Saturday, May 23, 2020

గురు చరిత్ర అధ్యాయము -33


అధ్యాయము  -33




                               

శ్రీ గణేశాయనమః                             
శ్రీ సరస్వత్యేనమః                                                                            శ్రీ గురుభ్యోనమః 




కథారంభము 



                     నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు : " దత్తుడు, సావిత్రి ఆ రోజక్కడే నిద్రచేసి, మరుసటిరోజు తెల్లవారుజామునే స్నానం చేసుకుని శ్రీగురుని దర్శించారు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది :'స్వామీ, నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము రుద్రాక్షలు,  విభూతి ప్రసాదించారు. ఆయనెవరు? ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనము మాకు ఎక్కడ లభిస్తుంది?' అన్నది. శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ, 'అమ్మాయీ, నీ పతిభక్తిని చూడదలచి  మేమే మారురూపంలో నీ వద్దకు వచ్చాము. మీకు రుద్రాక్ష మహిమను  తెలియజేయడానికే అవి ప్రసాదించాము. వాటి మహత్యం వల్లనే నీకు ఇట్టి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు గనుక వాటి మహత్యం వివరిస్తాము :              


                        ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు. ఎంతో పుణ్యం లభిస్తుందని శ్రుతి,  స్మృతి పురాణాలు చెబుతున్నాయి. వేయి రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తూ రుద్రుడే. అన్ని దొరకనప్పుడు బాహులకు పదహారెసి, శిఖలో ఒకటి, చేతులకు ఇరవైనాలుగేసి, మెడలో ముప్పైరెండు,  శిరస్సున నలభై రెండు,  చెవులకు పన్నెండేసి, కనులకు ఒక్కొక్కటి, వక్షస్థలంలో 108 ధరించిన వాడు సాక్షాత్తూ కుమారస్వామితో సమానుడు. వాటికి పగడాలు,  స్పటికాలు  చేర్చి బంగారం తో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది. రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలమొస్తుంది. భస్మము రుద్రాక్ష ధరించని వాని జన్మయే వ్యర్థం. అది ధరించి  స్నానం చేస్తే గంగాస్నాన ఫలం ఉంటుంది. ఏకాదశరుద్ర మహామంత్రంతో  రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగానర్చించినంత  ఫలితం ఉంటుంది. రుద్రాక్షలలో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు. ఎటువంటి రుద్రాక్షలు ధరించినా  నాలుగు పురుషార్థాలూ సిద్ధిస్తాయి.          


                              పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు,  మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే  కొడుకూ  ఉండేవారు. వారు ఎంతో ప్రేమతో మసులుకుంటూ ఇట్టి ఆభరణాలు లెక్కచేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసిగాని భోజనం చేసేవారు కాదు. ఒకనాడు పరాశరమహర్షి రాగా, భద్రసేనుడు ఆయనను పూజించి,  ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణ మేమో చెప్పమని ప్రార్థించాడు. ఆ ముని, "రాజా! వెనుక నంది గ్రామంలో మహా సౌందర్యవతి, శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేశ్యవుండేది. ఆమె గుణవంతురాలు. స్వేచ్ఛాచారిణిగా  జీవించక,  పెద్దలవలన సకల ధర్మాలూ తెలుసుకొని, దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది. ఆమె నిత్యమూ  అలంకరించుకొని తన ఇంటనున్న మంటపంలో నృత్యం చేసేది. ఆ మండపంలో ఒక కోడిని,  ఒక కోతిని పెంచుతూ ఉండేది. వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది.                   


                            ఒకనాడు మహాధనికుడు,  శివవ్రతదీక్షితుడూ  అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతని ఒంటి మీద విభూతి,  చేతులకు రత్నకంకణాలు,  అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగమూ ఉన్నాయి. దానిని చూచి ఆ వేశ్యా ఆశపడి,  తన సఖి చేత కబురు పంపింది. అతడు ఆ మంటపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయిన ఆ వేశ్య తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగమును ఇస్తానన్నాడు. ఆ వేశ్య అందుకు సంతోషించి మూడురోజులు పతివ్రతాధర్మమనుసరించి అతనిని సేవించగలనని  తన సఖీచేత  చెప్పించింది. ఆ వైశ్యుడు ఆ మాటవిని నవ్వి,  'కులస్త్రీకివలె  వేశ్యకు అదెలా సాధ్యం?' అని విమర్శించాడు. అప్పుడా వేశ్య, 'నా విషయంలో మీకెట్టి సందేహమూ  అక్కరలేదు. నేను త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులూ పాతివ్రత్యమవలంభించగలను' అని చెప్పి,  ఆ లింగం పై చేయివేసి,  సూర్య చంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి, 'ప్రేయసీ, ఇది నాకు ప్రాణంతో సమానం. దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను' అన్నాడు. ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది.                          


                            ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక,  అదేమి  చిత్రమోగాని,  నాట్య మంటపం క్షణంలో భస్మమై పోయింది. ఆ కోతి, కోడి కూడా బుగ్గయి పోయాయి. ఇరుగుపొరుగువారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు. తెల్లారాక అది తెలిసి వైశ్యుడు, ' అయ్యో నా ప్రాణ లింగమే పోయింది! నేనింక బ్రతకను' అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించినా  ఆ లింగం దొరకలేదు. అతడు ఒక చితి  వెలిగించి, ఆ మంటలలో దూకాడు. అతని వెంటనే ఆ వేశ్య, 'నాథా!' అని కేకలు పెడుతూవచ్చి తన ధర్మాన్ననుసరించి  సహగమనం చేయటానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమెను వారించి, 'వేశ్యవైన నీకు ఇదేమి వెర్రి?  అని ఎన్నో రీతుల చెప్పి వారించారు. కాని  ఆమె వారి మాటలెవీ  పట్టించుకోనక, 'సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్య మవలంబించిన నాకు ఇదే ధర్మము. నేనిప్పుడు సహగమనం చేయకుంటే,  నాతో పాటు నా 21 తరాలవారు నరకంలోపడతారు. నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు. మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా! ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం!' అని చెప్పి అగ్నిలో కి దూకబోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించి 'సుందరీ, నీ  ధర్మగుణాన్ని  పరీక్షించదలచి,  నేనే ఆ  వైశ్యుని రూపంలో వచ్చాను. నీకు ఇచ్చినది నా ఆత్మ లింగమే! ఈ మంటపానికి నేనే నిప్పుపెట్టి,  నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను. నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో!' అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, 'స్వామి,  నాకీ ముల్లోకాలలో ఎట్టి భోగమూ అక్కర్లేదు. నాకీ  సంసారబంధం తొలగించి,  శాశ్వతమైన శివసాయుజ్యము ప్రసాదించు' అని ప్రార్థించింది. శివుడు సంతోషించి,  ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు. ఆనాడు నాట్యమంటపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి, ఆ కోతి యీ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై  భస్మము,  రుద్రాక్షలూ ఇంత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యము చెప్పనలవిగానిది.' కనుక ఓ సాద్వి,  రుద్రాక్ష యింత మహిమ గలది' అని శ్రీ గురుడు చెప్పారు". 

ముప్పై మూడవ అధ్యాయం సమాప్తము.


శ్రీ దత్తాయ గురవేనమః 


శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయనమః   -  శ్రీ నృసింహ సరస్వత్యైనమః   




No comments:

Post a Comment

Please do not enter any spam link in the comment box

నూతనయజ్ఞోపవీత ధారణ విధానము

  నూతనయజ్ఞోపవీత ధారణ విధానము జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోప...