అధ్యాయము -32
శ్రీ గణేశాయనమః
శ్రీ సరస్వత్యేనమః
శ్రీ గురుభ్యోనమః
కథారంభము
బృహస్పతి ఉపదేశించిన స్త్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు: "బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు: ' దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం. కానీ భర్త దూర దేశంలో ఉన్నా, ఆమె గర్భవతి అయిన, లేక ఆమెకు పాలు తాగే బిడ్డవున్న అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు. అటువంటి స్త్రీ యావజ్జీవితమూ విధవాధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. విధవాధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే. ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం. లేకుంటే ఆమె జుట్టు అనే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది; గతించిన భర్త కూడా పతితుడు అవుతాడు. అప్పటి నుండి ఆమె నిత్యమూ తల స్నానం, ఒక్క పూట భోజనమూ చేస్తూ ఉండాలి. అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం. ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. మూడురోజులకో, వారానికో, లేక పక్షానికో ఒకసారి చొప్పున యధాశక్తి ఉపవసించటం గాని, లేకుంటే చాంద్రాయణవ్రతం ఆచరించడం గానీ ఎంతో శ్రేయస్కరం. పాడ్యమినాడు ఒక ముద్దతో ప్రారంభించి, శుక్లపక్షంలో తిధికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి, పౌర్ణమి నాటికి 15 ముద్దలు తినడం, అటు తర్వాత చంద్రకళలను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయణవ్రతం అంటారు. ముసలితనం వల్లగాని, రోగంవల్లగాని ఇలా చేయలేనివారు రెండవపూట పాలో, పండ్లో యావజ్జీవితమూ సేవించవచ్చు. మంచంమీద నిద్రించిన విధవ పతితో కలసి నరకానికి పోతుంది. కనుక క్రిందనే పడుకోవడం ఆమె ధర్మం. తనకున్న మంచము, పరుపు పేదలకు దానం చేయాలి. రంగు చీరలు ధరించక తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి. భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు దానమియ్యాలి. అభ్యంగనము(తలంటి), సుగంధములు, పూలు, అలంకారాలు, తాంబూలములను ఆమె పరిత్యజించాలి, పితృ యజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి, అతని ప్రీతికొరకు తర్పణం చేయాలి. అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి. ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకొని మాత్రమే ఇవన్నీ చేయాలి.
ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖమాసంలో జలదానం, కార్తీకమాసంలో దీపదానం, మాఘమాసంలో నెయ్యి, నువ్వులు దానం చేయడం ఆమె ధర్మం. అలాగే వేసవికాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి. విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి. కార్తీకమాసమంతా యవాన్నమే తింటూ నక్తావ్రతములాచరించాలి. ఆ కాలంలో ఆమె కంద, వంగ, తేనె, నూనె వాడకూడదు. మోదుగాకుల విస్తట్లో భోజనం చేయడమే ఉత్తమంగాని, అరటి ఆకులలోనూ, లోహ పాత్రలలోనూ తినకూడదు. ఆ నెలాఖరుకు ఉద్యాపన చేయాలి. ఆ సమయంలో నేతితో నింపిన కంచుపాత్ర, బాగా పాలిచ్చే కపిలగోవు. యధాశక్తి బంగారము, దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది.
వీటన్నింటిలో దీపదానం శ్రేష్టమైనది. శివునికి ఏకాదశ రుద్రాభిషేకము, షోడశోపచారపూజ చేసి, తన భర్తయే నారాయణుడన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వ పాపం నశించి యశస్సు లభిస్తుంది. మాఘమాసంలో జలమే నారాయణుడన్న భావంతో స్నానం చేసి, శివపూజ, అతిథి సత్కారము ఏమారకుండా చేయాలి. అది ఎలా చేయాలో చెబుతాను; వేద విధులకు పాధ్య మిచ్చి (అంటే కాళ్లు కడుక్కునేందుకు నీళ్లిచ్చి), విసనకర్ర, పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటిపళ్ళు, ఒక పాత్రలో పానకము దానమిచ్చి, తన భర్త పేరిట వారికి ఆపోసనమిచ్చి, వారికి సాత్వికాహారం తృప్తిగా వడ్డించాలి. వారిలో ఎక్కువగా బయట తిరిగేవారికీ గొడుగు, పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితమంటుంది. ఇలా ఆచరిస్తే సతీసహగమనంతో సమానమవుతుంది. ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది. పతివ్రత అయిన స్త్రీ భాగీరధితో సమానము. ఆమె భర్త శంకరునితో సమానమే. కాబట్టి ఇట్టి దంపతులే లోక పూజ్యులు'.
బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యం గలవారు సహగమనం చేయవచ్చు. కనుక అమ్మాయి! నీవు శోకం విడిచి, శ్రేయస్కరమనిపిస్తే అలా చేయి' అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తలమీద హస్తముంచి ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె, 'యోగీశ్వరా, మీరే నాకు తల్లి, తండ్రి, బంధువులు; వేరెవరూ లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు తారసిల్లారు. యుక్తవయస్కురాలైన నాకు వైధవ్యధర్మమాచరించడం కత్తిమీద నడకవంటిది. యవ్వనము, సౌందర్యమూ కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కనుక నాకు సహగమనమే నచ్చింది. అదే ఆచరిస్తాను. నన్ను ఆశీర్వదించండి' అని నమస్కరించింది. ఆయన ఆశీర్వదించి, తల్లీ, త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవు ఇంత దూరం గురు దర్శనంకోసం వచ్చావు. కానీ విధివశాన జరగరానిది జరిగిపోయింది. కనుక ఇప్పుడు సంగమానికి వెళ్లి, శ్రీ గురుని దర్శించి వచ్చి, అటు తర్వాత కర్తవ్యం నిర్వర్తించు' అని చెప్పి, ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మముంచి, ఆమెకు నాలుగు రుద్రాక్షలు ఇచ్చి, ' వీటిలో రెండు అతని మెడలోనూ, చెవులకు ఒక్కొక్కటీ కట్టి, రుద్ర సూక్తాలతో గురువు పాదాలకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు. అప్పుడు సువాసినులకు, వేద విప్రులకు యధాశక్తి దానమిచ్చి, తర్వాత సహగమనం చేయవచ్చు' అని చెప్పి వెళ్ళిపోయాడు.
అప్పుడు సావిత్రి, అచటి వేదపండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి, స్నానం చేసి, పసుపు-పారాణి, కుంకుమలతో అలంకరించుకుని, శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది. తాను అగ్ని పట్టుకొని, శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్లింది. మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగమనం చేసుకోడానికి వెళ్తుందని తెలిసి, గ్రామంలోని స్త్రీలు, పురుషులు ఆమెను చూడటానికి కొన్ని వేలమంది వచ్చారు. వారిలో కొందరు ఆమెను చూచి, 'అయ్యో, ఏ సుఖము ఎరుగని చిన్న వయస్సులో ఒక్క బిడ్డ అయినా కలగకముందే, చావంటే కించిత్తుకూడా భయంలేకుండా ఎంత ధైర్యంగా వెళుతుందో!' అని ముక్కున వేలేసుకున్నారు. కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి, 'ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్లి అక్కడ జీవించరాదా?' అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢనిశ్చయంతో ముందుకు సాగిపోతోంది. మరికొంతమంది, ' ఆహా! ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకనే, ధర్మం తప్పకుండా నడుచుకుంటోంది. స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు' అని కీర్తించారు.
చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితి పేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సువాసినులందరికీ వాయనాలు, బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి, వారందరికీ నమస్కరించి, ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది: 'తల్లులారా! విప్రోత్తములారా ! ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది. నా కన్నతల్లి అయినా గౌరీదేవి వద్దకు వెళుతున్నాను. అక్కడ మావాళ్ళందరితో కలసి పార్వతీ పరమేశ్వరులనిద్దరిని పూజిస్తుంటాను' అని చెప్పింది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది : ' మీరు బాధపడతారెందుకు? మీరు ఇంటికి వెళ్ళవచ్చు. కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా! చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది. కనుక మేమిద్దరము శ్రీగురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చటివారందరికీ చెప్పండి'. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి, అచ్చటి విప్రులతో, ' అయ్యలారా! నేను శ్రీ గురుదర్శనం కోసం వచ్చాను. కనుక వారిని దర్శించి వచ్చి, సహగమనం చేయటం నా ధర్మమని తోస్తున్నది. నేనువెళ్లిరానా? ' అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, ' అమ్మా, సరేగాని, సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో!' అన్నారు. ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది. అచటి వాళ్ళందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్లారు.
సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీగురునిలా స్తుతించుకున్నది; 'స్వామీ ! మీరు సర్వేశ్వరులు. శరణు కోరిన వారికందరికీ పురుషార్థాలను ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైనా, త్రిగుణాలను ధరించి సృష్టి, స్థితి, లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిదేమున్నది? కర్మ సూత్రాన్ని అమలు పరచి, దండించ దగిన వారిని దండించే కర్మ ఫలప్రదాతలు మీరే! మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని, నా భర్తను బ్రతికించుకొని సంతానం పొందాలని, ఇంత దూరం నడచి మీ వద్దకు వచ్చాను. నేను ఎంత పాపం చేశానో కాని, అందరికీ అబ్బిన సౌభాగ్యము, సంతానమూ, మాత్రం నాకు కరువవడమే గాక, ఇంతటి దుస్థితి కలిగింది. మీమీద ఇంత ఆశ పెట్టుకుని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి! మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించే దేమిటో చాలా బాగా తెలిసింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకు పోదలచి నా భర్తతోకలసి వెళ్ళబోతున్నాను.
ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమానమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెల్లుబికి. అక్కడ నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీ గురుడు ఆమెను, ' నిత్య సౌభాగ్యవతీ భవ!' అని ఆశీర్వదించారు!! వెంటనే అచటి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, 'స్వామీ, ఈమె భర్త ఇంతకుముందే ఇక్కడ మరణించాడు. అతని శవం ఇంకా స్మశానంలోనే ఉన్నది. మీ వద్ద సెలవు తీసుకొని ఈమె సహగమనం చేయబోతున్నది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది?' అన్నాడు. అది విని ఆయన ఏమీ తెలియనట్లు, 'అలాగా! ఎప్పుడు ప్రాణంపోయింది? ఏమైనాసరే, ఈమె సౌభాగ్యం స్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడు మేము చూస్తాము! అగ్ని సంస్కారం నిలిపివేసి, ఆ శవాన్ని ఇటు తీసుకురండి, మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు' అన్నారు. అందరూ ఆశ్చర్య పడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్ళారు.
ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురువు పాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడకు తీసుకువచ్చారు. వెంటనే శ్రీ గురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింపజేశారు. తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి, తమ అమృత దృష్టితోతదేకంగా శవంకేసి చూచారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై, మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు! అతడు సావిత్రితో, ' ప్రేయసీ ! నీవు నన్ను ఎక్కడకు తీసుకువచ్చావు? ఈ యతీశ్వరులు ఎవరు? నాకింత గాఢంగా నిద్ర పట్టితే నన్ను లేపనన్నా లేపలేదేమి?' అన్నాడు. సావిత్రి ఆనందభాష్పాలు రాలుస్తూ జరిగినదంతా చెప్పి, ' మన పాలిటి పరమేశ్వరులు, ప్రాణదాత ఈ శ్రీ గురుడే!' అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి, తమ ఆనందభాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు. 'పరాత్పరా! జగద్గురూ ! కృపాసాగరా ! శరణ్యమూర్తీ ! ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమా ! శ్రీహరీ ! సచ్చిదానంద స్వరూపులైన మీ లీలే యీ జగమంతా ! మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. స్వామి, ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి, దుఃఖాలలో పడిన మేము సర్వజీవరక్షకులైన మిమ్మల్ని మరచాము. మీరేమాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి!' అని స్వామిని స్తుతించారు. శ్రీగురుడు వారిని ఆశీర్వదించి, 'సిరిసంపదలు, దీర్ఘాయువుకలిగి, అష్టపుత్రులను కనండి! మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి. మీ దేహాలు పవిత్ర మయ్యాయి. మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్ధాలు సిద్ధించి, చివరకు ముక్తికూడా కలుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి' అన్నారు. అది విన్న జనమంతా జయజయ ధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు.
కానీ అందరిలో ఒక ధూర్తుడు స్వామి ముందుకొచ్చి, 'అయ్యా! నాకు ఒక సందేహమున్నది. నొసటి వ్రాత తప్పించటం ఎవరి తరమూ కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మ రాత నిజమే అయితే, ఈ చనిపోయినవాడు తిరిగి ఎలా బ్రతికాడు? ' అన్నాడు. స్వామి నవ్వి, 'బ్రహ్మ అనుమతితో మేము, వచ్చే జన్మలోని అతని జీవిత కాలం నుండి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము. అంతేగాని, విధివ్రాత అన్నది వాస్తవమే' అని చెప్పి, అతనికి దివ్యదృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపచేశారు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ యిళ్ళకు వెళ్లిపోయారు. నాటినుండి శ్రీగురుని కీర్తి వెల్లువలై దశదిశలా వ్యాపించింది. సావిత్రి -దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుని పూజించి, వేద విప్రులకు భారీయెత్తున దక్షిణలిచ్చి పంపారు. అప్పుడే సూర్యుడస్తమిస్తున్నాడు. ఆ దంపతులను వెంట తీసుకొని శ్రీ గురుడు తమ మఠానికి చేరుకున్నారు ".
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box