అధ్యాయము -34
శ్రీ గణేశాయనమః
శ్రీ సరస్వత్యేనమః శ్రీ గురుభ్యోనమః
కథారంభము
సిద్ధయోగి, అటుపై శ్రీ గురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు : ' ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి, "స్వామీ, ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించినా ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా, ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో దరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది?" అని అడిగాడు. పరాశరమహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి, "రాజా! వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనసు అంగీకరించడంలేదు" అన్నాడు. రాజు ఆందోళనతో అదేమిటో తెలుపమని మరీమరీ కోరగా, ఆ మహర్షి, "నాయనా! ఇప్పటి నుండి ఎనిమిదవ రోజున వారు మరణించవలసి ఉన్నది" అన్నాడు. అది విని రాజు, అతని పరివారమూ ఎంతో దుఃఖించి, దానికి నివారణోపాయం తెలుపమని కోరారు. ఆ మహర్షి ఇలా చెప్పారు : "భయం లేదు, శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి, అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంత్రం. అది నాలుగు పురుషార్ధాలు ప్రసాదించగలదు. సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని, వృష్ఠ భాగంనుండి అధర్మాన్నీ సృష్టించాడు. ధర్మాన్ననుసరించిన వారికి ఇహపరాలలో సుఖము, అధర్మమనుసరించిన వారికి దుఃఖమూ కలుగుతాయి. కామము, మొదలయిన వికారాలు అధర్మం నుండి పుట్టినవే. వాటిననుసరించి మరెన్నో పాపాలున్నాయి.
కానీ ఏ గ్రామంలో రుద్ర జపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు. అది సర్వపాపహరం. పూర్వం రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, "యమధర్మరాజా! మదాంధులు, తామసులు, భక్తిలేనివారిని మాత్రమే నీవు దండించాలి. భక్తితో రుద్రమంత్రం జపించేవారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనే కూడదు. అల్పాయువు గలవారుగూడ దానివలన దీర్ఘాయువు పొందగలరు. రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసినవారిని చూచి నీవు కూడా భయపడవలసివున్నది అని చెప్పాడు. కనుక రాజా, నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత ఏడు రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు. అందువలన వారు ధర్మాత్ములై, సర్వసంపదలతోను కలకాలం జీవించగలరు' అని ఆ విధానమంతా వివరించి చెప్పాడు.
ఆ రాజు, ఆ ప్రకారమే వందమంది సద్బ్రాహ్మణులచేత పదివేల రుద్రమంత్ర గానంతో ఏడు రోజులు రాత్రింబవళ్లూ సంతతధారగా శివునికి అభిషేకం చేయించారు. నిత్యమూ అభిషేకజలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు. చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ స్పృహతప్పిపడిపోయారు. అప్పుడు పరాశరమహర్షి రుద్ర మంత్ర జలం వారిమీద చల్లాడు. వెంటనే వారు లేచి కూర్చున్నారు. అప్పుడా మహర్షి, " బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి, ఆ రాజకుమారులను బ్రతికించారు" అని చెప్పాడు. రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవంచేసి, అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు. ఇంతలో నారదుడు అక్కడకు వచ్చి, ఆ రాజకుమారులకు పన్నెండవ యేట అపమృత్యు భయమున్నదని, అది తప్పితే పూర్ణాయుర్దాయమున్నదనీ చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు'. అందుకే శ్రీ గురునికి రుద్రాధ్యాయమంటే అంత ప్రీతి. కనుక నామధారకా, నీవు నిత్యమూ రుద్రాభిషేకంతో శ్రీగురుణ్ణి పూజించు!" అని సిద్ధుడు చెప్పాడు.
No comments:
Post a Comment
Please do not enter any spam link in the comment box