీరాక్షసులు  బ్రతుకనివ్వరు. కనుక నాకు సెలవిప్పించండి" అన్నాడు. అది విని దేవయాని ఏడుస్తూ,  "నా తండ్రి నిన్ను శిష్యునిగా అంగీకరించేలా చేశాను. మూడుసార్లు నీకు ప్రాణం ఇప్పించాను.కనుక  నన్ను వివాహమాడి నా అభీష్టం నెరవేర్చు" అని పట్టుబట్టింది. కచుడు,  నీవు గురుపుత్రివి  గనుక నాకు సోదరివి. ప్రాణదానం చేసావు గనుక తల్లివి. నిన్ను వివాహమాడదలచడం  మహాపాపం. కనుక నన్ను వేళ్ళనివ్వు" అని ప్రార్థించాడు.  కానీ ఆమె కామవశయై, "కృతజ్ఞుడా, నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక!" అని శపించింది. కచుడు ఆమెను అసహ్యించుకొని,  తనను అనవసరంగా శపించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు. నాటినుండి యుద్ధంలో దేవతలచేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు. ఇది తెలిసిన వారెవరూ స్త్రీకి  మంత్రోపదేశం చేయరు. కనుక సావిత్రీ, నీకేదైనా వ్రతం చెబుతాను, చేసుకో!" అన్నారు. సావిత్రి స్వామికి నమస్కరించి,  'స్వామి! మీ పాదసేవకు మించిన వ్రతమేమున్నది?  అయినప్పటికీ,  మీ ఆదేశమే నాకు వేదవాక్కు, మీకు నచ్చిన వ్రతం సెలవియ్యండి' అన్నది. శ్రీ గురుడు ఇలా చెప్పారు: 'అందరూ ఆచరించుకోడానికి అనువైనది ఉత్తమమైన సోమవారవ్రతం. దాని వెనుక సూత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించాడు. సోమవారంనాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ వ్రత మహిమ తెల్పే ఐతిహ్యము ఒకటి  చెబుతాను:           


                                        ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు. అతడు సంతానం కోసం శివుని పూజించగా,  ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు. దైవజ్ఞులు ఆమె జాతకం చూచి,  ఆమె చిరకాలం సుమంగళిగా,  సుఖంగా జీవించగలదని చెప్పారు. కానీ కొంత కాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూచి,  14వ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు. ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి,  సీమంతిని ఒకనాడు యజ్ఞవల్క్యమహర్షి భార్య, మహాపతివ్రత అయిన మైత్రేయిని  దర్శించి నమస్కరించి, తన దురదృష్టానికి నివారణ తెల్పమని ప్రార్ధించింది. అప్పుడు మైత్రేయి, "అమ్మాయి,  ప్రతి సోమవారమూ  భక్తితో శివపార్వతులను పూజించు.  అభిషేకము వలన పాపం నశిస్తుంది. పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము, గంధ  పుష్పాక్షతలు సమర్పించినందువల్ల సౌభాగ్యము, దూపమార్పించడం వలన సౌగంద్యము, దీపదానం వలన కాంతిమత్వము, నైవేద్యం వలన సకల భోగాలు, తాంబూల సమర్పణ వలన నాల్గు పురుషార్థాలూ చేకూరుతాయి. జపం వలన అష్టైశ్వర్యాలు, హోమం చేసినందువలన సిరిసంపదలు, స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి, విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వ దేవతా సంతృప్తి కలుగుతాయి. కనుక ఆ రీతిన ఈ వ్రతమాచరించు" అని చెప్పింది.


                సీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి, ఎంతో శ్రద్ధతో ఆ వ్రత మాచరించింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే, ఇంద్రసేన మహీపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికిచ్చి  వివాహం చేశారు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని  వెళ్లి, ప్రమాదవశాత్తు కాళింది నదిలో మునిగిపోయాడు. ఎందరు ఈతగాళ్లు వెతికినా దొరకలేదు. అది తెలిసి 14 సంవత్సరాలు నిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైనది, కానీ రాజు ఆమెను వారించాడు. బంధువులందరూ నది ఒడ్డుకు చేరి, దుఃఖించారు. సీమంతిని తాను వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించనందుకు శివపార్వతులకు మొరపెట్టుకొని, సహగమనం చేయడానికి సిద్ధమైంది. అప్పుడు పురోహితులు, "శవం కనిపించకుండా ఉంటే సహగమనం చేయకూడదు. ఇంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము? కనుక నీవు వేచి ఉండాలి" అని చెప్పారు. పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యం అపహరించి, ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు. చిత్రవర్మ, శాస్త్రానుసారం ఒక సంవత్సరము వేచిచూసిన తర్వాత తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు. సీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేకదీక్షతో ఆ వ్రతం ఆచరిస్తూనే ఉన్నది.    


                                      నీట మునిగి చనిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి, పాతాళలోకంలో మహోజ్వలమైన పట్టణంలో మణులతో వెలిగిపోతున్న పడగలుగల తమ రాజయిన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్లారు. అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు. తక్షకుడు అతని వృత్తాంతమెరిగి, సంతోషించి, సకల భోగాలూ అనుభవిస్తూ, తమ లోకంలోనే ఉండిపొమ్మని అతనిని ఆహ్వానించాడు. చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి, తన తల్లిదండ్రులు, తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని, కనుక తాను వెంటనే వెళ్లిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం త్రాగించి, అతని భార్యకోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతనిని సత్కరించి,తనను  ఎప్పుడు స్మరించినా ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు. తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వంమీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు. అమృతం త్రాగడం వలన దివ్యవర్ఛస్సుతో వెలిగిపోతూ, దివ్యాశ్వం  పై నీటినుండి పైకి వచ్చిన చంద్రాంగదుని జూచి సీమంతిని ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారం. సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది. కానీ ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రము,నొసట కుంకుమ కనిపించక పోయేసరికి, ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక, చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారు రూపం ధరించి రాజకుమార్తెను విచారించి, ' నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు' అని ఆమెతో చెప్పి. మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్లాడు. వారి రాజ్యం అపహరించిన దాయాదులకు, తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ, రాజ్యం తిరిగి అప్పగించమని, లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలననీ  హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు. నదిలోపడి మరణించిన చంద్రాంగదుడు  తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి, రాజ్యం అతనికి తిరిగి అప్పగించి,  క్షమాపణ కోరారు. చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ, తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తనవారు ఎంత దుఃఖించారో, ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకొని, తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పుకున్నాడు. తిరిగి తమ కొడుకును,  రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి, ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. '                                  


                                  శ్రీ గురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి, 'స్వామీ, పరమ పవిత్రము, శ్రేయోదాయకమూ అయిన మీ పాదసేవ మాకు చాలదా? త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా? వేరొక వ్రతంఎందుకు? ' అన్నాడు. శ్రీ గురుడు, ' ఇది మా ఆజ్ఞ! ఈ వ్రతం చేస్తే గాని మీ సేవ మాకుఅందదు. కనుక ఈ వ్రతం చేసుకోండి!' అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు. ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురుసన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు,  అతని భార్య వాళ్లను చూడడానికి అక్కడకు చేరుకున్నారు. వారు శ్రీగురుని దర్శించి, జరిగినదంతా తెలుసుకుని, వేయిమంది బ్రాహ్మణులకు సమారాధన చేసి, కొడుకు-కోడళ్లనూ తీసుకొని స్వస్థానం చేరుకున్నారు. సావిత్రీ  - దత్తాత్రేయులు శ్రీ గురుడు చెప్పిన వ్రతమాచరించి, కాలాంతరంలో పూర్ణాయువులైన కొడుకులను కన్నారు. చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి, శ్రీ గురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులకు ప్రాకిపోయింది.                           

ముప్పైఐదవ అధ్యాయం సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః  
 

*** ఆదివారం పారాయణ సమాప్తము ***


Saturday, May 23, 2020

గురు చరిత్ర అధ్యాయము -34


అధ్యాయము  -34




                               

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                              శ్రీ గురుభ్యోనమః 




కథారంభము

                        సిద్ధయోగి, అటుపై శ్రీ గురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు : ' ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి,  "స్వామీ, ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించినా ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా, ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో దరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది?" అని అడిగాడు. పరాశరమహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి, "రాజా! వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనసు అంగీకరించడంలేదు" అన్నాడు. రాజు ఆందోళనతో అదేమిటో తెలుపమని మరీమరీ కోరగా, ఆ మహర్షి,  "నాయనా! ఇప్పటి నుండి ఎనిమిదవ రోజున వారు మరణించవలసి ఉన్నది" అన్నాడు. అది విని రాజు, అతని పరివారమూ ఎంతో దుఃఖించి, దానికి నివారణోపాయం తెలుపమని కోరారు. ఆ మహర్షి ఇలా చెప్పారు : "భయం లేదు,  శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి, అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంత్రం. అది నాలుగు పురుషార్ధాలు ప్రసాదించగలదు. సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని, వృష్ఠ  భాగంనుండి అధర్మాన్నీ  సృష్టించాడు. ధర్మాన్ననుసరించిన వారికి ఇహపరాలలో సుఖము, అధర్మమనుసరించిన వారికి దుఃఖమూ కలుగుతాయి. కామము, మొదలయిన వికారాలు అధర్మం నుండి పుట్టినవే. వాటిననుసరించి మరెన్నో పాపాలున్నాయి.      


                  కానీ ఏ గ్రామంలో రుద్ర జపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు. అది సర్వపాపహరం. పూర్వం రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, "యమధర్మరాజా! మదాంధులు, తామసులు, భక్తిలేనివారిని మాత్రమే నీవు దండించాలి. భక్తితో రుద్రమంత్రం జపించేవారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనే కూడదు. అల్పాయువు గలవారుగూడ దానివలన దీర్ఘాయువు పొందగలరు. రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసినవారిని చూచి నీవు కూడా భయపడవలసివున్నది అని చెప్పాడు. కనుక రాజా, నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు. అందువలన వారు ధర్మాత్ములై, సర్వసంపదలతోను  కలకాలం జీవించగలరు' అని ఆ విధానమంతా వివరించి చెప్పాడు.                   


                              ఆ రాజు, ఆ ప్రకారమే వందమంది సద్బ్రాహ్మణులచేత పదివేల రుద్రమంత్ర గానంతో ఏడు రోజులు రాత్రింబవళ్లూ సంతతధారగా శివునికి అభిషేకం చేయించారు. నిత్యమూ అభిషేకజలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు. చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ స్పృహతప్పిపడిపోయారు. అప్పుడు పరాశరమహర్షి రుద్ర మంత్ర జలం వారిమీద చల్లాడు. వెంటనే వారు లేచి కూర్చున్నారు. అప్పుడా మహర్షి, " బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి, ఆ రాజకుమారులను బ్రతికించారు" అని చెప్పాడు. రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవంచేసి, అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు. ఇంతలో నారదుడు అక్కడకు వచ్చి, ఆ రాజకుమారులకు పన్నెండవ యేట అపమృత్యు భయమున్నదని, అది తప్పితే పూర్ణాయుర్దాయమున్నదనీ చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు'. అందుకే శ్రీ గురునికి రుద్రాధ్యాయమంటే అంత ప్రీతి. కనుక నామధారకా, నీవు నిత్యమూ రుద్రాభిషేకంతో శ్రీగురుణ్ణి  పూజించు!" అని సిద్ధుడు చెప్పాడు. 

ముప్ఫైనాల్గవ అధ్యాయం సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


గురు చరిత్ర అధ్యాయము -33


అధ్యాయము  -33




                               

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                            శ్రీ గురుభ్యోనమః 




కథారంభము 



                     నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు : " దత్తుడు, సావిత్రి ఆ రోజక్కడే నిద్రచేసి, మరుసటిరోజు తెల్లవారుజామునే స్నానం చేసుకుని శ్రీగురుని దర్శించారు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది :'స్వామీ, నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము రుద్రాక్షలు,  విభూతి ప్రసాదించారు. ఆయనెవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనము మాకు ఎక్కడ లభిస్తుంది?' అన్నది. శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ, 'అమ్మాయీ, నీ పతిభక్తిని చూడదలచి  మేమే మారురూపంలో నీ వద్దకు వచ్చాము. మీకు రుద్రాక్ష మహిమను  తెలియజేయడానికే అవి ప్రసాదించాము. వాటి మహత్యం వల్లనే నీకు ఇట్టి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు గనుక వాటి మహత్యం వివరిస్తాము :              


                        ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు. ఎంతో పుణ్యం లభిస్తుందని శ్రుతి,  స్మృతి పురాణాలు చెబుతున్నాయి. వేయి రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తూ రుద్రుడే. అన్ని దొరకనప్పుడు బాహులకు పదహారెసి, శిఖలో ఒకటి, చేతులకు ఇరవైనాలుగేసి, మెడలో ముప్పైరెండు,  శిరస్సున నలభై రెండు,  చెవులకు పన్నెండేసి, కనులకు ఒక్కొక్కటి, వక్షస్థలంలో 108 ధరించిన వాడు సాక్షాత్తూ కుమారస్వామితో సమానుడు. వాటికి పగడాలు,  స్పటికాలు  చేర్చి బంగారం తో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది. రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలమొస్తుంది. భస్మము రుద్రాక్ష ధరించని వాని జన్మయే వ్యర్థం. అది ధరించి  స్నానం చేస్తే గంగాస్నాన ఫలం ఉంటుంది. ఏకాదశరుద్ర మహామంత్రంతో  రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగానర్చించినంత  ఫలితం ఉంటుంది. రుద్రాక్షలలో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు. ఎటువంటి రుద్రాక్షలు ధరించినా  నాలుగు పురుషార్థాలూ సిద్ధిస్తాయి.          


                              పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు,  మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే  కొడుకూ  ఉండేవారు. వారు ఎంతో ప్రేమతో మసులుకుంటూ ఇట్టి ఆభరణాలు లెక్కచేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసిగాని భోజనం చేసేవారు కాదు. ఒకనాడు పరాశరమహర్షి రాగా, భద్రసేనుడు ఆయనను పూజించి,  ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణ మేమో చెప్పమని ప్రార్థించాడు. ఆ ముని, "రాజా! వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి, శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేశ్యవుండేది. ఆమె గుణవంతురాలు. స్వేచ్ఛాచారిణిగా  జీవించక,  పెద్దలవలన సకల ధర్మాలూ తెలుసుకొని, దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది. ఆమె నిత్యమూ  అలంకరించుకొని తన ఇంటనున్న మంటపంలో నృత్యం చేసేది. ఆ మండపంలో ఒక కోడిని,  ఒక కోతిని పెంచుతూ ఉండేది. వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది.                   


                            ఒకనాడు మహాధనికుడు,  శివవ్రతదీక్షితుడూ  అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతని ఒంటి మీద విభూతి,  చేతులకు రత్నకంకణాలు,  అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగమూ ఉన్నాయి. దానిని చూచి ఆ వేశ్యా ఆశపడి,  తన సఖి చేత కబురు పంపింది. అతడు ఆ మంటపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయిన ఆ వేశ్య తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగమును ఇస్తానన్నాడు. ఆ వేశ్య అందుకు సంతోషించి మూడురోజులు పతివ్రతాధర్మమనుసరించి అతనిని సేవించగలనని  తన సఖీచేత  చెప్పించింది. ఆ వైశ్యుడు ఆ మాటవిని నవ్వి,  'కులస్త్రీకివలె  వేశ్యకు అదెలా సాధ్యం?' అని విమర్శించాడు. అప్పుడా వేశ్య, 'నా విషయంలో మీకెట్టి సందేహమూ  అక్కరలేదు. నేను త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులూ పాతివ్రత్యమవలంభించగలను' అని చెప్పి,  ఆ లింగం పై చేయివేసి,  సూర్య చంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి, 'ప్రేయసీ, ఇది నాకు ప్రాణంతో సమానం. దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను' అన్నాడు. ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది.                          


                            ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక,  అదేమి  చిత్రమోగాని,  నాట్య మంటపం క్షణంలో భస్మమై పోయింది. ఆ కోతి, కోడి కూడా బుగ్గయి పోయాయి. ఇరుగుపొరుగువారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు. తెల్లారాక అది తెలిసి వైశ్యుడు, ' అయ్యో నా ప్రాణ లింగమే పోయింది! నేనింక బ్రతకను' అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించినా  ఆ లింగం దొరకలేదు. అతడు ఒక చితి  వెలిగించి, ఆ మంటలలో దూకాడు. అతని వెంటనే ఆ వేశ్య, 'నాథా!' అని కేకలు పెడుతూవచ్చి తన ధర్మాన్ననుసరించి  సహగమనం చేయటానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమెను వారించి, 'వేశ్యవైన నీకు ఇదేమి వెర్రి?  అని ఎన్నో రీతుల చెప్పి వారించారు. కాని  ఆమె వారి మాటలెవీ  పట్టించుకోనక, 'సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్య మవలంబించిన నాకు ఇదే ధర్మము. నేనిప్పుడు సహగమనం చేయకుంటే,  నాతో పాటు నా 21 తరాలవారు నరకంలోపడతారు. నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు. మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా! ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం!' అని చెప్పి అగ్నిలో కి దూకబోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించి 'సుందరీ, నీ  ధర్మగుణాన్ని  పరీక్షించదలచి,  నేనే ఆ  వైశ్యుని రూపంలో వచ్చాను. నీకు ఇచ్చినది నా ఆత్మ లింగమే! ఈ మంటపానికి నేనే నిప్పుపెట్టి,  నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో!' అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, 'స్వామి,  నాకీ ముల్లోకాలలో ఎట్టి భోగమూ అక్కర్లేదు. నాకీ  సంసారబంధం తొలగించి,  శాశ్వతమైన శివసాయుజ్యము ప్రసాదించు' అని ప్రార్థించింది. శివుడు సంతోషించి,  ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు. ఆనాడు నాట్యమంటపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి, ఆ కోతి యీ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై  భస్మము,  రుద్రాక్షలూ ఇంత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యము చెప్పనలవిగానిది.' కనుక ఓ సాద్వి,  రుద్రాక్ష యింత మహిమ గలది' అని శ్రీ గురుడు చెప్పారు". 

ముప్పై మూడవ అధ్యాయం సమాప్తము.


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   




Friday, May 22, 2020

గురు చరిత్ర అధ్యాయము -32


అధ్యాయము  -32




                               

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః 




కథారంభము 


                        బృహస్పతి ఉపదేశించిన స్త్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు: "బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు: ' దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం. కానీ భర్త దూర దేశంలో ఉన్నా, ఆమె గర్భవతి అయిన, లేక ఆమెకు పాలు తాగే బిడ్డవున్న అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు. అటువంటి స్త్రీ యావజ్జీవితమూ  విధవాధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. విధవాధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే. ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం. లేకుంటే ఆమె జుట్టు అనే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది; గతించిన భర్త కూడా పతితుడు అవుతాడు. అప్పటి నుండి ఆమె నిత్యమూ తల స్నానం, ఒక్క పూట భోజనమూ చేస్తూ ఉండాలి. అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం. ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. మూడురోజులకో, వారానికో, లేక పక్షానికో ఒకసారి చొప్పున యధాశక్తి ఉపవసించటం గాని, లేకుంటే చాంద్రాయణవ్రతం ఆచరించడం గానీ ఎంతో శ్రేయస్కరం. పాడ్యమినాడు ఒక ముద్దతో ప్రారంభించి, శుక్లపక్షంలో తిధికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి, పౌర్ణమి నాటికి 15 ముద్దలు తినడం, అటు తర్వాత చంద్రకళలను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయణవ్రతం అంటారు. ముసలితనం వల్లగాని, రోగంవల్లగాని ఇలా చేయలేనివారు రెండవపూట పాలో,  పండ్లో  యావజ్జీవితమూ సేవించవచ్చు. మంచంమీద నిద్రించిన విధవ పతితో కలసి నరకానికి పోతుంది. కనుక క్రిందనే పడుకోవడం ఆమె ధర్మం. తనకున్న మంచము, పరుపు పేదలకు దానం చేయాలి. రంగు చీరలు ధరించక తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి. భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు దానమియ్యాలి. అభ్యంగనము(తలంటి), సుగంధములు, పూలు, అలంకారాలు, తాంబూలములను ఆమె పరిత్యజించాలి, పితృ యజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి, అతని ప్రీతికొరకు తర్పణం చేయాలి. అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి. ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకొని మాత్రమే ఇవన్నీ చేయాలి.           


                        ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖమాసంలో జలదానం, కార్తీకమాసంలో దీపదానం, మాఘమాసంలో నెయ్యి,  నువ్వులు దానం చేయడం ఆమె ధర్మం. అలాగే వేసవికాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి. విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి. కార్తీకమాసమంతా యవాన్నమే తింటూ నక్తావ్రతములాచరించాలి. ఆ కాలంలో ఆమె కంద, వంగ,  తేనె, నూనె వాడకూడదు. మోదుగాకుల విస్తట్లో భోజనం చేయడమే ఉత్తమంగాని, అరటి ఆకులలోనూ, లోహ పాత్రలలోనూ తినకూడదు. ఆ నెలాఖరుకు ఉద్యాపన చేయాలి. ఆ సమయంలో నేతితో నింపిన కంచుపాత్ర, బాగా పాలిచ్చే కపిలగోవు. యధాశక్తి బంగారము, దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది.


                        వీటన్నింటిలో దీపదానం శ్రేష్టమైనది. శివునికి ఏకాదశ రుద్రాభిషేకము,  షోడశోపచారపూజ చేసి,  తన భర్తయే నారాయణుడన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వ పాపం నశించి యశస్సు లభిస్తుంది. మాఘమాసంలో జలమే నారాయణుడన్న భావంతో స్నానం చేసి, శివపూజ, అతిథి సత్కారము ఏమారకుండా చేయాలి. అది ఎలా చేయాలో చెబుతాను; వేద విధులకు పాధ్య మిచ్చి (అంటే కాళ్లు కడుక్కునేందుకు నీళ్లిచ్చి), విసనకర్ర,  పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు,  ద్రాక్ష మరియు అరటిపళ్ళు,  ఒక పాత్రలో పానకము దానమిచ్చి, తన భర్త పేరిట వారికి  ఆపోసనమిచ్చి,  వారికి సాత్వికాహారం తృప్తిగా వడ్డించాలి. వారిలో ఎక్కువగా బయట తిరిగేవారికీ గొడుగు,  పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితమంటుంది. ఇలా ఆచరిస్తే సతీసహగమనంతో సమానమవుతుంది. ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది. పతివ్రత అయిన స్త్రీ భాగీరధితో సమానము. ఆమె భర్త శంకరునితో సమానమే. కాబట్టి ఇట్టి దంపతులే లోక పూజ్యులు'.                                                   


                      బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యం గలవారు సహగమనం చేయవచ్చు. కనుక అమ్మాయి! నీవు శోకం విడిచి,  శ్రేయస్కరమనిపిస్తే అలా చేయి' అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తలమీద హస్తముంచి ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె,  'యోగీశ్వరా,  మీరే నాకు తల్లి,  తండ్రి,  బంధువులు; వేరెవరూ లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు  మీరు తారసిల్లారు. యుక్తవయస్కురాలైన నాకు వైధవ్యధర్మమాచరించడం కత్తిమీద నడకవంటిది. యవ్వనము,  సౌందర్యమూ కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కనుక నాకు సహగమనమే  నచ్చింది. అదే ఆచరిస్తాను. నన్ను ఆశీర్వదించండి' అని నమస్కరించింది. ఆయన ఆశీర్వదించి, తల్లీ, త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవు ఇంత దూరం గురు దర్శనంకోసం వచ్చావు. కానీ విధివశాన జరగరానిది జరిగిపోయింది. కనుక ఇప్పుడు సంగమానికి వెళ్లి, శ్రీ గురుని దర్శించి వచ్చి, అటు తర్వాత కర్తవ్యం నిర్వర్తించు' అని చెప్పి, ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మముంచి, ఆమెకు నాలుగు రుద్రాక్షలు ఇచ్చి, ' వీటిలో రెండు అతని మెడలోనూ, చెవులకు ఒక్కొక్కటీ కట్టి, రుద్ర సూక్తాలతో గురువు పాదాలకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు. అప్పుడు సువాసినులకు,  వేద విప్రులకు యధాశక్తి దానమిచ్చి, తర్వాత సహగమనం చేయవచ్చు' అని చెప్పి వెళ్ళిపోయాడు.      


                           అప్పుడు సావిత్రి,  అచటి వేదపండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి, స్నానం చేసి, పసుపు-పారాణి, కుంకుమలతో అలంకరించుకుని, శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది. తాను అగ్ని పట్టుకొని, శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్లింది. మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగమనం చేసుకోడానికి వెళ్తుందని తెలిసి, గ్రామంలోని స్త్రీలు, పురుషులు ఆమెను చూడటానికి కొన్ని వేలమంది వచ్చారు. వారిలో కొందరు ఆమెను చూచి, 'అయ్యో, ఏ సుఖము ఎరుగని చిన్న వయస్సులో ఒక్క బిడ్డ అయినా కలగకముందే, చావంటే కించిత్తుకూడా భయంలేకుండా ఎంత ధైర్యంగా వెళుతుందో!' అని ముక్కున వేలేసుకున్నారు. కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి, 'ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్లి అక్కడ జీవించరాదా?' అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢనిశ్చయంతో ముందుకు సాగిపోతోంది. మరికొంతమంది, ' ఆహా! ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకనే,  ధర్మం తప్పకుండా నడుచుకుంటోంది. స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు' అని కీర్తించారు.    


                               చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితి పేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సువాసినులందరికీ వాయనాలు,  బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి,  వారందరికీ నమస్కరించి,  ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది: 'తల్లులారా! విప్రోత్తములారా ! ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది. నా కన్నతల్లి అయినా గౌరీదేవి వద్దకు వెళుతున్నాను. అక్కడ మావాళ్ళందరితో కలసి పార్వతీ పరమేశ్వరులనిద్దరిని పూజిస్తుంటాను' అని చెప్పింది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది : ' మీరు బాధపడతారెందుకు? మీరు ఇంటికి వెళ్ళవచ్చు. కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా! చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది. కనుక మేమిద్దరము శ్రీగురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చటివారందరికీ చెప్పండి'. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి, అచ్చటి విప్రులతో, ' అయ్యలారా! నేను శ్రీ గురుదర్శనం కోసం వచ్చాను. కనుక వారిని దర్శించి వచ్చి, సహగమనం చేయటం నా ధర్మమని తోస్తున్నది. నేనువెళ్లిరానా? ' అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, ' అమ్మా, సరేగాని, సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో!' అన్నారు. ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది. అచటి వాళ్ళందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్లారు.                                   


                      సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీగురునిలా  స్తుతించుకున్నది; 'స్వామీ ! మీరు సర్వేశ్వరులు. శరణు కోరిన వారికందరికీ పురుషార్థాలను ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైనా, త్రిగుణాలను ధరించి సృష్టి, స్థితి,  లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిదేమున్నది? కర్మ సూత్రాన్ని అమలు పరచి, దండించ దగిన వారిని దండించే కర్మ ఫలప్రదాతలు మీరే! మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని, నా భర్తను బ్రతికించుకొని సంతానం పొందాలని, ఇంత దూరం నడచి మీ వద్దకు వచ్చాను. నేను ఎంత పాపం చేశానో కాని, అందరికీ అబ్బిన  సౌభాగ్యము,  సంతానమూ,  మాత్రం నాకు కరువవడమే గాక, ఇంతటి దుస్థితి కలిగింది. మీమీద ఇంత ఆశ పెట్టుకుని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి! మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించే దేమిటో చాలా  బాగా తెలిసింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకు పోదలచి నా భర్తతోకలసి వెళ్ళబోతున్నాను.          


                      ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమానమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెల్లుబికి. అక్కడ నుండే  ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీ గురుడు ఆమెను, ' నిత్య సౌభాగ్యవతీ భవ!' అని ఆశీర్వదించారు!! వెంటనే అచటి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, 'స్వామీ, ఈమె భర్త ఇంతకుముందే ఇక్కడ మరణించాడు. అతని శవం  ఇంకా స్మశానంలోనే ఉన్నది. మీ వద్ద సెలవు తీసుకొని ఈమె సహగమనం చేయబోతున్నది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది?' అన్నాడు. అది విని ఆయన ఏమీ తెలియనట్లు, 'అలాగా! ఎప్పుడు ప్రాణంపోయింది? ఏమైనాసరే, ఈమె సౌభాగ్యం స్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడు మేము చూస్తాము! అగ్ని సంస్కారం నిలిపివేసి, ఆ శవాన్ని ఇటు తీసుకురండి, మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు' అన్నారు. అందరూ ఆశ్చర్య పడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్ళారు.                                     


            ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురువు పాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడకు తీసుకువచ్చారు. వెంటనే శ్రీ గురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింపజేశారు. తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి, తమ అమృత దృష్టితోతదేకంగా శవంకేసి చూచారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై, మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు! అతడు సావిత్రితో, ' ప్రేయసీ ! నీవు నన్ను ఎక్కడకు తీసుకువచ్చావు? ఈ యతీశ్వరులు ఎవరు? నాకింత గాఢంగా నిద్ర పట్టితే నన్ను లేపనన్నా లేపలేదేమి?' అన్నాడు. సావిత్రి ఆనందభాష్పాలు రాలుస్తూ జరిగినదంతా చెప్పి, ' మన పాలిటి పరమేశ్వరులు, ప్రాణదాత ఈ శ్రీ గురుడే!' అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి, తమ ఆనందభాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు. 'పరాత్పరా! జగద్గురూ ! కృపాసాగరా ! శరణ్యమూర్తీ ! ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమా ! శ్రీహరీ ! సచ్చిదానంద స్వరూపులైన మీ లీలే యీ జగమంతా ! మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. స్వామి, ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి, దుఃఖాలలో పడిన మేము సర్వజీవరక్షకులైన మిమ్మల్ని మరచాము. మీరేమాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి!' అని స్వామిని స్తుతించారు. శ్రీగురుడు వారిని ఆశీర్వదించి, 'సిరిసంపదలు, దీర్ఘాయువుకలిగి, అష్టపుత్రులను కనండి! మీ  దుష్కర్మలన్నీ తీరిపోయాయి. మీ దేహాలు పవిత్ర మయ్యాయి. మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్ధాలు సిద్ధించి, చివరకు ముక్తికూడా కలుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి' అన్నారు. అది విన్న జనమంతా జయజయ ధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు.                 


                     కానీ అందరిలో ఒక ధూర్తుడు స్వామి ముందుకొచ్చి, 'అయ్యా! నాకు ఒక సందేహమున్నది. నొసటి వ్రాత తప్పించటం ఎవరి తరమూ కాదని వేదశాస్త్రాలన్నీ  చెబుతున్నాయి. బ్రహ్మ రాత నిజమే అయితే, ఈ చనిపోయినవాడు తిరిగి ఎలా బ్రతికాడు? ' అన్నాడు. స్వామి నవ్వి, 'బ్రహ్మ అనుమతితో మేము, వచ్చే జన్మలోని అతని జీవిత కాలం నుండి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము. అంతేగాని, విధివ్రాత అన్నది వాస్తవమే' అని చెప్పి, అతనికి దివ్యదృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపచేశారు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ యిళ్ళకు వెళ్లిపోయారు. నాటినుండి శ్రీగురుని కీర్తి వెల్లువలై దశదిశలా వ్యాపించింది. సావిత్రి -దత్తాత్రేయులు  సంగమంలో స్నానం చేసి శ్రీగురుని పూజించి, వేద విప్రులకు భారీయెత్తున దక్షిణలిచ్చి పంపారు. అప్పుడే సూర్యుడస్తమిస్తున్నాడు. ఆ దంపతులను వెంట తీసుకొని శ్రీ గురుడు తమ మఠానికి చేరుకున్నారు ".                     

ముప్పై రెండవ అధ్యాయము  సమాప్తము 

శ్రీ దత్తాయ గురవేనమః 

శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   


నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...